సత్యశోధన/మొదటిభాగం/11. సీమకు ప్రయాణ సన్నాహం

వికీసోర్స్ నుండి

11. సీమకు ప్రయాణ సన్నాహం

1887 వ సంవత్సరంలో నేను మెట్రిక్యులేషన్ పరీక్షకు కూర్చున్నాను. అప్పుడు అహ్మదాబాదు, బొంబాయి, పరీక్షాకేంద్రాలు. దేశంలో దారిద్ర్యం ఎక్కువగా వుండటంవల్ల కాఠియావాడ్ విద్యార్థులు తమకు దగ్గరలో వున్న కొద్ది ఖర్చుతో పని జరిగే అహ్మదాబాదు కేంద్రానికి వెళ్ళేందుకు ఇష్టపడేవారు. మా కుటుంబ ఆర్థికస్థితి కూడా అంతంతమాత్రంగానే వుంది. అందువల్ల నేను ఆ కేంద్రానికే వెళ్ళవలసి వచ్చింది. రాజకోట నుండి అహ్మదాబాదు ఒంటరిగా మొదటిసారి ప్రయాణం చేశాను.

మెట్రిక్యులేషన్ పూర్తి అయిన తరువాత కాలేజీలో చదవమని మా పెద్దలు ప్రోత్సహించారు, భావనగర్ మరియు బొంబాయిలో కాలేజీలు వున్నాయి. భావనగర్‌లో ఖర్చు తక్కువ అందువల్ల అక్కడి శ్యామలదాస్ కాలేజీలో చేరాను. కాని అక్కడంతా అడవి గొడవ. ఉపాధ్యాయులు చెప్పేది నాకు బోధపడలేదు. అది వారి లోటు కాదు. నా లోటే. ఆరు నెలలు గడిచాయి. ఇంటికి వెళ్ళాను. “మావుజీదవే” అనువారు మా కుటుంబానికి పాత మిత్రులు. మాకు మంచి చెడులు చెబుతూ వుండేవారు. ఆయన బ్రాహ్మణులు, విద్వాంసులు. వ్యవహారదక్షులు. మా తండ్రిగారు గతించిన తరువాత కూడా మా కుటుంబ కష్టసుఖాల్ని గురించి తెలుసుకుంటూ వుండేవారు. సెలవుదినాల్లో వారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మగారితోను, మా పెద్దన్నగారితోనూ మాట్లాడుతూ నా చదువును గురించి అడిగారు. నేను శ్యామలదాసు కాలేజీలో చేరి చదువుతున్నానని తెలుసుకున్నారు. కొంత సేపు యోచించి వారు ఈ విధంగా అన్నారు. “ఇప్పుడు కాలం మారింది. తగిన చదువు లేందే మీలో ఎవ్వరూ ఇప్పుడు మీ నాన్నగారు పొందిన పదవి, హోదా పొందలేరు. ఈ పిల్లవాడు చదువులో ముందడుగు వేస్తున్నాడు. కనుక ఇతడు ఈ హోదాను నిలుపుకునేలా చూడండి. బి.ఏ. ప్యాసు కావాలంటే ఇంకా నాలుగేళ్ళ సమయం పడుతుంది. ఎంత తంటాలుపడ్డా నెలకు 50 లేదా 60 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. దివాను మాత్రం కాలేడు. మా కుమారుని వలె లాయరు కావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ పిల్లవాడు లాయరు అయ్యేనాటికి దివాన్ పదవి కోసం చాలామంది లాయర్లు తయారవుతారు. అందువల్ల మీ పిల్లవాణ్ణి ఇంగ్లాండు పంపడం మంచిదని నా అభిప్రాయం. అక్కడ బారిష్టరు కావడం తేలిక అని మా అబ్బాయి కేవలరామ్ చెప్పాడు. మూడేళ్ళలో తిరిగి రావచ్చు. నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అవుతాయి. బారిష్టరై తిరిగివచ్చిన ఆ క్రొత్తవాణ్ణి చూడండి ఎంత దర్జాగా వుంటాడో, అతడు అడిగితే చాలు దివాన్‌గిరీ ఇచ్చేలా వున్నారు. కనుక ఈ సంవత్సరమే మోహనదాస్‌ను ఇంగ్లాండు పంపడం మంచిది. మా అబ్బాయి కేవల్‌రామ్‌కు ఇంగ్లాండులో మిత్రులున్నారు. వారికి పరిచయ పత్రాలిస్తాడు. అందువల్ల పిల్లవాడికి అక్కడ యిబ్బంది కలుగదు” ఈ విధంగా మా వాళ్ళకు చెప్పి జోషీగారు (దవేగారిని మా కుటుంబీకులు జోషీగారని అనేవారు) మేము అంగీకరించినట్లు భావించి నావంకకు తిరిగి “నీవు ఇక్కడ చదవడం కంటే ఇంగ్లాండులో చదువుకునేందుకు అభిలషింపవా?” అని అడిగారు. వారి మాటలు విన్న నాకు సంతోషం కలిగింది. కాలేజీలో సాగుతున్న కఠినమైన విద్యాబోధన వల్ల నేను విసిగిపోయివున్నాను. అందువల్ల వారి ఈ మాట వినగానే ఆనందపడి “ఎంత త్వరగా నన్ను పంపితే అంత మంచిది” అని అనివేశాను. పరీక్షలు త్వరగా ప్యాసు కావడం కష్టం. అందువల్ల నన్ను వైద్య చదువుకు పంపకూడదా అని అడిగాను.

మా అన్నగారు నా మాటకు అడ్డువచ్చి “నాన్నకు వైద్యమంటే ఇష్టం లేదు. మనం వైష్ణవులం. పీనుగుల్ని కోయడం మనకు పాడికాదు అని నాన్నగారు నిన్ను దృష్టిలో పెట్టుకుని అనేవారు. నీవు వకీలు కావడం నాన్నగారికి ఇష్టం” అని అన్నాడు.

వెంటనే జోషి మ అన్నగారి మాటల్ని సమర్థిస్తూ ఇలా అన్నారు. “నేను మీ నాన్నగారిలా వైద్యవృత్తిని ద్వేషించను. వైద్యవృత్తిని శాస్త్రం కూడా నిషేధించలేదు. నీవు వైద్యపరీక్ష ప్యాసైనా దివాన్ పదవి పొందలేవు. నీవు దివాన్ కావాలి. చేతనైతే అంత కంటే పెద్ద పదవి సంపాదించాలి. అప్పుడే ఈ పెద్ద కుటుంబాన్ని పోషించగలుగుతావు. రోజులు త్వరగా మారిపోతున్నాయి. రోజులు గడిచేకొద్దీ కష్టాలు పెరుగుతాయి. అందువల్ల బారిష్టరు కావడమే అన్నివిధాలా మంచిది” అని చెప్పి మా అమ్మగారి వంక తిరిగి “ఇక నాకు సెలవీయండీ. నేను చెప్పిన విషయాన్ని గురించి యోచించండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇంగ్లాండు ప్రయాణానికి సన్నాహాలు జరుపుతూ వుండండి. నేను చేయగల సాయం ఏమైనా వుంటే తప్పక చేస్తా” అంటూ జోషీ లేచి వెళ్ళిపోయారు. నేను ఆకాశ సౌధాలు నిర్మించసాగాను. మా అన్నగారు ఆలోచనా సాగరంలో మునిగిపోయారు. నన్ను ఇంగ్లాండు పంపడానికి డబ్బు ఎక్కడినుంచి తేవడం? ఒంటరిగా ఉన్నవాణ్ణి ఇంగ్లాండుకు ఎలా పంపడం? ఈ మధనలో అన్నగారు పడ్డారు

మా అమ్మగారు కూడా చింతలో పడిపోయింది. నన్ను విడిచి వుండలేదు. నా ఎడబాటు ఆమె సహించలేదు. అందువల్ల ఒక ఉపాయం ఆమెకు తట్టింది. “మన కుటుంబ పెద్దలు మీ పినతండ్రిగారున్నారు కదా! మొదట వారితో సంప్రదిద్దాం. వారు అంగీకరిస్తే తరువాత ఆలోచిద్దాం” అని ఆమె అన్నది.

మా అన్నగారికి మరో ఊహ కలిగింది. “పోరుబందరుపై మనకు కొంత హక్కు వున్నది. అక్కడ లేలీగారు పెద్ద అధికారి. మన కుటుంబమంటే వారికి గౌరవం. మన పినతండ్రిగారంటే వారికి ప్రత్యేక అభిమానం. నీ విద్యా వ్యయానికి సంస్థానం పక్షాన కొంత సహాయం అందజేసి వారు తోడ్పడవచ్చు” అని నాతో అన్నారు.

వారి మాటలు నాకు నచ్చాయి. పోరుబందరుకు ప్రయాణమైనాను. ఆ రోజుల్లో రైళ్ళు లేవు. ఎద్దుబండిమీద ప్రయాణం చేయాలి. నాకు పిరికితనం ఎక్కువ అని ముందు వ్రాశాను. అయితే ఇంగ్లాండుకు వెళ్ళాలనే ఉత్సాహం కలగడం వల్ల దాని ముందు నా పిరికితనం పటాపంచలైపోయింది. ధోరాజీ వరకు ఎడ్లబండిలో వెళ్ళాను. ఒంటెమీద ప్రయాణం సాగించాను. ఒంటె ప్రయాణం మొట్టమొదటిసారి చేశాను.

పోరుబందరు చేరాను. మా పినతండ్రిగారికి సాష్టాంగప్రణామం చేశాను. విషయమంతా వారికి చెప్పాను. వారు అంతా విని కొంచెం సేపు ఆలోచించి యిలా ఉన్నారు. “ఇంగ్లాండులో స్వధర్మ రక్షణ సాధ్యపడుతుందని నాకు అనిపించడంలేదు. నేను విన్న విషయాల్ని బట్టి అక్కడ స్వధర్మరక్షణ అసంభవమని భావిస్తున్నాను. అక్కడికి వెళ్ళివచ్చిన బారిష్టర్లను చూస్తున్నాను. వీళ్ళకు ఆ తెల్లవాళ్ళకు భేదం కనబడటం లేదు. ఆహారం విషయంలో వారికి నిషేధాలు లేవు. చుట్ట ఎప్పుడూ వారి నోట్లో ఉండవలసిందే. ఇంగ్లీషువాళ్ళ దుస్తులు సిగ్గులేకుండా ధరిస్తారు. అది మన కుటుంబ సంప్రదాయం కాదు. నేను కొద్దిరోజుల్లో తీర్ధయాత్రకు బయలుదేరుతున్నాను. నేను యిక ఎన్నాళ్ళో బ్రతకను. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న నేను సముద్రయానానికి అంగీకరించలేను. కాని నేను నీ దారికి అడ్డం రాను. ఈ విషయంలో నిజంగా కావలసింది మీ అమ్మగారి అనుమతి. ఆమె అంగీకరిస్తే బయలుదేరు. నేను అడ్డురానని ఆమెకు చెప్పు. నేనూ ఆశీర్వదిస్తాను.

“నాకు కావలసింది అదే. మా అమ్మగారి అనుమతి కోసం ప్రయత్నిస్తాను. మీరు లేలీగారికి సిఫారసు చేయండి” అని అడిగాను “నేను ఎలా చేస్తాను? అయితే అతను మంచివాడు. నీవే ఉత్తరం వ్రాయి. మన కుటుంబాన్ని గురించి తెలిస్తే తప్పక అనుమతిస్తాడు. సహాయం కూడా చేయవచ్చు.” అని అన్నారు

నేను సిఫారసు చేయమని అడిగితే మా పినతండ్రి ఎందుకు అంగీకరించలేదో నాకు బోధపడలేదు. సముద్రయానానికి ప్రత్యక్షంగా సాయం చేయడం ఆయనకు ఇష్టం లేదని నాకు గుర్తు.

లేలీగారికి జాబు వ్రాశాను. వారి అనుమతి తీసుకుని కలుద్దామని వెళ్ళాను. మేడమీద ఎక్కుతూ ఆయన నన్ను చూచాడు. బి.ఏ. పూర్తిచేయి. తరువాత వచ్చి కలు. నీకు ఇప్పుడు ఏమీ సాయం లభించదు. అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నేను ఆయనను చూడడానికి బాగా తయారైవచ్చాను. వారికి చెప్పాలని కొన్ని మాటలు కూడా వ్రాసుకుని బాగా వల్లించాను. వంగి వంగి రెండు చేతులతో సలాం చేశాను. కాని అంతా వృధా అయిపోయింది.

తరువాత ఆలోచించాను. నా భార్య నగలపైనా దృష్టి పడింది మా అన్నగారిమీద నాకు అపరిమిత విశ్వాసం. ఆయన ఉదార హృదయుడు. ఆయనకు నాపై పుత్రవాత్సల్యం. నేను పోరుబందర్ నుండి రాజకోటకు వచ్చాను. జరిగినదంతా చెప్పాను. జోషీగారితో కూడా మాట్లాడాను. అవసరమైతే అప్పు చేసైనా ఇంగ్లాండు వెళ్ళమని ఆయన సలహా ఇచ్చాడు. నా భార్య నగలు అమ్మితే రెండు మూడు వేల రూపాయలు వస్తాయనీ, వాటిని అమ్మి ఇంగ్లాండుకు వెళతానని అన్నాను. మా అన్నగారు ఏదో విధంగా డబ్బు ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు.

కాని మా అమ్మకు ఇష్టం లేదు. ఆమె ఏవో వంకలు చెప్పడం మొదలు పెట్టింది. ఇంగ్లాండు వెళ్ళే యువకులు చెడిపోతారని ఎవరో ఆమెకు చెప్పారు. అక్కడి వాళ్ళు గోమాంసం తింటారని, మద్యం త్రాగందే బ్రతకలేరని కూడా చెప్పారు. “ఇదంతా ఏమిటి?” అని ఆమె నన్ను అడిగింది. “అమ్మా! నన్ను నమ్మవా? నేను నీకు అబద్ధం చెబుతానా? నేను వాటిని ముట్టుకోను. ఒట్టు పెట్టుకుంటాను. నిజానికి అటువంటి అపాయమేవుంటే జోషీగారు వెళ్ళమని చెబుతారా?” అని అన్నాను. “నాయనా! నాకు నీమీద నమ్మకం ఉన్నది. కానీ దూరదేశం కదా! ఎట్లా నమ్మడం? నాకు ఏమీ తోచడం లేదు. బేచర్జీ స్వామిని అడిగిచూస్తాను” అని ఆమె అన్నది.

బేచర్జీ స్వామి మోఢ్ వైశ్యులు. మధ్యలో ఆయన జైన సాధువుగా మారారు. జోషీగారివలెనే వారు కూడా మా కుటుంబహితైషి. వారిని కలిశాము. “ఇతని చేత మూడు వాగ్దానాలు చేయించి ఇంగ్లాండుకు పంపవచ్చు” అని చెప్పి “మద్యం, మాంసం, మహిళ” లను ముట్టనని నా చేత ప్రమాణం చేయించారు. అప్పుడు మా అమ్మ అంగీకారం తెలిపింది.

హైస్కూల్లో నాకు వీడ్కోలు సభ జరిగింది. రాజకోటకు చెందిన ఒక పిన్న వయస్కుడు ఇంగ్లాండు వెళ్ళడం అక్కడ అసాధారణ విషయమైపోయింది. నేను నా కృతజ్ఞతలు తెలిపేందుకు మూడు నాలుగు వాక్యాలు ముందుగా వ్రాసి పెట్టుకున్నాను. వాటిని చదివేసరికి నాకు చెమటలు పట్టాయి. శరీరం వణికింది. ఆనాటి ఆ విషయం యిప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నది.

పెద్దల దీవెనలతో బొంబాయికి బయలుదేరాను. బొంబాయికి ఇదే నా ప్రథమ యాత్ర. మా అన్న నా వెంట బొంబాయి వచ్చారు. కాని ఇల్లు అలకగానే పండుగ అవుతుందా? బొంబాయిలో కొన్ని గండాలు దాటవలసి వచ్చింది.