Jump to content

సత్యశోధన/మొదటిభాగం/12. కులబహిష్కరణ

వికీసోర్స్ నుండి

12. కుల బహిష్కరణ

మా అమ్మ ఆజ్ఞను, ఆశీస్సులను పొంది పసిపాపను, భార్యను విడిచి అమితోత్సాహంతో బొంబాయికి బయలుదేరాను. జూన్, జూలై మాసాల్లో హిందూ మహాసముద్రం సామాన్యంగా ఒడిదుడుకులుగా ఉంటుంది. “మీ తమ్ముడికి ఇది మొదటి ప్రయాణం కదా! నవంబరు వరకు సముద్రప్రయాణం ఆపుకోండి. ఈ మధ్యనే తుఫాను వల్ల ఒక స్టీమరు కూడా మునిగిపోయింది” అని కొందరు మిత్రులు మా అన్నగారికి చెప్పారు. దానితో ఆయన కంగారుపడి సముద్ర ప్రయాణానికి అంగీకరించలేదు. అక్కడే ఒక మిత్రుని ఇంట్లో నాకు బస ఏర్పాటు చేసి తాను రాజకోటకు వెళ్ళి ఉద్యోగంలో చేరారు. నాకు కావలసిన ప్రయాణ వ్యయం మా బావ దగ్గర వుంచారు. వెళ్ళేప్పుడు ఇమ్మని చెప్పడమే గాక, అవసరమైన సహాయం చెయ్యమని మిత్రులకు కూడా చెప్పి మా అన్న ఇంటికి వెళ్ళిపోయారు.

బొంబాయిలో ప్రొద్దుపోవడం లేదు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ ఇంగ్లాండుకు వెళ్ళే కలవరింతలే. ఇంతలో మా కులంవారిలో కలవరం బయలుదేరింది. అంతవరకు మా కులంవారైన మోఢ్‌వైశ్యులెవ్వరూ సీమ ప్రయాణం చేయలేదు. నేను సీమ వెళుతున్నాను గనుక నన్ను కులాన్నుంచి బహిష్కరించాలని కొందరికి ఆవేశం కలిగింది. అందుకోసం ఒక సభ ఏర్పాటు చేశారు. కులస్థులు చాలామంది వచ్చారు. నన్ను పిలిపించారు. నాకు అంత సాహసం ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేనాసభకు నిర్భయంగ వెళ్ళాను. ఆ కులం పెద్ద అయిన సేఠ్ కు మా తండ్రిగారికి పరిచయం వున్నదట. ఆయన మాకు దూరబంధువుకూడానట. “కులధర్మాన్ని బట్టి నీవు సీమకు వెళ్ళడం సరిగాదు. సముద్రయానం మనకు నిషిద్ధం. అక్కడ ధర్మపాలనం సాధ్యంకాదు” అని సేఠ్ అన్నాడు. “సీమకు వెళ్ళడం ఎంతమాత్రం ధర్మేతరం కాదు. నేను అక్కడికి విద్య కోసం వెళుతున్నాను. మీరు భయపడుతున్న వస్తువుల్ని తాకనని మా అమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేశాను. అది నన్ను కాపాడుతుంది” అని సమాధానం చెప్పాను.

“నీవు అక్కడికి వెళితే ధర్మపాలన జరగదు. మీ తండ్రిగారికి నాకు ఎంతటి స్నేహమో నీకు తెలుసా? కావున నా మాటవిను. సీమ ప్రయాణం విరమించుకో” అని సేఠ్ చెప్పగా, “అయ్యా నాకు తెలుసును. మీరు నా తండ్రివంటి వారు. సీమకు వెళ్ళాలనే నా నిర్ణయం మార్చుకోను. మా తండ్రిగారికి మిత్రులు, విద్వాంసులు అగు బ్రాహ్మణులు సీమకు వెళ్ళమని ప్రోత్సహించారు. వారికి దోషం ఏమీ కనబడలేదు. మా అమ్మగారు, మా అన్నగారు కూడా అంగీకరించారు. అందువల్ల నేను వెళతాను” అని సమాధానం ఇచ్చాను.

“అయితే కుల పెద్దల ఆజ్ఞను మన్నించవా?”

నాకు వేరే మార్గం లేదు. కులం పెద్దలు ఈ విషయంలో కల్పించుకోకూడదని స్పష్టంగా చెప్పివేశాను. దానితో సేఠ్‌గారికి కోపం వచ్చింది. చివాట్లు పెట్టాడు. నేను నిబ్బరంగా కూర్చున్నాను.

“నేను ఇతణ్ణి కులం నుంచి వెలివేస్తున్నాను. ఇతనికి సహాయం చేసేవారికి ఇతణ్ణి సాగనంపేందుకు హార్బరు దగ్గరకు వెళ్ళేవారికి ఒక రూపాయి పావలా (సాలి గ్రామదానం) జరిమానా విధిస్తున్నాను.” అని సేఠ్ తన నిర్ణయం ప్రకటించాడు. నేను ఏమీ చలించలేదు. సేఠ్ దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చేశాను. మా అన్నగారికి ఈ విషయం తెలిస్తే వెళ్ళవద్దు తిరిగి వచ్చేయమంటారేమోనని భయపడ్డాను. కాని మా అన్నగారు ఆ విధంగా అనలేదు సరికదా, కులంవారు వెలివేసినా భయపడనవసరం లేదు, నీవు నిర్భయంగా సీమకు వెళ్ళు అని జాబు వ్రాశారు. అది నా అదృష్టం. ఇదంతా జరిగిన తరువాత నాకు తొందర ఎక్కువైంది. ఇలాంటి వారి వత్తిడివల్ల మా అన్నగారి మనస్సు మారుతుందేమోనన్న భయం నన్ను పట్టుకున్నది. ఇంతలో జునాగఢ్ వకీలు ఒకరు ఇంగ్లాండుకు బారిష్టరు పరీక్ష కోసం సెప్టెంబరు నాలుగోతేదీన వెళుతున్నారని తెలిసింది. నేను ఈ వార్తను మా అన్నగారి మిత్రులకు తెలియజేశాను. ఇట్టి అవకాశం పోగొట్టుకోకూడదని వారంతా భావించారు. సమయం తక్కువగా వున్నందున తంతి ద్వారా ఈ విషయం మా అన్నగారికి తెలియజేశాను. ఆయన అందుకు అంగీకరించాడు. మా బావగారికి తెలిపి పైకం అడిగాను. ఆయన “సేఠ్ ఆజ్ఞను గురించి చెప్పి నేను నీకు డబ్బు ఇవ్వను” అని అన్నాడు. అప్పుడు నేను మా కుటుంబమిత్రులు ఒకరి దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్పి నా ప్రయాణానికి అవసరమైన సొమ్ము ఇచ్చి సాయం చేయమనీ, మా అన్నగారిదగ్గర ఆ పైకం తీసుకోవచ్చుననీ విన్నవించాను. ఆయన నా విన్నపం అంగీకరించడమే కాక నన్నెంతో ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు తెలిపి అవసరమైన డబ్బు తీసుకొని వెళ్ళి ఓడ టిక్కెట్టు కొన్నాను. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడి మిత్రులు అనుభవజ్ఞులు. నాకు అవసరమయ్యే దుస్తులు తయారు చేయించారు. ఆ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు బాగున్నాయి. కొన్ని బాగాలేవు. ఇప్పుడు నేను ధరించేందుకు అంగీకరించిన నెక్‌టైని ఆనాడు అసహ్యించుకున్నాను. పొట్టి చొక్కా (జాకెట్) ధరిస్తుంటే సిగ్గు వేసింది అయితే ఇంగ్లాండు వెళ్ళాలనే ఉత్సాహం ముందు ఈ చిన్న వ్యవహారాలు నిలువలేదు. ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు అధికంగా సమకూర్చుకున్నాను. జునాగఢ్ వకీలు త్ర్యంబకరాయ్ మజుందార్‌గారు కేబిన్‌లోనే నా మిత్రులు నాకు ఒక బెర్తు తీసుకున్నారు. వారికి నన్ను పరిచయం చేశారు. ఆయన పెద్దవాడు, లోకానుభవం గలవాడు నాకు అంత లోకానుభవం లేదు. పద్దెనిమిదేండ్లవాణ్ణి. ఇతణ్ణి గూర్చి మీరేమీ భయపడవద్దని నన్ను సాగనంపడానికి వచ్చినవారందరికీ మజుందార్ చెప్పాడు. ఈ విధంగా 1888 సెప్టెంబరు 4వ తేదీనాడు బొంబొయినుండి ఓడలో ఇంగ్లాండుకు బయలుదేరాను.