సత్యశోధన/మొదటిభాగం/13. చివరకు సీమ చేరాను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

13. చివరికి సీమ చేరాను

సముద్రయానం వల్ల అందరికీ సామాన్యంగా వచ్చే వాంతులు మొదలగు వ్యాధులు నాకు రాలేదు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతూ ఉంది. స్టుఅర్డు ఆనగా నౌకరుతో మాట్లాడటానికి కూడా నాకు సంకోచంగా ఉండేది. నాకు ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు లేదు. రెండవ సెలూన్‌లో ఒక్క మజుందారు తప్ప తక్కిన వారంతా ఆంగ్లేయులే. వారితో నేను మాట్లాడలేను. వారు ఇంగ్లీషులో ఏమి మాట్లాడారో నాకు తెలిసేది కాదు. తెలిసినప్పుడు బదులు చెప్పలేకపోయేవాణ్ణి. సమాధానం చెప్పదలిస్తే ముందు ప్రతివాక్యం లోపల కూడబలుక్కోవలసి వచ్చేది. భోజన సమయంలో ముల్లు గరిటెలు వాడటం నాకు చేతకాదు. ఆహార పదార్థాలలో మాంసం కలవని వస్తువులేమిటి అని అడగడానికి ధైర్యం చాలేది కాదు. అందువల్ల భోజనశాలకు వెళ్ళి పదిమందితో కలిసి కూర్చొని నేనెప్పుడూ భోజనం చేయలేదు. నా గదిలోనే వుండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు, పండ్లు తింటూ ఉన్నాను. మజుందారుగారికి ఇట్టి బాధలేదు. ఆయన అందరితోను కలిసి స్టీమరు పైభాగాన తిరుగుతూ వుండేవారు. కాని నేను పగలంతా నా గదిలోనే వుండి సాయంత్రం జనం తక్కువగా వున్నప్పుడు ఓడ పైకి వెళ్ళి తిరుగుతూ వుండేవాణ్ణి. మజుందారు నీవు కూడా ప్రయాణీకులందరితో కలసిమెలసి వుండమనీ, సిగ్గుపడవద్దనీ చెబుతూ వుండేవాడు. లాయర్లు బాగా మాట్లాడుతూ వుండాలని కూడా చెప్పి తన అనుభవాలు వినిపిస్తూ వుండేవాడు. అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ వుండమనీ, తప్పులు వచ్చినా భయపడవద్దని కూడా చెప్పేవాడు. కాని నాకు మాత్రం ధైర్యం చాలలేదు.

ఒక ఆంగ్లేయుడు దయతో నన్ను మాటల్లోకి దింపాడు. అతడు నాకంటే పెద్దవాడు. నీవు ఏమి తిన్నాపు? నీకేం పని? నీవెక్కడికి వెళుతున్నావు? నీకీ మొగమాటం ఎందుకు? ఈ రకమైన ప్రశ్నలు వేశాడు. అందరితోబాటు భోజనానికి రమ్మని ప్రోత్సహించాడు. మాంసం ముట్టకూడదన్న నా దీక్షను గురించి విని నవ్వాడు. ఓడ ఎర్ర సముద్రంలో ప్రవేశించినప్పుడు స్నేహితుడిలా సలహా యిస్తూ “బిస్కే సముద్రం చేరేటంతపరకు నీవు చెప్పిన విధంగా శాకాహారం తీసుకోవచ్చు. కాని తరువాత నీ ఆహార నియమాన్ని మార్చుకోక తప్పదు. ఇంగ్లాండులో చలి అధికం. అందువల్ల మాంసం తినక తప్పదు అని చెప్పాడు.

“అక్కడ మాంసం తినకుండా కూడా జనం ఉండవచ్చని విన్నానే” అని అన్నాను. “అసంభవం, నాకు తెలిసినంతవరకు ఆ విధంగా వుండే వారెవ్వరూ లేరు. నేను మద్యం తాగుతున్నాను, నిన్ను తాగమని చెప్పానా? కాని మాంసం తినక తప్పదు. తినకపోతే అక్కడ బ్రతకడం కష్టం” అని అన్నాడు.

మీ ఉపదేశానికి ధన్యవాదాలు. నేను మా అమ్మగారి ఎదుట మాంసం ముట్టనని ప్రమాణం చేశాను. అందువల్ల ఏది ఏమైనా సరే నేను మాంసం తినను. ఒకవేళ కుదరకపోతే తిరిగి మాదేశానికి వచ్చేస్తాను. అదే మంచిదని నా అభిప్రాయం అని చెప్పాను.

ఓడ బిస్కే సముద్రంలో ప్రవేశించింది. కాని అక్కడ మద్య మాంసాల జోరు కనబడలేదు. నేను బయలుదేరేటప్పుడు నీవు మాంసం ముట్టలేదని తెలిసిన వారి దగ్గర సర్టిఫికేటు తీసుకోమని మిత్రులు నాకు చెప్పారు. ఆ విషయం నాకు జ్ఞాపకం వున్నది. నాకు ఒక సర్టిఫికేటు ఇమ్మని వారిని కోరాను. అతడు సంతోషంతో ఇచ్చాడు. నేను కొంతకాలం ఆ సర్టిఫికేటును జాగ్రత్తగా కాపాడాను కాని ఆ తరువాత మాంసం తినేవాళ్ళు కూడా మాంసం తినడం లేదని సర్టిఫికెట్లు పుచ్చుకోవడం చూచాను. దానితో ఈ విధమైన సర్టిఫికెట్ల మోజు తగ్గిపోయింది. మాటకు విలువ వుండాలే గాని ఈ విధమైన సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం ఏముంటుందని అనిపించింది.

ప్రయాణం ముగించుకొని మేము సౌదెంప్టన్ చేరాం. ఆనాడు శనివారం అని గుర్తు, నా మిత్రులు తెల్లని ఉన్ని సూటు (ఫాంటు, కోటు, వెస్టుకోటు) తయారు చేయించి ఇచ్చారు. ఓడలో నల్ల సూటు ధరించాను. రేవులో దిగినప్పుడు తెల్ల సూటు బాగుంటుందని భావించి దాన్ని ధరించాను. అవి సెప్టెంబరు మాసం చివరి రోజులు. నేను తప్ప మరెవ్వరూ అటువంటి సూటు ధరించలేదు. చాలామంది తమ సామాను, తాళం చెవుల్తో సహా గ్రిండ్లే కంపెనీ ఏజంటుకు అప్పగించడం చూచి నేను కూడా ఆలాగే నా సామాను వారికి అప్పగించాను.

డాక్టర్ ప్రాణ్ జీవన్ మెహతా. దలపత్‌రాం శుక్ల, రణజిత్ సింగ్ మహారాజ్, దాదాభాయి నౌరోజీ గార్ల పేరిట మిత్రులు ఇచ్చిన సిఫారసు పత్రాలు నా దగ్గర వున్నాయి. లండనులో విక్టోరియా హోటలులో బస చేయమని ఒకరు ఓడలో మాకు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం నేను, మజుందారు యిద్దరం విక్టోరియా హోటలుకు వెళ్ళాం. తెల్ల దుస్తుల్లో వెలివేసినట్లు నేనొక్కణ్ణే అక్కడ కనబడుతూ వుండటం వల్ల బాధపడ్డాను. మర్నాడు ఆదివారం. అందువల్ల గ్రిండ్లే కంపెనీ వారు సామను ఇవ్వరని తెలిసి చిరాకు పడ్డాను.

సౌదెంప్టస్ నుంచి డాక్టర్ మెహతాగారికి నేను తంతి పంపాను. అది వారికి అందింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు హోటలుకు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆదరంగా చూచారు. నా ఉన్ని దుస్తుల్ని చూచి ఆయన నవ్వారు. మాటల సందర్బంలో అయాచితంగా వారి హేట్‌ను చేతిలోకి తీసుకున్నాను. దాని మృదుత్వాన్ని పరిశీలిద్దామని చేతితో దాన్ని అటూ ఇటూ త్రిప్పి దానిమీద గల రోమాల్ని నిమరడం ప్రారంభించాను. మెహతాగారు కొంచెం చిరాకు పడి నన్ను వారించారు. కాని అప్పటికే నా వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇది మొదటి మందలింపు. పాశ్చాత్య దేశంలో యిది నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఆ దేశ విశేషాల్ని గురించి మెహతాగారు చెబుతూ “ఇతరుల వస్తువుల్ని తాకకూడదు. హిందూ దేశంలో వలె ఇక్కడ ప్రథమ పరిచయం కాగానే ఎవ్వరినీ ప్రశ్నలు వేయకూడదు. హిందూ దేశంలో ఎదుటివారిని మనం అయ్యా అని సంబోధిస్తాం, ఇక్కడ ఆవిధంగా సంబోధించకూడదు. ఇక్కడ  యజమానుల్ని నౌకర్లు మాత్రమే అయ్యా అని సంబోధిస్తారు. హోటల్లో ఉంటే ధనం బాగా ఖర్చువుతుంది. కావున ఏదో కుటుంబంలో చేరడం మంచిది.” అని చెప్పాడు. సోమవారం నాడు ఒక నిర్ణయానికి వద్దామని భావించాం.

శ్రీ మజుందారు గారికీ, నాకు కూడ హోటలు ఖర్చు అధికమనిపించింది. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింధు మిత్రుడు మాతోబాటు ప్రయాణించాడు. ఆయనకీ మజుందారుగారికీ స్నేహం కలిసింది. ఆయనకు లండను కొత్త కాదు. లండనులో మీకు అద్దె గదులు యిప్పిస్తానని ఆయన మాకు చెప్పాడు. మేము అంగీకరించాము. సోమవారంనాడు గ్రిండ్లే కంపెనీ వారు మా సామాన్లు మాకు అందజేశారు. హోటలు వాళ్ళకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి వేశాము. మా సింధు మిత్రుడు మా కోసం చూచి పెట్టిన గదుల్లో ప్రవేశించాం. హోటలు గదికి చెల్లించాల్సిన అద్దె క్రింద నా వంతు సొమ్ము మూడు పౌండ్లు చెల్లించివేశాను. నేను బిల్లు చూచి నివ్వెరపోయాను. ఇంత సామ్ము చెల్లించి కూడా ఆకలితోనే వున్నాను. హోటలు భోజనం రుచించలేదు. ఒక వస్తువు తీసుకొని రుచి చూచాను. అది రుచించలేదు. మరో వస్తువు తీశాను. రెండిటికీ సొమ్ము చెల్లించవలసి వచ్చింది. బొంబాయి నుండి వెంట తెచ్చుకున్న తినుబండారాల మీదనే ఆధారపడవలసి వచ్చింది.

ఈ క్రొత్తగదుల్లో కూడా నాకు ఏమీ తోచలేదు. నా మనస్సు ఎప్పుడూ దేశం మీద, ఇంటిమీద, అమ్మమీద కేంద్రితమై వుండేది. బెంగగా వుండేది. రాత్రి ఇంటి సంగతులు జ్ఞాపకం వచ్చేవి. ఒకటే ఏడుపు. రాత్రిళ్ళు నిద్రలేదు. నా కష్టం ఇంకొకరితో చెప్పుకునేది కాదు. చెప్పి ఏం ప్రయోజనం? అంతా క్రొత్త. పాశ్చాత్య దేశాచారాలు నాకు క్రొత్త. ఎంతో జాగ్రత్తగా వుండాలని భావించాను. పైగా శాకాహారం గురించి నేను చేసిన ప్రతిజ్ఞ ఒకటి. అక్కడి ఆహార పదార్థాలు రుచిగా లేవు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిగా మారింది నా పని. ఇంగ్లాండులో వుండలేను. తిరిగి ఇండియాకు వెళ్ళలేను. మధనలో పడిపోయాను. చివరకు ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నాకు కలగిన అంతరాత్మ ప్రబోధం.