సత్యశోధన/మొదటిభాగం/14. నా అభిరుచి

వికీసోర్స్ నుండి

14. నా అభిరుచి

డాక్టర్ మెహతా నన్ను కలుసుకునేందుకై విక్టోరియా హోటలు వెళ్ళారు. అక్కడ మా అడ్రసు తెలుసుకుని మా బసకు వచ్చారు. ఓడ మీద ప్రయాణిస్తున్నప్పుడు మూర్ఖంగా వ్యవహరించి ఒంటికి తామర తగిలించుకొన్నాను. అక్కడ ఉప్పు నీళ్లలో స్నానం చేయవలసి వచ్చింది, ఆ నీళ్లలో సబ్బు కరగదు. నేను సబ్బు రుద్దుకోవడం సభ్యతా లక్షణమని భావించాను. తత్ఫలితంగా శరీరం శుభ్రపడటానికి బదులు జిగటలు సాగింది. దానితో తామర అంటుకున్నది. డాక్టరు మెహతాగారికి చూపించాను. ఆయన మంటలు రేగే యాసిటిక్ యాసిడ్ అను మందు ఇచ్చారు. ఆ మందు నన్ను బాగా ఏడిపించింది.

డాక్టరు మెహతా మా గదులు వగైరా చూచారు. తల త్రిప్పుతూ “ఇలా నడవదు. చదువుకంటే ముందు ఇక్కడి జీవనసరళి తెలుసుకోవడం ముఖ్యo”. అందుకోసం ఏదేని కుటుంబంతో కలిసి వుండటం అవసరం. అయితే అందాకా కొంచెం నేర్చుకొనేందుకు, ఫలానా వారి దగ్గర నిన్ను ఉంచాలని అనుకొన్నాను. ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళతాడు అని చెప్పారు. వారి మాటను కృతజ్ఞతా భావంతో శిరసావహించాను. ఆ మిత్రుని దగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను ఆదరించాడు. తన తమ్ముడిలా నన్ను చూచాడు. ఆంగ్ల పద్ధతులు, అలవాట్లు నేర్పాడు. ఇంగ్లీషు మాట్లాడే విధానం కూడా నేర్పాడు.

నా భోజన వ్యవహారం సమస్యగా మారింది. ఉప్పు, మసాలాలు లేని కూరలు రుచించలేదు. ఇంటి యజమానురాలు పాపం నా కోసం యింకా ఏం చేస్తుంది? ఉదయం వరిగల పిండితో జావ చేసేది. దానితో కడుపు కొద్దిగా నిండేది. కాని మధ్యాహ్నం, సాయంత్రం తినడానికి ఏమీ ఉండేది కాదు. పొట్ట ఖాళీ. మాంసం తినమని రోజూ స్నేహితుల ఒత్తిడి పెరిగింది. ప్రతిజ్ఞ సంగతి చెప్పి మౌనం వహించేవాణ్ణి. వాళ్ళ తర్కానికి సమాధానం చెప్పడం కష్టంగా ఉండేది. మధ్యాహ్నం రొట్టె, కూర మురబ్బాతో పొట్ట నింపుకొనేవాణ్ణి. సాయంత్రం కూడా అదే తిండి. రెండు మూడు రొట్టె ముక్కలతో తృప్తి పడేవాణ్ణి. మళ్ళీ అడగాలంటే మొగమాటం. బాగా కడుపునిండా తినే అలవాటు గలవాణ్ణి. ఆకలి బాగా వేస్తూ వుండేది. తిన్నది చాలేది కాదు. మధ్యహ్నం, సాయంత్రం పాలు లభించేవి కావు. అడగటానికి బిడియం. నా యీ పద్ధతి చూచి మిత్రుడు చికాకు పడ్డాడు. “నీవు నా సోదరుడవు అయి వుంటే ఈ పాటికి మూట ముల్లె కట్టించి పంపివేసి వుండేవాణ్ణి. యిక్కడి పరిస్థితులు తెలియక, చదువురాని నీ తల్లి దగ్గర చేసిన ప్రమాణానికి విలువ ఏమిటి చెప్పు! అది లా ప్రకారం అసలు ప్రమాణమే కాదు. అట్టి ప్రమాణానికి బద్ధుడవైయుండటం అజ్ఞానం. ఇదిగో చెబుతున్నా, ఈ పట్టుదల నీకు యిక్కడ ఏమీ ఒరగదు. పైగా నీవు గతంలో మాంసం తిన్నానని, అది రుచించిందని కూడా చెప్పావు. అవసరం లేని చోట మాంసం తిని, అవసరమైన చోట తిననంటున్నావు. ఇది దురదృష్టకరం” అని గట్టిగా అన్నాడు.

ఇట్టి తర్కం రోజూ జరుగుతూ వుండేది. వంద రోగాలకు “తినను” అనే మందు నా దగ్గర వుంది. మిత్రుడు వత్తిడి చేసే కొద్దీ నా పట్టుదల పెరగసాగింది. రోజూ రక్షించమని దేవుణ్ణి ప్రార్ధిస్తూ వుండేవాణ్ణి. ఆ రోజు రక్షణ జరుగుతూ వుండేది. దేవుడంటే ఏమిటో, ఎవరో నాకు తెలియదు, కాని ఆనాడు “రంభ” చేసిన బోధ నాకు ఎంతో మేలు చేసింది. చేస్తూ ఉన్నది.

ఒకనాడు మిత్రుడు ‘బెంధమ్’ వ్రాసిన పుస్తకం నా ఎదుట చదవడం ప్రారంభించాడు. ఉపయోగాన్ని గురించిన అధ్యాయం అది. భాష, విషయం రెండూ గంభీరంగా వున్నాయి. అర్థం గ్రహించడం కష్టం. ఆయన వివరించి చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు “క్షమించండి. యింతటి సూక్ష్మ విషయాలు నాకు బోధపడవు, మాంసాహారం ఆవశ్యకమని అంగీకరిస్తాను. కాని నేను చేసిన ప్రమాణాన్ని జవదాటను. దాన్ని గురించి వాదించను. నేను మీతో వాదించి జయం పొందలేనని ఒప్పుకుంటున్నాను. అజ్ఞానిననో, పెంకి వాడననో భావించి నన్ను వదలి వేయండి. మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. మీరు నా హితైషులని నాకు తెలుసు. మీరు నా మంచి కోరి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని తెలుసు. కాని నేను నా నియమాన్ని ఉల్లంఘించలేను. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞయే. ఇది అనుల్లంఘనీయం” అని స్పష్టంగా చెప్పివేశాను.

నా మాటలు విని మిత్రుడు నిర్ఘాంతపోయాడు. అతడు ఆ పుస్తకం మూసి “మంచిది, యిక వాదించను” అని అన్నాడు. నేను సంతోషించాను. అతడు మళ్ళీ ఎన్నడూ ఆ విషయమై వాదించలేదు. అయితే నన్ను గురించి బాధపడుతూ వుండేవాడు. అతడు పొగత్రాగే వాడు. మద్యం సేవించేవాడు. నాకు అవి గిట్టవని చెప్పివేశాను. అతడు ఎన్నడూ వాటిని త్రాగమని నాకు చెప్పలేదు. అయితే మాంసం తినకపోతే మూలబడతావని, ఈ విధంగా వుంటే ఇంగ్లాండులో వుండలేవని, వచ్చిన పని పూర్తి చేసుకోలేవని ఆయన చెబుతూ వుండేవాడు.

ఒక నెల ఈ విధంగా గడిచింది. ఆయన ఇల్లు రిచ్‌మండ్‌లో ఉంది. అందువల్ల వారానికి రెండు మూడుసార్ల కంటే లండను వెళ్ళడం కష్టంగా వుండేది. ఇది చూచి డా‖ మెహతాగారు, దలపత్‌రాం శుక్లాగారు మరో కుటుంబం చూచారు. నేను అక్కడ వుండడం మంచిదని భావించారు. వెస్టు కెన్నింగ్టన్‌లో వున్న ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంతో కలిసి వుండటానికి శ్రీ శుక్లాగారు ఏర్పాటు చేశారు. ఆ ఇంటి యజమానురాలు వితంతువు. ఆమెకు నా ప్రమాణాన్ని గురించి తెలియజేశాను. ఆమె నన్ను జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చింది. నేను అక్కడ ప్రవేశించాను. కాని అక్కడ కూడా మాకు కటిక ఉపవాసమే. తినుబండారాలు కొద్దిగా పంపమని ఇంటికి వ్రాశాను. అవి యింకా రాలేదు. ఏ వస్తువు తినడానికి రుచిగా వుండేదికాదు. ఆమె పదార్థం వడ్డించి యిది బాగుందా అని అడుగుతూ వుండేది. కాని ఆ పదార్థం గొంతు దిగేది కాదు. ఆమె చేయగలిగింది మాత్రం ఏముంటుంది? నాకు బిడియం తగ్గలేదు. వడ్డించిన దానికంటే మించి యింకా వడ్డించమని అడగటానికి బిడియంగా వుండేది. ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు చెరొక రొట్టెముక్క బలవంతాన నా ప్లేటులో వుంచేవారు. అయితే అంతకు రెండింతలైతే గాని నా ఆకలి తీరదని పాపం వాళ్ళకు తెలియదు.

కొంతకాలానికి నాకు నిలకడ చిక్కింది. ఇంకా నేను, చదువు ప్రారంభించలేదు. శుక్లా గారి ధర్మమా అని వారిచ్చిన వార్తాపత్రికలు చదవడం ప్రారంభించాను. ఇండియాలో ఎప్పుడూ అట్టి పని చేయలేదు. ఇక్కడ ప్రతిరోజూ వార్తా పత్రికలు చదివి వాటి యందు అభిరుచి కలిగించుకున్నాను. డైలీ న్యూస్, డైలీ టెలిగ్రాఫ్, పాల్‌మాల్ గెజెట్ రోజూ చూడసాగాను. వాటిని చదవడానికి గంట కంటె ఎక్కువ సమయం పట్టేది కాదు.

ఇక ఊరు తిరగడం ప్రారంభించాను. మాంసం లేని హోటల్ళు ఎక్కడ వుంటాయా అని అన్వేషణ ప్రారంభించాను. మా ఇంటి యజమానురాలు అట్టివి కొన్ని వున్నాయని చెప్పింది. రోజూ పది, పన్నెండు మైళ్ళు తిరిగి చవుక రకం దుకాణాల్లో కడుపు నిండ రొట్టె తినడం ప్రారంభించాను. అయినా తృప్తి కలుగలేదు. ఇలా తిరుగుతూ వుంటే ఒక రోజున ఫారింగ్‌డన్ వీధిలో శాకాహారశాల (vegetarian restaurant) ఒకటి కనబడింది. తనకు కావలసిన వస్తువు దొరికినప్పుడు పిల్లవాడికి ఎంత ఆనందం కలుగుతుందో నాకు అంత ఆనందం కలిగింది. లోపలికి అడుగు పెట్టే పూర్వం ద్వారం దగ్గర గాజు కిటికీలో అమ్మకానికి పెట్టిన పుస్తకం ఒకటి కనబడింది. అది సాల్ట్ రచించిన “అన్నాహారసమర్థన” అను పుస్తకం. ఒక షిల్లింగు ఇచ్చి ఆ పుస్తకం కొన్నాను. తరువాత భోజనానికి కూర్చున్నాను. ఇంగ్లాండు వచ్చాక ఇవాళ కడుపు నిండా మొదటిసారి హాయిగా భోజనం చేశాను. దేవుడు నా ఆకలి తీర్చాడు.

సాల్ట్ రచించిన ఆ పుస్తకం చదివామ. నా మీద ఆ పుస్తక ప్రభావం బాగా పడింది. ఆ పుస్తకం చదివిన తరువాత అన్నాహారం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మగారి దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞ నాకు ఎంతో ఆనందం కలిగించింది. జనమంతా మాంసాహారులైతే మంచిదని ఒకప్పుడు భావించేవాణ్ణి. తరువాత కేవలం ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాంసం త్యజించాను. భవిష్యత్తులో బహిరంగంగా మాంసం తిని ఇతరులను కూడా మాంసం తినమని చెప్పి ప్రోత్సహించాలని భావించాను. కాని ఇప్పుడు శాకాహారిగా ఇతరులను కూడా శాకాహారులుగా మార్చాలనే కోరిక నాకు అమితంగా కలిగింది.