సత్యశోధన/మొదటిభాగం/15. ఆంగ్లవేషం
15. ఆంగ్ల వేషం
రోజురోజుకి నాకు శాకాహారం మీద నమ్మకం పెరగసాగింది. సాల్ట్‌గారి పుస్తకం చదివిన తరువాత ఆహార విషయాలను గురించిన పుస్తకాలు చదవాలనే కాంక్ష పెరిగింది. దొరికిన పుస్తకాలన్నీ చదివాను. హోవర్డు విలియమ్స్‌గారు వ్రాసిన “ఎతిక్స్ ఆఫ్ డైట్” అను గ్రంథం వాటిలో ఒకటి. అందు ఆదికాలం నుండి నేటి వరకు మనుష్యుల ఆహారాన్ని గురించిన చర్చ విస్తారంగా వుంది. పైథాగరస్, జీసస్ మొదలుకొని నేటి వరకు వున్న మతకర్తలు, ప్రవక్తలు అంతా ఆకులు, కూరలు, అన్నం తినేవారని రుజువు చేయబడింది. డాక్టర్ ఎల్లిన్‌సన్ గారు ఆరోగ్యాన్ని గురించి వ్రాసిన రచనలు ఉపయోకరమైనవి. ఆయన రోగుల ఆహార పద్ధతులను నిర్ధారించి తద్వారా రోగాల్ని కుదిర్చే ప్రణాళికను ఒక దానిని రూపొందించాడు. అతడు శాకం, అన్నం తినేవాడు, తన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆ ఆహారమే నిర్ధారించేవాడు. ఈ గ్రంథాలన్నీ చదవడం వల్ల ఆహార పరీక్ష నా జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించింది. ప్రారంభంలో ఆరోగ్యమే ఆహార పరీక్షకు ప్రధాన కారణం అయినా తరువాత ఈ శాకాహార విధానానికి ధర్మ దృష్టియే ప్రధాన లక్ష్యం అయింది.
అయినా నా మిత్రునికి నా ఆహారాన్ని గురించి బెంగపోలేదు. మాంసం తినకపోతే చిక్కిపోయే ప్రమాదం వుందనీ, ఇంగ్లీషువారితో కలిసి వుండలేకపోవచ్చుననీ భావించి నన్ను మాంసం తినమని వత్తిడి చేయడం ప్రారంభించాడు. నాయందు గల ప్రేమాధిక్యం వల్లనే ఆయన ఈ విధంగా చేశాడు. శాకాహార గ్రంథాలు విస్తారంగా చదవడం వల్ల నాకు చెడు జరుగుతుందేమోనని భయపడ్డాడు. ముఖ్యమైన అసలు చదువు మాని ఆహార పదార్థాలను గురించిన గ్రంధాలు చదువుతూ కాలమంతా వ్యర్థం చేసుకొంటాడేమోనను భావం ఆయనకు కలిగింది. దానితో చివరి ప్రయత్నం గట్టిగా చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఒకనాడు నన్ను నాటకానికి రమ్మంటే వెళ్ళాను. నాటకం చూడబోయే ముందు హాల్‌బర్న్ రెస్టారెంటులో భోజనం ఏర్పాటు చేశాడు. అది నాకు ఒక నగరంలా కనబడింది. విక్టోరియా హోటలును ఖాళీ చేసిన తరువాత ఇంత పెద్ద హోటలును నేను చూడలేదు. విక్టోరియా హోటల్లో నేను ఏవిధమైన ప్రయోగమూ చేయలేదు. అచ్చట ఉన్నన్ని రోజులు ఏమి చేయడానికీ తోచలేదు. కాని ఈ హోటలుకు నన్ను తీసుకురావడానికి ఆయన ఒక ఎత్తు ఎత్తాడని తరువాత బోధపడింది. ఈ హోటలులో చాలామంది భోజనం చేస్తూ ఉంటారు. మధ్యలో మాట్లాడటానికి వీలు ఉండదు. కిక్కురుమనకుండా పెట్టింది తినవలసి వస్తుందనే భావం ఆయనకు కలిగిందన్న మాట. మేము చాలామందిమి ఒక బల్ల దగ్గర కూర్చున్నాము. మొదటి వాయిసూప్, అది దేనితో చేశారా అని నాకు సందేహం కలిగింది. మిత్రుణ్ణి అడగటానికి వీలు లేదు. వడ్డించేవాణ్ణి పిలిచాను. అతణ్ణి ఎందుకు పిలుస్తున్నావని మిత్రుడు గట్టిగా నన్ను అడిగాడు. అంతటితో ఆగక “నీవు ఈ సమాజంలో ఉండగలవు, ఎలా మెలగాలో తెలియకపోతే ఇంకొక హోటలుకు వెళ్ళి భుజించు. నేను వచ్చేదాకా హోటలు బయట వేచి ఉండు” అని కోపంగా అన్నాడు.
ఆయన మాటలు వినగానే నాకు లోలోన సంతోషం కలిగింది. వెంటనే లేచి, బయటికి వచ్చేశాను. దగ్గరలోనే ఒక శాకాహారశాల ఉంది. ప్రొద్దుపోయినందున దాన్ని మూసివేశారు. ఆపూట నాకు తిండిలేదు. తరువాత ఇద్దరం నాటకం చూచేందుకు వెళ్ళాము. ఈ ఘట్టాన్ని గురించి ఆయన ఎన్నడూ నా దగ్గర ఎత్తలేదు. ఎత్తవలసిన అవసరం నాకు లేదు గదా! మా మిత్రకలహం చివరిది ఇదే. అయితే దానివల్ల మా స్నేహానికి ఆటంకం కలగలేదు. ఆయన పడ్డ తపనకు మూలం ప్రేమే. ఆచరణలోను, ఆలోచనలోను వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయనంటే నాకు అమిత గౌరవం ఏర్పడింది.
మాంసం తినకపోయినా మిగతా విషయాల్లో ఆంగ్లసమాజంలో సరిగా మసల గలనని ఆయనకు తెలియజేయాలని భావించాను. అందుకోసం అశక్యం అనుకొన్న ఆంగ్ల పద్ధతుల్ని అవలంబించ ప్రారంభించాను.
నేను ధరించే దుస్తులు బొంబాయిలో తయారైనవి. అవి ఇంగ్లీషు వారి సమాజానికి పనికిరావని తెలుసుకొని, ఆర్మీ అండ్ నేవి స్టోర్సులో తయారుచేయించాను. పందొమ్మిది షిల్లింగులు పెట్టి చిమ్నీ పాట్‌హాటు కొన్నాను. ఆ రోజుల్లో నేను ఆ హాట్ కోసం ఎక్కువ ధర చెల్లించాను. అంతటితో ఆగక నాగరికతకు నడిగడ్డ అయిన బాండ్ వీధిలో ఒక ఈవెనింగ్ సూటు కోసం పది పౌండ్లు వెచ్చించాను. మా అన్నగారికి జేబులో వ్రేలాడే రెండు పేటల బంగారు గొలును పంపమని వ్రాస్తే ఆయన వెంటనే ఎంతో దయతో పంపించారు, టై కట్టుకోవడం నేర్చుకొన్నాను. మనదేశంలో క్షవరం నాడే అద్దం చూచే అలవాటు వుండేది. కాని ఇక్కడ నిలువెత్తు అద్దం ముందు నిలబడి టై సరిచేసుకోవడం మొదలుగాగల పనులకు ప్రతిరోజూ పది పదిహేను నిమిషాలు వ్యర్ధం అవుతూ ఉండేవి. నా జుట్టు మృదువుగా వుండేది కాదు. అందువల్ల దాన్ని సరిగా దువ్వుకోవడానికి బ్రష్‌తో నిత్యము కుస్తీ పట్టాల్సి వచ్చేది. హేటు ధరించినప్పుడు, తొలగించినప్పుడూ పాపిట చెడిపోకుండా చెయ్యి దానిమీదనే వుంటూ వుండేది. అంతేగాక సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు ఎప్పుడూ చెయ్యి పాపిట మీదనే వుంటూ వుండేది.
ఈ టిప్పుటాపులు అంతటితో ఆగలేదు. ఆంగ్లేయుల వేషం వేసుకున్నంత మాత్రాన సభ్యుడవటం సాధ్యమా? ఇంకా సభ్య లక్షణాలు నేర్చుకోవలసినవి చాలా వున్నాయి. డాన్సు చేయడం నేర్చుకోవాలి. ఫ్రెంచి భాష బాగా నేర్చుకోవాలి. ఇంగ్లాండుకు పొరుగున వున్న ఫ్రాన్సు దేశపు భాష ఫ్రెంచి. యూరప్ పర్యటించాలనే కోరిక నాకు ఉండేది. అంతేగాక సభ్య పురుషుడు ధారాళంగా ఉపన్యసించడం కూడా నేర్చుకోవాలి. నేను డాన్సు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక క్లాసులో చేరాను. ఒక టరముకు మూడు పౌండ్లు ఫీజుగా చెల్లించాను. మూడు వారాలలో ఆరు తరగతులు జరిగి వుంటాయి. తాళానికి అనుగుణ్యంగా అడుగుపడలేదు. పియానో మోగుతూ ఉండేది. కానీ అదిఏమి చెబుతున్నదో బోధపడేది కాదు. ఒకటి, రెండు, మూడు అంటూ వాయిద్యం ప్రారంభమయ్యేది. కాని వాటి మధ్య గల అంతరాళం అర్థం అయ్యేది కాదు. ఇక ఏం చేయాలి? చివరికి నా వ్యవహారం కౌపీన సంరక్షణార్థం అయంపటాటోపః అన్న చందానికి దిగింది. వెనకటికి ఒక సన్యాసి తన గోచీని కొరకకుండ ఎలుకల్ని ఆపడానికి ఒక పిల్లిని పెంచాడట. పిల్లిని పెంచడానికి ఒక ఆవు. ఆవును కాచేందుకు ఒక కాపరి, ఈ విధంగా గోచీని రక్షించుకోవడం కోసం సంసారం ఏర్పడిందట.
పాశ్చాత్య సంగీతం నేర్చుకునేందుకై ఫిడేలు నేర్చుకోవాలని నిర్ణయించాను. ఫిడేలుకు మూడు పౌండ్ల సొమ్ము ఖర్చయింది. ఫిడేల్ నేర్చుకోడానికి కొంత ఖర్చు పెట్టక తప్పలేదు. ఉపన్యాస ధోరణి నేర్చుకొనేందుకు మరో గురువుకు ఒక గిన్నీ ప్రవేశ రుసుం క్రింద చెల్లించాను. అందుకోసం బెల్ రచించిన స్టాండర్డ్ ఎలోక్యూషనిస్ట్ అను గ్రంథం కొన్నాను. అందలి ఫిట్‌గారి ఉపన్యాసంతో అభ్యాసం ప్రారంభించాను.
కాని ఆ బెల్ అను ఆయన నా చెవిలో (బెల్ అనగా) గంట వాయించడంతో మేల్కొన్నాను. నేను ఇంగ్లాండులో ఎల్లకాలం వుంటానా? ధారాళంగా ఉపన్యసించడం నేర్చుకొని ఏం చేయాలి? డాన్సులు చేసి సభ్యుడినవుతానా? ఫిడేల్ మనదేశంలో లేదా? అక్కడ నేర్చుకోవచ్చుకదా! నేను విద్యార్థిని, విద్యాధనం సేకరించేందుకు నేను వచ్చాను. వృత్తి కోసం నేను సిద్ధం కావాలి, సదాచారాల ద్వారా సభ్యుడనని గుర్తించబడితే చాలు. అంతేకదా కావలసింది? ఇంక ఎందుకీ వ్యామోహం?
ఈ విధమైన భావాలను వెల్లడిస్తూ ఒక జాబు ఉపన్యాస కళను నేర్పే గురువు గారికి వ్రాసి పంపాను. ఆయన దగ్గర రెండు మూడు పాఠాలు మాత్రమే నేను నేర్చుకున్నాను. డాన్సు మాష్టరుకు కూడా అదేవిధమైన జాబు వ్రాశాను. ఫిడేల్ నేర్పే గురువుగారి దగ్గరికి ఫిడేలు పుచ్చుకొని వెళ్ళాను. ఎంత వస్తే అంతకు దీన్ని అమ్మివేయమని చెప్పాను. ఆయనతో అప్పటికే కొద్దిగా స్నేహం ఏర్పడింది. అందువల్ల నాకు కలిగిన మోహభ్రమల్ని గురించి ఆయనకు చెప్పాను. డాన్సుల జంజాటం నుండి నేను బయటపడటానికి ఆయన ఇష్టపడ్డాడు.
సభ్యుడు కావాలనే వ్యామోహం సుమారు మూడు మాసాల పాటు నన్ను వదలలేదు. అయితే ఆంగ్ల వేషానికి సంబంధించిన పటాటోపం మాత్రం కొన్ని సంవత్సరాల వరకు సాగింది. అయినా విద్యార్థిగా మారానని చెప్పవచ్చు.