సత్యశోధన/మొదటిభాగం/16. మార్పులు

వికీసోర్స్ నుండి

16. మార్పులు

ఆట పాటల్లో పడి నేను ఇష్టం వచ్చినట్లు కాలం గడిపానని ఎవ్వరూ తలంచవద్దు. అప్పుడు కూడా ఒళ్ళు తెలిసే వ్యవహరించానను విషయం పాఠకులు గ్రహించియే యుందురని భావిస్తున్నాను. కొంత ఆత్మశోధన జరిగిన తరువాతనే ఆ వ్యామోహం తొలగిపోయింది. నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క వ్రాశాను. ప్రతి చిన్న వ్యయం అనగా కారు ఖర్చు, తపాలా ఖర్చు, వార్తా పత్రికల నిమిత్తం వెచ్చించే ఒకటి రెండ పౌండ్లు మొదలుగా గల వాటినన్నింటిని, పుస్తకంలో వ్రాసి పడుకునే ముందు వాటిని సరిచూచుకునే వాణ్ణి. ఆ అలవాటు యిప్పటికీ నాకు వున్నది. దీనివల్ల అనేక ప్రయోజనాలు కలిగాయి. లక్షలాది రూపాయల ధర్మాదాయం నా చేతుల మీదుగా ఖర్చవుతూ వుండేది. శాఖోపశాఖలుగా అనేక విషయాలకు ధనం ఖర్చు పెడుతున్నా మితంగాను, సరిగాను ఖర్చు చేశాను. ప్రతిరోజు మిగులు చూపానే గాని, తగులు చూపలేదు. ఈ విషయం ప్రతివారు శ్రద్ధతో గమనించి తనకు వచ్చే ప్రతి పైసకి, తాను ఇచ్చే ప్రతి పైసకి లెక్క వ్రాసి పెడితే చివరికి నావలెనే తప్పక మేలు పొందగలరు. ఇది తథ్యం. ఎంతో జాగ్రత్తగా ఆదాయ వ్యయాలు వ్రాస్తూ వున్నందున ఖర్చు తగ్గించుకోవడం అవసరమని తెలుసుకోగలిగాను. పద్దు పుస్తకం చూచుకుంటే అందు బాడుగలు ఎక్కువగా కనిపించాయి. నేను ఒక కుటుంబంతో కలిసి వుంటున్నందున, వారికి ప్రతి వారం కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చింది. మర్యాద కోసం ఆ కుటుంబం వారితో కలిసి డిన్నర్లకు వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు ఖర్చు నేను భరించవవలసి వచ్చేది. అందుకు కారణం ఆ దేశంలో డిన్నర్లకు పిలిచిన ఆమె స్త్రీ అయితే పురుషుడే వ్యయం భరించాలి. ఆ కుటుంబం వారికి ప్రతివారం ఇచ్చే సొమ్ములో ఆ డిన్నరు ఖర్చు తగ్గించుకోరు. అదనంగా ఆ ఖర్చు భరించవలసిందే. లెక్కలు చూచాక ఈ ఖర్చు తగ్గించవచ్చునని తోచింది. ఈ విధంగా దుబారా ఖర్చు చేస్తున్నందున నేను ధనికుడననే అపోహ కూడా జనానికి కలుగుతున్నదని తోచింది.

ఈ కుటుంబంతో పాటు ఇక వుండకుండా ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకొని వుండాలని నిర్ణయించుకున్నాను. నేను చేయవలసిన పనులకు అనుకూలంగాను, సమీపంలోను వుండే చోటుకు మారాలని భావించాను. దానివల్ల అనుభవం గడించవచ్చునని అనుకున్నాను. పనివున్న చోటుకు తేలికగా గంటలో నడిచి వెళ్ళేందుకు వీలుగా దగ్గరలో గదులను అద్దెకు తీసుకున్నాను. అందువల్ల కార్ల బాడుగ వగైరా వ్యయం తగ్గింది. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళేవాణ్ణి. అందుకు బాడుగ క్రింద కొంత సొమ్ము ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు అది తగ్గింది. కాని నడిచి వెళ్ళాలంటే కొంత కాలం పడుతున్నది. ఈ విధంగా ప్రతిరోజు చాలా దూరం నడుస్తుండటం వల్ల నాకు జబ్బులు రాకపోవడమే గాక చాలావరకు శరీర దారుఢ్యత కూడా కలిగింది. నేను రెండుగదులు కిరాయికి తీసుకున్నాను. ఒకటి కూర్చునేందుకు, రెండవది పడుకునేందుకు, నేను చేసిన మార్పుల్లో ఇది రెండవ దశ అని చెప్పవచ్చు. మూడో మార్పు కూడా త్వరలోనే వస్తుంది. ఈ విధంగా ఖర్చు సగం తగ్గిపోయింది. కాని సమయమో! బారిష్టరు పట్టాకోసం ఎక్కువగా చదవవలసింది ఏమీ వుండదని తెలిసి ధైర్యం కలిగింది. కాని నా ఇంగ్లీషు భాషాజ్ఞానం సరిగాలేదు. అందుకు బాధగా ఉండేది. “బీ.ఏ. పూర్తి చేసుకో, ఆ తరువాత రా” అని శ్రీ లేలీగారు అన్న మాటలు గ్రుచ్చుకుంటున్నాయి, బారిష్టరు కావడం కోసం ఇంకా అదనంగా చదవాలి. ఆక్స్‌ఫర్డు కేంబ్రిడ్జి కోర్సులను గురించి తెలుసుకున్నాను. చాలామంది మిత్రుల్ని కలిశాను. అక్కడికి వెళితే ఖర్చు చాలా అవుతుందనీ, పైగా కోర్సు చాలా పెద్దదనీ, కాలం బాగా లాగుతుందని తెలిసింది. మూడు సంవత్సరాలకంటే మించి నేను ఇంగ్లాండులో వుండటానికి వీలులేదు. “నీవు పెద్దపరీక్ష ప్యాసవాలనుకుంటే లండను మెట్రిక్యులేషన్‌కు కూర్చో. అయితే బాగా కష్టపడవలసి వస్తుంది. సామాన్యజ్ఞానం బాగా పెరుగుతుంది. ఖర్చు ఏమీ వుండదు” అని ఒక మిత్రుడు చెప్పాడు. ఈ సలహా నాకు నచ్చింది. కాని కోర్సు చూచేసరికి భయం వేసింది. లాటిన్ మరియు మరో భాషా జ్ఞానం చాలా అవసరం. లాటిన్ తెలిసినవాడు లా గ్రంథాల్ని తేలికగా ఆర్థం చేసుకుంటాడు. అంతేగాక ‘రోమన్ లా’ పరీక్షయందు ఒక ప్రశ్న పత్రం పూర్తిగా లాటిన్ భాషలోనే వుంటుంది. లాటిన్ నేర్చుకున్నందువల్ల ఇంగ్లీషు భాష మీద మంచి పట్టు లభిస్తుంది. అని కూడా ఆ మిత్రుడు చెప్పాడు. ఆయన మాటల ప్రభావం నా మీద బాగా పడింది. కష్టమైనా, సులభమైనా లాటిన్ నేర్చుకోవలసిందేనని నిర్ణయానికి వచ్చాను. ఫ్రెంచి నేర్చుకోవడం అదివరకే ప్రారంభించాను. దాన్ని పూర్తి చేయాలి. అందువల్ల రెండో భాషగా ఫ్రెంచి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. ప్రైవేటుగా నడుస్తున్న ఒక మెట్రిక్యులేషన్ క్లాసులో చేరాను. ఆరు నెలలకు ఒక్క పర్యాయం పరీక్ష నడుస్తుంది. అయిదు మాసాల గడువు వున్నది. శక్తికి మించిన పని అని అనిపించింది. సభ్యుడు కావాలని కృషి చేస్తున్న నేను చివరికి కష్టపడి చదివే విద్యార్థిగా మారిపోయాను. టైంటేబులు తయారు చేసుకున్నాను. ఒక్కొక్క నిమిషం మిగుల్చుకోసాగాను. అయితే ఇతర విషయాలతో బాటు లాటిన్ మరియు ఫ్రెంచి భాషల్లో సైతం నైపుణ్యం సంపాదించగలంతటి బుద్ధి వికాసం నాకు కలగలేదు. పరీక్షకు కూర్చున్నాను. లాటిన్‌లో తప్పిపోయాను. విచారం కలిగింది. కాని అధైర్యపడలేదు. లాటిన్ విషయంలో ఆసక్తి పెరిగింది. సైన్సులో మరో విషయం తీసుకుందామని నిర్ణయించాను. రసాయన శాస్త్రం ఒకటి ఉంది. ఆ సబ్జక్టు మీద ఆసక్తి బాగా పెంచుకోవాలని భావించాను. కాని ప్రయోగాలకు అవకాశం లేనందున అది కుదరలేదు. ఇండియాలో రసాయన శాస్త్రం కూడా నేను చదివాను. అందువల్ల లండను మెట్రిక్ కోసం రసాయన శాస్త్రం చదవాలని భావించాను. ఈ పర్యాయం ‘వెలుగు, వేడి’ అను విషయాలు ఎన్నుకున్నాను. అది తేలికేనని అనిపించింది.

పరీక్ష కోసం తయారీ ప్రారంభించాను. దానితోపాటు జీవితంలో సరళత్వం తేవడం ఇంకా అవసరమని భావించాను. నా కుటుంబ బీద పరిస్థితులకు ఇక్కడి నా జీవనసరళి అనుగుణ్యంగా లేదని తెలుసుకున్నాను. మా అన్నయ్య బీదతనాన్ని ఆర్థికంగా అతడు పడుతున్న బాధను గురించి తలుచుకునేసరికి విచారం కలిగింది. కొందరికి విద్యార్థి వేతనం లభిస్తూ ఉండేది. నా కంటే సాదాగా జీవనం గడుపుతున్న విద్యార్థులు కూడా నాకు తటస్థపడ్డారు. అటువంటి చాలా మంది బీద విద్యార్థులతో నాకు పరిచయం ఏర్పడింది. ఒక బీద విద్యార్థి లండన్ నగరంలో “బీదమహల్” లో వారానికి రెండు షిల్లింగుల చొప్పున సొమ్ము చెల్లించి ఒక గదిలో ఉండేవాడు. లోకార్టులో వున్న చవుక కోకో దుకాణంలో రెండు పెన్నీలకు “కోకో, రొట్టె” తీసుకొని పొట్ట నింపుకునేవాడు. అతడితో పోటీపడగల శక్తి నాకు లేదు. అయితే రెండు గదులు ఎందుకు? ఒక్క గదిలో వుండవచ్చుకదా! ఒక పూట భోజనం స్వయంగా తయారు చేసుకుంటే నెలకు అయిదు లేక ఆరు పౌండ్లు మిగులుతాయి. సాదా జీవనసరళిని గురించి పుస్తకాలు చదివాను. రెండు గదులు వదిలి ఒక గది మాత్రమే అద్దెకు తీసుకున్నాను. వారానికి ఎనిమిది షిల్లింగులు చెల్లించాలి. ఒక కుంపటి కొన్నాను. ఉదయం భోజనం స్వయంగా చేసుకోసాగాను. ఇరవై నిమిషాల సమయం వంటకు పట్టేది. వరిగల సంకటికి, కోకో కోసం నీళ్లు వెచ్చ పెట్టడానికి అంతకంటే ఎక్కువ సమయం అనవసరం కదా! మధ్యాహ్నం పూట బయట భోజనం చేసేవాణ్ణి, సాయంత్రం మళ్ళీ కోకో తయారు చేసుకొని రొట్టెతో బాటు పుచ్చుకునేవాణ్ణి. ఈ విధంగా ఒకటి లేక ఒకటిం పావు షిల్లింగ్‌తో రోజూ పొట్టనింపుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కువ సమయం చదువుకు ఉపయోగించసాగాను. జీవనం సరళం అయిపోయినందున సమయం ఎక్కువ మిగిలింది. రెండో పర్యాయం పరీక్షకు కూర్చొని ప్యాసయ్యాను.

సాదాతనం వల్ల నా జీవితంలో నీరసం వచ్చిందని పాఠకులు భావించకుందురు గాక. ఈ విధమైన మార్పుల వల్ల నా అసలు జీవితానికీ, బాహ్య జీవితానికీ సరియైన సమన్వయం కుదిరింది. కుటుంబ పరిస్థితులకు అనుగుణ్యంగా నా నడవడికలో నా నిత్య వ్యవహారాలలో మార్పు వచ్చింది. జీవితం సత్యమయం అయింది. నాకు ఆత్మ తృప్తి కలిగింది.