సత్యశోధన/మొదటిభాగం/17. ఆహారంలో మార్పులు - ప్రయోగాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

17. ఆహారంలో మార్పులు - ప్రయోగాలు

నేను లోతుగా పరిశీలించసాగాను. బాహ్యాంభ్యంతరాలైన ఆచారాలు మార్చుకోవలసిన ఆవశ్యకత గోచరించింది. నిత్య వ్యవహారాలలోను, వ్యయం విషయంలోను మార్పు చేయడంతోపాటు ఆహారంలో కూడా మార్పులు ప్రారంభించాను. శాకాహారం గురించి పుస్తకాలు వ్రాసిన ఆంగ్ల రచయితలు నిశితంగా శోధన చేశారు. మత వైద్య ప్రకృతి శాస్త్రాల కనుగుణ్యంగా ఆచరణకు అనుకూలంగా లోతుగా పరిశీలించి వ్రాశారు, “మానవుడు జంతువులకంటే అధికుడు. అందువల్ల వాటిని కాపాడటం అవసరం. ఒక మనిషి మరో మనిషికి ఏవిధంగా సహాయం చేస్తాడో అదే విధంగా మిగతా ప్రాణులకు కూడా సహాయం చేయాలి” అని వ్రాసి అది మానవుని నైతిక ధర్మమని నిర్ధారించారు. మనిషి తినడానికి రుచే ప్రధానం కాదని, బ్రతకడానికేనని ప్రకటించి ఇది సత్యమని నిర్ధారించారు. ఆ గ్రంథ రచయితల్లో చాలామంది మాంసాన్నేగాక, గ్రుడ్లను పాలను కూడా నిషేధించారు. వారు స్వయంగా ఆ విధంగా నడుచుకున్నారు. కొందరు మానవశరీర నిర్మాణాన్ని బట్టి వండిన పదార్థాలు సరిపడవనీ, పళ్ళు వచ్చేవరకు పిల్లలకు తల్లిపాలు త్రాగించాలనీ, తరువాత పండ్లు ఫలాలు తినిపించాలని వ్రాశారు. వైద్యశాస్త్ర ప్రకారం ఊరగాయలు, పచ్చళ్ళు, పోపులు, మసాలాలు మొదలగు వాటిని పరిత్యజించాలని చెప్పారు. శాకాహారం అందరికీ అందుబాటులో వుంటుందనీ, ఖర్చు కూడా తక్కువ అవుతుందని నిర్ణయించారు. ఈ నాలుగు విషయాలు నా అనుభవంలోకి కూడా వచ్చాయి. శాకాహార భోజనశాలల్లో ఈ నియమాల్ని పాటించేవారిని చాలామందిని కలుసుకున్నాను. ఆంగ్లదేశంలో శాకాహార ప్రచార సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఒక వారపత్రికను ప్రకటిస్తున్నారు. నేను ఆ సంఘంలో చేరాను. ఆ పత్రికకు చందాదారుణ్ణి అయ్యాను. కొద్ది రోజులకే ఆ సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఎన్నికైనాను. శాకాహార నియమాన్ని నిష్టతో అమలుపరిచే చాలామంది ప్రముఖులతో నాకు పరిచయం కలిగింది. ఆహారం విషయంలో ప్రయోగాలు మొదలుపెట్టాను,

ఇంటి నుండి తెప్పించిన చిరుతిండ్లు, ఊరగాయలు తినడం మానివేశాను. మనస్సు మారినందున వాటిపై నాకు విరక్తి కలిగింది. వెనక రిచ్‌మండులో వున్నప్పుడు నా జిహ్వకు చప్పగా వున్న మసాలా లేని స్పెనక్ (బచ్చలి) ఇప్పుడు రుచిగా ఉంది. ఈ విధమైన ప్రయోగాలవల్ల ఆహార పదార్థాల రుచి విషయంలో మనస్సు ప్రధానం గాని, జిహ్వ కాదని తేలింది. ఆర్థిక దృష్టి కూడా నా విషయంలో బాగా పనిచేసింది. ఆ రోజుల్లో కొందరు కాఫీ, టీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని భావించి కోకో పుచ్చుకోవడం ప్రారంభించారు. నేను కూడా తిండి శరీర నిర్వహణకేనని నిశ్చయించి టీ, కాఫీలు మానివేసి కోకో పుచ్చుకోసాగాను.

శాకాహార భోజనశాలలో రెండు విభాగాలు ఉండేవి. ఒక విభాగంలో కావలసిన పదార్థాలు తిని, తిన్న పదార్థాలకు మూల్యం చెల్లించాలి. పూటకు మనిషికి రెండు షిల్లింగులు దాకా ఖర్చు అవుతుంది. ఈ విభాగానికి డబ్బు గలవాళ్ళు వెళతారు. రెండో విభాగంలో తొమ్మిది పెన్నీలకు ఒక రొట్టెముక్క. మరో మూడు పదార్థాలు పెడతారు. నేను ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నం ప్రారంభించినప్పటి నుండి రెండో విభాగంలోకే వెళ్ళి ఆహారం పుచ్చుకోవడం ప్రారంభించాను. ఈ ప్రయోగాలతో పాటు కొన్ని చిన్న ప్రయోగాలు కూడా ప్రారంభించాను. కొంత కాలం గంజి పదార్థాలు మానివేశాను. కొంతకాలం రొట్టె, పండ్లు మాత్రమే తింటూ వున్నాను. కొంతకాలం జున్ను, పాలు, గ్రుడ్లు పుచ్చుకుంటూ వున్నాను. ఈ చివరి ప్రయోగం పదిహేనురోజులకంటే మించి సాగలేదు. గంజిలేని పదార్థాలు తినాలని బోధించిన సంస్కర్త గ్రుడ్లు తినడం మంచిదని, అది మాంసాహారం కాదని సమర్థించాడు. గ్రుడ్లు తింటే జీవ జంతువులకు హానికలుగదు అని మొదట భావించాను. అందువల్ల కొంచెం కక్కుర్తి పడ్డాను. అయితే ఈ విధానం ఎక్కువ కాలం సాగలేదు. నా ప్రమాణానికి క్రొత్త వ్యాఖ్యానం ఎలా చెప్పను? ప్రమాణం చేయించిన మా అమ్మగారి ఉద్దేశ్యం నాకు తెలియదా? గ్రుడ్లు కూడా మాంసమనే మా అమ్మ ఉద్దేశ్యం. ఈ ప్రమాణంలో దాగియున్న సత్యం గ్రహించి వెంటనే గ్రుడ్లను, వాటికి సంబంధించిన ప్రయోగాల్ని విరమించుకున్నాను.

ఇంగ్లాండులో మాంసాన్ని గురించిన మూడు లక్షణాలు తెలుసుకున్నాను. మొదటి లక్షణం ప్రకారం పశు, పక్షుల మాంసమే మాంసం. ఈ లక్షణాన్ని గుర్తించిన శాకాహారులు అట్టి మాంసం త్యజించి చేపల్ని తినడం ప్రారంభించారు. ఇక గ్రుడ్లు కూడా పుచ్చుకునే వారిని గురించి చెప్పనవసరం లేదనకుంటాను. రెండవ లక్షణం ప్రకారం చేపల్ని కూడా తినకూడదు. కాని గ్రుడ్లు తినవచ్చు. ఇక మూడవ లక్షణం ప్రకారం సమస్త జీవజంతువుల మాంసం, వానివల్ల ప్రభవించే పదార్థాలు అంటే గ్రుడ్లు, పాలు మొదలైనవి కూడా మాంసం క్రింద లెక్కే. ఇందు మొదటి లక్షణం అంగీకరిస్తే నేను చేపలు కూడా తినవచ్చు. అయితే మా అమ్మ అభిప్రాయమే సరియైనదని నిర్ణయానికి వచ్చాను. ఆమె ఎదుట చేసిన ప్రయాణం ప్రకారం నేను గ్రుడ్లు కూడా తినకూడదు. అందువల్ల గ్రుడ్లు తినడం మానివేశాను. దీనివల్ల నాకు బాగా శ్రమ కలిగింది. సూక్ష్మంగా లోతుకు దిగి పరిశీలించి చూస్తే శాకాహారశాలల్లో లభించే చాల ఆహార పదార్థాలలో గ్రుడ్లు కలుస్తాయని తేలింది. అందువల్ల గ్రుడ్లు వాడిందీ లేనిదీ తెలుసుకోవడం కోసం వడ్డన చేసేవాణ్ణి పిలిచి అడగలవలసిన అవసరం కలిగింది. కేకుల్లోను, పుడ్డింగుల్లోను గ్రుడ్లు కలుస్తూ ఉండటం వల్ల అలా అడిగి తెలుసుకోవలసి వచ్చింది. దానితో ఇంకా కొన్ని చిక్కులు తొలిగాయి, సాదా పదార్థాలు మాత్రమే తినవలసిన ఆవశ్యకత ఏర్పడింది. నాలుక రుచి మరిగిన అనేక ఆహార పదార్థాలను మానుకోవలసి వచ్చింది, కష్టమనిపించింది. అయితే ఈ కష్టం క్షణికమేనని తేలింది. ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్ఛమైన, సూక్ష్మమైన, స్థిరమైన రుచి, నాలుక మరిగిన క్షణిక రుచి కంటే గొప్పదని తోచింది. అయితే అసలు పరీక్ష మరొకటి వుంది. చేసిన ప్రతిజ్ఞలో అదీ ఒక భాగమే. భగవంతుని రక్షణ పొందిన వాడికి ఎవ్వరూ చెరుపు చేయలేరు కదా!

ఈ ప్రకరణం ముగించేముందు ప్రతిజ్ఞ యొక్క అర్థాన్ని గురించి చెప్పడం అవసరమని భావిస్తున్నాను. మా అమ్మ ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ అలా నిలబడే ఉంది. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లనే ప్రపంచంలో చాలా అనర్థాలు కలుగుతూ ఉంటాయి. ప్రమాణ పత్రం ఎంత స్పష్టంగా వ్రాసుకోబడ్డా తమకు నప్పే విధంగా మాటలకు అర్థం చెబుతూనే ఉంటారు. స్వార్థం మనిషిని గ్రుడ్డివాణ్ణి చేస్తుంది. గోడమీద పిల్లివాటంగా మూలానికి అర్థాలు చెప్పి, ఆత్మ వంచన చేసుకుని, లోకాన్ని దైవాన్ని మోసగించే ప్రయత్నం చేస్తూ వుంటారు. అసలు ప్రమాణం చేసినవారు ప్రమాణం చేయించినవారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇది ఉత్తమ విధానం. రెండు అర్థాలు చెప్పుటకు వీలున్నచోట దుర్భలుడిమాట అంగీకరించడం మంచిది. ఈ రెండు పద్ధతుల్ని అనుసరించకపోతే కలహాలు, అనర్థాలు తప్పవు, సత్యపథం అనుసరించేవాడు ఉత్తమ పద్ధతినే అవలంబించాలి. క్రొత్త అర్థాలు తీసే విద్యావంతులతో అతనికి పని ఉండకూడదు. మాంసానికి సంబంధించినంతవరకు మా అమ్మ ఉద్దేశ్యమే నాకు ప్రధానం. ఇందు నా అనుభవానికిగాని, పాండిత్య గర్వానికిగాని తావులేదు.

ఇంగ్లాండులో ఆర్థిక దృష్టితోను, ఆరోగ్య దృష్టితోను నా పరిశోధనలు జరిగాయి. దక్షిణాఫ్రికాకు వెళ్ళక పూర్వం ఈ విషయమై పరిశోధించలేదు. కాని ఆ తరువాత బాగా పరిశోధనలు చేశాను. ఆ వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలుపుతాను. ఏది ఏమైనా ఆహారం విషయమై ప్రయోగాల బీజం ఇంగ్లాండులోనే నా హృదయంలో పడింది. అసలు మొదటినుండీ మతంలో వున్న వాళ్ళకంటే క్రొత్తగా మతంలో చేరినవాళ్ళకు ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండులో శాకాహార విధానం సరిక్రొత్త, నాకూ అది అంతే. మొదట మాంసాహారం మంచిదని నేను నమ్మేవాణ్ణి. కాని తరువాత శాకాహారంలోనికి మారాను. నాకు అబ్బిన ఈ క్రొత్త శాకాహార ప్రవేశానుభవంతో నేను నివసిస్తున్న బేసువాటర్‌పేటలో ఒక శాకాహార క్లబ్బు పెట్టదలచి, అక్కడ కాపురం వున్న సర్ ఎడ్విన్ ఆర్నాల్డుగారిని ఉపాధ్యాక్షునిగా వుండమని కోరాను. వెజిటేరియన్ పత్రికా సంపాదకుడు ఓల్డ్ ఫీల్డు గారు అధ్యక్షులు. నేను కార్యదర్శిని. కొంతకాలం ఆ క్లబ్బు బాగా నడిచింది. కాని ఆ తరువాత కొద్దినెలలకు మూతబడింది. నేను కొద్దికాలం తరువాత మరో చోటుకి బస మార్చుకుంటూ వుండేవాణ్ణి. ఆ ప్రకారం ఆ ప్రదేశాన్నుండి నా నివాసాన్ని మార్చాను. కాని ఈ కొద్ది అనుభవం కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారంలోకి తేగల శక్తి నాకు ప్రసాదించింది.