సత్యశోధన/మొదటిభాగం/8. దొంగతనం - ప్రాయశ్చిత్తం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

8. దొంగతనం - ప్రాయశ్చిత్తం

మాంసభక్షణ ప్రారంభించిన కాలంనాటి మరికొన్ని దోషాలు కూడా వివరించవలసినవి వున్నాయి. అవి నా వివాహం కాకపూర్వం నాటివి, ఆ తరువాతవి కూడా.

నా ఒక బంధువు సావాసంలోపడి సిగరెట్టు తాగాలని నాకు సరదా కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు, సిగరెట్టు త్రాగితే కలిగే ప్రయోజనం ఏమిటో, దాని వాసనలో గల మజా ఏమిటో మా యిద్దరిలో ఎవ్వరికీ తెలియదు. కాని పొగ ఊదుతూ వుంటే మజాగా వుండేది. మా పినతండ్రికి ఆ అలవాటు వున్నది. ఆయన, మరో కొంతమంది పొగపీల్చి సుతారంగా బయటికి వదులుతూ వుండటం చూచి మాకు కూడా ఒక దమ్ము లాగుదామునే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పినతండ్రి కాల్చిపారేసిన సిగరెట్టు ముక్కలు ఏరి కాల్చడం ప్రారంభించాము. అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు. దొరికినా ఎక్కువ పొగ వచ్చేది కాదు. అందువల్ల నౌకర్ల డబ్బు దొంగిలించి బీడీలు కొనడం ప్రారంభించాము. అయితే వాటిని ఎక్కడ దాచడమా అను సమస్య వచ్చింది. పెద్దవాళ్ళ ముందు ఎలా కాల్చడం? అందువల్ల దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా త్రాగడం ప్రారంభించాం. కొన్ని మొక్కల కాడలకు (పేరు జ్ఞాపకం లేదు) సన్నని బెజ్జాలు వుంటాయనీ, వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చనీ విన్నాము. దీనితో మాకు తృప్తి కలుగలేదు. మా పారతంత్ర్యాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాము. పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాము. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నాము. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవడం? విషం ఎలా దొరుకుతుంది? ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము. వాటి కోసం వెతుక్కుంటూ అడవికి వెళ్ళి వాటిని తెచ్చాము. సాయంకాలం వాటిని తినాలని ముహూర్తం నిర్ణయించుకున్నాం. కేదారేశ్వరుని దేవాలయానికి వెళ్ళి, దీపం ప్రమిదలో నెయ్యి పోశాం. దైవదర్శనం చేసుకున్నాం. మారుమూల వున్న చోటుకోసం వెతికాం. అయితే వెంటనే ప్రాణం పోకపోతే? చస్తే ఏమి లాభం? ఏమి సాధించినట్లు? స్వాతంత్ర్యం లేకుండా బ్రతకకూడదా? ఈ రకమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి రెండు మూడు ఉమ్మెత్తగింజలు మ్రింగివేశాము. తరువాత సాహసించలేకపోయాము. మాయిద్దరికీ చావంటే భయం వేసింది. కుదుటపడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు రామమందిరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య చేసుకోవడం తేలిక వ్యవహారం కాదని అప్పుడు నాకు బోధపడింది. అప్పటినుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని అంటే నాకు వాళ్ళ మాటమీద విశ్వాసం కలుగకుండా పోయింది.

ఈ ఆత్మహత్యా సంకల్పం మాకు మరో విధంగా తోడ్పడింది. సిగరెట్టు పీకలకు ఒక సలాం చేసేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా వుండేందుకు ఎంతగానో సహకరించింది.

పెరిగి పెద్దవాడినైన తరువాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎన్నడూ నాకు కలుగలేదు. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అను నిశ్చయానికి వచ్చాను.

ప్రపంచంలో సిగరెట్ల కోసం యింత మోజెందుకో నాకు అర్థం కాదు. పొగ త్రాగేవాళ్ళతో రైలు ప్రయాణం నేను చేయలేను, నాకు ఊపిరాడదు.

అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఏండ్ల వయస్సులో (అంతకంటే తక్కువ వుండవచ్చు) మొదట సిగరెట్లకోసం డబ్బులు దొంగిలించాను. తరుపోత 15వ ఏట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి వుండే బంగారుమురుగు నుండి కొంచెం బంగారం దొంగిలించాము, మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు మురుగు వుంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు. తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది. ఏది ఏమైనా దోషం అంగీకరిస్తేనే బుద్ధి కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా పరవాలేదని భావించాను.

చివరికి ఒక చీటీ మీద చేసిన తప్పంతా వ్రాసి క్షమించమని ప్రార్థించాలి అను నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను. వెళ్ళి మా తండ్రిగారికి యిచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగినవిధంగా శిక్షించమని, యిక ముందు దొగతనం చేయనని శపధం చేశాను. ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి యిస్తున్నప్పుడు వణికి పోయాను. మా తండ్రి భగందర రోగంతో బాధపడుతూ మంచం పట్టి వున్నారు. ఆయన బల్లమీద పడుకుని వున్నారు. చీటీ వారిచేతికి యిచ్చి ఎదురుగా నిలబడ్డాను.

వారు చీటీ అంతా చదివారు. వారి కండ్ల నుండి ముత్యాలవలె కన్నీరు కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషము సేపు కండ్లు మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. నాకు కూడ ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే ఈ రోజున కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కండ్లకు కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాశృవులు నా హృదయాన్ని కడిగివేశాయి. అనుభవించిన వారికే ఆ ప్రేమ బోధపడుతుంది.

“రామబాణ్ వాగ్యాంరే హొయ్ తే జేణే” రామబాణం మహిమ ఆ బాణం తగిలిన వాడికే తెలుస్తుంది. అని దాని అర్థం. ఆ ఘట్టం నాకు మొదటి అహింసా పాఠం అయింది. పితృవాత్సల్యం అంటే ఏమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కాని ఈనాడు ఆలోచిస్తే అదంతా అహింస మహిమేనని అనిపిస్తుంది. అట్టి అహింస అంతటా వ్యాప్తమైనప్పుడు దాని స్పర్శ తగలకుండా వుండదు. అహింసా శక్తి అమోఘం. అంతటి శాంతం ఓర్పు వాస్తవానికి మా తండ్రి స్వభావానికి విరుద్ధం. ఆయన కోప్పడతారనీ, దూషిస్తారనీ లేక తల బ్రద్దలు కొట్టుకుంటారనీ భావించాను. కాని ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. అందుకు కారణం దోషాన్ని అంగీకరించడమేనని నా విశ్వాసం. మళ్లీ యీ విధమైన దోషం చేయను అని శపథం చేశాను. దాని అర్థం గ్రహించగలవారి ముందు వుంచాను. ఆదే సరియైన ప్రాయశ్చిత్తమని నా అభిప్రాయం. నేను దోషం అంగీకరించి యిక చేయనని శపథం చేసినందువల్ల మా తండ్రి నన్ను విశ్వసించారు. వారికి నా మీద వాత్సల్యం ఇనుమడించిందని నాకు బోధపడింది.