సత్యశోధన/మొదటిభాగం/7. దుఃఖకరమైన ప్రకరణం - 2

వికీసోర్స్ నుండి

7. దుఃఖకరమైన ప్రకరణం - 2

నిర్ణయించిన రోజు రానే వచ్చింది. ఆనాటి నా స్థితిని గురించి వర్ణించలేను. ఒకవైపు సంస్కరణాభిలాష. మరోవైపు జీవితంలో గొప్ప మార్పు వస్తుందనే భావం. యింకోవైపు దొంగలా చాటుగా యీ పని చేస్తున్నాననే బిడియం, బాధ. వీటిలో ప్రాధాన్యం దేనిదో చెప్పలేను. ఏకాంత ప్రదేశం దొరికింది. అక్కడ జీవితంలో మొదటిసారి మాంసం చూచాను. నాన్‌రొట్టె కూడా తెచ్చాం. రెండిటిలో ఒక్కటి కూడా రుచించలేదు. మాంసం తోలులా బిరుసుగా వుంది. మింగడం సాధ్యం కాలేదు. కక్కు వచ్చినంత పని అయింది. మాంసం పరిత్యజించవలసి వచ్చింది.

ఆ రాత్రి కష్టమైపోయింది. ఏవేవో పీడకలలు రాసాగాయి. కన్నుమూతబడేసరికి నా కడుపులో బ్రతికియున్న మేక ‘మే మే’ అని అరిచినట్లనిపించడం, త్రుళ్ళిపడి లేవడం, ఇష్టపడే మాంసం తిన్నాను గదా అని ఊరట చెందడం, యిదీ వరస.

నా మిత్రుడు అంతటితో నన్ను వదలలేదు. మాంసంతో రకరకాల పాకాలు వండి తేవడం ప్రారంభించాడు. నదీతీరాన తినడం మాని గొప్ప భవనంలో తినడం ప్రారంభించాము. భోజనశాలలో మేజా బల్లలు. కుర్చీలు, అన్నీ వున్నాయి. అక్కడి వంటవాణ్ణి మంచి చేసుకుని మిత్రుడు ఆ దివ్య భవనంలో స్థానం సంపాదించాడు.

మిత్రుని ప్లాను బాగా పనిచేసింది. నాన్‌రొట్టెమీద నాకు రోత పోయింది. మేకల మీద జాలి గూడా తగ్గిపోయింది. వట్టి మాంసం కాకుండ, మాంసంతో తయారుచేసిన రకరకాల పాకాలు తినసాగాను. యీ విధంగా ఒక సంవత్సరం గడిచింది. మొత్తం ఆరు మాంసపు విందులు ఆరగించాను. తక్కువసార్లు తినడానికి కారణం ఆ రాజభవనం మాటిమాటికీ దొరక్కపోవడమే. రుచిగల మాంసపు వంటకాలు మాటిమాటికీ సిద్ధం చేయడం కూడా కష్టమే. పైగా యీ సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన సొమ్ము నా దగ్గర లేదు. మిత్రుడే డబ్బు తెచ్చి ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఎక్కడనుండి అంత డబ్బు తెచ్చేవాడో తెలియదు. నన్ను మాంసాహారిగా మార్చాలని, భ్రష్టుణ్ణి చేయాలని దీక్ష వహించినందున మిత్రుడే డబ్బు ఖర్చు పెడుతూ వుండేవాడు. అతనికి మాత్రం మాటిమాటికీ అంత డబ్బు ఎట్లా లభిస్తుంది? అందువల్ల మా మాంసాహార విందుల సంఖ్య తగ్గిపోయింది.

దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత నాకు ఆకలి వేసేది కాదు. యింటికి వచ్చి ఆకలి లేదని చెప్పవలసి వచ్చేది. మా అమ్మ అన్నానికి పిలిచేది. ఆకలి లేదంటే కారణం అడగకుండా వూరుకునేది కాదు “అన్నం అరగలేదు ఆందువల్ల ఆకలి కావడం లేదని” అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఈ విధంగా అబద్ధాలు చెబుతున్నప్పుడు బాధగా వుండేది. అమ్మకు అబద్ధం చెబుతున్నాను అని కుమిలిపోయేవాణ్ణి. మా బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే మా తల్లిదండ్రుల గుండెలు బ్రద్దలైపోతాయని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ తలుచుకుని బాధపడుతూ వుండేవాణ్ణి.

మాంసభక్షణను గురించి హిందూదేశంలో ప్రచారం చేయడం ఎంతో అవసరం అన్నమాట నిజమే. కాని తల్లిదండ్రుల్ని మోసగించడం, వారికి అబద్ధం చెప్పడం సబబా? అందువల్ల వారు జీవించియున్నంతవరకు ఇక మాంసం తినకూడదు. నేను పెద్దవాణ్ణి అయిన తరువాత బహిరంగంగా తింటాను. ఈ లోపల మాంసభక్షణ విరమించి వేస్తాను అను నిర్ణయానికి వచ్చాను.

నా యీ నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాను. తమ కొడుకులిద్దరూ మాంసాహారులైనారను విషయం మా తల్లిదండ్రులకు తెలియదు. మా తల్లిదండ్రుల ముందు అబద్ధాలాడకూడదని నిర్ణయించుకొని మాంసభక్షణ మానివేశానే కాని నా ఆ మిత్రుని సావాసం మాత్రం నేను మానలేదు. యితరుల్ని సంస్కరించాలనే కోరిక నన్ను నిలువునా ముంచి వేసింది. చివరకు ఆ సావాస ఫలితం యింతగా హానికారి అవుతుందని నేను అప్పడు ఊహించలేదు.

అతని స్నేహం నన్ను వ్యభిచార రంగంలోకి కూడా దింపేదే. కాని తృటిలో ఆ ప్రమాదం తప్పిపోయింది. ఒకరోజున అతడు నన్ను ఒక వేశ్య యింటికి తీసుకొనివెళ్ళాడు. కొన్ని వివరాలు చెప్పి నన్ను వేశ్య గదిలోకి పంపాడు. అవసరమైన ఏర్పాట్లు అదివరకే అతడు చేశాడు. యివ్వవలసిన సొమ్ము అదివరకే యిచ్చివేశాడు, నేను పాపపు కోరల్లో చిక్కుకుపోయాను. కాని భగవంతుడు నన్ను రక్షించాడు. ఆ పాపపు గుహలో నాకు కండ్లు కనబడలేదు, నోటమాట రాలేదు. పరుపు మీద నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను. నా నోరు మూసుకుపోయింది. ఆమె చాలాసేపు ఓపిక పట్టింది. యిక పట్టలేక తిట్టడం ప్రారంభించింది. ద్వారం చూపించి వెళ్ళిపొమ్మంది. నా మగతనానికి అవమానం  కలిగినట్లనిపించింది. సిగ్గుపడిపోయాను. భూమి తనలో నన్ను ఇముడ్చుకోకూడదా అని అనిపించింది. అయితే ఆ ఆపద నుండి నన్ను రక్షించినందుకు భగవంతుణ్ణి ప్రార్ధిస్తూవున్నాను. నా జీవితంలో ఇటువంటి ఘట్టాలు నాలుగు పర్యాయాలు జరిగాయి. అదృష్టం వల్ల వాటి నుండి బయటపడ్డాను. నా ప్రయత్నం కంటే నా అదృష్టమే తోడ్పడిందని చెప్పవచ్చు. యివన్నీ తప్పుడు పనులే. నా పతనానికి కారణం విషయవాంఛలే. ఈ వ్యవహారంలో అవే ఎక్కువగా పనిచేశాయి. నేను వాటికి లొంగిపోయాను. నిజానికి క్రియ ఎట్టిదో, అందుకు తోడ్పడే భావం కూడా అట్టిదే. కాని లౌకిక దృష్టితో చూస్తే నేను నిర్దోషిని. దేవుని అనుగ్రహం వల్ల కర్తకు, అతనికి సంబంధించిన వారికి తప్పిపోయే కర్మలు కొన్ని వుంటాయి. ఆ విధంగా ఆపద తప్పిపోయిన తరువాత జ్ఞానం కలిగిన వెంటనే దేవుని అనుగ్రహాన్ని గురించి మానవుడు యోచిస్తాడు. మనిషి వికారాలకు లోనవడం అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా భగవంతుడు అడ్డుపడి ఆ వికారాల్ని తొలగించి మనిషిని రక్షిస్తూ వుండటం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఎలా జరుగుతున్నది? మానవుడు ఎంతవరకు స్వతంత్రుడు? ఎంతవరకు పరతంత్రుడు? పురుష ప్రయత్నం ఎంతవరకు పనిచేస్తుంది? భగవదేచ్ఛ ఎప్పుడు రంగంలో ప్రవేశిస్తుంది? యిది పెద్ద వ్యవహారం.

ఇక విషయానికి వద్దాం. యింత జరిగినా నా స్నేహితుని దుస్సాంగత్యాన్ని గురించి నా కండ్లు మూసుకొనే వున్నాయి. ఊహించి యెరుగని అతని దోషాలు ప్రత్యక్షంగా యింకా నేను చూడలేదు. అతని దోషాల్ని కండ్లారా చూచినప్పుడు కాని నా కండ్లు తెరుపుడుపడలేదు. అప్పటివరకు ఆ దోషాలు అతనిలో లేవనే భావించాను. వాటిని గురించి తరువాత వివరిస్తాను.

అప్పటి మరో విషయం వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. మా దంపతుల మధ్య ఏర్పడిన విభేదాలకు జరిగిన కలహాలకు కారణం కూడా అతడి స్నేహమే. మొదటే వ్రాశాను నేను నా భార్య యెడ మిక్కిలి ప్రేమ కలవాణ్ణని. దానితోపాటు ఆమె యెడల నాకు అనుమానం కూడా ఏర్పడింది. యిందుకు కారణం ఆ స్నేహమే. మిత్రుడు చెప్పిన మాటల్ని నిజాలని పూర్తిగా నమ్మాను. మిత్రుని మాటలు నమ్మి నా భార్యను కష్టాలపాలు చేశాను. నేను ఆమెను హింస పెట్టాను. అందుకు నన్ను నేను క్షమించుకోలేను. యిలాంటి కష్టాలు హిందూస్త్రీయే సహిస్తుంది. అందువల్లనే స్త్రీని నేను ఓర్పుకు, సహనశక్తికి ప్రతీక అని భావిస్తాను. నౌకరును అపోహతో అనుమానిస్తే అతడు ఉద్యోగం మానుకొని వెళ్ళిపోతాడు. కన్నకొడుకుని అవమానిస్తే ఇల్లు వదలి  వెళ్ళిపోతాడు. స్నేహితులలో అనుమానం పెరిగితే స్నేహం దెబ్బతింటుంది. భర్త మీద అనుమానం కలిగితే లోలోన భార్య కుమిలిపోవలసిందే. కాని భార్య మీద భర్తకు అనుమానం కలిగితే పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎక్కడికి వెళుతుంది? పెద్ద కులాలకు చెందిన హిందూ స్త్రీ కోర్టుకెక్కి విడాకులు కోరగల స్థితిలో కూడా లేదు. యీ విధంగా స్త్రీ విషయంలో న్యాయం ఏకపక్షంగా వున్నది. నేను కూడా అట్టి న్యాయాన్నే అనుసరించాను. అందువల్ల కలిగిన దుఃఖం ఎన్నటికీ పోదు. అహింసను గురించి పూర్తి జ్ఞానం కలిగిన తరువాతే అనుమాన ప్రవృత్తి నాలో తగ్గింది. అంటే బ్రహ్మచర్య మహత్తు నేను తెలుసుకున్న తరువాత, భార్య, భర్తకు దాసి కాదనీ, అతడి సహచారిణి అనీ, సహధర్మచారిణి అనీ యిద్దరూ సుఖదుఃఖాలలో సమాన భాగస్వాములనీ, మంచి చెడులు చూచే స్వాతంత్ర్యం భర్తకు వున్నట్లే భార్యకు కూడా వున్నదనీ నేను తెలుసుకోగలిగాను. తరువాతనే అనుమాన ప్రవృత్తి తొలగిపోయింది. అనుమానంతో నేను వ్యవహరించిన కాలం జ్ఞాపకం వచ్చినప్పుడు నా మూర్ఖత్వం, విషయవాంఛల ప్రభావం వల్ల కలిగిన నిర్ధాక్షిణ్యం మీద నాకు కోపం వస్తుంది. మిత్రుని మీద కలిగిన మోహాన్ని తలుచుకున్నప్పుడు నా మీద నాకే జాలి కలుగుతుంది.