సత్యశోధన/మొదటిభాగం/6. దుఃఖకరమైన ప్రకరణం - 1

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search6. దుఃఖకరమైన ప్రకరణం - 1

హైస్కూల్లో వేరు వేరు సమయాల్లో నాకు యిద్దరు స్నేహితులు వుండేవారు. వారిలో ఒకడితో మైత్రి ఎక్కువకాలం సాగలేదు. నేను మాత్రం ఆ మిత్రుణ్ణి పరిత్యజించ లేదు. మరొకనితో నేను స్నేహంగా వుండటం యిష్టం లేక అతడు నన్ను వదిలివేశాడు. యిక రెండోవానితో స్నేహం చాలా కాలం సాగింది. అది ఎంతో దుఃఖకరమైన ప్రకరణంగా మారింది. అతణ్ణి సంస్కరించాలనే భావంతో నేను అతనితో స్నేహం చేశాను

అతడు మొదట మా రెండో అన్నయ్యకు మిత్రుడు. వాళ్ళిద్దరూ సహాధ్యాయులు. అతనిలో కొన్ని దోషాలు వున్నాయి అని నాకు తెలుసు. అయినా అతడు విశ్వసనీయుడనే భావించాను. మా అమ్మ, పెద్దన్నయ్య, నా భార్య కూడా యీ చెడు సహవాసం వద్దని హెచ్చరించారు. అభిమానం గల భర్తనైన నేను భార్య మాటల్ని పాటిస్తానా? కాని మా అమ్మ, పెద్దన్నయ్య మాటల్ని వినడం తప్పనిసరి. “మీరు చెప్పిన దోషాలు అతనిలో వున్నవూట నిజమే. కాని అతనిలోగల సుగుణాలు మీకు తెలియవు. అతడు నన్ను చెడగొట్టలేడు. మంచిదారికి తీసుకొని వచ్చేందుకే అతనితో స్నేహం చేస్తున్నాను. తన దోషాల్ని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు. అందుకే అతనితో చేతులు కలిపాను. నన్ను గురించి మీరు విచారపడవద్దు” అని అమ్మకు, పెద్దన్నయ్యకు నచ్చజెప్పాను. నా మాటలు మా వాళ్ళకు నచ్చాయని అనలేను కాని యిక వాళ్ళు నన్నేమీ అనలేదు. నాదారిన నన్ను పోనిచ్చారు.

తరువాత నాదే పొరపాటని తేలింది. యితరుల్ని సంస్కరించడం కోసం మరీ లోతుకు పోకూడదని గ్రహించాను. స్నేహంలో అద్వైత భావం వుంటుంది. సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది, నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం. అసలు అతి స్నేహం పనికిరాదని నా అభిప్రాయం. సామాన్యంగా మనిషి సుగుణాల కంటే దుర్గుణాల్నే త్వరగా గ్రహిస్తాడు. ఆత్మీయమైత్రిని, భగవంతుని మైత్రిని కోరుకునేవాడు ఏకాకిగా వుండాలి. లేదా ప్రపంచమంతటితో స్నేహంగా వుండాలి. యీ నా అభిప్రాయాలు సరైనవో, కాదో తెలియదు. కాని నా ఆ స్నేహప్రయత్నం మాత్రం ఫలించలేదు.

ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు రాజకోటలో సంస్కరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నది. మా ఉపాధ్యాయుల్లో చాలామంది చాటుగా మద్యమాంసాలు సేవిస్తున్నారని ఆ స్నేహితుడు నాకు చెప్పాడు. సుప్రసిద్ధులైన రాజకోటకు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు. అట్టివారిలో హైస్కూలు వాళ్ళు కూడా కొంతమంది వున్నారని చెప్పాడు.

ఇదంతా నాకు వింతగా తోచింది. తరువాత బాధ కూడా కలిగింది. వాళ్ళు, అలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. “మనం మాంసం తినం. అందువల్ల మనజాతి దుర్భలమై పోయింది. తెల్లవాళ్ళు మాంసభోజులు. అందువల్లనే వాళ్ళు మనల్ని పరిపాలించగలుగుతున్నారు. నన్నుచూడు. బలశాలిని. చాలా దూరం పరిగెత్తగలను. ఈ విషయం నీకు తెలుసు. నేను మాంసాహారి కావడమే అందుకు కారణం. మాంసాహారులకు కురుపులు లేవవు, గ్రంధులు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా వెంటనే మానిపోతాయి. మన ఉపాధ్యాయులు, రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు. వాళ్ళు మాంసం ఎందుకు తింటున్నారనుకుంటున్నావు? మాంసం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వాళ్ళకు బాగా తెలుసు. నువ్వు కూడా వారిలాగే మాంసం తిను. కృషితో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మాంసం తిని చూడు నీకే తెలుస్తుంది. ఎంత బలం వస్తుందో అని నన్ను ప్రోత్సహించాడు.

ఇవి అతడు ఒక్క పర్యాయం చెప్పిన మాటలు కావు. అనేక పర్యాయాలు సమయాన్ని, సందర్భాన్ని బట్టి అతడు చెప్పిన మాటల సారం. మా రెండో అన్నయ్య యిది వరకే అతని మాటల్లో పడిపోయాడు. పైగా ఆ స్నేహితుని వాదనను సమర్ధించాడు కూడా. ఆ మిత్రుని ముందు, మా రెండో అన్నయ్య ముందు నేను దోమ వంటివాణ్ణి. వాళ్ళిద్దరూ బలిష్టులు. దృఢగాత్రులు. నా స్నేహితుని పరాక్రమం చూచి నివ్వెరపోయాను. ఎంత దూరమైనా సరే రివ్వున పరుగెత్తగలడు. ఎత్తు మరియు దూరం దూకడంలో అతడు మేటి. ఎన్ని దెబ్బలు కొట్టినా కిమ్మన్నడు. సహిస్తాడు. తరచుగా తన పరాక్రమాన్ని నా ముందు ప్రదర్శిస్తూ వుండేవాడు. తనకు లేని శక్తులు యితరుల్లో చూచి మనిషి ఆశ్చర్యపడడం సహజం. అందువల్ల నేను అతగాణ్ణి చూచి ఆశ్చర్యపోయేవాణ్ణి. అతని వలె బలశాలి కావాలని ఆశ నాకు కలిగింది. నేను దూకలేను. పరిగెత్తలేను. అతనిలా దూకాలి, పరిగెత్తాలి అనుకోరిక నాకు కలిగింది.

నేను పిరికివాణ్ణి. దొంగలన్నా, దయ్యాలన్నా, తేళ్ళన్నా, పాములన్నా నాకు భయం. రాత్రిళ్ళు గడపదాటాలంటే భయం. చీకట్లో ఎక్కడికీ పోలేను. ఒక దిక్కునుండి దయ్యాలు వచ్చి మ్రింగివేస్తాయని, మరోదిక్కు నుండి పాములు వచ్చి కరిచి వేస్తాయని భయం వేసేది. గదిలో దీపం లేకుండా పడుకోలేను. నా ప్రక్కనే పడుకొని నిద్రిస్తున్న యౌవనదశలోనున్న నా భార్యకు నా భయం గురించి ఎలా చెప్పను? నా కంటే ఆమెకు ధైర్యం ఎక్కువ అని నాకు తెలుసు. నాలో నేను సిగ్గుపడ్డాను. ఆమెకు పాములన్నా, దయ్యాలన్నా భయం లేదు. చీకట్లో ఎక్కడికైనా నిర్భయంగా వెళుతుంది. ఈ విషయాలన్నీ నా స్నేహితునికి తెలుసు. “పాముల్ని చేత్తో పట్టుకుని ఆడిస్తా. దొంగల్ని తరిమికొడతా, దయ్యాల్ని లెక్క చెయ్యను” అంటూ వుండేవాడు. అది అంతా మాంసాహార ప్రతాపమేనని తేల్చేవాడు.

ఆ రోజుల్లో నర్మదకవి వ్రాసిన క్రింది గుజరాతీ పాట పిల్లలంతా పాడుతూ వుండేవారు.

“అంగ్రేజో రాజ్యకరే, దేశీరహే దబాయీ
  దేశీరహేదబాయి జోనే బేనాం శరీర్ భాయీ
  పేలో పాంచ్ హాథ్ పూరో, పూరో పాంచ్‌సే సే

(దేశీయులను దద్దమ్మలుగా చేసి ఆంగ్లేయులు రాజ్యం చేస్తున్నారు. యిద్దరి శరీరాల్ని పరికించి చూడు. మన అయిదువందల మందికి అయిదు అడుగుల ఆంగ్లేయుడొక్కడు చాలు)

వీటన్నిటి ప్రభావం నా మీద బాగా పడింది. మాంసాహారం మంచిదని అది నాకు బలం చేకూర్చి, వీరుణ్ణి చేస్తుందని, దేశ ప్రజలంతా మాంసం తింటే తెల్లవాళ్ళను జయించవచ్చుననే విశ్వాసం నాకు కలిగింది. మాంసభక్షణకు ముహూర్తం నిర్ణయమైంది. అది రహస్యంగా జరగాలి అనే నిర్ణయానికి వచ్చాం. గాంధీ కుటుంబాలవారిది వైష్ణవ సంప్రదాయం. మా తల్లిదండ్రులు పరమవైష్ణవులు. వాళ్ళు ప్రతిరోజు దేవాలయం వెళతారు. మా కుటుంబంలో ప్రత్యేకించి ప్రతి విషయంలో ఆ సంప్రదాయ ఆధిక్యత మెండు. జైనులు, వైష్ణవులు మాంసభక్షణకు పూర్తిగా వ్యతిరేకులు. అంతటి మాంస వ్యతిరేకత హిందూదేశంలో గాని, మరో దేశంలోగాని గల యితర సంప్రదాయాల వాళ్ళకు లేదని చెప్పవచ్చు. యిది పుట్టుకతో వచ్చిన సంప్రదాయ సంస్కారం.

నేను నా తల్లిదండ్రుల పరమభక్తుణ్ణి. నేను మాంసం తిన్నానని తెలిస్తే వాళ్ళ స్థితి ఏమవుతుందో నాకు తెలుసు. అప్పటికే సత్యనిరతి నాలో అధికంగా వుంది. నేను మాంసభక్షణ ప్రారంభిస్తే నా తల్లిదండ్రుల్ని మోసం చేయవలసి వస్తుందను విషయం నాకు తెలుసు. అట్టి స్థితిలో మాంసం తినడం ఎంత భయంకరమైన విషయమో వేరే చెప్పనక్కరలేదు. కాని నా మనస్సంతా సంస్కారదీక్ష మీద కేంద్రీకృతమైంది. నేను మాంసం తింటున్నది రుచి కోసం కాదు. మాంసం రుచిగా వుంటుందని నాకు తెలియదు. నాకు బలం కావాలి. పరాక్రమం కావాలి. నా దేశ ప్రజలంతా పరాక్రమ వంతులు కావాలి. అప్పుడు తెల్లవాళ్ళను జయించి హిందూ దేశాన్ని స్వతంత్ర్యం చేయవచ్చు. ఇదే నా కోరిక. స్వరాజ్యం అను శబ్దం అప్పటికి నా చెవిన పడలేదు. కాని స్వతంత్ర్యం అంటే ఏమిటో నాకు తెలుసు. సంస్కారపు పిచ్చి నన్ను అంధుణ్ణి చేసింది. రహస్యంగా మాంసభక్షణం చేసి, తల్లిదండ్రులకు యీ విషయం తెలియనీయకుండా రహస్యంగా వుంచాలి. యిలా చేయడం సత్యపథాన్నుండి తొలగడం కాదనే నమ్మకం నాకు కలిగింది.