Jump to content

సత్యశోధన/మొదటిభాగం/5. హైస్కూల్లో

వికీసోర్స్ నుండి

5. హైస్కూల్లో

పెండ్లి జరిగినప్పుడు నేను హైస్కూల్లో చదువుతూ వున్నానని ముందే వ్రాశాను. మేము ముగ్గురు సోదరులం ఒకే హైస్కూల్లో చేరి చదువుతున్నాము. మా పెద్దన్నయ్య పెద్ద తరగతిలో వున్నారు. పెండ్లి వల్ల ఒక సంవత్సరం పాటు మా చదువు ఆగిపోయింది. మా అన్న పని మరీ అన్యాయం. ఆయన బడి మానివేశాడు. మా అన్నవలె ఎంతమంది పిన్న వయస్సులో యీ విధంగా చదువు మానివేశారో ఆ భగవంతునికే ఎరుక. ఈనాటి మన హిందూ సమాజంలో విద్య, వివాహం రెండూ వెంట వెంట నడుస్తున్నాయి. నా చదువు మాత్రం ఆగిపోలేదు. హైస్కూల్లో నాకు మొద్దబ్బాయి అని పేరు రాలేదు. ఉపాధ్యాయులకు నా యెడ వాత్సల్యం మెండు. పిల్లవాడి నడతను గురించి, అతని చదువును గురించి ప్రతి సంవత్సరం స్కూలు నుండి ఒక సర్టిఫికెట్ తల్లిదండ్రులకు పంపుతూ వుంటారు. వాళ్లు ఎప్పుడూ నా నడతను గురించిగానీ, నా చదువును గురించి గానీ వ్యతిరేకంగా వ్రాయలేదు. రెండో తరగతి తరువాత నేను బహుమతులు కూడా కొన్ని సంపాదించాను. అయిదవ, ఆరవ తరగతుల్లో నెలకు నాలుగు రూపాయలు ఆ తరువాత పది రూపాయల చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. యిందు నా తెలివితేటల కంటే నా అదృష్టం ఎక్కువగా పనిచేసిందని నా అభిప్రాయం. యీ వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కావు. సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్టు వచ్చిన వాళ్ళకు యిట్టి వేతనం లభించేది. 40 లేక 50 మంది గల తరగతిలో అప్పుడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు బహు తక్కువ.

నాకు తెలిసినంతవరకు తెలివితేటల్ని గురించిన గర్వం నాకు వుండేదికాదు. బహుమతులు లేక స్కాలర్షిప్పులు లభించినప్పుడు ఆశ్చర్యం కలిగేది. కాని నడతను గురించి మాత్రం జాగ్రత్తగా వుండేవాణ్ణి. ఆచరణలో దోషం కనబడితే ఏడుపు వస్తూ వుండేది. ఉపాధ్యాయులు నన్ను మందలించటం గానీ, అట్టి పరిస్థితి ఏర్పడటం గానీ నేను సహించలేకపోయేవాణ్ణి. నాకు బాగా జ్ఞాపకం. ఒక పర్యాయం నేను దెబ్బలు తినవలసి వచ్చింది. దెబ్బలు తగిలినందుకు నేను విచారించలేదు, దండనకు గురి అయినాననే బాధ అమితంగా కలిగింది. బాగా ఏడ్చాను. మొదటి తరగతిలోనో లేక రెండో తరగతిలోనో ఇలా జరిగింది. అప్పుడు దొరాబ్జీ ఎదల్జీగిమీ హెడ్ మాష్టరు. ఆయన విద్యార్థులకు యిష్టుడు. తాను నియమబద్ధంగా పనిచేస్తూ ఇతరులచేత పనిచేయించేవాడు. చదువు బాగా చెప్పేవాడు. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం, క్రికెటు అనివార్యం చేశాడు. నాకు అవి యిష్టంలేదు. నేను వాటిలో పాల్గొనేవాణ్ణి కాదు. నా అయిష్టం సరికాదని యిప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ రోజుల్లో చదువుకు, వ్యాయామానికి ఏ మాత్రం సంబంధం లేదని నేను అనుకునేవాణ్ణి. విద్యార్జనతో బాటు అనగా మానసిక శిక్షణతోబాటు వ్యాయామం శారీరక శిక్షణ కూడా, విద్యార్థికి అవసరమని తరువాత బోధపడింది. అయినా వ్యాయామంలో పాల్గొనక పోవడం వల్ల నాకేమీ నష్టం కలుగలేదని చెప్పగలను. తెరపగాలిలో వాహ్యాళి ఎంతో ప్రయోజనకర మైనదని చదివాను. ఆ సలహా నాకు నచ్చింది. దానిలో పెద్ద తరగతుల్లో చదువుకునేటప్పటి నుండి నాకు కాలినడకన వాహ్యాళికి వెళ్ళడం అలవాటైపోయింది. చివరివరకు ఈ అలవాటు నన్ను వదలలేదు. కాలినడకన తిరగడం కూడా మంచి వ్యాయామమే. అందువల్ల నా శరీరంలో కొంచెం బిగువు వచ్చింది. నా తండ్రికి సేవ చేయాలనే తలంపు కూడా వ్యాయామంలో పాల్గొనకపోవడానికి మరో కారణం. స్కూలు మూసివేయగానే యింటికి చేరి తండ్రికి సేవ చేసేవాణ్ణి. స్కూల్లో వ్యాయామాన్ని అనివార్యం చేయడం వల్ల తండ్రిగారి సేవకు విఘ్నం ఏర్పడింది. గనుక స్కూలు వ్యాయామంలో పాల్గొనకుండా వుండుటకు అనుమతి నొసంగమని అర్జీ పెట్టుకున్నాను. కాని గీమీగారు అంగీకరిస్తారా? ఒక శనివారం నాడు స్కూలు ఉదయం పూట నడిపారు. సాయంకాలం మేఘాలు కమ్మాయి. అందువల్ల టైము ఎంత అయిందో తెలియలేదు. మేఘాలవల్ల మోసపోయాను. క్లాసుకు వెళ్ళాను. ఎవ్వరూ లేరు. రెండో రోజున గీమీగారు హాజరు పట్టిక చూచారు. నేను పాల్గొనలేదని తేలింది. కారణం అడిగారు నేను నిజం చెప్పాను. నేను చెప్పింది నిజం కాదని ఆయన భావించారు. ఒకటో లేక రెండో అణాల (ఎంతో సరిగా జ్ఞాపకం లేదు) జుర్మానా వేశారు. నేను అబద్ధం చెప్పలేదని రుజువు చేయడం ఎలా? ఉపాయం ఏమీ కనబడలేదు. వూరుకున్నాను. బాగా ఏడ్చాను. నిజం మాట్లాడేవారు, నిజాయితీగా వ్యవహరించేవారు. ఏమరచి వుండకూడదని గ్రహించాను. చదువుకునే రోజుల్లో అజాగ్రత్తగా వుండటం అదే ప్రధమం, అదే అంతిమం కూడా. చివరికి ఆ జుర్మానాను మాఫీ చేయించుకోగలిగానని జ్ఞాపకం. స్కూలు మూసివేయగానే నా సేవకు మా అబ్బాయి అవసరం అని మా తండ్రి హెడ్మాష్టరుకు జాబు వ్రాశారు. దానితో నాకు ముక్తి లభించింది.

వ్యాయామానికి బదులు వాహ్యాళికి వెళ్ళడం అలవాటు చేసుకున్నందువల్ల అనారోగ్యం బారినుండి తప్పించుకోగలిగాను. కాని మరో పొరపాటు వల్ల కలిగిన ఫలితం నేను ఈనాటికీ ఆనుభవిస్తున్నాను. చదువుకునేటప్పుడు అందంగా వ్రాయడం నేర్చుకోవలసిన అవసరం లేదనే తప్పు అభిప్రాయం నా బుర్రలో ఎలా దూరిందో తెలియదు దూరిపోయింది. విదేశానికి బయలుదేరేంతవరకు ఆ అభిప్రాయం మారలేదు. కాని దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తరువాత, అక్కడి వకీళ్ళు అక్కడి ప్రజలు ముత్యాల్లాంటి అందమైన అక్షరాలు వ్రాస్తూ వుంటే చూచి సిగ్గుపడ్డాను. వంకరటింకర అక్షరాలు అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలనే భావం అప్పుడు నాకు కలిగింది, తరువాత నా అక్షరాల్ని అందంగా వ్రాద్దామని ఎంతో ప్రయత్నించాను. కాని వ్యవహారం చేయి దాటి పోయింది. దస్తూరి మార్చుకోలేకపోయాను. నన్ను చూచి ప్రతి బాలుడు, బాలిక జాగ్రత్తపడాలని కోరుతున్నాను. మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి. అక్షరాలు దిద్దించుటకు ముందు బాలురకు చిత్రలేఖనం నేర్పటం అవసరమని నాకు అనిపించింది. పూవులు, పిట్టలు మొదలుగా గల వాటిని పరిశీలించి చిత్రించినట్లే అక్షరాల్ని కూడా పరిశీలించి వ్రాయడం అవసరం. వస్తువుల్ని చూచి గీయడం నేర్చుకున్న తరవాతే వ్రాత నేర్వడం మంచిది. అప్పుడు అక్షరాలు అందంగా వుంటాయి. ఆనాటి మా బడిని గురించిన రెండు విషయాలు చెప్పవలసినవి వున్నాయి. వివాహం వల్ల నా ఒక సంవత్సర కాలం వ్యర్థమైపోయింది. దాన్ని సరిచేసేందుకు ఉపాధ్యాయుడు నన్ను పై క్లాసులో చేర్పించాడు. కష్టపడి చదివే వాళ్ళకు అట్టి అవకాశం లభిస్తూ వుండేది. అందువల్ల నేను మూడో తరగతిలో ఆరు నెలలు మాత్రమే వుండి ఎండాకాలపు సెలవులకు పూర్వం జరిగే పరీక్షలు పూర్తి అయిన తరువాత నాలుగో తరగతిలో చేర్చబడ్డాను. నాలుగో తరగతి నుండి పాఠ్య విషయాలు ఎక్కువభాగం ఇంగ్లీషులో బోధించబడేవి. నాకు నడిసముద్రంలో వున్నట్లు అనిపించేది. రేఖాగణితం నాకు క్రొత్త. ఇంగ్లీషులో రేఖాగణితం బోధించడం వల్ల నా పాలిట అది గుదిబండ అయింది. ఉపాధ్యాయుడు పాఠం బాగా చెప్పేవాడు. కాని ఏమీ బోధపడేది కాదు. పాఠాలు కష్టంగా వుండటం వలన నా మనస్సు కలత చెంది తిరిగి మూడో తరగతిలోనే చేరదామని భావించాను. రెండేండ్ల చదువు ఒక సంవత్సరంలో పూర్తి చేయడం కష్టమనిపించింది. కాని నాకంటే కూడా నా ఉపాధ్యాయునికి యిలా తిరిగి నేను మూడో తరగతిలో చేరడం అవమానమనిపించింది. నా చదువు మీద గల విశ్వాసంతో ఆయన నన్ను నాలుగో తరగతిలో చేర్పించాడు. యింతగా శ్రమపడిన తరువాత తిరిగి మూడో తరగతిలో నేను చేరడం సబబా? అందువల్ల నేను నాలుగో తరగతిలోనే ఉండిపోయాను. బాగా కష్టపడి చదవడం ప్రారంభించాను. యూక్‌లిడ్‌లో 13వ ప్రోపొజిషన్ వరకు రాగా అక్కడి నుండి రేఖాగణితం సులభంగా బోధపడిపోయింది. తెలివితేటల్ని ఉపయోగించి సరళప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది. అప్పటినుండి నాకు రేఖాగణితం యెడ అభిరుచి పెరిగింది.

సంస్కృతం బాగా కష్టమనిపించింది. రేఖాగణితంలో బట్టీ పట్టవలసిన అవసరం వుండేది కాదు. కాని సంస్కృతం అంతా బట్టీపట్టడమే. అందుకు ధారణాశక్తి అవసరమనిపించింది. నాలుగోతరగతికి చేరేసరికి సంస్కృత పాఠాలు మరీ కష్టమనిపించాయి. సంస్కృత ఉపాధ్యాయుడు పిల్లలకు సంస్కృతాన్ని నూరిపోద్దామని అనుకునేవాడు. సంస్కృత ఉపాధ్యాయుడికీ, ఫారసీ ఉపాధ్యాయుడికీ పడేది కాదు. ఫారసీ మౌల్వీ సౌమ్యుడు. ఫారసీ తేలిక అని ఫారసీ మౌల్వీ పిల్లల్ని ప్రేమగా చూస్తాడని పిల్లలు చెప్పుకునేవారు. ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. ఒకసారి ఫారసీ క్లాసులో కూర్చున్నాను అది చూచి సంస్కృత ఉపాధ్యాయుడు చాలా బాధపడ్డాడు. నన్ను పిలిచి “అబ్బాయీ! నీవు ఎవరికొడుకువో ఆలోచించుకో. నీ ధార్మిక భాష సంస్కృతం. దాన్ని నీవు నేర్చుకోవా? సంస్కృతం రాకపోతే నా దగ్గరికి రావచ్చుకదా? శక్తి కొద్దీ పిల్లలకు సంస్కృతం నేర్పడం నా లక్ష్యం. ముందు ముందు సంస్కృతం తేలిక అవుతుంది. అధైర్యపడవద్దు. వచ్చి సంస్కృత క్లాసులో కూర్చో” అని మంచిగా చెప్పాడు.

ఆయన చూపిన మంచితనాన్ని కాదనలేకపోయాను. గురుప్రేమను తిరస్కరించలేకపోయాను. ఆయన పేరు కృష్ణశంకర పాండ్యా, యిప్పుడు వారిని, వారు చెప్పిన పాఠాల్ని గుర్తు చేసుకుంటే నా హృదయం వారి ఉపకారాన్ని మర్చిపోలేక కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆనాడు వారిదగ్గర ఆ కొద్దిపాటి సంస్కృతం నేర్చుకొని వుండకపోతే ఆనందించలేకపోయేవాణ్ణి. నిజానికి నేను సంస్కృతం ఇంకా ఎక్కువ నేర్చుకోలేకపోయాననే బాధ యిప్పుడు నాకు కలుగుతూ వుంటుంది. ప్రతి హిందూ బాలుడు, బాలిక సంస్కృతం చక్కగా నేర్చుకోవడం అవసరమని తరువాత గ్రహించాను.

నా అభిప్రాయం ప్రకారం భారతదేశపు ఉన్నత విద్యా ప్రణాళికలో మాతృభాషతో పాటు హిందీ, సంస్కృతం, ఫారసీ, అరబ్బీ, ఇంగ్లీషు భాషలను పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ సంఖ్యను చూచి భయపడవలసిన అవసరంలేదు. మనకు బోధించబడుతున్న విద్యను క్రమబద్ధం చేసి పరాయి భాషలో పాఠ్యాంశాలు నేర్చుకోవలసిన అవసరం లేకుండా చేసి, ఆ భారం తగ్గించితే పిల్లలు తేలికగా ఈ భాషలు నేర్చుకోగలుగుతారని. వాళ్ళకు ఆనందం కలుగుతుందని నా అభిప్రాయం. ఒక భాషను శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం అవుతాయి. అసలు హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలు ఏకభాషలేనని చెప్పవచ్చు. అదే విధంగా ఫారసీ, అరబ్బీ భాషలు ఏకభాషలే. ఫారసీ భాష ఆర్య భాషకు చెందినది. అరబ్బీ భాష హీబ్రూకు చెందినది. అయినా ఈ రెండింటికీ దగ్గరి చుట్టరికం వుంది. ఈ రెండు భాషలు ఇస్లాం మతంతోబాటు అభివృద్ధి చెందాయి. ఉర్దూ భాష వేరు అని నేను అంగీకరించను. హిందీ వ్యాకరణాంశాలు అందు వుండటం, ఫారసీ, అరబ్బీ పదాలు అందు వుండటం అందుకు కారణం. గుజరాత్, హిందీ, బెంగాలీ, మరాఠీ, మొదలుగా గల మన భాషల్లో మంచి ప్రవేశం కలగాలంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా అవసరం. అలాగే ఉర్దూలో మంచి ప్రవేశం కలగాలంటే ఫారసీ, అరబ్బీ భాషలు అభ్యసించాలి.