సత్యశోధన/మొదటిభాగం/4. భర్తగా
4. భర్తగా
నాకు పెండ్లి అయిన రోజుల్లో దమ్మిడీకో, కాణీకో, చిన్న చిన్న పత్రికలు అమ్ముతూ వుండేవారు. వాటిలో భార్యభర్తల ప్రేమ, పొదుపు, బాల్యవివాహాలు మొదలుగా గల విషయాలను గురించి వ్రాస్తూ వుండేవారు. చేతికందినప్పుడు వాటిని పూర్తిగా చదివేవాణ్ణి. నచ్చని విషయాల్ని మరిచిపోవడం, నచ్చిన విషయాల్ని ఆచరణలో పెట్టడం నాకు అలవాటు. ఒకసారి ఒక పత్రికలో ఏకపత్నీవ్రతం ధర్మం అను వ్యాసం ప్రకటించారు. శ్రద్ధగా చదివాను. ఆ విషయం నా మనస్సులో నాటుకుపోయింది. సత్యమంటే నాకు మక్కువ, అట్టి స్థితిలో భార్యను మోసగించడం నావల్ల సాధ్యం కానిపని. అందువల్ల మరో స్త్రీ యెడ మక్కువ కూడదని నాకు బోధపడింది. చిన్న వయస్సులో ఏకపత్నీవ్రత భంగం అయ్యే అవకాశం తక్కువేనని చెప్పవచ్చు.
కాని ఒక ముప్పు కూడా కలిగింది. నేను ఏకపత్నీవ్రతం అవలంబించితే ఆమె కూడా పాతివ్రత్యాన్ని పాటించాలి. యీ రకమైన యోచన నన్ను ఈర్ష్యపడే భర్తగా మార్చివేసింది. పాటించాలి అని అనుకున్న నేను “పాటింపచేయాలి” అనే నిర్ణయానికి వచ్చాను. ఆమెచే పాటింపచేయాలంటే నేను జాగ్రత్త పడాలి అని భావించాను. నిజానికి నా భార్యను శంకించవలసిన అవసరం లేనేలేదు. కానీ అనుమానం పెనుభూతం వంటిది కదా. నా భార్య ఎక్కడికి పోతున్నదీ నేను తెలుసుకోకపోతే ఎలా? నా అనుమతి లేనిదే ఆమె ఎక్కడికీ వెళ్ళకూడదు. దానితో మా మధ్య ఎడమొహం పెడమొహం ప్రారంభమైంది. అనుమతి లేకుండా ఎక్కడికీ పోకూడదంటే ఒక విధమైన జైలేకదా! అయితే కస్తూరిబాకి యిలాంటి జైలు బంధాలు గిట్టవని తేలిపోయింది. నేను వెళ్ళొద్దని వత్తిడి తెచ్చిన కొద్దీ వెళ్ళసాగింది. దానితో నాకు చిరచిర ఎక్కువైంది. పిల్లలమైన మా మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. కస్తూరిబా తీసుకున్న స్వాతంత్ర్యం నిజానికి దోషరహితం. మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవదర్శనానికో, మరెవరినైనా కలుసుకోవడానికో వెళ్ళడాన్ని అంగీకరించక అధికారం చెలాయిస్తే సహిస్తుందా? నేను ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నా మీద దర్పం చూపించవచ్చుకదా! అయితే యీ విషయం కాలం గడిచాక బోధపడింది కానీ అప్పుడో! భర్తగా అధికారం చలాయించడమే నా పని. నా గృహ జీవితంలో మాధుర్యం లోపించిందని పాఠకులు అనుకోవద్దు. నా వక్రపోకడకు మూలం ప్రేమయే. నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని నా భావం. ఆమె స్వచ్ఛంగా, శుద్ధంగా వుండాలనీ. నేను నేర్చుకున్న దాన్ని ఆమె నేర్చుకోవాలనీ, నేను చదివిందాన్ని ఆమె చదవాలనీ, యిద్దరం ఒకరిలో ఒకరం ఏకం అయిపోవాలన్న యోచన తప్ప మరో యోచన నాకు లేదు.
కస్తూరిబాకి కూడా నా మాదిరి యోచన వున్నదో లేదో నాకు తెలియదు. ఆమెకు చదువురాదు. స్వభావం మంచిది. స్వతంత్రురాలు, కష్టజీవి. నాతో తక్కువగా మాట్లాడేది. చదువుకోలేదను చింత ఆమెకు లేదు. చదువుకోవాలనే స్పందన ఆమెలో చిన్నతనంలో నాకు కనబడలేదు. అందువల్ల నా యోచన ఏకపక్షమైనదని అంగీకరిస్తున్నాను. నేను ఆమెను అమితంగా ప్రేమించాను. అలాగే ఆమె కూడా నన్ను ప్రేమించాలని కోరాను. ఆ విధంగా అన్యోన్య ప్రేమ లేకపోయినా, ప్రేమ ఏకపక్షంగా వుండిపోయినా అది మాకు బాధాకరం కాలేదు. నా భార్య మీద నాకు మక్కువ ఎక్కువగా వుండేది. స్కూల్లో కూడా ఆమెను గురించిన ధ్యాసే. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడెప్పుడు యిద్దరం కలుస్తామా అని ఆరాటపడుతూ వుండేవాణ్ణి. వియోగాన్ని సహించలేని స్థితి. రాత్రిళ్ళు నిరర్ధకమైన మాటలతో నేను కస్తూరిని నిద్రపోనిచ్చేవాణ్ణి కాదు. ఎంతటి ఆసక్తితో బాటు కర్తవ్యనిష్ఠ లేకపోతే నేను అప్పుడు రోగగ్రస్థుడనై మృత్యువు కోరల్లో చిక్కుకుపోయేవాణ్ణి. ప్రపంచానికి భారమైపోయేవాణ్ణి. తెల్లవారగానే నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వుండేవాణ్ణి. మరొకరిని మోసగించడం ఎరగనివాణ్ణి. కనుకనే అనేక పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను.
కస్తూరిబా చదువుకోలేదని మొదటే వ్రాశాను. ఆమెకు చదువు చెప్పాలనే కోరిక నాకు వుండేది. కాని విషయవాంఛ అందుకు అడ్డుపడేది. ఆమెకు బలవంతంగా చదువు చెప్పవలసిన పరిస్థితి. అది కూడా రాత్రిపూట ఏకాంతంగా వున్న సమయంలోనే సాధ్యపడేది. గురుజనుల ఎదుట భార్యవంక చూడటానికి కూడా వీలు లేని రోజులు. అట్టి స్థితిలో ఆమెతో మాట్లాడటం సాధ్యమా? కాఠియావాడ్ లో పనికిమాలిన మేలిముసుగు అనగా పర్దా రివాజు అమలులో వుండేది. యిప్పటికీ ఆ రివాజు అక్కడక్కడా అమలులో వుంది. ఈ కారణాలవల్ల కస్తూరిబాకు చదువు చెప్పేందుకు అవకాశం చిక్కలేదు. యౌవ్వన సమయంలో భార్యకు చదువు చెప్పడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమయ్యాయని అంగీకరిస్తున్నాను. విషయవాంఛల నుంచి మేల్కొని బయటపడేసరికి ప్రజాజీవితంలో బాగా లీనమైపోయాను. ఇక ఆమెకు చదువు చెప్పేందుకు సమయం దొరకనేలేదు. ఉపాధ్యాయుణ్ణి పెట్టి చదువు చెప్పిద్దామని చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఏతావాతా కస్తూరిబా చదువరి కాలేదు. ఆమె కొద్దిగా జాబులు వ్రాయగలదు. సామాన్యమైన గుజరాతీ అర్థం చేసుకోగలదు. ఆమె యెడ నాకుగల ప్రేమ వాంఛామయం కాకుండా వుండివుంటే యీనాడు ఆమె విదుషీమణి అయివుండేదని నా అభిప్రాయం. చదువు యెడ ఆమెకు గల నిర్లిప్తతను జయించి వుండేవాణ్ణి. శుద్ధమైన ప్రేమవల్ల జరగని పని అంటూ ఏదీ వుండదని నాకు తెలుసు.
భార్య మీద భోగవాంఛ అమితంగా పెంచుకున్నప్పటికీ నన్ను కాపాడిన విషయాల్ని గురించి వ్రాశాను కదా! మరో విషయం కూడా చెప్పవలసిన అవసరం వుంది. ఎవరి నిష్ఠ పవిత్రంగా వుంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ వుంటాడను సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది. అతి బాల్య వివాహం పెద్ద దురాచారం. దానితోబాటు అందలి చెడుగుల్ని కొంత తగ్గించడానికా అన్నట్లు హిందువుల్లో ఒక ఆచారం వుంది. తల్లిదండ్రులు నూతన దంపతుల్ని ఎక్కువ కాలం కలిసి ఒక చోట వుండనీయరు. నూతన వధువు సగం కాలం పుట్టింట్లో వుంటుంది. ఈ విషయంలో అలాగే జరిగింది. మాకు పెండ్లి అయిన అయిదేళ్ళ కాలంలో (13వ ఏట నుండి 18 వరకు) మేము కలిసియున్న కాలం మొత్తం మూడేండ్లకు మించదు. ఆరు నెలలు గడవకుండానే పుట్టింటినుండి కస్తూరిబాకి పిలుపు వచ్చింది. ఆ విధంగా పిలుపు రావడం నాకు యిష్టం వుండేది కాదు. అయితే ఆ పిలుపులే మమ్ము రక్షించాయి. 18వ ఏట నేను ఇంగ్లాండు వెళ్లాను. అది మాకు వియోగకాలం. ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చాక కూడా మేము ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేదు. అప్పుడు నేను రాజకోట నుండి బొంబాయికీ, బొంబాయినుండి రాజకోటకు పరుగులు తీస్తూ వుండేవాణ్ణి. తరువాత నేను దక్షిణ ఆఫ్రికా వెళ్ళవలసి వచ్చింది. ఈ లోపున నేను పూర్తిగా మేల్కొన్నాను.