సత్యశోధన/మొదటిభాగం/3. బాల్యవివాహం

వికీసోర్స్ నుండి

3. బాల్య వివాహం

ఈ ప్రకరణం వ్రాయకుండా వుండటం నాకెంతో యిష్టం. కాని కథాక్రమంలో యిట్టి చేదు మాత్రలు ఎన్నో మ్రింగవలసి వచ్చింది. సత్యపూజారిని కదా! వేరే మార్గం లేదు. వ్రాయక తప్పదు. సుమారు పదమూడోయేట నాకు పెండ్లి అయింది. యీ విషయాలు గ్రంథస్థం చేయవలసి వచ్చినందుకు విచారంగా వుంది. అయినా విధి అని భావించి వ్రాస్తున్నాను. నా రక్షణలో వున్న పన్నెండు లేక పదమూడు ఏండ్ల బాలబాలికల్ని చూస్తూ వుంటే నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నా మీద నాకే జాలికలుగుతూ వుంటుంది. నాకు పట్టిన దౌర్భాగ్యం వాళ్ళకు పట్టలేదు. కనుక వాళ్ళను అభినందించాలని వుంటుంది. పదమూడేళ్ళ వయస్సులో జరిగిన ఈ పెళ్ళిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు.

ప్రధానం గురించి వ్రాస్తున్నానని పాఠకులు గ్రహించాలి. కాఠియావాడ్ లో వివాహమంటే ప్రధానం కాదు. ఇద్దరు బాలబాలికలకు పెండ్లి జరపాలని వాళ్ళ తల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని లేక ఒడంబడికను ప్రధానం అని అంటారు. ప్రధానం అనుల్లంఘనీయం కాదు. ప్రధానం అయిన తరువాత పెండ్లికి పూర్వం పిల్లవాడు చనిపోతే ఆ బాలిక వితంతువైపోదు. ప్రధానానికి సంబంధించినంతవరకు వరుడికి, వధువుకి మధ్య సంబంధం ఉండదు. అసలు తమకిరువురికీ ప్రధానం జరిగిందను విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఈ విధమైన ప్రధానాలు నాకు వరుసగా మూడు జరిగాయని విన్నాను. అవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. ప్రధానం జరిగిన తరువాత ఇద్దరు కన్యలు చనిపోయారని నాకు చెప్పారు. మూడో ప్రధానం ఏడేండ్ల వయస్సులో జరిగినట్లు నాకు గుర్తు. అయితే ప్రధానం జరిగినప్పుడు నాకు ఎవరైనా ఏమైనా చెప్పారో లేదో గుర్తులేదు. పెండ్లి జరిగినప్పుడు వరుడు, వధువు అవసరం అవుతారు. కొన్ని విధులు వారు నిర్వర్తించవలసి వుంటుంది. అట్టి వివాహాన్ని గురించే వ్రాస్తున్నాను. నా పెండ్లికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు గుర్తు వున్నాయి.

మేము ముగ్గురు అన్నదమ్ములమని పాఠకులకు గతంలో తెలియజేశాను. మాలో అందరికంటే పెద్దవాడికి పెండ్లి అయిపోయింది. రెండవవాడు నా కంటె రెండు మూడు సంవత్సరాలు పెద్ద. అతడికీ, వయుస్సులో నా కంటే ఒకటి లేక ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడైన మా పినతండ్రి చివరికొడుక్కి, నాకు ముగ్గురికీ ఒకేసారి పెండ్లి జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో మా మేలును ఎవ్వరూ ఆలోచించలేదు. మా యిష్టాయిష్టాలను గురించి యోచించే అవకాశమే లేదు. పెద్దవాళ్ళు తమ సౌకర్యం గురించి, పెండ్లి ఖర్చులు తగ్గించడాన్ని గురించి మాత్రమే యోచించారు.

హిందూ సమాజంలో వివాహమంటే సామాన్య విషయం కాదు. వరుడు, వధువుల తల్లిదండ్రులు ఆర్థికంగా తరచు కూలిపోతూ వుంటారు. డబ్బును, సమయాన్ని వ్యర్థం చేస్తారు. పెండ్లి ఏర్పాట్లు ఎన్నో నెలల ముందునుంచే ప్రారంభిస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు సమకూరుస్తారు. విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. పిండి వంటల విషయంలో పోటాపోటీలు ప్రారంభమవుతాయి. కంఠం సరిగా వున్నా లేకపోయినా లెక్క చేయకుండా స్త్రీలు పాటలు పాడి పాడి గొంతు పోగొట్టుకుంటారు. జబ్బు కూడా పడతారు. ఇరుగుపొరుగువాళ్ళ శాంతికి భంగం కలిగిస్తారు. అయితే ఇరుగుపొరుగువాళ్ళు కూడా తమ ఇళ్ళలో శుభకార్యలు జరిగినప్పుడు ఇలాగే చేస్తారు. అందువల్ల గందరగోళం జరిగినా, ఎంగిలిమంగలం అయినా, మురికి పేర్కొన్నా పట్టించుకోరు. సహించి వూరుకుంటారు. ఇంత గొడవ, గందరగోళం మూడుసార్లు జరిపేకంటే ఒక్క పర్యాయమే జరిపితే సౌకర్యం కదా! డబ్బు ఖర్చు తగ్గినా దర్జాకు లోటు వుండదు. మూడు వివాహాలు ఒకే పర్యాయం జరపడం వల్ల డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవచ్చు. మా తండ్రి, పినతండ్రి ఇద్దరూ వృద్ధులు. మేము వారి చివరి బిడ్డలు. అందువల్ల మా వివాహాలను పురస్కరించుకొని హాయిగా ఆనందించి తమ వాంఛల్ని నెరవేర్చుకోవాలని వారు అనుకోవడం సహజం. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముగ్గురి వివాహాలు ఒకేసారి చేయాలనే నిర్ణయానికి మా పెద్దలు వచ్చారు. ఇంతకు ముందు వివరించినట్లు కొన్ని మాసాల ముందునుంచే ఏర్పాట్లు ప్రారంభమైనాయి.

వాటిని చూచి మా వివాహాలు జరుగుతాయను విషయం ముగ్గురు సోదరులం తెలుసుకున్నాం. కొత్త బట్టలు ధరించడం, మేళతాళాలు మ్రోగడం, గుర్రం మీద ఎక్కడం, రకరకాల పిండిపంటలు తినడం, ఆటలకు, వినోదాలకు ఒక క్రొత్త పిల్ల దొరకడం ఇవి తప్ప మరోరకమైన వాంఛ మాకు వున్నట్లు నాకు గుర్తులేదు. భోగవిలాసాన్ని గురించిన భావం తరువాత కలిగింది. ఎలా కలిగిందో సవివరంగా తరువాత చెబుతాను. కానీ అట్టి జిజ్ఞాస పాఠకులు తగ్గించుకొందురు గాక. నాకు కలిగిన బిడియాన్ని కొంతవరకు దాచుకుంటాను. చెప్పదగిన కొన్ని విషయాలు చెబుతాను. ఆయితే ఆ వివరాలు వ్రాస్తున్నప్పుడు నా అభిప్రాయాన్ని గమనిస్తే అందు విషయవాసనలు తక్కువేనని తేలుతుంది.

మా అన్నదమ్ములిద్దరినీ రాజకోట నుంచి పోరుబందరు తీసుకువెళ్ళారు. అక్కడ మా ఒంటికి నూనె రాశారు. పసుపు మొదలుగా గలవి పూశారు. నలుగు పెట్టారు. మనోరంజకంగా వున్నా అవి వదిలివేయదగినవి. మా తండ్రి దివాను అయినప్పటికీ నౌకరే గరా! రాజుగారికి విశ్వాసపాత్రుడు. అందువల్ల మరింత పరాధీనుడన్నమాట. చివరి నిమిషం వరకు రాజుగారు మా తండ్రికి వెళ్ళడానికి అనుమతి నీయలేదు. రెండు రోజుల తరువాత అనుమతించారు. మా ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ విధి నిర్ణయం మరో విధంగా వుంది. రాజకోట పోరుబందరుకు మధ్య 60 క్రోసుల దూరం. ఎడ్లబండి మీద అయిదురోజుల ప్రయాణం, రాజుగారు గుర్రపు బగ్గి ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రయాణం మూడురోజుల్లో ముగుస్తుంది. కాని చివరి మజిలీ దగ్గర గుర్రం బగ్గీ బోర్లపడిపోయింది. మా నాన్నగారికి గట్టి దెబ్బలు తగిలాయి. చేతులకు కట్లు, వీపుకు కట్లు కట్టించుకుని పోరుబందరు చేరారు. దానితో పెండ్లి ఆనందం సగం తగ్గిపోయింది. అయినా వివాహాలు జరిగాయి. పెండ్లి ముహూర్తాన్ని ఆపడం ఎవరితరం? నేను పెండ్లి సంతోషంలో మా తండ్రిగారికి తగిలిన దెబ్బల దుఃఖం మరిచిపోయాను. చిన్నతనం కదా! నేను పితృభక్తికలవాణ్ణి. దానితోపాటు విషయవాంఛలకు కూడా భక్తుణ్ణి అయ్యాను. విషయాలంటే ఇంద్రియాలకు సంబంధించినవని కూడా గ్రహించాలి. తల్లిదండ్రుల యెడ గల భక్తికోసం సర్వమూ త్యజించాలను జ్ఞానం తరువాత నాకు కలిగింది. నా భోగాభిలాషకు దండన విధించడం కోసమనేమో అప్పుడు ఒక ఘట్టం జరిగింది. అప్పటినుండి ఆ ఘట్టం నన్ను బాధిస్తూనే వుంది. ఆ వివరం ముందు తెలుపుతాను. నిష్కలానందుడు చెప్పిన “త్యాగ్ న టకేరే వైరాగవినా, కరీయే కోటి ఉపాయ్ జీ” “కోటి ఉపాయాలు పన్నినా, విషయవాంఛల యెడ వైరాగ్యం కలుగనిచో త్యాగభావం అలవడదు సుమా” అను గీతం చదివినప్పుడు ఆ గీతం ఎవరైనా చదువగా విన్నప్పుడు కటువైన ఆ ఘట్టం చప్పున జ్ఞాపకం వచ్చి నన్ను సిగ్గులో ముంచేస్తుంది.

మా తండ్రి గాయాలతో బాధపడుతూ కూడా నవ్వు ముఖంతో వివాహ కార్యాలు నిర్వహించారు. మా తండ్రి ఏఏ సమయంలో ఎక్కడెక్కడ కూర్చున్నదీ అప్పటికీ నాకు బాగా గుర్తు. నాకు బాల్య వివాహం చేసినందుకు తరువాత నా తండ్రిని తీవ్రంగా విమర్శించాను. కాని పెండ్లి సమయంలో ఆ విషయం నాకు తోచలేదు. అప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. అంతా మనోహరంగా కనిపించింది. పెండ్లి ఉబలాటంలో అప్పుడు నా తండ్రి చేసినదంతా మంచే అని అనిపించింది. ఆ విషయాలు యిప్పటికీ నాకు గుర్తు వున్నాయి.

పెండ్లి పీటల మీద కూర్చున్నాం. సప్తపది పూర్తి అయింది. ఒకే పళ్ళెంలో కంసారు అనగా గోధుమరవ్వ, చక్కెర, కిస్ మిస్, ఎండుద్రాక్షలతో తయారు చేసే జావ తాగాం. ఒకరికొకరం తినిపించుకున్నాం. ఇద్దరం కలిసిమెలిసి వున్నాం. ఆ విషయాలన్నీ కండ్లకు కట్టినట్లు ఇప్పటికీ నాకు కనబడుతున్నాయి. ఆహా! మొదటి రాత్రి. అభం శుభం తెలియని యిద్దరు పిల్లలం. సంసార సాగరంలోకి ఉరికాము. మొదటి రాత్రి ఏం చేయాలో, కొత్త ఆడపిల్లతో ఎలా వ్యవహరించాలో మా వదిన బోధించింది. నీ వెవరి దగ్గర నేర్చుకున్నావని ఆ రాత్రి నా ధర్మపత్నిని అడిగినట్లు గుర్తులేదు. యిప్పటికీ అడుగవచ్చు. కాని నాకు అట్టి ఇచ్ఛలేదు. ఒకరిని చూచి ఒకరం భయం భయంగ వున్నామని పాఠకులు గ్రహించవచ్చు. బాగా సిగ్గుపడ్డాం, ఎట్లా మాట్లాడాలో నాకేం తెలుసు? నేర్చుకున్న పాఠాలు జ్ఞాపకం వుంటాయా? అసలు అవి ఒకరి దగ్గర నేర్చుకునే విషయాలా? సంస్కారాలు బలంగా వున్నచోట పాఠాలు పనిచేయవు. మెల్లమెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకోసాగాం. మాట్లాడుకోసాగాం. మేమిద్దరం సమవయస్కులం. అయినా భర్తగా అధికారం చలాయించడం ప్రారంభించాను.