సత్యశోధన/మొదటిభాగం/2. బాల్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. బాల్యం

నా తండ్రి పోరుబందరు వదిలి ప్రభుత్వం వారి స్థానిక కోర్టు సభ్యునిగా రాజకోటకు వెళ్ళినప్పుడు నాకు ఏడేండ్ల వయస్సు. నన్ను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో చేర్చారు. అక్కడ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు, ఇతర విషయాలు నాకు గుర్తు వున్నాయి. పోరుబందరు వలె ఇక్కడ కూడా నా చదువును గురించి వ్రాయవలసిన విషయాలేమీ లేవు. నేను ఒక సామాన్య విద్యార్ధిగా వున్నాను. ఈ స్కూలు నుండి సబర్బను స్కూల్లోను. అక్కడ నుండి హైస్కూల్లోను చేరాను. అప్పటికి నాకు పన్నెండేళ్ళు. ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో కానీ, ఇటు తోటి విద్యార్థులతో కాని అబద్ధాలాడిన గుర్తు లేదు. నాకు సిగ్గు ఎక్కువ. అందువల్ల సమాజాన్ని తప్పించుకు తిరిగేవాణ్ణి. నా పుస్తకాలు, నా పాఠాలు, నా జతగాళ్ళు, వేళకు బడికి పోవడం, బడి మూసివేయగానే పరిగెత్తుకుని ఇంటికి చేరడం ఇదే నా నిత్య కార్యక్రమం. నిజంగా నేను పరిగెత్తేవాణ్ణి. ఇతరులతో మాట్లాడటం అంటే కష్టంగా వుండేది. ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా వుండేది. హైస్కూల్లో చేరిన మొదటి సంవత్సరం పరీక్షా సమయమప్పుడు జరిగిన ఒక విషయం వ్రాయడం అవసరం. విద్యాశాఖకు చెందిన జైయిల్స్ అను పేరుగల ఒక ఇన్‌స్పెక్టరు మా స్కూలుకు ఇన్‌స్పెక్షన్ కై వచ్చాడు. అతడు మా పిల్లల అక్షరజ్ఞానాన్ని పరీక్షించేందుకై ఐదు శబ్దాలు ఇచ్చాడు. వాటిల్లో కేటిల్ (Kettle) అను శబ్దం ఒకటి. నేను దాన్ని తప్పుగా వ్రాశాను. ఇది గమనించి ఉపాధ్యాయుడు తన బూటుకాలుతో నొక్కి తప్పు దిద్దుకోమన్నట్లు సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా వున్న పిల్లవాడి పలక చూచి తపుదిద్దుకోమని సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా వున్న పిల్లవాడి పలక చూచి తప్పు దిద్దుకోమని మాష్టారు సైగ చేస్తున్నారన్న విషయం తెలుసుకోలేక పోయాను. ఒకరి పలక మరొకరు చూచి వ్రాయకుండా వుండేందుకే మాష్టారు అక్కడ వున్నారని నా భావం. మిగతా పిల్లలంతా వ్రాసిన ఐదు శబ్దాలు సరిగా వున్నాయి. నేను ఒక్కణ్ణి మాత్రం దద్దమ్మనైనాను. తరువాత మాస్టారు నా మూర్ఖత్వాన్ని నాకు తెలియజేశారు. కానీ ఆయన మాటలు నా మీద పని చేయలేదు. ఇతరుల్ని చూచి వ్రాయడం నేను ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను. అయితే ఈ ఘట్టం ఉపాధ్యాయుని పట్ల నాకు గల వినయాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పెద్దల దోషాల్ని చూచి కళ్ళు మూసుకోవడం నా స్వభావం. తరువాత కూడా ఆ ఉపాధ్యాయుణ్ణి గురించిన దోషాలు నా దృష్టికి వచ్చాయి. కానీ ఆయన ఎడ నాకు వినయం తగ్గలేదు. నేను పెద్దల ఆజ్ఞ పాలించడమే నేర్చాను గాని వారి పనుల్ని గురించి తర్కించడం నేర్చుకోలేదు. అప్పటి మరో రెండు విషయాలు నా మనస్సుకు హత్తుకుని వుండిపోయాయి. బడి పుస్తకాలు తప్ప యితర పుస్తకాలు చదువుదామనే కోరిక నాకు వుండేది కాదు. రోజువారి పాఠాలు చదవాలి గదా! ఉపాధ్యాయుణ్ణి మోసగించడమంటే నాకు ఇష్టం వుండేదికాదు. ఆయనచే మాట పడడం నాకు ఇష్టం లేక పాఠాలు బాగా వల్లించేవాణ్ణి. అయితే నా మనస్సు మాత్రం పాఠాల మీద నిలిచేది కాదు. యీ విధంగా నా పాఠాలే నాకు సరిగా రానప్పుడు పుస్తకాలు చదవడం సాధ్యమా? ఒకసారి మా తండ్రిగారు కొని తెచ్చిన ఒక పుస్తకం నా కంటపడింది. అది శ్రవణ పితృభక్తి నాటకం. శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను. ఆ రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికి తిరుగుతూ వుండేవారు. వాళ్ళు చూపించిన చిత్రాల్లో అంధులగు తన తల్లిదండ్రుల్ని కావడిలో కూర్చోబెట్టుకొని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా హృదయం మీద చెరగని ముద్ర వేసింది. అతణ్ణి లక్ష్యంగా పెట్టుకున్నాను. శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రుల కరుణవిలాపం యిప్పటికీ నాకు జ్ఞాపకం వున్నది. ఆ లలిత గీతం నన్ను ద్రవింప చేసింది. నా తండ్రిగారు కొని ఇచ్చిన వాద్యం మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా. అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది. వాళ్ళ నాటకం చూచేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం నాకు బాగా నచ్చింది. కాని ఎక్కువ సార్లు ఎవరు చూడనిస్తారు! అయినా నా మసస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూ వుండేది. కలలో హరిశ్చంద్రుడు కనపడుతూ వుండేవాడు. అందరూ సత్య హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని అనుకునేవాణ్ణి. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలచుకుని ఎన్ని ఆపదలు వచ్చినా అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి. నాటకంలో హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలన్నీ యదార్థమైనవేనని అనుకొని, హరిశ్చంద్రుని దుఃఖం చూచి, దాన్ని జ్ఞాపకం పెట్టుకుని నేను బాగా ఏడ్చేవాణ్ణి. అతడు ఐతిహాసిక పురుషుడు కాడని యిప్పటికీ నాకు అనిపిస్తుంది. నా హృదయంలో యిప్పటికీ శ్రవణుడు, హరిశ్చంద్రుడు జీవించే వున్నారు. ఆ నాటకం చదివితే యిప్పటికీ నా కండ్లు చమరిస్తాయనే నా నమ్మకం.