సత్యశోధన/మొదటిభాగం/1. జననం

వికీసోర్స్ నుండి

మొదటి భాగం

1. జననం

గాంధీ కుటుంబం వారు మొదట పచారు దినుసులు అమ్ముకునేవారని ప్రతీతి. కాని మా తాతగారి పూర్వపు ముగ్గురు పురుషులు కాఠియావాడ్ కు చెందిన కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పని చేశారు. మాతాతగారి పేరు ఉత్తమచంద్ గాంధీ. ఆయనకు ఓతాగాంధీ అని మరో పేరు కూడా ఉండేది. ఆయన గట్టి నియమపాలకుడని ప్రతీతి. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోరుబందరు దివాన్ గిరీ విడిచిపెట్టి జునాగఢ్ అను సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ ఆయన నవాబుకు ఎడమ చేత్తో సలాం చేశాడట. యీ అవిధేయతకు కారణం ఏమిటని ప్రశ్నించగా కుడిచేయి యిదివరకే పోరుబందరుకు అర్పితమై పోయిందని సమాధానం యిచ్చాడట.

భార్య చనిపోగా ఓతాగాంధీ రెండో పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు కొడుకులు, రెండవ భార్యకు యిద్దరు కొడుకులు పుట్టారు. ఓతాగాంధీ కొడుకులంతా ఏక గర్భ సంజాతులు కారని బాల్యంలో నాకు తెలియదు. ఆ విషయం యితరుల వల్ల బాల్యంలో తెలుసుకున్నానని కూడా చెప్పలేను. ఆ ఆరుగురు అన్నదమ్ముల్లో అయిదవవాడు కరంచంద్ గాంధీ. ఆయనకు కబాగాంధీ అని మరో పేరు కూడా వున్నది. ఆరవవాడు తులసీదాసు గాంధీ. యీ అన్నదమ్ములిద్దరూ ఒకరి తరువాత ఒకరు పోరుబందరుకు దివానులుగా పనిచేశారు. కబాగాంధీ మా తండ్రి. పోరుబందరు ప్రధానామాత్య పదవిని త్యజించిన తరువాత ఆయన స్థానిక కోర్టులో సభ్యుడుగా పనిచేశారు. తరువాత రాజకోట దివానుగాను, ఆ తరువాత బికానేరుకు దివానుగాను పనిచేశారు. యావజ్జీవితం రాజకోట సంస్థానంలో పింఛను పుచ్చుకున్నారు.

కబాగాంధీకి నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్యకు, రెండో భార్యకు యిద్దరు కూతుళ్ళు పుట్టారు. నాలుగో భార్య పుత్తలీబాయి. ఆమెకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో నేను చివరివాణ్ణి. నా తండ్రి కులాభిమాని, సత్యప్రియుడు, శూరుడు, ఉదారుడు. కానీ కోపిష్టి. కొంచెం విషయలోలుడని చెప్పవచ్చు. ఎందుకంటే నలభై ఏళ్ళు గడిచాక నాలుగో పెళ్ళి చేసుకున్నారు కదా! ఆయన లంచగొండికాదనీ, ఇంటాబయటా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యాయశీలి అని ఖ్యాతి గడించారు. ఆయన సంస్థానాభిమానం సర్వవిదితం. ఆయన ప్రభువగు రాజకోటరాజును అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంటు ఒకనాడు తూలనాడే సరికి కబాగాంధీ ఆయన్ని ఎదిరించాడు. ఆ ఏజెంటుకు కోపం వచ్చింది. పొరపాటు చేశానని ఒప్పుకొని శరణువేడితే క్షమిస్తానని అన్నాడు. కాని కబాగాంధీ అందుకు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఆయన్ని కొన్ని గంటలపాటు నిర్భందించి ఉంచారు. అయినా ఆయన భయపడలేదు. ఆ తరువాత ఆయనను విడిచి పెట్టారు.

మా తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువల్లనే మాకు బహు తక్కువ ఆస్థి మిగిలింది. మా తండ్రి చదివింది అయిదవ తరగతి వరకే. చరిత్ర భూగోళం ఆయన ఎరగడు. కాని ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. వ్యవహారజ్ఞానంలో దిట్ట. చిక్కు సమస్యల్ని తేలికగా పరిష్కరించడంలో మేటి. కనుకనే వేలాదిమంది జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన వాదాలు వినడం వల్ల చాలా మంది హిందువుల వలెనే ఆయనకు ధర్మ పరిజ్ఞానం కలిగింది. మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణునిచే ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతా పారాయణం ప్రారంభించారు. ప్రతిరోజూ శ్లోకాలు పఠిస్తూ వుండేవారు.

మా అమ్మ పరమసాధ్వి. ఆ విషయం బాల్యం నుంచే నా హృదయంలో నాటుకుంది. ఈమెకు దైవచింతన అధికం. ప్రతిరోజు పూజ చేయకుండా భోజనం చేసేది కాదు. వైష్ణవ దేవాలయం వెళ్లి రావడం ఆమె నిత్య కార్యక్రమం. ఆమె చాతుర్మాస్య వ్రతం (వర్షరుతువునందు నాలుగు మాసాలు ఒక పూట భోజనం చేయు వ్రతం) మానడం నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నో కఠినమైన నోములు నోచి వాటిని నిర్విఘ్నంగా నెరవేరుస్తూవుండేది. జబ్బు చేసినప్పుడు దానిని సాకుగా తీసుకొని నోములు మానడం ఎరుగదు. ఒక పర్యాయం ఆమె చాంద్రాయణం చంద్రుని పెరుగుదలను బట్టి భోజన పరిమాణం పెంచడం, తగ్గించడం అనువ్రతం ప్రారంభించి మధ్యలో జబ్బు పడింది. జబ్బు ఏమాత్రం తగ్గలేదని నాకు గుర్తు. రెండు మూడు రోజుల ఉపవాసమంటే ఆమెకు లెక్కలేదు. చాతుర్మాస్య వ్రతపురోజుల్లో ఒక పూట మాత్రమే భుజించడం ఆమెకు అలవాటు. అంతటితో ఆగక ఒక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి ఒక రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి రోజు విడిచి రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి సూర్యుని చూచిగానీ భోజనం చేయనని నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో సూర్యదర్శనం అయిందని మా అమ్మకు చెప్పేందుకై పిల్లలమంతా సూర్యుని కోసం నిరీక్షిస్తూ డాబా మీద నిలబడి హఠాత్తుగా సూర్యుడు కనిపించినప్పుడు గబగబా మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి “అమ్మా, అమ్మా! సూర్యుడు వచ్చాడు” అని చెప్పిన రోజులు నాకు గుర్తు వున్నాయి. సూర్య దర్శనం కోసం ఆమె పరుగు పరుగున బయటకు వచ్చేది. అంతలో మాయదారి సూర్యుడు మబ్బుల చాటున దాక్కునేవాడు. “ఇవాళ నేను భోజనం చేయడం ఈశ్వరునికి యిష్టం లేదు కాబోలు అని అంటూ ఆమె సంతోషంగా వెళ్ళి ఇంటి పనుల్లో లీనమైపోయేది.

మా అమ్మకు వ్యవహారజ్ఞానం అధికం. సంస్థానానికి సంబంధించిన విషయాలు ఆమెకు బాగా తెలుసు. రాణివాసంలో గల స్త్రీలు మా అమ్మ తెలివితేటల్ని మెచ్చుకునేవారు. బాల్యం తెచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని నేను కూడా మా అమ్మ వెంట తరచు రాణివాసానికి వెళుతూ వుండేవాణ్ణి. రాజమాతకు, మా అమ్మకు మధ్య జరుగుతూ వుండే సరస సంభాషణలు ఇప్పటికీ నాకు గుర్తువున్నాయి. కబాగాంధీ పుత్తలీబాయి దంపతులకు సుదామాపురి అను పోరుబందరులో 1869 అక్టోబరు 2వ తేదీన (శుక్ల సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) నేను జన్మించాను. పోరుబందర్లో నా శైశవం గడిచింది. నన్ను బడిలో చేర్చడం నాకు గుర్తు ఉంది. ఎక్కాలు వల్లించాలంటే నాకు ఇబ్బందిగా వుండేది. అప్పుడు తోటి పిల్లలతో బాటు మా పంతుల్ని తిట్టడం తప్ప నేను నేర్చిందేమీ గుర్తులేక పోవడాన్ని తలచుకుంటే నా బుద్ధి మందమైనదనీ, నాకు జ్ఞాపకశక్తి తక్కువనీ స్పష్టంగా చెప్పవచ్చు. పిల్లలమంతా అప్పడం పాట పాడేవాళ్ళం. ఆ పాటను ఇక్కడ ఉటంకిస్తున్నాను.

ఒకటే ఒకటి అప్పడం ఒకటి
అప్పడం పచ్చి ... కొట్టో కొట్టు ...

మొదటి ఖాళీ చోట పంతులు పేరు, రెండవ ఖాళీ చోట తిట్టు వుండేవి. వాటిని వ్రాయను.