సత్యశోధన/మొదటిభాగం/25. నన్ను పట్టుకున్న పెద్ద బెంగ
25. నన్ను పట్టుకున్న పెద్ద బెంగ
బారిష్టరు అని అనిపించుకోవడం తేలికే గాని బారిష్టరీ చేయడం మాత్రం కష్టమని తోచింది. లా చదివాను గాని, వకీలు వృత్తి నేర్చుకోలేదు. లా లో అనేక ధర్మ సిద్ధాంతాలు చదివాను. అవి నాకు నచ్చాయి. కాని వాటిని వృత్తిలో ఎలా అమలుబరచాలో బోధపడలేదు. “ఇతరుల ఆస్థికి నష్టం కలుగకుండా నీ సర్వస్వాన్ని వినియోగించు” అనునది ధర్మవచనం. కాని వకీలు వృత్తికి పూనుకొని వాది విషయంలో ఈ సిద్ధాంతాన్ని ఎలా అమలుపరచగలమో బోధపడలేదు. ఈ సిద్ధాంతం అమలుబరచబడిన కేసుల వివరం చదివాను. కాని అ వివరంలో ఈ సిద్ధాంతాల్ని అమలుబరచిన ఉపాయాలు లభించలేదు.
నేను చదివిన చట్టాలలో హిందూదేశానికి సంబంధించిన చట్టాలు ఏమీ లేవు. హిందూ చట్టాలు ఇస్లాం చట్టాలు ఎలా వుంటాయో నేను తెలుసుకోలేకపోయాను. దావాలు ఎలా వేయాలో తెలియదు. పెద్ద బెంగ పట్టుకున్నది. ఫిరోజ్ షా మెహతాగారి పేరు విన్నాను. ఆయన కోర్టుల్లో సింహంలా గర్జిస్తాడని విన్నాను. ఆంగ్ల దేశంలో ఆయన ఏ విధంగా చదివారో తెలియదు. ఆయన లాంటి తెలివి ఈ జీవితంలో నాకు అబ్బదు అని అనిపించింది. ఒక వకీలుగా వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుకునేందుకు అవసరమైన భృతి సంపాదించగలనా అని అనుమానం కూడా నన్ను పట్టుకుంది,
లా చదువుతున్న రోజుల్లోనే ఈ సంశయం కలిగి బాధపడ్డాను. మిత్రులతో ఈ విషయం చెప్పాను. దాదాభాయి నౌరోజీగారి సలహా తీసుకోమని ఒక మిత్రుడు చెప్పాడు. నేను ఇంగ్లాండుకు వెళ్ళేటప్పుడు శ్రీ దాదాభాయి నౌరోజీగారి పేరిట కూడా ఒక సిఫార్సు పత్రం తీసుకువెళ్ళానని గతంలో వ్రాశాను. చాలాకాలం తరువాత నేనా ఉత్తరాన్ని బయటికి తీశాను. ఆ మహా పురుషుని దర్శించటానికి నాకు గల అధికారం ఏమిటా అని యోచించాను. వారి ఉపన్యాసం జరుగుతుందని తెలియగానే నేను ఆ సభకు వెళ్ళి ఒక మూల కూర్చొని వారిని కండ్లారా చూచి వారి ఉపన్యాసం శ్రద్ధగా చెవులారా వినేవాణ్ణి. విద్యార్థుల బాగోగులను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక సంఘం స్థాపించారు. ఆ సభలకు నేను విధిగా వెళుతూ ఉన్నాను. నౌరోజీగారు విద్యార్థుల పట్ల చూపే ప్రేమ, వాత్సల్యం విద్యార్థులు వారి యెడ చూపే శ్రద్ధాభక్తులు చూచి ఎంతో ఆనందించాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని సిఫార్సు ఉత్తరం పుచ్చుకొని వారి దగ్గరకు వెళ్ళాను. “నీ కిష్టమైనప్పుడల్లా వచ్చి నన్ను కలవవచ్చు” అని ఆయన అన్నారు. అయితే ఆ అవకాశం నేను ఉపయోగించుకోలేదు. అవసరం లేనప్పుడు వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేక ఆ సలహాను నేను అమలుచేయలేదు.
ఫెడరిక్ పిన్‌కట్ గారిని దర్శించమని ఆ మిత్రుడే సలహా యిచ్చాడో లేక మరో మిత్రుడే ఇచ్చాడో గుర్తులేదు. పిన్‌కట్‌గారు మితవాది. పూర్వాచారపరాయణుడు. భారతీయ విద్యార్థుల మీద ఆయన చూపే ప్రేమ నిర్మలం, నిస్వార్థమయం. విద్యార్థులు సలహా కోసం వారి దగ్గరకు వెళుతూ వుండేవారు. నేను కూడా వారి దర్శనం కోసం వెళ్ళాను. ఆ సంభాషణను నేను మరిచిపోలేను. ఒక మిత్రునితో సంభాషించినట్లు ఆయన నాతో మాట్లాడారు. నన్ను పట్టుకున్న బెంగను నవ్వుతూ పోగొట్టారు. “ఏమిటి? అంతా ఫిరోజ్ షా మెహతాలు అవుతారా? ఫిరోజ్‌షాలు, బదురుద్దీనులు కొద్దిమందే ఉంటారు. లాయరవడానికి గొప్పతెలివితేటలు ఉండాలని భావించకు. ప్రామాణికత్వం, శ్రద్ధ ఉంటే చాలు. తద్వారా అవసరమైనంత డబ్బు సంపాదించవచ్చు. దావాలన్నీ చిక్కులమయంగా ఉండవు అని చెప్పి, సరే, పాఠ్యపుస్తకాలు కాక ఇంకా ఇతర పుస్తకాలు ఏమేమి చదివావో చెప్పు!” అని అడిగారు. నేను చదివిన కొద్ది గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన కొంచెం నిరాశపడ్డారు. ఒక్క క్షణం సేపు అలా ఉండి చిరునవ్వు నవ్వుతూ “నీ క్షోభ నాకు అర్థం అయింది. నీకు ఇతర గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొద్దే. నీకు గల ప్రపంచజ్ఞానం కొద్దే. నీవు కనీసం హిందూ దేశచరిత్ర అయినా చదవాలి. మనిషి స్వభావం తెలుసుకోవాలి. మనిషి మొహం చూచి అతడెట్టివాడో తెలుసుకొనగలిగివుండాలి. ప్రతి హిందువు హిందూ దేశ చరిత్ర చదివి తీరాలి. లాయరుకు దానితో సంబంధం లేకపోయినా దాన్ని చదవాలి. విషయం తెలుసుకోవాలి. కే మరియు మాలెసన్‌గారు కలిసి వ్రాసిన 1857 సంవత్సరపు విప్లవ చరిత్ర కూడా నీవు చదవలేదు. వెంటనే ఆ పుస్తకం చదువు. మానవ స్వభావాన్ని గురించి తెలియజెప్పే ముఖ సాముద్రికాన్ని గురించి లావేటరు గారు, షెమ్మెల్ పెన్నిక్ గారు వ్రాసిన గ్రంథాలు సంపాదించు” అని చెప్పి ఆ గ్రంథాల పేర్లు కాగితం మీద వ్రాసి నాకు ఇచ్చారు.
వారికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఆయన ఎదుట నా భయం ఎగిరిపోయింది. కాని కాలు బయట పెట్టగానే మళ్ళీ బెంగ మొదలైంది. ముఖం చూచి మనిషి స్వభావం తెలుసుకోవడం ఎట్లా అని దారి పొడుగునా అనుకుంటూ ఆ రెండు పుస్తకాలను గురించి యోచిస్తూ ఇంటికి చేరాను. దుకాణంలో షెమ్మిల్ పెన్నిక్ గారి పుస్తకం దొరకలేదు. మర్నాడు లావేటరు గారి పుస్తకం చదివాను. అదీ స్నెల్‌గారి “ఈక్విటీ” కంటే కష్టంగా ఉంది. షేక్స్పియర్‌గారి ముఖసాముద్రికం చదివాను. కాని లండను వీధుల్లో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందికి ఎంత తిరిగినా షేక్స్పియర్‌గారు చెప్పినట్లు ముఖసాముద్రికాన్ని గురించి తెలుసుకునే ప్రావీణ్యం నాకు కలుగలేదు.
లావేటరు గారి పుస్తకం నాకు ఉపయోగపడలేదు. కాని వారి స్నేహం నాకు ఎంతో ఉపయోగపడింది. వారి నవ్వుముఖం, ఉదారాకృతి నా హృదయానికి హత్తుకున్నాయి. మంచి లాయరు అయ్యేందుకు ఫిరోజ్‌షా మెహతా గారి నైపుణ్యం, ధారణాశక్తి అవసరంలేదు. కాని ప్రామాణికత, శ్రద్ధ, కష్టపడి పనిచేసే మనస్తత్వం అవసరమని వారిచ్చిన సలహా మీద నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. దానితో కొంచెం ఆశ చిగురించింది.
కే మరియు మాలెసన్ గారు కలిసి వ్రాసిన గ్రంధాల్ని చదవలేకపోయాను. సమయం దొరికితే ముందు ముందు వారి గ్రంథాల్ని చదవాలని నిర్ణయించుకున్నాను. ఆ నా కోరిక దక్షిణాఫ్రికాలో తీరింది. నన్ను పట్టుకున్న బెంగలో కొంత ఆశారేఖ గోచరించింది. దానితో అస్సాము అను స్టీమరు ఎక్కి బొంబాయి చేరాను. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. లాంచీలో ఒడ్డుకు చేరాను.
* * *