సత్యశోధన/మొదటిభాగం/24. పట్టాపుచ్చుకున్నాను - కాని ఆ తరువాత?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search24. పట్టా పుచ్చుకున్నాను - కాని ఆ తరువాత?

బారిష్టరు పట్టాకోసం గదా నేను ఆంగ్లదేశం వెళ్ళింది? దాన్ని గురించి కొంచెం వ్రాస్తాను. అందుకు ఇది మంచి తరుణం.

బారిష్టరు పరీక్షకు రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి నిశ్చిత సమయపాలన. రెండవది - పరీక్షలు వ్రాయడం. నిశ్చిత సమయపాలనకు పట్టే సమయాన్ని పన్నెండు భాగాలుగా విభజించాలి. ఆ సమయపు ఒక్కొక్క భాగంలో జరిగే ఇరవై నాలుగు డిన్నర్లలో కనీసం ఆరు డిన్నర్లలోనైనా పాల్గొనాలి. (అంటే మూడు సంవత్సరాలకు పన్నెండు టరములు. సంవత్సరానికి నాలుగు టరములు. డిన్నర్లు తొంభై ఆరు అన్నమాట! విందుల్లో పాల్గొనడమంటే భోజనం చేయడం అని అర్థం కాదు. నిర్ణీత సమయంలో హాజరై విందు జరిగినంత సేపు ఉండటం అని అర్థం. సామాన్యంగా అంతా పక్వావ్నాలు భుజిస్తారు. కోరిన మద్యం సేవిస్తారు. ఒక్కొక్క విందు వెల రెండు మూడు పౌండ్లు. అది తక్కువే. హోటల్లో అయితే ఒక మద్యానికే అంత వెల చెల్లించవలసి వస్తుంది. నవనాగరికులు కాని హిందువులకు భోజనం కంటే, అందులో ఒక భాగమైన మద్యానికి అంత ధర వుంటుందని అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

లండనులో నాకీ విషయం తెలిసినప్పుడు త్రాగుడుకు ఇంత డబ్బు పాడుచేస్తున్నారేమిటి అని బాధ కలిగింది. తరువాత అక్కడి డిన్నర్ల విషయం అర్థమైంది. నేను ఆ డిన్నర్లలో పాల్గొని తిన్నది ఏమీ లేదు. అయితే రొట్టె, బంగాళాదుంపలు, క్యాబేజీ కూర మాత్రం తినేవాణ్ణి. ప్రారంభంలో ఇష్టం లేక వాటిని తినలేదు. రుచి మరిగిన తరువాత యింకా వడ్డించమని అడగడానికి కూడా సాహసించాను.

అక్కడ విద్యార్థులకు పెట్టే ఆహారం కంటే ఉపాధ్యాయులకు పెట్టే ఆహారం మేలుగా వుండేది. నాతోబాటు శాకాహారి ఆయిన పార్సీ యువకుడు మరొకడు వుండేవాడు. మేము శాకాహారులం. అందువల్ల ఉపాధ్యాయులకు పెట్టే శాకాహార పదార్థాల్లో కొన్ని మాకు పెట్టమని విన్నవించుకున్నాం. మా విన్నపం అంగీకరించబడింది. మాకు కూడా శాకాలు, పండ్లు లభించసాగాయి.

నలుగురు విద్యార్థుల బృందానికి రెండు మద్యం సీసాలు ఇస్తారు. నేను మద్యం త్రాగను. అందువల్ల ప్రతివారు తమ బృందంలోకి రమ్మని నన్ను ఆహ్వానించేవారు. నేను వాళ్ళ బృందంలో కలిస్తే నా భాగం కూడా వారే త్రాగొచ్చు. ప్రతి ఇరవైనాలుగు డిన్నర్లకు ఒకటి చొప్పున పెద్ద డిన్నరు ఏర్పాటు చేసేవారు. దానికి గ్రాండ్‌నైట్ అని పేరు. అప్పుడు మామూలు మద్యాలతో బాటు షాంపేన్, ఫోర్‌టువైన్, షెర్రీ మొదలుగాగల మద్యాలు కూడా ఇచ్చేవారు. ఆనాడు నాకు ప్రత్యేక ఆహ్వానాలు బ్రహ్మాండంగా లభిస్తూ ఉండేవి.

అసలు ఈ రకం డిన్నర్ల వల్ల బారిష్టరగుటకు ఏవిధంగా అర్హత చేకూరుతుందో అప్పటికీ, ఇప్పటికీ నాకు బోధపడలేదు. విద్యార్థులు వెళుతూ వుండేవారనీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంభాషణకు చర్చకు అవకాశం లభించేదనీ, అక్కడ ఉపన్యాసాలు జరిగేవనీ, వాటివల్ల కొంత లోకజ్ఞానం, కొంత నాగరికత, ఉపన్యాస సమర్థత విద్యార్థులకు కలుగుతూ వుండేదనీ వినికిడి. నా టైము వచ్చేసరికి అవన్నీ పోయాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు దూరం దూరంగా కూర్చోసాగారు. అసలు ప్రయోజనం మృగ్యమైపోయి ఆచారం మాత్రం మిగిలింది. పూర్వాచారాల మీద ఆసక్తి కలిగియుండే ఇంగ్లాండు ఆ ఆచారాన్ని వదలలేదు.

బారిష్టరు పరీక్షకు అవసరమైన పుస్తకాలు తేలిక. అందుకే బారిస్టర్లకు అక్కడ డిన్నర్ బారిష్టర్లని పేరు వచ్చింది, డిన్నర్ బారిష్టర్లంటే తిండిపోతు బారిష్టర్లని అర్థం. పరీక్షలు పేరుకు మాత్రమేనని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో రెండు పరీక్షలు జరిగేవి. అవి రోమన్ లా, కామన్ లా పరీక్షలు. ఈ పరీక్షలకు పాఠ్యగ్రంథాలు ఉండేవి. విడివిడిగా చదివి విడివిడిగా పరీక్షలు వ్రాయవచ్చు. కాని ఎవ్వరూ పాఠ్యపుస్తకాలు చదివిన పాపాన పోరు. రెండు వారాలు రోమన్‌లాటీను బట్టీవేసి పరీక్షకు కూర్చుంటారు. రెండు మూడు నెలలు కామన్‌లాటీనును బట్టి వేసి పరీక్షకు కూర్చుంటారు. అటువంటి వాళ్ళను చాలామందిని చూచాను. ప్రశ్నలు తేలిక, పరీక్షకులు ఉదార స్వభావులు. రోమన్‌లా పరీక్షార్థుల్లో నూటికి 95 నుండి 99 మంది ప్యాసయ్యేవారు. పెద్ద పరీక్షలో నూటికి 75 మంది, అంతకంటే ఎక్కువమంది ప్యాస్. అందువల్ల పరీక్షా భయంలేదు. సంవత్సరానికి పరీక్షలు నాలుగుసార్లు జరుగుతూ ఉండేవి. ఇంత అనువుగా వున్న పరీక్షలు కష్టమనిపించవు.

నేను మాత్రం పుస్తకాలన్నీ చదవాలని నిర్ణయించుకున్నాను. పాఠ్యగ్రంథాలు చదవకపోవడం మోసమని నాకు అభిప్రాయం కలిగింది. నేను ఆ పుస్తకాల కోసం డబ్బు బాగా ఖర్చు చేశాను. రోమన్ లా ను లాటిన్ భాషలో చదవదలిచాను. నేను లండన్ మెట్రిక్యులేషన్ పరీక్ష కోసం లాటిన్ భాష అభ్యసించాను. అది ఇప్పుడు బాగా ఉపకరించిది. నేను చదివిన చదువుకు విలువ లేకుండా పోలేదు. దక్షిణాఫ్రికాలో అది నాకు బాగా ఉపయోగపడింది. దక్షిణాఫ్రికాలో రోమన్ డచ్చి భాషలు ప్రామాణికం. ఈ విధంగా లాటిన్ చదువు దక్షిణాఫ్రికా దేశపు చట్టాలను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడింది.

ఇంగ్లాండు దేశపు కామన్‌లాను రాత్రింబవళ్ళు చదవడానికి నాకు తొమ్మిది నెలలు పట్టింది. బ్రూముగారి “కామన్‌లా” పెద్దది. కాని చదవడానికి బాగుండేది. కాలం మాత్రం చాలా పట్టింది. స్నెల్ గారి “ఈక్విటీ” అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. వైట్ ట్యూడర్ రచించిన “లీడింగ్ కేసెస్” అను గ్రంథంలో కొన్ని కేసులు తప్పనిసరిగా చదువతగ్గవి. ఆ గ్రంథం హృదయరంజకం, జ్ఞానదాయకం. విలియం ఎడ్వర్డ్‌గార్ల “రియల్ ప్రాపర్టీ” గుస్వ్ గారి “పర్సనల్ ప్రాపర్టీ” అని గ్రంథాలు సంతోషంతో చదివాను. విలియం గారి పుస్తకం చదవడానికి నవలగా వుంటుంది. మెయిన్‌గారి “హిందూ లా” ఎంతో అభిరుచితో చదివాను. హిందూదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఓడలో దాన్ని చదివినట్లు గుర్తు. హిందూ లా గ్రంథాన్ని గురించి విశ్లేషించడానికి ఇది తరుణం కాదు.

నేను పరీక్ష ప్యాసయ్యాను. ది 10 జూన్ 1891లో పట్టా చేతికందింది. 11వ తేదీన ఇంగ్లాండు హైకోర్టులో రెండున్నర షిల్లింగులు చెల్లించి పేరు రిజిష్టరు చేయించుకున్నాను. 12వ తేదీన ఇంటికి బయలుదేరాను.

ఇంత చదివిన తరువాత కూడా నన్ను పెద్ద బెంగ పట్టుకుంది. కోర్టులో వాదించడానికి నేను తగనని భయం వేసింది.

ఆ క్షోభను గురించి వర్ణించేందుకు మరో ప్రకరణం అవసరం.