సత్యశోధన/మొదటిభాగం/23. పెద్ద సంత

వికీసోర్స్ నుండి

23. పెద్ద సంత

1890వ సంవత్సరంలో పారిస్‌లో గొప్ప సంత జరిగింది. అందుకోసం పెద్ద ఏర్పాట్లు చేయబడుతున్నాయని పత్రికల్లో చదివాను. నాకు పారిస్ నగరం చూడాలనే కోరిక కలిగింది. రెండు పనులు కలిసి వస్తాయని భావించి పారిస్ వెళ్ళాలని నిర్ణయించాను. ఆ సంతలో ఏఫిల్ టవర్ (గోపురం) అనునది గొప్ప వింత. దాని పొడవు వేయి అడుగులు. కేవలం ఇనుముతో కట్టబడింది. ఇంకా అనేక వింతలు అక్కడ వున్నాయి. కాని ఆ గోపురం మాత్రం గొప్ప వింత. అంత ఎత్తుగల కట్టడం స్థిరంగా వుండదని అక్కడ అంతా అనుకుంటూ వుంటారు.

పారిస్‌లో శాకాహారశాల ఒకటి వున్నదని విన్నాను. అందొక గది నా కోసం ఏర్పాటు చేసుకున్నాను. ఏడురోజులు అక్కడ ఉన్నాను. తక్కువ ఖర్చుతో పారిస్ వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాను. పారిస్ నగర పటం ఒకటి, సంతకు సంబంధించిన వివరాలు తెలిపే పుస్తకం ఒకటి సంపాదించి దగ్గర పెట్టుకున్నాను. చాలా ప్రదేశాలకు నడిచే వెళ్ళాను. మ్యాపు సహాయంతో రాజవీధులకు, దర్శనీయ స్థానాలకు వెళ్ళడం తేలిక అయింది.

ఆ ప్రదర్శనశాల అంతగా గుర్తులేదు. దాని వైశాల్యం, వైవిధ్యం మాత్రం జ్ఞాపకం వున్నాయి. రెండు మూడు సార్లు ఎక్కడం వల్ల ఏఫిల్ టవర్ నాకు చక్కగా గుర్తు ఉంది. దాని మీద మొదటి మజిలీలో భోజనశాల ఉంది. అంత ఎత్తున భోజనం చేశానని చెప్పుకునేందుకుగాను దాని మొహాన ఏడు షిల్లింగులు పారవేశాను.

పారిస్ నగరంలో గల చర్చి గృహాలు జ్ఞాపకం వున్నాయి. వాటి భవ్యస్వరూపం, వాటిలోపల లభించే శాంతి మరిచిపోదామన్నా వీలులేనివి. నోటర్ డామ్ కట్టడపు పని, లోపలి చిత్తరువులు, అక్కడి చెక్కడపు పని చిరకాలం జ్ఞాపకం వుంటాయి. అట్టి విశాలమైన చర్చి దేవళాన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన వారి హృదయాంతరాళాలలో ఈశ్వర భక్తి ఎంతగా నిండి ఉందో వాటిని చూస్తే బోధపడుతుంది,

పారిస్ నగరపు ఫాషన్లను గురించి అక్కడి భోగవిలాసాల్ని గురించి చాలా చాలా చదివాను. ఇది ప్రతి వీధిలో మనకు కనబడుతుంది. కాని చర్చి దేవళాలు మాత్రం అద్భుతం. వాటిలోపల అడుగు పెట్టేసరికి బయట గొడవంతా మరిచిపోవలసిందే. మన ప్రవర్తన మారిపోతుంది. వర్జిన్ మేరీ దగ్గర మోకరించి యున్న వాళ్ళ దగ్గరగా నడిచి వెళుతున్నప్పుడు భయభక్తులు ఉత్పన్నమవుతాయి. మోకరిల్లుట, ప్రార్థించుట ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు అని ఆనాడు నాకు బోధపడింది. ఆ భావం నాలో రోజురోజుకు పెరుగుతూ వున్నది. వర్జిన్ మేరీ విగ్రహం ముందు భక్తి ప్రపత్తులతో మోకరిల్లుట రాతికి రప్పకు మోకరిల్లుట అని అనగలమా? వారుభక్తిచే తన్మయులై రాతినిగాక, దానియందలి దేవుణ్ణి కొలుస్తున్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఈ విధంగా దేవుని మహిమను తగ్గించకుండా హెచ్చించుచున్నారని నేను భావించినట్లు గుర్తు.

ఏఫిల్ టవరును గురించి రెండు మూడు మాటలు వ్రాయడం అవసరం. దాని ఉపయోగం ఏమిటో నాకు బోధపడలేదు. కొందరు దాన్ని దూషించినట్లు, కొందరు భూషించినట్లు విన్నాను. దాన్ని నిందించిన వారిలో ప్రముఖుడు టాల్‌స్టాయ్ అని గుర్తు. అతడు ఏఫిల్ టవరు మానవుని విజ్ఞానానికి గాక అజ్ఞానానికి చిహ్నం అని పేర్కొన్నాడు.

“మాదక ద్రవ్యాలలో పొగాకు కడు నీచం. దానికి అలవాటు పడినవాడు త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ళకంటే మించి నేరాలు చేస్తాడు. తాగుడువల్ల ఉన్మాదం కలుగుతుంది. కాని పొగాకు వల్ల బుద్ధి తమస్సులో పడిపోతుంది. పొగాకును ఉపయోగించేవాడు ఇలాంటి ఆకాశ సౌధాలు కట్టజూస్తాడని” టాల్‌స్టాయి చెప్పినట్లు గుర్తు. ఏఫిల్‌టవరు అట్టి వ్యసన పరిణామమే. ఏఫిల్ టవరు నందు శిల్పం లేదు. అది పారిస్‌లో ఏర్పాటు చేయబడిన గొప్ప సంతకు ఏవిధంగానూ అందం సమకూర్చి పెట్టలేదు. దాని క్రొత్తదనాన్ని, వింతకొలతల్ని చూచి జనం దాన్ని చూడటం కోసం మూగుతూ ఉంటారు. దాని మీదకు ఎక్కుతూ ఉంటారు. అది సంతలో ప్రదర్శన కోసం పెట్టబడ్డ బొమ్మ, బాలురమై వున్నంతవరకు బొమ్మలపై మోహం ఉంటుంది. ఎంతవరకు అట్టి మోహం ఉంటుందో అంతవరకు మనం బాలురమేనని ఈ ఏఫిల్ టవరు స్పష్టంగా చెబుతూ ఉంటుంది. అందుకు ఈ ఏఫిల్ టవరు ఉపయోగపడుతున్నదని చెప్పవచ్చును.