సత్యశోధన/మూడవభాగం/20. కాశీలో
20. కాశీలో
కలకత్తా నుండి రాజకోట వెళ్ళే దోవలో గల కాశీ, ఆగ్రా, జయపూర్, పాలన్పూర్ చూచుకుంటు రాజకోట చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రతిచోట ఒక్కొక్క రోజు వున్నాను. పాలన్‌పూరులో తప్ప మిగతా అన్ని చోట్ల సత్రాల్లోను పండాల ఇళ్ళల్లోను వున్నాను. ఈ ప్రయాణానికంతకు రైలు చార్జీతో సహా మొత్తం ముప్పది ఒక్క రూపాయలు మాత్రం ఖర్చు అయిందని గుర్తు. మూడవ తరగతిలో ప్రయాణం చేస్తున్నప్పటికి మైలు బండ్లు ఎక్కలేదు. వాటిలో జనం క్రిక్కిరిసి వుండటం గమనించాను. మిగతా రైళ్ళ కంటే మైలుబండ్లలో మూడవ తరగతి చార్జీకూడా ఎక్కువే. నాకది కష్టమనిపించింది,
మూడోతరగతి పెట్టెలో చెత్త చెదారం, మరుగుదొడ్ల కంపు ఇప్పుడెట్లా వున్నాయో అప్పుడు కూడా అట్లాగే వున్నాయి. కొద్దిగా మార్పులు జరిగితే జరిగియుండవచ్చు. మూడో తరగతికి, మొదటి తరగతికి చార్జీల్లో తేడావుండటమే గాక సౌకర్యాల్లో కూడా తేడా వుంది. మూడో తరగతి ప్రయాణీకులకి, గొర్రెలకి తేడా ఏమీ లేదు. ఇక్కడి బండ్లు కూడా గొర్రెలకు అనుకూలమైనవని చెప్పవచ్చును.
యూరపులో మూడోతరగతిలో ప్రయాణం చేయటమే నాకు అలవాటు. ఎట్లా వుంటాయో చూద్దామని ఒకసారి మొదటి తరగతి పెట్టె ఎక్కాను. మూడోతరగతికి మొదటి తరగతికి పెద్ద తేడా నాకు కనబడలేదు. దక్షిణ ఆఫ్రికాలో మూడో తరగతి ప్రయాణీకులంటే నీగ్రోలన్న మాట. కొన్ని పెట్టెల్లో మూడోతరగతి ప్రయాణీకులకు సౌకర్యాలు వుంటాయి. కొన్ని బండ్లలో మూడో తరగతి ప్రయాణీకులకు పడుకొనేందుకు ఏర్పాట్లు వుంటాయి. కూర్చునే చోట దిండ్లు వుంటాయి. పెట్టెల్లో సీట్లను మించి జనం ఎక్కరు. మనదేశంలో అసలే రైల్వేవారిలోట్లు ఎక్కువ. వాటితో బాటు యిటు ప్రయాణీకులు కూడా చాలా అపరిశుభ్రంగా వుంటారు. వాళ్ళ ప్రక్కన కూర్చొని ప్రయాణించడం శుచిగా వుండేవారికి చాలా కష్టం. అట్టి ప్రయాణం వాళ్లకు శిక్షయే. చాలామంది పెట్టెలోనే ఉమ్మి వేస్తూ వుంటారు. మురికి చేస్తూ వుంటారు, బీడీల పొగ సరేసరి. తమలపాకులు, పొగాకు నమిలి పిచికారీ చేస్తూ వుంటారు. బిగ్గరగా మాట్లాడుతూ వుంటారు. ప్రక్క వారికి యిబ్బందిని లెక్కచేయకుండా దుర్భాషలాడుతూ వుంటారు. ఈ విధమైన మూడోతరగతి పెట్టెల్లో ప్రయాణం చేసి చాలాసార్లు పైన తెలిపిన యాతనలన్నింటిని అనుభవించాను.
నేను 1920 లో మూడో తరగతి పెట్టెలో ప్రయాణించాను. 1915 నుండి సంవత్సరం పాటు విడవకుండా మూడో తరగతిలో ప్రయాణం చేశాను. అప్పటికి యిప్పటికీ పెద్ద భేదం నాకు కనబడలేదు. ఈ మహావ్యాధికి ఒక్కటే మందు. చదువుకున్న వాళ్లంతా మూడోతరగతిలో ప్రయాణం చేసి ప్రయాణీకుల దురభ్యాసాలను తొలగింప చేసేందుకు కృషిచేయాలి. అవసరమైన మార్పుల్ని గురించి అర్జీలు పంపించి రైలు అధికారుల్ని నిద్రపోనీయకూడదు. తమతమ సౌఖ్యాలకోసం లంచాలు యివ్వకూడదు. ఇతర అన్యాయమార్గాలను త్రొక్కకూడదు. రైలు నియమాలను అతిక్రమించకూడదు. ఈ విధంగా చేస్తే జనానికి కొద్దో గొప్పో సంస్కారం కలుగుతుందని అనుభవం వల్ల చెబుతున్నాను. నేను జబ్బుపడినందువల్ల 1920 నుండి మూడోతరగతి ప్రయాణం మానుకున్నాను. ఇందుకు నాకు సిగ్గు వేసింది. విచారం కలిగింది. మూడో తరగతి ప్రయాణీకుల ఇక్కట్లు కొద్దికొద్దిగా తగ్గి దారికి వస్తున్న తరుణంలో నాకు జబ్బు చేసి అట్టి అదృష్టం తప్పిపోయింది. రైళ్లలోను, ఓడల్లోను ప్రయాణం చేసే బీదవాళ్ళకు కలిగే చిక్కుల్ని, అసౌకర్యాలను తొలగించేందుకు అంతా కృషి చేయాలి. యిది అందరికీ సంబంధించిన ఒక స్వతంత్ర విషయం. అందుకు ఒకరిద్దరు సమర్ధులు పూనుకుంటే మేలు జరుగుతుంది.
ఇక యీ విషయం మాని కాశీ కథ చెబుతాను. ప్రాతః కాలసమయంలో కాశీలో కాలు పెట్టాను. పండా ఇంట దిగుదామని అనుకున్నాను. చాలామంది బ్రాహ్మణులు నా చుట్టూ మూగారు. వారందరిలో శుచిగా యున్న పండా యింటికి వెళదామని అనుకున్నాను. అట్టి పండాను చూచి వారి యింటికి వెళ్ళాను. ఆ పండా ఇల్లు శుచిగా వుంది. ముంగిట్లో గోవు కట్టివేయబడి వుంది. యిల్లు పరిశుభ్రంగా వుంది. మేడ మీద నా బస. యధావిధిగా గంగా స్నానం చేయాలని భావించాను. అంతవరకు అన్నం తినకుండా వుండాలని అనుకున్నాను. అవసరమైన ప్రయత్నమంతా పండా చేశాడు. ఒక రూపాయి పావలా కంటే ఎక్కువ దక్షిణ యివ్వలేనని మొదటనే పండాకు చెప్పాను. దానికి తగినట్లే చేయమని చెప్పాను. అతడు ఏమాత్రం జగడం పెట్టుకోలేదు. “ఫకీర్లకైనా పాదుషాలకైనా పూజ ఒకే రీతిగా చేయిస్తాను. యాత్రికులు వారి వారి శక్త్యానుసారం యిస్తారు. దాని కేమిటి?” అని పండా అన్నాడు. పూజా సమయంలో అతడు మంత్రాలు మింగినట్లు అనిపించలేదు. పన్నెండు గంటలకు పూజా స్నానాదులు ముగించుకొని కాశీ విశ్వనాధుని దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ చూచిన విషయాలు వాకు ఎంతో దుఃఖం కలిగించాయి.
1891వ ఏట నేను బొంబాయిలో బారిస్టరీ చేస్తున్నప్పుడు ప్రార్ధనా సమాజ మందిరంలో కాశీ యాత్రను గురించి ఒక ఉపన్యాసం విన్నాను. ఆ ప్రసంగం విని నిరాశ పడ్డాను. కాశీ వెళ్ళాను. కానీ ప్రత్యక్ష దర్శనం చేసుకొని అనుకున్న దాని కంటే అధికంగా నిరాశపడ్డాను.
జారుడుగా వున్న ఒక ఇరుకు సందులో నుండి ఆలయం లోపలికి వెళ్లాలి. అక్కడ శాంతి అనే మాటకు తావులేదు. ఎక్కడ చూచినా ఈగలు గుయ్ అంటున్నాయి. యాత్రికుల రొదకు, దుకాణాల వాళ్ల రగడకు అంతేలేదు. ధ్యానానికి, భగవచ్చింతనకు అది నిలయం. అలాంటి చోట వాటికే తావు లేదు. అయితే తమ చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో లీనమైయున్న కొంతమంది స్త్రీలను నేను చూచాను. అందుకు ఆలయ అధికారుల్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఆలయ ప్రాంతం శాంతంగా, నిర్మలంగా, సుగంధితంగా ఉంచడం ఆలయ అధికారుల విది. నేనక్కడ మోసపువర్తకులు రెండోరకం మిఠాయి అమ్ముతూ వుండటం చూచాను.
ఆలయంలో అడుగు పెట్టేసరికి గుమ్మంలో కుళ్ళిన పూలు కనబడ్డాయి. వాటినుండి దుర్గంధం వస్తూవుంది. లోపల నేలమీద చలువ రాళ్ళు పరచబడి వున్నాయి. ఆ చలవరాళ్ల మీద అంధభక్తుడొకడు రూపాయలు తాపింపచేశాడు. దానిలోకి మురికి దూరి స్థావరం ఏర్పరుచుకుంది.
‘జ్ఞానవాసి’ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఈశ్వరుడి కోసం వెతికాను. కాని వృధా. అక్కడ నా మనస్సు బాగుండలేదు. జ్ఞానవాసి దగ్గరకూడా అంతా చెడుగే. దక్షిణ యిచ్చేందుకు బుద్ధిపుట్టలేదు. అందువల్ల ఒక్క దమ్మిడీ మాత్రం అక్కడ వేశాను. ఒక పండా తిట్లుతిట్టి “నీవు ఈ విధంగా అవమానం చేస్తే నరకంలో పడతావు” అని శపించాడు. “అయ్యా, నా కర్మ ఎలా కానున్నదో కానీయండి. మీరు యిట్టి దుర్భాష నోటితో పలుకకూడదు. ఈ దమ్మిడీ తీసుకుంటే తీసుకోండి. లేకపోతే యిది కూడా మీకు దక్కదు” అని నేనన్నాను. “పో, నీ దమ్మిడీనాకు కావాలనుకున్నావా? పో, పో” అని పండా యింకో నాలుగు తిట్లు వడ్డించాడు. ఆ దమ్మిడీని తీసుకొని బయటపడ్డాను. “పండా మహాశయుడికి దమ్మిడీ నష్టం, నాకు దమ్మిడి లాభం...” అని నేను అనుకున్నాను. కాని ఆయన దమ్మిడి కూడా పోనిచ్చేరకం కాదు. అతడు నన్ను వెనక్కి పిలిచి “మంచిది. అక్కడ వుంచు, నేను నీ మాదిరిగా చేయకూడదు. నేను తీసుకోకపోతే నీకు అమంగళం కలుగుతుంది” అని అన్నాడు.
నేను మాట్లాడకుండా దమ్మిడీ అక్కడ బెట్టి తిరుగుముఖం పట్టాను.
తరువాత ఒకటి రెండు సార్లు కాశీ విశ్వనాధుని దగ్గరకు వెళ్ళాను. కాని అప్పటికి నాకు మహాత్మ బిరుదు లభించింది. కావున 1902 వ ఏట కలిగిన అనుభవం ఇప్పుడు ఎలా కలుగుతుంది? ఇప్పుడు నేనే దర్శన పాత్రుణ్ణి అయిపోయాను. యిక నాకు అప్పటిలాంటి దృశ్య దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది? మహాత్ముల కష్టాలు మహాత్ములకే ఎరుక. యిక ఆలయం విషయం. అక్కడ ఒకటే కమురుకంపు. గతంలో ఆలయం లోపల ఎలా వున్నదో ఇప్పుడూ అలాగే వుంది. ఎవరికైనా దేవుని దయ మీద సందేహం వుంటే వాళ్లిటువంటి తీర్ధ క్షేత్రాల్ని చూతురుగాక. ఆ మహాయోగి పరమేశ్వరుడు తన పేరిట జరుగుతున్న మోసం అధర్మం దుర్మార్గం అలా ఎందుకు సహిస్తున్నాడో తెలియదు.
‘యే యధా మాం ప్రపద్యంతే తాంస్తథైవభజామ్యహమ్’ ఎవరు ఎట్లా నన్ను కొలుస్తారో వారికి అట్టి ఫలం యిస్తాను. అని భగవానుడు చెప్పాడు. కర్మను ఎవడు మార్చగలడు? మధ్యన భగవానుడు తానెందుకు కల్పించుకోవాలి? ధర్మాన్ని యిలా నిర్ధారించి ఆయన అంటే భగవంతుడు అంతర్హితుడైనాడు.
నేనీ అనుభవాలు వెంట బెట్టుకొని మిసెస్ బిసెంటు దర్శనానికి వెళ్ళాను. ఆమె అప్పుడు జబ్బుపడి లేచింది. నేను వచ్చానని తెలియగానే ఆమె లోపలినుండి నన్ను చూచేందుకు బయటికి వచ్చింది. నేను కేవలం దర్శనం కోసం వచ్చాను. “మీకు ఒంట్లో బాగాలేదని విన్నాను. అందువల్ల మిమ్మల్ని చూచి వెళదామని వచ్చాను. మీకు జబ్బుగా వున్నా దర్శనం యిచ్చారు. చాలు. సంతృప్తి కలిగింది. ఇంతకంటే ఎక్కువ కష్టం మీకు కలిగించను” అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాను.