సత్యశోధన/మూడవభాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మూడవభాగం

1. తుపాను చిహ్నాలు

కుటుంబ సభ్యులతో బాటు నేను ఓడమీద ప్రయాణం చేయడం యిదే ప్రథమం. మధ్యతరగతి హిందూ కుటుంబాలల్లో బాల్యవివాహాలు జరుగుతూ వుంటాయని, భర్త చదువుకున్నవాడు గాను- భార్య నిరక్షర కుక్షిగాను వుంటుందని అనేక చోట్ల వ్రాశాను. భార్యాభర్తల జీవితంలో సముద్రమంత అంతరం వుంటుంది. భర్త భార్యకు ఉపాధ్యాయుడు అవుతాడు. నేను నా భార్యాబిడ్డల వేష భాషల మీద, ఆహార విహారాదులమీద దృష్టి సారించాను. వాళ్ళకు ఎట్లా నడుచుకోవాలో బోధించడం అవసరమని భావించాను. అప్పటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకుంటే యిప్పుడునాకు నవ్వు వస్తుంది. హిందూ స్త్రీ పతిభక్తియే తన ధర్మమని భావిస్తుంది. భర్త దేవుడని భావిస్తుంది. ఆ కారణం వల్ల భర్త ఎలా ఆడిస్తే అలా భార్య ఆడవలసి వస్తుంది.

మనం నాగరికులం అని అనిపించుకోవాలంటే తెల్లవారిని అనుకరించాలి. అలా అనుకరిస్తేనే మన పలుకుబడి పెరుగుతుంది, అలా చేయకపోతే లాభం లేదని ఆ రోజుల్లో గట్టిగా నమ్మేవాణ్ణి. యీ కారణాలవల్ల నా భార్యాబిడ్డలకు నేనే దుస్తుల్ని నిర్ణయించాను. నా పిల్లల్ని చూచి లోకులు కాఠియావాడు కోమట్లండోయ్ అని అంటే ఓర్వగలనా? పార్సీ వాళ్ళు అందరి కంటే నాగరికంగా వుంటారని ప్రతీతి. అది గమనించి నా భార్యకు, పిల్లలకు తెల్లవాళ్ల డ్రస్సు వేయకుండా పార్సీ డ్రస్సు వేయాలని నిర్ణయించాను. నా భార్యకు పారసీ పద్ధతి చీర, పిల్లలకి పారసీలకోటు, పాంట్లు, అందరికి బూట్లు, మేజోళ్ళు కొన్నాను. నాభార్యకు, పిల్లలకి కొంతకాలం దాకా ఇవి నచ్చలేదు. బూట్లు వేసుకుంటే కాళ్లు కరిచాయి. మేజోళ్ళు వేసుకుంటే చెమట. బొటనవ్రేళ్ళు బిగదీసుకు పోయాయి. వాళ్ళు వద్దన్నా నేను అంగీకరించలేదు. నామాటల్లో అధికార భావం ఎక్కువగా పనిచేసింది. అందువల్ల పాపం ఏం చేస్తారు? నా భార్య, పిల్లలు ఆ దుస్తులే ధరించారు. అదే విధంగా యిష్టం లేకపోయినా భోజనం ఇంగ్లీషువాళ్ళ విధానంలో చేయడం ప్రారంభించారు. నాకు వ్యామోహం తొలగినప్పుడు వాళ్ళు డ్రస్సు, ఫోర్కులు, ముళ్ళగరిటెలు వగైరాలు విడనాడి మామూలు పద్ధతికి వచ్చారు. ముందు వాటికి అలవాటు పడడం ఎంత కష్టమైందో, అలవాటు అయిన తరువాత వాటిని విడనాడటం కూడా అంతే కష్టమైంది. ఈ నాగరికతా వ్యామోహమనే కుబుసాన్నుండి బయటపడ్డ తరువాత ఎంతో బరువు తగ్గినట్లు అంతా భావించాము.

ఓడమీద ఎక్కడికైనా నేను వెళ్ళవచ్చు. అట్టి స్వేచ్ఛ నాకు లభించింది. ఓడ ఏ రేవులోనూ ఆగకుండా తిన్నగా నేటాలు పోతున్నది. కనుక ప్రయాణం 18 రోజులేనని తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో మేము ఒడ్డుకు చేరబోతుండగా రాబోయే తుపానుకు చిహ్నంగా, ముందుగా సముద్రంలో పెద్ద తుపాను ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో డిసెంబరు నందు వేసవి కాలం వస్తుంది. వానలు కూడా కురుస్తూవుంటాయి. ఆ కారణం వల్ల చిన్న, పెద్ద తుపాన్లు, వానలు తప్పవన్నమాట. కాని ఈ తుపాను ఎక్కువ రోజులు వీచడం వల్ల యాత్రీకులకు చాలా యిబ్బందులు కలిగాయి.

అదొక విచిత్ర మైన దృశ్యం. ఆపద సమయంలో జనం ఏకమైనారు. భేదబుద్ధి నశించింది. ఒక్క భగవంతుణ్ణే అంతా స్మరించడం ప్రారంభించారు. హిందువులు, మహమ్మదీయులు అంతా హృదయ పూర్తిగా దేవుణ్ణి స్మరించసాగారు. కొందరు ముడుపులు కట్టారు. కెప్టెను యాత్రికుల మధ్యకు వచ్చి “ఈ తుపాను పెద్దదే అయినా పరవాలేదు. నేను యింత కంటే పెద్ద తుపాన్లు చూచాను. ఓడ గట్టిదే. మునిగిపోదు. భయపడవద్దు” అని చెప్పాడు. కాని దాని వల్ల ఎవ్వరికీ ధైర్యం కలగలేదు. త్వరలోనే ఓడ చిన్నాభిన్నమైపోతున్నట్లు పెద్దగా ధ్వనులు వినబడసాగాయి. ఓడ తిరగబడిపోతున్నట్లుగా సముద్రపు కెరటాల్లో ఊగసాగింది. డెక్కు మీద ఎంతో భీభత్సంగా వున్నది. ఎవరినోట విన్నా ‘దైవస్మరణే’

ఈ స్థితి 24 గంటల సేపు వున్నదని గుర్తు. ఆ తరువాత కారు మబ్బులు విడిపోయాయి. సూర్యదర్శనం అయింది. తుపాను తొలగిపోయిందని కెప్టెను ప్రకటించాడు. యాత్రికుల ముఖాలు సంతోషంతో విప్పారాయి. అపాయం తగ్గిపోయినట్లే భగవన్నామస్మరణ కూడా తగ్గిపోయింది. మృత్యుభయం తొలగిపోయింది కదా! తిరిగి మాయ అందరినీ ఆవరించిందన్నమాట. నమాజులు ప్రారంభమైనాయి. భజనలు కూడా జరుగుతూ వున్నాయి. కానీ వీటిలో తుపాను సమయంలో గల ఏకాగ్రత లేదు.

ఈ తుపాను కారణంగా యాత్రీకులందరితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. నాకు తుపానంటే భయం కలగలేదు. భయం కలిగినా అది బహుతక్కువే. అటువంటి తుపాన్లు అదివరకు చాలా చూచాను. సముద్రయానంలో జబ్బుపడను. అందువల్ల ధైర్యం వహించి ఓడలో అటుయిటు తిరుగుతూ యాత్రీకులను ఓదారుస్తూ వున్నాను. ఈ స్నేహబంధం నాకు ఎంతో ఉపయోగ పడిందని చెప్పగలను.

ఓడ డిసెంబరు పద్దెనిమిదో తేదీనో, లేక పందొమ్మిదవ తేదీనో డర్బను రేవులో లంగరు వేసింది. నాదరీ ఓడకూడా ఆరోజే చేరుకున్నది. కాని నిజమైన తుపాను యిక ముందు రాబోతున్నదని అప్పటికి నాకు తెలియదు. 

2. తుపాను

డిసెంబరు పద్దెనిమిదవ తేదీనాడు టోయిటోలో రెండు ఓడలు లంగరు వేశాయి. దక్షిణ ఆఫ్రికా రేవుల్లో డాక్టరు వచ్చి ప్రతి యాత్రికుణ్ణి జాగ్రత్తగా పరీక్ష చేస్తాడు. దారిలో ఎవరికైనా అంటురోగం పట్టుకుంటే వాళ్ళను ఓడ యొక్క క్వారంటీనులో ఉంచుతారు. మేము బొంబాయి నుండి బయలుదేరినప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి వున్నది. అందువల్ల మాకు క్వారంటీను బాధ తప్పదని కొంచెం భయపడ్డాము. రేవులో లంగరు వేశాక ప్రప్రథమంగా ఓడ మీద పచ్చ జెండా ఎగురవేస్తారు. డాక్టరు పరీక్షించి చీటీ యిచ్చేదాక పచ్చజెండా ఎగురుతూ వుంటుంది. పచ్చ జండాను దింపి వేసిన తరువాతనే బయటివాళ్ళను ఓడ మీదికి రానిస్తారు. ఆ నియమం ప్రకారం మా ఓడమీద కూడా పచ్చజండా ఎగరవేశారు. డాక్టరు వచ్చి అయిదు రోజులు క్వారంటీను అని ఆదేశించాడు. ప్లేగుక్రిములు ఇరవైమూడు దినాలు జీవించి వుంటాయని వారి ఉద్దేశ్యం. మేము బొంబాయి నుండి బయలు దేరి పద్దెనిమిది రోజులు గడిచాయి. కనుక యింకా అయిదు రోజులు ఓడ మీద వుంటే ఇరవై మూడు రోజులు పూర్తి అవుతాయని వాళ్ల అభిప్రాయం.

కానీ మమ్మల్ని క్వారంటీనులో వుంచటానికి మరోకారణం కూడా వున్నది. డర్బనులోని తెల్లవాళ్ళు మమ్మల్ని తిరిగి ఇండియాకు పంపివేసేందుకై పాతాళహోమం ప్రారంభించారు. ఈ ఆదేశానికి అదికూడా ఒక కారణం.

దాదా అబ్దుల్లా కంపెనీ వారు పట్టణంలో జరుగుతున్న వ్యవహారాలను గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూవున్నారు. తెల్లవాళ్ళు ఒకనాటి కంటే మరొకనాడు పెద్ద పెద్ద సభలు జరుపుతూ జనాన్ని రెచ్చగొడుతూ వున్నారని తెలిసింది. అబ్దుల్లా గారిని ఒకవంక భయపెడుతూ, మరోవంక లాలిస్తూ వున్నారట. ఈ రెండు ఓడల్ని తిరిగి ఇండియాకు పంపివేస్తే నష్టమంతా చెల్లించివేస్తామని కూడా చెప్పారట. దాదా అబ్దుల్లా యిట్టి బెదిరింపులకు బెదిరే రకం కాదు. అప్పుడు భాగస్వాములైన సేఠ్ అబ్దుల్ కరీం హాజీ ఆదం గారు కంపెనీ తరఫున వ్యవహర్తలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఓడలను రేవుకు చేర్చి యాత్రికులనందరినీ దింపి తీరతానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఏనాటికానాడు జరుగుతున్న వ్యవహారాలను ఆయన పూసగుచ్చినట్లు నాకు తెలియచేస్తూ వున్నాడు. కీర్తి శేషులు మన సుఖలాల్ హీరాలాల్ నాజరుగారు నన్ను చూచేందుకు అదృష్టవశాత్తు డర్బను విచ్చేశారు. వారు చాలా చతురులు, వీరులు కూడా. జనం వారి సలహాలను పాటిస్తూవుంటారు, వారి వకీలు మిస్టర్ లాటిన్. వారుకూడా అంతటి వారే. వారు తెల్లవారి చేష్టల్ని ఖండించారు. కేవలం డబ్బు పుచ్చుకునే వకీలువలె గాక నిజమైన మిత్రునివలె వారికి సహాయం చేస్తున్నారు

ఈ విధంగా డర్బనులో ద్వంద్వయుద్ధం ప్రారంభమైందన్నమాట. ఒకవంక కూటికి లేని నల్లవాళ్లు, మరొకవంక వీరికి మిత్రులైన కొందరు తెల్లవాళ్ళు వేరొకవంక ధనబలం, కండబలం, అక్షరబలం, సంఖ్యాబలం కలిగిన తెల్లవాళ్లు. అంతటి బలవంతులైన తెల్లవారికి ప్రభుత్వబలం కూడా తోడుగా వున్నది. నేటాలు ప్రభుత్వం వీరికి బహిరంగంగా తోడ్పడుతూ వున్నది. స్వయంగా హారీ ఎస్కాంబీగారు వారి సభలో పాల్గొని బహిరంగంగా వత్తాసు పలకడంతో వాళ్లు హద్దు దాటిపోయారు.

కావున మా క్వారంటీను కేవలం ఆరోగ్యానికి సంబంధించింది కాదని తేలిపోయింది. యాత్రీకుల్ని ఏజంటును భయపెట్టి ఏదో విధంగా ఓడల్ని తిరిగి, పంపివేయడమే వాళ్ల ముఖ్యోద్దేశం. “మీరు తిరిగి వెళ్ళిపోండి. లేకపోతే సముద్రంలో ముంచి వేస్తాం. తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ యిచ్చివేస్తాం” అని మమ్ము హెచ్చరించడం ప్రారంభించారు.

నేను యాత్రికుల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పసాగాను. నాదరీ ఓడయందలి యాత్రికులకు కూడా ధైర్యంగా వుండమని, భయపడవద్దని సమాచారం పంపించాను.

యాత్రీకుల వినోదం కోసం ఓడల్లో రకరకాల ఆటలు ఏర్పాటు చేశాం. క్రిస్‌మస్ పండుగ కూడా వచ్చింది. కెప్టెను యాత్రికులందరికీ డిన్నరు యిచ్చాడు. అందు మేము, మా పిల్లలం ముఖ్యులం. భోజనాశాల తరువాత ఉపన్యాసాలు సాగాయి. నేను పాశ్చాత్య నాగరికతను గురించి ప్రసంగించాను. అది గంభీరోపన్యాసానికి తగిన సమయం కాదని నాకు తెలుసు. కాని మరో విధంగా ప్రసంగించడం నా వల్లకాని పని. నేను వినోదంగాను, ప్రమోదంగాను మాట్లాడాను. కాని నా మనస్సంతా డర్బనులో జరుగుతున్న సంగ్రామం మీద కేంద్రీకరించి యున్నది. అందుకు ముఖ్య కారణం, యీ సంగ్రామానికి కేంద్రబిందువును నేనే. నామీద క్రింద తెలిసిన రెండు నేరాలు మోపారు.

  1. నేను భారతదేశంలో పర్యటించి నేటాలులోగల తెల్లవారిని అనుచితంగా నిందించాను
  2. నేను నేటాలును భారతీయులతో నింపివేయాలని చూస్తున్నాను. అందుకోసం కురలేండు, నాదరీ ఓడలనిండా ఎంతోమందిని తీసుకు వస్తున్నాను.

నాకు విషయం బోధపడింది. నావల్ల దాదా అబ్దుల్లా గారికి పెద్ద అపాయం కలుగనున్నదని స్పష్టంగా తేలిపోయింది. నేను ఒంటరిగా రాక నా భార్యను, పిల్లల్ని కూడా వెంట తీసుకొని వచ్చి వాళ్ళను ప్రమాదంలో పడవేశాను.

నిజానికి నేను నిర్దోషిని. నేను ఎవ్వరనీ నేటాలు రమ్మని ప్రోత్సహించలేదు. నాదరీయందలి యాత్రికుల్ని అప్పటివరకు నేను ఎరుగను. కురలేండు యందలి యిద్దరి ముగ్గురి పేర్లు తప్ప మిగతావారి పేర్లు కూడా నేను ఎరగను. నేటాలులో చెప్పిన మాటలే భారతదేశంలో కూడా చెప్పాను. అంతకంటే మించి ఒక్క మాట కూడా నేను అనలేదు. నేను చెప్పిన ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యం వున్నది.

ఏ సంస్కారానికి నేటాలు యందలి తెల్లవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఏ స్థాయిలో వారు వ్యవహరిస్తున్నారో ఆ వివరం తెలుసుకొన్న మీదట విచారం కలిగింది. దాన్ని గురించి బాగా యోచించాను. ఆ విషయం నలుగురి ముందు ప్రసంగించాను. మిగతా వారికి నా అభిప్రాయం తెలియకపోయినా, కెప్టెన్‌గారికీ, తదితరులకు నా అభిప్రాయం బోధపడింది. అందువల్ల వారి జీవితంలో ఏమైనా మార్పు కలిగిందో లేదో తెలియదు. ఆ తరువాత తెల్లవారి సంస్కారాల్ని గురించి కెప్టెను మొదలగు వారితో చాలా సేపు చర్చ జరిగింది. నేను పాశ్చాత్య సంస్కారం హింసాపూరితం అని చెప్పాను. నా మాటలకు తెల్లవారు కొందరు ఆవేశపడ్డారు కూడా.

“తెల్లవారి బెదిరింపులు కార్యరూపం దాలిస్తే మీరు అహింసా సిద్ధాంతాన్ని ఎలా అనుసరిస్తారు” అని కెప్టెను ప్రశ్నించాడు. “వీరిని క్షమించుటకు, వీరిపై చర్చ గైకొనకుండుటకు అవసరమైన శక్తిని పరమేశ్వరుడు నాకు ప్రసాదించుననే ఆశ నాకున్నది. ఇప్పటికీ వీరి మీద నాకు రోషం లేదు. వారి అజ్ఞానం, వారి సంకుచిత దృష్టి చూస్తే నాకు జాలి కలుగుతున్నది. తాము చేస్తున్నదంతా సముచితమే అని వారు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందువల్ల కోపం తెచ్చుకునేందుకు కారణం నాకు కనబడటం లేదు” అని జవాబిచ్చాను. అక్కడి వారంతా నవ్వారు. వారికి నా మాటలమీద విశ్వాసం కలగలేదన్నమాట.

ఈ విధంగా రోజులు కష్టంగా గడిచాయి. క్వారంటీను నుండి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ఆఫీసరును అడిగితే “ఈ విషయం నా చేతులు దాటింది. ప్రభుత్వం ఆదేశించగానే మిమ్ము దింపివేస్తాం” అని సమాధానం యిచ్చాడు. ఇంతలో కడపటిసారిగా “మీరు ప్రాణాలు దక్కించుకోదలిస్తే మాకు లొంగిపోండి” అని తెల్లవారు హెచ్చరిక పంపారు. అందుకు సమాధానంగా “నేటాలు రేవులో దిగుటకు మాకు హక్కు వున్నది. ఎన్ని అపాయాలు వచ్చినా మా హక్కును కాపాడుకొంటాం” అని నేను, సహయాత్రికులం సమాధానం పంపించాం. ఇరవై మూడు రోజులు గడిచిపోయాయి. జనవరి 13 వతేదీనాడు ఓడలు రేవులోకి ప్రవేశించవచ్చని ఆదేశం యివ్వబడింది. యాత్రికులు రేవులో దిగవచ్చని కూడా ఆ ఆదేశంలో పేర్కొనబడింది.

3. ఒరిపిడి

ఓడలు రేవుకి చేరాయి. యాత్రికులంతా దిగిపోయారు. “తెల్లవాళ్ళు గాంధీమీద మండిపడుతున్నారు. వారి ప్రాణాలకు అపాయం కలుగవచ్చు. కనుక గాంధీని, వారి కుటుంబ సభ్యుల్ని రాత్రిపూట ఓడనుండి దింపండి. రేవు సూపరిండెంట్ టేటమ్ గారు రాత్రిపూట వాళ్ళను ఇంటికి భద్రంగా తీసుకు వెళతారు” అని ఎస్కాంబీగారు ఓడ కెప్టెనుకు కబురు పంపారు.

కెప్టెను నాకీ సందేశం అందజేశారు. నేను అందుకు అంగీకరించాను. ఈ సందేశం అంది అరగంట గడిచిందో లేదో టాటన్ గారు వచ్చి కెప్టెనుతో ఇలా అన్నాడు “గాంధీగారు నాతో రాదలచుకుంటే నా జవాబుదారీమీద వారిని తీసుకువెళతాను. గాంధీ గారిని గూర్చి ఎస్కాంబీగారు పంపిన సందేశాన్ని మీరు పాటించనవసరం లేదు. ఈ ఓడల యజమాని యొక్క వకీలు హోదాతో నేను చెబుతున్నాను” ఆ తరువాత ఆయన నా దగ్గరికి వచ్చి “మీకు ప్రాణాలంటే భయం లేకపోతే మీ భార్యాపిల్లల్ని బండిమీద రుస్తుంగారింటికి పంపించి, మనమిద్దరం కాలినడకన నడిచి వెళదాం. మీ మీద ఈగ కూడా వాలదని నా విశ్వాసం. ఇప్పుడు అంతటా శాంతి నెలకొని వుంది. తెల్లవారంతా వెళ్ళి పోయారు. మీరు దొంగవాడిలా చాటుగా వెళ్ళడం నాకిష్టంలేదు” అని అన్నాడు. నేను అందుకు సమ్మతించాను. నా భార్యాపిల్లలు ఏ బాధలేకుండా రుస్తుంజీ సేఠ్ గారింటికి చేరారు. నేను కెప్టెన్‌గారి దగ్గర సెలవు తీసుకొని లాటన్ గారితో పాటు ఓడదిగి రుస్తుంజీసేఠ్ గారి ఇంటికి బయలుదేరాను. వారి ఇల్లు అక్కడికి రెండు మైళ్ళ దూరాన వున్నది.

మేము ఓడనించి దిగేసరికి కొంతమంది తెల్లదొరల పిల్లలు గాంధీ గాంధీ అంటూ అరుస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అయిదారుగురు చుట్టూ మూగి గాంధీ గాంధీ అని పెద్దగా అరవడం ప్రారంభించారు. లాటన్‌గారు గుంపు పెరుగుతుందేమోనని భావించి రిక్షావాణ్ణి పిలిచారు. రిక్షా ఎక్కడం నాకు యిష్టం లేకపోయినా రిక్షా ఎక్కడానికి సిద్ధపడ్డాను. కాని తెల్లవాళ్లు రిక్షావాణ్ణి చంపివేస్తామని బెదిరించేసరికి అతడు పారిపోయాడు. మేము ముందుకు సాగుతూ వుంటే గుంపు పెరిగి పోసాగింది. నడవడానికి చోటు లేదు. ముందుగా వాళ్ళు నన్ను, లాటన్ గారిని విడగొట్టి వేరుచేశారు. తరువాత నామీద రాళ్ళు, మురిగిపోయిన గ్రుడ్లు విసరడం ప్రారంభించారు. ఎవడో నా తలపాగాను ఎగరగొట్టాడు. కొందరు నన్ను కొట్టడం ప్రారంభించారు. నన్ను క్రిందికి పడత్రోశారు. నాకు స్మృతి తప్పింది. దగ్గరలోనేగల ఇంటి చువ్వలు పట్టుకొని నిలబడ్డాను. అలా నిలవడం కూడా కష్టమైపోయింది. ఇంకా దెబ్బలు తగులుతూనే వున్నాయి.

ఇంతలో అటు పోలీసు సూపరింటెండెంట్ గారి భార్య హఠాత్తుగా వచ్చింది. ఆమె నన్ను ఎరుగును. ఆమె ధైర్యవంతురాలు. త్వరగా వచ్చి నా దగ్గర నిలబడింది. అప్పుడు ఎండలేదు. అయినా ఆమె గొడుగు తెరిచి నాపై పట్టింది. దానితో గుంపు కొంచెం ఆగింది. నన్ను కొట్టాలంటే ముందు ఆమెను కొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆవిధంగా నన్ను ఆమె కమ్మి వేసింది.

ఇంతలో ఒక భారతీయుడు ఇదంతా చూచి పరుగెత్తుకొని పోలీసు ఠాణాకు వెళ్లి సమాచారం అందజేశాడు. పోలీసు సూపరింటెండెంటు నన్ను రక్షించడంకోసం కొంతమంది పోలీసుల్ని పంపించాడు. వారు త్వరగా అక్కడికి చేరుకున్నారు దారిలోనే పోలీసుఠాణా వున్నది. నన్ను ఠాణాలో ఆశ్రయం పొందమని సూపరింటెండెంటు అన్నాడు. నేను అందుకు అంగీకరించలేదు. వారి తప్పు తెలుసుకొని వారే మౌనం వహిస్తారు. వారికి న్యాయబుద్ధికలుగగలదను విశ్వాసం నాకు వున్నది.” అని కృతజ్ఞతతో బదులు చెప్పాను. పోలీసులు నా వెంట వచ్చారు. వారి రక్షణ వల్ల మరేమీ హాని కలుగలేదు. రుస్తుంజీ గారి ఇంటికి చేరాను. నిజంగా నాకు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒక చోట పెద్ద గాయం అయింది. ఓడ వైద్యులు దాదీ బరజోర్ గారు అక్కడే వున్నారు. వారు ఓపికతో నాకు సేవ చేశారు.

లోపల శాంతిగానే వున్నది. కాని బయట గొడవ ఎక్కువైంది. తెల్లవాళ్ళు ఇంటి ముందు ప్రోగై “గాంధీని మాకు అప్పగించండి” అని గొడవ చేయడం ప్రారంభించారు. పోలీసు సూపరింటెండెంటు అక్కడికి వచ్చాడు. ఇదంతా చూచి గొడవ చేస్తున్న వాళ్లనెవ్వరినీ ఏమీ అనకుండా వాళ్లందరికీ తలా ఒక మాట చెబుతూ వాళ్ళను అక్కడే నిలబెట్టివేశాడు.

అయినా ఆయన చింతాముక్తుడు కాలేదు. లోపలికి తన మనిషిని పంపి “గాంధీ! నీ మిత్రుని ధనం, ప్రాణం, గృహం, నీ భార్య, నీ బిడ్డలు మరియు నీ ప్రాణం దక్కాలంటే వెంటనే మారువేషంతో ఇల్లు విడిచి వెళ్ళిపొండి” అని వార్త పంపాడు

ఒకే రోజున పరస్పర విరుద్ధమైన రెండు పరిస్థితులు నాకు తటస్థపడ్డాయి. ప్రాణభయం కేవలం కల్పితం అని భావించి లాటనుగారు నన్ను బహిరంగంగా రమ్మన్నాడు. అందుకు నేను అంగీకరించాను. కాని యిప్పుడు ప్రాణభయం ఎదురుగా కనబడుతున్నది. మరో మిత్రుడు అందుకు విరుద్ధంగా సలహా యిస్తున్నాడు. దీనికి నేను సమ్మతించాను. నా ప్రాణాలకు ముప్పు వాటిల్లు నను భయంతో, మిత్రునికి అపాయం కలుగునను భయంతో, నా భార్యా బిడ్డలకు ప్రమాదం కలుగునను భయంతో నేను సమ్మతించానని ఎవరు అనగలరు? మొదట నేను ధైర్యంతో ఓడ దిగి గుంపును ఎదుర్కోవడం. తరువాత మారు వేషంలో తప్పించుకొని వెళ్ళిపోవడం రెండూ ఒప్పిదాలే అని ఎవరు అనగలరు? అయితే ఆయా విషయాల యోగ్యతలను నిర్ణయించడం అనవసరం. ఈ విషయాలను పరిశీలించి, యిందువల్ల నేర్చుకోవలసింది ఏమైనా వుంటే నేర్చుకోవడమే మంచిది. ఒకడు ఒక్కొక్క సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో చెప్పడం కష్టం. మానవుని బాహ్యాచరణను మాత్రం గమనించి అతని గుణగణాల్ని నిర్ణయించడం సరికాదని, అది అసమగ్రమని మనం గ్రహించాలి.

ఇక నేను పలాయనానికి పూనుకొన్నాను. దెబ్బల బాధ మరచిపోయాను. నల్లపోలీసు వేషం వేశాను. తలపై దెబ్బలు తగులకుండా ఇత్తడి సిబ్బి పెట్టుకొని దాని మీద మద్రాసు ఉత్తరీయం తలపాగాగా చుట్టి బయలుదేరాను. నావెంట యిద్దరు పోలీసు గూఢచారులు వున్నారు. అందొకడు భారతీయ వర్తకుని వేషం వేశాడు లేక భారతీయుడుగా కనబడేందుకు ముఖాన రంగుపులుముకున్నాడని చెప్పవచ్చు. మరొకడు ఏం వేషం వేశాడో నాకు గుర్తులేదు. ప్రక్క సందుగుండా వెళ్లి ఒక దుకాణం చేరుకున్నాం. ఆ దుకాణం గిడ్డంగిలో గల బస్తాల మధ్యగా దారి చేసుకొని వెళ్లి దుకాణం ద్వారం దాటి గుంపుకు దొరక్కుండా బయట పడ్డాం. వీధి చివర నాకోసం బండి సిద్ధంగా వున్నది. ఆ బండి ఎక్కి పోలీసు ఠాణా చేరుకున్నాము. నేను సూపరింటెండెంటుగారికి, పోలీసు గూఢచారులికి ధన్యవాదాలు అర్పించాను.

ఒక వంక నేను గుంపును తప్పించుకు పోతూవుంటే మరోవంక సూపరిండెంట్ అలెగ్జాండరుగారు. “పదండి ముందుకు పట్టుకువద్దాం చెట్టు కొమ్మకు వేలాడతీద్దాం” అని పాట పాడుతూ జనాన్ని ఆపుతూ వున్నాడు. నేను పోలీసు స్టేషనుకు సురక్షితంగా చేరానను వార్త అందగానే అలెగ్జాండర్ స్వరం మార్చి “ఏమండోయ్! లేడి పారిపోయింది యిక పదండి మీమీ ఇండ్లకు” అని జనాన్ని నిరుత్సాహపరచడం ప్రారంభించాడు. దానితో కొందరికి కోపం వచ్చింది. కొందరికి నవ్వు వచ్చింది. చాలామంది ఆయన మాటల్ని నమ్మలేదు. “అయితే మీలో కొందరు లోపలికి వెళ్ళి చూచి రండి. గాంధీ వుంటే మీకు అప్పగిస్తాను. లేకపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరెవ్వరు రుస్తుంజీ గృహానికి నష్టం కలిగించరని, గాంధీ భార్యా బిడ్డల జోలికి పోరని నాకు తెలుసు” అని అన్నాడు.

జనంలో నుండి యిద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళి చూచి బయటకి వచ్చి గాంధీ లేడని జనానికి చెప్పారు. కొందరు అలెగ్జాండరును భూషించారు. కొందరు దూషించారు. ఇక చేసేదేమీ లేక అంతా ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. కీ.శే. చేంబర్లేను గారు గాంధీని కొట్టిన వాళ్ళను శిక్షించమని నేటాలు ప్రభుత్వానికి తంతి పంపారు. ఎస్కాంబీగారు నన్ను పిలిపించారు. నాకు తగిలిన దెబ్బలకు విచారం ప్రకటించారు. మీ వెంట్రుకకు హాని కలిగినా నేను సహించను. లాటనుగారు చెప్పిన ప్రకారం నడుచుకోక, నేను చెప్పిన ప్రకారం నడుచుకొనియుంటే అసలు ఈ దుఃఖకరమైన ఘట్టం జరిగేదేకాదు. ఘాతకుల్ని మీరు గుర్తించితే వాళ్ళను నిర్భందించి శిక్షిస్తాం. చేంబర్లేనుగారు కూడా అలాంటి తంతి పంపించాడు అని అన్నారు.

“ఎవ్వరిమీద కేసు పెట్టడం నాకు యిష్టం లేదు. ఆ జనంలో ఇద్దరు ముగ్గురిని గుర్తు పట్టగలను. కాని వారిని శిక్షిస్తే నాకేమి లాభం? వారిని దోషులని నేను అనను. హిందూ దేశంలో నేను తెల్లవారిని నోటికి వచ్చినట్లు నిందించానని, లేనిపోని మాటలు చెప్పి ఎవరో వారిని రెచ్చకొట్టారు. అట్టి వారి మాటలు నమ్మి వారు రెచ్చిపోయారు. ఇందు వారి తప్పు ఏమీ లేదని భావిస్తున్నాను. అసలు దీనికంతటికీ కారకులు మీ నాయకులు, మన్నించండి. మీరే యిందుకు బాధ్యులు. మీరు ప్రజలను సరియైన మార్గాన నడిపించాలి. అట్టిమీరే రూటరు మాట నమ్మి నాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నేనేదో ఇండియాలో చేశానని విచారించకుండా మీరు వ్యవహరించారు. తత్ఫలితమే యీ కాండ. అందువల్ల నేనెవ్వరినీ శిక్షించతలచలేదు. నిజం తెలిసినప్పుడు వారు తప్పక పశ్చాత్తాప పడతారనే విశ్వాసం. నాకు వున్నది.” అని నేను అన్నాను.

‘అయితే ఈ మాటలే వ్రాసి యివ్వండి. మీరు వ్రాసి యిచ్చే మాటలు చేంబర్లేను గారికి తంతిద్వారా తెలియజేస్తాను. తొందరపడి వ్రాసిమ్మని నేను కోరాను. లాటనుగారితోను, తదితర మిత్రులతోను సంప్రదించి ఏది ఉచితమో అదే చేయండి. మీరు ఘాతకులపై కేసు పెట్టని ఎడల అందరినీ సులువుగా శాంతింప చేయవచ్చు. ఆ విధంగా చేస్తే మీ గౌరవ ప్రతిష్టలు తప్పక పెరుగుతాయి’ అని ఎస్కాంబీగారు అన్నారు.

“ఈ విషయంలో నా మాట ఖాయం. మీ దగ్గరకు రాకముందే నేను యిట్టి నిర్ణయానికి వచ్చాను. నన్ను కొట్టిన వారిమీద కేసు పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు కోరిన ప్రకారం ఇప్పుడే వ్రాసి యిస్తాను” అని చెప్పి అవసరమైన పత్రం వ్రాసి వారికి యిచ్చి వేశాను.

4. శాంతి

ఆ రోజున నా మీద దాడి జరిగిన తరువాత నేను పోలీసు స్టేషను చేరాను. అక్కడ రెండు రోజులు పున్నాను. నా వెంట యిద్దరు పోలీసులు రక్షణ కోసం వున్నారు. తరువాత ఎస్కాంబీగారిని కలుసుకునేందుకు వెళ్ళాను. అప్పటికి పోలీసుల కాపలా అవసరం లేకుండా పోయింది.

నేను ఓడ దిగిన రోజున అనగా పచ్చజెండా దింపిన రోజున నేటాల్ అడ్వర్‌టైజర్ పత్రికా ప్రతినిధి వడివడిగా వచ్చి నన్ను కలిసి మాట్లాడాడు. అనేక ప్రశ్నలు వేశాడు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం యిచ్చాను. సర్ ఫిరోజ్ షా మెహతాగారి సలహా ప్రకారం హిందూ దేశంలో నేను యిచ్చిన ఉపన్యాసాలన్నీ ముద్రింపబడి వున్నాయి. వాటన్నింటిని నేను అతనికి యిచ్చాను. దక్షిణ - ఆఫ్రికాలో నేను అదివరకు చెప్పిన మాటల్నే హిందూదేశంలో కూడా చెప్పాను. అంతకు మించి ఒక్కమాట అయినా అదనంగా చెప్పలేదని రుజూచేశాను. కురలేండ్, నాదరి ఓడల్లో వచ్చిన వారితో నాకు ఏవిధమైన సంబంధం లేదని స్పష్టం చేశాను. వారిలో చాలామంది నేటాలులో నివసిస్తున్న వారే. మిగిలిన వారు నేటాల్లో ఆగరు. వారు ట్రాన్సువాలు వెళతారు. ఆ సమయంలో నేటాల్లో పనులు తక్కువ. ట్రాన్సువాల్లో పనులు ఎక్కువ. అక్కడ ఆదాయం అధికంగా లభిస్తున్నది. అందువల్ల ఎక్కువ మంది భారతీయులు అక్కడికి వెళ్ళుతూ వున్నారు.

పత్రికా ప్రతినిధితో జరిగిన నా సంభాషణంతా పత్రికల్లో ప్రకటింపబడింది. నన్ను కొట్టినవారి మీద కేసు పెట్టనని సవివరంగా చెప్పిన మాటలు కూడా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. దానితో తెల్లవారు తలలు వంచుకున్నారు. పత్రికలు నన్ను నిర్దోషి అని ప్రకటించాయి. దుండగుల దుందుడుకుతనాన్ని ఖండించాయి. చివరికి ఈ విధంగా ఆ ఘట్టం వల్ల నాకు లాభం కలిగిందన్నమాట. దీనివల్ల భారతీయుల గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. నా మార్గం సుగమం అయింది. మూడు నాలుగు రోజులకు ఇంటికి చేరాను. నా కార్యక్రమాలు ప్రారంభించాను. ఈ ఘట్టం వల్ల నా వకాలతు కూడా పెరిగింది.

ఒకవైపున భారతీయుల ప్రతిష్ట పెరిగిందే కాని మరో వైపున వారి యెడ తెల్లవారిలో ద్వేషం కూడా పెరిగింది. భారతీయుడు పౌరుషవంతుడని తెల్లవారికి తెలిసింది. దానితో భారతీయులంటే తెల్లవారికి భయం ప్రారంభమైంది. నేటాలు లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండు చట్టాలు ప్యాసయ్యాయి. భారతీయులకు కష్టాలు కలిగించేవిగా అవి వున్నాయి. ఒక చట్టం భారతీయుల వ్యాపారానికి హాని కలిగిస్తుంది. రెండోది వలస వచ్చే వారికి హాని కలిగిస్తుంది. వోటు హక్కు కోసం మేము చేసిన కృషి దేవుని దయవల్ల కొంత ఫలించింది. “భారతీయులకు వ్యతిరేకంగా, అనగా భారతీయుడైనంత మాత్రాన వానికి ఏ చట్టమూ వర్తించబడకూడదు” అంటే “చట్టానికి జాతి భేదం వర్ణభేదం ఉండరాదు” అని నిర్ణయం చేశారు. యీ నిర్ణయం భారతీయులకు కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే పై రెండు చట్టాల్లోను ఉపయోగించబడిన భాష పైకి మెత్తగా వున్నా, లోపల మాత్రం భారతీయుల హక్కుల్ని కుంచింపజేసే విధంగా కరుకుగా వున్నది,

ఈ రెండు చట్టాలు నా పనిని పెంచి వేశాయి. భారతీయుల్లో జాగృతి కలిగించాయి. భారతీయులందరకీ యీ చట్టాల ఉద్దేశ్యం స్పష్టంగా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో వాటిని అన్ని భాషల్లోకి అనువదించాము. ఇంగ్లాండుకు అర్జీలు పంపించాము. కాని చట్టాలు మాత్రం మంజూరయ్యాయి. నా సమయమంతా సార్వజనిక కార్యక్రమాలకే సరిపోతున్నది. మన్‌సుఖలాల్ నాజర్ గారు నేటాల్లో వున్నారని గతంలో తెలియజేశాను. వారు మా ఇంట్లో ఉండేందుకై వచ్చి ఆ పనుల్ని చూడటం ప్రారంభించారు. అందువల్ల నా పని భారం కొద్దిగా తగ్గినది.

నేను దక్షిణ - ఆఫ్రికాలో లేనప్పుడు ఆదంజీ మియాఖాన్ గారు తమ విధిని సక్రమంగా నిర్వహించారు. వారి సమయంలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. యాత్రీకుల్ని రానీయకుండా చేసే యత్నాన్ని, భారతీయుల వ్యతిరేక చట్టాల్ని ఎదుర్కునేందుకు ఎక్కువ ధనం సమకూర్చాలని నిర్ణయించాం. తత్ఫలితంగా 5000 పౌండ్ల ధనం వసూలైంది. కాంగ్రెస్ కోశానికి స్థిరత్వం చేకూరితే ఆ సొమ్ముతో కొంత ఆస్థి కొని, దాని వల్ల వచ్చే ఆదాయంతో కాంగ్రెస్‌ను ఆర్ధికంగా తీర్చిదిద్దాలని నాకు లోభం కలిగింది. సార్వజనిక సంస్థల్ని నడిపే వ్యవహారంలో నాకు కలిగిన మొదటి అనుభవం యిది. నా అభిప్రాయం తోటి మెంబర్లకు చెప్పాను. వారంతా అందుకు అంగీకరించారు. కొంత ఆస్థి కొన్నాం. అద్దెకిచ్చాం. దానితో కాంగ్రెస్ వ్యయం సరిపోసాగింది. అందు నిమిత్తం ధర్మకర్తల్ని ఏర్పాటు చేశాం. ఆ ఆస్తి యిప్పటికీ వున్నది. కాని తరువాత అది అంతః కలహాలకు దారితీసింది. అద్దె సొమ్ము కోర్టులో జమచేయబడుతూ వున్నది. నేను దక్షిణ - ఆఫ్రికా వదలి వచ్చేసిన తరువాత అలా జరిగింది.

అసలు సార్వజనిక సంస్థలకు మూలధనం ఏర్పాటు చేయడం విషయంలో నా అభిప్రాయంలో చాలా మార్పు వచ్చింది. నేను అక్కడ వున్నపుడు చాలా సార్వజనిక సంస్థల్ని స్థాపించాను. వాటిని నడిపించాను. వాటికి అండగా వున్నాను. వాటివల్ల కలిగిన అనుభవాన్ని పురస్కరించుకొని ఏ సార్వజనిక సంస్థకూ మూలధనం సమకూర్చి పెట్టే ప్రయత్నం చేయకూడదనే దృఢ నిర్ణయానికి వచ్చాను. మూలధనం సమకూర్చి పెట్టగానే దానికి నైతికంగా అధోగతి ప్రారంభం అవుతుంది. అందుకు అవసరమైన బీజాలు మూలధనంలోనే వున్నాయి.

సార్వజనిక సంస్థ అంటే ఏమిటి? సర్వజనుల అనుమతితో, సర్వజనుల ధనంతో, నడుపబడు సంస్థ అని అర్థం. ప్రజల సహకారం అట్టి సంస్థకు లేకుండా పోయినప్పుడు యిక ఆ సంస్థ అనవసరం. మూలధనంతో నడపబడే సంస్థలు ప్రజల అభిప్రాయాలకంటే స్వతంత్రంగాను, అనేకసార్లు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగాను కూడా నడుస్తూ వుంటాయి. మన దేశంలో యిట్టి సంస్థల్ని ప్రతిచోట చూస్తున్నాం. ధార్మిక సంస్థలుగా చలామణి అవుతున్న అనేక సంస్థలకు లెక్కాడొక్కా ఏమీ ఉండదు. ధర్మకర్తలే వాటికి అధికారులుగా తయారవుతున్నారు. వారు ఎవ్వరికీ జవాబుదారీ వహించక అధికారం చలాయిస్తున్నారు. యిది సరికాదని నా అభిప్రాయం. ప్రకృతివలె యిట్టి సంస్థలు వాటంతట అవే పెరగాలని నా అభిప్రాయం. అది నా మతం. ఏ సంస్థకు ప్రజలు సాయం చేసేందుకు సిద్ధంకారో ఆ సంస్థ సార్వజనిక సంస్థయను పేరిట నడపడానికి వీలు వుండకూడదు. ఏ సార్వజనిక సంస్థకైనా ప్రజల సహకారం లభిస్తున్నదని ఎవరైనా చెబితే దానికి ప్రజల వల్ల లభించే చందాల పట్టికను చూడాలి. అదే ఆ సంస్థ యొక్క ధర్మకర్తల యోగ్యతకు, ఆసంస్థయొక్క ప్రజాపరపతికి ఒరిపిడిరాయి అన్నమాట. ప్రతి సంస్థ ఈ ఒరిపిడి రాయి మీద తన రాతను గీచి చూచుకోవాలని నా మతం. దీనికి ఎవ్వరూ దురర్థం చెప్పకుందురు గాక. శాశ్వత భవనాలు లేకపోతే కొన్ని సంస్థలు నడవవు. అట్టి సంస్థల్ని గురించి నేను యిక్కడ పేర్కొనడంలేదు. నేను చెప్పదలుచుకున్నది ఒక్క విషయమే. ప్రతి సంవత్సరం తమ యిష్ట ప్రకారం జనం యిచ్చే చందాలతో సంస్థ వార్షిక వ్యయం చేయబడాలి. అలా జరిగితే ఆ సంస్థకు నైతిక స్ఫూర్తి చేకూరుతుంది.

దక్షిణ - ఆఫ్రికాలో సత్యాగ్రహ సమరం ముమ్మరంగా సాగినప్పుడు నా ఈ ఉద్దేశ్యాలు దృఢపడ్డాయి. లక్షలాదిరూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. అయినా మూలధనం లేకుండా ఆరు సంవత్సరాలపాటు ఆ మహాసంగ్రామం జరిపాము. చందాలు రాకపోతే రేపు యీ సంగ్రామం గతి ఏమవుతుందోనని మేము భయపడ్డ రోజులు కూడా వున్నాయి. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము కదా! నాకు కలిగిన నిశ్చితాభిప్రాయాల్ని గురించి సందర్భాన్ని బట్టి ముందు వివరిస్తాను.

5. పిల్లల చదువు

1897 వ సంవత్సరం జనవరి నెల్లో డర్బనులో దిగాను. అప్పుడు నాతో మా ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. ఒకడు నా మేనల్లుడు. వాడికి పదేండ్ల వయస్సు. మిగిలిన యిద్దరూ నా కుమారులు. పెద్దవాడికి తొమ్మిదేండ్లు, చిన్నవాడికి అయిదేండ్లు. వీళ్ళకు చదువెట్లా అన్న సమస్య బయలుదేరింది.

నా పిల్లల్ని తెల్లవారి బడికి పంపగలను. అందుకు బాగా శ్రమపడాలి. నా పిల్లలకు మాత్రమే అట్టి వీలు కలుగుతుంది. కాని యితర భారతీయుల పిల్లలకు అట్టి వీలు దొరకదు. భారతీయ బాలుర కోసం మిషన్ వాళ్లు పెట్టిన బడులు వున్నాయి. కాని అందలి శిక్ష దీక్షలు బాగుండనందున నా పిల్లల్ని అక్కడికి పంపదలుచుకోలేదు. గుజరాతీ భాషలో బోధన కావాలంటే ఎలా సాధ్యం? ఇంగ్లీషు భాషలో అయితే వీలు వున్నది. ఎంతో కష్టం మీద వచ్చీరాని అరవంలోగాని లేక హిందీలోగాని పిల్లల చదువుకు వీలున్నది. కానీ యీవిషయంలో ఎదురైన అభ్యంతరాల్ని తొలగించలేక పోయాను. పిల్లలకు నేను చదువు చెబుదామని ప్రయత్నించాను. కాని అది నియమంగా సాగలేదు. అనుకూలమైన గుజరాతీ ఉపాధ్యాయుడెవ్వడూ దొరకలేదు.

నాకేమీ తోచలేదు. “నా ఉద్దేశ్యాల ప్రకారం పిల్లలకు విద్యగరపే ఆంగ్ల భాషా బోధకుడు ఒకరు కావాలి” అని పత్రికల్లో ప్రకటన చేశాను. ఆ ఉపాధ్యాయుడు నియమబద్ధంగా పిల్లలకు పాఠం చెబుతాడనీ, తీరిక దొరికినప్పుడు నేను కొంత చెప్పవచ్చునని భావించాను. నెలకు ఏడు పౌండ్ల జీతంమీద ఒక ఆంగ్ల వనిత పాఠం చెప్పడానికి అంగీకరించింది. యీ విధంగా పిల్లల చదువు ప్రారంభమైంది.

నేను పిల్లలతో గుజరాతీలోనే మాట్లాడుతూ వుండేవాణ్ణి. దానితో వాళ్ళకు కొద్దిగా గుజరాతీ భాషతో పరిచయం ఏర్పడింది. వాళ్ళను వెంటనే ఇండియాకు పంపాలనే ఉద్దేశ్యం నాకు లేదు. చిన్నపిల్లల్ని తల్లి దండ్రులకు దూరంగా వుంచకూడదను విషయం అప్పటికే నాకు బోధపడింది. మంచి ఏర్పాట్లుగల గృహాల్లో పిల్లలకు విద్య అప్రయత్నంగా అబ్బినట్లు, హాస్టల్లో ఉంచి చదివిస్తే అబ్బదు. ఆ కారణం వల్ల వాళ్ళు చాలాకాలం నాదగ్గరే వున్నారు. నా మేనల్లుణ్ణి, పెద్దకుమారుణ్ణి కొన్ని నెలల పాటు ఇండియాలో వసతి గృహాలు కల స్కూళ్లకు పంపించాను. కాని వాళ్ళను వెంటనే అక్కడనుండి తిరిగి తీసుకువచ్చాను. ఈడు వచ్చాక మా పెద్ద కుమారుడు తనంతటతాను అహమ్మదాబాదు హైస్కూల్‌లో చదవ తలచి దక్షిణ - ఆఫ్రికా వదిలి వెళ్ళిపోయాడు. నా మేనల్లుడు నేను చెప్పే చదువుకు తృప్తిపడి నాదగ్గరే వున్నట్లు గుర్తు. దురదృష్టవశాత్తు అతడు కొన్నాళ్ళు జబ్బుపడి నడియౌవనంలోనే యీ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. మిగిలిన నా ముగ్గురు పిల్లలు బడికి వెళ్లలేదు. సత్యాగ్రహ సమయంలో నేను స్థాపించిన పాఠశాలలో మాత్రమే వాళ్ళు నియమబద్ధంగా కొంచెం చదువుకున్నారు.

నా ఈ ప్రయోగాలన్నీ అపూర్ణాలే. వారికి విద్య బోధించుటకు కావలసినంత సమయం నాకు దొరకలేదు. ఇంకా అనేక ఆటంకాల వల్ల వాళ్లకు అవసరమైనంత శిక్షణ నేను గరపలేకపోయాను. ఈ విషయంలో వారి అసంతృప్తికి నేను కొద్దో గొప్పో గురికాక తప్పలేదు. ఎప్పుడైనా వారి ఎదుట ఎవరైనా మేము బి.ఏ. మేము ఎం.ఏ అని చెబుతూ వుంటే మేము కనీసం మెట్రిక్యులేషన్ అయినా ప్యాసుకాలేకపోతిమే అను భావం నా పిల్లల ముఖాన కనబడుతూ వుంటుంది. వాళ్ళు ఏమనుకున్నా, తల్లి దండ్రుల సహవాసం వల్ల కలిగే అనుభవజ్ఞానం వారికి కలిగిందని చెప్పగలను. స్వాతంత్ర్య సముపార్జనా పాఠం వాళ్ళు బాగా నేర్చుకున్నారని నా అభిప్రాయం. వాళ్ళ అభిరుచి ప్రకారం వాళ్ళను స్కూలుకు పంపించి యుంటే యిట్టి జ్ఞానంవారికి కలిగి యుండేది కాదు. వీళ్లను ఇంగ్లాండుకు పంపించో, లేక దక్షిణ-ఆఫ్రికాలో ఉంచో చదివించి కృత్రిమ శిక్షణ గరిపించియుంటే వీరి విషయమై నేను యీనాడు వున్నంత నిశ్చింతంగా వుండలేకపోయేవాణ్ణి. వాళ్ళు రుజూజీవితం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో గ్రహించలేకపోయేవాళ్ళు. వారి కృత్రిమ చదువులు నేను చేస్తున్న దేశారాధనా కార్యక్రమానికి అడ్డంకులుగా పరిణమించి యుండేవి.

మొత్తంమీద నేననుకున్నంతగాను, వాళ్లు అనుకున్నంతగాను భాషా జ్ఞానం వాళ్లకు లభించకపోయినా, బాగా యోచిస్తే వారి విషయంలో నా ధర్మాన్ని శక్తివంచన లేకుండా నిర్వర్తించాననే భావిస్తున్నాను. ఆ విషయమై నేను పశ్చాత్తాపపడటంలేదు. ఈనాడు నా పెద్ద కుమారునియందు చింతించవలసిన ఏ దోషాలు నేను చూస్తున్నానో, అవి అశిక్షితాలు, అమూర్తాలునగు నా ప్రథమ జీవితాంశాల ప్రతిధ్వనులని మాటిమాటికి నాకు అనిపిస్తూ వున్నది. నా ఆ ప్రథమ జీవితాంశం ఒక మాదిరి మూర్ఛాకాలం లేక వైభవకాలం. అప్పటి వయస్సు ననుసరించి అది అటువంటిది కాదని మా పెద్ద పిల్లవాడి ఊహ. నా జీవితంలో అదే రాజమార్గమనీ, తరువాత నాలో వచ్చిన మార్పులన్నీ వివేకమను పేరట మోహరాహిత్యం వల్ల నాలో కలిగాయని అతడి విశ్వాసం. ఆ విధంగా నా ప్రథమ జీవితమే రాజమార్గమనీ, తరువాత కలిగిన మార్పులు సూక్ష్మాభిమానవకృతాలనీ, అజ్ఞానజనితాలనీ అతడు ఎందుకు భావించ కూడదు? కొందరు మిత్రులు నాతో యీ విషయమై వాదించారు కూడా. నీ కుమారులు బారిష్టరులైతే వచ్చిన నష్టం ఏమిటి? వారిరెక్కలు విరగ గొట్టే అధికారం మీకెవరిచ్చారు? వాళ్లను వాళ్ల యిష్ట ప్రకారం పోనీయకుండా యిలా అడ్డు పడటం ఏమిటి? యిదీ మిత్రుల తర్కం.

అయితే యీ ప్రశ్నల్లో నాకు విశేషం కనబడలేదు. అనేక మంది విద్యార్థుల్ని గురించి నాకు తెలుసు. యితర బాలుర విషయమై కూడా యిట్టి ప్రయోగం చేసి చూచాను లేక అందుకు సహకరించాను. ఫలితాన్ని కూడా చూచాను. ఆ పిల్లలు, మా పిల్లలు యిప్పుడు ఒకే ఈడులో వున్నారు. వారు మానవత్వం విషయంలో నా పిల్లలకంటే మించలేదని చెప్పగలను. వారి దగ్గర నా పిల్లలు నేర్చుకోవలసింది ఏమీ లేదని నా అభిప్రాయం. నా యీ ప్రయోగాల ప్రయోజనాన్ని గురించి నిర్ణయించవలసింది భవిష్యత్తే. మనుష్యజాతి అభివృద్ధిని పరిశీలించే శోధకుడు గృహ శిక్షణకు, స్కూలు శిక్షణకు గల భేదాన్ని తెలుసుకోవాలని, తల్లిదండ్రుల జీవితంలో కలిగే పరివర్తనల ప్రభావం పిల్లల పై ఏవిధంగా పడుతుందో గమనించాలని భావించి యీ వివరం యిక్కడ తెలియచేశాను.

ఈ నా ప్రకరణానికి మరో ఉద్దేశ్యం కూడా వున్నది. సత్యారాధకుడు ఎంతవరకు సత్యారాధన చేయగలడో తెలుసుకోవాలనేది కూడా ఒక ఉద్దేశ్యం. స్వతంత్రతా దేవిని ఉపాసించే వాడిని. ఆ దేవి ఎంత బలిదానం కోరుతుందో తెలియజేయడం మరో ఉద్దేశ్యం. ఆత్మ గౌరవాన్ని త్యజించివేసి, యితర పిల్లలకు అలభ్యమైన విద్యను నా పిల్లలకు గరపి, నేను తృప్తి పడియుంటే వారికి వాఙ్మయ జ్ఞానం బాగా కలిగించి యుండేవాణ్ణే. కాని స్వాతంత్ర్యాన్ని గురించి, ఆత్మాభిమానాన్ని గురించి ఈనాడు వారికి కలిగిన జ్ఞానం అప్పుడు కలిగి యుండేదికాదు. స్వాతంత్ర్యం గొప్పదా లేక పాండిత్యం గొప్పదా అని ఎవరైనా ప్రశ్నిస్తే పాండిత్యం కన్న స్వాతంత్ర్యమే వెయ్యి రెట్లు మిన్నయని అనకుండా ఎవరైనా ఉండగలరా?

1920వ సంవత్సరంలో యిప్పటి స్కూళ్లు, కాలేజీలు స్వాతంత్ర్యానికి ఘాతుకాలు గనుక వాటిని విడిచి పెట్టమని బాలురకు ఉద్భోదించాను. అక్షరజ్ఞానం కోసం బంధితులై, గులాములై పడియుండేకంటే, స్వాతంత్ర్యం కోసం నిరక్షరులై యుండి రాళ్లను పగులగొట్టి బ్రతకడం మేలని ఉద్ఘోషించాను. దీనివల్ల నా ఉద్దేశ్యం ఏమిటో అందరికీ బోధపడియుంటుందని భావిస్తున్నాను.

6. సేవా ప్రవృత్తి

నా వృత్తి బాగా సాగుతున్నది. కాని దానివల్ల నాకు సంతోషం కలగలేదు. జీవితాన్ని యింకా రుజూ మార్గాన నడిపించాలనే మధన నాలో ఎక్కువగా సాగింది

ఆ సమయంలో మా యింటికి ఒక కుష్టురోగి వచ్చాడు. అన్నం పెట్టి పంపి వేయడానికి మనస్సు అంగీకరించలేదు. అతణ్ణి ఒక గదిలో వుంచి పుండ్లు కడిగి శుభ్రం చేసి కట్లు కట్టాను. సేవ చేశాను.

అయితే ఆ విధంగా ఎక్కువ రోజులు చేయలేకపోయాను. ఎల్లప్పుడు అతణ్ణి యింట్లో వుంచుకోవడానికి శక్తి చాలలేదు. ఇచ్ఛా బలం చాలలేదు. అందువల్ల గిరిమిటియాల కోసం ప్రభుత్వం వారు పెట్టిన ఆసుపత్రికి అతణ్ణి పంపించివేశాను. నాకు తృప్తి కలుగలేదు. ఎల్లప్పుడూ చేయతగిన శుశ్రూషాకార్యం ఏదైనా దొరికితే బాగుండునని ఆశపడ్డాను. డా. బూత్‌గారు సెయింట్ ఏయిడాన్స్ మిషన్‌కు అధికారులు. ఎవరు వచ్చినా వారు ఉచితంగా మందులిస్తూ వుంటారు. ఆయన ఎంతో మంచివాడు. వారి హృదయ స్నేహమయం. డా. బూత్ గారి ఆధిపత్యాన పారసీ రుస్తుంజీ ధర్మంతో ఒక ఆసుపత్రి పెట్టబడింది. అందు నర్సుపని చేద్దామని నాకు ప్రబలంగా కోరిక కలిగింది. అక్కడ రెండు గంటల సేపు మందులిచ్చే పని ఒకటి వున్నది. డబ్బు తీసుకోకుండా ఆ పని చేయగల స్వచ్ఛంద సేవకుడు కావలసి వచ్చింది. ఆ పని నేను చేయాలని, ఇతర పనుల నుండి ఏదో విధంగా రెండు గంటల సమయం మిగిల్చి, యీ పనికి వినియోగించాలని నిర్ణయించుకున్నాను. ఆఫీసులో కూర్చొని సలహాలివ్వడం, దస్తావేజులకు ముసాయిదా తయారుచేయడం, తగాదాలు పరిష్కరించడం నా పసులు. నాకు మేజిస్ట్రేటు కోర్టులో కూడా పనులు వుండేవి. కాని అవి అంత వివాదస్పదాలు కావు. యీ కేసుల్లో నాకు ఖానుగారు సాయం చేస్తున్నారు. వీరు నాతోబాటు దక్షిణ - ఆఫ్రికాకు వచ్చారు. మా యింట్లోనే వుండేవారు. వారి సాయంవల్ల ఆ చిన్న ఆసుపత్రిలో పనిచేసేందుకు నాకు అవకాశం ఆభించింది. అక్కడ ప్రతిరోజూ ఉదయం పూట పని. రాకపోకలకు, అక్కడ పని చేయడానికి రోజూ రెండు గంటలు పట్టేది. యీ పని వల్ల నా మనస్సుకు కొంచెం శాంతి లభించింది. రోగుల రోగాల్ని, బాధల్ని అడిగి తెలుసుకొని డాక్టరుకు చెప్పడం, డాక్టరు చెప్పిన మందు తయారుచేసి రోగులకు యివ్వడం యిదీ నా పని. దీనివల్ల రోగపీడితులైన హిందూదేశవాసులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారిలో చాలామంది అరవవారు, తెలుగువారు, ఉత్తరాదివారు. అంతా గిరిమిటియాలు.

ఆ చికిత్సా జ్ఞానం తరువాత నాకు ఎంతో ఉపయోగపడింది. బోయరు యుద్ధ సమయంలో దెబ్బలు తిన్నవారికీ, రోగులకు సేవ చేయడానికి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది.

పిల్లల పోషణను గురించిన సమస్య ఎప్పుడూ నన్ను వేధిస్తూ వుండేది. దక్షిణ ఆఫ్రికాలో నాకు యిద్దరు కుమారులు కలిగారు. వారి పోషణకు కూడా ఆసుపత్రిలో కలిగిన అనుభవం బాగా ఉపయోగపడింది. నా స్వతంత్ర ప్రవృత్తి నాకు ఎప్పడూ కష్టం కలిగిస్తూ వుండేది. యిప్పటికీ కలిగిస్తున్నది. ప్రసవం శాస్త్రీయంగా జరపాలని దంపతులు అనుకున్నాం. అయితే డాక్టరుగాని, మంత్రసానిగాని సమయానికి రాకపోతే ఏంచేయాలి? చదువుకున్న మంత్రసాని హిందూ దేశంలోనే దొరకనప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో దొరకడం సాధ్యమా? అందుకని నేను సుఖ ప్రసవాన్ని గురించి పుస్తకం కొని చదివాను. డా|| త్రిభువన దాసు గారు రచించిన మానేశిఖావణ తల్లులకు ఉపదేశము అను పుస్తకం అది. ఆ పుస్తకం ప్రకారం మరియు యితరత్ర నాకు లభించిన అనుభవం ప్రకారం ఇద్దరు పిల్లలకి లాలన పాలన నేనే చేశాను. రెండుసార్లు మంత్రసానుల సాయం పొందాను. కాని రెండు రెండు మాసాల కంటే మించి వారి సాయం లభించలేదు. వారి సహాయం నా భార్య వరకే పరిమితమైంది. పిల్లలకు తలంటువంటి సమస్త పనులు నేనే చేశాను. మా చివరివాడి పుట్టుక నన్ను కఠిన పరీక్షకు లోను చేసింది. ప్రసవ వేదన హఠాత్తుగా ప్రారంభమై ఎక్కువైంది. డాక్టరు సమయానికి దొరకలేదు. మంత్రసానిని పిలవాలి. మంత్రసాని దగ్గరలో వుంటే ఆ సమయంలో పిలవవచ్చు. కాని అందుకు అవకాశం లేదు. నొప్పులు ఎక్కువైనాయి. దానితో నేనే పురుడు పోయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు త్రిభువనదాసు పుస్తకం చదివాను గనుక నాకు భయం కలుగలేదు. ఆ గ్రంధ పఠనం నాకు అమితంగా సహాయపడింది.

పిల్లల పోషణను గురించి జ్ఞానం సంపాదించి నేను మా పిల్లల్ని పెంచి యుండకపోతే వాళ్లు ఆరోగ్యం విషయంలో వెనుకబడి యుండేవారే. సామాన్యంగా మొదట అయిదేండ్ల వరకు పిల్లలు నేర్చుకునేది ఏమీ వుండదని జనం అనుకుంటూ వుంటారు కాని అది సరికాదు. అసలు మొదటి అయిదేండ్ల సమయంలో పిల్లలు గ్రహించినంతగా ఆ తరువాత గ్రహించరు. శిశువుకు విద్యారంభం తల్లి గర్భంలోనే ఆరంభం అవుతుంది. గర్భ ధారణ సమయంలో తల్లి దండ్రుల శారీరక మానసిక ప్రవృత్తుల ప్రభావం శిశువునందు ప్రసరిస్తుంది. తల్లి గర్భం మోస్తున్నప్పుడు ఆమె ప్రకృతిని, ఆహార విహారాల్ని, గుణ దోషాల్ని స్వీకరించి శిశువుకు జన్మనిస్తుంది. జన్మించిన తరువాత తల్లిదండ్రుల్ని అనుకరిస్తుంది. తరువాత కొన్ని సంవత్సరాల దాకా తన వికాసానికి పూర్తిగా తల్లి దండ్రులమీద ఆధారపడుతుంది.

ఈ సంగతులు తెలిసిన దంపతులు కేవలం కామ తృప్తి కోసం తంటాలు పడరు. సంతానం కోసం వాళ్లు కాపురం చేస్తారు. నిద్రవలె, ఆహారంవలె సంయోగం అవసరం అని అనుకోకుండా పూర్తిగా అజ్ఞానమని నా అభిప్రాయం. అసలు ఈ జగత్తు యొక్క అస్తిత్వం జనన క్రియపై ఆధారపడి వున్నది. ఈ లోకం భగవంతుని లీలాభూమి. అతని మహిమకు ప్రతిబింబం. స్త్రీ పురుష సంయోగ సంతానం యొక్క సక్రమాభివృద్ధికి నిర్మితమని తెలుసుకుంటే భగీరధ ప్రయత్నం చేసి అయినా మనిషి తన లాలసత్వాన్ని పోగొట్టుకొనగలడు. ఆ విధంగా జరగాలని నా అభిలాష. సంయోగం వల్ల తాము పొందే సంతతి యొక్క శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక రక్షణకు పూనుకొనడం అవసరమను జ్ఞానం తల్లిదండ్రులు పొందుదురుగాక. ఆ విధంగా తన సంతతికి లాభం చేకూర్చెదరుగాక.

7. బ్రహ్మచర్యం - 1

ఇది నా బ్రహ్మచర్య వ్రతాన్ని గురించి వ్రాయతగిన సమయం. పెండ్లి రోజునే నా మనస్సునందు ఏకపత్నీవ్రతమను భావం నాటుకుంది. అది నా సత్యవ్రతంలో ఒక భాగం కూడా అయింది. గార్హ్యస్థ్య జీవితం గడుపుతున్నప్పటికీ బ్రహ్మచర్యం యొక్క ఆవశ్యకత దక్షిణ - ఆఫ్రికాలో నాకు బోధపడింది. ఏ సందర్భంలో ఏ పుస్తక ప్రభావం చేత యిట్టి ఆవశ్యకత బోధపడిందో నాకు గుర్తులేదు. రాయచంద్‌భాయి యిందుకు ప్రధాన కారణం అయివుండవచ్చని మాత్రం గుర్తు.

మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకటి యిప్పటికీ గుర్తు వున్నది. ఒకసారి నేను గ్లాడ్‌స్టన్ గారి యెడ వారి భార్యకు గల ప్రేమను గురించి ప్రస్తావించాను. హౌస్ ఆఫ్ కామన్సులో వున్నప్పుడు కూడా ఆమె తన భర్తకు తేనీరు కాచి ఇస్తూ వుండేదని ఎక్కడో చదివాను. నియమనిష్టలతో జీవితం గడిపే ఆ దంపతుల జీవితంలో ఇది గొప్ప విశేషం. ఈ విషయం ఆ కవికి చెప్పి దాంపత్య ప్రేమను స్తుతించాను. రాయచంద్ భాయి నా మాటలు విని “గ్లాడ్‌స్టన్ గారి భార్య గ్లాడ్‌స్టన్ గారికి పరిచర్య చేసిందనీ, అది గొప్ప విషయమనీ మీరు అంటున్నారు. సరే, ఆమె గ్లాడ్‌స్టన్‌గారి సోదరిగాని, పనిమనిషిగాని అని అనుకోండి. అట్టి ప్రేమతో తేనీరు కాచి ఇచ్చారనుకోండి. అట్టి స్థితిలో భార్య పరిచర్య గొప్పదా? సోదరి పరిచర్య గొప్పదా? పనిమనిషి పరిచర్య గొప్పదా? ఇట్టి సోదరి లేక పనిమనిషి యొక్క ఉదాహరణలు మనకు లేవా? ఈ ప్రేమ స్త్రీ జాతిలో గాక పురుష జాతిలో కనబడితే మీకు ఆనందాశ్చర్యాలు కలుగవా? ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచించి చూడండి” అని అన్నాడు.

రాయచంద్ భాయి వివాహితుడే. ఆ సమయాన వారి మాటలు నాకు కఠోరంగా ఉన్నాయి. కాని వారి మాటలు సూదంటురాయిలా నన్ను ఆకర్షించాయి. భార్యకుగల స్వామిభక్తి యొక్క విలువకంటే పరిచారకుని స్వామిభక్తి యొక్క విలువ ఎక్కువ కాదా? భార్యాభర్తల మధ్య ప్రేమ వుండటంలో ఆశ్చర్యం ఏముంది? స్వామి సేవకుల మధ్య యిట్టి ప్రేమ అభిలషణీయం. రాయచంద్‌భాయి మాటల సారం యిదే కదా? వారి మాటలు నన్ను బాగా వశపరచుకున్నాయి. “నేను నా భార్యతో ఎట్టి సంబంధం ఏర్పరుచుకోవాలి!” అను ఆలోచన నాలో ప్రారంభమైంది. భార్యను భోగ సాధనంగా భావించడం సబబా? అప్పుడు ఏకపత్నీవ్రతానికి విలువలేదు. యిది గమనించతగిన విషయం. నా భార్య నన్ను ఎన్నడైనా మోహవశుణ్ణి చేసిందా? లేదే! ఈ దృష్టితో నేను యిప్పుడు బ్రహ్మచర్య వ్రతాన్ని తేలికగా పాలించగలనని నిర్ణయించుకున్నాను. అయితే అందుకు అడ్డంకి కామాసక్తియే. కామం విషయంలో జాగ్రత్తగా వుందామని ప్రయత్నించాను. అయినా రెండు పర్యాయాలు పొరపాటు చేశాను. ప్రయత్నం చేస్తున్నానే గాని ఓడిపోతున్నాను. ఈ ప్రయత్నానికి ముఖ్యమైన హేతువు అంత గొప్పదికాదు. సంతానం కలుగకుండుటకు సంతానం కలుగకుండ చేసుకునేందుకు బాహ్యోపకరణాలు వున్నాయని ఇంగ్లాండులో వున్నప్పుడు చదివాను. డాక్టరు అలిన్సనుగారి అభిప్రాయాల్ని గురించి, వారు తెలిపిన ఉపాయాల్ని గురించి గతంలో కొద్దిగా వ్రాశాను. కొంతకాలం, అది మంచిదేనని అనుకున్నాను. కాని డాక్టర్ హిల్స్ గారు దాన్ని ఖండించి సంయమమే మంచిదని చెప్పారు. ఆ విషయం నా మనస్సులో అప్పుడే నాటుకున్నది. కాని అప్పుడు ఆ విషయాన్ని గురించి ఎక్కువగా యోచించలేదు. ఇప్పుడు యిక సంతానం వద్దనే నిర్ణయానికి వచ్చాను. దానితో ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఆలోచించసాగాను.

ఇందుకు నేను పడిన పాట్లు చాలా వున్నాయి. మా మంచాలు దూరం అయ్యాయి. పని చేసి బాగా అలసి పోయిన తరువాత నిద్రించడం ప్రారంభించాను. ఎంతగా ప్రయత్నించినా విశేష ఫలితం ఏమీ అప్పుడు కనబడలేదు. కాని భూతకాలపు ఘట్టాల్ని పరిశీలించి చూసుకుంటే చేసిన ప్రయత్నాలు ప్రారంభంలో సఫలం కాక పోయినా చివరికి బలం పుంజుకొని సఫలం కావడం గుర్తుకొచ్చింది.

గట్టి నిర్ణయం 1906వ సంవత్సరంలో చేసుకున్నాను. అప్పటికి సత్యాగ్రహ సమరానికి విఘ్నేశ్వర పూజ కాలేదు. బోయరు యుద్ధం ముగిసిన తరువాత నేటాలులో జూలూ తిరుగుబాటు జరిగింది. అప్పుడు నేను జోహాన్సుబర్గులో వకీలుగా వున్నాను. ఆ తిరుగుబాటు సమయంలో నేటాలు ప్రభుత్వానికి సహకరించాలని భావించాను. నేనీ విషయం విన్నవించుకోగా ప్రభుత్వం వారు అందుకు అంగీకరించారు. ఆ విషయం ముందు వ్రాస్తాను. అయితే యీ సేవకు ఫలితం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించాను. నా స్వభావాన్ని బట్టి మిత్రులతో యీ విషయం చర్చించాను. బిడ్డల్ని కనడం, వారిని పోషించుకోవడం యీ రెండు పనులకి మరి ప్రజా సేవకు సంబంధం లేదని అభిప్రాయపడ్డాను. యీ తిరుగుబాటు సమయంలో జోహాన్సుబర్గు నుండి మకాం ఎత్తి వేయాల్సి వచ్చింది. అలంకరించుకున్న ఇంటిని, అమర్చుకున్న గృహోపకరణాల్ని ఒక నెల అయినా పూర్తికాక ముందే వదలివేయవలసి వచ్చింది. భార్యా బిడ్డల్ని ఫినిక్సులో ఉంచాను. తరువాత నేను గాయపడ్డవారికి శుశ్రూష ప్రారంభించాను. సైన్యంలో చేరి యిట్టి దళాన్ని నడిపించాను. ఆ యుద్ధంలో అసిధారా వ్రతానికి పూనుకోవలసి వచ్చింది.

అప్పుడు లోక సేవా పరాయణుడనైతే యిక పుత్రేషణ, ధనేషణ విరమించుకొని వానప్రస్థాశ్రమం స్వీకరిద్దామన్న సంకల్పం కూడా నాకు కలిగింది.

తిరుగుబాటు సమయంలో మాసంన్నర రోజుల కంటే ఎక్కువ కాలం పట్టలేదు. ఆ ఆరువారాల కాలం నా జీవితంలో ఎంతో అమూల్యమైనది. అదివరకటి కంటే శపథానికి గల విలువ ఏమిటో నాకు బాగా బోధపడింది. శపథం చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి అని ఆలోచన బయలుదేరింది యింత వరకు చేసిన ప్రయత్నాలకు కలిగిన ఫలితం ఏమిటా అని యోచించాను. ఏమీ కనబడలేదు. అసలు నాకు నిశ్చలత కుదరలేదని తేల్చుకున్నాను. ఒక నిర్ణయం మీద నిలబడతాననే విశ్వాసం కలుగలేదు. అందువల్లనే నా మనస్సు అనేక వికారాలకు, అనేక యోచనా తరంగాలకు లోనవుతూ వున్నదని తెల్చుకున్నాను. ఈశ్వరుడు కరుణిస్తాడనే నమ్మకం కూడా లేదు. శపథం చేయకుండా వుండేవాడు మోహంలో పడిపోతాడని తెలుసుకున్నాను. శపథంచే తనను తాను బంధించుకుంటే అది వ్యభిచారంలో పడకుండా మనిషిని ఏకపత్నీవ్రతంలో నిలిపి వుంచుతుందని అనుభవంవల్ల తెలుసుకున్నాను. ప్రయత్నం మంచిదే, కాని శపథ బంధనం మంచిది కాదనుకోవడం దౌర్బల్య సూచకమని తెల్చుకున్నాను. అందు కొద్దిగా భోగేచ్ఛ వుంటుంది. చేయరాని పనిని విడనాడితే కలిగే నష్టం ఏమిటి? పాము కాటు వేయబోతున్నదని తెలిస్తే తప్పక పరుగెత్తుతాము. పరుగెత్తేందుకు ప్రయత్నం మాత్రమే చేస్తూ కూర్చుంటే చావు తధ్యం. అయితే ఆ నిజం తెలుసుకోనప్పుడు ప్రయత్నం చేస్తూ వుంటాం. అందువల్ల ఫలానా అలవాటు మానుకోవాలని నిర్ణయించుకొనీ అందు నిమిత్తం ప్రయత్నం మాత్రమే చేస్తూవుంటే, దాన్ని మానుకోవలసిన ఆవశ్యకతను మనం గుర్తించనట్లే. అసలు మన ఊహలు మారిపోతాయేమో అని శంకించి అనేక సార్లు శపథం చేయడానికి మనం వెనకాడుతూ వుంటాం. ఇదంతా స్పష్టమైన దృక్పధం లేకపోవడం వల్ల జరుగుతూ వుంటుంది. నిష్కలానందుడు దీన్ని గురించి యిలా అన్నాడు. “త్యాగనటకేరేవైరాగవినా” “ఎన్ని ఉపాయాలు చేసినా విషయవాసనలను విడనాడనిదే నీకు త్యాగం అలవడదు సుమా”. అందువల్ల ఎప్పుడు ఏ విషయం యెడ పూర్ణ వైరాగ్యం కలుగుతుందో అప్పుడు శపధం పూనడం మంచిదని, అది దానంతటదే అనివార్యం అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చాను.

8. బ్రహ్మచర్యం - 2

ఎంతో చర్చించి, ఎంతో ఆలోచించి 1909వ సంవత్సరంలో నేను బ్రహ్మచర్య వ్రతం చేపట్టాను. వ్రతం ప్రారంభించేవరకు నా భార్యకు యీ విషయం చెప్పలేదు. వ్రత సమయంలో చెప్పి ఆమె అనుమతి తీసుకున్నాను. ఇందుకు ఆమె అభ్యంతరం తెలుపలేదు.

ఈ వ్రతానికి పూనుకోవడం చాలా కష్టం అయింది. వికారాల్ని అణుచుకోవడం తేలిక విషయం కాదు కదా! భార్య విషయంలో వికారం కలుగకుండ వుండటం సామాన్య విషయమా? అయినా తక్షణ కర్తవ్యంగా భావించి నా లక్ష్యం శుద్ధమైనది గనుక పరమాత్ముడు కరుణించి నాకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించవలెనని ప్రార్ధించి యిందుకు పూనుకున్నాను. నేటికి 20 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు యీ వ్రతాన్ని గురించి యోచిస్తే నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలుగుతున్నది. నిగ్రహం అవసరమను భావం, తత్పరిపాలనమును గురించిన పట్టుదల 1901వ సంవత్సరంలో ప్రబలంగా వుండేది. ఇప్పుడు నాకు గల స్వాతంత్ర్యం, ఆనందం 1909వ సంవత్సరానికి పూర్వం వున్నట్లు గుర్తులేదు. ఆ సమయంలో నాకింకా వాంఛ తొలగలేదు. ఏ సమయంలోనైనా చ్యుతి కలుగవచ్చునని భయంగా వుండేది. ఇప్పుడు ఇట్టి స్థితిలేదు. వాంఛను అణుచుకోగలిగానను విశ్వాసం నాకు కలిగింది. బ్రహ్మచర్యం మహిమ రోజురోజుకు పెరిగిపోవడమేకాక, దాని అనుభవం నాకు కలుగసాగింది. ఫినిక్సు నందు బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించాను. సైన్యాన్నుండి సెలవు పుచ్చుకొని ఫినిక్సు వెళ్లాను. అక్కడి నుండి వెంటనే జోహాన్సుబర్గు వెళ్లవలసి వచ్చింది. అక్కడే ఒక నెల లోపున సత్యాగ్రహ సమరానికి అంకురార్పణ జరిగింది. బ్రహ్మచర్య వ్రతమే నన్ను సత్యాగ్రహ సంగ్రామ ప్రారంభానికి పూనుకునేలా చేసిందని భావిస్తున్నాను. ముందు ఆలోచించుకొని నేను సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించలేదు, అనుకోకుండా అతి సహజంగా ప్రారంభమైంది. కాని దీనికి పూర్వం నేను చేసిన పనులు అనగా ఫినిక్సు వెళ్లడం, జోహాన్సుబర్గులో ఇంటి ఖర్చులు తగ్గించడం, బ్రహ్మచర్య వ్రతానికి పూనుకోవడం మొదలగునవి, సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించేందుకు దోహదం చేశాయని భావిస్తున్నాను. బ్రహ్మచర్యాన్ని సరిగా పాటించడం అంటే బ్రహ్మదర్శనం చేసుకోవడమేనన్నమాట. ఈ జ్ఞానం నాకు శాస్త్రాలు చదవడంవల్ల కలుగలేదు. నాకీ విషయం మెల్ల మెల్లగా అర్ధం కాసాగింది. తరువాత శాస్త్రాలు చదివాను. బ్రహ్మచర్య వ్రతధారణం వల్ల శరీర రక్షణ, బుద్ధి రక్షణ, ఆత్మ రక్షణ కలుగునను సంగతి బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించిన తరువాత రోజురోజుకు అధికంగా అనుభవంలోకి రాసాగింది. ప్రారంభంలో బ్రహ్మచర్యవ్రతమంటే ఘోరతపశ్చర్యయని భావించేవాణ్ణి. కాని ప్రారంభించిన తరువాత యిప్పుడు ఎంతో రసమయంగాను, ఆనందమయంగాను వున్నది. యిప్పడు దీని బలం వల్లనే పనులు జరుగుతున్నాయి. దీని సౌందర్యం రోజురోజుకు అధికంగా పెరుగుతూ వున్నది.

ఈ వ్రతానికి పూనుకున్న తరువాత ఆనందం పొందుతున్నప్పటికీ దీని వేడి నాకు తగలలేదని భావించవద్దు. నేటితో నాకు యాభై ఆరేండ్లు నిండాయి. అయినా దీని కాఠిన్యం నాకు గోచరమవుతూనే వుంది. ఇది నిజంగా అసిధారావ్రతమే. ఎల్లప్పుడూ యీ విషయమై కడు జాగ్రత్తగా వుండటం అవసరం అని గ్రహించాను

బ్రహ్మచర్య వ్రతం సాఫీగా సాగాలంటే ముందు జిహ్వను వశంలో పెట్టుకోవాలి. నాలుకను జయించితే బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం తేలిక అని అనుభవం వల్ల గ్రహించాను. అందుకుగాను భోజనంలో మార్పులు చేశాను. శాకాహార దృష్టితోగాక, బ్రహ్మచర్య దృష్టితో భోజనంలో మార్పుచేశాను. మితంగా తినడం. వీలైనంత వరకు వండని పదార్థం తినడం. అనగా స్వాభావికమైన భోజనం అవసరమని అనుభవం వల్ల తెలుసుకొన్నాను. బ్రహ్మచారికి అడవిలో పండిన పండ్లు సరియైన ఆహారమని ఆరేళ్ళు కృషిచేసి తెలుసుకున్నాను. పండ్లు తినే సమయంలో నాకు కలిగిన నిర్వికారభావం, సుఖం, పండ్లు తినడం మానివేసే మరో పదార్థం తిన్నప్పుడు కలుగలేదు. పండ్లు తింటూ వున్నప్పుడు బ్రహ్మచర్యం సులభమైంది. పాలు పుచ్చుకుంటూ వున్నప్పుడు ఆ వ్రతాన్ని పాలించడం కష్టమనిపించింది. పండ్లు తినడం మాని పాలు ఎందుకు త్రాగవలసి వచ్చిందో తరువాత తెలియజేస్తాను. బ్రహ్మచారికి పాలు పనికిరావని, అవి బ్రహ్మచర్యానికి విఘ్నకారకమని చెప్పక తప్పదు. అయితే బ్రహ్మచారికి పాలు నిషిద్ధమని భావించవద్దు. బ్రహ్మచర్యానికి ఆహార ప్రాముఖ్యం ఏపాటిది? ఎంత? ఈ విషయంలో. యింకా ప్రయోగాలు చేసి చూడటం అవసరం. పాలు ఎంతో జీర్ణకరం, స్నాయువర్ధకం. అలాంటి ఆహారం మరొకటి యింతవరకు లభించలేదు. అట్టిది మరొక్కటి వున్నదని ఏ వైద్యుడు, ఏ హకీము, ఏ డాక్టరు కూడా చెప్పలేదు. పాలు కామవికారం కలిగిస్తాయి. అయినా పైన తెలిపిన కారణం వల్ల పాలు త్యాజ్యమని కూడా అనలేను. ఆహార విధానం, ఆహార నియమం వలె ఉపవాసం కూడా ఒక బాహ్యోపచారమే. ఇంద్రియ సముదాయానికి రాక్షసబలం ఎక్కువ. నలు ప్రక్కల, పది దిక్కుల క్రింద, పైన కాపలా పెడితేగాని అది లొంగదు. కడుపు మాడిస్తే ఇంద్రియాలు దుర్భలం అవుతాయి. అయితే ఇచ్ఛాపూర్వకంగా చేసే ఉపవాసాలు ఇంద్రియ దమనానికి తోడ్పడతాయి. కావున ఉపవాసాలు చేసే వారిలో చాలామంది సఫలురు కావడంలేదు. ఉపవాసం చేస్తే సమస్తం లభ్యమవుతుందని వారు భావిస్తూ వుంటారు. బాహ్యోపవాసం చేస్తూ వుంటారేకాని మసస్సులో మాత్రం భోగాలన్నింటిని భోగిస్తూనే వుంటారు. ఉపవాసం పూర్తయిన తరువాత ఏమి తినాలో యోచించుకొని ఆ పదార్థాల రుచుల్ని గురించి ఉపవాస సమయంలో యోచిస్తూ వాటి రుచుల్ని ఆస్వాదిస్తూ వుంటారు. అయ్యో, నాలుక మీద సంయమం ఉండటంలేదు, జననేంద్రియం మీద సంయమం ఉండటంలేదు అని అంటూ వుంటారు. మనస్సు కూడా ఇంద్రియ సంయమనానికి తోడ్పడినప్పుడే ఉపవాసం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే అసలు మనస్సులో విషయ భోగాల యెడ వైరాగ్యం జనించడం అవసరం. విషయ వాసనలకు మూలం మనస్సు. అది వశంలో వుంటే ఉపవాసాది సాధనాలు ఎక్కువగా ఉపకరిస్తాయి. కానియెడల ఉపకరించవు. ఉపవాసాలు చేసినా మనిషి విషయాసక్తుడుగా ఉండవచ్చు కనుక మనస్సును అదుపులో పెట్టుకొని ఉపవాసం చేయాలి. అప్పుడది బ్రహ్మచర్యానికి అమితంగా తోడ్పడుతుంది.

బ్రహ్మచర్యం విషయంలో చాలా మంది విఫలత్వం పొందుతూ పున్నారు. ఆహార విహారాదుల విషయంలో వాళ్ళు, అబ్రహ్మచారులుగా వ్యవహరిస్తూ బ్రహ్మచర్యాన్ని రక్షించుకోవాలని భావిస్తూ వుంటారు. ఇది గ్రీష్మకాలంలో హేమంతాన్ని కోరడం వంటిది. స్వచ్ఛంద వర్తనుడి జీవితంలోను, సంయమం కలవాడి జీవితంలోను వ్యత్యాసం పుండాలి. ఇరువురికీ పైపైని సామ్యమే కాని లోలోన భేదం వుంటుంది. యిద్దరూ చూస్తూనే వుంటారు. కాని బ్రహ్మచారి పరమేశ్వరుణ్ణి చూస్తూ వుంటే భోగి నాటకాలు, సినిమాలు చూస్తూ వుంటాడు. ఇద్దరూ వింటూ వుంటారు. కాని బ్రహ్మచారి భజన గీతాల్ని, భక్తి గీతాల్ని వింటూ వుంటే భోగి విలాసగీతాన్ని వింటూ వుంటాడు. ఇద్దరూ జాగరణ చేస్తూ వుంటారు కాని బ్రహ్మచారి హృదయ మందిరంలో రాముడు ఆరాధింపబడితే, భోగి హృదయం నాట్యరంగంలో తేలి ఆడుతూ వుంటుంది. ఇద్దరూ భుజిస్తారు. కాని బ్రహ్మచారి శరీర రూపంలో నున్న తీర్థక్షేత్ర రక్షణ కోసం మాత్రమే భుజిస్తాడు. భోగి రుచులకోసం రకరకాల పదార్థాలు సేవించి ఉదరాన్ని దుర్గంధమయం చేస్తాడు. ఈ విధంగా ఇద్దరి ఆచార విచారాలలో భేదం వుంటుంది. రోజు రోజుకు ఇది పెరుగుతూ వుంటుందే కాని తరగదు.

బ్రహ్మచర్యం అంటే ఏమిటి? మనోవాక్కాయాలతో సర్వేంద్రియాలను నిగ్రహించడమన్నమాట. ఇందుకోసం పూర్వపు విషయవాసనలన్నిటిని త్యజించడం అవసరమని భావిస్తున్నాను. త్యాగక్షేత్రానికి ఎల్లలు లేనట్లే బ్రహ్మచర్య మహిమకు కూడా ఎల్లలు లేవు. యిట్టి బ్రహ్మచర్యం సులభంగా లభ్యమవుతుందని భావింపకూడదు. చాలామందికి యిది ఆదర్శం మాత్రమే. కాని ప్రయత్నశీలుడగు బ్రహ్మచారికి తన లోట్లు తెలుస్తూ వుంటాయి. తద్వారా తన హృదయ కుహరంలో దాగియున్న వికారాల్ని తొలగించుకుంటూ వుంటాడు. ప్రవృత్తుల్ని జయించనంతవరకు బ్రహ్మచర్యవ్రతం సఫలం కాదు. ప్రవృత్తులు, వృత్తులు ఎన్ని రకాలుగా వున్నా అవి వికారాలతో నిండి వుంటాయి. వాటిని వశపరుచు కోవడమంటే మనస్సును వశపరుచుకోవడమే. వాస్తవానికి మనస్సును నిగ్రహించడం, వాయువును నిగ్రహించడం కంటే కష్టం. అయితే మనస్సులో పరమేశ్వరుడు తిష్ఠవేస్తే వ్రతం అంతా సులభమే అవుతుంది. కాని ఆ మార్గాన చిక్కులు అధికంగా వుంటాయి. అయినా అది అసాధ్యమని అనుకోనక్కరలేదని నా అభిప్రాయం. అది పరమార్ధం. అట్టి పరమార్ధానికి గట్టి ప్రయత్నం అవసరం. అందుకు బాగా కృషిచేయాలి.

ఇట్టి బ్రహ్మచర్యం సులభంకాదని హిందూ దేశానికి తిరిగి వచ్చిన తరువాత తెలుసుకున్నాను. అంతవరకు ఫలహారాల వల్ల వికారాలు సమూలం నశించిపోతాయని, అందుకు యింత ప్రయత్నం చేయనవసరం లేదని భావించే వాణ్ణి. అది కేవలం మోహంలోపడి యుండుటయేయని తరువాత తెలిసుకో గలిగాను. అయితే అందుకు నేను చేసిన ప్రయత్నాలను గురించి తెలియజేయాలి కదా! అందుకు కొంత సమయం కావాలి. ఈ సందర్భంలో మరో విషయం చెప్పడం అవసరం. ఈశ్వర సాక్షాత్కారం కోసం నేను చెప్పిన బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్ఠించాలని భావించేవారు, తమ ప్రయత్నంతో బాటు పరమేశ్వరుని పై శ్రద్ధ వహించగలిగితే, నిరాశపడవలసిన అవసరం వుండదని గట్టిగా చెప్పవచ్చు.

విషయావినివర్తంతే నిరాహారస్యదేహినః
రసవర్జం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
(గీత. 2వ అధ్యాయం. 59వ శ్లోకం)

ఆహారం మానివేసిన వాడికి విషయములు శాంతించును. కాని అందుండు అభిరుచి శాంతించదు. ఈశ్వర దర్శనం వల్లనే అట్టి అభిరుచి శమించును. కావున ఆత్మ దర్శనం కావలసిన వారికి రామనామం, రామకృప సాధనాలు అవసరం. నేను భారతదేశానికి వచ్చిన తరువాతనే ఈ విషయం తెలుసుకున్నాను. అది నాకు కలిగిన అనుభవం.

9. మితవ్యయం

నేను సుఖాలు అనుభవించసాగాను. కాని ఎంతోకాలం సాగలేదు. గృహాలంకరణకు అవసరమనుకున్న సామాగ్రిని సమకూర్చాను. కాని ఆ వ్యామోహం కూడా నిలవలేదు. దానితో వ్యయం తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చాను. చాకలి ఖర్చు ఎక్కువగా వుందని అనిపించింది. అంతేగాక అతడు బట్టలు త్వరగా తీసుకురాడు. అందువల్ల రెండుమూడు డజన్ల కమీజులు, అన్ని కాలర్లు వున్నా చాలేవి కావు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కాలరు. రోజూ కాక పోయినా మూడురోజులకొక కమీజు చొప్పున మారుస్తూ వుండేవాణ్ణి. యిందుకు వ్యయం పెరిగింది. ఈ వ్యయం అవసరమని అనిపించింది. నేను యింట్లో బట్టలుతకడం ఎలా అను పుస్తకాలు తెప్పించి చదివాను. నా భార్యకు కూడా నేర్పాను. పని పెరిగింది. కాని యిది క్రొత్తపని కావడంవల్ల మనోవినోదం కూడా కలిగింది.

మొట్టమొదటిసారి నేను ఉతికి ఇస్త్రీ చేసిన కాలరు మరచిపోవడానికి వీలు లేనంతగా పనిచేసింది. పిండి ఎక్కువైంది. ఇస్త్రీ పెట్టె వేడెక్కలేదు. కాలరు కాలిపోతుందేమోనని భయంతో ఇస్త్రీ పెట్టెను అణిచి రుద్దలేదు. అందువల్ల కాలరు గట్టిపడింది. పిండి రాలుతూ వుంది. ఆ కాలరుతో కోర్టుకు వెళ్ళి తోటి బారిస్టర్ల హాస్యానికి గురి అయ్యాను. అయితే యిట్టిహాస్యాన్ని సహించగలశక్తి నాకు చేకూరేవుంది. కాలరు ఇస్త్రీ చేసుకోవడం యిదే ప్రధమం. కనుక కాలరు నుండి పిండి రాలితే ఏం? మీకందరికి వినోదం కల్పించింది. ఇది గొప్ప విశేషం కదా! అంటూ స్పష్టంగా చెప్పాను. “ఇక్కడ చాకళ్ళకు కరువు లేదు కదా?” అని ఒక మిత్రుడు అన్నాడు.

“చాకలి ఖర్చు అత్యధికంగా పెరిగిపోయింది. కాలరు ధర ఎంతో దానిని ఉతికిoచడానికి అంత ఖర్చు అవుతున్నది. అంతేకాక చాకలివాని కోసం పడిగాపులు కాయవలసి వస్తున్నది. ఈ కష్టాలు పడేకంటే నా బట్టలు నేనే ఉతుక్కోవడం మంచిదని భావించాను.” అయితే ఎవరిపని వారు చేసుకోవడం మంచిదని వాళ్ళకు చెప్పలేక పోయాను. నాపని మాత్రం నేను చేసుకోసాగాను. క్రమంగా ఈ విద్యలో పాండిత్యం సంపాదించాను. నా ఇస్త్రీ చాకలి ఇస్త్రీ కంటే ఏ మాత్రమూ తీసిపోలేదు. చాకలి ఇస్త్రీ చేసిన కాలరు కంటే నేను ఇస్త్రీ చేసిన కాలరు నిగనిగలాడుతూ శుభ్రంగా ఉంది. క్రీ. శే. మహదేవ గోవిందరానడేగారు గోఖలేగారికి ఒక శాలువ ప్రసాదించారు. గోఖలేగారు దాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ ప్రత్యేక సమయాల్లో దాన్ని వాడుతూ ఉండేవారు. జోహన్సుబర్గులో గోఖలేగారికి ఘనంగా మేము విందు చేశాము. అది గొప్పసభ. అప్పుడు వారిచ్చిన ఉపన్యాసం దక్షిణ ఆఫ్రికాలో వారిచ్చిన ఉపన్యాసాలన్నిటి కంటే గొప్పగా ఉంది. అప్పుడువారు ఆశాలువా వేసుకోవాలని అనుకున్నారు. ఆ శాలువా మడతపడి ఉన్నది. దాన్ని ఇస్త్రీ చేయించాలి. సమయం తక్కువ. చాకలి చేత ఇస్త్రీ చేయించి తేవడం కష్టం “నా విద్యను కొద్దిగా పరీక్షించండి” అని వారిని కోరాను.

‘నీ లాయరు విద్యను విశ్వసించవచ్చుగాని చాకలి విద్యను ఎలా విశ్వసించడం? నీవు దీని మీద మరకలు వేస్తే ఎలా? దీని వెల ఎంతో తెలుసా’ అని అంటూ ఆ శాలువా కథ చెప్పారు.

మరకలు పడకుండా శాలువా సరిచేస్తానని వారికి విన్నవించాను. తత్ఫలితంగా ఆ శాలువా ఇస్త్రీ చేసే గౌరవం నాకు దక్కింది. వారు నాకు “మంచి చాకలి” అని బిరుదు ఇచ్చారు. ఇక చాలు లోకమంతా ఇవ్వకపోయినా పర్వాలేదని అనిపించి సంబరపడ్డాను. చాకలి దాస్యం నుండి బయట పడినట్లుగానే మంగలి దాస్యం నుండి బయటపడవలసిన అవసరం ఏర్పడింది. ఇంగ్లాండు వెళ్ళినవారంతా కనీసం తన గడ్డమైనా చేసుకోవడం నేర్చుకుంటారు. కాని తల వెంట్రుకలు కత్తిరించుకోవటం నేర్చుకోరు. ప్రిటోరియాలో ఒకసారి నేను మంగలి దుకాణానికి వెళ్ళాను. అక్కడ మంగలి “నాకు క్షవరం చేయను, పో” అని అన్నాడు. చేయనంటే పరవాలేదు. కాని ఆ తిరస్కారం భరించలేకపోయాను. బజారుకు వెళ్లి కత్తెర ఒకటి కొన్నాను. అద్దం ఎదుట నిలబడి నేనే జుట్టు కత్తిరించుకున్నాను. ముందరి వెంట్రుకలు ఏదో విధంగా కత్తిరపడ్డాయి. కాని వెనుక వెంట్రుకలు కత్తిరించుకోవడం కష్టమైంది. నేను కోరుకున్నట్లు కత్తెర పడలేదు. ఆ విధంగా జుట్టు కత్తెర వేసుకుని కోర్టుకు హాజరయ్యాను. కోర్టులో కలవరం బయలుదేరినది.

“నీ మీద ఎలుకలు తిరుగుతున్నాయా ఏమి” అని ఒకడు ప్రశ్నించాడు. ‘లేదు నా నల్లవాడి తలను తెల్లమంగలి అంటడు కదా! అందుకని నేను వెంట్రుకల్ని ఏదో విధంగ కత్తిరించుకున్నాను, యిది నాకు ఎంతో హాయినిచ్చింది.’ అని చెప్పాను. నా సమాధానం విని వాళ్లు ఆశ్చర్యపడలేదు. నిజానికి యిందు మంగలి అపరాధం ఏమీ లేదు. నల్లవాడికి క్షవరం చేస్తే అతడి కూట్లో రాయిపడుతుంది. మనం మాత్రం మన మంగళ్లను మాదిగలకు క్షవరం చేయనిస్తామా? దక్షిణ - ఆఫ్రికాలో యిట్టి అనుభవం ఒక్కసారి కాదు, అనేకసార్లు నాకు కలిగింది. ఇది మన పాపఫలమే అని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల నాకు ఈ విషయమై ఎన్నడు రోషం కలుగలేదు.

నా పనులన్నీ నేనే చేసుకోవాలి, వ్యయం తగ్గించుకోవాలి. అని కోరికలు బయలుదేరి తీవ్రరూపం ధరించాయి. ఆ వివరం తరువాత పలుచోట్ల తెలియజేస్తాసు. కాని దీనికి మూలం చాలా పురాతనమైనది. పూచేందుకు, కాచేందుకు, మూలానికి నీరు పోయవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు దక్షిణ - ఆఫ్రికా పరిస్థితులు బాగా తోడ్పడ్డాయి.

10. బోయరు యుద్ధం

1897 నుండి 1899 వరకు నా జీవితంలో కలిగిన యితర అనుభవాల్ని వదిలి బోయరు యుద్ధాన్ని గురించి తెలియజేస్తాను. యుద్ధం ప్రారంభమైనప్పుడు నేను పూర్తిగా బోయర్లకు అనుకూలంగా వున్నాను. ఇటువంటి విషయాల్లో వ్యక్తిగతమైన అభిప్రాయాల ప్రకారం పని చేసే అధికారం నాకు లేదని అనుకున్నాను. ఈ విషయమై నా హృదయంలో అపరిమితంగా మథనం సాగింది. ఆ వివరం దక్షిణ - ఆఫ్రికా సత్యాగ్రహచరిత్రలో వివరించాను. అందువల్ల దీన్ని యిక్కడ వ్రాయను. తెలుసుకోదలచిన వారు ఆ చరిత్ర చదివి తెలుసుకోవచ్చును. తెల్ల ప్రభుత్వం వారి ప్రజలం కనుక ఆ యోగ్యత ప్రకారం మనకు వుండవలసిన హక్కుల్ని మనం పుచ్చుకోవలసియున్నట్లే, తెల్ల ప్రభుత్వం వారియెడ గల విశ్వాసం ఈ యుద్ధంలో వారికి సాయపడమని నన్ను ముందుకు త్రోసింది. తెల్లప్రభుత్వం వారి ప్రజలం కనుక ఆయోగ్యత ననుసరించి బ్రిటీష్ రాజ్య రక్షణకు సాయపడటం మన ధర్మం అని భావించాను. భారతీయుల వికాసానికి బ్రిటీష్ సామ్రాజ్యమే శరణ్యమని ఆ రోజుల్లో నాకు అభిప్రాయం ఏర్పడింది.

ఆ కారణం వల్ల దొరికినంతమంది మిత్రుల్ని చేరదీసి, యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేసేందుకై ఎంతో కష్టపడి ఒక దళాన్ని ప్రోగుచేశాను. నల్లవారంతా పిరికివారనీ, అపాయాల్ని ఎదుర్కోలేరనీ, తమ పనుల్ని తప్ప మిగతా పనుల్ని పట్టించుకోరనీ, స్వార్థపరులనీ అప్పుడు ఇంగ్లీష్‌వాళ్ళు భావిస్తు వుండేవారు. అందువల్ల నా ఆంగ్ల మిత్రులు నా యీ ప్రయత్నాన్ని చూచి చప్పరించారు. డాక్టర్ బూత్‌గారొక్కరు మాత్రం ఏ ఏ విధంగా చేయాలో నేర్పారు. మేము యీ పనికి తగిన వారమని డాక్టర్ సర్టిఫికెట్లు సంపాదించాము. లాటనుగారు, ఎస్కాంబిగారు మా ఉద్దేశ్యాన్ని మెచ్చుకొన్నారు. యుద్ధంలో మా సేవల్ని అంగీకరించమని ప్రభుత్వానికి దరఖాస్తు పంపాము. ప్రభుత్వం వారు మమ్ము అభినందించారు. ఆయితే యిప్పుడు అవసరం లేదని మాకు తెలియజేశారు.

నేను “అవసరంలేదు” అని వచ్చిన సమాధానంతో వూరుకోలేదు. డాక్టర్ బూత్ గారి సహాయంతో నేటాలు బిషప్పుగారిని దర్శించాను. బిషప్ గారికి మా ఉద్యమం ఆనందం కలిగించింది. ఆయన తప్పక సాయం చేస్తానని మాట యిచ్చాడు.

ఇంతలో ఘటనా చక్రంలో కొంత మార్పు వచ్చింది. తెల్లవాళ్ళు బోయర్ల సన్నాహాన్ని, దార్డ్యతను, పరాక్రమాన్ని గుర్తించసాగారు. దానితో తెల్ల ప్రభుత్వం కదిలింది. క్రొత్తవారిని ప్రోగు చేసుకోవలసిన అవసరం కలిగింది. చివరికి నా ప్రార్ధన అంగీకరించబడినది.

మా దళంలో సుమారు 1100 మందిమి వున్నాం. యిందు నాయకులు నాలుగు వందల మంది. సుమారు మూడు వందల మంది స్వతంత్రులగు భారతీయులు, మిగిలిన వారంతా గిరిమిటియాలు. డాక్టర్ బూత్ గారు కూడా మాతో వున్నారు. దళం చక్కగా పని చేసింది. మా దళం పని సైన్యానికి బయటనే. దీనికి రెడ్ క్రాస్ అనగా లోహిత స్వస్తికం యిచ్చారు. అది యుద్ధంలో పడిపోయిన వారికి ఉపచారం చేసేవారు ఎడమచేతి మీద పెట్టుకునే ఎరగ్రుర్తు. ఈ గుర్తు కలవారిని శత్రువులు కాల్చరు. ఇంకా ఎక్కువ వివరం తెలుసుకోదలచిన వారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహచరిత్ర చదువవచ్చును. ఆ గుర్తు మా రక్షణ కోసం మంజూరు చేశారు.

ఒకానొక సమయంలో మా దళం యుద్ధరంగంలోకి కూడా పోవలసి వచ్చింది. లోగడ ప్రభుత్వం వారు వారి యిష్ట ప్రకారమే అపాయస్థలంలోకి వెళ్ళుటకు మాకు అనుమతి యివ్వలేదు. కాని స్కియాంకోపు చెయ్యి జారి పోయేసరికి పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు జనరల్ బులర్‌గారు యుద్ధరంగంలో పనిచేయాలనే నిర్బంధం మీకు లేదు, అయినా అపాయానికి సిద్ధపడి పడిపోయిన సైనికుల్ని, ఆఫీసర్లను యుద్ధరంగంలోకి వెళ్ళి ఎత్తుకుని డోలీలలో తీసుకొనివచ్చేందుకు సిద్ధపడితే ప్రభుత్వం వారు మీ ఉపకారాన్ని మరచిపోరని వార్త పంపాడు. మేమందుకు సంసిద్ధంగా వున్నామని సమాధానం పంపాము, తత్ఫలితంగా స్పెయాంకోప్ యుద్ధం అయిపోయిన తరువాత మేము ఫిరంగి గుండ్లు, తుపాకీ గుండ్లు పడే చోట పనిచేయుటకు పూనుకున్నాము. అప్పుడు రోజుకు 20 లేక 25 మైళ్ళ వరకు తిరిగి పనిచేయాల్సి వచ్చింది. ఒక్కొక్క సారి దెబ్బలు తిని గాయపడిన వారిని డోలీల్లో మోసుకొని అంతదూరం నడిచి రావలసి వస్తూ వుండేది. ఆవిధంగా గాయపడిన వారిలో జనరల్ వుడ్‌గేట్ వంటివారున్నారు. అట్టి యోధుల్ని చేరవేసే అదృష్టం మాకు కలిగింది.

ఆరువారాలు విశ్రాంతి లేకుండా పని చేసిన పిమ్మట మాదళాన్ని విడుదల చేశారు. స్పియాంకోపును, వాల్‌క్రాంజును చేజార్చుకున్న పిమ్మట లేడీస్మిత్ మొదలగు స్థావరాలను బోయర్లు ముట్టడించేసరికి, వారి పట్టు నుండి వాటిని విడిపించడం కోసం పూనుకోకుండా ఇంగ్లాండు నుండి, ఇండియా నుండి సైన్యాలను రప్పించాలని నిర్ణయించుకొని, అంత వరకు మెల్లమెల్లగా పని చేయాలని బ్రిటీష్ సేనాపతి నిశ్చయించుకున్నాడు.

మేము చేసిన ఆ స్వల్ప కార్యానికి ఆ సమయంలో మమ్మల్ని అంతా ఘనంగా మెచ్చుకున్నారు. దీనివల్ల భారతీయుల ప్రతిష్ట పెరిగింది. “అహో ! భారతీయులననెవరో కాదు ఈ రాజ్యపు వారసులే,” అను మకుటంతో పద్యాలు పత్రికల్లో వెలువడ్డాయి. జనరల్ బులర్ మాసేవల్ని ప్రశంసించాడు. మా దళపు నాయకులకు మెడల్సు కుడా లభించాయి.

ఇందువల్ల భారతీయుల్లో ఐక్యత పెరిగింది. నాకు గిరిమిటియాలతో సంబధం పెరిగింది. వారిలో కూడా వివేకం పెరిగింది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు. మద్రాసీ, గుజరాతీ, సింధూ, అంతా హిందూ దేశస్థులేనను భావం ప్రబలింది. ఇక భారతీయుల కష్టాలు తొలగిపోతాయని అంతా భావించారు. అప్పటి నుండి తెల్లవారి నడతలో మార్పు వచ్చింది.

యుద్ధ సమయంలో తెల్లవారికి, మాకు మధురమైన సంబంధం ఏర్పడింది. వేలాదిమంది తెల్లసోల్జర్లతో మాకు సంబంధం ఏర్పడింది. వారు మాతో ఎంతో స్నేహంగా వ్యవహరించారు. మేము తమకు చేసిన సేవా శుశ్రూషలకు వారు ఎంతో కృతజ్ఞత తెలియజేశారు.

దుఃఖ సమయంలో మనిషి హృదయం ఎంత ద్రవిస్తుందో ఒక్క ఉదాహరణ పేర్కొంటాను. మేము చీవలీ శిబిర ప్రాంతంలో సంచరిస్తున్నాము. రాబర్ట్సు ప్రభువు పుత్రుడు లెఫ్టినెంట్ రాబర్ట్స్‌గారికి ప్రాణాంతకమగు గుండు దెబ్బ తగిలింది. ఆయన ప్రాణాలు విడిచాడు. వారిని మోసుకొని వెళ్ళే అదృష్టం మా దళానికి కలిగింది. వచ్చేటప్పుడు ఎండ మాడిపోత్నుది. అందరి నాలుకలు దాహంతో పిడచకట్టుకు పోయాయి. దారిలో ఒక చిన్న సెలయేరు కనబడింది. ముందెవరు మంచినీళ్ళు త్రాగాలన్న ప్రశ్న బయలుదేరింది. ముందు తెల్ల సోల్జర్లు త్రాగాలి. ఆ తరువాత మేము త్రాగుతాము అని చెప్పాము. వెంటనే ముందు మీరు త్రాగండి అని తెల్ల సోల్జర్లు అన్నారు. ముందు మీరు త్రాగండని మేము వారిని కోరాం. ఈ విధంగా చాలా సేపటి వరకు మీరు త్రాగండంటే మీరు త్రాగండని ప్రేమతో పోటీపడ్డాం.

11. నగర పారిశుద్ధ్యం - క్షామనిధి

సంఘమను శరీరంలో ఏ అవయవం చెడినా ప్రమాదమే. అది నాకు యిష్టం వుండదు. లోకులు దోషాల్ని కప్పి పుచ్చడం, వాటిని చూచీ చూడనట్లు ఊరకుండి మా హక్కుల్ని మాకిమ్మని ప్రభుత్వాన్ని కోరడం నాకు యిష్టం వుండదు. దక్షిణ - ఆఫ్రికా యందలి భారతీయుల మీద ఒక ఆక్షేపణ వుండేది. “భారతీయులు మడ్డి రకం. వారి యిండ్లు చెత్త చెదారంతో నిండి మైలగా వుంటాయి” అని మాటిమాటికీ తెల్లవాళ్ళు ఆక్షేపిస్తూ వుండేవారు. అందులో కొంత సత్యం వున్నది. నేను అక్కడికి వెళ్ళినప్పటినుండి ఈ ఆక్షేపణ ఎలా తొలగించడనూ అని యోచిస్తూ వున్నాను. కొంచెం ప్రయత్నించగా పేరు పడియున్న పెద్ద ఇండ్లన్ని పరిశుభ్రమైనాయి. కాని డర్బనులో ప్లేగు ప్రవేశించి ప్రకోపిస్తుందనే వార్త పుట్టింది. ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేయడం పడలేదు. అందుకు మునిసిపాలిటీ సమ్మతి కావాలి. అది మాకు లభించింది. మేము పని చేయడానికి పూనుకున్నాం. అందువల్ల మునిసిపాలిటీ వారి పని తేలిక అయింది. భారతీయుల కష్టాలు కూడా తగ్గాయి. ప్లేగు మొదలుగా గల జబ్బులు వ్యాప్తి చెందినప్పుడు అధికారులు జనం మీద విరుచుకుపడేవారు. ఇష్టులు కాని వారి మీద వత్తిడి ఎక్కువయ్యేది. భారతీయులు శుచిగా వుండటం ప్రారంభించిన తరువాత అట్టి కష్టాలు బాధలు తగ్గిపోయాయి

ఈ విషయంలో నేను కూడా చాలా కష్టాలు చవిచూచాను. హక్కుల కోసం నేటాలు ప్రభుత్వంతో పోరాటం నడుపుటకు వారి వల్ల ఎంత సాయం పొందగలిగానో, అంత సాయం వారి చేత వారి విధుల్ని అమలుచేయించుటకు కృషిచేసి వారి సాయం పొందలేకపోయాను. కొందరు నన్ను అవమానించారు. కొందరు వినయపూర్వకంగా ఫరవాలేదు ఫరవాలేదు అంటూ కాలం గడిపారు. చాలామంది తమ మురికిని తాము తొలగించుకొనేందుకు సిద్ధం కాలేదు. అలా చేసుకోవడం పెద్ద తప్పని భావించారు. అందుకోసం డబ్బు ఖర్చు పెట్టమంటే యింకా కష్టం “యీ రంగంలో జనంచే ఏమైనా పనిచేయించాలి అంటే ముందు మనకు ఎంతో ఓర్పు సహనం పుండాలి” అను పాఠం నేను నేర్చుకొన్నాను. సంస్కర్తకు కావలసింది కేవలం సంస్కరణం. ఏ సంఘంలో సంస్కారం చేయాలని కోరతామో ఆ సంఘంలో వ్యతిరేకత, తిరస్కారం, చివరకు ప్రాణాపాయం సైతం కలుగవచ్చునని భావించి అందుకు సిద్ధపడాలి. సంస్కర్త దేన్ని సంస్కారం అని భావిస్తాడో ప్రజలు దాన్ని వికారం అని భావించవచ్చు. వికారం అనుకున్నా సరేకాని, వారు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సంస్కరణం జరగదు.

ఇక మా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఉద్యమం వల్ల భారతీయులకు ఇళ్ళు పరిశుభ్రంగా వుంచుకోవాలి అన్న విషయం కొద్దిగానో గొప్పగానో బోధపడింది. తెల్ల అధికారుల్లో మాయెడ కొంచెం గౌరవం పెరిగింది. భారతీయుల హక్కుల కోసం, అధికారాల కోసం ఎంత గట్టిగా ఉద్యమిస్తానో వారిని సంస్కరిoచడానికి అంతగా కృషిచేస్తూ వుంటానని వారికి బోధపడింది.

సంఘ మనోవికాసానికి మరొక పని చేయవలసి వచ్చింది. భారత దేశం ఎడ తమ కర్తవ్య నిర్వహణకు దక్షిణ - ఆఫ్రికా యందలి భారతీయుల్ని తయారు చేయవలసిన అవసరం వుందని గ్రహించాను. భారతదేశం పేద దేశం. అచటి వారు డబ్బు సంపాదస కోసం విదేశాలకు తరలి వెళ్లారు. భారత దేశానికి ఆపత్సమయంలో తాము సంపాదించిన డబ్బులో కొద్దిగా యివ్వడం ధర్మం కదా! 1897 వ సంవత్సరంలో ఇండియాలో క్షామం వచ్చింది. 1899వ సంవత్సరంలో దానికంటే పెద్ద క్షామం వచ్చింది. ఈ రెండు సమయాల్లోను దక్షిణ - ఆఫ్రికా నుండి పెద్ద సహాయం ఇండియాకు పంపించాము. మొదటి సారి చాలా సొమ్ము పంపాము. రెండవసారి మరింత సొమ్ము పంపాము. మేము తెల్లవారిని కూడా సాయం అడిగాము. వారు కూడా చాలా సహాయం చేశారు. గిరిమిటియాలు కూడా సొమ్ము విరాళంగా యిచ్చారు.

ఈ విధంగా రెండు క్షామాలు భారత దేశంలో సంభవించినప్పుడు సాయం చేసినట్లే ఆ తరువాత కూడా అనేక పర్యాయాలు సాయం చేశారు. అది వారికి అలవాటు అయిపోయిందన్నమాట.

ఈ విధంగా దక్షిణ - ఆఫ్రికాలో భారతీయులకు సేవచేస్తూ ఒకటి తరువాత మరొకటి అనేక విషయాలు నేర్చుకున్నాను. సత్యం అనేది మహావృక్షం. మనం దాన్ని ఎంత అధికంగా పోషిస్తే అది అంతగా ఫలాలు అందిస్తుంది. దానికి అంతం ఉండదు. దాన్ని తెలుసుకొని లోతుకు దిగిన కొద్దీ సేవారూపంలో రత్నాలు చేతికి దొరుకుతూ వుంటాయి.

12. స్వదేశాగమనం

యుద్ధం ముగిసిన తరువాత దక్షిణ - ఆఫ్రికాలో యిక నా పని పూర్తి అయిందని స్వదేశంలో చేయవలసిన పని చాలా వున్నదని గ్రహించాను. దక్షిణ ఆఫ్రికాలోనే వుంటే ఏదో కొంత సేవకార్యం దొరకకపోదు. కాని అక్కడ వుండిపోతే డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారుతుందనే సందేహం నాకు కలిగింది. దేశమునందలి మిత్రులు దేశం రమ్మని వత్తిడి చేయసాగారు. దేశం వెళితే ఎక్కువ ఉపయోగం వుంటుందని అనుకున్నాను. నేటాలులో ఖాన్‌గారు మన సుఖలాలుగారు వుండనే వున్నారు.

నాకు యిక సెలవు యిమ్మని మిత్రుల్ని కోరాను. అతికష్టం మీద ఒక షరతు పెట్టి సెలవు మంజూరు చేశారు “ఒక్క సంవత్సరంలో తిరిగి పనిబడితే మీరు యిక్కడికి రావాలి.” అనేది వారి షరతు. నాకది విషమ షరతు అనిపించింది. కాని ప్రేమపాశంచే బద్ధుడనైనాను.

“కాచేరే తాంతణే మన్ హరజీఏ బాందీ,
జేమ తాణే తేమ తేమనీరీ,
మనేలాగీ కటారీ ప్రేమనీ”

(ఆ నారాయణుడు నా మెడకు ప్రేమ బంధం వేశాడు. దాన్ని పుచ్చుకొని అతడు లాగిన కొద్దీ ఆహాహా, నేను అతని దానినయిపోతున్నాను.)

మీరాబాయి గానం చేసిన యీ గీతం నాకు బాగా వర్తించింది. జనతా జనార్ధనుని మాట కాదనలేక పోయాను. వారికి మాటయిచ్చి సెలవు తీసుకున్నాను. ఈ పర్యాయం నేటాలుతో నాకు సంబంధం అధికంగా ఏర్పడింది. నేటాలు నందలి భారతీయులు, నామీద ప్రేమామృతం అపరిమితంగా కురిపించారు. ఊరూర అభినందన పత్రాలు, ఊరూర కానుకలు అందజేశారు. 1899 వ సంవత్సరంలో దేశానికి పస్తున్నప్పుడు కూడా కానుకలు లభించాయి. యీ సారి ఆ కానుకల్ని, ఆ సభల్ని చూచి బెదిరిపోయాను. బంగారు, వెండియేగాక వజ్రాలు కూడా లభించాయి.

నేను యీ కానుకల్ని స్వీకరించవచ్చునా? నేను యీ కానుకల్ని తీసుకుంటే డబ్బు తీసుకోకుండా ప్రజల సేవ చేసినట్లవుతుందా? నాక్లయింటు యిచ్చినవి కొన్ని మాత్రం కాక మిగతావన్నీ ప్రజాసేవకుగాను యివ్వబడినవే గదా! అయితే యీ రెండింటికీ నా దృష్టిలో తేడా లేదు. పెద్ద పెద్ద క్లయింట్లందరు ప్రజా కార్యక్రమాలకు సాయపడ్డవారే. ఒక రోజున రెండు గొప్ప కానుకలు వచ్చాయి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పిచ్చివానివలె అటుయిటు తిరుగుతూ జాగారం చేశాను. ఏమి చేయాలో పాలుబోలేదు. వేల కొద్ది రూపాయలు తీసుకోకుండా వుందామంటే కష్టంగానే వుంది. తీసుకుందామంటే అంతకంటే కష్టంగా వుంది.

ఈ కానుకలు నేను జీర్ణం చేసుకోవచ్చు. కాని నా భార్యా బిడ్డల పరిస్థితి ఏమిటి? వాళ్ళు కూడా ప్రజాసేవకు అలవాటు పడుతున్నారు. సేవకు విలువ కట్టకూడదని రోజూ వారికి నూరి పోస్తున్నాను. ఇంట్లో ఖరీదైన నగలు వుంచడం మానుకున్నాను. ఇంటిలో మితంగా ఖర్చు పెట్టడం అలవాటు అవుతున్నది. అట్టి స్థితిలో బంగారు గడియారాలు, బంగారు గొలుసులు యింట్లో ఎలా ఉంచడం? వజ్రాల ఉంగరాలు ఎలా పెట్టుకోవడం? అప్పటికే నగల వ్యామోహం కూడదని అందరికీ చెబుతూ వున్నాను. అందువల్ల ఈ నగలు, ఉంగరాలు తీసుకొని ఏం చేయను? చివరికి వీటిని ఇంట్లో వుంచకూడదనే నిర్ణయానికి వచ్చాను. పారసీ రుస్తుంజీ మొదలగు వారిని ధర్మ కర్తలుగా ఏర్పాటు చేసి పత్రం వ్రాసి పెట్టుకొని ప్రొద్దున్నే భార్యాబిడ్డలతో సంప్రదించి బరువు దించుకుందామని నిర్ణయించుకున్నాను.

నా భార్యను ఒప్పించడం తేలికపని కాదని తోచింది. అందుకని నా పక్షాన వాదించుటకు నా పిల్లల్ని వకీళ్లుగా నియమించాను. పిల్లలతో మాట్లాడాను.

వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. “మాకీ నగలతో పనిలేదు. వాటి ఉపయోగం లేదు. ఎవరివి వారికిచ్చి వేయడం మంచిదని మా ఉద్దేశ్యం, మనకు కావలసివస్తే మనం చేయించుకోలేమా?” అని వాళ్ళు అన్నారు.

నాకు సంతోషం కలిగింది. “అయితే మీ అమ్మను ఒప్పించగలరని అనుకుంటున్నాను” అని వాళ్ళతో అన్నాను.

“తప్పక, అది మాపని. ఈ నగలు మా అమ్మ కెందుకు? ఆమె కావాలనేది ఎవరికోసం? మా కోసమే కదా? మేము వద్దంటే ఆమె ఇక ముట్టదు” అని అన్నారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు.

“ఇవి మీకు అక్కర లేకపోవచ్చును. మీ పిల్లలకు అక్కరలేక పోవచ్చును. పిల్లలదేముంది? మనం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. నాకు పెట్టుకోవాలని వున్నదనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? జనం ఎంతో ప్రేమతో యీ ఆభరణాలు యిచ్చారు. వాటిని తిరిగి వారికివ్వడం సరికాదు.” అంటూ కస్తూరిబాయి వాగ్ధార జోరుగా ప్రారంభించింది. దానితో అశ్రుధార కూడా కలిసింది. అయితే పిల్లలు చలించలేదు. నేనూ చలించలేదు. మెల్లమెల్లగా ప్రారంభించాను. “మన పిల్లలికి అప్పుడే పెళ్ళా! చిన్నతనంలో వాళ్ళకు పెళ్ళి చేయముకదా! పెద్దవాళ్ళు అయిన తరువాత వాళ్ళ పెళ్ళిళ్లు వాళ్లే చేసుకుంటారు. నగలు కావాలనే కోడళ్లు మనకెందుకు? అయినా నగలే అవసరమైతే నేను లేనా? నేను ఎక్కడి పోతాను?” అని అన్నాను.

“ఆ సంగతి నాకు తెలియదా? నా ఒంటిమీద వున్న నగలన్నీ ఒలిచి తీసుకొన్నవారు కదూ మీరు? నన్నే పెట్టుకోనీయనివారు రేపు నా కోడళ్ళని పెట్టుకోనిస్తారా? నా పిల్లల్ని యిప్పటి నుండే బైరాగుల్ని చేసి పెడుతున్నారు. ఈ నగలు నేనెవ్వరికీ యివ్వను. పైగా అవి నావి, నాకు యిచ్చారు. వాటిమీద మీకు హక్కుఎక్కడుంది?” “ఆ బంగారు హారం నీవు చేసిన సేవను చూచి యిచ్చారా చెప్పు! నేను చేసిన సేవకే గదా యిచ్చారు?” “పోనియ్యండి మీరు చేస్తే నేను చేసినట్లు కాదా? మీకు రాత్రింబవళ్ళు నేను సేవచేయడం లేదా? ఇది సేవ కాదా? ఇంటికి తీసికొని వచ్చిన అడ్డమైన వాళ్లందరికీ ఎముకలు విరిగేలా సేవచేయడం లేదా? దీన్ని ఏమంటారు? యిది సేవకాదా?” ఆమె వదిలిన బాణాలన్నీ వాడిగలవే. ఎన్నో నాకు గ్రుచ్చుకున్నాయి. కాని నేను నగలు తిరిగి యిచ్చి వేయాలని నిర్ణయించుకున్నాను. తరువాత చివరికి ఏదో విధంగా కానుకలు తిరిగి యిచ్చి వేసేందుకు ఆమెను ఒప్పించాను. 1896, 1901 వ సంవత్సరాలలో వచ్చిన కానుకలన్నింటిని తిరిగి ఇచ్చివేశాను. దానపత్రం వ్రాశాను. నా అనుమతితో కాని ధర్మకర్తల అనుమతితో కాని ప్రజాసేవకు యివి ఉపయోగించబడాలనే షరతుతో సొమ్మంతా బాంకులో జమ చేశాను.

ప్రజాసేవకు సంబంధించిన కార్యాలకు ఈ సొమ్ము ఉపయోగించాలని భావించాను. కాని అందుకు అవసరమైన సొమ్ము ఎప్పటికప్పుడు వస్తూ వుండటం వల్ల ఆ సొమ్మును ముట్టుకోలేదు. ఆ సొమ్ము సురక్షితంగా వుండిపోయింది. పైగా అది పెరుగుతూవున్నది.

ఇలా చేసినందుకు నాకు ఎన్నడూ పశ్చాత్తాపం కలుగలేదు. కాలం గడిచిన కొద్దీ కస్తూరిబాయి కూడా నేను చేసిన పని యొక్క ఔచిత్యాన్ని అర్థం చేసుకోసాగింది. ఈ విధంగా నేను ప్రలోభాల నుండి తప్పించుకోగలిగాను. ప్రజల సేవ చేసేవారికి ఎన్నో కానుకలు వస్తాయి. కాని అవి వారి సొంతం కాజాలవని నా నిశ్చితాభిప్రాయం.

13. భారతదేశానికి ప్రయాణం

ఈ విధంగా నేను ఏర్పాట్లు పూర్తిచేసుకొని భారత దేశానికి ప్రయాణమయ్యాను. దారిలో మారిషస్ రేవు తగిలింది. అక్కడ ఓడ కొద్ది రోజులు ఆగుతుంది. నేనక్కడ దిగి అక్కడ వారి స్థితిగతుల్ని తెలుసుకున్నాను. అక్కడ గవర్నరుగా వున్న చార్లెస్‌బ్రూస్ గారికి అతిథిగా ఒక రాత్రి వున్నాను.

దేశానికి వచ్చిన తరువాత కొంత కాలం అటుయిటు తిరుగుతూ పర్యటిస్తూ వున్నాను. 1901 నాటి విషయం, కలకత్తాలో ఆ ఏడు కాంగ్రెస్ జరుగుతున్నది. అధ్యక్షులు దిన్షా ఎడల్జి వాచాగారు. నేను ఆ కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కాంగ్రెస్‌ను చూడటం నాకు అదే మొదటిసారి.

బొంబాయి నుండి సర్‌ఫిరోజ్‌షాగారు కలకత్తా వెళుతున్న రైల్లోనే నేను కూడా ఎక్కాను. దక్షిణ - ఆఫ్రికా విషయాలు వారితో మాట్లాడవలసి వున్నది. వారి పెట్టెలో కూర్చొని ఒక స్టేషను దాకా ప్రయాణించవచ్చని నాకు అనుమతి లభించింది. వారు ఒక పెట్టెను పూర్తిగా తీసుకున్నారు. వారి రాజ వైభవం, ఠీవి, అందుకుగాను అయ్యే ఖర్చుల వ్యవహారమంతా నాకు కొంత తెలుసు. నిర్ణయించబడిన స్టేషనులో వారి పెట్టె ఎక్కాను. అప్పుడా పెట్టెలో దిన్షావాచాగారు, చిమన్‌లాల్ సెతల్వాడు గారు వున్నారు. వారంతా రాజకీయాల్ని గురించి మాట్లాడుతూ వున్నారు. నన్ను చూచి ఫిరోజ్ షా మెహతా గారు “గాంధీ! నీ పని అనుకూలంగా లేదు. నీ తీర్మానం కాంగ్రెస్సులో ఆమోదించినా ప్రయోజనం ఏముంటుంది? అసలు మనకు మనదేశాల్లో వున్న హక్కులేమిటి? మనదేశంలో మనకు సత్తా లేనంత కాలం పరాయి దేశాల్లో మన స్థితి ఎలా బాగు పడుతుంది?” అని అన్నారు. నేను నివ్వెరబోయాను. చిమన్‌లాల్‌గారు కూడా వారితో ఏకీభవించారు. కాని దిన్షాగారు మాత్రం దయ దృష్టితో నావంక చూచారు.

ఫిరోజ్‌షాగారిని ఒప్పించాలని ప్రయత్నించాను. వారు బొంబాయికి మకుటంలేని మహీపతి. అట్టివారిని నాబోటివాడు ఒప్పించడం సాధ్యమా? అయితే కాంగ్రెస్‌లో దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించిన తీర్మానం ఆమోదం పొందుతుందని సంతోషించాను.

వారికి ధన్యవాదాలు తెలిపి రైలు ఆగగానే పెట్టె దిగి నా పెట్టె ఎక్కి నా స్థానంలో కూర్చున్నాను. షాగారి దగ్గర నుండి వచ్చేసేముందు లేవగానే నాకు ఉత్సాహం కలిగించేందుకు వాచాగారు “తీర్మానం తయారు చేసి నాకు చూపించండి” అని చెప్పారు. రైలు కలకత్తా చేరింది. నగరవాసులు అధ్యక్షుల వారిని మహా వైభవంగా తీసుకు వెళ్ళారు. అక్కడ అనేక మంది ప్రతినిధులు వున్నారు. అదృష్టవశాత్తు నేనున్న విభాగానికి లోకమాన్యులు విచ్చేశారు. వారు ఒక రోజు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తు. లోకమాన్యులు ఎక్కడ వుంటే అక్కడ ఒక చిన్న దర్బారు జరుగుతూ వుంటుంది. లోకమాన్యులు శయ్యపై కూర్చుంటారు. చిత్రకారుణ్ణి అయితే శయ్యపై కూర్చున్నవారి చిత్రం గీసేవాణ్ణి. ఆ దృశ్యం అంత స్పష్టంగా నాకు గుర్తువుంది. వారి దర్శనం కోసం వచ్చేవారి సంఖ్య అపరిమితంగా వుంటుంది. పెద్ద సంఖ్యలో వుంటుందంటే అతిశయోక్తికానేరాదు. వారిలో అమృత బజారు పత్రికాధిపతి మోతీబాబుగారు నాకు బాగా గుర్తు. వారిద్దరి నవ్వు, పరిపాలకుల అన్యాయాల్ని గురించి వారనుకున్న మాటలు యిప్పటికీ నాకు గుర్తు. ఇక అచటి కాంగ్రెస్ వారి నివాసాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

వాలంటీర్లలో ఒకరికొకరికి పడదు. ఎవనికైనా ఒకపని అప్పగించితే అతడు ఆ పని చేయడు. అతడు వెంటనే మరొకడికి చెబుతాడు. అతడు యింకొకడికి పురమాయిస్తాడు. యిక పాపం ప్రతినిధులపని హుళక్కే.

కొంతమంది స్వచ్ఛంద సేవకులతో నేను మాట్లాడాను. దక్షిణ - ఆఫ్రికాలో జరిగే పద్ధతి కొద్దిగా చెప్పాను. వాళ్ళు కొంచెం సిగ్గు పడ్డారు. వారికి సేవాధర్మం అంటే ఏమిటో చెబుదామని ప్రయత్నించాను. వారికి కొంచెం కొంచెం బోధపడింది. కాని సేవాభావం, ప్రేమభావం ఎప్పటికప్పుడు ఎక్కడ బడితే అక్కడ పుట్టుకురావడానికి అవి పుట్టకొక్కులు కావుగదా! అవి లోపలి నుండి పుట్టుకురావాలి. దానికి అభ్యాసం కూడా అవసరం. అమాయకులు, సరళ స్వభావులు అయిన ఈ వాలంటీర్లకు సేవ చేద్దామని వుంది, కాని చేసి ఎరగరు. అలవాటు లేదు. ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది? అందుకు కారణం కూడ వున్నది. కాంగ్రెస్ జరిగేది సంవత్సరానికి ఒక్కసారి. అదికూడా మూన్నాళ్ల ముచ్చట. తరువాత కథ కంచికి అది ఇంటికి. అట్టి స్థితిలో ఏడాదికి మూడు రోజులు మాత్రం జరిగే తతంగంలో వాలంటీర్లు సవ్యంగా పనిచేయాలంటే సాధ్యమా?

ప్రతినిధులు కూడా స్వచ్ఛంద సేవకుల వంటివారే. వారికి కూడా అది మూన్నాళ్ళ ముచ్చటే. ఈ ప్రతినిధులు తమ పని తాము చేసుకోరు. హుకుములిచ్చి పనులు చేయించుకుంటూ వుంటారు. ‘ఏయ్! వాలంటీరూ! అది తే, ఇది తే’ యిదీ వాళ్ల వరస. ఇక్కడ అంటరానితనం జాస్తి. అరవవారికోసం వంట యిల్లు స్పెషల్‌గా ఏర్పాటుచేయబడింది. వాళ్లు భోజనం చేస్తుంటే ఎవ్వరూ చూడకూడదు. అందువల్ల వారికోసం కాలేజీ ఆవరణలో వేరే ఏర్పాట్లు చేశారు. దిష్టి తగలకుండా చుట్టూ దడికట్టారు. లోపల ఊపిరి సలపనంత పొగ. అది వంట గదిలా లేదు. సందూకు పెట్టెలా వుంది. అన్ని వైపుల దాన్ని మూసివేశారు.

ఇది వర్ణాశ్రమ ధర్మానికి విరుద్దం. కాంగ్రెసు ప్రతినిధుల్లోనే అంటరానితనం యింత అధికంగా వుంటే వాళ్లను ఎన్నుకునే జనంలో ఎంత అంటరానితనం వుంటుందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారమంతా చూసేసరికి నాకు అమితంగా నిరాశ కలిగింది.

ఇక అక్కడ దుర్గంధం విపరీతం. ఎక్కడ చూచినా నీళ్లు, నీళ్లు, నీళ్లు. మరుగు దొడ్లు తక్కువగా వున్నాయి. ఒకటే కంపు. తలుచుకుంటేనే డోకు వస్తుంది. ఒక వాలంటీరుని పిలిచి యీ విషయం చెప్పాను. అది పాకీ వాళ్లు చేయాల్సిన పని అని అతడు ఠపీమని సమాధానం యిచ్చాడు. ‘నాకు ఒక చీపురు కట్ట తెచ్చి పెట్టగలరా’ అని అడిగాను. అతడు తెల్లబోయాడు, నా ముఖం ఎగాదిగా చూడసాగాడు. చివరికి నేనే వెతికి తెచ్చుకున్నాను. మరుగుదొడ్డి బాగు చేశాను. కాని అది నాకు ఉపయోగపడే మరుగుదొడ్డి. ఇదెక్కడి లోకం? ఇవెక్కడి మరుగుదొడ్లు? ఎన్ని సార్లు బాగుచేసినా ప్రయోజనం శూన్యం. వాటిని బాగుచేయాలంటే నా శక్తికి మించినపని. అందువల్ల నాపని మాత్రం చేసుకొని సంతోషపడ్డాను. మిగతావాళ్లకు కంపు కొట్టినట్లులేదు. ఈ వ్యవహారం యింతటితో ఆగలేదు. కొందరు రాత్రిపూట తాము వుంటున్న గది వరండాలోనే మలవిసర్జనం, మూత్ర విసర్జనం చేశారు. వాలంటీర్లకు ప్రొద్దున్నే ఆ దృశ్యం చూపించాను. కాని బాగుచేసే నాధుడెవరు? చివరికి నాకే ఆ గౌరవం దక్కింది.

తరువాత మొదటి కంటే కొద్దిగా మార్పు వచ్చింది. కాని పరిశుభ్రతను గురించి పట్టించుకునేవారు తక్కువ. ప్రతినిధులు తమ చెడ్డ అలవాటును మార్చుకోరు. వాలంటీర్లు అసలు పట్టించుకోరు.

కాంగ్రెస్ మరికొన్ని రోజులు యిలాగే జరిగితే అంటురోగాలు తప్పవు అని అనిపించింది.

14. క్లర్కు - బేరా

బేరర్ అనే ఇంగ్లీషు శబ్దానికి బేరా అపభ్రంశం. కలకత్తాలో ఇంట్లో పనిచేసే వాణ్ణి బేరా అని అనడం అలవాటు. కాంగ్రెసు ప్రారంభం కావడానికి యింకా రెండు రోజుల వ్యవధి వుంది. కాంగ్రెసు ఆఫీసులో నాకేమైనా పని దొరికితే కొంత అనుభవం గడించవచ్చని అనిపించింది.

కలకత్తాలో దిగిన రోజే కాలకృత్యాలు ముగించుకొని కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లాను. శ్రీ భూపేంద్రనాధ బోసుగారు, శ్రీ ఘోషాలుగారు కార్యదర్శులు. భూపేంద్రబాబుగారి దగ్గరికి వెళ్లి ఏమైనా పనివుంటే యిమ్మని అడిగాను. వారు నన్ను పరిశీలించి చూచి “నాదగ్గర పనేమీ లేదు. బహుశ ఘోషాలుగారి దగ్గర పనివుంటే చెబుతారు. వారిని చూడు” అని అన్నారు.

ఘోషాలు బాబు గారి దగ్గరికి వెళ్లాను. వారు నన్ను క్రింది నుండి పైదాకా ఎగాదిగా చూచి కొంచెం చిరునవ్వునవ్వి ‘నాదగ్గర క్లర్కు పని వుంది చేస్తావా?’ అని అడిగారు.

“తప్పక చేస్తా. చేతనైన పని చేయడానికే మీదగ్గరకు వచ్చా”

“అబ్బాయి! నిజమైన సేవాభావమంటే యిదే”

వారి దగ్గరే కొందరు వాలంటీర్లు వున్నారు. వారికేసి చూచి “చూచారా! యీ అబ్బాయి ఏమన్నాడో!” అని అన్నారు. మళ్లీ నాకేసి తిరిగి “అదిగో, ఉత్తరాలగుట్ట, దాన్ని తీసుకో. ఇదుగో కుర్చీ. దీనిమీద కూర్చొని పని మొదలుబెట్టు. నా కోసం వందలాది ఉత్తరాలు వస్తుంటాయి. చాలామంది జనం వస్తుంటారు. వీళ్లతోనే మాట్లాడనా లేక ఈ ఉత్తరాలు చూస్తూ కూర్చోనా? ఈ పని చూడడానికి క్లర్కు లేడు. వీటిలో చాలావరకు పనికిమాలినవి. అయితే అన్నింటినీ చదువు. అవసరమైన ఉత్తరాలకు సమాధానం వ్రాయి. అవసరమనుకుంటే నన్ను సంప్రదించు. అని అన్నారు. నన్ను వారు నమ్మినందుకు సంతోషించాను.

ఘోషాలుగారు నన్నెరుగరు. తరువాత నీ పేరేమిటి అని అడిగి తెలుసుకున్నారు. నాకు అప్పగించినది తేలికపని. ఆ పని త్వరగా ముగించాను. ఘోషాలు బాబుగారు సంతోషించారు. ఆయనకు మాట్లాడుతూ వుండటం అలవాటు. మాటలతో కాలం గడిపే మనిషి. తరువాత నీ అంతవాడికి యీ చిన్న పని అప్పగించానే అని నొచ్చుకున్నారు. “అయ్యా! నేనెక్కడ! మీరెక్కడ! కాంగ్రెసు సేవలో మీ జుట్టు పండిపోయింది. నాకంటే మీరు పెద్దలు. వృద్ధులు. నేను అనుభవంలేని కుర్రవాణ్ణి. మీరీ పని యిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. యిక ముందు ముందు కాంగ్రెసులో నేను పనిచేయాల్సి వుంది. పని తెలుసుకునేందుకు దుర్లభమైన అవకాశం మీరు నాకు యిచ్చారు” అని ఆయనను సముదాయించాను.

“నిజంగా నువ్వు భలేవాడివి. ఈ కాలపు కుర్రవాళ్లు నీలా వుండరు. కాంగ్రెసు పుట్టినప్పటినుండి నాకంతా తెలుసు. కాంగ్రెసు స్థాపనలో హ్యూమ్‌గారితో బాటు నాకు కూడా పాలువుంది” అని ఘోషాలుగారన్నారు.

మా కీవిధంగా బాగా పరిచయం అయింది. మధ్యాహ్నభోజనం మేమిద్దరం కలిసి చేశాం. ఘోషాలు బాబుగారి చొక్కాకు గుండీ “బేరా” వచ్చి తగిలించేవాడు. అది చూచి ఆ పని నేనే చేస్తానని చెప్పాను. అలా చేయడం నాకు యిష్టం. పెద్దలంటే నాకు గౌరవం. వారికి నా మనస్సు బాగా తెలిసిపోయింది. అప్పటి నుండి వారు తన పనులన్నీ నాచేత చేయించుకోసాగారు. గుండీలు పెడుతూ వుంటే మూతి బిగించి “చూచావా? కాంగ్రెసు సెక్రటరీకి బొత్తాములు పెట్టుకునేందుకు కూడా తీరిక వుండదు. అప్పుడు కూడా అతనికి అనేక పనులు వుంటాయి” అని అన్నారు.

ఆయన అమాయకత్వానికి నాలో నేను నవ్వుకున్నాను. అయితే ఆయనకు శుశ్రూషచేయడమంటే నాకు అయిష్టత ఏర్పడలేదు. అందువల్ల నాకు ఎంతో లాభం కలిగింది.

కొద్ది కాలానికే కాంగ్రెసు వ్యవహారం అంతా తెలుసుకున్నాను. పెద్దలతో పరిచయం అయింది. గోఖ్లే, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలగు యోధులు వస్తూ పోతూ వుండేవారు. వారి వైఖరి తెలుసుకునేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్‌లో కాలం ఎంతగా వృధా అవుతున్నదో బోధ పడింది. ఇంగ్లీషు భాషకు అక్కడగల ఆధిపత్యం గమనించారు. అది చూచి నాకు దుఃఖం కలిగింది. ఒక్కడు చేసే పనికి పదిమంది పరుగెత్తడం, అవసరమైన పనికి ఒక్కడు కూడా రాకపోవడం గమనించాను.

ఈ విషయాలన్నింటిని గురించి నా మనస్సు పనిచేయసాగింది. అయితే యింత కంటే ఎక్కువ సంస్కరణ సాధ్యం కాదేమో అని మనస్సు సమాధానం చెప్పింది. అందువల్ల మనస్సులో దుర్భావన కలుగలేదు.

15. కాంగ్రెసులో

మహాసభ ప్రారంభమైంది. ఆ మంటపం యొక్క భవ్యత, ఆ వాలంటీర్ల విధానం, వేదిక మీద ఆసీనులైన ఆ పెద్దల సముదాయం చూచి నివ్వెరబోయాను. యీ సభలో నాకు చోటు ఎక్కడ అని తికమకపడ్డాను. అధ్యక్షుని ఉపన్యాసం ఒక బృహత్ గ్రంథం. దాని నంతటిని చదవడం అసంభవం. అందువల్ల కొన్ని కొన్ని అంశాలే చదువబడ్డాయి.

తరువాత విషయనిర్ణయ సభకు ఎన్నికలు జరిగాయి. గోఖ్లే గారు నన్ను అక్కడికి తీసుకువెళ్లారు.

సర్ ఫిరోజ్‌షా గారు నా తీర్మానాన్ని అంగీకరిస్తామని యిదివరకే చెప్పారు. కాని వారు ఎప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రతి తీర్మానం మీద సుదీర్ఘ ఉపన్యాసాలు సాగుతూ వున్నాయి. అవన్నీ ఇంగ్లీషులోనే తీర్మానాల్ని సమర్ధించే వారంతా ఉద్దండులే. ఈ నగారాఖానాలో నా తూతూ వినేవారెవ్వరు? రాత్రి ప్రొద్దు పోతున్నది. నా గుండె దడదడ లాగసాగింది. చివరికి మిగిలిన తీర్మానాలన్నీ వాయు వేగంతో పరుగెత్తసాగాయి. అందరూ ఇంటికి పోవాలని తొందరపడుతున్నారు.

రాత్రి పదకొండు దాటింది. నాకు మాట్లాడదామంటే సాహసం చాలడం లేదు. గోఖ్లేగారికి గతంలోనే తీర్మానం చూపించాను. వారి కుర్చీదగ్గరికి వెళ్లి మెల్లిగా “నా మాట మరిచి పోవద్దు” అని అన్నాను. “నాకు గుర్తున్నది. వాళ్ల వేగం చూస్తున్నారు కదా! ఏది ఏమైనా సరే తప్పి పోనీయను” అని వారు సమాధానం యిచ్చారు.

“ఏం, అంతా ముగిసింది కదూ!” అని ఫిరోజ్‌షాగారి ప్రశ్న.

“ఇంకా దక్షిణ ఆఫ్రికాను గురించిన తీర్మానం మిగిలివుంది. గాంధీగారు చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నారు.” అని గోఖ్లే గారు బిగ్గరగా చెప్పారు. “మీరు ఆ తీర్మానం చూచారా?” అని ఫిరోజ్‌షాగారు అడిగారు.

“చూచాను”

“మీకు బాగుందా?”

“ఆ, బాగుంది”

“అయితే గాంధీ! చదువు”

నేను వణుకుతు తీర్మానం చదివి వినిపించాను. గోఖ్లేగారు నా తీర్మానాన్ని సమర్ధించారు. “ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం” అని అంతా అరిచారు. గాంధీ! నీవు అయిదు నిమిషాలు మాట్లాడు అని వాచా గారు ఆదేశించారు. నాకు అక్కడ జరుగుతున్న పద్ధతి ఏమీ నచ్చలేదు. తీర్మానాన్ని అర్ధం చేసుకునేందుకు ఎవ్వరూ ప్రయత్నించడంలేదు. ఎప్పుడు వెళ్లిపోదామా అని అంతా తొందర పడుతున్నారు. గోఖ్లేగారు ముందే తీర్మానం చూచారు గనుక యింకెవ్వరూ చూడదలుచుకోలేదు.

తెల్లవారింది. ఉపన్యాసం ఎలా యివ్వడమా అని యోచించసాగాను. అయిదు నిమిషాల్లో ఏం చెప్పగలను? నేను విషయం మీద మాట్లాడేందుకు సిద్ధపడే వచ్చాను. కాని సమయం బహుకొద్ది. శబ్దాలు తోచడం లేదు. ఏది ఏమైనా ఏదో మాట్లాడాలి. యింటి దగ్గర తయారు చేసుకోవచ్చని ఉపన్యాసం చదవకూడదని నిర్ణయించుకున్నాను. దక్షిణ - ఆఫ్రికాలో ఉపన్యాసాలు బాగానే యిచ్చాను. కాని యిప్పుడు ఎందుకో గాని మళ్లీ గొంతు పట్టుకుంది.

నా తీర్మానం రాగానే ఫిరోజ్‌షాగారు నా పేరు పెద్దగా పిలిచారు. నేను నిలబడ్డాను. తల తిరగసాగింది. తీర్మానం ఏదోవిధంగా చదివాను. ఇంతలో ఎవరో ఒక కవి తమ కవిత్వం ముద్రించి ప్రతినిధులకు పంచుతూ వున్నాడు. అందు విదేశ యాత్రను గురించి, సముద్రయాత్రను గురించి ప్రశంసించారు. నేను దాన్ని వినిపించి దక్షిణ - ఆఫ్రికాలో భారతీయులు పడుతున్న కష్టాలు కొద్దిగా పేర్కొన్నాను. యింతలో దిన్షావాచాగారు గంట బజాయించారు. అప్పటికి ఇంకా అయిదు నిమిషాలు పూర్తి కాలేదని నాకు తెలుసు. అయితే రెండు నిమిషాలు వుందనగా ఆవిధంగా గంట కొడతారట. ఆవిషయం నాకు తెలియదు. కొందరు అరగంట కంటే మించి మాట్లాడారు. అప్పుడు యీ ఈవిధంగా గంట కొట్టలేదు. అందువల్ల నాకు కష్టమనిపించింది. గంట మ్రోగగానే ప్రసంగం ఆపి కూర్చున్నాను. అయితే నేను చదివిన కవిత్వాలు ఫిరోజ్‌షాగారికి సమాధానం అని బాల్య చాపల్యం వల్ల అనుకువ్నాను.

తీర్మానం ఆమోదించబడిందా లేదా అని అడగనవసరం లేదు. ఆ రోజుల్లో ప్రజలకు ప్రతినిధులకు భేదం లేదు. ఏ తీర్మానానికి వ్యతిరేకత లేదు. అందరు చేతులెత్తడమే. ప్రతి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడటమే. నా తీర్మానం స్థితి అంతే. అందువల్ల నా తీర్మానం వల్ల ప్రయోజనం కలుగుతుందని నాకు అనిపించలేదు. కాని కాంగ్రెసులో తీర్మానం జరిగింది. అదే ఆనందం. నా తీర్మానానికి కాంగ్రెసు ముద్ర పడింది. ఇది సమస్త భారత దేశం వేసిన ముద్ర అన్నమాట. ఈ జ్ఞానం, ఈ సంతోషం ఎవరికైనా తృప్తి కలిగిస్తుంది కదా!

16. లార్డు కర్జన్ దర్బారు

కాంగ్రెసు ముగిసింది. కాని దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించి పని చేంబర్ ఆఫ్ కామర్సు మొదలగు వానితో వుండటం వల్ల నేను కలకత్తాలోనే వున్నాను. ఇందుకు ఒక నెల పట్టింది. ఈ సారి హోటల్లో వుండకుండా ఇండియన్ క్లబ్బులో వుండుటకు ఏర్పాటుచేసుకున్నాను. అందుకు అవసరమైన పరిచయం సంపాదించాను. అక్కడ గొప్ప గొప్ప వారు వుంటూ వుంటారు. వారందరితో పరిచయం కలుగుతుందనీ, దక్షిణ - ఆఫ్రికా వ్యవహారాలు చెప్పి వారికి అభిరుచి కలిగించవచ్చునని నా ఆశ. గోఖ్లేగారు ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ బిలియర్డ్సు ఆడటానికి వచ్చేవారు. నేను కలకత్తాలో వున్నానని వారికి తెలిసి తనతో వుండమని అన్నారు. నేను సగౌరవంగా అంగీకరించాను. రెండు మూడు రోజులు గడిచాయి. తరువాత గోఖ్లేగారు వచ్చి నన్ను స్వయంగా తీసుకు వెళ్లారు. నా ముఖం చూచి వారు “గాంధీ! నీవు యీ దేశంలో వుండాలి అంటే బిడియం పెట్టుకుంటే పని జరగదు. ఎంత మందితో పరిచయం పెంచుకుంటే అంత మంచిది. నీచేత కాంగ్రెసు పనులు చేయించాలి” అని అన్నారు. గోఖ్లేగారి దగ్గరికి వెళ్లక ముందు ఇండియన్ క్లబ్బులోనే వున్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు తెలుపుతాను. ఆ రోజుల్లో లార్డుకర్జన్ ఒక దర్బారు తీర్చారు. అచటికి ఆహూతులైన రాజులు, మహారాజులు కొందరు అక్కడే బస చేశారు. వారిక్కడ బెంగాలీ ధోవతులు కట్టి కుర్తా తొడిగి ఉత్తరీయాలు వేసుకుంటూ వుండేవారు. కాని ఒకనాడు వారు తమ దగ్గర వుండే కాసాల (వడ్డన చేసేవాళ్లు) ఫాంటు తొడిగి గౌన్లు ధరించారు. తళతళలాడే బూట్లు తొడిగారు. నాకు వారి ఈ చర్య విచారం కలిగించింది. ఈ క్రొత్త వేషానికి కారణం ఏమిటని ప్రశ్నించాను.

“మా బాధలు మాకే తెలుసు. మా ధనసంపదలు, మా బిరుదులు ఖాయంగా వుంచుకునేందుకు మేము భరించే అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి?” అని జవాబు ఇచ్చారు.

“పోనీండి, ఈ కాసాతలపాగా లేమిటి? ఈ కాసాబూట్లేమిటి?” “మాకూ వడ్డన చేసే కాసాలకు అసలు తేడా ఏముందో చెప్పండి!, వాళ్లు మాకు కాసాలు. మేము లార్డుకర్జనుకు కాసాలం. అంతే తేడా. మేమీ దర్బారుకు హాజరుకాకపోతే అది మా అపరాధంగా పరిగణింపబడుతుంది. మా సహజ వేషాలతో దర్బారుకు పోతే అదికూడా పెద్ద అపరాధమే. సరే, కర్జను దర్బారుకు వెళ్లామనుకోండి. కర్జనుతో మాట్లాడటం మాతరమా? రామరామ, ఒక్కమాటైనా మాట్లాడటానికి వీలు పడదు.” ఆ మాటలు పలికిన ఆ నిర్మల హృదయుని మీద నాకు జాలి కలిగింది.

ఇటువంటి దర్బారు మరొకటి నాకు బాగా గుర్తు వుంది. లార్డ్ హార్జింజ్ బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన కావించిన చోట ఒక దర్బారు ఏర్పాటు చేశారు. అందు రాజులు, మహారాజులు పాల్గొన్నారు. భారత భూషణ మాలవ్యాగారు నన్ను అక్కడికి రమ్మని పట్టుబట్టారు. నేను అక్కడికి వెళ్లాను. కేవలం స్త్రీలకు శోభ చేకూర్చే వారి వస్త్రాలు, ఆభరణాలు చూచి నాకు ఎంతో విచారం కలిగింది. పట్టు పాజామాలు, పట్టు అంగరఖాలు, మెడలో ముత్యాలు, వజ్రాల హారాలు, బాహువులకు బాజా బందులు, తలపాగాకు వజ్రాలు, ముత్యాలు పొదిగిన తురాయిలు, వీటన్నిటితో బాటు నడుముకు బంగారు పిడిగల కరవాలాలు. ఇవన్నీ ఏమిటి? రాజచిహ్నాలా! లేక దాస్య చిహ్నాలా? యిట్టి నామర్దా కలిగించే నగలు వారే తమ యిష్ట ప్రకారం చేసుకున్నారని అనుకున్నాను. కాని యిట్టి దర్బారులకు యిట్టి వేష భూషాదులు వేసుకు రావడం వారి విధి అని తెలిసింది. కొందరు రాజులకైతే యిట్టి వస్త్రాలు, నగలు అంటే అసహ్యమనీ, యిట్టి దర్బారుల్లో తప్ప మరెప్పుడూ వాటిని తాకరని కూడా తెలిసింది. యీ మాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యితర సమయాల్లో వారు వాటిని ధరిస్తారో లేదో తెలియదు. ఏది ఏమైనా వైస్రాయి దర్బారైతేనేమి మరే దర్బారైతేనేమి ఆడవాళ్లలా వీళ్లు నగలు ధరిస్తారని తెలిసి విచారం కలిగింది. ధనం, బలం, మానం, యివి మనుష్యులచేత ఎట్టి పాపాలనైనా ఎట్టి అనర్ధాలనైనా చేయిస్తాయి కదా! 

17. గోఖ్లేగారితో ఒక మాసం - 1

మొదటి రోజునే గోఖ్లేగారు నాకుగల మొహమాటాన్ని పోగొట్టారు. నన్ను తమ్మునిలా చూచారు. నా అవసరాలేమిటో తెలుసుకొని వాటిని పూర్తిచేశారు. అదృష్టవశాత్తు నాకు కావలసినవి కడు స్వల్పం. నా పనులన్నీ స్వయంగా చేసుకోవడం నాకు అలవాటు. కనుక నా కోసం చేయవలసిందేమీ లేదు. నా పనులు నేను చేసుకోవడం, నియమబద్ధమైన నడవడి, నా దుస్తులతీరు యివన్నీ చూచి ఆయన విస్తుపోయారు. నన్ను అమితంగా స్తుతించడం ప్రారంభించారు.

వారు నాదగ్గర ఏమీ దాచేవారు కారు. తమను చూడవచ్చిన వారందరినీ నాకు పరిచయం చేసేవారు. అట్టి పరిచితుల్లో డాక్టరు ప్రపుల్ల చంద్రరాయ్‌గారు ముఖ్యులు. వారు పొరుగునే వుండేవారు. తరుచు వస్తూ వుండేవారు. “ఈ ప్రొఫెసరు రాయ్‌గారికి నెలకు 800 రూపాయలు జీతం. అందు 40 రూపాయలు మాత్రం ఖర్చులకు వుంచుకొని మిగతాదంతా ప్రజా సేవకు యిచ్చివేస్తారు. వీరింతవరకు పెండ్లి చేసుకోలేదు. ఇక ముందు పెండ్లి చేసుకునే తలంపు కూడా వీరికి లేదు.” అని చెప్పి గోఖ్లేగారు రాయ్ గారిని పరిచయం చేశారు. ఆనాటి రాయ్‌గారికీ, యీ నాటి రాయ్‌గారికి నాకు అట్టే తేడా కనబడలేదు. యిప్పుడెట్టి వస్త్రాలు ధరిస్తున్నారో అప్పుడూ అట్టి వస్త్రాలు ధరించేవారు. యిప్పుడు ఖాదీ వచ్చిపడింది. అప్పటికింకా అది రాలేదు. స్వదేశపు మిల్లు బట్టలు వుండేవి. వారిద్దరి సంభాషణ వింటున్నప్పుడు నాకు విసుగు పుట్టేదికాదు. వారి సంభాషణంతా దేశహితానికి సంబంధించిందే లేక జ్ఞానచర్చయే. వారి మాటలు కొన్ని విన్నప్పుడు కష్టం కూడా కలుగుతూ వుండేది. వారు కొందరు నాయకుల్ని తీవ్రంగా విమర్శిస్తూ వుండేవారు. వారి మాటలవల్ల నేను పర్వతాలని అనుకున్న వారంతా పరమాణువులేనని తేలింది.

గోఖ్లేగారు పనిచేసే తీరు ఆనందదాయకమేగాక జ్ఞానవర్ధకం కూడా. వారు ఒక్క నిమిషం కూడా వృధాగా పోనిచ్చేవారు కాదు. వారు చేసే ప్రతిపని దేశం కోసమే. మాట్లాడటం దేశంకోసమే. వారి మాటల్లో మాలిన్యంగాని, దంభంకాని, అసత్యంకాని లేదు. భారతదేశ దారిద్ర్యం, పారతంత్ర్యం. ఈ రెండూ ఎప్పుడూ వారి మనస్సును వేధిస్తూ వుండేవి. చాలామంది వారిని రకరకాలుగా ఆకర్షించేందుకు వస్తూ వుండేవారు. అందరికీ జవాబు చెబుతూ “మీరు మీ పని చేయండి. నన్ను నా పనిచేసుకోనీయండి. నాకు కావలసింది దేశ స్వాతంత్ర్యం, అది లభించిన తరువాతే మరొకటి. యిప్పటికి యీ పనిలో నాకు ఒక్క క్షణం తీరికలేదు.” అని అనేవారు. గోఖ్లేగారి ప్రతిమాటలోనూ రానడేగారి యెడ గౌరవం నిండి యుండేది. రానడేగారు ఇలా చెప్పేవారు అని అనడం వారికి ఊత పదం. నేనక్కడ వుండగా రానడేగారి జయంత్యుత్సవమో, వార్షికోత్సవమో (సరిగా గుర్తులేదు) జరిగింది. గోఖ్లేగారు దాన్ని ప్రతి ఏటా జరుపుతూ వుంటారట. అప్పుడు నేను గాక వారి మిత్రులు ప్రొఫెసర్ కాధనేట్ గారు మరియొక సబ్ జడ్జి వున్నారు. రానడే గారిని గురించి కొన్ని వివరాలు గోఖ్లేగారు తెలియజేశారు. రానడేగారికి, మరియు తైలంగీ భాషా పండితులు మాండలికుగారికీ గల వ్యత్యాసం చెప్పారు. మాండలికుగారికి క్లయింటు పని అంటే కడు శ్రద్ధట. ఒకనాడు వారికి రైలు అందలేదు. స్పెషల్ రైలు తెప్పించుకొని మరీ కోర్టుకు వెళ్లారట. ఇక ఆనాటి గొప్పవారందరిలో రానడే గొప్పవారు. ఆయన కేవలం న్యాయమూర్తే గాక చరిత్రకారుడు కూడా. ఆర్ధిక శాస్త్రవేత్త. గొప్ప సంస్కర్త. ప్రభుత్వ జడ్జి అయి యుండికూడా నిర్భయంగా కాంగ్రెసులో ప్రేక్షకునిగా పాల్గొనేవారు. జనానికి వారి నిర్ణయం ప్రమాణంగా వుండేది. ఈ విధంగా రానడేగారి గుణగణాలను వర్ణిస్తున్నప్పుడు గోఖ్లేగారు పరవశత్వం చెందేవారు.

గోఖ్లేగారి దగ్గర ఒక గుర్రపు బండి వుండేది. నేను దాన్ని గురించి ప్రశ్నించాను. దాని అవసరం ఏమిటో నాకు బోధపడనందున “మీరు ట్రాముబండి మీద పోతే సరిపోదా? అది నాయకుల ప్రతిష్టకు భంగమా?” అని అడిగాను.

ఈ మాటలు విని కొంచెం బాధపడి యిలా అన్నారు. “నీవు కూడా నా సంగతి తెలుసుకోలేకపోయావు. నాకు కౌన్సిలువల్ల వచ్చే సొమ్మును నా సొంతానికి ఉపయోగించను. మీరంతా ట్రాముబండ్లలో వెళుతూ వుంటే నాకు అసూయ కలుగుతుంది. నేనలా చేయలేను. ఎంతమందితో నాకు పరిచయం వున్నదో అంతమందితో నీకు కూడా పరిచయం వుంటే ట్రాములలో వెళ్లడం అసంభవం కాకపోయినా దుష్కరమని తెలిసేది. నాయకులు చేసేదంతా సౌఖ్యంకోసమేనని అనుకోవడం సరికాదు. నీ మితవ్యయవిధానం నాకు సంతోషదాయకం. వీలైనంత వరకు నేనూ అట్టి వాడినే. కాని నావంటి వానికి కొంత ఎక్కువ వ్యయం కావడం తప్పనిసరి. దీనితో నా ఆక్షేపణ ఒకటి పూర్తిగా రద్దు అయిపోయింది. కాని మరొకటి వుంది. దానికి వారు తప్పక తృప్తికరమైన సమాధానం యివ్వలేక పోయారు.

“అయితే మీరు షికారుకైనా పోరుకదా! యిక ఎప్పుడూ అస్వస్థులై వుండటం సరియేనా? దేశ కార్యాల్లో వ్యాయామానికి అవకాశం దొరకదా?” అని అడిగాను, ‘షికారుకు పోవుటకు ఎప్పుడైనా నాకు అవకాశం కలదని కనుగొన్నారా?’ అని నన్ను అడిగారు.

వారి యెడగల ఆదరం వల్ల వారి యీ మాటకు నేను సమాధానం చెప్పలేదు. వారి ఈమాటవల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని నేను మారుమాటాడలేదు. భోజనానికి మనకు సమయం దొరకడం లేదా? అదేవిధంగా వ్యాయామానికి సమయం దొరుకుతుందని నాటికీ, నేటికీ కూడా నా విశ్వాసం. దీని వల్ల దేశ సేవ తగ్గిపోదని ఎక్కువవుతుందని నా అభిప్రాయం. 

18. గోఖ్లేగారితో ఒక మాసం - 2

గోఖ్లేగారి గొడుగు నీడలో వున్న నేను కాలవ్యవధిని గమనించలేదు. హిందూ దేశమందలి క్రైస్తవుల స్థితిగతులను గురించి సవివరంగా తెలుసుకొని మీకు తెలియచేస్తానని దక్షిణ ఆఫ్రికా యందలి క్రైస్తవ మిత్రులకు చెప్పి వచ్చాను. కాళీచరణ బెనర్జీగారి పేరు విన్నాను. వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా పని చేస్తున్నారు. అందువల్ల వారంటే నాకు ఆదరం పెరిగింది. సామాన్యంగా భారతదేశ క్రైస్తవులు కాంగ్రెస్ సభల్లో పాల్గొనరు. హిందువులతో, ముసల్మానులతో కలవరు. అందువల్ల క్రైస్తవుల యెడ కలిగిన ఆ విశ్వాసం కాళీచరణ బెనర్జీ గారి యెడ నాకు కలగలేదు. నేను వారిని దర్శిస్తానని గోఖ్లేగారితో అన్నాను. వారిని చూచి ఏం చేస్తావు? వారు చాలా యోగ్యులే. కాని వారిని దర్శించినందున నీకు సంతృప్తి కలుగదని భావిస్తున్నాను. నీవు చూడదలుచుకుంటే తప్పక చూడు అని గోఖ్లే అన్నారు. నేను కాళీబాబు దర్శనం కోసం జాబు పంపాను. వారు వెంటనే అనుమతి యిచ్చారు. వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాను. ఇంట్లో వారి ధర్మపత్ని మృత్యుశయ్యమీద పడివున్నది. ఇల్లంతా నిరాడంబరంగావుంది. కాంగ్రెస్‌లో వారు కోటు, ఫాంటు ధరించి పాల్గొనేవారు. కాని యింట్లో బెంగాలీ ధోవతి కట్టుకొని వున్నారు. వారి నిరాడంబరత్వం చూచి ముగ్ధుడనయ్యాను. వారి సమయం వ్యర్థం చేయకుండా నా గొడవ చెప్పకున్నాను. “పాపాలతో బాటు మనకు పునర్జన్మ కలదను సిద్ధాంతం మీరు నమ్ముతారా?” అని వారు ప్రశ్నించారు.

“తప్పక నమ్ముతాను.”

“అయితే ఈ పాప నివారణోపాయం హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. కాని క్రైస్తవ ధర్మంలో వుంది” అని చెప్పి “పాపాలకు ఫలం మృత్యువు. యీ మృత్యువును తప్పించుకొనుటకు ఏసుక్రీస్తే శరణ్యం” అని అన్నారు.

నేను వారికి గీతలో చెప్పబడిన భక్తి యోగాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నించాను. కాని నా ప్రయత్నం వృధా అయింది. నేను వారి సౌజన్యానికి ధన్యవాదాలు సమర్పించాను. మా సంభాషణ వల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని లాభం చేకూరింది. నేను కలకత్తాలో గల వీధివీధిన బాగా తిరిగాను. చాలా దూరం నడిచాను. అప్పుడే న్యాయమూర్తి మిత్రగారిని, సర్‌గురుదాసబెనర్జీ గారిని దర్శించాను. దక్షిణ ఆఫ్రికా పనులకు వారి సాయం అవసరం. రాజాసర్‌ప్యారీ మోహన్‌ముఖర్జీగారి దర్శన భాగ్యం కూడా కలిగింది.

కాళీ చరణ బెనర్జీగారు కాళికాలయాన్ని గురించి నాకు చెప్పారు. ఒక పుస్తకంలో దాని వర్ణన చదివాను. న్యాయమూర్తి మిత్రగారి గృహం ఆ ప్రాంతంలోనే వున్నది. వారి దర్శనం చేసుకొని ఆ దారినే వస్తూ కాళికాలయం దగ్గరకి వెళ్ళాను. కాళికాదేవికి బలికాబోతున్న గొర్రెల మందను త్రోవలో చూచాను. ఆలయం సందుల్లో బిచ్చగాళ్లు గుంపులు గుంపులుగా వున్నారు. బైరాగి బాబులు సరేసరి. సంతలు, బజార్లు మొదలుగాగల చోట్ల బిచ్చగాళ్లకు కాణీకూడా యివ్వకూడదని అప్పటికే నేను నిర్ణయించుకొన్నాను. చాలామంది బిచ్చగాళ్లు నా వెంటబడ్డారు. ఒక బాబాజీ ఎత్తగు నలుచదరపు రాతికట్టడం మీద కూర్చొని వున్నాడు. ఆయన నన్ను దగ్గరికి రమ్మని పిలిచాడు. నేను, ఒక మిత్రుడు ఆయన దగ్గరకు వెళ్లాము. “నాయనా! ఎక్కడికి పోతున్నావు.” అని ఆయన నన్ను అడుగగా, తగిన సమాధానం చెప్పాను. ఆయన నన్ను, నామిత్రుణ్ణి కూర్చోమని చెప్పగా మేము కూర్చున్నాము “అయ్యా! ఇన్ని గొర్రెల్ని బలివ్వడం ధర్మమని మీరు భావిస్తున్నారా?” అని అడిగాను. “జీవహత్య ధర్మమని ఎవరంటారు?” అని ఆయన అన్నాడు.

“మీరిక్కడ కూర్చున్నారు గదా? జనానికి బోధించకూడదా?”

“అది నా పనికాదు. భగవత్సేవయే నా పని”

“అందుకు మీకు యీ చోటే దొరికిందా? వేరే చోటుదొరకలేదా?”

“ఎక్కడ బడితే అక్కడ కూర్చుంటాను. నాకన్ని చోట్లు ఒక్కటే, లోకులగోల నాకెందుకు? వాళ్లొక గొర్రెల మంద. ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోతారు. వారితో మాకేమిపని?”

నేనిక సంభాషణను పెరగనీయలేదు. తరువాత నేను దేవాలయంలోకి వెళ్లాను. ఎదురుగా రక్తపుమడి చూచి బిత్తరపోయాను. నిలబడలేకపోయాను. పెద్ద క్షోభ కలిగింది. తలక్రిందులయ్యాను. ఆ దృశ్యం ఈనాటికీ మరువలేను. ఆ సమయాన ఒక బెంగాలీ సంఘం వారు నన్ను విందుకు పిలిచారు. ఇక్కడ ఒక సజ్జనునితో ఘాతుకమగు జంతుబలిని గూర్చి ముచ్చటించాను. “అక్కడ బలియిచ్చే సమయంలో చెవులు రింగుమంటూ నౌబత్‌ఖానాలు మోగుతూ వుంటాయి. ఈ గందర గోళంలో గొర్రెలకు మృత్యుబాధ తెలియదు” అనే ఆ సజ్జనుడు అన్నాడు. వారి మాటలు నాకు రుచించలేదు. ‘ఆ గొర్రెలకి నోరుంటే ఊరుకోవు. ఘోరమైన ఈ ఆచారాన్ని ఆపివేయాలి.’ అని అన్నాను. నాకు బుద్దుని కథ జ్ఞాపకం వచ్చింది. కాని దానిని ఆపడం మాత్రం నా శక్తికి మించిన పనియని అనిపించింది.

ఈ విషయంలో అప్పుడు ఏవిధంగా భావించానో ఇప్పుడు కూడా ఆ విధంగానే భావిస్తునాను. గొర్రె ప్రాణం విలువ మనుష్యుని ప్రాణం కంటే తక్కువ కాదు. మనిషి శరీరాన్ని పోషించేందుకు గొర్రెను చంపడం ఎన్నటికీ అంగీకరించలేను. జంతువు కడు నిస్సహాయమగు ప్రాణి. మనుష్యుని సాయం పొందుటకు అది అధికారి. అయితే దానికి సాయం చేయాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండటం అవసరం. అప్పుడే ప్రాణదానం చేయగల శక్తి మనిషికి చేకూరుతుంది. గొర్రెలను ఇంతటి క్రూరమైన హోమం నుండి రక్షించాలంటే నాకు యింకా ఆత్మశుద్ధి, త్యాగం అవసరం. ఇట్టి శుద్ధిని, త్యాగాన్ని గురించి ఘోషిస్తూ ఘోషిస్తూనే ఈ దేహాన్ని విడవలసి వస్తుందేమోనని తోస్తున్నది. మనిషిని ఈమహాపాతకాన్నుండి రక్షించుటకు, నిర్దోషులగు ఈ జీవులను కాపాడుటకు, ఈ ఆలయాన్ని పవిత్రం చేయిటకు ఆ పరమేశ్వరుడు ఏ మహాపురుషుణ్ణి లేక ఏ మహాశక్తిని సృష్టిస్తాడో తెలియదు. కాని నేను అలా సృష్టించమని సదా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, త్యాగధనులు, భావుకులునగు బెంగాల్ ప్రజలు ఇట్టి వధను ఎట్లు సహించి వూరుకుంటున్నారో తెలియదు. 

19. గోఖ్లేగారితో ఒక మాసం - 3

కాళీ మాత నుద్దేశించి చేయబడుతున్న భయంకరమగు ఈ యజ్ఞాన్ని చూచిన తరువాత బెంగాలీ ప్రజల జీవిత విధానాన్ని గురించి తెలుసు కోవాలనే కోరిక కలిగింది. బ్రహ్మసమాజ మత గ్రంధాలు బాగా చదివాను. వారి ఉపన్యాసాలు విన్నాను. వారు వ్రాసిన కేశవ చంద్రసేన్ గారి జీవిత చరిత్రను ఆసక్తితో చదివాను. సాధారణంగా బ్రహ్మసమాజానికి, అసలు బ్రహ్మాసమాజానికి గల భేదం తెలుసుకున్నాను. పండిత శివనాధశాస్త్రిగారిని దర్శించాను. ప్రొఫెసర్ కాధవటేగారితో కలిసి మహర్షి దేవేంద్రనాధ టాగూరు గారిని దర్శించుటకు వెళ్ళాను. కాని ఆ సమయంలో వారు ఎవ్వరికీ దర్శనం యివ్వడంలేదని తెలిసింది. అందువల్ల వారి దర్శనం కాలేదు. కాని వారి ఇంట్లో జరిగే బ్రహ్మసమాజోత్సవానికి ఆహ్వానింపబడి వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొన్నాను. అక్కడ శ్రేష్టమైన బెంగాలీ సంగీతం విన్నాను. అప్పటినుండి బెంగాలీ సంగీతం అంటే నాకు ఆసక్తి బాగా పెరిగింది.

బ్రహ్మసమాజాన్ని గురించి తెలుసుకున్న తరువాత శ్రీ వివేకానందస్వామి వారి దర్శనం చేసుకోకుండా ఎలా ఉండగలను? అత్యుత్సాహంతో బేలూరు మఠం నడిచి వెళ్ళాను. ఎంతదూరం నడిచానో నాకు ఇప్పుడు గుర్తు లేదు. ఏకాంత స్థలం పున్న ఆ మఠం చూచి నేను చాలా ఆనందపడ్డాను. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాముల వారు జబ్బుపడి కలకత్తాలో వున్నారని తెలిసింది. ఈ సమాచారం విని నిరాశపడ్డాను. తరువాత సోదరి నివేదిత గారి ఇంటి జాడ తెలుసుకొని వెళ్ళి ఆమెను దర్శించాను. ఆమె వైభవం చూచి నిలువునా నీరైపోయాను. మాటలోను పలుకులోను కూడా మా ఇద్దరికి పొంతన కుదర్లేదు. నేను ఈ విషయం గోఖ్లేగారికి చెప్పాను. “ఆమె” తేజస్సుగల వనిత. మీ ఇద్దరికి కుదరదు అని గోఖ్లేగారు అన్నారు.

మరోసారి పేస్తన్‌జీ గారి యింట్లో మేమిద్దరం సమావేశమయ్యాము. ఆమె అక్కడ వుండగా నేను వెళ్లాను. ఆమె పేస్తన్‌జీ వృద్ధమాతకు ఉపదేశం ఇస్తున్న సమయం అది. అనుకోకుండా నేను ఇద్దరికీ మధ్య దుబాసి అయినాను. సోదరి నివేదితకు నాకు భావైక్యత లేకపోయినా, ఆమెకు హిందూ మతం యెడ గల అగాధ ప్రేమను గమనించాను. ఆమె రచించిన గ్రంథాలు ఆ తరువాత దక్షిణ ఆఫ్రికా కార్యాలయం కోసం కొన్నాను. కలకత్తా లోని నాయకుల్ని దర్శించడానికి మిగతా అర్ధదినం, ధార్మిక సంస్థల్ని, ఇతర సార్వజనిక సంస్థల్ని దర్శించేందుకు వెచ్చించాలని నిర్ధారించుకున్నాను.

నేనొక రోజున డాక్టరు మల్లిక్ గారి అధ్యక్షతన జరిగిన సభలో బోయర్ యుద్ధంలో భారతీయుల సేవాబృందం చేసిన పనిని గురించి ఉపన్యసించాను, “ఇంగ్లీష్‌మన్” పత్రికాధిపతి పరిచయం ఇప్పుడు కూడ నాకు ఉపయోగపడింది. సాండర్సుగారికి ఇప్పటికీ సుస్తీగానే వుంది. అయితే 1896 లో నాకు ఏవిధంగా సాయం చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా సాయం చేశారు. నా ఈ ఉపన్యాసానికి గోఖ్లేగారు సంతోషించారు. డాక్టరు రాయ్‌గారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించే సరికి యింకా సంబరపడ్డాను. నేనీ విధంగా గోఖ్లేగారి గొడుగు నీడన వుండటం వల్ల బెంగాల్ ప్రాంతంలో నాపని తేలిక అయింది. బెంగాల్ నందు గొప్ప గొప్ప కుటుంబాల వారితో నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. చిరస్మరణీయాలైన సంగతులు ఈ కాలానికి సంబంధించినవి చాలా వున్నాయి. కాని వాటిని ఇక్కడ వివరించడం లేదు. ఈ సమయంలో బ్రహ్మ దేశ (బర్మా) వెళ్లి వచ్చాను. అక్కడి వూంగీలను (సన్యాసుల్ని) కలిశాను. వాళ్ల సోమరితనం చూచి నాకు నవ్వు వచ్చింది. బంగారు పెగోడాలు (గోపురాలు) చూచాను. దేవళంలో లెక్కలేనన్ని కొవ్వొత్తులు వెలుగుతూ వున్నాయి. అవి నాకు నచ్చలేదు. గర్భాలయంలో పరుగెత్తుతున్న ఎలుకల్ని చూచేసరికి దయానందస్వామి వారి అనుభవం గుర్తుకు వచ్చింది. బ్రహ్మదేశంలో స్త్రీ ఉత్సాహాన్ని చూచి సంతోషించాను. కాని పురుషుల మాంద్యం చూచి విచారించాను. బొంబాయి ఎట్లా హిందూ దేశం కాదో, అట్లే రంగూను బ్రహ్మదేశం కాదని చూచి తెలుసుకున్నాను. హిందూ దేశంలో మనం ఇంగ్లీషు వర్తకులకు కమీషన్ ఏజంట్లుగా భావించి వ్యవహరిస్తున్నట్లే, ఇంగ్లీషు వాళ్లు అక్కడి వర్తకులతో కలిసి బ్రహ్మదేశం వాళ్ళను కమీషన్ ఏజంట్లుగా చేసుకొన్నారని నాకు బోధపడింది. బ్రహ్మదేశాన్నుండి తిరిగి వచ్చిన తరువాత గోఖ్లేగారి దగ్గర సెలవు తీసుకున్నాను. వారిని విడిచి పెట్టడం ఎంతో కష్టమనిపించింది. అయితే నాకు బెంగాలులో లేక కలకత్తాతో పని అయిపోయింది. అన్ని పనుల కంటే ముందు హిందూ దేశంలో మూడో తరగతి రైలుబండ్లలో ప్రయాణం చేసి ఆ తరగతిలో ప్రయాణించేవారి కష్టాలు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయం గోఖ్లేగారికి విన్నవించాను. వారు వెంటనే నవ్వారు కాని నా అభిప్రాయాలు తెలుసుకొని సంతోషించారు. ముందు కాశీకి వెళ్ళి అనిబిసెంట్ గారి దర్శనం చేసుకొందామని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఆమె జబ్బుపడి మంచం పట్టి వున్నది.

మూడోతరగతి రైలుబండి ప్రయాణానికి తగిన సరంజామా సిద్ధం చేసుకోవలసి వచ్చింది. లడ్లు, పూరీలు నింపిన టిఫిన్‌బాక్సు ఒకటి గోఖ్లేగారు బహూకరించారు. పన్నెండు అణాలు పెట్టి ఒక సంచి కొన్నాను. ఒక రకమైన చాయగల ఉన్నికోటు (పోరుబందరు ప్రాంతంవారు ధరిస్తారు), ఒక తువాలు, ఒక ధోవతి, ఒక చొక్కా దాన్లో వుంచాను. కప్పుకునేందుకు ఒక కంబళీ తీసుకున్నాను. ఒక లోటా కూడా తీసుకుని ప్రయాణమైనాను.

గోఖ్లేగారు, రాయ్‌గారు నన్ను సాగనంపడానికి రైలు స్టేషనుకు వచ్చారు. రావద్దని బ్రతిమిలాడాను. కాని వారు నా మాట వినలేదు. “నీవు ఒకటో తరగతిలో ప్రయాణిస్తూవుంటే నేను రాను. కాని ఇప్పుడు రాక తప్పదు” అని గోఖ్లేగారు అన్నారు.

ప్లాటుఫారం మీదకు వస్తూ వున్నప్పుడు గోఖ్లేగారిని ఎవ్వరూ ఆపలేదు. వారు పట్టు పాగా చుట్టుకున్నారు. కోటు తొడుక్కున్నారు. డాక్టర్‌రాయ్ గారు బెంగాలీ దుస్తుల్లో వున్నారు. ఆ కారణంవల్ల టిక్కెట్టు కలెక్టరు వారిని మొదట ఆపి వేశాడు. కాని గోఖ్లేగారు “నా మిత్రులు” అని చెప్పిన మీదట రానిచ్చారు. ఈ విధంగా వారిద్దరు వచ్చి నన్ను సాగనంపారు. 

20. కాశీలో

కలకత్తా నుండి రాజకోట వెళ్ళే దోవలో గల కాశీ, ఆగ్రా, జయపూర్, పాలన్పూర్ చూచుకుంటు రాజకోట చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రతిచోట ఒక్కొక్క రోజు వున్నాను. పాలన్‌పూరులో తప్ప మిగతా అన్ని చోట్ల సత్రాల్లోను పండాల ఇళ్ళల్లోను వున్నాను. ఈ ప్రయాణానికంతకు రైలు చార్జీతో సహా మొత్తం ముప్పది ఒక్క రూపాయలు మాత్రం ఖర్చు అయిందని గుర్తు. మూడవ తరగతిలో ప్రయాణం చేస్తున్నప్పటికి మైలు బండ్లు ఎక్కలేదు. వాటిలో జనం క్రిక్కిరిసి వుండటం గమనించాను. మిగతా రైళ్ళ కంటే మైలుబండ్లలో మూడవ తరగతి చార్జీకూడా ఎక్కువే. నాకది కష్టమనిపించింది,

మూడోతరగతి పెట్టెలో చెత్త చెదారం, మరుగుదొడ్ల కంపు ఇప్పుడెట్లా వున్నాయో అప్పుడు కూడా అట్లాగే వున్నాయి. కొద్దిగా మార్పులు జరిగితే జరిగియుండవచ్చు. మూడో తరగతికి, మొదటి తరగతికి చార్జీల్లో తేడావుండటమే గాక సౌకర్యాల్లో కూడా తేడా వుంది. మూడో తరగతి ప్రయాణీకులకి, గొర్రెలకి తేడా ఏమీ లేదు. ఇక్కడి బండ్లు కూడా గొర్రెలకు అనుకూలమైనవని చెప్పవచ్చును.

యూరపులో మూడోతరగతిలో ప్రయాణం చేయటమే నాకు అలవాటు. ఎట్లా వుంటాయో చూద్దామని ఒకసారి మొదటి తరగతి పెట్టె ఎక్కాను. మూడోతరగతికి మొదటి తరగతికి పెద్ద తేడా నాకు కనబడలేదు. దక్షిణ ఆఫ్రికాలో మూడో తరగతి ప్రయాణీకులంటే నీగ్రోలన్న మాట. కొన్ని పెట్టెల్లో మూడోతరగతి ప్రయాణీకులకు సౌకర్యాలు వుంటాయి. కొన్ని బండ్లలో మూడో తరగతి ప్రయాణీకులకు పడుకొనేందుకు ఏర్పాట్లు వుంటాయి. కూర్చునే చోట దిండ్లు వుంటాయి. పెట్టెల్లో సీట్లను మించి జనం ఎక్కరు. మనదేశంలో అసలే రైల్వేవారిలోట్లు ఎక్కువ. వాటితో బాటు యిటు ప్రయాణీకులు కూడా చాలా అపరిశుభ్రంగా వుంటారు. వాళ్ళ ప్రక్కన కూర్చొని ప్రయాణించడం శుచిగా వుండేవారికి చాలా కష్టం. అట్టి ప్రయాణం వాళ్లకు శిక్షయే. చాలామంది పెట్టెలోనే ఉమ్మి వేస్తూ వుంటారు. మురికి చేస్తూ వుంటారు, బీడీల పొగ సరేసరి. తమలపాకులు, పొగాకు నమిలి పిచికారీ చేస్తూ వుంటారు. బిగ్గరగా మాట్లాడుతూ వుంటారు. ప్రక్క వారికి యిబ్బందిని లెక్కచేయకుండా దుర్భాషలాడుతూ వుంటారు. ఈ విధమైన మూడోతరగతి పెట్టెల్లో ప్రయాణం చేసి చాలాసార్లు పైన తెలిపిన యాతనలన్నింటిని అనుభవించాను.

నేను 1920 లో మూడో తరగతి పెట్టెలో ప్రయాణించాను. 1915 నుండి సంవత్సరం పాటు విడవకుండా మూడో తరగతిలో ప్రయాణం చేశాను. అప్పటికి యిప్పటికీ పెద్ద భేదం నాకు కనబడలేదు. ఈ మహావ్యాధికి ఒక్కటే మందు. చదువుకున్న వాళ్లంతా మూడోతరగతిలో ప్రయాణం చేసి ప్రయాణీకుల దురభ్యాసాలను తొలగింప చేసేందుకు కృషిచేయాలి. అవసరమైన మార్పుల్ని గురించి అర్జీలు పంపించి రైలు అధికారుల్ని నిద్రపోనీయకూడదు. తమతమ సౌఖ్యాలకోసం లంచాలు యివ్వకూడదు. ఇతర అన్యాయమార్గాలను త్రొక్కకూడదు. రైలు నియమాలను అతిక్రమించకూడదు. ఈ విధంగా చేస్తే జనానికి కొద్దో గొప్పో సంస్కారం కలుగుతుందని అనుభవం వల్ల చెబుతున్నాను. నేను జబ్బుపడినందువల్ల 1920 నుండి మూడోతరగతి ప్రయాణం మానుకున్నాను. ఇందుకు నాకు సిగ్గు వేసింది. విచారం కలిగింది. మూడో తరగతి ప్రయాణీకుల ఇక్కట్లు కొద్దికొద్దిగా తగ్గి దారికి వస్తున్న తరుణంలో నాకు జబ్బు చేసి అట్టి అదృష్టం తప్పిపోయింది. రైళ్లలోను, ఓడల్లోను ప్రయాణం చేసే బీదవాళ్ళకు కలిగే చిక్కుల్ని, అసౌకర్యాలను తొలగించేందుకు అంతా కృషి చేయాలి. యిది అందరికీ సంబంధించిన ఒక స్వతంత్ర విషయం. అందుకు ఒకరిద్దరు సమర్ధులు పూనుకుంటే మేలు జరుగుతుంది.

ఇక యీ విషయం మాని కాశీ కథ చెబుతాను. ప్రాతః కాలసమయంలో కాశీలో కాలు పెట్టాను. పండా ఇంట దిగుదామని అనుకున్నాను. చాలామంది బ్రాహ్మణులు నా చుట్టూ మూగారు. వారందరిలో శుచిగా యున్న పండా యింటికి వెళదామని అనుకున్నాను. అట్టి పండాను చూచి వారి యింటికి వెళ్ళాను. ఆ పండా ఇల్లు శుచిగా వుంది. ముంగిట్లో గోవు కట్టివేయబడి వుంది. యిల్లు పరిశుభ్రంగా వుంది. మేడ మీద నా బస. యధావిధిగా గంగా స్నానం చేయాలని భావించాను. అంతవరకు అన్నం తినకుండా వుండాలని అనుకున్నాను. అవసరమైన ప్రయత్నమంతా పండా చేశాడు. ఒక రూపాయి పావలా కంటే ఎక్కువ దక్షిణ యివ్వలేనని మొదటనే పండాకు చెప్పాను. దానికి తగినట్లే చేయమని చెప్పాను. అతడు ఏమాత్రం జగడం పెట్టుకోలేదు. “ఫకీర్లకైనా పాదుషాలకైనా పూజ ఒకే రీతిగా చేయిస్తాను. యాత్రికులు వారి వారి శక్త్యానుసారం యిస్తారు. దాని కేమిటి?” అని పండా అన్నాడు. పూజా సమయంలో అతడు మంత్రాలు మింగినట్లు అనిపించలేదు. పన్నెండు గంటలకు పూజా స్నానాదులు ముగించుకొని కాశీ విశ్వనాధుని దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ చూచిన విషయాలు వాకు ఎంతో దుఃఖం కలిగించాయి.

1891వ ఏట నేను బొంబాయిలో బారిస్టరీ చేస్తున్నప్పుడు ప్రార్ధనా సమాజ మందిరంలో కాశీ యాత్రను గురించి ఒక ఉపన్యాసం విన్నాను. ఆ ప్రసంగం విని నిరాశ పడ్డాను. కాశీ వెళ్ళాను. కానీ ప్రత్యక్ష దర్శనం చేసుకొని అనుకున్న దాని కంటే అధికంగా నిరాశపడ్డాను.

జారుడుగా వున్న ఒక ఇరుకు సందులో నుండి ఆలయం లోపలికి వెళ్లాలి. అక్కడ శాంతి అనే మాటకు తావులేదు. ఎక్కడ చూచినా ఈగలు గుయ్ అంటున్నాయి. యాత్రికుల రొదకు, దుకాణాల వాళ్ల రగడకు అంతేలేదు. ధ్యానానికి, భగవచ్చింతనకు అది నిలయం. అలాంటి చోట వాటికే తావు లేదు. అయితే తమ చుట్టుప్రక్కల ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో లీనమైయున్న కొంతమంది స్త్రీలను నేను చూచాను. అందుకు ఆలయ అధికారుల్ని ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఆలయ ప్రాంతం శాంతంగా, నిర్మలంగా, సుగంధితంగా ఉంచడం ఆలయ అధికారుల విది. నేనక్కడ మోసపువర్తకులు రెండోరకం మిఠాయి అమ్ముతూ వుండటం చూచాను.

ఆలయంలో అడుగు పెట్టేసరికి గుమ్మంలో కుళ్ళిన పూలు కనబడ్డాయి. వాటినుండి దుర్గంధం వస్తూవుంది. లోపల నేలమీద చలువ రాళ్ళు పరచబడి వున్నాయి. ఆ చలవరాళ్ల మీద అంధభక్తుడొకడు రూపాయలు తాపింపచేశాడు. దానిలోకి మురికి దూరి స్థావరం ఏర్పరుచుకుంది.

‘జ్ఞానవాసి’ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఈశ్వరుడి కోసం వెతికాను. కాని వృధా. అక్కడ నా మనస్సు బాగుండలేదు. జ్ఞానవాసి దగ్గరకూడా అంతా చెడుగే. దక్షిణ యిచ్చేందుకు బుద్ధిపుట్టలేదు. అందువల్ల ఒక్క దమ్మిడీ మాత్రం అక్కడ వేశాను. ఒక పండా తిట్లుతిట్టి “నీవు ఈ విధంగా అవమానం చేస్తే నరకంలో పడతావు” అని శపించాడు. “అయ్యా, నా కర్మ ఎలా కానున్నదో కానీయండి. మీరు యిట్టి దుర్భాష నోటితో పలుకకూడదు. ఈ దమ్మిడీ తీసుకుంటే తీసుకోండి. లేకపోతే యిది కూడా మీకు దక్కదు” అని నేనన్నాను. “పో, నీ దమ్మిడీనాకు కావాలనుకున్నావా? పో, పో” అని పండా యింకో నాలుగు తిట్లు వడ్డించాడు. ఆ దమ్మిడీని తీసుకొని బయటపడ్డాను. “పండా మహాశయుడికి దమ్మిడీ నష్టం, నాకు దమ్మిడి లాభం...” అని నేను అనుకున్నాను. కాని ఆయన దమ్మిడి కూడా పోనిచ్చేరకం కాదు. అతడు నన్ను వెనక్కి పిలిచి “మంచిది. అక్కడ వుంచు, నేను నీ మాదిరిగా చేయకూడదు. నేను తీసుకోకపోతే నీకు అమంగళం కలుగుతుంది” అని అన్నాడు.

నేను మాట్లాడకుండా దమ్మిడీ అక్కడ బెట్టి తిరుగుముఖం పట్టాను.

తరువాత ఒకటి రెండు సార్లు కాశీ విశ్వనాధుని దగ్గరకు వెళ్ళాను. కాని అప్పటికి నాకు మహాత్మ బిరుదు లభించింది. కావున 1902 వ ఏట కలిగిన అనుభవం ఇప్పుడు ఎలా కలుగుతుంది? ఇప్పుడు నేనే దర్శన పాత్రుణ్ణి అయిపోయాను. యిక నాకు అప్పటిలాంటి దృశ్య దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది? మహాత్ముల కష్టాలు మహాత్ములకే ఎరుక. యిక ఆలయం విషయం. అక్కడ ఒకటే కమురుకంపు. గతంలో ఆలయం లోపల ఎలా వున్నదో ఇప్పుడూ అలాగే వుంది. ఎవరికైనా దేవుని దయ మీద సందేహం వుంటే వాళ్లిటువంటి తీర్ధ క్షేత్రాల్ని చూతురుగాక. ఆ మహాయోగి పరమేశ్వరుడు తన పేరిట జరుగుతున్న మోసం అధర్మం దుర్మార్గం అలా ఎందుకు సహిస్తున్నాడో తెలియదు.

‘యే యధా మాం ప్రపద్యంతే తాంస్తథైవభజామ్యహమ్’ ఎవరు ఎట్లా నన్ను కొలుస్తారో వారికి అట్టి ఫలం యిస్తాను. అని భగవానుడు చెప్పాడు. కర్మను ఎవడు మార్చగలడు? మధ్యన భగవానుడు తానెందుకు కల్పించుకోవాలి? ధర్మాన్ని యిలా నిర్ధారించి ఆయన అంటే భగవంతుడు అంతర్హితుడైనాడు.

నేనీ అనుభవాలు వెంట బెట్టుకొని మిసెస్ బిసెంటు దర్శనానికి వెళ్ళాను. ఆమె అప్పుడు జబ్బుపడి లేచింది. నేను వచ్చానని తెలియగానే ఆమె లోపలినుండి నన్ను చూచేందుకు బయటికి వచ్చింది. నేను కేవలం దర్శనం కోసం వచ్చాను. “మీకు ఒంట్లో బాగాలేదని విన్నాను. అందువల్ల మిమ్మల్ని చూచి వెళదామని వచ్చాను. మీకు జబ్బుగా వున్నా దర్శనం యిచ్చారు. చాలు. సంతృప్తి కలిగింది. ఇంతకంటే ఎక్కువ కష్టం మీకు కలిగించను” అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాను.

21. బొంబాయిలో నివాసం

నేను బొంబాయిలో వుండి బారిస్టరీ చేస్తూ దానితో బాటు ప్రజా సేవ చేస్తూ వుండాలని గోఖ్లేగారి కోరిక. ఆ రోజుల్లో లోక సేవ అంటే కాంగ్రెస్ సేవ అన్నమాట. అప్పుడు గోఖ్లేగారు ఒక సంస్థను స్థాపించారు. దాని పని కేవలం కాంగ్రెస్ పనులు చేయడమే.

నా కోరిక కూడా అదే. కాని బారిస్టరీలో ఆత్మవిశ్వాసం తక్కువ. పూర్వానుభవాల్ని నేను మరచిపోలేదు. కేసుల కోసం వాళ్ళను వీళ్ళను ప్రాధేయపడటం నాకు నచ్చదు.

అందువల్ల మొదట నేను రాజకోటలోనే మకాం పెట్టాను. అక్కడ నా హితైషులు, నన్ను ఇంగ్లాండుకు పంపిన వారు నగు కేవల్‌రాం మావజీదవే గారు మూడు కేసులు తెచ్చి యున్నారు. అందు రెండు అప్పీళ్ళు. కాఠియావాడ్ జుడిషియల్ అసిస్టెంట్ దగ్గర వాటి విచారణ జరుగుతున్నది. మిగిలినది అసలు దావా. అది జామ్ నగర్‌లో జరుగుతున్నది. అది పెద్ద దావా. ఈ దావాలో గెలిపిస్తానని పూచీ పడలేనని చెప్పాను. ‘ఓడిపోయేది మేము కదా! నీవు శక్తి కొద్ది పనిచేయి. నేను నీతో వుంటాను!’ అని కేవలరాం గారు అన్నారు. ప్రతిపక్షాల వకీలు కీ.శే సమర్ధ్. నేను కేసు క్షుణ్ణంగా చదివాను. నాకు ఇండియన్‌లా బాగారాదు. కేవలరాంగారు నాకు నూరి పోశారు. “ఎవిడెన్సు ఆక్టు విధానమంతా ఫిరోజ్‌గారికి కరతలామలకం. ఆయన గొప్పవాడు కావడానికి అదే కారణమని నా మిత్రులు, దక్షిణ ఆఫ్రికాకు వెళ్లక పూర్వం నాకు చెబుతూ వుండేవారు. ఈ సంగతి నేను గుర్తుంచుకొని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లేటప్పుడు టీకాలతో సహా దాన్ని బాగా పఠించాను. ఇంతేగాక నాకు దక్షిణ ఆఫ్రికాలో మంచి అనుభవం కలిగింది.

నేను దావా గెలిచాను. అందువల్ల నా విశ్వాసం దృఢపడింది. అప్పీళ్ళ విషయంలో నాకు భయం లేదు. వాటిలో కూడా గెలిచాను. ఇక బొంబాయి వెళ్ళినా భయం లేదని ధైర్యం కలిగింది.

ఈ విషయం ఎక్కువగా చెప్పేముందు తెల్ల అధికారుల అత్యాచారం, అజ్ఞానం గురించి కలిగిన అనుభవం చెబుతాను. ఈ జ్యుడిషియల్ అసిస్టెంటుగా వున్న ఒక దొర ఎప్పుడూ ఒక చోట వుండడు. ఈయన త్రిపాదిలా ఎక్కడెక్కడికి తిరుగుతూ వుంటాడో వకీళ్ళు, క్లయింట్లు కూడా అక్కడక్కడికి తిరుగుతూ వుండాలి. తమ చోటు విడిచి వచ్చే వకీళ్లకు ఫీజు ఎక్కువ యివ్వవలసివున్నందున క్లయింట్లకు ఖర్చు అధికమైపోత్నుది. ఇదంతా విచారించవలసిన అవసరం జడ్జీకి లేదు కదా!

వేరావల్ అను గ్రామంలో అప్పీలు విచారణ జరుగనున్నది. అక్కడ ప్లేగు ముమ్మరంగా వుంది. రోజుకి 50 మందికి ప్లేగు తాకుతూ వున్నదని గుర్తు. జనాభా దరిదాపు 5,500. దాదాపు గ్రామమంతా శూన్యం. నేను ఒక శూన్యంగా వున్న సత్రంలో విడిది చేశాను. అది గ్రామానికి కొంచెం సమీపాన వుంది. కాని పాపం పార్టీలు ఎక్కడ పుంటారు? బీదవారైతే ఇక వాళ్ల రక్షకుడు భగవంతుడే.

“అక్కడ ప్లేగు వుండటం వలన విచారణను మరోచోటుకి మార్చమని దొర గారిని కోరవచ్చును.” అని ఒక వకీలు మిత్రుడు నాకు తంతి పంపాడు. నేనా విధంగా కోరగా ప్లేగుకు భయపడుతున్నారా అని దొర అడిగాడు.

“ఈ విషయంలో మీరు మా భయాన్ని గురించి యోచించవద్దు. మా సంరక్షణోపాయం మాకు తెలుసు. కాని క్లయింట్ల గతి ఏమిటి?” అడిగాను.

హిందూ దేశంలో ప్లేగు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. దీనికి భయమెందుకు? వేరావల్ ఎంతో మంచిది (దొర గ్రామానికి దూరంగా రాజభవనం లాంటి డేరాలో వున్నాడు) ఈ విధంగా బయట వుండటం అందరికీ నేర్పాలని యిలా చేస్తున్నాను.

ఇది ఆయన వేదాంతం. దీని ముందు యిక నా మాట చలామణి ఎలా అవుతుంది. “గాంధీగారు చెప్పింది గుర్తు పెట్టుకొని వకీళ్ళకు, పార్టీలకు నిజంగా కష్టం కలుగుతూ వుంటే నాకు చెప్పండి” అని దొర శిరస్తాదారుకు చెప్పాడు. దొర తాను చేస్తున్నది ఒప్పే అనుకొని అలా చేస్తున్నాడను విషయం నిజం. కాని నల్లవాళ్లు పడుతున్న ఇబ్బందుల ముందు అది ఏపాటిది? ఆయనకు బీదవారగు నల్లవారి అవసరాలు, అలవాట్లు, స్వభావాలు, ఆచారాలు ఎట్లా తెలుస్తాయి? రూపాయల మీద నడిచే వాడికి పైసల సంగతి ఎలా తెలుస్తుంది! ఎంత ప్రయత్నించినా ఏనుగు చీమను గురించి తెలుసుకోలేదు. అదే విధంగా ఏనుగులవంటి తెల్లవాళ్ళు చీమలాంటి నల్లవాళ్లను తెలుసుకోవాలన్నా వాళ్ళను తీర్చిదిద్దాలన్నా సాధ్యం కాదు.

ఇక స్వవిషయం. పైన తెలిపిన విధంగా నామీద నాకు విశ్వాసం కలిగింది. కొంతకాలం రాజకోటలోనే వుందామని భావించాను. ఇంతలో కేవలరాంగారు నా దగ్గరకు వచ్చి “నిన్నిక్కడ వుండనీయను. నీవు యిక బొంబాయిలో వుండవలసి వస్తుంది.” అని అన్నాడు.

“అయితే అక్కడ కేసులేవీ? నా ఖర్చు మీరు భరిస్తారా!”

“అహా, నీ ఖర్చులు నేను భరిస్తాను. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద బారిస్టర్లను ఇక్కడికి తీసుకువచ్చినట్లు నిన్ను తీసుకు వస్తాను. వ్రాతకోతల పనులన్నీ అక్కడికి పంపిస్తాను. బారిస్టర్లను పెద్దవాళ్ళను చేయడం, చిన్నవాళ్ళను చేయడం ప్లీడర్ల చేతిలో పని కాదా! జాంనగర్‌లోసు, వేరావలులోను నీ పనిని సరిగ్గా నిర్వహించావు. ఇక మాకు చింత లేదు. లోకారాధన చేయవలసిన వాడవు. ఇక నిన్ను కాఠియావాడులో వుండనీయం. ప్రయాణం ఎప్పుడో చెప్పు.”

“నేటాలునుండి నాకు కొంత పైకం రావాలి. అది రాగానే నేను బొంబాయి వెళతాను”

పైకం రెండు వారాల్లో వచ్చింది. నేను బొంబాయి వెళ్ళాను “ఫేయిన్ గిల్ బర్టు అండ్ సయానీస్" అను ఆఫీసులో చేంబరు అద్దెకు తీసుకొని అక్కడే బసచేశాను.

22. ధర్మసంకటం

నేను ఆఫీసుతో పాటు గిరిగాములో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. కాని ఈశ్వరుడు నన్ను స్థిరంగా వుండనీయలేదు. ఇల్లు తీసుకున్న కొద్దిరోజులకే మా రెండో పిల్లవాడికి బాగా జబ్బు చేసింది. టైఫాయిడ్ జ్వరం. ఎంతకీ తగ్గలేదు. మాటలు తడబడడం ప్రారంభమైంది. రాత్రి సన్నిపాత లక్షణాలు. ఈ వ్యాధికి ముందు అతనికి మశూచి ముమ్మరంగా పోసింది. డాక్టరును పిలిపించాను. “ఇందుకు మందు పనిచేయదు. కోడిగుడ్లరసం, కోళ్ళరసం ఇవ్వాలి” అని డాక్టరు చెప్పాడు.

మణిలాలు వయస్సు పదిఏళ్ళు. పిల్లవాణ్ణి ఏమని అడగను? సంరక్షకుణ్ణి నేను. నేనే ఏదో ఒక నిర్ణయం చేయాలి. డాక్టరు సజ్జనుడు. పారసీకుడు “అయ్యా, మేము మాంసాహారులం కాము. మీరు చెప్పిన ఈ రెండు వస్తువుల్లో దేన్నీ ముట్టము. ఇందుకు బదులు మరొకటి చెప్పండి.” అని అన్నాను.

“మీ పిల్లవాడి జీవితాశలేదు. పాలలో నీళ్ళు కలిపి ఇవ్వవచ్చు. కాని ఆ ఆహారం చాలదు. నేను చాలామంది హిందువుల ఇళ్ళల్లో వైద్యం చేస్తున్నాను. మీకు తెలుసు. వాళ్ళంతా నే చెప్పినట్లు చేస్తారు. నేను చెప్పిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నారు. నేను చెప్పినట్లు మీరు కూడా విని ఈ పిల్లవాడి విషయంలో కాఠిన్యం వహించకుండా వుంటే మేలు జరుగుతుంది.

మీరన్నది నిజమే. కాని ఒక్క విషయం చెప్పక తప్పదు. ఈ విషయంలో నా బాధ్యత చాలా ఎక్కువ. అతడు పెద్ద వాడైయుంటే అతడి ఇష్టానుసారం వ్యవహరించి వుండేవాణ్ణి. కాని ఆ భారం నా మీద పడింది. మనిషికి ధర్మసంకటం ఏర్పడేది ఇలాంటి సమయాల్లోనేనని భావిస్తున్నాను. తప్పో ఒప్పో మనుష్యుడు మాంసం తినకూడదని నా నిర్ణయం. జీవన సాధనానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రాణం నిలుపుకోడం కోసమైనా ఈ వస్తువుల్ని తినరాదని నా అభిప్రాయం. అందువల్ల నాకు గాని నావారికి గాని ఇట్టి సమయంలో కూడా మాంసం మొదలగు వాటిని తినిపించకూడదని నా ధర్మమర్యాద బోధిస్తున్నది. మీరు ఈ పిల్లవాడి జీవితానికి ప్రమాదం అని చెప్పినా లేక నిజంగా ప్రమాదం సంభవించినా నేను వాటిని ముట్టను. కాని ఒక్కటి మాత్రం యాచిస్తున్నాను. మీ మందులు నేను వాడను. నాకు నాడి, హృదయ పరీక్ష తెలియదు. నాకు కొంచెం కొంచెం జల చికిత్స తెలుసు. నేనా చికిత్స చేస్తాను. మీరు నియమప్రకారం మణిలాలును చూచి శరీరంలో కలిగే మార్పుల్ని నాకు తెలిపితే మీ మేలు మరువలేను అని అన్నాను. సజ్జనుడగు అతనికి నా ఇబ్బంది తెలిసింది. నేను కోరిన ప్రకారం వచ్చి మణిలాలును చూచి వెళతానని అన్నాడు.

మణిలాలు తన ఉద్దేశ్యం నిర్ధారించి చెప్పగలవాడు కాకపోయినా, నాకు డాక్టరుకు జరిగిన సంభాషణంతా చెప్పి నీ ఉద్దేశ్యం ఏమిటి అని అడిగాను.

“నీవు మామూలుగా జలవైద్యం చేయి. నాకు కోళ్ళూ వద్దు, కోడిగ్రుడ్లరసమూ వద్దు” అని మణిలాలు అన్నాడు. బాబూ, వాటిని తిను అని నేను చెబితే పిల్లవాడు తింటాడని నాకు తెలుసు. అయినా అతని మాటలవల్ల నాకు సంతోషం కలిగింది. నాకు కూనే వైద్యం కొద్దిగా తెలుసు. లోగడ నుండి ఈ వైద్యం నేను చేస్తున్నాను. రోగానికి లంకణం పరమౌషధం అని నా భావం. కూనే వైద్యం ప్రకారం మణిలాలుకు కటిస్నానం మూడు నిమిషాలు మాత్రం చేయించాను. మూడు రోజుల వరకు నీరు కలిపిన నారింజ పండ్ల రసం ఇచ్చాను. కాని ఉష్ణం తగ్గలేదు. రాత్రిళ్ళు కొంచెం కొంచెం పెరుగుతూ వున్నది. 104 డిగ్రీల దాక జ్వరం వుంటున్నది. నాకు కంగారు పుట్టింది. “పిల్లవాడికి ఏమైనా అయితే లోకులేమంటారు? మా అన్నగారేమంటారు? మరో డాక్టరును పిలిపించకూడదా? ఆయుర్వేద వైద్యుణ్ణి పిలిపించకూడదా? అపక్వమైన తమ బుద్ధిని పిల్లలపై ప్రయోగించే హక్కు తల్లిదండ్రుల కెక్కడిది? ఈ రకమైన ఊహలతో మనుస్సు బరువెక్కింది ‘జీవుడా! నీవు నీకోసం ఏంచేస్తున్నావో నీ పిల్లవాడి కోసం కూడా అదే చేయి. పరమేశ్వరుడు సంతోషిస్తాడు. నీకు జలచికిత్స అంటే గురి. మందు మీద అట్టి గురి లేదు. డాక్టరు ప్రాణం పోయలేడు. అతడిచ్చేది మందు. ప్రాణతంతువు దేవుడి చేతుల్లో వుంది. అందువల్ల దైవనామం స్మరించు. దానిని నమ్ము. నీ మార్గం విడవకు’ అను ఊహ మనస్సులో జనించింది.

మనస్సులో ఎంతో మధనపడుతూ వున్నాను. చీకటి పడింది. రాత్రి మణిలాలును దగ్గరకు తీసుకొని పడుకున్నాను. తడిగుడ్డ కప్పవచ్చని అనుకున్నాను. లేచి బట్ట తెచ్చి చన్నీటిలో తడిపి పిడిచి తలవరకు కప్పాను. పైన రెండు కంబళ్ళు, కప్పాను. తలకు తడితువాలు చుట్టాను. ఒళ్ళు పెనంలా కాలుతున్నది. వంటి మీద చెమట బొట్టు లేదు.

నాకు దడ పుట్టింది. మణిలాలును తల్లికి అప్పగించాను. ఒక్క అరగంట సేపు తెరపగాలిలో తిరిగి శ్రమ తీర్చుకొని శాంతి పొందుదామని తలచి చౌపాటి వైపుకు వెళ్ళాను. పదోగంట కొట్టారు. మనుష్యుల రాక పోకలు తగ్గాయి. కాని నాకు ఆదేమీ తెలియదు. నేను దుఃఖ సాగరంలో మునిగి వున్నాను. “ఓ ఈశ్వరా! ఈ ధర్మ సంకటంలో నా ప్రార్ధన అంగీకరించు” అని అంటూ నిలబడ్డాను. నా నాలుక మీద రామనామం ఆడుతూ వుంది. కొంత సేపటికి ఇంటికి బయలుదేరాను. నా గుండెలు దడదడలాడుతూ వున్నాయి. ఇంట్లో ప్రవేశించాను. “నాన్నా! వచ్చావా?” అని మణిలాలు అన్నాడు. “ఆ నాయనా!”

“నన్ను బయటికి తీయండి. చచ్చిపోతున్నాను.”

“చెమట పోస్తున్నదా!”

“చెమటతో స్నానం చేశాను వెంటనే తీసివేయినాన్నా?”

నేను మణిలాలు తల తాకి చూచాను! చెమట చేతికి తగిలింది. జ్వరం దిగజారింది. ఈశ్వరునికి చేతులెత్తి నమస్కరించాను.

“నాయనా! మణిలాలూ! భయంలేదు. యిక జ్వరం పోతుంది. ఇంకొంచెం చెమట పోయనీయి”

“ఇక ఆగలేను. యిప్పుడే నన్ను బయటికి తీయండి. అవసరమైతే యింకోసారి కప్పవచ్చు”

నాకు ధైర్యం వచ్చింది. మాటల్లో కొద్ది నిమిషాలు గడిచాయి. చెమట ధారగా కారసాగింది. కప్పిన బట్టలన్నీ తొలగించాను. ఒళ్ళంతా తుడిచి ఆరనిచ్చాను. తరువాత తండ్రీ బిడ్డలం ఆ మంచం మీదనే నిద్రించాం. మా యిద్దరికీ గాఢంగా నిద్రపట్టింది. తెల్లవారింది. లేచి చూచాను. మణిలాలుకు వేడి చాలా వరకు తగ్గి పోయింది. నలభైరోజులు పాలు, నీళ్ళు, పండ్లు వీటితో నడిపాను. నాకు భయం పోయింది. జ్వరం మొండిదే కాని లొంగిపోయింది. నేడు నా పిల్లలందరిలో మణిలాలు ఆరోగ్యవంతుడు. బలిష్టుడు కూడా.

దీనికి కారణం? రాముడి కృపయా? జలచికిత్సయా? అల్పాహారమా? లేక ఏదేని ఉపాయమా? నిర్ణయం ఎవరు చేయగలరు? ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు భావించవచ్చును. కానీ ఆ సమయంలో ఈశ్వరుడే నా ప్రార్థనను ఆలకించాడని నా నమ్మకం. ఆనాటికీ, యీనాటికీ అదే నా నమ్మకం.

23. మళ్లీ దక్షిణ-ఆఫ్రికా

మణిలాలుకు పూర్తిగా నెమ్మదించింది. గిరిగాము నందలి గృహం వాసయోగ్యంగా లేదని అనుకున్నాను. ఇల్లంతా తేమ. తగిన వెలుగులేదు. అందువల్ల నేను రేవాశంకరుగారితో మాట్లాడి మంచి చోట గాలివచ్చే ఇల్లు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. బాంద్రా, శాంతాకృజ్ వగైరాలన్నీ తిరిగాము. బాంద్రాలో కసాయి దుకాణం వుండటం వల్ల అక్కడ నివసించడానికి నాకు బుద్ధి పుట్టలేదు. ఘల్‌కోపర్ వగైరాలు సముద్రానికి దూరమని అనిపించింది. శాంతాకృజ్‌లో ఒక అందమైన బంగళా దొరికింది. అక్కడ కాపురం పెట్టాను. ఆరోగ్యదృష్ట్యా సురక్షితం అని భావించాను. చర్చిగేటు వరకు వెళ్లడానికి ఒక మొదటి తరగతి రైలు పాసు తెప్పించుకున్నాను. మొదటి తరగతి బండిలో అనేక పర్యాయాలు నేనొక్కడినే ప్రయాణించినట్లు గుర్తు. అందువల్ల నాకు కొంచెం గర్వంకూడా కలిగింది. చాలాసార్లు బాంద్రానుండి చర్చిగేటుకు సరాసరి వెళ్లే బండిని అందుకోవడం కోసం శాంతాక్రజ్ నుండి బాంద్రాకు నడిచి పోతూ వుండేవాణ్ణి. నాకు రాబడి బాగానే ఉంది. దక్షిణ-ఆఫ్రికా క్లయింట్లు కూడా కొంచెం పని ఇస్తూ వున్నారు. అందువల్ల నా ఖర్చులకు సొమ్ము సరిపోతున్నది.

ఇంతవరకు నాకు హైకోర్టుతో పనిపడలేదు. కాని ఆ రోజుల్లో అక్కడ ‘సూట్‌’ (చర్య) జరుగుతూ వుండేది. దానికి వెళుతూ వుండేవాణ్ణి. అందులో పాల్గొందామంటే ధైర్యం చాలదు. అందు జమీయత్‌రామ్ నానా భాయిగారు ప్రధాన స్థానం ఆక్రమించుతూ వుండేవారని గుర్తు. క్రొత్త బారిస్టర్లందరివలె నేను కూడా హైకోర్టుకు కేసులు వినడానికి వెళుతూ వుండేవాణ్ణి. అచ్చట ఏదో ఒకటి వినడానికి బదులు సముద్రం మీద నుండి మెల్లమెల్లగా వచ్చే చల్లగాలికి కునికిపాట్లు పడి ఆనందం అనుభవిస్తూ వుండేవాణ్ణి. నా వలెనే కునికిపాట్లు పడే ఇతరుల్ని కూడా అక్కడ చూచి సిగ్గు పోగొట్టుకున్నాను. అక్కడ అలా నిద్రించడం కూడా ఒక ఫాషనేనని తలపోశాను. హైకోర్టులో గల గ్రంథాలయాన్ని ఉపయోగించడం ప్రారంభించాను. అక్కడ కొందరితో పరిచయం చేసుకోసాగాను. ఇక కొద్ది కాలంలోనే హైకోర్టులో పని ప్రారంభించగలనని భావించాను.

ఈ మధ్య వృత్తి నిర్వహణను గురించిన చింత కొంచెం కొంచెం తగ్గసాగింది. మరోవైపున గోఖ్లేగారి కండ్లు నా మీద వున్నాయి. వారానికి రెండు మూడు సార్లు నా ఛేంబరులోకి వచ్చి నా యోగక్షేమం తెలుసుకొని వెళ్ళసాగారు. అప్పుడప్పుడు తన మిత్రుల్ని కూడా తీసుకొని వస్తూ ఉండేవారు. పనిచేసే విధానం నాకు తెలుపుతూ ఉండేవారు.

అయితే నా భవిష్యద్విషయాన్ని గురించి ఒక్క సంగతి చెప్పడం మంచిదని భావిస్తున్నాను. నేను మొదట ఏమి చేయదలచుకొనేవాడినో ఈశ్వరుడు దాన్ని సాగనిచ్చేవాడు కాదు. తానొకటి తలిస్తే దైవమింకొకటి తలచినట్లు నా విషయంలో జరుగుతూ ఉంది. నేను స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. కొంచెం స్వస్థుణ్ణి కూడా అయ్యాను. ఇంతలో హఠాత్తుగా దక్షిణ ఆఫ్రికా నుండి తంతి వచ్చింది. “చేంబర్లేనుగారు ఇచటికి రానున్నారు. నీవు వెంటనే రావాలి” ఇది ఆ తంతి సారం. నేను వారికి చెప్పిన మాటలు గుర్తున్నాయి. నేను మళ్ళీ తంతి పంపాను. “నా ఖర్చులు సిద్ధం చేయండి. బయలు దేరి వస్తాను” అని. వెంటనే డబ్బు వచ్చింది. అక్కడ ఒక ఏడాది పడుతుందని అనుకున్నాను. బంగళా నాక్రిందనే వుంచుకొని భార్యాబిడ్డల్ని అందు వుంచి వెళదామని నిర్ణయించుకున్నాను. ఈ దేశంలో పని దొరకని చిన్నవాళ్ళు, విదేశాలకు వెళ్ళేందుకు సాహసించడం మంచిదని అప్పుడు నాకు తోస్తూవుండేది. అందువల్ల నా వెంట నలుగురైదుగురిని తీసుకువెళ్లాను. వారిలో మగన్‌లాల్‌గాంధీ కూడా ఒకరు.

గాంధీ కుటుంబం పెద్దది. ఇంకను వృద్ధి అవుతూ ఉంది. వీరిలో స్వాతంత్ర్యం కోరేవారిని స్వతంత్రుల్ని చేయాలని నా భావన. మా తండ్రిగారు వారినందరినీ జమీందారీ నౌకరీలో బెట్టి ఏదో విధంగా పోషిస్తూ వుండేవారు. వాళ్ళు తమంతట తాము సంపాదించుకోగల స్వతంత్రులు కావాలని నా కోరిక. మగన్‌లాల్ గాంధీని సిద్ధం చేయగలిగాను. ఈ విషయం ముందు వివరిస్తాను.

భార్యాబిడ్డల వియోగం, స్థిరపడిన వకీలు పనిని త్రెంచి వేయడం, నిశ్చిత వస్తువు నుండి అనిశ్చిత వస్తువునందు ప్రవేశించడం, ఇదంతా ఒక నిమిషం పాటు బాధాకరం అనిపించింది. కాని నాకు అనిశ్చిత జీవనం అలవాటు అయిపోయింది. ఈ ప్రపంచంలో భగవంతుడొక్కడే సత్యం. మిగిలినదంతా అనిశ్చితం. మన చుట్టుప్రక్కల కనిపించేదీ జరిగేది అంతా అనిశ్చితం. క్షణికం. దీనియందు నిశ్చిత రూపమైన ఏ పరమతత్వం విలీనమై ఉన్నదో దాని ప్రదర్శనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం మీద నమ్మకం వుంచితే మన జీవనం సార్ధకం కాగలదు. ఈ అన్వేషణే పరమ పురుషార్థం అని అంటారు

నేను దర్బనుకు ఒకరోజు ముందుగా వెళ్ళలేకపోయాను. నేను చేయవలసిన పని అంతా తయారు చేసి ఉంచారు. చేంబర్లేనుగారిని చూచుటకు తేదీ నిర్ణయించబడింది. వారికి అందజేయవలసిన అర్జీ వ్రాసి నేను డిప్యుటేషనుతో వెళ్ళాలి.


* * *

Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.