సత్యశోధన/మూడవభాగం/2. తుఫాను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. తుపాను

డిసెంబరు పద్దెనిమిదవ తేదీనాడు టోయిటోలో రెండు ఓడలు లంగరు వేశాయి. దక్షిణ ఆఫ్రికా రేవుల్లో డాక్టరు వచ్చి ప్రతి యాత్రికుణ్ణి జాగ్రత్తగా పరీక్ష చేస్తాడు. దారిలో ఎవరికైనా అంటురోగం పట్టుకుంటే వాళ్ళను ఓడ యొక్క క్వారంటీనులో ఉంచుతారు. మేము బొంబాయి నుండి బయలుదేరినప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి వున్నది. అందువల్ల మాకు క్వారంటీను బాధ తప్పదని కొంచెం భయపడ్డాము. రేవులో లంగరు వేశాక ప్రప్రథమంగా ఓడ మీద పచ్చ జెండా ఎగురవేస్తారు. డాక్టరు పరీక్షించి చీటీ యిచ్చేదాక పచ్చజెండా ఎగురుతూ వుంటుంది. పచ్చ జండాను దింపి వేసిన తరువాతనే బయటివాళ్ళను ఓడ మీదికి రానిస్తారు. ఆ నియమం ప్రకారం మా ఓడమీద కూడా పచ్చజండా ఎగరవేశారు. డాక్టరు వచ్చి అయిదు రోజులు క్వారంటీను అని ఆదేశించాడు. ప్లేగుక్రిములు ఇరవైమూడు దినాలు జీవించి వుంటాయని వారి ఉద్దేశ్యం. మేము బొంబాయి నుండి బయలు దేరి పద్దెనిమిది రోజులు గడిచాయి. కనుక యింకా అయిదు రోజులు ఓడ మీద వుంటే ఇరవై మూడు రోజులు పూర్తి అవుతాయని వాళ్ల అభిప్రాయం.

కానీ మమ్మల్ని క్వారంటీనులో వుంచటానికి మరోకారణం కూడా వున్నది. డర్బనులోని తెల్లవాళ్ళు మమ్మల్ని తిరిగి ఇండియాకు పంపివేసేందుకై పాతాళహోమం ప్రారంభించారు. ఈ ఆదేశానికి అదికూడా ఒక కారణం.

దాదా అబ్దుల్లా కంపెనీ వారు పట్టణంలో జరుగుతున్న వ్యవహారాలను గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూవున్నారు. తెల్లవాళ్ళు ఒకనాటి కంటే మరొకనాడు పెద్ద పెద్ద సభలు జరుపుతూ జనాన్ని రెచ్చగొడుతూ వున్నారని తెలిసింది. అబ్దుల్లా గారిని ఒకవంక భయపెడుతూ, మరోవంక లాలిస్తూ వున్నారట. ఈ రెండు ఓడల్ని తిరిగి ఇండియాకు పంపివేస్తే నష్టమంతా చెల్లించివేస్తామని కూడా చెప్పారట. దాదా అబ్దుల్లా యిట్టి బెదిరింపులకు బెదిరే రకం కాదు. అప్పుడు భాగస్వాములైన సేఠ్ అబ్దుల్ కరీం హాజీ ఆదం గారు కంపెనీ తరఫున వ్యవహర్తలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఓడలను రేవుకు చేర్చి యాత్రికులనందరినీ దింపి తీరతానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఏనాటికానాడు జరుగుతున్న వ్యవహారాలను ఆయన పూసగుచ్చినట్లు నాకు తెలియచేస్తూ వున్నాడు. కీర్తి శేషులు మన సుఖలాల్ హీరాలాల్ నాజరుగారు నన్ను చూచేందుకు అదృష్టవశాత్తు డర్బను విచ్చేశారు. వారు చాలా చతురులు, వీరులు కూడా. జనం వారి సలహాలను పాటిస్తూవుంటారు, వారి వకీలు మిస్టర్ లాటిన్. వారుకూడా అంతటి వారే. వారు తెల్లవారి చేష్టల్ని ఖండించారు. కేవలం డబ్బు పుచ్చుకునే వకీలువలె గాక నిజమైన మిత్రునివలె వారికి సహాయం చేస్తున్నారు

ఈ విధంగా డర్బనులో ద్వంద్వయుద్ధం ప్రారంభమైందన్నమాట. ఒకవంక కూటికి లేని నల్లవాళ్లు, మరొకవంక వీరికి మిత్రులైన కొందరు తెల్లవాళ్ళు వేరొకవంక ధనబలం, కండబలం, అక్షరబలం, సంఖ్యాబలం కలిగిన తెల్లవాళ్లు. అంతటి బలవంతులైన తెల్లవారికి ప్రభుత్వబలం కూడా తోడుగా వున్నది. నేటాలు ప్రభుత్వం వీరికి బహిరంగంగా తోడ్పడుతూ వున్నది. స్వయంగా హారీ ఎస్కాంబీగారు వారి సభలో పాల్గొని బహిరంగంగా వత్తాసు పలకడంతో వాళ్లు హద్దు దాటిపోయారు.

కావున మా క్వారంటీను కేవలం ఆరోగ్యానికి సంబంధించింది కాదని తేలిపోయింది. యాత్రీకుల్ని ఏజంటును భయపెట్టి ఏదో విధంగా ఓడల్ని తిరిగి, పంపివేయడమే వాళ్ల ముఖ్యోద్దేశం. “మీరు తిరిగి వెళ్ళిపోండి. లేకపోతే సముద్రంలో ముంచి వేస్తాం. తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ యిచ్చివేస్తాం” అని మమ్ము హెచ్చరించడం ప్రారంభించారు.

నేను యాత్రికుల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పసాగాను. నాదరీ ఓడయందలి యాత్రికులకు కూడా ధైర్యంగా వుండమని, భయపడవద్దని సమాచారం పంపించాను.

యాత్రీకుల వినోదం కోసం ఓడల్లో రకరకాల ఆటలు ఏర్పాటు చేశాం. క్రిస్‌మస్ పండుగ కూడా వచ్చింది. కెప్టెను యాత్రికులందరికీ డిన్నరు యిచ్చాడు. అందు మేము, మా పిల్లలం ముఖ్యులం. భోజనాశాల తరువాత ఉపన్యాసాలు సాగాయి. నేను పాశ్చాత్య నాగరికతను గురించి ప్రసంగించాను. అది గంభీరోపన్యాసానికి తగిన సమయం కాదని నాకు తెలుసు. కాని మరో విధంగా ప్రసంగించడం నా వల్లకాని పని. నేను వినోదంగాను, ప్రమోదంగాను మాట్లాడాను. కాని నా మనస్సంతా డర్బనులో జరుగుతున్న సంగ్రామం మీద కేంద్రీకరించి యున్నది. అందుకు ముఖ్య కారణం, యీ సంగ్రామానికి కేంద్రబిందువును నేనే. నామీద క్రింద తెలిసిన రెండు నేరాలు మోపారు.

  1. నేను భారతదేశంలో పర్యటించి నేటాలులోగల తెల్లవారిని అనుచితంగా నిందించాను
  2. నేను నేటాలును భారతీయులతో నింపివేయాలని చూస్తున్నాను. అందుకోసం కురలేండు, నాదరీ ఓడలనిండా ఎంతోమందిని తీసుకు వస్తున్నాను.

నాకు విషయం బోధపడింది. నావల్ల దాదా అబ్దుల్లా గారికి పెద్ద అపాయం కలుగనున్నదని స్పష్టంగా తేలిపోయింది. నేను ఒంటరిగా రాక నా భార్యను, పిల్లల్ని కూడా వెంట తీసుకొని వచ్చి వాళ్ళను ప్రమాదంలో పడవేశాను.

నిజానికి నేను నిర్దోషిని. నేను ఎవ్వరనీ నేటాలు రమ్మని ప్రోత్సహించలేదు. నాదరీయందలి యాత్రికుల్ని అప్పటివరకు నేను ఎరుగను. కురలేండు యందలి యిద్దరి ముగ్గురి పేర్లు తప్ప మిగతావారి పేర్లు కూడా నేను ఎరగను. నేటాలులో చెప్పిన మాటలే భారతదేశంలో కూడా చెప్పాను. అంతకంటే మించి ఒక్క మాట కూడా నేను అనలేదు. నేను చెప్పిన ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యం వున్నది.

ఏ సంస్కారానికి నేటాలు యందలి తెల్లవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఏ స్థాయిలో వారు వ్యవహరిస్తున్నారో ఆ వివరం తెలుసుకొన్న మీదట విచారం కలిగింది. దాన్ని గురించి బాగా యోచించాను. ఆ విషయం నలుగురి ముందు ప్రసంగించాను. మిగతా వారికి నా అభిప్రాయం తెలియకపోయినా, కెప్టెన్‌గారికీ, తదితరులకు నా అభిప్రాయం బోధపడింది. అందువల్ల వారి జీవితంలో ఏమైనా మార్పు కలిగిందో లేదో తెలియదు. ఆ తరువాత తెల్లవారి సంస్కారాల్ని గురించి కెప్టెను మొదలగు వారితో చాలా సేపు చర్చ జరిగింది. నేను పాశ్చాత్య సంస్కారం హింసాపూరితం అని చెప్పాను. నా మాటలకు తెల్లవారు కొందరు ఆవేశపడ్డారు కూడా.

“తెల్లవారి బెదిరింపులు కార్యరూపం దాలిస్తే మీరు అహింసా సిద్ధాంతాన్ని ఎలా అనుసరిస్తారు” అని కెప్టెను ప్రశ్నించాడు. “వీరిని క్షమించుటకు, వీరిపై చర్చ గైకొనకుండుటకు అవసరమైన శక్తిని పరమేశ్వరుడు నాకు ప్రసాదించుననే ఆశ నాకున్నది. ఇప్పటికీ వీరి మీద నాకు రోషం లేదు. వారి అజ్ఞానం, వారి సంకుచిత దృష్టి చూస్తే నాకు జాలి కలుగుతున్నది. తాము చేస్తున్నదంతా సముచితమే అని వారు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందువల్ల కోపం తెచ్చుకునేందుకు కారణం నాకు కనబడటం లేదు” అని జవాబిచ్చాను. అక్కడి వారంతా నవ్వారు. వారికి నా మాటలమీద విశ్వాసం కలగలేదన్నమాట.

ఈ విధంగా రోజులు కష్టంగా గడిచాయి. క్వారంటీను నుండి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు. ఆఫీసరును అడిగితే “ఈ విషయం నా చేతులు దాటింది. ప్రభుత్వం ఆదేశించగానే మిమ్ము దింపివేస్తాం” అని సమాధానం యిచ్చాడు. ఇంతలో కడపటిసారిగా “మీరు ప్రాణాలు దక్కించుకోదలిస్తే మాకు లొంగిపోండి” అని తెల్లవారు హెచ్చరిక పంపారు. అందుకు సమాధానంగా “నేటాలు రేవులో దిగుటకు మాకు హక్కు వున్నది. ఎన్ని అపాయాలు వచ్చినా మా హక్కును కాపాడుకొంటాం” అని నేను, సహయాత్రికులం సమాధానం పంపించాం. ఇరవై మూడు రోజులు గడిచిపోయాయి. జనవరి 13 వతేదీనాడు ఓడలు రేవులోకి ప్రవేశించవచ్చని ఆదేశం యివ్వబడింది. యాత్రికులు రేవులో దిగవచ్చని కూడా ఆ ఆదేశంలో పేర్కొనబడింది.