సత్యశోధన/మూడవభాగం/1. తుఫాను చిహ్నాలు

వికీసోర్స్ నుండి

మూడవభాగం

1. తుపాను చిహ్నాలు

కుటుంబ సభ్యులతో బాటు నేను ఓడమీద ప్రయాణం చేయడం యిదే ప్రథమం. మధ్యతరగతి హిందూ కుటుంబాలల్లో బాల్యవివాహాలు జరుగుతూ వుంటాయని, భర్త చదువుకున్నవాడు గాను- భార్య నిరక్షర కుక్షిగాను వుంటుందని అనేక చోట్ల వ్రాశాను. భార్యాభర్తల జీవితంలో సముద్రమంత అంతరం వుంటుంది. భర్త భార్యకు ఉపాధ్యాయుడు అవుతాడు. నేను నా భార్యాబిడ్డల వేష భాషల మీద, ఆహార విహారాదులమీద దృష్టి సారించాను. వాళ్ళకు ఎట్లా నడుచుకోవాలో బోధించడం అవసరమని భావించాను. అప్పటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకుంటే యిప్పుడునాకు నవ్వు వస్తుంది. హిందూ స్త్రీ పతిభక్తియే తన ధర్మమని భావిస్తుంది. భర్త దేవుడని భావిస్తుంది. ఆ కారణం వల్ల భర్త ఎలా ఆడిస్తే అలా భార్య ఆడవలసి వస్తుంది.

మనం నాగరికులం అని అనిపించుకోవాలంటే తెల్లవారిని అనుకరించాలి. అలా అనుకరిస్తేనే మన పలుకుబడి పెరుగుతుంది, అలా చేయకపోతే లాభం లేదని ఆ రోజుల్లో గట్టిగా నమ్మేవాణ్ణి. యీ కారణాలవల్ల నా భార్యాబిడ్డలకు నేనే దుస్తుల్ని నిర్ణయించాను. నా పిల్లల్ని చూచి లోకులు కాఠియావాడు కోమట్లండోయ్ అని అంటే ఓర్వగలనా? పార్సీ వాళ్ళు అందరి కంటే నాగరికంగా వుంటారని ప్రతీతి. అది గమనించి నా భార్యకు, పిల్లలకు తెల్లవాళ్ల డ్రస్సు వేయకుండా పార్సీ డ్రస్సు వేయాలని నిర్ణయించాను. నా భార్యకు పారసీ పద్ధతి చీర, పిల్లలకి పారసీలకోటు, పాంట్లు, అందరికి బూట్లు, మేజోళ్ళు కొన్నాను. నాభార్యకు, పిల్లలకి కొంతకాలం దాకా ఇవి నచ్చలేదు. బూట్లు వేసుకుంటే కాళ్లు కరిచాయి. మేజోళ్ళు వేసుకుంటే చెమట. బొటనవ్రేళ్ళు బిగదీసుకు పోయాయి. వాళ్ళు వద్దన్నా నేను అంగీకరించలేదు. నామాటల్లో అధికార భావం ఎక్కువగా పనిచేసింది. అందువల్ల పాపం ఏం చేస్తారు? నా భార్య, పిల్లలు ఆ దుస్తులే ధరించారు. అదే విధంగా యిష్టం లేకపోయినా భోజనం ఇంగ్లీషువాళ్ళ విధానంలో చేయడం ప్రారంభించారు. నాకు వ్యామోహం తొలగినప్పుడు వాళ్ళు డ్రస్సు, ఫోర్కులు, ముళ్ళగరిటెలు వగైరాలు విడనాడి మామూలు పద్ధతికి వచ్చారు. ముందు వాటికి అలవాటు పడడం ఎంత కష్టమైందో, అలవాటు అయిన తరువాత వాటిని విడనాడటం కూడా అంతే కష్టమైంది. ఈ నాగరికతా వ్యామోహమనే కుబుసాన్నుండి బయటపడ్డ తరువాత ఎంతో బరువు తగ్గినట్లు అంతా భావించాము.

ఓడమీద ఎక్కడికైనా నేను వెళ్ళవచ్చు. అట్టి స్వేచ్ఛ నాకు లభించింది. ఓడ ఏ రేవులోనూ ఆగకుండా తిన్నగా నేటాలు పోతున్నది. కనుక ప్రయాణం 18 రోజులేనని తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో మేము ఒడ్డుకు చేరబోతుండగా రాబోయే తుపానుకు చిహ్నంగా, ముందుగా సముద్రంలో పెద్ద తుపాను ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో డిసెంబరు నందు వేసవి కాలం వస్తుంది. వానలు కూడా కురుస్తూవుంటాయి. ఆ కారణం వల్ల చిన్న, పెద్ద తుపాన్లు, వానలు తప్పవన్నమాట. కాని ఈ తుపాను ఎక్కువ రోజులు వీచడం వల్ల యాత్రీకులకు చాలా యిబ్బందులు కలిగాయి.

అదొక విచిత్ర మైన దృశ్యం. ఆపద సమయంలో జనం ఏకమైనారు. భేదబుద్ధి నశించింది. ఒక్క భగవంతుణ్ణే అంతా స్మరించడం ప్రారంభించారు. హిందువులు, మహమ్మదీయులు అంతా హృదయ పూర్తిగా దేవుణ్ణి స్మరించసాగారు. కొందరు ముడుపులు కట్టారు. కెప్టెను యాత్రికుల మధ్యకు వచ్చి “ఈ తుపాను పెద్దదే అయినా పరవాలేదు. నేను యింత కంటే పెద్ద తుపాన్లు చూచాను. ఓడ గట్టిదే. మునిగిపోదు. భయపడవద్దు” అని చెప్పాడు. కాని దాని వల్ల ఎవ్వరికీ ధైర్యం కలగలేదు. త్వరలోనే ఓడ చిన్నాభిన్నమైపోతున్నట్లు పెద్దగా ధ్వనులు వినబడసాగాయి. ఓడ తిరగబడిపోతున్నట్లుగా సముద్రపు కెరటాల్లో ఊగసాగింది. డెక్కు మీద ఎంతో భీభత్సంగా వున్నది. ఎవరినోట విన్నా ‘దైవస్మరణే’

ఈ స్థితి 24 గంటల సేపు వున్నదని గుర్తు. ఆ తరువాత కారు మబ్బులు విడిపోయాయి. సూర్యదర్శనం అయింది. తుపాను తొలగిపోయిందని కెప్టెను ప్రకటించాడు. యాత్రికుల ముఖాలు సంతోషంతో విప్పారాయి. అపాయం తగ్గిపోయినట్లే భగవన్నామస్మరణ కూడా తగ్గిపోయింది. మృత్యుభయం తొలగిపోయింది కదా! తిరిగి మాయ అందరినీ ఆవరించిందన్నమాట. నమాజులు ప్రారంభమైనాయి. భజనలు కూడా జరుగుతూ వున్నాయి. కానీ వీటిలో తుపాను సమయంలో గల ఏకాగ్రత లేదు.

ఈ తుపాను కారణంగా యాత్రీకులందరితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. నాకు తుపానంటే భయం కలగలేదు. భయం కలిగినా అది బహుతక్కువే. అటువంటి తుపాన్లు అదివరకు చాలా చూచాను. సముద్రయానంలో జబ్బుపడను. అందువల్ల ధైర్యం వహించి ఓడలో అటుయిటు తిరుగుతూ యాత్రీకులను ఓదారుస్తూ వున్నాను. ఈ స్నేహబంధం నాకు ఎంతో ఉపయోగ పడిందని చెప్పగలను.

ఓడ డిసెంబరు పద్దెనిమిదో తేదీనో, లేక పందొమ్మిదవ తేదీనో డర్బను రేవులో లంగరు వేసింది. నాదరీ ఓడకూడా ఆరోజే చేరుకున్నది. కాని నిజమైన తుపాను యిక ముందు రాబోతున్నదని అప్పటికి నాకు తెలియదు.