సత్యశోధన/మూడవభాగం/16. లార్డు కర్జన్ దర్బారు

వికీసోర్స్ నుండి

16. లార్డు కర్జన్ దర్బారు

కాంగ్రెసు ముగిసింది. కాని దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించి పని చేంబర్ ఆఫ్ కామర్సు మొదలగు వానితో వుండటం వల్ల నేను కలకత్తాలోనే వున్నాను. ఇందుకు ఒక నెల పట్టింది. ఈ సారి హోటల్లో వుండకుండా ఇండియన్ క్లబ్బులో వుండుటకు ఏర్పాటుచేసుకున్నాను. అందుకు అవసరమైన పరిచయం సంపాదించాను. అక్కడ గొప్ప గొప్ప వారు వుంటూ వుంటారు. వారందరితో పరిచయం కలుగుతుందనీ, దక్షిణ - ఆఫ్రికా వ్యవహారాలు చెప్పి వారికి అభిరుచి కలిగించవచ్చునని నా ఆశ. గోఖ్లేగారు ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ బిలియర్డ్సు ఆడటానికి వచ్చేవారు. నేను కలకత్తాలో వున్నానని వారికి తెలిసి తనతో వుండమని అన్నారు. నేను సగౌరవంగా అంగీకరించాను. రెండు మూడు రోజులు గడిచాయి. తరువాత గోఖ్లేగారు వచ్చి నన్ను స్వయంగా తీసుకు వెళ్లారు. నా ముఖం చూచి వారు “గాంధీ! నీవు యీ దేశంలో వుండాలి అంటే బిడియం పెట్టుకుంటే పని జరగదు. ఎంత మందితో పరిచయం పెంచుకుంటే అంత మంచిది. నీచేత కాంగ్రెసు పనులు చేయించాలి” అని అన్నారు. గోఖ్లేగారి దగ్గరికి వెళ్లక ముందు ఇండియన్ క్లబ్బులోనే వున్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు తెలుపుతాను. ఆ రోజుల్లో లార్డుకర్జన్ ఒక దర్బారు తీర్చారు. అచటికి ఆహూతులైన రాజులు, మహారాజులు కొందరు అక్కడే బస చేశారు. వారిక్కడ బెంగాలీ ధోవతులు కట్టి కుర్తా తొడిగి ఉత్తరీయాలు వేసుకుంటూ వుండేవారు. కాని ఒకనాడు వారు తమ దగ్గర వుండే కాసాల (వడ్డన చేసేవాళ్లు) ఫాంటు తొడిగి గౌన్లు ధరించారు. తళతళలాడే బూట్లు తొడిగారు. నాకు వారి ఈ చర్య విచారం కలిగించింది. ఈ క్రొత్త వేషానికి కారణం ఏమిటని ప్రశ్నించాను.

“మా బాధలు మాకే తెలుసు. మా ధనసంపదలు, మా బిరుదులు ఖాయంగా వుంచుకునేందుకు మేము భరించే అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి?” అని జవాబు ఇచ్చారు.

“పోనీండి, ఈ కాసాతలపాగా లేమిటి? ఈ కాసాబూట్లేమిటి?” “మాకూ వడ్డన చేసే కాసాలకు అసలు తేడా ఏముందో చెప్పండి!, వాళ్లు మాకు కాసాలు. మేము లార్డుకర్జనుకు కాసాలం. అంతే తేడా. మేమీ దర్బారుకు హాజరుకాకపోతే అది మా అపరాధంగా పరిగణింపబడుతుంది. మా సహజ వేషాలతో దర్బారుకు పోతే అదికూడా పెద్ద అపరాధమే. సరే, కర్జను దర్బారుకు వెళ్లామనుకోండి. కర్జనుతో మాట్లాడటం మాతరమా? రామరామ, ఒక్కమాటైనా మాట్లాడటానికి వీలు పడదు.” ఆ మాటలు పలికిన ఆ నిర్మల హృదయుని మీద నాకు జాలి కలిగింది.

ఇటువంటి దర్బారు మరొకటి నాకు బాగా గుర్తు వుంది. లార్డ్ హార్జింజ్ బెనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన కావించిన చోట ఒక దర్బారు ఏర్పాటు చేశారు. అందు రాజులు, మహారాజులు పాల్గొన్నారు. భారత భూషణ మాలవ్యాగారు నన్ను అక్కడికి రమ్మని పట్టుబట్టారు. నేను అక్కడికి వెళ్లాను. కేవలం స్త్రీలకు శోభ చేకూర్చే వారి వస్త్రాలు, ఆభరణాలు చూచి నాకు ఎంతో విచారం కలిగింది. పట్టు పాజామాలు, పట్టు అంగరఖాలు, మెడలో ముత్యాలు, వజ్రాల హారాలు, బాహువులకు బాజా బందులు, తలపాగాకు వజ్రాలు, ముత్యాలు పొదిగిన తురాయిలు, వీటన్నిటితో బాటు నడుముకు బంగారు పిడిగల కరవాలాలు. ఇవన్నీ ఏమిటి? రాజచిహ్నాలా! లేక దాస్య చిహ్నాలా? యిట్టి నామర్దా కలిగించే నగలు వారే తమ యిష్ట ప్రకారం చేసుకున్నారని అనుకున్నాను. కాని యిట్టి దర్బారులకు యిట్టి వేష భూషాదులు వేసుకు రావడం వారి విధి అని తెలిసింది. కొందరు రాజులకైతే యిట్టి వస్త్రాలు, నగలు అంటే అసహ్యమనీ, యిట్టి దర్బారుల్లో తప్ప మరెప్పుడూ వాటిని తాకరని కూడా తెలిసింది. యీ మాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యితర సమయాల్లో వారు వాటిని ధరిస్తారో లేదో తెలియదు. ఏది ఏమైనా వైస్రాయి దర్బారైతేనేమి మరే దర్బారైతేనేమి ఆడవాళ్లలా వీళ్లు నగలు ధరిస్తారని తెలిసి విచారం కలిగింది. ధనం, బలం, మానం, యివి మనుష్యులచేత ఎట్టి పాపాలనైనా ఎట్టి అనర్ధాలనైనా చేయిస్తాయి కదా!