సత్యశోధన/మూడవభాగం/17. గోఖలేగారితో ఒక మాసం - 1
17. గోఖ్లేగారితో ఒక మాసం - 1
మొదటి రోజునే గోఖ్లేగారు నాకుగల మొహమాటాన్ని పోగొట్టారు. నన్ను తమ్మునిలా చూచారు. నా అవసరాలేమిటో తెలుసుకొని వాటిని పూర్తిచేశారు. అదృష్టవశాత్తు నాకు కావలసినవి కడు స్వల్పం. నా పనులన్నీ స్వయంగా చేసుకోవడం నాకు అలవాటు. కనుక నా కోసం చేయవలసిందేమీ లేదు. నా పనులు నేను చేసుకోవడం, నియమబద్ధమైన నడవడి, నా దుస్తులతీరు యివన్నీ చూచి ఆయన విస్తుపోయారు. నన్ను అమితంగా స్తుతించడం ప్రారంభించారు.
వారు నాదగ్గర ఏమీ దాచేవారు కారు. తమను చూడవచ్చిన వారందరినీ నాకు పరిచయం చేసేవారు. అట్టి పరిచితుల్లో డాక్టరు ప్రపుల్ల చంద్రరాయ్‌గారు ముఖ్యులు. వారు పొరుగునే వుండేవారు. తరుచు వస్తూ వుండేవారు. “ఈ ప్రొఫెసరు రాయ్‌గారికి నెలకు 800 రూపాయలు జీతం. అందు 40 రూపాయలు మాత్రం ఖర్చులకు వుంచుకొని మిగతాదంతా ప్రజా సేవకు యిచ్చివేస్తారు. వీరింతవరకు పెండ్లి చేసుకోలేదు. ఇక ముందు పెండ్లి చేసుకునే తలంపు కూడా వీరికి లేదు.” అని చెప్పి గోఖ్లేగారు రాయ్ గారిని పరిచయం చేశారు. ఆనాటి రాయ్‌గారికీ, యీ నాటి రాయ్‌గారికి నాకు అట్టే తేడా కనబడలేదు. యిప్పుడెట్టి వస్త్రాలు ధరిస్తున్నారో అప్పుడూ అట్టి వస్త్రాలు ధరించేవారు. యిప్పుడు ఖాదీ వచ్చిపడింది. అప్పటికింకా అది రాలేదు. స్వదేశపు మిల్లు బట్టలు వుండేవి. వారిద్దరి సంభాషణ వింటున్నప్పుడు నాకు విసుగు పుట్టేదికాదు. వారి సంభాషణంతా దేశహితానికి సంబంధించిందే లేక జ్ఞానచర్చయే. వారి మాటలు కొన్ని విన్నప్పుడు కష్టం కూడా కలుగుతూ వుండేది. వారు కొందరు నాయకుల్ని తీవ్రంగా విమర్శిస్తూ వుండేవారు. వారి మాటలవల్ల నేను పర్వతాలని అనుకున్న వారంతా పరమాణువులేనని తేలింది.
గోఖ్లేగారు పనిచేసే తీరు ఆనందదాయకమేగాక జ్ఞానవర్ధకం కూడా. వారు ఒక్క నిమిషం కూడా వృధాగా పోనిచ్చేవారు కాదు. వారు చేసే ప్రతిపని దేశం కోసమే. మాట్లాడటం దేశంకోసమే. వారి మాటల్లో మాలిన్యంగాని, దంభంకాని, అసత్యంకాని లేదు. భారతదేశ దారిద్ర్యం, పారతంత్ర్యం. ఈ రెండూ ఎప్పుడూ వారి మనస్సును వేధిస్తూ వుండేవి. చాలామంది వారిని రకరకాలుగా ఆకర్షించేందుకు వస్తూ వుండేవారు. అందరికీ జవాబు చెబుతూ “మీరు మీ పని చేయండి. నన్ను నా పనిచేసుకోనీయండి. నాకు కావలసింది దేశ స్వాతంత్ర్యం, అది లభించిన తరువాతే మరొకటి. యిప్పటికి యీ పనిలో నాకు ఒక్క క్షణం తీరికలేదు.” అని అనేవారు. గోఖ్లేగారి ప్రతిమాటలోనూ రానడేగారి యెడ గౌరవం నిండి యుండేది. రానడేగారు ఇలా చెప్పేవారు అని అనడం వారికి ఊత పదం. నేనక్కడ వుండగా రానడేగారి జయంత్యుత్సవమో, వార్షికోత్సవమో (సరిగా గుర్తులేదు) జరిగింది. గోఖ్లేగారు దాన్ని ప్రతి ఏటా జరుపుతూ వుంటారట. అప్పుడు నేను గాక వారి మిత్రులు ప్రొఫెసర్ కాధనేట్ గారు మరియొక సబ్ జడ్జి వున్నారు. రానడే గారిని గురించి కొన్ని వివరాలు గోఖ్లేగారు తెలియజేశారు. రానడేగారికి, మరియు తైలంగీ భాషా పండితులు మాండలికుగారికీ గల వ్యత్యాసం చెప్పారు. మాండలికుగారికి క్లయింటు పని అంటే కడు శ్రద్ధట. ఒకనాడు వారికి రైలు అందలేదు. స్పెషల్ రైలు తెప్పించుకొని మరీ కోర్టుకు వెళ్లారట. ఇక ఆనాటి గొప్పవారందరిలో రానడే గొప్పవారు. ఆయన కేవలం న్యాయమూర్తే గాక చరిత్రకారుడు కూడా. ఆర్ధిక శాస్త్రవేత్త. గొప్ప సంస్కర్త. ప్రభుత్వ జడ్జి అయి యుండికూడా నిర్భయంగా కాంగ్రెసులో ప్రేక్షకునిగా పాల్గొనేవారు. జనానికి వారి నిర్ణయం ప్రమాణంగా వుండేది. ఈ విధంగా రానడేగారి గుణగణాలను వర్ణిస్తున్నప్పుడు గోఖ్లేగారు పరవశత్వం చెందేవారు.
గోఖ్లేగారి దగ్గర ఒక గుర్రపు బండి వుండేది. నేను దాన్ని గురించి ప్రశ్నించాను. దాని అవసరం ఏమిటో నాకు బోధపడనందున “మీరు ట్రాముబండి మీద పోతే సరిపోదా? అది నాయకుల ప్రతిష్టకు భంగమా?” అని అడిగాను.
ఈ మాటలు విని కొంచెం బాధపడి యిలా అన్నారు. “నీవు కూడా నా సంగతి తెలుసుకోలేకపోయావు. నాకు కౌన్సిలువల్ల వచ్చే సొమ్మును నా సొంతానికి ఉపయోగించను. మీరంతా ట్రాముబండ్లలో వెళుతూ వుంటే నాకు అసూయ కలుగుతుంది. నేనలా చేయలేను. ఎంతమందితో నాకు పరిచయం వున్నదో అంతమందితో నీకు కూడా పరిచయం వుంటే ట్రాములలో వెళ్లడం అసంభవం కాకపోయినా దుష్కరమని తెలిసేది. నాయకులు చేసేదంతా సౌఖ్యంకోసమేనని అనుకోవడం సరికాదు. నీ మితవ్యయవిధానం నాకు సంతోషదాయకం. వీలైనంత వరకు నేనూ అట్టి వాడినే. కాని నావంటి వానికి కొంత ఎక్కువ వ్యయం కావడం తప్పనిసరి. దీనితో నా ఆక్షేపణ ఒకటి పూర్తిగా రద్దు అయిపోయింది. కాని మరొకటి వుంది. దానికి వారు తప్పక తృప్తికరమైన సమాధానం యివ్వలేక పోయారు.
“అయితే మీరు షికారుకైనా పోరుకదా! యిక ఎప్పుడూ అస్వస్థులై వుండటం సరియేనా? దేశ కార్యాల్లో వ్యాయామానికి అవకాశం దొరకదా?” అని అడిగాను, ‘షికారుకు పోవుటకు ఎప్పుడైనా నాకు అవకాశం కలదని కనుగొన్నారా?’ అని నన్ను అడిగారు.
వారి యెడగల ఆదరం వల్ల వారి యీ మాటకు నేను సమాధానం చెప్పలేదు. వారి ఈమాటవల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని నేను మారుమాటాడలేదు. భోజనానికి మనకు సమయం దొరకడం లేదా? అదేవిధంగా వ్యాయామానికి సమయం దొరుకుతుందని నాటికీ, నేటికీ కూడా నా విశ్వాసం. దీని వల్ల దేశ సేవ తగ్గిపోదని ఎక్కువవుతుందని నా అభిప్రాయం.