సత్యశోధన/మూడవభాగం/15. కాంగ్రెసులో

వికీసోర్స్ నుండి

15. కాంగ్రెసులో

మహాసభ ప్రారంభమైంది. ఆ మంటపం యొక్క భవ్యత, ఆ వాలంటీర్ల విధానం, వేదిక మీద ఆసీనులైన ఆ పెద్దల సముదాయం చూచి నివ్వెరబోయాను. యీ సభలో నాకు చోటు ఎక్కడ అని తికమకపడ్డాను. అధ్యక్షుని ఉపన్యాసం ఒక బృహత్ గ్రంథం. దాని నంతటిని చదవడం అసంభవం. అందువల్ల కొన్ని కొన్ని అంశాలే చదువబడ్డాయి.

తరువాత విషయనిర్ణయ సభకు ఎన్నికలు జరిగాయి. గోఖ్లే గారు నన్ను అక్కడికి తీసుకువెళ్లారు.

సర్ ఫిరోజ్‌షా గారు నా తీర్మానాన్ని అంగీకరిస్తామని యిదివరకే చెప్పారు. కాని వారు ఎప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రతి తీర్మానం మీద సుదీర్ఘ ఉపన్యాసాలు సాగుతూ వున్నాయి. అవన్నీ ఇంగ్లీషులోనే తీర్మానాల్ని సమర్ధించే వారంతా ఉద్దండులే. ఈ నగారాఖానాలో నా తూతూ వినేవారెవ్వరు? రాత్రి ప్రొద్దు పోతున్నది. నా గుండె దడదడ లాగసాగింది. చివరికి మిగిలిన తీర్మానాలన్నీ వాయు వేగంతో పరుగెత్తసాగాయి. అందరూ ఇంటికి పోవాలని తొందరపడుతున్నారు.

రాత్రి పదకొండు దాటింది. నాకు మాట్లాడదామంటే సాహసం చాలడం లేదు. గోఖ్లేగారికి గతంలోనే తీర్మానం చూపించాను. వారి కుర్చీదగ్గరికి వెళ్లి మెల్లిగా “నా మాట మరిచి పోవద్దు” అని అన్నాను. “నాకు గుర్తున్నది. వాళ్ల వేగం చూస్తున్నారు కదా! ఏది ఏమైనా సరే తప్పి పోనీయను” అని వారు సమాధానం యిచ్చారు.

“ఏం, అంతా ముగిసింది కదూ!” అని ఫిరోజ్‌షాగారి ప్రశ్న.

“ఇంకా దక్షిణ ఆఫ్రికాను గురించిన తీర్మానం మిగిలివుంది. గాంధీగారు చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నారు.” అని గోఖ్లే గారు బిగ్గరగా చెప్పారు. “మీరు ఆ తీర్మానం చూచారా?” అని ఫిరోజ్‌షాగారు అడిగారు.

“చూచాను”

“మీకు బాగుందా?”

“ఆ, బాగుంది”

“అయితే గాంధీ! చదువు”

నేను వణుకుతు తీర్మానం చదివి వినిపించాను. గోఖ్లేగారు నా తీర్మానాన్ని సమర్ధించారు. “ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాం” అని అంతా అరిచారు. గాంధీ! నీవు అయిదు నిమిషాలు మాట్లాడు అని వాచా గారు ఆదేశించారు. నాకు అక్కడ జరుగుతున్న పద్ధతి ఏమీ నచ్చలేదు. తీర్మానాన్ని అర్ధం చేసుకునేందుకు ఎవ్వరూ ప్రయత్నించడంలేదు. ఎప్పుడు వెళ్లిపోదామా అని అంతా తొందర పడుతున్నారు. గోఖ్లేగారు ముందే తీర్మానం చూచారు గనుక యింకెవ్వరూ చూడదలుచుకోలేదు.

తెల్లవారింది. ఉపన్యాసం ఎలా యివ్వడమా అని యోచించసాగాను. అయిదు నిమిషాల్లో ఏం చెప్పగలను? నేను విషయం మీద మాట్లాడేందుకు సిద్ధపడే వచ్చాను. కాని సమయం బహుకొద్ది. శబ్దాలు తోచడం లేదు. ఏది ఏమైనా ఏదో మాట్లాడాలి. యింటి దగ్గర తయారు చేసుకోవచ్చని ఉపన్యాసం చదవకూడదని నిర్ణయించుకున్నాను. దక్షిణ - ఆఫ్రికాలో ఉపన్యాసాలు బాగానే యిచ్చాను. కాని యిప్పుడు ఎందుకో గాని మళ్లీ గొంతు పట్టుకుంది.

నా తీర్మానం రాగానే ఫిరోజ్‌షాగారు నా పేరు పెద్దగా పిలిచారు. నేను నిలబడ్డాను. తల తిరగసాగింది. తీర్మానం ఏదోవిధంగా చదివాను. ఇంతలో ఎవరో ఒక కవి తమ కవిత్వం ముద్రించి ప్రతినిధులకు పంచుతూ వున్నాడు. అందు విదేశ యాత్రను గురించి, సముద్రయాత్రను గురించి ప్రశంసించారు. నేను దాన్ని వినిపించి దక్షిణ - ఆఫ్రికాలో భారతీయులు పడుతున్న కష్టాలు కొద్దిగా పేర్కొన్నాను. యింతలో దిన్షావాచాగారు గంట బజాయించారు. అప్పటికి ఇంకా అయిదు నిమిషాలు పూర్తి కాలేదని నాకు తెలుసు. అయితే రెండు నిమిషాలు వుందనగా ఆవిధంగా గంట కొడతారట. ఆవిషయం నాకు తెలియదు. కొందరు అరగంట కంటే మించి మాట్లాడారు. అప్పుడు యీ ఈవిధంగా గంట కొట్టలేదు. అందువల్ల నాకు కష్టమనిపించింది. గంట మ్రోగగానే ప్రసంగం ఆపి కూర్చున్నాను. అయితే నేను చదివిన కవిత్వాలు ఫిరోజ్‌షాగారికి సమాధానం అని బాల్య చాపల్యం వల్ల అనుకువ్నాను.

తీర్మానం ఆమోదించబడిందా లేదా అని అడగనవసరం లేదు. ఆ రోజుల్లో ప్రజలకు ప్రతినిధులకు భేదం లేదు. ఏ తీర్మానానికి వ్యతిరేకత లేదు. అందరు చేతులెత్తడమే. ప్రతి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడటమే. నా తీర్మానం స్థితి అంతే. అందువల్ల నా తీర్మానం వల్ల ప్రయోజనం కలుగుతుందని నాకు అనిపించలేదు. కాని కాంగ్రెసులో తీర్మానం జరిగింది. అదే ఆనందం. నా తీర్మానానికి కాంగ్రెసు ముద్ర పడింది. ఇది సమస్త భారత దేశం వేసిన ముద్ర అన్నమాట. ఈ జ్ఞానం, ఈ సంతోషం ఎవరికైనా తృప్తి కలిగిస్తుంది కదా!