సత్యశోధన/మూడవభాగం/14. క్లర్కు - బేరా
14. క్లర్కు - బేరా
బేరర్ అనే ఇంగ్లీషు శబ్దానికి బేరా అపభ్రంశం. కలకత్తాలో ఇంట్లో పనిచేసే వాణ్ణి బేరా అని అనడం అలవాటు. కాంగ్రెసు ప్రారంభం కావడానికి యింకా రెండు రోజుల వ్యవధి వుంది. కాంగ్రెసు ఆఫీసులో నాకేమైనా పని దొరికితే కొంత అనుభవం గడించవచ్చని అనిపించింది.
కలకత్తాలో దిగిన రోజే కాలకృత్యాలు ముగించుకొని కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లాను. శ్రీ భూపేంద్రనాధ బోసుగారు, శ్రీ ఘోషాలుగారు కార్యదర్శులు. భూపేంద్రబాబుగారి దగ్గరికి వెళ్లి ఏమైనా పనివుంటే యిమ్మని అడిగాను. వారు నన్ను పరిశీలించి చూచి “నాదగ్గర పనేమీ లేదు. బహుశ ఘోషాలుగారి దగ్గర పనివుంటే చెబుతారు. వారిని చూడు” అని అన్నారు.
ఘోషాలు బాబు గారి దగ్గరికి వెళ్లాను. వారు నన్ను క్రింది నుండి పైదాకా ఎగాదిగా చూచి కొంచెం చిరునవ్వునవ్వి ‘నాదగ్గర క్లర్కు పని వుంది చేస్తావా?’ అని అడిగారు.
“తప్పక చేస్తా. చేతనైన పని చేయడానికే మీదగ్గరకు వచ్చా”
“అబ్బాయి! నిజమైన సేవాభావమంటే యిదే”
వారి దగ్గరే కొందరు వాలంటీర్లు వున్నారు. వారికేసి చూచి “చూచారా! యీ అబ్బాయి ఏమన్నాడో!” అని అన్నారు. మళ్లీ నాకేసి తిరిగి “అదిగో, ఉత్తరాలగుట్ట, దాన్ని తీసుకో. ఇదుగో కుర్చీ. దీనిమీద కూర్చొని పని మొదలుబెట్టు. నా కోసం వందలాది ఉత్తరాలు వస్తుంటాయి. చాలామంది జనం వస్తుంటారు. వీళ్లతోనే మాట్లాడనా లేక ఈ ఉత్తరాలు చూస్తూ కూర్చోనా? ఈ పని చూడడానికి క్లర్కు లేడు. వీటిలో చాలావరకు పనికిమాలినవి. అయితే అన్నింటినీ చదువు. అవసరమైన ఉత్తరాలకు సమాధానం వ్రాయి. అవసరమనుకుంటే నన్ను సంప్రదించు. అని అన్నారు. నన్ను వారు నమ్మినందుకు సంతోషించాను.
ఘోషాలుగారు నన్నెరుగరు. తరువాత నీ పేరేమిటి అని అడిగి తెలుసుకున్నారు. నాకు అప్పగించినది తేలికపని. ఆ పని త్వరగా ముగించాను. ఘోషాలు బాబుగారు సంతోషించారు. ఆయనకు మాట్లాడుతూ వుండటం అలవాటు. మాటలతో కాలం గడిపే మనిషి. తరువాత నీ అంతవాడికి యీ చిన్న పని అప్పగించానే అని నొచ్చుకున్నారు. “అయ్యా! నేనెక్కడ! మీరెక్కడ! కాంగ్రెసు సేవలో మీ జుట్టు పండిపోయింది. నాకంటే మీరు పెద్దలు. వృద్ధులు. నేను అనుభవంలేని కుర్రవాణ్ణి. మీరీ పని యిచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. యిక ముందు ముందు కాంగ్రెసులో నేను పనిచేయాల్సి వుంది. పని తెలుసుకునేందుకు దుర్లభమైన అవకాశం మీరు నాకు యిచ్చారు” అని ఆయనను సముదాయించాను.
“నిజంగా నువ్వు భలేవాడివి. ఈ కాలపు కుర్రవాళ్లు నీలా వుండరు. కాంగ్రెసు పుట్టినప్పటినుండి నాకంతా తెలుసు. కాంగ్రెసు స్థాపనలో హ్యూమ్‌గారితో బాటు నాకు కూడా పాలువుంది” అని ఘోషాలుగారన్నారు.
మా కీవిధంగా బాగా పరిచయం అయింది. మధ్యాహ్నభోజనం మేమిద్దరం కలిసి చేశాం. ఘోషాలు బాబుగారి చొక్కాకు గుండీ “బేరా” వచ్చి తగిలించేవాడు. అది చూచి ఆ పని నేనే చేస్తానని చెప్పాను. అలా చేయడం నాకు యిష్టం. పెద్దలంటే నాకు గౌరవం. వారికి నా మనస్సు బాగా తెలిసిపోయింది. అప్పటి నుండి వారు తన పనులన్నీ నాచేత చేయించుకోసాగారు. గుండీలు పెడుతూ వుంటే మూతి బిగించి “చూచావా? కాంగ్రెసు సెక్రటరీకి బొత్తాములు పెట్టుకునేందుకు కూడా తీరిక వుండదు. అప్పుడు కూడా అతనికి అనేక పనులు వుంటాయి” అని అన్నారు.
ఆయన అమాయకత్వానికి నాలో నేను నవ్వుకున్నాను. అయితే ఆయనకు శుశ్రూషచేయడమంటే నాకు అయిష్టత ఏర్పడలేదు. అందువల్ల నాకు ఎంతో లాభం కలిగింది.
కొద్ది కాలానికే కాంగ్రెసు వ్యవహారం అంతా తెలుసుకున్నాను. పెద్దలతో పరిచయం అయింది. గోఖ్లే, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలగు యోధులు వస్తూ పోతూ వుండేవారు. వారి వైఖరి తెలుసుకునేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్‌లో కాలం ఎంతగా వృధా అవుతున్నదో బోధ పడింది. ఇంగ్లీషు భాషకు అక్కడగల ఆధిపత్యం గమనించారు. అది చూచి నాకు దుఃఖం కలిగింది. ఒక్కడు చేసే పనికి పదిమంది పరుగెత్తడం, అవసరమైన పనికి ఒక్కడు కూడా రాకపోవడం గమనించాను.
ఈ విషయాలన్నింటిని గురించి నా మనస్సు పనిచేయసాగింది. అయితే యింత కంటే ఎక్కువ సంస్కరణ సాధ్యం కాదేమో అని మనస్సు సమాధానం చెప్పింది. అందువల్ల మనస్సులో దుర్భావన కలుగలేదు.