సత్యశోధన/మూడవభాగం/10. బోయరుయుద్ధం

వికీసోర్స్ నుండి

10. బోయరు యుద్ధం

1897 నుండి 1899 వరకు నా జీవితంలో కలిగిన యితర అనుభవాల్ని వదిలి బోయరు యుద్ధాన్ని గురించి తెలియజేస్తాను. యుద్ధం ప్రారంభమైనప్పుడు నేను పూర్తిగా బోయర్లకు అనుకూలంగా వున్నాను. ఇటువంటి విషయాల్లో వ్యక్తిగతమైన అభిప్రాయాల ప్రకారం పని చేసే అధికారం నాకు లేదని అనుకున్నాను. ఈ విషయమై నా హృదయంలో అపరిమితంగా మథనం సాగింది. ఆ వివరం దక్షిణ - ఆఫ్రికా సత్యాగ్రహచరిత్రలో వివరించాను. అందువల్ల దీన్ని యిక్కడ వ్రాయను. తెలుసుకోదలచిన వారు ఆ చరిత్ర చదివి తెలుసుకోవచ్చును. తెల్ల ప్రభుత్వం వారి ప్రజలం కనుక ఆ యోగ్యత ప్రకారం మనకు వుండవలసిన హక్కుల్ని మనం పుచ్చుకోవలసియున్నట్లే, తెల్ల ప్రభుత్వం వారియెడ గల విశ్వాసం ఈ యుద్ధంలో వారికి సాయపడమని నన్ను ముందుకు త్రోసింది. తెల్లప్రభుత్వం వారి ప్రజలం కనుక ఆయోగ్యత ననుసరించి బ్రిటీష్ రాజ్య రక్షణకు సాయపడటం మన ధర్మం అని భావించాను. భారతీయుల వికాసానికి బ్రిటీష్ సామ్రాజ్యమే శరణ్యమని ఆ రోజుల్లో నాకు అభిప్రాయం ఏర్పడింది.

ఆ కారణం వల్ల దొరికినంతమంది మిత్రుల్ని చేరదీసి, యుద్ధంలో గాయపడిన వారికి సేవ చేసేందుకై ఎంతో కష్టపడి ఒక దళాన్ని ప్రోగుచేశాను. నల్లవారంతా పిరికివారనీ, అపాయాల్ని ఎదుర్కోలేరనీ, తమ పనుల్ని తప్ప మిగతా పనుల్ని పట్టించుకోరనీ, స్వార్థపరులనీ అప్పుడు ఇంగ్లీష్‌వాళ్ళు భావిస్తు వుండేవారు. అందువల్ల నా ఆంగ్ల మిత్రులు నా యీ ప్రయత్నాన్ని చూచి చప్పరించారు. డాక్టర్ బూత్‌గారొక్కరు మాత్రం ఏ ఏ విధంగా చేయాలో నేర్పారు. మేము యీ పనికి తగిన వారమని డాక్టర్ సర్టిఫికెట్లు సంపాదించాము. లాటనుగారు, ఎస్కాంబిగారు మా ఉద్దేశ్యాన్ని మెచ్చుకొన్నారు. యుద్ధంలో మా సేవల్ని అంగీకరించమని ప్రభుత్వానికి దరఖాస్తు పంపాము. ప్రభుత్వం వారు మమ్ము అభినందించారు. ఆయితే యిప్పుడు అవసరం లేదని మాకు తెలియజేశారు.

నేను “అవసరంలేదు” అని వచ్చిన సమాధానంతో వూరుకోలేదు. డాక్టర్ బూత్ గారి సహాయంతో నేటాలు బిషప్పుగారిని దర్శించాను. బిషప్ గారికి మా ఉద్యమం ఆనందం కలిగించింది. ఆయన తప్పక సాయం చేస్తానని మాట యిచ్చాడు.

ఇంతలో ఘటనా చక్రంలో కొంత మార్పు వచ్చింది. తెల్లవాళ్ళు బోయర్ల సన్నాహాన్ని, దార్డ్యతను, పరాక్రమాన్ని గుర్తించసాగారు. దానితో తెల్ల ప్రభుత్వం కదిలింది. క్రొత్తవారిని ప్రోగు చేసుకోవలసిన అవసరం కలిగింది. చివరికి నా ప్రార్ధన అంగీకరించబడినది.

మా దళంలో సుమారు 1100 మందిమి వున్నాం. యిందు నాయకులు నాలుగు వందల మంది. సుమారు మూడు వందల మంది స్వతంత్రులగు భారతీయులు, మిగిలిన వారంతా గిరిమిటియాలు. డాక్టర్ బూత్ గారు కూడా మాతో వున్నారు. దళం చక్కగా పని చేసింది. మా దళం పని సైన్యానికి బయటనే. దీనికి రెడ్ క్రాస్ అనగా లోహిత స్వస్తికం యిచ్చారు. అది యుద్ధంలో పడిపోయిన వారికి ఉపచారం చేసేవారు ఎడమచేతి మీద పెట్టుకునే ఎరగ్రుర్తు. ఈ గుర్తు కలవారిని శత్రువులు కాల్చరు. ఇంకా ఎక్కువ వివరం తెలుసుకోదలచిన వారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహచరిత్ర చదువవచ్చును. ఆ గుర్తు మా రక్షణ కోసం మంజూరు చేశారు.

ఒకానొక సమయంలో మా దళం యుద్ధరంగంలోకి కూడా పోవలసి వచ్చింది. లోగడ ప్రభుత్వం వారు వారి యిష్ట ప్రకారమే అపాయస్థలంలోకి వెళ్ళుటకు మాకు అనుమతి యివ్వలేదు. కాని స్కియాంకోపు చెయ్యి జారి పోయేసరికి పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు జనరల్ బులర్‌గారు యుద్ధరంగంలో పనిచేయాలనే నిర్బంధం మీకు లేదు, అయినా అపాయానికి సిద్ధపడి పడిపోయిన సైనికుల్ని, ఆఫీసర్లను యుద్ధరంగంలోకి వెళ్ళి ఎత్తుకుని డోలీలలో తీసుకొనివచ్చేందుకు సిద్ధపడితే ప్రభుత్వం వారు మీ ఉపకారాన్ని మరచిపోరని వార్త పంపాడు. మేమందుకు సంసిద్ధంగా వున్నామని సమాధానం పంపాము, తత్ఫలితంగా స్పెయాంకోప్ యుద్ధం అయిపోయిన తరువాత మేము ఫిరంగి గుండ్లు, తుపాకీ గుండ్లు పడే చోట పనిచేయుటకు పూనుకున్నాము. అప్పుడు రోజుకు 20 లేక 25 మైళ్ళ వరకు తిరిగి పనిచేయాల్సి వచ్చింది. ఒక్కొక్క సారి దెబ్బలు తిని గాయపడిన వారిని డోలీల్లో మోసుకొని అంతదూరం నడిచి రావలసి వస్తూ వుండేది. ఆవిధంగా గాయపడిన వారిలో జనరల్ వుడ్‌గేట్ వంటివారున్నారు. అట్టి యోధుల్ని చేరవేసే అదృష్టం మాకు కలిగింది.

ఆరువారాలు విశ్రాంతి లేకుండా పని చేసిన పిమ్మట మాదళాన్ని విడుదల చేశారు. స్పియాంకోపును, వాల్‌క్రాంజును చేజార్చుకున్న పిమ్మట లేడీస్మిత్ మొదలగు స్థావరాలను బోయర్లు ముట్టడించేసరికి, వారి పట్టు నుండి వాటిని విడిపించడం కోసం పూనుకోకుండా ఇంగ్లాండు నుండి, ఇండియా నుండి సైన్యాలను రప్పించాలని నిర్ణయించుకొని, అంత వరకు మెల్లమెల్లగా పని చేయాలని బ్రిటీష్ సేనాపతి నిశ్చయించుకున్నాడు.

మేము చేసిన ఆ స్వల్ప కార్యానికి ఆ సమయంలో మమ్మల్ని అంతా ఘనంగా మెచ్చుకున్నారు. దీనివల్ల భారతీయుల ప్రతిష్ట పెరిగింది. “అహో ! భారతీయులననెవరో కాదు ఈ రాజ్యపు వారసులే,” అను మకుటంతో పద్యాలు పత్రికల్లో వెలువడ్డాయి. జనరల్ బులర్ మాసేవల్ని ప్రశంసించాడు. మా దళపు నాయకులకు మెడల్సు కుడా లభించాయి.

ఇందువల్ల భారతీయుల్లో ఐక్యత పెరిగింది. నాకు గిరిమిటియాలతో సంబధం పెరిగింది. వారిలో కూడా వివేకం పెరిగింది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు. మద్రాసీ, గుజరాతీ, సింధూ, అంతా హిందూ దేశస్థులేనను భావం ప్రబలింది. ఇక భారతీయుల కష్టాలు తొలగిపోతాయని అంతా భావించారు. అప్పటి నుండి తెల్లవారి నడతలో మార్పు వచ్చింది.

యుద్ధ సమయంలో తెల్లవారికి, మాకు మధురమైన సంబంధం ఏర్పడింది. వేలాదిమంది తెల్లసోల్జర్లతో మాకు సంబంధం ఏర్పడింది. వారు మాతో ఎంతో స్నేహంగా వ్యవహరించారు. మేము తమకు చేసిన సేవా శుశ్రూషలకు వారు ఎంతో కృతజ్ఞత తెలియజేశారు.

దుఃఖ సమయంలో మనిషి హృదయం ఎంత ద్రవిస్తుందో ఒక్క ఉదాహరణ పేర్కొంటాను. మేము చీవలీ శిబిర ప్రాంతంలో సంచరిస్తున్నాము. రాబర్ట్సు ప్రభువు పుత్రుడు లెఫ్టినెంట్ రాబర్ట్స్‌గారికి ప్రాణాంతకమగు గుండు దెబ్బ తగిలింది. ఆయన ప్రాణాలు విడిచాడు. వారిని మోసుకొని వెళ్ళే అదృష్టం మా దళానికి కలిగింది. వచ్చేటప్పుడు ఎండ మాడిపోత్నుది. అందరి నాలుకలు దాహంతో పిడచకట్టుకు పోయాయి. దారిలో ఒక చిన్న సెలయేరు కనబడింది. ముందెవరు మంచినీళ్ళు త్రాగాలన్న ప్రశ్న బయలుదేరింది. ముందు తెల్ల సోల్జర్లు త్రాగాలి. ఆ తరువాత మేము త్రాగుతాము అని చెప్పాము. వెంటనే ముందు మీరు త్రాగండి అని తెల్ల సోల్జర్లు అన్నారు. ముందు మీరు త్రాగండని మేము వారిని కోరాం. ఈ విధంగా చాలా సేపటి వరకు మీరు త్రాగండంటే మీరు త్రాగండని ప్రేమతో పోటీపడ్డాం.