సత్యశోధన/మూడవభాగం/9. మితవ్యయం

వికీసోర్స్ నుండి

9. మితవ్యయం

నేను సుఖాలు అనుభవించసాగాను. కాని ఎంతోకాలం సాగలేదు. గృహాలంకరణకు అవసరమనుకున్న సామాగ్రిని సమకూర్చాను. కాని ఆ వ్యామోహం కూడా నిలవలేదు. దానితో వ్యయం తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చాను. చాకలి ఖర్చు ఎక్కువగా వుందని అనిపించింది. అంతేగాక అతడు బట్టలు త్వరగా తీసుకురాడు. అందువల్ల రెండుమూడు డజన్ల కమీజులు, అన్ని కాలర్లు వున్నా చాలేవి కావు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కాలరు. రోజూ కాక పోయినా మూడురోజులకొక కమీజు చొప్పున మారుస్తూ వుండేవాణ్ణి. యిందుకు వ్యయం పెరిగింది. ఈ వ్యయం అవసరమని అనిపించింది. నేను యింట్లో బట్టలుతకడం ఎలా అను పుస్తకాలు తెప్పించి చదివాను. నా భార్యకు కూడా నేర్పాను. పని పెరిగింది. కాని యిది క్రొత్తపని కావడంవల్ల మనోవినోదం కూడా కలిగింది.

మొట్టమొదటిసారి నేను ఉతికి ఇస్త్రీ చేసిన కాలరు మరచిపోవడానికి వీలు లేనంతగా పనిచేసింది. పిండి ఎక్కువైంది. ఇస్త్రీ పెట్టె వేడెక్కలేదు. కాలరు కాలిపోతుందేమోనని భయంతో ఇస్త్రీ పెట్టెను అణిచి రుద్దలేదు. అందువల్ల కాలరు గట్టిపడింది. పిండి రాలుతూ వుంది. ఆ కాలరుతో కోర్టుకు వెళ్ళి తోటి బారిస్టర్ల హాస్యానికి గురి అయ్యాను. అయితే యిట్టిహాస్యాన్ని సహించగలశక్తి నాకు చేకూరేవుంది. కాలరు ఇస్త్రీ చేసుకోవడం యిదే ప్రధమం. కనుక కాలరు నుండి పిండి రాలితే ఏం? మీకందరికి వినోదం కల్పించింది. ఇది గొప్ప విశేషం కదా! అంటూ స్పష్టంగా చెప్పాను. “ఇక్కడ చాకళ్ళకు కరువు లేదు కదా?” అని ఒక మిత్రుడు అన్నాడు.

“చాకలి ఖర్చు అత్యధికంగా పెరిగిపోయింది. కాలరు ధర ఎంతో దానిని ఉతికిoచడానికి అంత ఖర్చు అవుతున్నది. అంతేకాక చాకలివాని కోసం పడిగాపులు కాయవలసి వస్తున్నది. ఈ కష్టాలు పడేకంటే నా బట్టలు నేనే ఉతుక్కోవడం మంచిదని భావించాను.” అయితే ఎవరిపని వారు చేసుకోవడం మంచిదని వాళ్ళకు చెప్పలేక పోయాను. నాపని మాత్రం నేను చేసుకోసాగాను. క్రమంగా ఈ విద్యలో పాండిత్యం సంపాదించాను. నా ఇస్త్రీ చాకలి ఇస్త్రీ కంటే ఏ మాత్రమూ తీసిపోలేదు. చాకలి ఇస్త్రీ చేసిన కాలరు కంటే నేను ఇస్త్రీ చేసిన కాలరు నిగనిగలాడుతూ శుభ్రంగా ఉంది. క్రీ. శే. మహదేవ గోవిందరానడేగారు గోఖలేగారికి ఒక శాలువ ప్రసాదించారు. గోఖలేగారు దాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ ప్రత్యేక సమయాల్లో దాన్ని వాడుతూ ఉండేవారు. జోహన్సుబర్గులో గోఖలేగారికి ఘనంగా మేము విందు చేశాము. అది గొప్పసభ. అప్పుడు వారిచ్చిన ఉపన్యాసం దక్షిణ ఆఫ్రికాలో వారిచ్చిన ఉపన్యాసాలన్నిటి కంటే గొప్పగా ఉంది. అప్పుడువారు ఆశాలువా వేసుకోవాలని అనుకున్నారు. ఆ శాలువా మడతపడి ఉన్నది. దాన్ని ఇస్త్రీ చేయించాలి. సమయం తక్కువ. చాకలి చేత ఇస్త్రీ చేయించి తేవడం కష్టం “నా విద్యను కొద్దిగా పరీక్షించండి” అని వారిని కోరాను.

‘నీ లాయరు విద్యను విశ్వసించవచ్చుగాని చాకలి విద్యను ఎలా విశ్వసించడం? నీవు దీని మీద మరకలు వేస్తే ఎలా? దీని వెల ఎంతో తెలుసా’ అని అంటూ ఆ శాలువా కథ చెప్పారు.

మరకలు పడకుండా శాలువా సరిచేస్తానని వారికి విన్నవించాను. తత్ఫలితంగా ఆ శాలువా ఇస్త్రీ చేసే గౌరవం నాకు దక్కింది. వారు నాకు “మంచి చాకలి” అని బిరుదు ఇచ్చారు. ఇక చాలు లోకమంతా ఇవ్వకపోయినా పర్వాలేదని అనిపించి సంబరపడ్డాను. చాకలి దాస్యం నుండి బయట పడినట్లుగానే మంగలి దాస్యం నుండి బయటపడవలసిన అవసరం ఏర్పడింది. ఇంగ్లాండు వెళ్ళినవారంతా కనీసం తన గడ్డమైనా చేసుకోవడం నేర్చుకుంటారు. కాని తల వెంట్రుకలు కత్తిరించుకోవటం నేర్చుకోరు. ప్రిటోరియాలో ఒకసారి నేను మంగలి దుకాణానికి వెళ్ళాను. అక్కడ మంగలి “నాకు క్షవరం చేయను, పో” అని అన్నాడు. చేయనంటే పరవాలేదు. కాని ఆ తిరస్కారం భరించలేకపోయాను. బజారుకు వెళ్లి కత్తెర ఒకటి కొన్నాను. అద్దం ఎదుట నిలబడి నేనే జుట్టు కత్తిరించుకున్నాను. ముందరి వెంట్రుకలు ఏదో విధంగా కత్తిరపడ్డాయి. కాని వెనుక వెంట్రుకలు కత్తిరించుకోవడం కష్టమైంది. నేను కోరుకున్నట్లు కత్తెర పడలేదు. ఆ విధంగా జుట్టు కత్తెర వేసుకుని కోర్టుకు హాజరయ్యాను. కోర్టులో కలవరం బయలుదేరినది.

“నీ మీద ఎలుకలు తిరుగుతున్నాయా ఏమి” అని ఒకడు ప్రశ్నించాడు. ‘లేదు నా నల్లవాడి తలను తెల్లమంగలి అంటడు కదా! అందుకని నేను వెంట్రుకల్ని ఏదో విధంగ కత్తిరించుకున్నాను, యిది నాకు ఎంతో హాయినిచ్చింది.’ అని చెప్పాను. నా సమాధానం విని వాళ్లు ఆశ్చర్యపడలేదు. నిజానికి యిందు మంగలి అపరాధం ఏమీ లేదు. నల్లవాడికి క్షవరం చేస్తే అతడి కూట్లో రాయిపడుతుంది. మనం మాత్రం మన మంగళ్లను మాదిగలకు క్షవరం చేయనిస్తామా? దక్షిణ - ఆఫ్రికాలో యిట్టి అనుభవం ఒక్కసారి కాదు, అనేకసార్లు నాకు కలిగింది. ఇది మన పాపఫలమే అని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల నాకు ఈ విషయమై ఎన్నడు రోషం కలుగలేదు.

నా పనులన్నీ నేనే చేసుకోవాలి, వ్యయం తగ్గించుకోవాలి. అని కోరికలు బయలుదేరి తీవ్రరూపం ధరించాయి. ఆ వివరం తరువాత పలుచోట్ల తెలియజేస్తాసు. కాని దీనికి మూలం చాలా పురాతనమైనది. పూచేందుకు, కాచేందుకు, మూలానికి నీరు పోయవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు దక్షిణ - ఆఫ్రికా పరిస్థితులు బాగా తోడ్పడ్డాయి.