సత్యశోధన/నాల్గవభాగం/5. నిరీక్షణకు ఫలితం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5. నిరీక్షణకు ఫలితం

క్రీస్తుశకం 1893లో క్రైస్తవ మిత్రులతో పరిచయం పెరిగిన సమయంలో నేను జిజ్ఞాసువు స్థాయిలో వున్నాను. క్రైస్తవ మిత్రులు బైబిలు సందేశం నాకు వినిపించి వివరించి చెప్పి నా చేత అంగీకరింపచేయాలని ప్రయత్నిస్తూ వుండేవారు. నేను వినమ్రతతో తటస్థభావం వహించి వారి ఉపదేశాలను వింటూ వుండేవాణ్ణి. ఆ సందర్భంలో నేను హిందూ మతాన్ని గురించి శక్త్యానుసారం అధ్యయనం చేశాను. ఇతర మతాల్ని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు అనగా 1903లో పరిస్థితి మారింది. దివ్యజ్ఞాన సమాజం మిత్రులు నన్ను తమ సమాజంలో చేర్చుకుందామని ఉవ్విళ్లూరుతున్నారు. హిందువుగా నా ద్వారా ఏదో కొంత చేయించాలని వాళ్ళ అభిలాష. దివ్యజ్ఞాన పుస్తకాల్లో హిందూ మతచ్ఛాయలే ఎక్కువ. అందువల్ల నేను ఎక్కువగా సహకరిస్తానని అనుకున్నారు. సంస్కృత అధ్యయనం నేను చేయలేదు. ప్రాచీన హిందూమత గ్రంథాలు సంస్కృతంలో నేను చదవలేదు. అనువాదాలు కూడా చదివింది తక్కువే అని చెప్పాను. అయినా వాళ్ళు సంస్కారాల్ని, పునర్జన్మను అంగీకరిస్తారు. అందువల్ల నా వల్ల కొద్ది సాయం పొందాలని వారి అభిలాష. “నిరస్తపాదపే దేశే ఎరండోపి ద్రుమాయతే” చెట్టులేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అను సామెత వలె నా పరిస్థితి వున్నది. ఒక మిత్రునితో కలిసి వివేకానందుని గ్రంధాలు, మరొకరితో కలిసి మణిలాల్ భాయీ రచించిన రాజయోగం చదవడం ప్రారంభించాను. జిజ్ఞాస మండలి అను పేరిట ఒక సమితిని స్థాపించి నియమబద్ధంగా అధ్యయన కార్యక్రమం ప్రారంభించాం. భగవద్గీత అంటే మొదటినుండి నాకు ఎంతో ప్రేమ, శ్రద్ధ. లోతుకుపోయి గీతాధ్యయనం చేయాలనే కోరిక కలిగింది. నా దగ్గర గీతానువాదాలు రెండు మూడు వున్నాయి.

వాటి ద్వారా సంస్కృత గీతను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టి ప్రతిరోజు ఒకటి రెండు శ్లోకాలు కంఠస్థం చేయాలని నిశ్చయించుకున్నాను.

ఉదయం ముఖం కడుక్కునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు గీతాశ్లోకాలు కంఠస్థం చేయసాగాను. దంతధావనకు 15 నిమిషాలు, స్నానానికి 20 నిమిషాలు పట్టేది. దంతధావనం ఆంగ్లేయుల పద్ధతిలో నిలబడి చేసేవాణ్ణి. ఎదురుగా వున్న గోడమీద గీతాశ్లోకాలు వ్రాసి అంటించి సమయం దొరికినప్పుడల్లా వాటిని బట్టీవేయసాగాను. బట్టీ వేసిన సంస్కృత శ్లోకాలు స్నానం చేసేసరికి నోటికి వచ్చేసివి. ఈ సమయంలోనే మొదటి నుండీ బట్టీ బట్టిన శ్లోకాల్ని తిరిగి పఠించి నెమరవేసుకునేవాణ్ణి. ఈ విధంగా 13 అధ్యాయాలు కంఠస్థం చేసిన సంగతి నాకు గుర్తు ఉంది. తరువాత నాకు ఇతర పని పెరిగింది. సత్యాగ్రహ కార్యక్రమం ప్రారభించిన తరువాత ఆ బిడ్డ పెంపకం, పోషణలో పడిపోయి ఆలోచించడానికి కూడా సమయం చిక్కడం దుర్లభం అయింది.

ఇప్పటికీ అదే స్థితి అని చెప్పవచ్చు. గీతాధ్యయనం వల్ల నాతో కలిసి చదువుతున్నవారి మీద ఏం ప్రభావం పడిందో తెలియదు కాని నాకు మాత్రం ఆ పుస్తకం ఆచారానికి సంబంధించిన ప్రౌఢ మార్గసూచిక అయిందని చెప్పగలను. అది నాకు ధార్మిక నిఘంటువు అయింది. క్రొత్త ఇంగ్లీషు శబ్దాల స్పెల్లింగు లేక వాటి అర్థం తెలుసుకునేందుకు ఇంగ్లీషు నిఘంటువును చూచినట్లే ఆచరణకు సంబధించిన కష్టాలు, కొరుకుడుపడని సమస్యలు వచ్చినప్పుడు గీతద్వారా వాటి పరిష్కారం చేసుకునేవాణ్ణి. అపరిగ్రహం, సమభావం మొదలైన అందలి శబ్దాలు నన్ను ఆకట్టుకున్నాయి. సమభావాన్ని ఎలా సాధించాలి? దాన్ని ఎలా సంరక్షించాలి? అవమానించే అధికారులు, లంచాలు పుచ్చుకునే అధికారులు, అనవసరంగా వ్యతిరేకించేవారు, భూతకాలపు అనుచరులు మొదలగువారు ఎక్కువ ఉపకారాలు చేసిన సజ్జనులు వీరి మధ్య భేదం చూపవద్దు అని అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం? అపరిగ్రహాన్ని పాలించడం ఎలా? దేహం వున్నదిగదా! ఇది తక్కువ పరిగ్రహమా? భార్యాబిడ్డలు పరిగ్రహాలు కాదా? గ్రంధాలతో నిండియున్న అల్మారాలను తగులబెట్టనా! ఇల్లు తగులబెట్టి తీర్ధాలకు వెళ్ళనా? ఇల్లు తగులబెట్టందే తీర్థాలు సాధ్యం కావు అని వెంటనే సమాధానం వచ్చింది. ఇక్కడ ఇంగ్లీషు చట్టం సహాయం చేసింది. ప్రెల్ యొక్క చట్టపరమైన సిద్ధాంతాల వివరం జ్ఞాపకం వచ్చింది. ట్రస్టీ అను శబ్దానికి అర్థం ఏమిటో గీత చదివిన తరువాత బాగా బోధపడింది. లా శాస్త్రం ఎడ ఆదరణ పెరిగింది. దానిలో కూడా నాకు ధర్మదర్శనం లభించింది. ట్రస్టీ దగ్గర కోట్లాది రూపాయలు వున్నా వాటిలో ఒక్క దమ్మిడీ కూడా అతనిది కాదు. ముముక్షువు యొక్క స్థితి కూడా ఇంతేనని గీతాధ్యయనం వల్ల నాకు బోధపడింది. అపరిగ్రహికావడానికి, సమభావి కావడానికి హేతువుయొక్క మార్పు, హృదయము యొక్క మార్పు అవసరమను విషయం గీతాధ్యయనం వల్ల దీపపు కాంతిలా నాకు స్పష్టంగా కనబడింది. భీమా పాలసీ ఆపివేయమనీ, ఏమైనా తిరిగి వచ్చేది వుంటే తీసుకోమనీ, తిరిగి వచ్చేది ఏమీ లేకపోతే ఆ సొమ్ము పోయినట్లుగా భావించమనీ, భార్యా బిడ్డల సంరక్షణ వాళ్ళను, నన్ను పుట్టించినవాడే చేస్తాడనీ, దేవాశంకరభాయికి జాబు వ్రాశాను. ఈనాటి వరకు నా దగ్గర మిగిలిన సొమ్మంతా మీకు అర్పించాను. ఇక నా ఆశమానుకోండి ఇకనుండి నా దగ్గర మిగిలేదంతా జాతికి ఉపయోగపడుతుంది అని పితృతుల్యులగు నా అన్నగారికి వ్రాశాను.

అయితే ఈ విషయం అన్నగారికి వెంటనే వివరించలేకపోయాను. మొదట వారు కఠినమైన భాషలో తన విషయమై నా కర్తవ్యం ఏమిటో వివరించి నీవు మన తండ్రిగారిని మించి తెలివితేటలు ప్రదర్శించవద్దు. మన తండ్రి ఎలా కుటుంబపోషణ చేశారో నీవు కూడా అదే విధంగా కుటుంబపోషణ చేయాలి అంటూ ఏమేమో వ్రాశారు. వినమ్రంగా సమాధానం వ్రాస్తూ “తండ్రిగారు చేసిన పనే నేను చేస్తున్నాను. కుటుంబం యొక్క అర్థాన్ని విస్తృతం చేసి చూచుకుంటే నా నిర్ణయమందలి ఔచిత్యం మీకు బోధపడుతుంది” అని తెలియజేశాను.

అన్నగారు ఇక నా ఆశవదులుకున్నారు. మాట్లాడటం కూడా విరమించుకున్నారు. నాకు దుఃఖం కలిగింది. కాని ధర్మమని భావించిన విషయాన్ని వదలమంటే మరీ దుఃఖం కలిగింది. నేను పెద్ద దుఃఖాన్ని సహించాలని నిర్ణయించుకున్నాను. అయినా దుఃఖానికి కారణం నా యెడ వారికి గల ప్రేమయే. నా సొమ్ముకంటే నా సదాచరణ వారికి ముఖ్యం. చివరి రోజుల్లో అన్నగారు కరిగిపోయి తాను మృత్యుశయ్యమీద వున్నప్పడు “నీ ఆచరణయే సరియైనది, ధర్మబద్ధమైనది అని నాకు తెలియజేశారు. కరుణరసంతో నిండిన వారి జాబు నాకు అందింది. తండ్రి కుమారుని క్షమాపణ కోరగలిగితే వారు నన్ను క్షమాభిక్ష కోరినట్లే. నా బిడ్డలను నీ విధానంలోనే పెంచి పోషించమని వ్రాశారు. నన్ను కలుసుకోవాలని ఆతురతను వ్యక్తం చేశారు. నాకు తంతి పంపారు. వెంటనే తంతి ద్వారా నా దగ్గరకు రమ్మని వారికి తెలియజేశాను. కాని మా ఇరువురి కలయిక సాధ్యపడలేదు. వారి బిడ్డలకు సంబంధించిన వారి కోరిక కూడా నెరవేరలేదు. అన్నగారు భారతదేశంలోనే శరీరం త్యజించారు. వారి పిల్లలపై తండ్రి యొక్క పాత జీవన ప్రభావం బాగా పడింది. వాళ్ళు మారలేకపోయారు. నేను వారిని నా దగ్గరకు తెచ్చుకోలేకపోయాను. ఇందు వారి దోషం ఏమీ లేదు. స్వభావాన్ని ఎవరు మార్చగలరు? బలమైన సంస్కారాల్ని ఎవరు పోగొట్టగలరు? మనలో మార్పు వచ్చిన విధంగా మన ఆశ్రితుల్లో, బంధువుల్లో, కుటుంబీకుల్లో మార్పు రావాలని భావించడం వ్యర్థమే”

ఈ దృష్టాంతం వల్ల తల్లిదండ్రుల బాధ్యత ఎంత భయంకరమైనదో అంచనా వేయవచ్చు.