సత్యశోధన/నాల్గవభాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాలుగవ భాగం

1. చేసిన కృషి వ్యర్థం

మి.చేంబర్లేన్ మూడున్నర కోట్ల పౌండ్లు దక్షిణ ఆఫ్రికా దగ్గర తీసుకుందామని వచ్చాడు. ఇంగ్లీషువాళ్ళ, సాధ్యమైతే బోయర్ల మనస్సును కూడా జయించాలని ఆయన భావం. అందువల్ల భారతీయ ప్రతినిధులకు వ్యతిరేక సమాధానం వచ్చింది.

“స్వరాజ్యం అనుభవిస్తున్న అధినివేశరాజ్యాల మీద ఆంగ్ల సామ్రాజ్య ప్రభుత్వానికి గల అధికారం బహు స్వల్పమను విషయం మీరు ఎరుగుదురు. మీ ఆరోపణలు యదార్థమైనవనే తోస్తున్నది. నా చేతనైనంతవరకు మీకు సాయం చేస్తాను. మీరు మాత్రం అక్కడి తెల్లవారికి తృప్తి కలిగించాలి. వాళ్ళను సంతోషపరచాలి.” ఇదీ వారి సమాధానం.

ఈ సమాధానం వల్ల భారత ప్రతినిధి వర్గం మీద పిడుగు పడినంతపని అయింది. నాకు గల ఆశ పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడే తెల్లవారిందని భావించి “ఏమండీ! ఆశీర్వదించండి” అంటూ పని ప్రారంభించాలన్న మాట. అనుచరులందరికీ ఈ విషయం నచ్చ చెప్పాను.

అయితే చేంబర్లేన్ సమాధానం అనుచితమైనదా? తారుమారు చేసి మాట్లాడకుండా ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాడు. నోరు ఉన్న వాడిదే రాజ్యమని ఆయన తీయని మాటల్లో చెప్పాడన్నమాట. అసలు మా దగ్గర నోరనేది వుంటే గదా! నోటి తూటాల తాకిడికి తట్టుకోగల శరీరాలు కూడా మాకు లేవు. మి. చేంబర్లేన్ కొద్ది వారాలు మాత్రమే ఉంటారని తెలిసింది. దక్షిణాఫ్రికా చిన్న ప్రాంతం కాదు. ఇదొక దేశం, ఇదొక ఖండం, ఆఫ్రికాలో ఆనేక ఉపఖండాలు వున్నాయి. కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు 1800 మైళ్ళు ఉంటే, డర్బన్ నుండి కేప్‌టౌన్ వరకు 1100 మైళ్ళకు తక్కువ లేదు. ఈ ఖండంలో మి. చేంబర్లేన్ తుపాను పర్యటన జరపాలి. ఆయన ట్రాన్సువాలుకు బయలుదేరాడు. హిందూ దేశస్థుల కేసును తయారు చేసి నేను వారికి అందజేయాలి. ప్రిటోరియా ఎలా చేరడం? నేను సమయానికి చేరాలి, అనుమతి తీసుకోవాలి అంటే మనవాళ్ళ వల్ల అయ్యే పనికాదు. యుద్ధం ముగిశాక ట్రాన్సువాలు శిథిలమైపోయింది. అక్కడ తినడానికి తిండిగాని కట్టడానికి బట్టగాని లేదు. ఖాళీగా మూసిపడివున్న దుకాణాలను తెరిపించాలి. నింపాలి. ఇది నెమ్మదిగా జరుగవలసిన కార్యక్రమం. సామాను లభించేదాన్ని బట్టి ఇళ్ళు వదలిపారిపోయిన వాళ్ళనందరినీ తిరిగివచ్చేలా చూడాలి. అందు నిమిత్తం ప్రతి ట్రాన్సువాలు నివాసి, అనుమతి పత్రం తీసుకోవాలి. తెల్లవాళ్ళకు అడగంగానే అనుమతి పత్రం లభిస్తుంది. కాని హిందూ దేశస్తులకు లభించదు. యుద్ధ సమయంలో హిందూ దేశాన్నుండి, లంకనుండి చాలామంది ఆఫీసర్లు, సైనికులు దక్షిణాఫ్రికా వచ్చారు. వారిలో అక్కడ ఉండదలచిన వారికి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత బ్రిటీష్ ప్రభుత్వ అధికారులది. అది వారి కర్తవ్యంగా భావించబడింది. క్రొత్త అధికారుల కమిటీలు ఏర్పాటు చేయాలి. అందు అనుభవం కలిగిన అధికారులకు తేలికగా స్థానం లభించింది. ఈ అధికారుల తీవ్ర బుద్ధి మరో క్రొత్త విభాగాన్ని నెలకొల్పింది. దానివల్ల వారికే ఎక్కువ స్తోమతు లభించడం సహజం. హబ్షీలకోసం వేరే విభాగం ఏర్పాటు చేశారు. ఇక ఆసియా వాసుల కోసం ఏర్పాటు చేయరా? తర్కం సరిగా వున్నందున అంగీకారం లభించింది. అయితే నేను అక్కడకు చేరేసరికి ఈ ఏర్పాటు జరిగిపోయింది. మెల్లమెల్లగా వల పన్నారు. పారిపోయిన వాళ్ళకు అనుమతి పత్రం ఇస్తున్న అధికారి ఇష్టపడితే అందరికీ ఇవ్వవచ్చు. కాని ఫలానా వాడు ఆసియా వాసి అని అతడికి తెలియడం ఎలా? ఈ క్రొత్త విభాగం సిఫారసు చేస్తే ఆసియా వారికి అనుమతి పత్రం లభించితే ఆ అధికారి బాధ్యత తగ్గుతుంది. అతడి మీద పని బరువు కూడా తగ్గుతుంది. ఈ తర్కం క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశ పెట్టబడింది. కాని క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశ పెట్టబడింది. కాని క్రొత్త విభాగం వారికి పనితోబాటు సొమ్ముకూడ కావలసి వచ్చింది. పనిలేకపోతే ఈ విభాగం అవసరం లేదని చెప్పి దాన్ని మూసివేస్తారు. అందువల్ల ఆ విభాగానికి పని అప్పజెప్పబడింది.

ఆ విభాగానికి వెళ్ళి హిందూ దేశస్థులు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలారోజుల తరువాత జవాబు వస్తుంది. ట్రాన్సువాలు వెళ్ళగోరే వారి సంఖ్య ఎక్కువగా వుంది. అందువల్ల దళారులు బయలుదేరారు. ఈ దళారులకు అధికారులకు మధ్య బీద హిందూదేశస్థుల వేలాది రూపాయలు స్వాహా అవుతున్నాయి. సొమ్ము ఇచ్చి గట్టి ప్రయత్నం చేయకపోతే అనుమతి పత్రం లభించడం లేదని చాలా మంది నాకు చెప్పారు. అవకాశం ఉన్నప్పటికీ ఒక్కొక్క మనిషి అనుమతి పత్రం కోసం వంద పౌండ్లు కూడా చెల్లించవలసిన స్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంలో నా కర్తవ్యం ఏమిటి? నా చిరకాల మిత్రుడగు డర్బన్ పోలీసు సూపరింటెండెంటు దగ్గరకు వెళ్ళాను. “మీరు అధికార పత్రం ఇచ్చే అధికారికి నన్ను పరిచయం చేయండి. నాకు అనుమతి పత్రం ఇప్పించండి. నేను ట్రాన్సువాలులో వున్నానని మీరు ఎరుగుదురు.” అని చెప్పాను. ఆయన వెంటనే నెత్తిన హాట్ పెట్టుకొని నా వెంట బయలుదేరారు. నాకు అనుమతి పత్రం ఇప్పించాడు. నా రైలు బయలుదేరడానికి ఒక గంట టైము మాత్రమే వున్నది. నేను మొదటనే సామాను సిద్ధం చేసి పెట్టుకున్నాను. సూపరింటెండెంట్ అలెగ్జాండరుకు ధన్యవాదాలు చెప్పి ప్రిటోరియాకు బయలుదేరాను. పడవలసిన కష్టాలు నాకు బోధపడ్డాయి. నేను ప్రిటోరియా చేరాను. దరఖాస్తు సిద్ధం చేశాను. డర్బనులో ప్రతినిధుల పేర్లు ఎవరినైనా అడిగారేమో నాకు గుర్తులేదు. ఇక్కడ క్రొత్త విభాగం పనిచేస్తున్నది. వాళ్ళు భారతీయ ప్రతినిధుల పేర్లు ముందుగానే అడిగి తెలుసుకున్నారట. అంటే నన్ను ప్రతినిధి వర్గానికి దూరంగా వుంచడమే దాని అర్థమన్నమాట. ఈ వార్త ప్రిటోరియాలో గల హిందూ దేశస్థులకు తెలిసింది.

ఇది దుఃఖకరమైన కథ. మనో వినోదం కల్పించే కథ కూడా. వివరాలు తరువాత వ్రాస్తాను.

2. ఆసియా నవాబ్ గిరి

అసలు నేను ట్రాన్సువాలులో అడుగు ఎలా పెట్టగలిగానో క్రొత్త విభాగం అధికారులు తెలుసుకోలేకపోయారు. తమ దగ్గరకు వచ్చిన హిందూ దేశస్థుల్ని ఈ విషయం అడిగారు. కాని పాపం వాళ్ళకు ఏం తెలుసు? నాకు గతంలో గల పరిచయాల వల్ల అధికార పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించి వుంటానని భావించారు. అప్పుడు నన్ను అరెస్టు చేయవచ్చునని అనుకున్నారు.

యుద్ధం ముగిసిన తరువాత పెద్ద పెద్ద అధికారులకు ప్రత్యేక అధికారాలు అన్నిచోట్ల ఇవ్వబడతాయి. దక్షిణాఫ్రికాలో కూడా అలాగే జరిగింది. అక్కడ శాంతి పరిరక్షణ పేరిట ఒక ప్రత్యేక చట్టం చేయబడింది. ఆ చట్టమందలి ఒక నిబంధన ప్రకారం అనుమతి పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించే వారిని అరెస్టు చేయవచ్చు. జైల్లో పెట్టవచ్చు. ఈ నిబంధన ప్రకారం నన్ను అరెస్టు చేయాలని అధికారులు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అయితే నన్ను అనుమతి పత్రం చూపించమని అడిగేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అధికారుల డర్బనుకు తంతి పంపారు. అనుమతి పత్రం తీసుకొనే వచ్చానని అక్కడి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అయితే ఆ విభాగం అధికారులు అంతటితో ఊరుకోలేదు. నేను ట్రాన్సువాలు చేరుకోగలిగాను కాని చేంబర్లేనును కలువకుండా చేయగల సత్తా వాళ్ళకు ఉంది.

అందుకే ముందుగానే పేర్లు అడిగారన్నమాట. దక్షిణాఫ్రికాలో వర్ణ ద్వేషం వల్ల కలిగే కటు అనుభవాలు అధికం. దానితోబాటు హిందూ దేశంలో వలె తారుమారు చేయడం, టక్కరితనం చేయడం వంటి దుర్వాసన ఇక్కడ కూడా మొదలైంది. దక్షిణాఫ్రికాలో ప్రభుత్వ శాఖలు ప్రజలహితం కోసం పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల అధికారులు వినమ్రంగాను, సరళంగాను వ్యవహరించే వారు. దాని ప్రయోజనం అప్పుడప్పుడు నల్ల తెల్ల పచ్చ చర్మాల వాళ్ళు కూడా సహజంగా పొందుతూ వుండేవారు. ఆసియా దేశపు వాతావరణం ఏర్పడేసరికి అక్కడి మాదిరిగానే కాళ్ళకు మొక్కుతా వంటి ప్రవృత్తి, అంతా తారుమారు చేసే పద్ధతి, తదితర చెడ్డ మురికి అలవాట్లు చోటు చేసుకున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒకరకమైన ప్రజాస్వామ్యం నడుస్తున్నది. కాని ఆసియా నుండి మాత్రం నవాబ్‌గిరీ వచ్చిపడింది. అక్కడ ప్రజాప్రభుత్వం లేకపోవడం, కేవలం ప్రజల మీద అధికారం చలాయించే ప్రభుత్వం మాత్రమే వుండటం అందుకు కారణం. దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు గృహాలు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళే అక్కడి ప్రజలన్నమాట. అందువల్ల అక్కడి అధికార్ల మీద వాళ్ల అంకుశం పని చేస్తున్నదన్నమాట. ఆసియా నుండి వచ్చిన నిరంకుశ అధికారులు కూడా వాళ్ళతో చేతులు కలిపి హిందూ దేశస్థుల్ని అడకత్తెర మధ్య ఇరుక్కున్న పోకచెక్కలా చేశారు.

నాకు కూడా ఇట్టి నవాబ్‌గిరీ ఎలా ఉంటుందో బోధపడింది. నన్ను మొదట ఈ విభాగం ప్రధాన అధికారి దగ్గరకు పిలిపించారు. ఈ ఆఫీసరు లంక నుండి వచ్చాడు. పిలిపించారనీ, పిలిపించబడ్డాననీ అనడం సబబు కాదు. కొంచెం వివరం తెలియజేస్తాను. నా దగ్గరికి లిఖితంగా ఏవిధమైన ఆర్డరు రాలేదు. కాని ముఖ్యులగు హిందూ దేశస్తులు అక్కడికి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి ముఖ్యుల్లో కీ.శే. సేఠ్ తయ్యబ్ హాజీ ఖాన్ మహ్మద్ కూడా ఒకరు. ఆయన్ని అధికారి “గాంధీ ఎవరు? అతడు ఎందుకోసం వచ్చాడు?” అని ప్రశ్నించాడు.

తయ్యబ్ సేఠ్ ‘ఆయన మాకు సలహాదారు. వారిని మేము పిలిపించాము’ అని చెప్పాడు. ‘అయితే మేమంతా ఇక్కడ ఎందుకున్నాం? మీ రక్షణ కోసం మేము ఇక్కడ నియమించబడలేదా? గాంధీకీ ఇక్కడి విషయం ఏం తెలుసు?’ అని గద్దించాడు. తయ్యబ్ సేఠ్ తన తెలివితేటల్ని ఉపయోగించి “మీరు వున్నారు. కాని గాంధీ గారు మా మనిషి గదా! ఆయనకు మా భాష వచ్చు. ఆయన మమ్మల్ని ఎరుగును. పైగా మీరు అధికారులు” అని అన్నాడు.

“గాంధీని నా దగ్గరకు తీసుకురండి” అని ఆదేశించాడు ఆ అధికారి.

తయ్యబ్ సేఠ్ మొదలగువారితో బాటు నేను అక్కడికి వెళ్ళాను. కూర్చోవడానికి కుర్చీ లభించలేదు. మేమంతా నిలబడే ఉన్నాము. దొర నావంక చూచాడు. చెప్పండి! మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు.

“నా సోదరులు పిలిచినందున వారికి సలహా ఇచ్చేందుకు వచ్చాను” అని జవాబిచ్చాను.

“ఇక్కడకు రావడానికి మీకు అధికారంలేదని తెలియదా? పొరపాటున మీకు అనుమతి పత్రం లభించింది. మీరు ఇక్కడి నివాసస్థులుగా పరిగణించబడరు. మీరు తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. మీరు మి. చేంబర్లేన్ దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడి హిందూ దేశస్తుల రక్షణ కోసం మా విభాగం ప్రత్యేకించి ఏర్పాటు చేయబడింది మంచిది. ఇక వెళ్ళండి” అని దొర నన్ను పంపించి వేశాడు. సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వలేదు.

ఇతర అనుచరులను ఆపి ఉంచాడు. వారిని బెదిరించాడు. నన్ను తక్షణం ట్రాన్సువాలు నుండి పంపివేయమని వాళ్ళకు సలహా ఇచ్చాడు.

అనుచరులు ముఖం వ్రేలాడేసుకొని వచ్చారు. ఊహించని ఒక క్రొత్త సమస్యను ఎదుర్కొని దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.

3. చేదు గుటకలు

ఈ అవమానం వల్ల నాకు దుఃఖం కలిగింది. అయితే ఇంతకు పూర్వం ఇటువంటి అనేక అవమానాలు భరించివున్నాను. అందువల్ల నాకు అవి అలవాటయ్యాయి. కనుక అవమానాన్ని లక్ష్యం చేయకుండా తటస్థభావంతో వుండి కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.

ఆ అధికారి సంతకంతో ఒక పత్రం వచ్చింది. మి. చేంబర్లేన్ డర్బనులో మి. గాంధీని కలుసుకున్నారు. అందువల్ల ఆయన పేరు ప్రతినిధుల పట్టికనుంచి తొలగించవలసివచ్చింది అని ఆ పత్రంలో వ్రాసి ఉన్నది.

అనుచరులకు ఈ పత్రం వల్ల భరించలేనంత బాధ కలిగింది. అయితే అసలు మేము డెపుటేషనే తీసుకువెళ్ళం” అని అన్నారు. నేను వారికి నచ్చచెప్పాను. మనవాళ్ళ స్థితి దుర్భరంగా ఉంది. మీరు మి. చేంబర్లేను దగ్గరికి వెళ్ళకపోతే ఇక్కడ మనవాళ్ళకేమీ కష్టం లేదని ప్రకటిస్తారు. అందువల్ల ఏది ఏమైనా చెప్పదలుచుకున్నది లిఖితంగా చెప్పవలసిందే. అది వ్రాసి సిద్ధంగా ఉన్నది. నేను చదివినా, మరెవరు చదివినా ఒకటే. మి. చేంబర్లేన్ దీన్ని గురించి చర్చించడు. నాకు జరిగిన అవమానాన్ని మనం సహించవలసిందే అని నేను చెబుతూ వుండగా తయ్యబ్ సేఠ్ అందుకొని ‘మీ అవమానం జాతికే అవమానం. మీరు మా ప్రతినిధులు. దీన్ని ఎలా మరచిపోవడం?’ అని అన్నాడు.

“నిజమే. కాని జాతికూడా ఇటువంటి అవమానాల్ని సహించవలసిందే. మరో ఉపాయం ఏమీ లేదు” అని నేను అన్నాను. తయ్యబ్‌సేఠ్ “అయిందేదో అయింది. కావలసింది అయి తీరుతుంది. మేము చేతులారా మరో అవమానానికి గురికాము. మన పనులు ఎలాగూ చెడుతున్నాయి. మనకేమైనా హక్కులు లభించనున్నాయా? లేదే!” అని అన్నాడు.

ఈ ఆవేశం నా దృష్టిలో సరియైనదే. కాని దానివల్ల లాభం లేదని నాకు తెలుసు. జాతికి అవమానం జరుగుతున్నదని నాకు తెలియదా? అందువల్ల వారందరినీ శాంతపరిచాను. నా పక్షాన హిందూ దేశపు బారిష్టర్ కీ.శే. జార్జిగాడ్‌ఫ్రేను వెళ్ళమని చెప్పాను. అంతా అంగీకరించారు. ఈ విధంగా మి. గాడ్‌ఫ్రే డెపుటేషన్‌కు నాయకత్వం వహించారు. మాటల సందర్భంలో చేంబర్లేన్ నా విషయం కొద్దిగా పేర్కొన్నాడట. “ఒకే మనిషిని మాటిమాటికి వినేకంటే క్రొత్తవారిని వినడం ఎక్కువ మంచిది” మొదలుగా గల మాటలు పలికి తగిలిన గాయాన్ని కొద్దిగా మాన్చడానికి ప్రయత్నించాడట.

దీనివల్ల జాతిపని, నా పని కూడా బాగా పెరిగిపోయింది. మళ్ళీ మొదటినుండి ప్రారంభించవలసి వచ్చింది. “మీరు చెప్పినందువల్ల జాతి అంతా యుద్ధంలో పాల్గొన్నది. కాని ఫలితం ఇదేగదా?” అని ఎత్తిపొడిచేవాళ్ళు కూడా బయలుదేరారు. అయితే ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు నా మీద పనిచేయలేదు. “నేను అట్టి సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాపపడటం లేదు. యుద్ధంలో పాల్గొని మనం మంచి పనే చేశాము. ఇవాళ కూడా నా అభిప్రాయం అదే. ఆ విధంగా చేసి మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాం. దాని సత్ఫలితం మనం చూడలేకపోతే పోవచ్చు. కాని మంచి పనికి ఎప్పుడూ మంచి ఫలితమే కలుగుతుంది. ఇది నా దృఢ విశ్వాసం. గతంలో ఏం జరిగింది అని ఆలోచించకుండా ఇక భవిష్యత్తులో ఏం చేయాలి అని మనం యోచించాలి. ఇది మన కర్తవ్యం” అని చెప్పాను. నా మాటలు విని అందరూ నన్ను సమర్థించారు. తరువాత ఇలా అన్నాను. “నిజానికి నన్ను మీరు ఏ పని కోసం పిలిపించారో, ఆ పని అయిపోయిందని భావించవచ్చు. కాని మీరు వెళ్ళమన్నా వెళ్ళకూడదని, సాధ్యమైనంతకాలం ట్రాన్సువాలులో వుండాలని భావిస్తున్నాను. నా పని నేటాలులో కాక, ఇక్కడ జరగాలని భావిస్తున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వెళ్ళిపోదామనే అభిప్రాయం నేను విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వకీలు వృత్తి ప్రారంభిస్తాను. అనుమతి తీసుకుంటాను. ఈ క్రొత్త విభాగాన్ని నడిపించగల శక్తి నాకు వున్నది. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోకపోతే జాతి దెబ్బ తింటుంది. ఇక్కడి నుండి అంతా మూట ముల్లె కట్టుకొని పారిపోవలసిన స్థితి దాపురిస్తుంది. మి. చేంబర్లేను నన్ను కలవలేదు. ఆ అధికారి నా విషయంలో తుచ్ఛంగా వ్యవహరించాడు. అయితే జాతి మొత్తానికి జరుగుతున్న అవమానం ముందు ఇది అంత పెద్దది కాదు. కుక్కలవలె మనం ఇక్కడ వుండటం సహించరాని విషయం.” అంటూ యదార్థ విషయాన్ని వాళ్ళందరి ముందు వుంచాను. ప్రిటోరియూ మరియు జోహన్సుబర్గులో నివసిస్తున్న హిందు దేశనాయకులతో చర్చించాను. చివరికి జోహన్సుబర్గులో ఆఫీసు నెలకొల్పాలని నిర్ణయించాము.

ట్రాన్సువాలులో నాకు వకీలు వృత్తికి అనుమతి పత్రం లభించే విషయం సందేహాస్పదమే. అయితే వకీళ్ల సముదాయం మాత్రం నన్ను వ్యతిరేకించలేదు. పెద్ద కోర్టు వారు వకీలు వృత్తి కోసం నేను పెట్టుకొన్న దరఖాస్తును అంగీకరించారు.

హిందూ దేశవాసులకు తగినచోట ఆఫీసు నెలకొల్పడం కోసం ఇల్లు దొరకడం కూడా అక్కడ కష్టమే. మి. రీచ్‌గారితో నాకు బాగా పరిచయం ఉంది. అప్పుడు వారు వ్యాపారవర్గంలో వున్నారు. వారికి పరిచితుడైన హౌస్ ఏజంటు ద్వారా ఆఫీసు కోసం నాకు మంచి చోట ఇల్లు దొరికింది. నేను వకీలు వృత్తి ప్రారంభించాను.

4. నాలో పెరిగిన త్యాగ ప్రవృత్తి

ట్రాన్సువాలులో హిందూ దేశవాసుల హక్కులకోసం ఏ విధంగా పోరు సలపవలసివచ్చిందో, ఆసియా విభాగానికి చెందిన అధికారులతో ఏవిధంగా తలపడవలసి వచ్చిందో వివరించే ముందు నా జీవితంలో జరుగుతున్న మరో ముఖ్యమైన మార్పును గురించి తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను.

ఇప్పటివరకు కొంత డబ్బు ప్రోగు చేయాలనే కోరిక నాకు వున్నది. పారమార్థికంతో బాటు స్వార్థం కూడా అందు చోటు చేసుకున్నది. బొంబాయిలో నా ఆఫీసు ప్రారంభించినప్పుడు ఒక అమెరికాకు చెందిన భీమా ఏజంటు నన్ను కలుసుకునేందుకు వచ్చాడు. అతని ముఖం ఆకర్షణీయంగా వుంది. మాటలు మధురంగా వున్నాయి. మేము పాత మిత్రులమా అనే భావం కలిగేలా అతడు నా భావి జీవితహితానికి సంబంధించి మాట్లాడాడు. “అమెరికాలో మీ స్థాయిలో వుండే వ్యక్తులంతా తమ జీవితాన్ని భీమా చేస్తారు. మీరు కూడా చేయించుకొని మీ భవిష్యత్తుని గురించి నిశ్చింతపడండి. అది ఎంతో అవసరం. జీవితంలో స్థిరత్వం కోసం అమెరికాలో భీమా చేయించుకోవడం కర్తవ్యమని భావిస్తాం. ఒక చిన్న పాలసీ తీసుకునేందుకు నేను మిమ్ము ఒప్పించలేనా?” అని అన్నాడు.

దక్షిణ ఆఫ్రికాలోను, హిందూదేశంలోను, చాలామంది భీమా ఏజంట్లను త్రిప్పి పంపించివేశాను. భీమా చేయించడంలో కొంచెం పిరికితనం, ఈశ్వరునిపై అపనమ్మకం పనిచేస్తుందని నా అభిప్రాయం. కాని ఈ పర్యాయం నేను కొంచెం ఆకర్షితుడనయ్యాను. అతడి మాటలు వింటున్న కొద్దీ నా భార్యా బిడ్డల భవిష్యత్తును గురించిన చిత్తరువు కండ్ల ఎదుట కనబడసాగింది. “ఓ పెద్దమనిషీ! నీవు దరిదాపుగా నీ భార్య ఆభరణాలన్నీ అమ్మివేశావు. రేపు నీకేమైనా ఆయితే, భార్యాబిడ్డల భారం పాపం బీదవాడైన నీ అన్నగారి మీద పడుతుంది. ఆ సోదరుడే తండ్రిగా నీ బాధ్యత వహించాడు. ఆయన మీదే మొత్తం భారం పడదా! ఇది ఏమంత మంచిపని కాదు” ఈ రకమైన తర్కం నా మనస్సులో ప్రారంభమైంది. అప్పుడు 10వేల రూపాయలకు భీమా చేయించాను కాని దక్షిణ ఆఫ్రికాలో తలెత్తిన క్రొత్త ఆపదను పురస్కరించుకొని నేను చేసిన పనులన్నీ భగవంతుణ్ణి సాక్షిగా పెట్టుకొని చేసినవే. దక్షిణ ఆఫ్రికాలో ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. ఇక హిందూ దేశానికి తిరిగి వెళ్ళలేను. అందువల్ల నా భార్యాబిడ్డల్ని నా దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళను ఇక వదలకూడదు. వాళ్ళపోషణ దక్షిణ ఆఫ్రికాలోనే జరగాలి అని అనుకున్నాను. దానితో ఆ పాలసీ దుఃఖానికి హేతువు అయింది. భీమా ఏజంటు వలలో చిక్కుకున్నందుకు సిగ్గుపడ్డాను. మా అన్న తండ్రి బాధ్యత హించినప్పుడు, తమ్ముని భర్య వితంతువైతే ఆమె బాధ్యత వహించడని నీవు ఎట్లా అనుకున్నావు? నీవే ముందు చనిపోతావని ఎందుకు భావించావు? పాలకుడు ఆ ఈశ్వరుడే. నీవూ కాదు, నీ అన్నా కాదు. భీమా చేయించి భార్యాబిడ్డల్ని కూడా పరాధీనుల్ని చేశావు. వాళ్ళు స్వయం పోషకులు కాలేరా? ఎంతోమంది బీదల బిడ్డలు లేరా? వారి సంగతేమిటి? నీ వాళ్ళుకూడా అట్టివారేనని ఎందుకు భావించవు? ఈ విధమైన భావనాస్రవంతి ప్రారంభమైంది. వెంటనే ఆచరణలో పెట్టలేకపోయాను. భీమాకు చెల్లించవలసిన సొమ్ము ఒక్క పర్యాయం దక్షిణ ఆఫ్రికా నుండి పంపించినట్లు గుర్తు. ఈ విధమైన భావానికి బయటనుండి కూడా ఉత్తేజం లభించింది. మొదటిసారి దక్షిణ ఆఫ్రికాకు వచ్చినప్పుడు క్రైస్తవ వాతావరణ ప్రభావం వల్ల మత విషయంలో జాగరూకుడనయ్యాను. ఈసారి దివ్య జ్ఞాన సమాజ ప్రభావంలో పడ్డాను. మి.రీచ్ ధియాసోఫిస్టు. జోహాన్సుబర్గునందున్న ఆయన సొసైటీతో నాకు సంబంధం కల్పించాడు. అయితే నేను అందు మెంబరుగా చేరలేదు. దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాల విషయంలో నాకు అభిప్రాయభేదం ఉంది. అయినా సదరు సొసైటీ సభ్యులందరితో నాకు గాఢంగా పరిచయం ఏర్పడింది. వారితో నిత్యము మతపరంగా చర్చ జరుగుతూ వుండేది. వారి పుస్తకాలు చదివేవాణ్ణి. వారి సభల్లో మాట్లాడే అవకాశం కూడా లభిస్తూ ఉండేది. దివ్యజ్ఞాన సమాజంలో భ్రాతృభావానికీ, దాని పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమై మేము బాగా చర్చ చేస్తూ వుండేవాళ్ళం. వారి సిద్ధాంతానికి, సొసైటీ సభ్యుల ఆచరణకీ పొంతన కనపడకపోతే తీవ్రంగా విమర్శించేవాణ్ణి. ఈ విమర్శ యొక్క ప్రభావం నా మీద కూడా బాగా పడింది. నేను ఆత్మ నిరీక్షణ చేసుకోవడం నేర్చుకున్నాను.

5. నిరీక్షణకు ఫలితం

క్రీస్తుశకం 1893లో క్రైస్తవ మిత్రులతో పరిచయం పెరిగిన సమయంలో నేను జిజ్ఞాసువు స్థాయిలో వున్నాను. క్రైస్తవ మిత్రులు బైబిలు సందేశం నాకు వినిపించి వివరించి చెప్పి నా చేత అంగీకరింపచేయాలని ప్రయత్నిస్తూ వుండేవారు. నేను వినమ్రతతో తటస్థభావం వహించి వారి ఉపదేశాలను వింటూ వుండేవాణ్ణి. ఆ సందర్భంలో నేను హిందూ మతాన్ని గురించి శక్త్యానుసారం అధ్యయనం చేశాను. ఇతర మతాల్ని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు అనగా 1903లో పరిస్థితి మారింది. దివ్యజ్ఞాన సమాజం మిత్రులు నన్ను తమ సమాజంలో చేర్చుకుందామని ఉవ్విళ్లూరుతున్నారు. హిందువుగా నా ద్వారా ఏదో కొంత చేయించాలని వాళ్ళ అభిలాష. దివ్యజ్ఞాన పుస్తకాల్లో హిందూ మతచ్ఛాయలే ఎక్కువ. అందువల్ల నేను ఎక్కువగా సహకరిస్తానని అనుకున్నారు. సంస్కృత అధ్యయనం నేను చేయలేదు. ప్రాచీన హిందూమత గ్రంథాలు సంస్కృతంలో నేను చదవలేదు. అనువాదాలు కూడా చదివింది తక్కువే అని చెప్పాను. అయినా వాళ్ళు సంస్కారాల్ని, పునర్జన్మను అంగీకరిస్తారు. అందువల్ల నా వల్ల కొద్ది సాయం పొందాలని వారి అభిలాష. “నిరస్తపాదపే దేశే ఎరండోపి ద్రుమాయతే” చెట్టులేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అను సామెత వలె నా పరిస్థితి వున్నది. ఒక మిత్రునితో కలిసి వివేకానందుని గ్రంధాలు, మరొకరితో కలిసి మణిలాల్ భాయీ రచించిన రాజయోగం చదవడం ప్రారంభించాను. జిజ్ఞాస మండలి అను పేరిట ఒక సమితిని స్థాపించి నియమబద్ధంగా అధ్యయన కార్యక్రమం ప్రారంభించాం. భగవద్గీత అంటే మొదటినుండి నాకు ఎంతో ప్రేమ, శ్రద్ధ. లోతుకుపోయి గీతాధ్యయనం చేయాలనే కోరిక కలిగింది. నా దగ్గర గీతానువాదాలు రెండు మూడు వున్నాయి.

వాటి ద్వారా సంస్కృత గీతను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టి ప్రతిరోజు ఒకటి రెండు శ్లోకాలు కంఠస్థం చేయాలని నిశ్చయించుకున్నాను.

ఉదయం ముఖం కడుక్కునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు గీతాశ్లోకాలు కంఠస్థం చేయసాగాను. దంతధావనకు 15 నిమిషాలు, స్నానానికి 20 నిమిషాలు పట్టేది. దంతధావనం ఆంగ్లేయుల పద్ధతిలో నిలబడి చేసేవాణ్ణి. ఎదురుగా వున్న గోడమీద గీతాశ్లోకాలు వ్రాసి అంటించి సమయం దొరికినప్పుడల్లా వాటిని బట్టీవేయసాగాను. బట్టీ వేసిన సంస్కృత శ్లోకాలు స్నానం చేసేసరికి నోటికి వచ్చేసివి. ఈ సమయంలోనే మొదటి నుండీ బట్టీ బట్టిన శ్లోకాల్ని తిరిగి పఠించి నెమరవేసుకునేవాణ్ణి. ఈ విధంగా 13 అధ్యాయాలు కంఠస్థం చేసిన సంగతి నాకు గుర్తు ఉంది. తరువాత నాకు ఇతర పని పెరిగింది. సత్యాగ్రహ కార్యక్రమం ప్రారభించిన తరువాత ఆ బిడ్డ పెంపకం, పోషణలో పడిపోయి ఆలోచించడానికి కూడా సమయం చిక్కడం దుర్లభం అయింది.

ఇప్పటికీ అదే స్థితి అని చెప్పవచ్చు. గీతాధ్యయనం వల్ల నాతో కలిసి చదువుతున్నవారి మీద ఏం ప్రభావం పడిందో తెలియదు కాని నాకు మాత్రం ఆ పుస్తకం ఆచారానికి సంబంధించిన ప్రౌఢ మార్గసూచిక అయిందని చెప్పగలను. అది నాకు ధార్మిక నిఘంటువు అయింది. క్రొత్త ఇంగ్లీషు శబ్దాల స్పెల్లింగు లేక వాటి అర్థం తెలుసుకునేందుకు ఇంగ్లీషు నిఘంటువును చూచినట్లే ఆచరణకు సంబధించిన కష్టాలు, కొరుకుడుపడని సమస్యలు వచ్చినప్పుడు గీతద్వారా వాటి పరిష్కారం చేసుకునేవాణ్ణి. అపరిగ్రహం, సమభావం మొదలైన అందలి శబ్దాలు నన్ను ఆకట్టుకున్నాయి. సమభావాన్ని ఎలా సాధించాలి? దాన్ని ఎలా సంరక్షించాలి? అవమానించే అధికారులు, లంచాలు పుచ్చుకునే అధికారులు, అనవసరంగా వ్యతిరేకించేవారు, భూతకాలపు అనుచరులు మొదలగువారు ఎక్కువ ఉపకారాలు చేసిన సజ్జనులు వీరి మధ్య భేదం చూపవద్దు అని అంటే ఏమిటి? అది ఎలా సాధ్యం? అపరిగ్రహాన్ని పాలించడం ఎలా? దేహం వున్నదిగదా! ఇది తక్కువ పరిగ్రహమా? భార్యాబిడ్డలు పరిగ్రహాలు కాదా? గ్రంధాలతో నిండియున్న అల్మారాలను తగులబెట్టనా! ఇల్లు తగులబెట్టి తీర్ధాలకు వెళ్ళనా? ఇల్లు తగులబెట్టందే తీర్థాలు సాధ్యం కావు అని వెంటనే సమాధానం వచ్చింది. ఇక్కడ ఇంగ్లీషు చట్టం సహాయం చేసింది. ప్రెల్ యొక్క చట్టపరమైన సిద్ధాంతాల వివరం జ్ఞాపకం వచ్చింది. ట్రస్టీ అను శబ్దానికి అర్థం ఏమిటో గీత చదివిన తరువాత బాగా బోధపడింది. లా శాస్త్రం ఎడ ఆదరణ పెరిగింది. దానిలో కూడా నాకు ధర్మదర్శనం లభించింది. ట్రస్టీ దగ్గర కోట్లాది రూపాయలు వున్నా వాటిలో ఒక్క దమ్మిడీ కూడా అతనిది కాదు. ముముక్షువు యొక్క స్థితి కూడా ఇంతేనని గీతాధ్యయనం వల్ల నాకు బోధపడింది. అపరిగ్రహికావడానికి, సమభావి కావడానికి హేతువుయొక్క మార్పు, హృదయము యొక్క మార్పు అవసరమను విషయం గీతాధ్యయనం వల్ల దీపపు కాంతిలా నాకు స్పష్టంగా కనబడింది. భీమా పాలసీ ఆపివేయమనీ, ఏమైనా తిరిగి వచ్చేది వుంటే తీసుకోమనీ, తిరిగి వచ్చేది ఏమీ లేకపోతే ఆ సొమ్ము పోయినట్లుగా భావించమనీ, భార్యా బిడ్డల సంరక్షణ వాళ్ళను, నన్ను పుట్టించినవాడే చేస్తాడనీ, దేవాశంకరభాయికి జాబు వ్రాశాను. ఈనాటి వరకు నా దగ్గర మిగిలిన సొమ్మంతా మీకు అర్పించాను. ఇక నా ఆశమానుకోండి ఇకనుండి నా దగ్గర మిగిలేదంతా జాతికి ఉపయోగపడుతుంది అని పితృతుల్యులగు నా అన్నగారికి వ్రాశాను.

అయితే ఈ విషయం అన్నగారికి వెంటనే వివరించలేకపోయాను. మొదట వారు కఠినమైన భాషలో తన విషయమై నా కర్తవ్యం ఏమిటో వివరించి నీవు మన తండ్రిగారిని మించి తెలివితేటలు ప్రదర్శించవద్దు. మన తండ్రి ఎలా కుటుంబపోషణ చేశారో నీవు కూడా అదే విధంగా కుటుంబపోషణ చేయాలి అంటూ ఏమేమో వ్రాశారు. వినమ్రంగా సమాధానం వ్రాస్తూ “తండ్రిగారు చేసిన పనే నేను చేస్తున్నాను. కుటుంబం యొక్క అర్థాన్ని విస్తృతం చేసి చూచుకుంటే నా నిర్ణయమందలి ఔచిత్యం మీకు బోధపడుతుంది” అని తెలియజేశాను.

అన్నగారు ఇక నా ఆశవదులుకున్నారు. మాట్లాడటం కూడా విరమించుకున్నారు. నాకు దుఃఖం కలిగింది. కాని ధర్మమని భావించిన విషయాన్ని వదలమంటే మరీ దుఃఖం కలిగింది. నేను పెద్ద దుఃఖాన్ని సహించాలని నిర్ణయించుకున్నాను. అయినా దుఃఖానికి కారణం నా యెడ వారికి గల ప్రేమయే. నా సొమ్ముకంటే నా సదాచరణ వారికి ముఖ్యం. చివరి రోజుల్లో అన్నగారు కరిగిపోయి తాను మృత్యుశయ్యమీద వున్నప్పడు “నీ ఆచరణయే సరియైనది, ధర్మబద్ధమైనది అని నాకు తెలియజేశారు. కరుణరసంతో నిండిన వారి జాబు నాకు అందింది. తండ్రి కుమారుని క్షమాపణ కోరగలిగితే వారు నన్ను క్షమాభిక్ష కోరినట్లే. నా బిడ్డలను నీ విధానంలోనే పెంచి పోషించమని వ్రాశారు. నన్ను కలుసుకోవాలని ఆతురతను వ్యక్తం చేశారు. నాకు తంతి పంపారు. వెంటనే తంతి ద్వారా నా దగ్గరకు రమ్మని వారికి తెలియజేశాను. కాని మా ఇరువురి కలయిక సాధ్యపడలేదు. వారి బిడ్డలకు సంబంధించిన వారి కోరిక కూడా నెరవేరలేదు. అన్నగారు భారతదేశంలోనే శరీరం త్యజించారు. వారి పిల్లలపై తండ్రి యొక్క పాత జీవన ప్రభావం బాగా పడింది. వాళ్ళు మారలేకపోయారు. నేను వారిని నా దగ్గరకు తెచ్చుకోలేకపోయాను. ఇందు వారి దోషం ఏమీ లేదు. స్వభావాన్ని ఎవరు మార్చగలరు? బలమైన సంస్కారాల్ని ఎవరు పోగొట్టగలరు? మనలో మార్పు వచ్చిన విధంగా మన ఆశ్రితుల్లో, బంధువుల్లో, కుటుంబీకుల్లో మార్పు రావాలని భావించడం వ్యర్థమే”

ఈ దృష్టాంతం వల్ల తల్లిదండ్రుల బాధ్యత ఎంత భయంకరమైనదో అంచనా వేయవచ్చు.

6. మాంసరహిత ఆహారం కోసం బలిదానం

జీవితంలో త్యాగనిరతి, నిరాడంబరత, ధర్మ జాగృతితో బాటు మాంసరహిత ఆహారాన్ని గురించి. అట్టి ఆహార ప్రచారాన్ని గురించి శ్రద్ధ పెరగసాగింది. ఆచరణ ద్వారాను, జిజ్ఞాసువులతో చర్చల ద్వారాను ప్రచారం చేయడం ప్రారంభించాను.

జోహన్సుబర్గులో ఒక మాంసరహిత భోజనశాల వున్నది. కూనేగారి జల చికిత్స తెలిసిన ఒక జర్మనీ వాడు దాన్ని నడుపుతూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళడం ప్రారంభించాను. వెంట తీసుకొని వెళ్ళగలిగినంత మంది ఇంగ్లీషు వాళ్ళను అక్కడికి తీసుకువెళ్ళసాగాను. ఈ భోజనశాల ఎక్కువ రోజులు నడవదని గ్రహించాను. ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందే. అవసరమని భావించి చేతనైనంత ఆర్థిక సాయం చేశాను. కొంత డబ్బు పోగొట్టుకున్నాను కూడా. చివరికి ఆ భోజనశాల మూతబడింది. థియాసాఫిస్టుల్లో ఎక్కువ మంది శాకాహారులు. కొందరు పూర్తిగా, కొందరు సగం శాకాహారులు. ఆ మండలిలో సాహసోపేతురాలైన ఒక మహిళ వుంది. ఆమెది పెద్ద స్థాయి. ఒక శాకాహార భోజనశాల ప్రారంభించింది. ఆమె కళాభిమాని, రసికురాలు. ఖర్చు బాగా పెడుతుంది. లెక్కాడొక్కా ఎక్కువగా ఆమెకు తెలియదు. ఆమెకు మిత్రమండలి అధికం. ప్రారంభంలో తక్కువ స్థాయిలో ప్రారంభించింది. కాని త్వరలోనే పెంచి, పెద్ద స్థాయిలో నడపాలని నిర్ణయానికి వచ్చింది. అందుకు నా సాయం కోరింది. అప్పుడు నాకు ఆమె లెక్కల వ్యవహారం తెలియదు. ఆమె లెక్కలు సరిగా ఉన్నాయని అనుకున్నాను. నా దగ్గర డబ్బుకు కొదువలేదు. చాలామంది కక్షిదారుల సొమ్ము నా దగ్గర ఉన్నది. వారిలో ఒకనితో మాట్లాడి అతని సొమ్ము 100 పౌండ్లు ఆమెకు ఇచ్చాను. ఆ వ్యక్తి విశాలహృదయుడు. నా మీద అతనికి అపరిమితమైన విశ్వాసం. అతడు మొదటి కూలీల జట్టులో దక్షిణ ఆఫ్రికా వచ్చినవాడు. “అన్నా! మీ మనస్సు సరేనంటే ఇవ్వండి. నాకేమీ తెలియదు. నాకు తెలిసినవారు మీరే” అని అన్నాడు. అతని పేరు బద్రీ. సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. జైలుశిక్ష కూడా అనుభవించాడు. అతడి మాట తీసుకొని సొమ్ము ఆమెకు అప్పుగా ఇచ్చాను. రెండు మూడు మాసాలు గడిచాయి. ఇక డబ్బు తిరిగి రాదని నాకు బోధపడింది. యింత సొమ్ము మునిగితే తట్టుకోగలశక్తి నాకు లేదు. ఆ సొమ్ముతో చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. ఇక ఆ సొమ్ము వాపసు రాలేదు. నా మీద అంత నమ్మకంతో వున్న బద్రీని నేను ముంచగలనా? అతనికి తెలిసినవాణ్ణి నేనేగదా? అందువల్ల ఆ సొమ్ము నేనే చెల్లించివేశాను.

ఒక కక్షిదారునికి ఈ విషయం చెప్పాను. అతడు తియ్యగా మందలించి నన్ను జాగ్రత్తపడమని హెచ్చరించాడు. “అన్నా! (దక్షిణ ఆఫ్రికాలో నేను అప్పటికి మహాత్ముణ్ణి కాలేదు. “బాపూ” కూడా కాలేదు. కక్షిదారులంతా నన్ను అన్నా అని పిలుస్తూ ఉండేవారు) ఇది మీ పనికాదు. మీమీద గల నమ్మకంతో మేము నడుచుకుంటాం. ఆ సొమ్ము ఇక మీకు రాదు. మీరు బద్రీని నష్టపరచరు. సరే మీరు మునిగినట్లేకదా! ఈ విధంగా పరుల మేలు కోసం కక్షిదారుల సొమ్ము ఇవ్వడం ప్రారంభిస్తే కక్షిదార్లు చచ్చిపోతారు. బిచ్చగాళ్ళు అయి ఇంట్లో కూర్చుంటారు. మీరు చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలు దెబ్బతింటాయి.” అని అన్నాడు.

అదృష్టవశాత్తు ఆ మిత్రుడు ఇంకా జీవించే వున్నాడు. దక్షిణ ఆఫ్రికాలోను, ఇతరత్రాను అతడి కంటే మించిన స్పష్టవాది మరొకడు నాకు తగలలేదు. ఎవరిని గురించి అయినా అనుమానం కలిగితే, వెంటనే ముఖం మీద అడిగి తేల్చుకోవడం, అది అబద్ధమని తేలితే వెంటనే వారిని క్షమాపణ కోరి మనస్సును తేలిక పరుచుకోవడం అతనికి అలవాటు. అతని మాటలు సబబుగా వున్నాయి. బద్రీ సొమ్ము తీర్చివేశాను. కాని మరో వంద పౌండ్లు నేను మునిగి వుంటే తట్టుకోగల శక్తి నాకు లేదు. అప్పు చేయవలసి వచ్చేది. జీవితంలో ఇట్టి పని ఇక ఎన్నడూ నేను చేయలేదు. ఇటువంటి పని నాకు అసలు గిట్టదు. సంస్కరణకు సంబంధించిన పనుల్లో కూడా శక్తికి మించి పాల్గొనడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం గీత బోధించిన తటస్థ నిష్కామకర్మ విధానానికి విరుద్ధమని, ఆ విధంగా గీతను తృణీకరించినట్లయిందని తెలుసుకున్నాను. మాంసరహిత ఆహార ప్రచారం కోసం ఈ విధమైన బలిదానం అవసరమవుతుందని కలలోనైనా ఊహించలేదు. ఇది బలవంతగా లభించిన పుణ్యమని భావించవచ్చు.

7. మట్టితో, నీటితో ప్రయోగాలు

నా జీవితంలో నిరాడంబరత పెరిగినకొద్దీ రోగాలకు మందు పుచ్చుకోవడమంటే అయిష్టత కూడా పెరిగింది. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నపుడు డాక్టర్ ప్రాణజీవనదాసు మెహతా నన్ను చూచేందుకు వచ్చేవారు. అప్పుడు నాకు నీరసంగా వుండేది. అప్పుడప్పుడు వాపు కూడా వస్తూ ఉండేది. ఆయన చికిత్స చేయగా ఆ నలత తగ్గిపోయింది. ఆ తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేవరకు చెప్పుకోదగ్గ జబ్బు చేసినట్లు నాకు గుర్తు లేదు.

జోహన్సుబర్గులో నన్ను విరోచనాలు పట్టుకున్నాయి. తలనొప్పి కూడా వుండేది. విరోచనాలకు మందు పుచ్చుకుంటూ ఉండేవాణ్ణి. పత్యంగా వుండేవాణ్ణి. అయినా పూర్తిగా వ్యాధి తగ్గలేదు. విరోచనాలు కట్టుకుంటే బాగుంటుందని మనస్సు సదా కోరుకుంటూ ఉండేది.

ఇదే సమయాన నేను మాంచెస్టరు పత్రికలో “నో బ్రేక్‌ఫాస్టు అసోసియేషన్” (టిఫెన్ల త్యాగ సంఘం) స్థాపనకు సంబంధించిన వార్త చదివాను. ఆ వార్తా రచయిత ఇంగ్లీషు వాళ్ళు చాలాసార్లు చాలా ఆహారం భుజిస్తారనీ, రాత్రి పన్నెండు గంటలదాకా తింటూనే వుంటారనీ, తత్ఫలితంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వుంటారనీ, ఈ బాధ తొలగాలంటే ఉదయం తీసుకునే టిఫెను (బ్రేక్ ఫాస్టు) మానివేయాలని వ్రాశాడు. ఈ ఆరోపణ పూర్తిగా కాకపోయినా కొంతవరకు నాకూ వర్తిస్తుందని భావించాను. నేను మూడు పర్యాయాలు కడుపు నిండా తినేవాణ్ణి. మధ్యాహ్నం పూట టీ కూడా త్రాగేవాణ్ణి. శాకాహారం, మసాలాలు లేని ఆహార పదార్థాలు భుజించేవాణ్ణి. ఆరు లేక ఏడు గంటలకు ముందు లేచేవాణ్ణి కాదు. నేను కూడా ఉదయం టిఫెను మానేస్తే మంచిదనీ, తలనొప్పి తగ్గవచ్చుననీ నిర్ణయానికి వచ్చాను. ఉదయం టిఫెసు మానివేశాను. కొద్దిరోజులు బాధ కలిగింది. కాని తత్ఫలితంగా తలనొప్పి తగ్గిపోయింది. దానితో నేను అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నానని తేలిపోయింది.

విరోచనాలు తగ్గలేదు. కూనే తెలిపిన ప్రకారం కటిస్నానం మొదలు పెట్టాను. బాధ కొద్దిగా తగ్గింది. కాని పూర్తిగా తగ్గలేదు. ఈ లోపున ఆ జర్మనీ హోటలువాడో మరో మిత్రుడో, జుస్ట్ రచించిన “రిటర్న్ టు నేచర్” (ప్రకృతి వైపు మరలుము) అను పుస్తకం నా చేతికి ఇచ్చారు. అందు మట్టి చికిత్సను గురించిన వివరం చదివాను. ఎండుద్రాక్ష వగైరా పండ్లు, ఆకుపచ్చని పండ్లు మనిషికి ప్రాకృతిక ఆహారమని కూడా వ్రాసి ఉన్నది. పండ్లను గురించిన ప్రయోగం అప్పుడు నేను చేయలేదు కాని మట్టి చికిత్స వెంటనే ప్రారంభించాను. ప్రయోజనం కలిగింది. పరిశుభ్రమైన, పొలంలో దొరికే ఎర్రని లేక నల్లని మట్టి తెచ్చి అందు సరిపోయేలా నీళ్ళుపోసి కలిపి, పల్చటి తడి బట్టమీద దానివేసి చుట్టి పొట్టమీద ఉంచాను. దాని మీద పట్టీ కట్టాను. ఆ విధంగా మట్టిపట్టి రాత్రి నిద్రపోయే ముందు కట్టి, ప్రొద్దునగాని లేక రాత్రి మెలకువ వచ్చినప్పుడు గాని విప్పదీసేవాణ్ణి. దానివల్ల విరోచనాలు కట్టుకున్నాయి. ఈ విధమైన మట్టి చికిత్స నా అనుచరులకు కూడ చాలాసార్లు చేశాను. అది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని నాకు ఇప్పటికీ జ్ఞాపకం.

భారతదేశం వచ్చాక ఇలాంటి చికిత్సలను గురించిన ఆత్మ విశ్వాసం తగ్గిపోయింది. ప్రయోగాలు చేసేందుకు ఒకచోట కూర్చునేందుకు సమయమే దొరకలేదు. అయితే ఇట్టి చికిత్స యెడ నాకు గల శ్రద్ధాసక్తులు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. సమయాన్ని బట్టి అప్పుడప్పుడు మట్టి చికిత్స నేను చేసుకోవడమేగాక నా అనుచరులకు కూడా చేస్తున్నాను. రెండు పర్యాయాలు నేను బాగా జబ్బు పడ్డాను. అయినా మందులు పుచ్చుకోవలసిన అవసరం లేదనే భావించాను. పత్యం, నీరు, మట్టి మొదలుగాగల చికిత్సతో వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది జబ్బులు నయం చేయవచ్చునని నా విశ్వాసం.

క్షణక్షణం డాక్టర్ల దగ్గరికీ, వైద్యుల దగ్గరికీ, హకీములదగ్గరికీ పరుగెత్తుతూ, ఉదరంలో రకరకాల బెరుళ్ళు, ఆకులు మొదలగువాటి రసాయనం పోసి పోసి మనిషి తన జీవితాన్ని తానే కుంచించుకుంటూ ఉన్నాడు. అంతేగాక మనస్సుమీద అతనికి గల పట్టు తప్పుతున్నది. దానితో అతడు మానవత్వం పోగొట్టుకుంటున్నాడు. శరీరానికి బానిస అయిపోతున్నాడు. రోగ శయ్యమీద పడుకొని నేను వ్రాస్తున్నాను. అందువలన నా భావాల్ని తేలికగా తీసుకొని త్రోసివేయవద్దు. నా జబ్బుకు కారణం ఏమిటో నాకు తెలుసు. నా దోషాల వల్లనే నేను జబ్బుపడ్డాను. కనుకనే నేను అధైర్యపడలేదు. ఈ జబ్బు భగవంతుని అనుగ్రహంవల్ల వచ్చిందని భావిస్తున్నాను. మందులు వాడాలనే కోరికకు దూరంగా ఉన్నాను. పట్టుదలతో డాక్టర్లను ఇబ్బంది పెడుతూ ఉన్నాను. అయినా వాళ్ళు ఉదార స్వభావంతో నా మొండిపట్టును చూచి నన్ను వదిలివేయరు. నా ఈనాటి స్థితిని గురించి ఇక వ్రాయను. మనం 1904 పూర్వం నుండి 05కి వద్దాం.

ముందుకు సాగే పాఠకుల్ని ఒక్క విషయమై హెచ్చరించడం అవసరమని భావిస్తున్నాను. నా వర్ణన చదివి జుస్టు పుస్తకం తెప్పించి ఆయన వ్రాసినదంతా వేద వాక్యమని భావించకుందురుగాక. ప్రతి రచనయందు సామాన్యంగా రచయిత భావం ఒక్కటే చోటుచేసుకుంటూ ఉంటుంది. కాని ప్రతి విషయాన్ని పలు రకాలుగా పరిశీలించవచ్చు. ఆయా దృక్పథాల ప్రకారం అది సరిగానే ఉంటుంది. అయితే అన్ని దృక్పధాలు, అన్ని విషయాలు ఒకే సమయాన సత్యాలు కానేరవు. ఇంతేగాక చాలా పుస్తకాలు అమ్మకం కావాలనే భావంతోను, పేరు రావాలనే తాపత్రయంతోను వ్రాయబడుతూ ఉంటాయి. అందువల్ల ఆ పుస్తకం చదవదలచిన సోదరులు జాగ్రత్తగా చదవమనీ, ప్రయోగాలు చేయతలుచుకుంటే అనుభవజ్ఞుల సలహా సహకారాలు పొందమనీ ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ఇట్టి ప్రయోగాలకు పూనుకోమనీ మనవి చేస్తున్నాను.

8. ఒక జాగరూకత

నా వివిధ ప్రయోగాల గాధను గురించి చెప్పడం తరువాతి ప్రకరణం వరకు ఆపుతాను. గత ప్రకరణంలో మట్టి చికిత్సను గురించి వ్రాసిన విధంగానే ఆహారం విషయంలో కూడా పలు ప్రయోగాలు చేశాను. అందువల్ల అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ చెప్పివేయడం అవసరమని భావిస్తున్నాను. ఆహారం విషయంలో నేను చేసిన ప్రయోగాలను గురించి, అందుకు సంబంధించిన యోచనలను గురించి పూర్తిగా ఈ ప్రకరణంలో వివరించడం సాధ్యం కాదు. ఆ విషయాలు దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం నేను వ్రాసిన వ్యాసాలు తరువాత పుస్తక రూపంలో ప్రకటించబడ్డాయి. నేను వ్రాసిన చిన్నచిన్న పుస్తకాలలో ఈ పుస్తకం పాశ్చాత్య దేశాల్లోను, మనదేశంలోను బాగా ప్రసిద్ధికెక్కింది. అందుకు కారణం ఏమిటో ఈనాటివరకు నేను తెలుసుకోలేకపోయాను. ఆ పుస్తకం ఇండియన్ ఒపీనియన్ పత్రిక కోసం వ్రాయబడింది. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని చాలామంది సోదర సోదరీమణులు తమ జీవనంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిపారు.

అందువల్ల ఆ విషయాన్ని గురించి ఇక్కడ కొద్దిగా వ్రాయవలసిన అవసరం ఏర్పడింది. ఆ పుస్తకంలో వ్రాసిన నా భావాలలో మార్పు చేయవలసిన అవసరం ఏమీ కలుగకపోయినా, నేను జీవితంలో చేసిన అత్యవసరమైన కొన్ని మార్పుల్ని గురించి ఆ పుస్తకం చదివిన పాఠకులకు తెలియదు. వారు ఆ వివరం తెలుసుకోవడం చాలా అవసరం.

మిగతా పుస్తకాలవలెనే నేను ఈ పుస్తకం కూడా కేవలం ధార్మిక భావంతో వ్రాశాను. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిలో ఆ భావమే నిండి ఉంటుంది. అందువల్ల అందలి అనేక విషయాల్ని నేను అమలు చేయలేకపోయాను. ఇది నాకు విచారం, సిగ్గు కలిగించే విషయం.

బాల్యంలో బిడ్డ తల్లి పాలు త్రాగుతాడు. ఆ తరువాత మరో పాలు త్రాగవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. పండిన వన్య ఫలాలతో బాటు ఆకుపచ్చని పండ్లు, ఎండు ఫలాలు మనిషికి మంచి ఆహారం. వాటికి మించినది మరొకటి లేదు. బాదంపప్పు, ద్రాక్ష మొదలుగాగలపండ్ల వల్ల మనిషి శరీరానికి, మెదడుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఇట్టి ఆహారం మీద ఆధారపడి వుండగల వారు బ్రహ్మచర్యం మొదలగు ఆత్మ సంయమగుణాల్ని అలవరచుకోవచ్చు. తిండిని బట్టి త్రేపులు ఉంటాయి. తినే తిండిని బట్టి మనిషి తయారవుతాడు. అను సామెత యందు సత్యం ఇమిడి ఉంది. నేను, నా అనుచరులు అట్టి అనుభవం పొందాం.

ఈ భావాలను సమర్థిస్తూ విస్తారంగా నా ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది. కాని హిందూదేశంలో నా ప్రయోగాలు పూర్తి సాఫల్యం పొందే అదృష్టం నాకు కలగలేదు. ఖేడా జిల్లాలో సైనికుల్ని భర్తీ చేసుకుంటూ నా పొరపాటు వల్ల మృత్యుశయ్య మీదకు చేరాను. పాలు లేకుండా జీవించాలని ఎంతో ప్రయాసపడ్డాను. తెలిసిన వైద్యుల, డాక్టర్ల, రసాయన శాస్త్రజ్ఞుల సహాయం కోరాను. పెసరనీళ్ళు తీసుకోమని ఒకరు, విప్పనూనె తీసుకోమని ఒకరు, బాదంపాలు తీసుకోమని ఒకరు సలహా ఇచ్చారు. వాటినన్నింటి ప్రయోగాలు చేసి చేసే నా శరీరాన్ని పిండివేశాను. తత్ఫలితంగా పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకున్నాను. చరకుని శ్లోకాలు వినిపించి వైద్యులు కొందరు రోగం నయం కావడానికి ఖాద్యాఖాద్యములను గురించి బాధపడవద్దని మాంసాదులు కూడా తినవచ్చునని చెప్పారు. ఈ వైద్యులు పాలు త్రాగకుండా గట్టిగా వుండమని చెప్పలేరని తేలిపోయింది. బీఫ్ టీ (గోమాంసపు టీ), బ్రాంది పుచ్చుకోవచ్చునని చెప్పేవారున్న చోట పాలు త్రాగడం మానమని చెప్పేవారు ఎలా దొరుకుతారు? ఆవుపాలు, గేదెపాలు నేను త్రాగను. అది నా వ్రతం. నా వ్రత ఉద్దేశ్యం పాలు మానడమే. అయితే అట్టి వ్రతం గైకొన్నప్పుడు నా దృష్టిలో వున్నది గోమాత, గేదెమాత మాత్రమే. నేను వ్రతం అనే పదాన్ని పాటించాను. మేకపాలు తీసుకొనేందుకు అంగీకరించాను. మేకమాత పాలు త్రాగుతున్నప్పుడు వ్రతాత్మకు విఘాతం కలిగిందని నాకు అనిపించింది.

అయితే నేను రౌలట్ ఆక్టును ఎదుర్కోవాలి! ఆ మోహం నన్ను వదలలేదు. అందువల్ల జీవించి వుండాలనే కాంక్ష కలిగింది. జీవితంలో మహత్తర ప్రయోగమని దేన్ని భావిస్తూ వున్నానో అది ఆగిపోయింది.

ఆహారంతో జలంతో ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ తినదు, తాగదు. ఉదరంలోకి పోయే పదార్థాలతో దానికి సంబంధం లేదు. లోనుండి వెలువడే మాటలే లాభనష్టాలు కలిగిస్తాయని నాకు తెలుసు. అందు నిజం కూడా కొంత వున్నది. తర్కం జోలికి పోకుండా ఇక్కడ నా దృఢ నిశ్చయం ప్రకటిస్తున్నాను. భగవంతునికి వెరచి నడుచుకోవాలని, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని భావించే సాధకునకు మరియు ముముక్షువునకు ఆహారపదార్థాల ఎన్నికను గురించి, వాటిని త్యజించడాన్ని గురించి శ్రద్ధ చాలా అవసరం. భావాన్ని, వాక్కును ఎన్నుకోవడం ఎంత అవసరమో నిర్ణయం యెడ శ్రద్ధ వహించడం అంత అవసరం అన్నమాట.

అయితే స్వయంగా నేను చేయని దాన్ని ఆచరించమని ఎవ్వరికీ సలహా ఇవ్వను. అలా ఎవరైనా చేయదలుచుకుంటే వారిని వారిస్తాను. అందువల్ల ఆరోగ్యవిషయమై నేను వ్రాసిన పుస్తకం సాయంతో ప్రయోగాలు చేయదలచిన చాలామందిని హెచ్చరిస్తున్నాను. పాలు మానడం పూర్తిగా లాభకారి. అయితే, అనుభవజ్ఞులగు వైద్యులు డాక్టర్లు పాలుమానమని సలహాయిస్తేనే పాలుమానడం మంచిది. నా పుస్తకాన్ని ఆధారం చేసుకొని మాత్రం పాలు మానవద్దు. నాకు ఇప్పటివరకు కలిగిన అనుభవం వల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జీర్ణశక్తి మందగించిన వారికీ, జబ్బుతో పక్కమీద నుండి లేవలేనివారికి, పాలకంటే మించిన తేలిక అయిన పోషక పదార్థం మరొకటి లేదు. అందువల్ల పుస్తకంలో పాలను గురించి నేను వ్రాసిన మార్గాన నడుస్తామని పట్టుపట్టవద్దని పాఠకులకు మనవి చేస్తున్నాను.

ఈ ప్రకరణం చదివిన వైద్యులు, డాక్టర్లు, హకీములు, అనుభవజ్ఞులు తదితరులెవరైనా సరే పాలకు బదులుగా పోషక పదార్థం మరియు తేలికగా జీర్ణం కాగలిగిన వనస్పతి ఏదైనా ఉంటే చదివిన పుస్తకాల ఆధారంతోగాక, ఆచరించి పొందిన అనుభవంతో ఆ వివరం తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను.

9. బలవంతులతో పోరు

ఇక ఆసియా విభాగపు అధికారుల వైపు మళ్ళుదాం. ఆ ఆసియా విభాగపు బహుదొడ్డ కార్యాలయం జోహన్సుబర్గులో వుంది. అక్కడ హిందూ దేశస్థులతో బాటు, చైనీయులు మొదలుగాగల వారి రక్షణకు బదులు భక్షణ జరుగుతున్నది. నా దగ్గరికి రోజూ అందుకు సంబంధించి పితూరీలు వస్తూ ఉండేవి. అధికారుల దయవల్ల నిజమైన హక్కుదారులు దక్షిణ ఆఫ్రికా రాలేకపోతున్నారు. కాని హక్కులేని వాళ్ళు వంద వంద పౌండ్లు లంచం ఇచ్చి వస్తున్నారనీ, ఇందుకు తగిన చికిత్స మీరు చేయకపోతే ఇక చేసేదెవరు? అని నా దగ్గర ఒకటే గొడవ. అది నిజమని నాకు అనిపించింది. ఈ దుర్గంధాన్ని పూర్తిగా తొలగించివేయకపోతే ట్రాన్సువాలులో నా నివాసం వ్యర్థం అన్నమాట.

ప్రమాణాలు సేకరించడం ప్రారంభించాను. నా దగ్గర చాలా గట్టి ప్రమాణాలు చేరిన తరువాత నేను తిన్నగా పోలీసు కమీషనరు దగ్గరికి వెళ్ళాను. అతడు దయాగుణం, న్యాయప్రవృత్తి కలవాడని నాకు అనిపించింది. నా మాటలు అసలు విననని భీష్మించకుండా, ఓపికతో నా మాటలు ఆయన విన్నాడు. ప్రమాణాలు చూపించమని అన్నాడు. సాక్షుల సాక్ష్యాలు ఆయన స్వయంగా సేకరించాడు. అతనికి నమ్మకం కలిగింది. అయితే నాకు తెలిసినట్లుగానే దక్షిణ ఆఫ్రికాలో తెల్ల న్యాయనిర్ణేతల ఎదుట తెల్ల దోషులకు శిక్ష పడేలా చూడటం కష్టమని ఆయనకూ తెలుసు. “అయినా ప్రయత్నిద్దాం. అసలు న్యాయనిర్ణేతలు ఇట్టి దోషుల్ని వదిలివేస్తారని భావించి ఆ భయంతో వాళ్ళను పట్టించుకోకపోవడం కూడా సరికాదు. అందువల్ల నేను వాళ్ళను పట్టిస్తాను. అందుకు అవసరమైన శ్రమపడతానని మీరు నమ్మవచ్చు” అని ఆయన అన్నాడు. నాకు వారి మాట మీద విశ్వాసం కలిగింది. అనేకమంది అధికారుల మీద కూడా ఆరోపణలు వున్నాయి. కాని వాటికి గట్టి ప్రమాణాలు లేవు. ఇద్దరు అధికారులు గట్టి ప్రమాణాలతో దొరికారు. వాళ్ళ పేరిట వారంట్లు వెళ్ళాయి.

నా రాకపోకలు గోప్యంగా వుంచడం సాధ్యం కాని పని. నేను ప్రతిరోజు పోలీసు కమీషనరు దగ్గరకు వచ్చి వెళ్ళడం చాలామంది చూస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరు ఆఫీసర్లకు గూఢచారులు వున్నారు. వాళ్ళు నామీద కన్ను వేసి వుంచారు. నా రాకపోకలను గురించిన వివరాలు కొందరు ఆ ఆఫీసర్ల దగ్గరికి చేరవేయడం ప్రారంభించారు. అయితే ఆ ఆఫీసర్లిద్దరూ కడు క్రూరులు. అందువల్ల వాళ్ళకు గూఢచారులు ఎక్కువమంది లభించలేదు. హిందూ దేశస్తులు, చైనా వాళ్ళు నాకు సహకరించి ఉండకపోతే వాళ్ళు దొరికియుండేవాళ్ళు కాదు.

వారిద్దరిలో ఒకడు పారిపోయాడు. పోలీసు కమీషనరు బైటినుండి వారంటు జారీ చేసి అతణ్ణి నిర్భందించి తిరిగి రప్పించాడు. కేసు నడిచింది. ప్రమాణాలు బలవత్తరంగా వున్నాయి. అధికారి పారిపోయిన విషయం కూడా జ్యూరీకి తెలిసింది. అయినా ఇద్దరూ విడుదల అయ్యారు.

నేను బాగా నిరాశపడ్డాను. పోలీసు కమీషనరుకు కూడా దుఃఖం కలిగింది. వకీలు వృత్తి యెడ నాకు ఏవగింపు కలిగింది. దోషాల్ని కప్పిపుచ్చడానికి బుద్ధి ఉపయోగపడుతుండటం చూచి అట్టి బుద్ధి మీదనే నాకు విరక్తి కలుగసాగింది.

శిక్షపడలేదు గాని ఇద్దరు అధికారులకు చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇక వాళ్ళను ప్రభుత్వం భరించలేకపోయింది. ఇద్దరూ డిస్మిస్ అయ్యారు. ఆసియా విభాగం కొంచెం శుభ్రపడింది. హిందూ దేశస్థులకు ధైర్యం చేకూరింది.

నా ప్రతిష్ఠ కూడా పెరిగింది. నా వృత్తి కూడా వృద్ధికి వచ్చింది. ప్రతినెల లంచాల క్రింద పోతున్న హిందూ దేశస్థుల వందలాది పౌండ్ల సొమ్ము మిగిలింది. అయితే సొమ్మంతా మిగిలిందని చెప్పలేను. కొంతమంది లంచగొండులు లంచాలు తింటూనే ఉన్నారు. అయితే నిజాయితీపరులు మాత్రం తమ నిజాయితీని నిలబెట్టుకోగల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ అధికారులు అధములు. అయినప్పటికీ వారియెడల నా మనస్సులో ద్వేషం అనేది లేదు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు. తరువాత వాళ్ళు దయనీయస్థితిలో పడిపోగా నేను వాళ్ళకు ఎంతగానో సహాయం చేశాను. నేను అడ్డు చెప్పియుంటే జోహన్సుబర్గు మునిసిపాలిటీలో వాళ్ళకు ఉద్యోగం లభించియుండేది కాదు. వాళ్ళ మిత్రుడొకడు నా దగ్గరకు వచ్చి మాట్లాడగా వారికి ఉద్యోగం ఇప్పించేందుకు సహాయం చేస్తానని మాట ఇచ్చాను. వాళ్ళకు ఉద్యోగం దొరికింది కూడా. అప్పటినుండి ఇంగ్లీషు వాళ్ళకు కూడా నా మీద విశ్వాసం ఏర్పడి నేనంటే భయపడటం మానివేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలం వాడవలసి వచ్చేది. అయినా వాళ్ళంతా నాతో మధుర సంబంధం కలిగి ఉండేవారు. అట్టి స్వభావం, అట్టి ఆచరణ నాకు బాగా అలవాటు అయ్యాయి. అయితే అప్పటికి ఈ విషయం నేను గ్రహించలేదు. తరువాత అర్థం చేసుకున్నాను.

10. ఒక పావన స్మృతి - ప్రాయశ్చిత్తం

నా జీవితంలో ఎన్నో ఘట్టాలు జరిగాయి. వాటివల్ల అనేక మతాల వారితోను, జాతుల వారితోను నాకు గాఢ పరిచయం ఏర్పడింది. వీటన్నిటివల్ల కలిగిన అనుభవాల వల్ల స్వ-పరభేదాలు, దేశీయులు, విదేశీయులు, తెల్లవారు-నల్లవారు, హిందువులు - ముస్లిములు, క్రైస్తవులు పారశీకులు, యూదులు మొదలుగా గల వారి మధ్య వుండే భేదాలను అధిగమించగలిగాను. నా హృదయం అట్టి భేదాలను గుర్తించలేదని చెప్పగలను. నా విషయంలో ఇది గొప్ప సుగుణమేమీ కాదని నేను భావిస్తున్నాను. అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలుగాగల గుణాలను అలవరచుకొని, వాటి ఆధారంతో ఇప్పటివరకు నడుస్తున్నట్లే మతాల, జాతుల, రంగుల భేదాన్ని అలవరచుకోవడం కూడా సహజంగానే జరిగిందని నా భావన. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే గుమాస్తాలు నాతోబాటే వుండేవారు. వారిలో హిందువులు, క్రైస్తవులు వున్నారు. ప్రాంతాలవారీగా గుజరాతీలు, మద్రాసీలు వున్నారు. వారి విషయంలో నా మనస్సులో ఎన్నడూ వేరు భావం కలిగినట్లు గుర్తులేదు. వాళ్ళందరినీ నా కుటుంబీకులుగానే భావించేవాణ్ణి. నా భార్య ఎప్పుడైనా ఈ విషయం ఎత్తితే ఆమెతో తగాదాకు దిగేవాణ్ణి. ఒక గుమాస్తా క్రైస్తవుడు. అతని తల్లిదండ్రులు పంచమకులంవారు. నా గృహవ్యవస్థ పాశ్చాత్య విధానంతో కూడినది. అతని గదిలో పాయిఖానా లేదు. నా అభిప్రాయం ప్రకారం వుండకూడదు. అందువల్ల పాయిఖానాకు బదులు ప్రతిగదిలోను మూత్రం పోసుకునేందుకు ప్రత్యేక పాత్రలు వుంచాము. ఆ పాత్రలను తీసి బాగుచేసే కార్యక్రమం నౌకర్లది కాదు. ఇంటి యజమానిది, యజమానురాలిది. తాను కూడా మా కుటుంబంలో ఒకడినని భావించుకున్నవాడు తన పాత్రలు తానే కడిగి బాగుచేసుకునేవాడు. పంచమకులానికి చెందిన ఈ గుమాస్తా క్రొత్తవాడు. అతని పాత్ర మేమే తీసి బాగు చేయాలి. పాత్రలు కస్తూరిబాయి తీస్తూ ఉండేది. కాని అతని విషయం ఆమెకు మిక్కుటమై పోయింది. మా ఇద్దరికి జగడం జరిగింది. తాను ఎత్తదు. నేను ఎత్తుదామంటే అందుకు ఆమె ఇష్టపడదు. ఆమె కండ్ల నుండి కన్నీటి బిందువులు ముత్యాల్లా కారసాగాయి. చేతులో పాత్ర పట్టుకొని నావంక చురచుర చూస్తూ తిరస్కార భావం వ్యక్తం చేస్తూ మెట్లమీద నుండి గబగబ క్రిందకు దిగుతున్న కస్తూరిబాయి బొమ్మని చిత్రకారుడనైతే ఈనాడు కూడా చిత్రించియుండేవాణ్ణి.

కాని నేను ఎంతగా ప్రేమించేవాడినో అంతగా ప్రాణాలు తీసే భర్తను కూడా. ఆమెకు నేను శిక్షకుణ్ణని భావించేవాణ్ణి. అందువల్ల అంధప్రేమకులోనై ఆమెను బాగా సతాయిస్తూ ఉండేవాణ్ణి.

ఈ విధంగా ఆమె కోపంతో పాత్ర తీసుకొని వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఆమె పకపక నవ్వుతూ మూత్రపు పాత్ర తీసుకువెళ్ళాలి. అప్పుడే మనకు తృప్తి అన్నమాట. కంఠం పెద్దది చేసి “ఈ కలహం నా ఇంట్లో నడవదు” అని అరిచాను.

నా మాటలు కస్తూరిబాయి గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి. ఆమె రెచ్చిపోయి “అయితే నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్లిపోతున్నా” అని అన్నది. అప్పుడు దేవుణ్ణి మరచిపోయాను. దయ అనేది నా హృదయంలో కొంచెం కూడా మిగలలేదు. నేను ఆమె చెయ్యి పట్టుకున్నాను. మెట్లు ఎదురుగా బయటికి వెళ్ళడానికి ద్వారం ఉన్నది. నేను ఆ నిస్సహాయురాలగు అబలను పట్టుకొని ద్వారం దాకా లాక్కెళ్ళాను. ద్వారం సగం తెరిచాను. కస్తూరిబాయి కండ్లనుండి గంగా, యమునలు ప్రవహిస్తున్నాయి. ఆమె ఇలా అన్నది “నీకు సిగ్గులేదు కాని నాకున్నది. కొంచెమైనా సిగ్గుపడు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళను? ఇక్కడ మా అమ్మ నాన్నలు లేరు. వుంటేవాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆడదాన్ని, అందువల్ల నీ దౌర్జన్యం సహించక తప్పదు. ఇకనైనా సిగ్గుతెచ్చుకో, ద్వారం మూసివేయి. ఎవరైనా చూస్తే ఇద్దరి ముఖాలకు మచ్చ అంటుకుంటుంది. ఆమె మాటలు విని పైకి ధుమ ధుమలాడుతూ వున్నాను. కాని లోలోన సిగ్గుపడిపోయాను. తలుపులు మూసివేశాను. భార్య నన్ను వదలలేనప్పుడు నేను మాత్రం ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళగలను? మా ఇద్దరికి చాలాసార్లు తగాదా జరిగింది. కాని ఫలితం చివరికి మంచిగానే ఉండేది. భార్య తన అత్యద్భుత సహనశక్తితో విజయం సాధించిందన్నమాట.

ఈ విషయం ఈనాడు తటస్థ భావంతో వర్ణించగలను. కారణం ఇది మా గడిచిన యుగపు జీవితానికి సంబంధించిన గాథ. ఇప్పుడు నేను మోహాంధుడనగు భర్తను కాను. శిక్షకుణ్ణి కాను. ఇప్పుడు కస్తూరిబాయి తలుచుకుంటే నన్ను బెదిరించగలదు. ఇప్పుడు మేము అనుభవం గడించిన మిత్రులం. నిర్వికార భావంతో కలిసి వుంటున్నాం. యీనాడు ఆమె నేను జబ్బుపడితే ప్రయోజనం పొందాలనే కోరిక లేకుండ చాకిరీ చేసే సేవిక అన్నమాట.

పైన తెలిపిన ఘట్టం 1898 నాటిది. అప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి నాకేమీ తెలియదు. ఆరోజులెలాంటివో తెలుసా? భార్య అంటే కేవలం సహధర్మిణి, సహచారిణి. సుఖదుఃఖాలలో సహభాగిని అను విషయం నాకు తెలియని రోజులవి. విషయవాంఛల తృప్తికి భార్య సాధనమని, భర్త ఆజ్ఞను నోరు మెదపకుండ శిరసావహించునట్టి స్త్రీయే భార్య అని నేను భర్తగా భావించిన రోజులవి.

1900 నుండి నా యోచనా సరళిలో అపరిమితమైన మార్పు వచ్చింది. 1906 లో ఫలితం కనబడింది. ఈ వివరం మరో సందర్భంలో మనవి చేస్తాను. ఇక్కడ ఒక్క విషయం మాత్రం పేర్కొంటున్నాను. నేను నిర్వకారుణ్ణి అయిన కొద్దీ నాగార్హ్యస్థ్య జీవితంలో సుఖ శాంతులు నిర్మలత్వం నెలకొన్నాయి.

ఈ పావన స్మృతిని గురించి చదువుతూ ఉన్నప్పుడు మేము ఆదర్శ దంపతులమని, నా ధర్మపత్ని యందు దోషాలేమీ లేవని లేక మా ఆదర్శాలు సమానంగా వున్నాయని భావించకుందురుగాక. కస్తూరిబాయికి ఆదర్శమంటూ ఒకటుందని పాపం ఆమెకే తెలిసియుండదు. నా ఆచరణలన్నీ ఈనాడు కూడా ఆమెకు రుచిస్తాయని అనుకోను. ఈ విషయమై మేము ఎన్నడూ చర్చించలేదు. చర్చించినా ప్రయోజనం వుండదు. ఆమెకు తల్లిదండ్రులు చదువు చెప్పించలేదు. నా దగ్గరకు వచ్చిన తరువాత సరియైన సమయంలో నేను చదువు నేర్పలేదు. ఇతర హిందూ స్త్రీలవలెనే ఆమెలో కూడా ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇష్టం వున్నా లేకపోయినా, జ్ఞానంవల్ల గానీ, అజ్ఞానంవల్లగానీ నా వెంట నడచి నన్ను అనుసరించడమే తన జీవితానికి సార్థకత అని విశ్వసించింది. స్వచ్ఛజీవితం గడపవలెనని భావించి నా మార్గానికి ఎన్నడూ అడ్డు తగలలేదు. మా ఇద్దరి బౌద్ధిక శక్తులు వేరువేరుగా వున్నా మా జీవితం సంతోషంగా సుఖంగా ఊర్ధ్వపధాన ముందుకు సాగిందని చెప్పగలను.

11. ఇంగ్లీషు వారితో గాఢ పరిచయం

ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు “సత్యశోధన” అను నా ఈ గ్రంథ రచనకు గల కారణాలను, సందర్భాలను పాఠకులకు తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. ఈ కథ వ్రాసే సమయంలో నా దగ్గర ప్లాను అంటూ ఏమీ లేదు. ఎదురుగా పుస్తకాలు గాని, డైరీలు గాని, ఇతర పత్రాలు గాని పెట్టుకొని నేను ఈ ప్రకరణాలు వ్రాయలేదు. అంతరంగం చూపిన మార్గంలో వ్రాస్తున్నానని చెప్పగలను. నాలో సాగుతున్న క్రియను, అంతర్యామి యొక్క క్రియ అని అనవచ్చునో లేదో నిశ్చయంగా చెప్పలేను. కాని ఒక విషయం మాత్రం నిజం. ఎన్నో సంవత్సరాలనుండి నేను చేస్తున్న అతి పెద్ద పనిని అతి చిన్న పనిని పరిగణింపతగిన కార్యాలనన్నింటిని జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట అవన్నీ అంతర్యామి ప్రేరణవల్లనే జరిగాయని చెప్పగలను.

అంతర్యామిని నేను చూడలేదు. తెలుసుకోలేదు. ప్రపంచమంతటికీ భగవంతుని యెడ గల శ్రద్ధనే నేను కూడా శ్రద్ధగా మలుచుకున్నాను. ఆ శ్రద్ధ తొలగించుటకు వీలులేనిది. అందువల్ల శ్రద్ధగా దాన్ని గుర్తించడం మానుకొని దానిని అనుభవ రూపంలో గుర్తిస్తున్నాను. అయినా ఈ విధంగా అనుభవరూపంలో దాన్ని పరిచయం చేయడం కూడా సత్యం మీద పడుతున్న దెబ్బ అనే గ్రహించాలి. అసలు శుద్ధ రూపంలో దాన్ని పరిచయం చేయగల శబ్దాలు నా దగ్గర లేవని చెప్పడమే మంచిదని భావిస్తున్నాను.

కంటికి కనబడని అంతర్యామికి వశవర్తినై నేను ఈ కథ వ్రాస్తున్నానని నా విశ్వాసం. వెనుకటి ప్రకరణం ప్రారంభించినప్పుడు ‘ఇంగ్లీషు వారితో పరిచయం’ అని శీర్షిక పెట్టాను. కాని ప్రకరణం వ్రాస్తున్నప్పుడు ఈ పరిచయాల్ని వివరించే ముందు “పావనస్మృతి” ని గురించి వ్రాయాలని అనుకొని ఆ ప్రకరణం వ్రాశాను. దాన్ని వ్రాసిన తరువాత మొదటి శీర్షికను మార్చవలసి వచ్చింది.

ఇప్పుడు ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు మరో ధర్మసంకటం వచ్చిపడింది. ఇంగ్లీషు వారిని పరిచయం చేస్తున్నప్పుడు ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు. అను మహత్తరమైన ప్రశ్న ఉదయించింది. విషయం చెప్పకపోయినా సత్యానికి దెబ్బతగులుతుంది. అసలు ఈ కథ వ్రాయవలసిన అవసరమే లేదేమో. ఇట్టి స్థితిలో అప్రస్తుతమైన వివాదాన్ని పరిష్కరించేందుకు పూనుకోవడం కష్టం గదా!

చరిత్ర రూపంలో ఆత్మకథ అపూర్ణం. అందుకు సంబంధించిన ఇబ్బందుల్ని ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ‘సత్యశోధన’ యను ఈ ఆత్మకథలో నాకు జ్ఞాపకం వున్న విషయాలన్నింటిని వ్రాయడం లేదని నాకు తెలుసు. సత్యాన్ని దర్శింప చేయుటకు నేను ఎంత వ్రాయాలో ఎవరికి తెలుసు? ఒకే మార్గాన నడిచే అసంపూర్ణ ఆధారాలకు న్యాయ మందిరంలో ఎంత విలువ కట్టబడుతుందో మరి? వ్రాసిన ప్రకరణలను గురించి తీరికగా వున్న వ్యక్తి ఎవరైనా నాతో తర్కానికి దిగితే నా ఈ ప్రకరణాలపై ఎంత వెలుగు ప్రసరింపచేస్తాడోగదా! అతడు విమర్శకుని దృష్టితో దీన్ని అన్వేషించి ఎటువంటి డొల్లు విషయాలు బయటపెట్టి ప్రపంచాన్ని నవ్విస్తాడో కదా? తాను కూడా ఉబ్బి తబ్బిబ్బు అవుతాడో కదా!

ఈ విధంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఈ ప్రకరణాలు వ్రాయడం ఆపివేయడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. కాని ప్రారంభించిన కార్యం అవినీతిమయమని స్పష్టంగా గోచరించనంతవరకు దాన్ని ఆపివేయకూడదు కదా! అందువల్ల అంతర్యామి నన్ను ఆపివేయమని ఆదేశించనంతవరకు ప్రకరణలు వ్రాస్తూ ఉండాలనే నిర్ణయానికి వచ్చాను.

ఈ కథ టీకాకారుల్ని తృప్తి పరచడం కోసం వ్రాయడం లేదు. ఇది సత్యశోధనకు సంబంధించిన ఒక ప్రయోగం. దీనివల్ల అనుచరులకు కొంత ఊరట కలుగుతుందను భావం కూడా ఈ రచన మూలంలో పనిచేస్తున్నది. దీని ఆరంభం కూడా వారి తృప్తి కోసమే జరిగింది. స్వామీ ఆనంద్, జయరామదాసులు నా వెంటపడి యుండకపోతే బహుశ ఈ కథ ఆరంభమై ఉండేది కాదు. అందువల్ల ఈ కథారచనలో ఏమైనా దోషాలు దొర్లితే అందుకు వారు కూడా భాగస్వాములే.

ఇక నేను శీర్షికకు వస్తాను. నేను హిందూ దేశస్తుల్ని గుమాస్తాలుగా ఇంట్లో పెట్టుకున్నట్లుగానే, ఇంగ్లీషు వాళ్ళను కూడా పెట్టుకోసాగాను. నా ఈ చర్య నా వెంట వుండే వారందరికీ పొసగేది కాదు. అయినా పట్టుబట్టి వారిని నా యింట్లో ఉంచాను. అందరినీ వుంచి నేను తెలివిగలపని చేశానని గట్టిగా చెప్పలేను. కొందరి విషయంలో చేదు అనుభవాలు కూడా కలిగాయి. అయితే ఇట్టి అనుభవాలు దేశవాసులవల్ల మరియు విదేశీయులవల్ల కలిగాయి. చేదు అనుభవాలు కలిగినందుకు నాకు పశ్చాత్తాపం కలుగలేదు. చేదు అనుభవాలు కలుగుతూ వున్నా మిత్రులకు అసౌకర్యం కలుగుతుందని తెలిసి కూడా కష్టాలు పడవలసి వస్తుందని భావించే నా అలవాటును మార్చుకోలేదు. ఉదారస్వభావంతో మిత్రులు సహించారు కూడా. క్రొత్త క్రొత్త మనుష్యుల వెంట వుండటం వల్ల, అట్టి సంబంధాల వల్ల అనుచరులకు విచారం కలిగింది. అప్పుడు వారి వారి దోషాలు వివరించి చెప్పడానికి నేను సంకోచించలేదు. ఆస్తికులగు మనుష్యులు తమలో గల భగవంతుణ్ణి సర్వులలో చూడగలిగి, అందరితోను నిర్లిప్తంగా వుండగల శక్తిని అలవర్చుకొని వుండాలని నా అభిప్రాయం. ఎక్కడ వెతకకుండా అవకాశాలు లభిస్తాయో, అక్కడ వాటికి దూరంగా పారిపోకుండా క్రొత్త క్రొత్త సంబంధాలు ఏర్పరుచుకున్నప్పుడు, అలా చేస్తూ రాగద్వేషాలకు దూరంగా వుండగలిగినప్పుడు శక్తిని వికసింపచేసుకోగలుగుతాము.

బోయర్లకు బ్రిటీష్‌వారికి యుద్ధం ప్రారంభమైనప్పుడు నా ఇల్లు పూర్తిగా నిండిపోయి వున్నప్పటికీ జోహన్సుబర్గు నుండి వచ్చిన ఇద్దరు ఇంగ్లీషు వారికి నా ఇంట్లో బస ఏర్పాటు చేశాను. ఇద్దరూ థియాసాఫిస్టులు. ఒకని పేరు కిచన్. ఆయనను గురించి ముందు కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ మిత్రుల సహవాసం కూడా నా ధర్మపత్నిని బాగా ఏడిపించింది. నా మూలాన ఆమె ఏడ్వవలసిన సందర్భాలు అనేకసార్లు ఏర్పడ్డాయి. ఏవిధమైన పర్దాగాని, అరమరికలు గాని లేకుండా ఇంగ్లీషువారికి బస ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది క్రొత్త అనుభవం. ఇంగ్లాండులో నేను వాళ్ళ ఇళ్ళలో వున్నమాట నిజం. అయితే వారి విధానానికి, ప్రవర్తనకు లోబడి నేను వున్నాను. ఆ నా నివాసం హోటలు నివాసం వంటిది. కాని ఈ వ్యవహారం అలాంటిది కాదు. పూర్తిగా అందుకు విరుద్ధం. ఈ మిత్రులు నా కుటుంబసభ్యులుగా వున్నారు. వాళ్ళు భారతీయ అలవాట్లను, నడవడిని అనుసరించారు. ఇంట్లోను, బయటకూడా వ్యవహారమంతా ఆంగ్లేయుల పద్ధతిలోనే ఉన్నాయి. ఈ మిత్రుల్ని మాతోబాటు మా ఇంట్లో వుంచినప్పుడు ఎన్నో ఇబ్బందులు కలిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. కాని వారిద్దరు మా కుటుంబ సభ్యులందరితో పూర్తిగా కలిసిపోయారని చెప్పగలను. జోహన్సుబర్గులో ఈ సంబంధాలు డర్బనును మించిపోయాయి.

12. ఇంగ్లీషువారితో పరిచయం

ఒక పర్యాయం జోహన్సుబర్గులో నా దగ్గర నలుగురు హిందూ దేశపు గుమాస్తాలు ఉండేవారు. వారిని గుమాస్తాలు అనాలో లేక బిడ్డలు అని అనాలో చెప్పలేను. వారితో నా పనిసాగలేదు. టైపు లేనిదే నా పని సాగదు. టైపింగు జ్ఞానం కొద్దో గొప్పో నా ఒక్కడికే ఉంది. ఈ నలుగురు యువకుల్లో యిద్దరికి టైపింగు చేయడం నేర్పాను. కాని వాళ్ళకు ఇంగ్లీషు బాగా రాకపోవడం వల్ల వారిటైపు బాగుండలేదు. వారిలో లెక్కలు వ్రాయగలవారిని కూడా తయారు చేసుకోవాలి. నేటాలు నుండి నా ఇష్టమైన వాళ్ళను పిలిపించుకునేందుకు వీలులేదు. పర్మిట్ లేకుండా ఏ హిందూ దేశస్థుడూ ప్రవేశించడానికి వీలులేదు. నా సౌకర్యం కోసం అధికారుల మెహర్బానీ కోసం బిచ్చం అడిగేందుకు నేను సిద్ధపడలేదు. నేను ఇబ్బందుల్లో పడ్డాను. ఎంత శ్రమపడ్డా, వకీలువృత్తి, సార్వజనిక సేవాకార్యం రెండూ సాగించడం కష్టమైపోయింది. గుమస్తా పనికి ఇంగ్లీషు వాళ్ళు దొరికితే వారిని నియమించకుండా ఎలా వుండగలను? నల్లవారి దగ్గర తెల్లవాళ్ళు ఉద్యోగం చేస్తారా అని నాకు అనుమానంగా వుండేది. ప్రయత్నం చేసి చూద్దామని నిర్ణయించుకున్నాను. టైపు రైటింగు ఏజెంట్లతో నాకు పరిచయం ఉంది. ఒక ఏజెంటు దగ్గరకు వెళ్లాను. టైపు చేయగల తెల్లవారు స్త్రీ అయినా పురుషుడైనా నల్లవారి దగ్గర నౌకరీ చేయడానికి అంగీకరిస్తే పంపండి అని ఆయనకు చెప్పాను. దక్షిణ ఆఫ్రికాలో షార్టుహాండు, టైపురైటింగు పని సామాన్యంగా స్త్రీలే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని వెతికి పంపిస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆయనకు మిస్‌డిక్ అను పేరుగల ఒక స్కాచ్‌కుమారి తటస్థపడింది. ఆ మహిళ ఈ మధ్యనే స్కాట్లండు నుండి వచ్చింది. ప్రామాణికమైన నౌకరీ ఎవరి దగ్గరనైనా సరే చేయడానికి ఆమెకు అభ్యంతరం లేదు. ఆమె వెంటనే పనిలో చేరాలని అనుకున్నది. ఆ ఏజంటు ఆమెను నా దగ్గరకు పంపించాడు. చూడగానే ఆమె మీద నా దృష్టి నిలబడిపోయింది.

‘హిందూ దేశవాసి దగ్గర పనిచేయడానికి మీకు అభ్యంతరం ఏమీ లేదు కదా!’ అని అడిగాను. “ఏమాత్రం లేదు” దృఢమైన స్వరంతో ఆమె అన్నది.

“జీతం ఎంత కావాలి?”

“పదిహేడున్నర పౌండ్లు. మీరు ఎక్కువ అనుకుంటున్నారా?” అని ఆమె అడిగింది

“నేను ఆశించినంత పని మీరు చేసిన యెడల ఆ సొమ్ము నాకు అధికం కాదు. మీరు ఎప్పటి నుండి పనిలో చేరతారు?”

“మీరు సరేనంటే ఈ క్షణం నుంచే పని ప్రారంభిస్తాను.”

నేను ఎంతో సంతోషించాను. ఆ సోదరిని వెంటనే ఎదుట కూర్చోబెట్టుకుని జాబులు వ్రాయించడం ప్రారంభించాను.

ఆమె ఒక గుమాస్తాగా గాక, ఒక బిడ్డగా, ఒక సోదరిగా బాధ్యత వహించి పనిచేయడం ప్రారంభించింది. ఆమెకు ఎన్నడూ బిగ్గరగా చెప్పవలసిన అవసరం కలుగలేదు. ఆమె చేసిన పనిలో తప్పులెన్నవలసిన అవసరం ఎన్నడూ కలుగలేడు. వేలాది పౌండ్ల సొమ్ము ఆమె చేతిలో వున్న రోజులు కూడా వున్నాయి. ఆమె డబ్బు లెక్క కూడా సంబాళించసాగింది. సంపూర్తిగా ఆమె నా విశ్వాసాన్ని చూరగొన్నది. ఆమె వ్యక్తిగత రహస్యాలు కూడా నాకు చెప్పే స్థితికి రావడం ఎంతో గౌరవంగా భావించాను. తనకు తోడుగా వుండే వ్యక్తిని గురించిన సలహా అడగడమే గాక నా సాయం కూడా కోరింది. కన్యాదానం చేసే గౌరవం కూడా నాకే లభించింది. మిస్‌డిక్ మిస్ మెకడనల్డ్ అయింది. అప్పుడు ఆమెకు మేము దూరం కావలసి వచ్చింది. వివాహం అయిన తరువాత కూడా పని ఎక్కువైనప్పుడు కబురు చేస్తే ఆమె వచ్చి సహకరిస్తూ ఉండేది.

ఆఫీసులో షార్టుహాండు తెలిసినవారు కావలసి వచ్చింది. ఒక మహిళ దొరికింది. ఆమె పేరు శ్లేశిన్. ఆమెను నాదగ్గరకు మి.కేలన్‌బక్ తీసుకువచ్చారు. శ్రీ కేలన్‌బక్ గారిని గురించి పాఠకులు ఇక ముందు తెలుసుకుంటారు. ఆ మహిళ ఒక హైస్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు 17 సంవత్సరాల వయస్సు. ఆమె ప్రత్యేకతలు కొన్ని చూచి నేను, మి.కేలన్‌బక్ ఆశ్చర్యపడేవాళ్ళం. ఆమె నౌకరీ చేయాలనే ఉద్దేశ్యంతో మా దగ్గరకు రాలేదు. ఆమె అనుభవం కోసం వచ్చిందన్నమాట. ఆమెకు వర్ణద్వేషం లేదు. ఆమె ఎవ్వరినీ లక్ష్యపెట్టేది కాదు. ఎవరినైనా సరే అవమానించడానికి సంకోచించేదికాదు. ఒకరిని గురించి ఆమెకు కలిగిన భావాన్ని స్పష్టంగా ప్రకటించేది. తన భావాన్ని వెల్లడించడానికి వెనుకాడేదికాదు. ఇట్టి స్వభావం వల్ల అప్పుడప్పుడు అందరికీ బరువు దిగినట్లుండేది. ఆమెకు ఇంగ్లీషు భాషమీదగల అధికారం నాకంటే అధికం. ఈ కారణాలన్నిటివల్ల ఆమె తయారు చేసిన జాబులను తిరిగి చదవకుండా సంతకం పెడుతూ వుండేవాణ్ణి.

ఆమెకు గల త్యాగ ప్రవృత్తి ఎంతో గొప్పది. ఆమె చాలా కాలం వరకు నా దగ్గర కేవలం ఆరు పౌండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండేది. అంతకంటే జీతం తీసుకునేందుకు చివరి వరకు ఆమె అంగీకరించలేదు. జీతం ఎక్కువ తీసుకోమని నేను అంటే ఆమె నన్ను బెదిరిస్తూ “జీతం తీసుకునేందుకు నేను ఇక్కడ వుండటం లేదు. మీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం. మీ ఆదర్శాలంటే నాకు ఇష్టం. అందుకే మీ దగ్గర పనిచేస్తున్నాను” అని స్పష్టంగా అంటూ ఉండేది.

ఒకసారి అవసరంపడి నా దగ్గర ఆమె 40 పౌండ్లు తీసుకున్నది. అది కూడా అప్పుగానే. గత సంవత్సరం ఆమె ఆ డబ్బంతా తిరిగి ఇచ్చివేసింది. ఆమె త్యాగభావం ఎంత తీవ్రంగా వుండేదో ధైర్యం కూడా అంత ఎక్కువగా ఉండేది. స్పటికమణి వంటి పవిత్రత, క్షత్రియుల్ని కూడా నివ్వెరపడేలా చేయగల ప్రతాపం కలిగిన కొందరు మహిళామణులు నాకు తెలుసు. అట్టివారిలో ఈమె ఒకరని నా అభిప్రాయం. ఆమె వయస్సులో ఉన్న ప్రౌఢ అవివాహిత. ఇప్పుడు ఆమె మానసికస్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు. అయినా నాకు కలిగిన అనుభవం వల్ల ఆమెను ఈనాటికి పవిత్రంగా స్మరిస్తాను. తెలిసిన సత్యాన్ని వ్రాయకపోతే సత్యానికి ద్రోహం చేసినవాణ్ణి అవుతానుకదా! పని వున్నప్పుడు రాత్రనక పగలనక అమితంగా శ్రమపడేది. అర్థరాత్రి సమయంలో కూడా పనిబడితే ఒంటరిగా వెళుతూ వుండేది. ఎవరినైనా వెంట పంపాలని ప్రయత్నిస్తే నన్ను కోపంగా చూచేది. వేలాదిమంది హిందూదేశస్తులు ఆమెను గౌరవభావంతో చూచేవారు. అంతా ఆమె మాట వినేవారు. మేమంతా జైల్లో వున్నప్పుడు, బాధ్యత గలవారెవ్వరూ బయటలేనప్పుడు ఆమె ఒక్కతే సత్యాగ్రహ సంగ్రామం నడిపించింది. లక్షలాది రూపాయల లెక్కలు ఆమెవ్రాసింది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆమె జరిపింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికను కూడా ఆమె నడిపింది. అలసట అంటే ఏమిటో ఆమె ఎరుగదు.

మిస్ శ్లేశిన్ గురించి ఎంత వ్రాసినా తనివి తీరదు. గోఖ్లేగారి సర్టిఫికెట్టు గురించి చెప్పి ఈ ప్రకరణం ముగిస్తాను. గోఖ్లేగారు నా అనుచరులందరిని పరిచయం చేసుకున్నారు. పరిచయం అయిన తరువాత చాలామంది విషయంలో వారు సంతోషించారు. ప్రతి ఒక్కరి చరిత్రను వారి విలువలను అంచనా వేశారు. హిందూ దేశానికి చెందిన నా అనుచరులు, యూరోపుకు చెందిన నా అనుచరులు అందరిలో వారు మిస్ శ్లేశిన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. “ఇంతటి త్యాగం, ఇంతటి పవిత్రత, ఇంత నిర్భీకత, ఇంతటి కార్యకుశలత బహు కొద్దిమంది లోనే నేను చూచాను. మిస్ శ్లేశిన్ మీ అనుచరులందరిలోను ప్రథమ స్థానం పొందుటకు అర్హురాలు” అని వారు ప్రకటించారు.

13. ఇండియన్ ఒపీనియన్

ఇంకా కొంతమంది యూరోపియన్లను గురించి వ్రాయవలసిన అవసరం ఉన్నది. అంతకు ముందు మరో రెండు మూడు మహత్తరమైన విషయాలను గురించి వ్రాయడం అవసరం. ఇప్పుడే ఒకరిని గురించి వ్రాస్తాను. మిస్ డిక్‌ను నియమించి నా పని పూర్తి చేయగలిగానని అనుకోవడం సరికాదు. మి.రీచ్‌ని గురించి నేను మొదటనే వ్రాశాను. ఆయనతో నాకు బాగా పరిచయం వున్నది. ఆయన ఒక వ్యాపార సంస్థ సంచాలకులు. అక్కడి నుండి తప్పుకొని నా దగ్గర ఆర్టికల్ క్లర్కుగా పని చేయమని వారిని కోరాను. నా సలహా వారికి నచ్చింది. వారు నా ఆఫీసులో చేరారు. నా పనిభారం కొంత తగ్గించారు.

ఇదే సమయంలో శ్రీ మదనజీత్ “ఇండియన్ ఒపీనియన్” అను పత్రికను వెలువరించాలని నిర్ణయించుకున్నాడు. నన్ను సలహా సహకారాలు యిమ్మని కోరాడు. ప్రెస్సు ఆయన నడుపుతూ వున్నాడు. పత్రిక వెలువరించాలనే కోరికను సమర్థించాను. 1904లో ఈ పత్రిక ప్రారంభించబడింది. మనసుఖలాల్ నాజరు ఆ పత్రికకు ఎడిటరుగా ఉన్నారు. కాని సంపాదకత్వపు నిజమైన భారమంతా నా మీద పడింది. మొదటనుండి నాకు దూరాన ఉండి పత్రికలు నడిపించే యోగం కలుగుతూ వచ్చింది.

మన సుఖలాల్ నాజరు సంపాదకులుగా లేరని కాదు. వారు దేశమందలి చాలా పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ వుండేవారు. దక్షిణ ఆఫ్రికాలోగల చిక్కులతో కూడిన పలు సమస్యలను గురించి నేనుండగా స్వతంత్రంగా వ్యాసాలు వ్రాయడానికి ఆయన సాహసించలేదు. నా యోచనా శక్తిమీద ఆయనకు అమిత విశ్వాసం. అందువల్ల ఏమైనా ప్రధాన విషయాలపై వ్రాయవలసి వస్తే ఆ భారం నా మీద మోపుతూ వుండేవాడు.

ఇండియన్ ఒపీనియన్ వారపత్రిక ప్రారంభంలో గుజరాతీ, హిందీ, తమిళం, ఇంగ్లీషుల్లో వెలువడుతూ ఉండేది. తమిళం, హిందీ శాఖలు పేరుకు మాత్రమే ఉండటం చూచాను. వాటివల్ల సమాజానికి సేవ జరిగే స్థితి కలుగకపోవడం వల్ల అందు నాకు అసత్యం గోచరించింది. వెంటనే వాటిని మూసివేయించాను. ఆ తరువాతనే నాకు శాంతి లభించింది.

ఈ పత్రిక కోసం డబ్బు నేను ఖర్చు పెట్టవలసి వస్తుందని ఊహించలేదు. కొద్ది రోజులకే డబ్బు ఖర్చు పెట్టక పోతే పత్రిక నడవదని తెలిసిపోయింది. నేను పత్రికకు సంపాదకుణ్ణి కాదు. అయినా వ్యాసాల విషయమై బాధ్యత వహించాను. ఈ విషయం హిందూ దేశస్థులు, యూరోపియన్లు కూడా గ్రహించారు. అసలు పత్రిక ప్రకటించబడిన తరువాత మూత బడితే నా దృష్టిలో జాతికే అవమానం, నష్టం కూడా,

నేను పత్రిక కోసం డబ్బు ఖర్చు పెట్టడం ప్రారంభించాను. నా దగ్గర మిగిలిందంతా దానికి ఖర్చు పెడుతూనే వున్నాను. ప్రతి మాసం 75 పౌండ్లు ఇవ్వవలసి వస్తుండేది.

ఇన్ని సంవత్సరాల తరువాత పరిశీలించి చూస్తే ఈ పత్రిక జాతికి చాలా సేవ చేసిందని చెప్పగలను. ఆ పత్రిక ద్వారా ధనం గడించాలని ఎవ్వరం అసలు అనుకోలేదు.

పత్రిక నా చేతిలో వున్నంత కాలం దానిలో జరిగిన మార్పులు నా జీవితంలో కలిగిన మార్పులకు ప్రతీకలే. నేడు యంగ్ ఇండియా, నవజీవన్ నా జీవితమందలి కొంత భాగానికి ప్రతీకలు అయినట్లే ఇండియన్ ఒపీనియన్ కూడా అయింది. దానియందు నేను ప్రతివారం నా ఆత్మను క్రుమ్మరించేవాణ్ణి. నేను దేన్ని సత్యాగ్రహం అని అనుకునే వాడినో దాన్ని గురించి తెలియజెప్పడానికి ప్రయత్నించేవాణ్ణి. నేను జైల్లో వున్నప్పుడు తప్ప మిగతా కాలం 10 సంవత్సరాల పాటు అనగా 1914 వరకు నడిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రిక యొక్క ప్రతి సంచికలోను నా వ్యాసాలు ప్రచురితం అవుతూనే వున్నాయి. ఆలోచించకుండా తూకం వేసుకోకుండా వ్రాసిన ఒక్క శబ్దం కూడా ఆ పత్రికలో వెలువడలేదని చెప్పగలను. ఒకరిని సంతోష పెట్టడానికో లేక తెలిసి వుండి అతిశయోక్తులో వ్రాసినట్లు నాకు గుర్తులేదు. ఆ పత్రిక నా సంయమనానికి ఒక దృష్టాంతంగా రూపొందింది. నా భావాలకు వాహకం అయింది. నా వ్యాసాల్లో విమర్శకు ఏమీ లభించేది కాదు. ఇందు ప్రకటించబడిన వ్యాసాలు విమర్శకుల చేతుల్లో గల కలాలను చాలా వరకు అదుపులో ఉంచేవి. ఈ పత్రిక లేనిదే నత్యాగ్రహ సమరం సాగని స్థితి ఏర్పడింది. పాఠకులు ఈ పత్రికను తమదిగా భావించేవారు. సత్యాగ్రహ సంగ్రామానికి, దక్షిణ ఆఫ్రికాలో గల హిందూ దేశస్తుల పరిస్థితులకు నిజమైన చిత్తరువుగా దాన్ని భావించేవారు.

ఈ పత్రిక వల్ల రంగురంగుల మానవ స్వభావాన్ని గుర్తించేందుకు నాకు మంచి అవకాశం లభించింది. సంపాదకుడు చందాదారులు వీరిద్దరి మధ్య స్వచ్ఛమైన సంబంధం ఏర్పరచడమే మా ఉద్దేశ్యం గనుక నా దగ్గరకు హృదయం విప్పి చెప్పే పాఠకుల జాబులు కుప్పలు కుప్పలుగా వచ్చిపడేవి. తీపివి, చేదువి, కారంగా ఉండేవి, కటువుగా ఉండేవి రకరకాల జాబులు వాటిలో ఉండేవి. వాటినన్నింటినీ చదివి, వాటిలోగల భావాలను తెలుసుకొని వాటికి సమాధానాలు రాస్తూ వుండేవాణ్ణి. అది నాకు గొప్ప పాఠం అయింది. వాటిద్వారా జాతియొక్క భావాల్ని వింటున్నానా అని అనిపించేది. సంపాదకుని బాధ్యత ఏమిటో నేను బాగా తెలుసుకోసాగాను. ప్రజలమీద నాకు మంచి పట్టు లభించింది. దానివల్ల భవిష్యత్తులో ప్రారంభం కాబోతున్న పోరాటానికి శోభ చేకూరింది. శక్తి లభించింది.

ఇండియన్ ఒపీనియన్ పత్రిక వెలువడసాగిన మొదటి మాసంలోనే సమాచార పత్రిక సేవాభావంతోనే నడపబడాలని బోధపడింది. సమాచార పత్రికకు గొప్పశక్తి కలదని, స్వేచ్ఛగా, నిరంకుశంగా ప్రవహించే నీటి ప్రవాహం పొలాల్ని ముంచివేసినట్లు, పంటల్ని నాశనం చేసినట్లు కలాన్నుండి బయల్వెడలే నిరంకుశ ప్రవాహం నాశనానికి హేతువవుతుందని గ్రహించాను. ఆ అంకుశం బయటనుండి వస్తే నిరంకుశత్వం కంటే ఎక్కువ విషాక్తం అవుతుందని, లోపలి అంకుశమే లాభదాయకం అవుతుందని గ్రహించాను. నా యీ యోచనా సరళి సరియైనదైతే ప్రపంచంలో నడుస్తున్న ఈనాటి పత్రికల్లో ఎన్ని నిలుస్తాయి? అయితే పనికిమాలిన వాటిని ఆపగల వారెవ్వరు? ఏవి పనికిమాలినవో ఎలా తేల్చడం? పనికివచ్చేవి, పనికిరానివీ రెండు ప్రక్క ప్రక్కన నడుస్తూనే ఉంటాయి. అయితే మనిషి వాటిలో తనకు ఏది గ్రాహ్యమో ఏది అగ్రాహ్యమో నిర్ణయించుకోవాలి.

14. కూలి లొకేషనా లేక పాకీవాళ్ళ పల్లెయా?

హిందూ దేశంలో మనకి అపరిమితంగా సేవ చేసే పాకీ మొదలుగాగల వారిని అసభ్యులుగా భావించి వాళ్ళను ఊరి బయట విడిగా వుంచుతాము. గుజరాతీ భాషలో వారి పల్లెను ఢేడ్‌వాడ అని అంటారు. ఈ పేరును ఉచ్చరించడానికి కూడా జనం అసహ్యించుకొంటారు. యిదేవిధంగా యూరపులో క్రైస్తవ సమాజంలో ఒకానొక కాలంలో యూదులు అస్పృశ్యులుగా భావించబడేవారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన ఢేడ్‌వాడాను ఘేటో అని అనేవారు. దుర్గుణాలకు చిహ్నంగా దాన్ని పరిగణించేవారు. దక్షిణ ఆఫ్రికాలో అదే విధంగా హిందూ దేశస్థులమంతా పాకీవారుగా పరిగణింపబడేవారం. ఎండ్రూస్ చేసిన ఆత్మ త్యాగం వల్ల, శాస్త్రిగారి మంత్రదండం వల్ల మాకు శుద్ధి జరుగుతుందో లేదో మేము పాకీవారుగా పరిగణించబడక సభ్యులుగా పరిగణింపబడతామో లేదో ముందు ముందు చూడాలి.

హిందువుల మాదిరిగా యూదులు కూడా తాము దేవునికి ప్రీతిపాత్రుల మని, యితరులంతా ప్రీతిపాత్రులు కారని భావించి ఎన్నో అపరాధాలు చేశారు. అందుకు విచిత్రమైన పద్ధతిలో క్రూరంగా వారికి శిక్ష పడింది. దరిదాపు అదే విధంగా హిందువులు కూడా తాము సభ్యులమని, సుసంస్కృతులమని లేక ఆర్యులమని భావించి తమకు సంబంధించిన అవయవాల వంటివారిని అసభ్యులని అనార్యులని పాకీవాళ్ళని భావించారు. తాము చేసిన ఆ అపరాధానికి తగిన శిక్ష విచిత్రమైన పద్ధతిన క్రూరంగా దక్షిణ ఆఫ్రికా వంటి అధినివేశ దేశాలలో అనుభవిస్తున్నారు. ఈ శిక్షను హిందువుల ఇరుగుపొరుగున ఉండే మహ్మదీయులు, పారశీకులు కూడా అనుభవిస్తున్నారని నా అభిప్రాయం.

జోహన్సుబర్గులో కూలీల లొకేషనుకు యీ ప్రకరణంలో ప్రాధాన్యం ఎందుకిస్తున్నానో పాఠకులకు బోధపడి వుంటుంది. దక్షిణ ఆఫ్రికాలో మా అందరికి “కూలీ” అని పేరు. కూలీ అనే పదం మన దేశంలో కూలీ నాలీ చేసుకొనేవారికే వర్తిస్తుంది. కాని దక్షిణ ఆఫ్రికాలో యీ పదం పాకీలు, మాదిగలు మొదలుగాగల వారి కందరికి తిరస్కార సూచకంగా వాడతారు. దక్షిణ ఆఫ్రికాలో యిట్టి కూలీలందరి కోసం కేటాయించబడ్డ చోటును కూలీ లొకేషన్ అని అంటారు. అలాంటి లొకేషన్ ఒకటి జోహాన్సుబర్గులో వున్నది. ఆ లొకేషన్‌లో గాని, యితర చోట్ల అదే విధంగా వున్న కూలీ లొకేషన్లలో గాని నివసిస్తున్న హిందూదేశస్థులకు అక్కడ యాజమాన్యం హక్కు లేదు. జోహాన్సుబర్గులో గల ఈ లొకేషన్‌కు మాత్రం 99 సంవత్సరాల పట్టా యివ్వబడింది. యిందు హిందూ దేశస్థులు కిటకటలాడుతూ వుండేవారు. జనసంఖ్య పెరిగిపోసాగిందేకాని లొకేషన్ విస్తీర్ణం మాత్రం పెరగలేదు. పాయిఖానా దొడ్లు శుభ్రం చేయించడందప్ప అంతకుమించి మునిసిపాలిటీ వాళ్ళ లొకేషనును గురించి పట్టించుకోలేదు. అక్కడ రోడ్లమీద దీపాలు ఎందుకు వుంటాయి? అసలు పాయిఖానా పరిశుభ్రతను గురించి కూడా ఏ మాత్రం పట్టించుకోని ఆ లోకేషన్‌లో యితర పారిశుధ్యాల్ని గురించి అడిగేనాధుడెవరు? అక్కడ నివసిస్తున్న హిందూ దేశస్తులు పట్టణ పారిశుధ్యం ఆరోగ్యం మొదలుగాగల వాటిని గురించి వాటి నియమాలను గురించి తెలిసిన ఆదర్శ భారతీయులు కారు. మునిసిపాలిటీ వారికి సాయం చేయాలని గాని, తమ నడవడిక, ప్రవర్తనను గురించి పట్టించుకోవడం అవసరం అని గాని భావించేవారు కాదు.

సూక్ష్మంలో మోక్షం చూపించగల, మట్టి నుంచి తిండి గింజల్ని పండించగల హిందూ దేశస్థులు అక్కడికి వెళ్ళి స్థిరపడివుంటే అక్కడి చరిత్ర మరో విధంగా మారి వుండేది. అసలు ప్రపంచంలో ఎక్కడా యీ విధంగా వేలాది, లక్షలాది మంది జనం యితర దేశాలకు వెళ్ళి స్థిరపడలేదు. సామాన్యంగా జనం డబ్బు కోసం, వృత్తి కోసం విదేశాలలో కష్టాలు పడుతూ వుంటారు. హిందూదేశంలో అధిక శాతం మంది నిరక్షర కుక్షులు, దీనులు, దుఃఖితులు, శ్రామికులు. వాళ్ళే ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అడుగడుగునా వారికి రక్షణ అవసరం. వారి తరువాత అక్కడకు వెళ్ళిన వ్యాపారస్తులు, తదితర స్వతంత్ర భారతీయులు సంఖ్యలో బహుకొద్దిమందే వున్నారు.

ఈ విధంగా పారిశుధ్య కార్యక్రమాల్ని నిర్వహించవలసిన శాఖవారి క్షమించరాని నిర్లక్ష్యంవల్ల ప్రవాస భారతీయుల అజ్ఞానం వల్ల ఆరోగ్యదృష్ట్యా లొకేషస్ స్థితి నాసి అయిపోయింది. దాన్ని బాగుచేయడానికి మునిసిపాలిటీవాళ్ళు సరికాదా పై పెచ్చు యీ వంకమీద ఆ లొకేషనునంతా దగ్ధం చేసివేయాలని నిర్ణయించారు. అక్కడి భూమిని ఆధీనం చేసుకునే హక్కును కౌన్సిలు నుండి సంపాదించుకున్నారు. ఇదీ నేను జోహన్సుబర్గు చేరుకున్నప్పటి పరిస్థితి. అక్కడ నివాసం వున్నవారు భూమిమీద హక్కు కలిగి వున్నారు. అందువల్ల వాళ్ళకు నష్టపరిహారంగా ఏదో కొంత లభించాలి. పరిహారంగా ఎంతసొమ్ము చెల్లించాలో నిర్ణయించేందుకు కోర్టు ఏర్పాటు అయింది. మునిసిపాలిటీ వాళ్ళు యిస్తానన్న సొమ్ము తీసుకోకపోతే కేసు ఆ కోర్టు ముందుకు వెళుతుంది. ఆ కోర్టువారు ఎంత నిర్దారిస్తే అంత కూలీలు తీసుకోవాలి. యిదీ విధానం. మునిసిపాలిటీ వారిచ్చే దానికంటే ఎక్కువ సష్టపరిహారం కోర్టు నిర్ణయిస్తే వకీలుకు అయిన ఖర్చు మునిసిపాలిటీ వారే భరిస్తారు.

ఈ వ్యవహారంలో ఎక్కువ మంది కూలీలు తమ తమ తరుపున నన్ను వకీలుగా నియమించారు. డబ్బు చేసుకుందామనే కోరిక నాకు లేదు. “మీరు గెలిస్తే మునిసిపాలిటీ వాళ్ళు యిచ్చే సొమ్ముతో తృప్తిపడతా, మీరు గెలిచినా, ఓడినా పట్టాకు 10 పౌండ్లు చొప్పున యివ్వండి చాలు.” అని వారికి చెప్పాను. అంతేగాక ఆవిధంగా వచ్చిన సొమ్ములో సగభాగం బీదవారి కోసం ఆసుపత్రి నిర్మాణానికో లేక అలాంటిదే మరో ప్రజాసేవా కార్యానికో వినియోగిస్తానని కూడా వారికి చెప్పాను. నామాటలు విని వాళ్ళు సంతోషించారు. సుమారు 70 దావాలు జరిగాయి. నాకు ఒక్క దానిలో మాత్రం పరాజయం కలిగింది. అందువల్ల పెద్ద మొత్తం నాకు లభించింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికా ఖర్చు భారం నా మీద బాగా పడటం వల్ల ఆ మొత్తంలో 1600 పౌండ్ల సొమ్ము ఆ ఖాతాకు వెళ్ళి పోయిందని గుర్తు.

ఈ దావాలకై నేను చాలా కృషిచేశాను. కక్షిదారులు గుంపులు గుంపులుగా నా దగ్గర వుండేవారు. వారిలో చాలామంది ఉత్తర బీహారుకు, దక్షిణాదికి చెందిన తమిళ, తెలుగు ప్రాంతాలనుండి గిరిమిట్లుగా వచ్చిన భారతీయులు. ఆ తరువాత వారంతా గిరిమిట్ ప్రధ నుండి విముక్తి పొంది స్వతంత్రంగా వృత్తి చేసుకోసాగారు.

వీళ్ళంతా కలిసి తమ కష్టాలు తొలగించుకొనేందుకు భారతీయ వ్యాపారస్థులకు సంబంధించిన మండలి నుండి విడివడి మరో మండలిని సొంతంగా స్థాపించుకున్నారు. నిర్మలహృదయులు, నిజాయితీపరులు, శీలవంతులు అయిన ఆ మండలి అధ్యక్షుని పేరు శ్రీ జయరాం సింహ్. అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుని వంటి మరొకరి పేరు శ్రీ బద్రీ. ఇద్దరూ ఇప్పుడు కీర్తిశేషులే. వారిద్దరి వల్ల నాకు ఎంతో సహకారం లభించింది. శ్రీ బద్రీతో చాలా పని నాకు పడింది. ఆయన సత్యాగ్రహంలో ప్రముఖంగా పాల్గొన్నాడు. వీరివంటి వారి వల్ల దక్షిణ భారతావనికి, ఉత్తర భారతావనికి చెందిన పలువురితో నాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను వారి వకీలునేగాక ఒక సోదరునిగా పున్నాను. వారి దుఃఖాలలో భాగస్వామిగా వున్నాను. ‘సేఠ్ అబ్దుల్లా నన్ను గాంధీ అని పిలవడానికి అంగీకరించలేదు. నన్ను దొర అని అక్కడ ఎవరు అంటారు? అన్నా అని అంగీకరించేది ఎవరు? అందువల్ల ఆయన ఎంతో ప్రీతికరమైన పదం ఒకటి వెతికి బయటికి తీశారు. భాయీ అంటే సోదరా అనేదే ఆ పదం. ఆ పదం దక్షిణ ఆఫ్రికాలో చివరిదాకా నాకు స్థిరపడిపోయింది. గిరిమిట్ ప్రధమం నుండి విముక్తులైన హిందూ దేశస్థులు నన్ను “భాయీ” అని పిలుస్తున్నప్పుడు వారి పిలుపులో నాకు తీయదనం గోచరిస్తూ వుండేది.

15. మహమ్మారి - 1

మునిసిపాలిటీ వారు ఈ లొకేషను యాజమాన్యం పట్టా పుచ్చుకొని అక్కడ వుండే హిందూదేశస్థుల్ని వెంటనే తొలగించలేదు. వారికి అనుకూలమైన మరో చోటు చూపించాలి. వారు స్థలం నిర్ణయించనందున వెళ్ళమని చెప్పలేదు. తత్ఫలితంగా హిందూ దేశస్తులు ఆ ‘మురికి’ లొకేషన్‌లోనే వున్నారు. కాని రెండు మార్పులు జరిగాయి. హిందూ దేశస్థులు గృహయజమానులుగా వుండక, మునిసిపాలిటీ వారికి బాడుగ చెల్లించేవారుగా మారారు. దానితో లొకేషనులో మురికి బాగా పెరిగిపోయింది. మొదట హిందూ దేశస్థులకు యాజమాన్యం హక్కు లభించియున్నప్పుడు, ఇష్టం వున్నా లేకపోయినా భయం వల్ల పరిసరాలను కొద్దిగా శుభ్రంగా ఉంచుకొనేవారు. ఇప్పుడు మునిసిపాలిటీ వ్యవహారం కదా! ఎవరికీ ఎవరన్నా ఏమీ భయం లేదు. ఇండ్లలో కిరాయిదారులు పెరిగిపోయారు. వారితోపాటు మురికి, అవ్యవస్థ పెరిగి పోయింది.

ఇలా వ్యవహారం నడువసాగింది. ఇది చూచి హిందూ దేశస్థులకు భయం పట్టుకుంది. ఇంతలో భయంకరంగా ప్లేగు అంటుకుంది. అది ప్రాణాంతకమైన మహమ్మారి. ఊపిరితిత్తులకు సంబందించిన ప్లేగు, నల్ల ప్లేగుకంటే ఇది ప్రమాదకరమైంది. అదృష్టవశాత్తు మహమ్మారికి కారణం లొకేషను కాదని అందుకు కారణం జోహన్సుబర్గు సమీపంలోనున్న బంగారుగనుల్లో గల ఒక గని అని తేలింది. అక్కడ హబ్షీ శ్రామికులు ఉన్నారు. అక్కడి పారిశుధ్య బాధ్యత తెల్ల యజమానులది. ఈ గనిలో కొందరు హిందూ దేశస్థులు కూడా పనిచేస్తున్నారు. వారిలో 23 మందికి అంటురోగం సోకింది. ఒకనాటి సాయంత్రం భయంకరమైన ప్లేగు రోగంతో వారంతా లొకేషనులోగల తమ చోటుకు చేరుకున్నారు.

అప్పుడే భాయిమదనజీత్ ఇండియన్ పత్రికకు చందాదారుల్ని చేర్చడానికి చందాలు వసూలు చేయడానికి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఆయన భయపడలేదు. ఆ రోగుల్ని చూచాడు. ఆయన గుండె దడదడలాడింది. పెన్సిలుతో వ్రాసి ఒక చీటీ నా దగ్గరికి పంపించాడు. అందులో ఇలా వ్రాశాడు. “ఇక్కడ హఠాత్తుగా నల్లప్లేగు అంటుకుంది. మీరు వెంటనే వచ్చి ఏమైనా చేయాలి. లేకపోతే భయంకరమైన పరిణామం ఏర్పడుతుంది. త్వరగా రండి” మదనజీత్ ఒక ఖాళీగా ఉన్న ఇంటిని నిర్భయంగా ఆక్రమించి ఆ రోగుల్ని అందులో చేర్చాడు. సైకిలుమీద నేను వెంటనే లొకేషను చేరాను. అక్కడినుండి టౌన్‌క్లర్కుకు జాబు పంపి ఏ పరిస్థితుల్లో ఆ గృహాన్ని ఉపయోగించవలసి వచ్చిందో వ్రాశాను.

డాక్టర్ విలియం గాడ్‌ఫ్రే జోహన్సుబర్గులో డాక్టరుగా వున్నారు. సమాచారం అందగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు. రోగులకు తానే డాక్టరు, నర్సు అయిపోయాడు. కాని 23 మంది రోగులకు మేము ముగ్గురం ఏం సరిపోతాం? ఇలాంటి సమయంలో మన విధానం సరిగా ఉంటే కష్టాల్ని ఎదుర్కొనేందుకు సేవకులు తప్పక లభించి తీరతారని అనుభవం మీద తెలుసుకున్నాను. నా ఆఫీసులో కళ్యాణదాసు, మాణిక్‌లాల్ మరియు మరో ఇద్దరు హిందూ దేశస్థులు వున్నారు. చివరి ఇద్దరి పేర్లు ఇప్పుడు నాకు జ్ఞాపకం లేవు. కళ్యాణదాసును అతని తండ్రి నాకు అప్పగించాడు. అతని వంటి పరోపకారి కేవలం ఆజ్ఞను పాటించునట్టి వారు బహు కొద్దిమందే ఉంటారు. అదృష్టవశాత్తు కళ్యాణదాసు బ్రహ్మచారి. ఎంతటి ప్రమాదకరమైన పని అయినా అతనికి అప్పగించే స్థితిలో నేను ఉన్నాను. రెండో సజ్జనుడు మాణిక్‌లాల్. అతడు నాకు జోహాన్సుబర్గులో లభించాడు. అతడికి కూడా పెండ్లి కాలేదనే అనుకుంటాను. నాకు గుమస్తాలు, అనుచరులు, బిడ్డలు అన్నీవారే. ఆ నలుగురినీ హోమం చేసేందుకు సిద్ధపడ్డాను. కళ్యాణదాసును అడగనక్కరలేదు. మిగతావారు అడగగానే సిద్ధపడ్డారు. “ఎక్కడ మీరు వుంటే అక్కడ మేము ఉంటాం” ఇది వారు క్లుప్తంగా ఇచ్చిన సమాధానం.

మి. రీచ్ కుటుంబం పెద్దది. ఆయన స్వయంగా రావడానికి సిద్ధపడ్డాడు. కాని నేనే వారిని ఆపాను. వారిని ఈ ప్రమాదంలోకి నెట్టడానికి నేను సిద్ధం కాలేదు. నాకు ధైర్యం చాలలేదు. అయితే ఆయన బయటి కార్యమంతా చేసేందుకు నడుం బిగించాడు. ఆ రాత్రి సేవా శుశ్రూషల్లో గడిచింది. అది నిజంగా కాళరాత్రే. నేను చాలా మంది రోగులకు శుశ్రూష చేశాను. కాని ప్లేగు వాతపడిన రోగులకు శుశ్రూష నేనెన్నడూ చేసి యుండలేదు. డాక్టర్ గాడ్‌ఫ్రే ప్రదర్శించిన ధైర్యం మమ్మల్ని నిర్భయుల్ని చేసింది. రోగులకు సేవ ఎక్కువ చేయనక్కరలేదు. వాళ్ళకు మందు ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి పత్యపానాలు చూడాలి. వారు దొడ్డికి వెళితే ఆ మలం ఎత్తివేయాలి. ఇంతకంటే మించి పని లేదు. నలుగురు యువకులు నడుం వంచి చేసిన శ్రమ, వారి నిర్భీకత చూచి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

డాక్టరు గాడ్‌ఫ్రే, మదన్‌జీత్‌ల ధైర్యం మాట సరే. ఈ నలుగురు యువకుల ధైర్యం అద్భుతం. ఏదో విధంగా ఆ రాత్రి గడిచింది. నాకు జ్ఞాపకం వున్నంతవరకు ఆ రాత్రి మేము ఒక్క రోగిని కూడా పోగొట్టుకోలేదు. కాని ఈ ఘట్టం ఎంత కరుణరసార్ద్రమైనదో, అంత మనోరంజకమైనది. నా దృష్టిలో ఇది ధార్మికమైనది కూడా.

16. మహమ్మారి - 2

ముందుగా అనుమతి తీసుకోకుండా ఇంటి తాళం బద్దలు కొట్టి అందు రోగులను చేర్చి వారికి సేవా శుశ్రూష చేసినందుకు టౌన్‌క్లర్కు మమ్మల్ని అభినందించాడు. “ఇటువంటి సమయంలో ధైర్యం చేసి మీరు చేసిన విధంగా ఏర్పాటు చేసే చొరవ మాకు లేదు. మీకు ఏవిధమైన సాయం కావలసివచ్చినా చెప్పండి. టౌన్‌కౌన్సిలు చేతనైన సాయం చేస్తుంది.” అని మనస్పూర్తిగా చెప్పాడు. మున్సిపాలిటీ వారు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. రోగుల సేవ విషయంలో వాళ్ళు ఆలస్యం చేయలేదు.

రెండో రోజున ఖాళీగా వున్న పెద్ద గోడౌను మాకు అప్పగించారు. అందు రోగులనందరినీ చేర్చమని చెప్పారు. దాన్ని శుభ్రం చేసే బాధ్యత మునిసిపాలిటీ వహించలేదు. ఆ గోడౌను మురికిగాను, అపరిశుభ్రంగాను ఉంది. మేమంతా కలిసి దాన్ని శుభ్రం చేశాము. ఉదార హృదయులగు భారతీయులు మంచాలు వగైరా ఇచ్చారు. అక్కడ ఒక ఆసుపత్రి వాతావరణం ఏర్పడింది. మునిసిపాలిటీ వారు ఒక నర్సును పరిచారికను పంపించారు. బ్రాందీ సీసాలు, మందులు వగైరా వారికిచ్చి పంపారు. డాక్టర్ గాడ్‌ఫ్రే మొదటివలెనే మాతోబాటు వుండి చికిత్స చేస్తున్నారు. నర్సును, మేము రోగుల దగ్గరికి పోనీయలేదు. ఆమెకు ఏమీ ఇబ్బంది కలుగలేదు. ఆమె స్వభావం మంచిది. అయితే ఎవ్వరికీ ప్రమాదం కలుగకూడదని మా అభిప్రాయం. రోగులకు బ్రాందీ పట్టమని సలహా ఇచ్చింది. వ్యాధి సోకకుండా మీరు కూడా కొద్ది కొద్దిగా బ్రాందీ తాగమని నర్సు మాకు సలహా ఇచ్చింది. ఆమె బ్రాందీ త్రాగుతునే వున్నది. రోగులకు బ్రాందీ పట్టడానికి నా మనస్సు అంగీకరించలేదు. ముగ్గురు రోగులు బ్రాందీ త్రాగకుండా వుండటానికి అంగీకరించారు. డా. గాడ్‌ఫ్రే గారి అనుమతితో వారికి మట్టిపట్టీల చికిత్స చేశాను. గుండెలో నొప్పిగా వున్నచోట మట్టి పట్టీలు వేశాను. వారిలో ఇద్దరు మాత్రం బ్రతికారు. మిగతావారంతా చనిపోయారు. ఇరవై మంది రోగులు ఆ గోడౌనులోనే చనిపోయారు.

మునిసిపాలిటీ వారు మరో ఏర్పాటు చేశారు. జోహన్సుబర్గుకు ఏడు మైళ్ళ దూరాన అంటురోగాలు తగిలిన వారి కోసం ప్రత్యేక ఆసుపత్రి వున్నది. అక్కడ డేరా వేసి ముగ్గురు రోగుల్ని తీసుకువెళ్ళారు. ప్లేగు తగిలిన మిగతా రోగుల్ని కూడా అక్కడకు తీసుకొని వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. దానితో మాకు ముక్తి లభించింది. పాపం ఆ నర్సు కూడా ప్లేగు వ్యాధి సోకి చనిపోయిందని కొద్దిరోజుల తరువాత మాకు తెలిసింది. కొద్దిమంది రోగులు బ్రతకడం, మేము ప్లేగువాత బడకుండా మిగలడం విచిత్రమే. ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేము. అయితే మట్టి చికిత్స మీద నాకు శ్రద్ధ, ఔషధ రూపంలో బ్రాందీ మొదలగువాటి ఎడ అశ్రద్ధ పెరిగింది. ఈ శ్రద్ధకు, అశ్రద్ధకు ఆధారం ఏమీ లేదని అనవచ్చు. నాకు ఆ విషయం తెలుసు. కాని ఆనాడు నా మనస్సు పైబడిన ముద్రను తొలగించలేను. ఈనాటికీ ఆ ముద్ర అలాగే ఉన్నది. అందువల్లనే ఇక్కడ ఆ విషయాన్ని వ్రాయడం అవసరమని భావించాను.

ఈ నల్ల ప్లేగు వంటి భయంకర వ్యాధి ప్రబలగానే నేను పత్రికల్లో మునిసిపాలిటీ వారు లొకేషను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత చూపిన అశ్రద్ధను గురించి వివరంగా వ్రాసి ఇట్టి వ్యాధి రావడానికి వారి బాధ్యతను నొక్కి వక్కాణిస్తూ జాబు ప్రకటించాను. నా ఆ జాబు మి. హెనరీ పోలక్‌ను నాకు పరిచయం చేసింది. కీ.శే. జోసఫ్‌డోక్‌తో పరిచయం కావడానికి సాధనంగా ఉపయోగపడింది.

గత ప్రకరణంలో నేను భోజనం నిమిత్తం ఒక మాంసాహార రహిత భోజనశాలకు వెళుతూ వుండేవాడినని వ్రాశాను. ఆక్కడ మి. అల్బర్టువెస్ట్‌తో పరిచయం కలిగింది. మేము సాయంత్రం పూట ఆ భోజనశాలలో కలుస్తూ వుండేవారం. అక్కడ ఆహారం తీసుకొని షికారుకు వెళ్ళేవారం. ఆయన ఒక చిన్న ప్రెస్సులో భాగస్వామిగా వుండేవాడు. పత్రికల్లో మహమ్మారిని గురించిన నా జాబు చదివి, భోజనశాలలో నేను కనబడక పోయేసరికి కంగారు పడిపోయాడు. నేనూ, నాతోటి అనుచరులు రోగులకు సేవచేస్తున్నప్పుడు భోజనం పూర్తిగా తగ్గించివేశాం. ప్లేగువంటి వ్యాధులు ప్రబలినప్పుడు పొట్ట ఎంత తేలికగా వుంటే అంత మంచిదని అనుభవం వల్ల తెలుసుకున్నాను. అందువల్ల సాయంకాల భోజనం మానివేశాను. మధ్యాహ్నం పూట భోజనం చేసి వచ్చేవాణ్ణి. భోజనశాలలో భోజనం మానివేశాను. మధ్యాహ్నం పూట భోజనం చేసి వచ్చేవాణ్ణి. భోజనశాల యజమాని నన్ను బాగా ఎరుగును. ఆయనకు ముందుగానే నేను ప్లేగు సోకిన రోగుల సేవ చేస్తున్నాను, నా వల్ల ఎవ్వరికీ ఏ విధమైన యిబ్బంది కలుగకూడదు అని చెప్పాను. అందువల్ల నేను భోజనశాలలో వెస్ట్‌గారికి కనబడలేదు. రెండోరోజునో లేక మూడో రోజునో ఉదయం పూట నేను బయటకు వెళ్ళబోతున్నప్పుడు నేనుండే గది దగ్గరికి వచ్చి తలుపుకొట్టగా నేను తలుపు తెరిచాను. నన్ను చూచీ చూడగానే “మీరు భోజనశాలలో కనబడనందున మీకేమైనా అయిందేమోనని గాబరాపడ్డాను. ఈ సమయంలో తప్పక దొరుకుతారనే భావంతో వచ్చాను. అవసరమైతే చెప్పండి. రోగులకు సేవ శుశ్రూషలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నా పొట్ట నింపుకోవడం మినహా నాకు మరో బాధ్యత అంటూ ఏమీ లేదని మీకు తెలుసుగదా అని అన్నాడు.

నేను వెస్ట్‌గారికి ధన్యవాదాలు సమర్పించాను. నేను ఆలోచించేందుకు ఒక్క నిమిషం సేపు కూడా వృధా చేయలేదు. “మిమ్మల్ని నర్సుగా తీసుకోను. మేము జబ్బు పడకపోతే రెండుమూడు రోజుల్లో మా పని పూర్తి అవుతుంది. ఒక్క పని మాత్రం ఉన్నది” అని అన్నాను. “ఏమిటది” “దర్బను వెళ్ళి ఇండియన్ ఒపీనియన్ ప్రెస్సుపని మీ చేతుల్లోకి తీసుకోగలరా? మదనజీత్ ప్రస్తుతం ఇక్కడ పనిలో మునిగి ఉన్నాడు. అక్కడికి ఎవరైనా వెళ్ళడం అవసరం. మీరు వెళితే ఆ చింత నాకు తొలగుతుంది“ “నా దగ్గర ప్రెస్సు వున్నదని మీకు తెలుసు. ఏ సంగతీ సాయంకాలం చెబుతా. సరేనా! సాయంత్రం వాహ్యాళికి వెళదాం మాట్లాడుకోవచ్చు” నాకు ఆనందం కలిగింది. ఆ రోజు సాయంత్రం మాట్లాడాం. ప్రతిమాసం వెస్ట్‌కు పది పౌండ్ల జీతం మరియు ప్రెస్సులో డబ్బు మిగిలితే దానిలో భాగం ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి వెస్ట్‌దొర జీతానికి ఒప్పుకునే వ్యక్తికాదు. అందువల్ల జీతాన్ని గురించి ఆయన పట్టించుకోలేదు. రెండో రోజు రాత్రి మెయిలుకి వెస్ట్ బయలుదేరి వెళ్ళాడు.

అప్పటినుండి నేను దక్షిణ ఆఫ్రికా వదిలి వచ్చేవరకు కష్టసుఖాల్లో నాతోబాటు వుండి ఆయన పనిచేశాడు. వెస్ట్‌దొర ఇంగ్లాండులో లౌథ్ అను గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి. స్కూల్లో సామాన్య శిక్షణ పొంది, కష్టపడి పైకి వచ్చి అనుభవం అనే పాఠశాలలో శిక్షణ పొందినవాడు. పొందికగల సంయమశీలి, భగవంతునికి భయపడేమనిషి, ధైర్యశాలి, పరోపకారి. ఆయనను గురించి, ఆయన కుటుంబాన్ని గురించి రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను.

17. లొకేషను దగ్ధం

ప్లేగుకు సంబంధించిన పనుల నుండి ముక్తి పొందామేకాని అందుకు సంబంధించిన మిగతా వ్యవహారాలు యింకా మమ్మల్ని వదలలేదు. లొకేషను పరిస్థితిని గురించి మునిసిపాలిటీ పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాని తెల్లవారి ఆరోగ్యం విషయంలో మాత్రం పూర్తిగా పట్టించుకొని ఇరవైనాలుగు గంటలు జాగ్రత్త వహించింది. తెల్లవారి ప్రాంతాలకు వ్యాధి ప్రాకకుండా వుండేందుకు డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టింది. హిందూ దేశస్థులను గురించి గాని, వాళ్ల ఆరోగ్యాన్ని గురించి గాని పట్టించుకోని దోషాలు మునిసిపాలిటీ వారిలో చూచాను. అయితే తెల్లవారి ఆరోగ్యం విషయమై వారు చూపిన శ్రద్ధను అభినందించకుండా వుండలేకపోయాను. ఈ విషయమై చేయగలిగినంత సాయం నేను చేశాను. నేను ఆ సాయం చేసియుండకపోతే మునిసిపాలిటీ వారు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళే. గుండ్లవర్షం కురిపించో, తుపాకుల సాయం పొందో తమ నిర్ణయాలను అమలుచేసి యుండేవారు.

అయితే అలా జరగలేదు. హిందూదేశస్థులు వ్యవహరించిన తీరుకు వాళ్ళు ఎంతో సంతోషించారు. తత్ఫలితంగా తరువాత పనులు సవ్యంగా జరిగాయి. మునిసిపాలిటీ వారి పనులు హిందూ దేశస్థుల ద్వారా చేయించడానికి నా పలుకుబడి ఉపయోగపడింది. నా వత్తిడి లేకపోతే హిందూ దేశస్థులు ఆ పనులు చేసేవారు కాదు.

లొకేషనుకు నలువైపుల కాపలా పెట్టారు. అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ పోగూడదు, బయటికి రాకూడదు. నాకు, నా అనుచరులకు లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి పర్మిట్ ఇచ్చారు. లొకేషనులో నివసిస్తున్న హిందూ దేశస్థులనందరినీ జోహన్సుబర్గుకు 13 మైళ్ళ దూరాన మైదానంలో డేరాలు వేసి వాటిలో వుంచాలని, ఆ తరువాత లొకేషనును దగ్ధం చేయాలని మునిసిపాలిటీవారు నిర్ణయించారు. అక్కడకు వెళ్ళి డేరాల్లో కుదుటపడటానికి కొంత సమయం పట్టింది. అందాకా కాపలా ఏర్పాటు అలాగే ఉంచారు.

జనం భయపడ్డారు. అయితే నేను వాళ్ళవెంట వున్నాననే ధైర్యం వాళ్ళకు వున్నది. చాలామంది తమ డబ్బు భూమిలో గుంట తవ్వి దాచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు బయటకి తీయవలసి వచ్చింది. వాళ్ళకు బ్యాంకుల విషయం తెలియదు. నేను వారికి బ్యాంకు అయ్యాను. నా దగ్గర వాళ్ళందరి సొమ్ము కుప్పలుగా చేరింది. ఆ సొమ్ములో నేను కమీషను తీసుకునే సమస్యే లేదు. వాళ్ళ డబ్బు సమస్యను పరిష్కరించాను. బ్యాంకు మేనేజరుతో నాకు పరిచయం ఉన్నది. మీ దగ్గర డబ్బు నిల్వ చేస్తానని ఆయనకు చెప్పాను. బ్యాంకు వెండి, రాగి వస్తువుల్ని తమ వద్ద ఉంచేందుకు అంగీకరించలేదు. ప్లేగు సోకిన ప్రదేశానికి సంబంధించిన వస్తువులని తెలిస్తే బ్యాంకులో పని చేస్తున్న వారు వాటిని తాకేందుకు కూడా సిద్ధపడేవారు కారు. అయితే బ్యాంకు మేనేజరు తెలిసినవాడు కావడం వల్ల అన్ని సౌకర్యాలు కల్పించాడు. డబ్బును క్రిమినాశక మందులచే కడిగి బ్యాంకులో వుంచడానికి నిర్ణయించాము. ఈ విధంగా 60 వేల పౌండ్లు బ్యాంకులో జమ చేసినట్లు గుర్తు.

కొంతకాలం పాటు ఫిక్సెడ్ డిపాజిటులో డబ్బు జమ చేసుకోమని బాగా డబ్బు గల కక్షిదారులకు చెప్పాను. ఆ విధంగా వారి డబ్బు బ్యాంకులో అమితంగా జమపడింది. దానితో బ్యాంకులో సొమ్ము జమ చేయడం, అవసరమైనప్పుడు తీసుకోవడం వాళ్ళకు తెలిసింది. లొకేషను వాసులందరినీ క్లిపస్పృట్ అను ఫారానికి ప్రత్యేక రైల్లో తీసుకువెళ్ళారు. వాళ్ళకు నీరు మునిసిపాలిటీ వారు తమ ఖర్చుతో అందజేశారు. ఆ పేటను చూస్తే సైనికుల బస్తీగా కనబడుతూ ఉన్నది. జనానికి అలా ఉండటం అలవాటు లేదు. వారికి మానసిక శ్రమ కలిగింది. అంతా క్రొత్తగా ఉన్నది. అయితే వాళ్ళకు ఇబ్బందులేమీ కలుగలేదు. నేను రోజూ సైకిలు మీద ఒకసారి వెళ్ళి అంతా తిరిగి చూచి వస్తూ వుండేవాణ్ణి. మూడు వారాలపాటు ఈ విధంగా తెరపగాలిలో వుండటo వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగు పడింది. మానసిక కష్టం మొదటి 24 గంటలు మాత్రమే ఉన్నది. తరువాత అంతా సంతోషంగా వుండసాగారు. నేను వెళ్ళినప్పుడు అంతా భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ ఆటలు ఆడుతూ వుండేవారు.

లొకేషను ఖాళీ చేసిన తరువాత రెండవ రోజున లొకేషనును తగులబెట్టారు. అక్కడి వస్తువుల్లో ఒక్క దానిని కూడా మిగిల్చి వుంచాలనే కోరిక మునిసిపాలిటీ వారికి కలుగలేదు. ఈ నెపంతో తమ మార్కెట్టులో గల కలపనంతటినీ కూడా తగులబెట్టారు. అంతా కలిసి పదివేల పౌండ్ల సొమ్ము నష్టమైంది. మార్కెట్టులో చచ్చిన ఎలుకలు పడివున్నాయి. అందువల్లనే అంత భయంకరంగా లొకేషనును తగులబెట్టారు. ఖర్చు బాగా అయింది కాని వ్యాధి మాత్రం అంతటితో ఆగిపోయింది. నగర ప్రజల భయం తొలగిపోయింది.

18. ఒక పుస్తకపు అద్భుత ప్రభావం

ఈ ప్లేగు వ్యాధి బీదవారైన హిందూదేశస్థుల్ని గురించి నా పనిని, నా వృత్తిని, నా బాధ్యతను బాగా పెంచివేసింది. యూరోపియన్లతో నాకు పరిచయం బాగా పెరగడమే గాక వారి యెడ నా నైతిక బాధ్యత కూడా బాగా పెరిగింది. మాంసరహిత భోజనశాలలో వెస్ట్‌దొరతో నాకు పరిచయం అయినట్లే పోలక్‌తో కూడా పరిచయం అయింది. ఒకరోజు నేను బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాను. దూరంగా వున్న ఒక బల్ల దగ్గర కూర్చొని ఒక యువకుడు భోజనం చేస్తున్నాడు. “మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నాను, అనుమతి ఇస్తారా” అని చీటీ వ్రాసి పంపించాడు. ఆయనను నా బల్లదగ్గరకు రమ్మన్నాను. ఆయన వచ్చాడు.

“నేను క్రిటిక్ అను పత్రికకు ఉపసంపాదకుణ్ణి. ప్లేగును గురించి మీరు ప్రకటించిన జాబు చదివాను. అప్పటి నుండి మిమ్ము కలుసుకోవాలని అనుకుంటున్నాను. నా ఆ కోరిక ఈనాడు నెరవేరింది.” అని అన్నాడు.

మి. పోలక్ యొక్క నిష్కపట భావాలవల్ల నేను ఆయన యెడ ఆకర్షితుడనయ్యాను. ఆ రాత్రి మేమిద్దరం ఒకరికొకరం బాగా పరిచితులమయ్యాం. మా జీవిత విధానాల్లో సామ్యం కనబడింది. సాదా జీవనం వారికి ఇష్టం. బుద్ధి అంగీకరించిన విషయాల్ని వెంటనే అమలు పరచాలన్న తపన ఆయనలో అధికంగా కనబడింది. తన జీవనంలో చాలా మార్పులు వెంటనే చేసిన వ్యక్తి మి. పోలక్.

“ఇండియన్ ఒపీనియన్” ఖర్చు పెరిగిపోతున్నది. వెస్ట్ పంపిన మొదటి రిపోర్టు చదివి నివ్వెరపోయాను. “మీరు చెప్పినంత లాభం యిక్కడ కనబడలేదు. నష్టం కనబడుతున్న లెక్కలు కూడా అస్తవ్యస్తంగా వున్నాయి. పని అయితే బాగానే వున్నది. కాని దానికి తలా తోకా కనబడటం లేదు. మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఈ రిపోర్టు చూచి గాబరా పడకండి. నాకు చేతనైనంత వరకు వ్యవస్థను సరిచేస్తాను. లాభం లేదని నేను పని మానను” అని జాబు వ్రాశాడు.

లాభం లేనందున వెస్ట్ తలుచుకుంటే పని మానివేసేవాడే. ఆయనను తప్పు పట్టడానికి కూడా వీలులేదు. సరియైన వివరాలు తెలుసుకోకుండా లాభం వస్తున్నదని చెప్పినందుకు నన్ను తప్పు పట్టవచ్చు కూడా. అయినా ఆయన నన్ను ఎన్నడూ ఒక కటువైన మాటకూడా అనలేదు. చెప్పుడు మాటలు నమ్మేవాడినని నన్ను గురించి వెస్ట్ భావించి వుంటాడని అనుకున్నాను. మదనజీత్ మాట ప్రకారం నేను లాభం వస్తున్నదని వెస్ట్‌కు చెప్పాను. సార్వజనిక పనులు చేసేవారు స్వయంగా పరిశీలించి చూడనిదే ఒకరిని నమ్మి వెంటనే నిర్ణయానికి రాకూడదని పాఠం నేర్చుకున్నాను. సత్యపూజారి ఇంకా జాగ్రత్తగా వుండాలి. పూర్తిగా నిర్ణయానికి రానిదే ఏదో మాట చెప్పి ఒకరి మనస్సును నమ్మేలా చేయడం సత్యాన్ని మరుగుపరచడమే. ఈ విషయం తెలిసియుండి కూడా త్వరగా నమ్మి పనిచేసే నా స్వభావాన్ని పూర్తిగా మార్చుకోజాలనందుకు విచారపడ్డాను. ఇందుకు కారణం శక్తి సామర్థ్యం కంటే మించి పని చేద్దామనే లోభమే. ఈ లోభం వల్ల నేను కష్టపడవలసి వచ్చింది. అంతేగాక నా సహచరులు ఎంతో ఇబ్బందులకు లోనుకావలసి వచ్చింది.

వెస్ట్ వ్రాసిన జాబు చూచి నేను నేటాలుకు బయలుదేరాను. పోలక్ నా విషయాలన్నీ గ్రహించాడు. నన్ను సాగనంపుటకు స్టేషనుకు వచ్చాడు. ఒక పుస్తకం నాకిచ్చి “ఈ పుస్తకం చదువతగింది. చదవండి. మీకు నచ్చుతుంది” అని అన్నాడు. పుస్తకం పేరు “అంటు దిస్ లాస్ట్” రస్కిన్ రాసిన పుస్తకం. ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను. చివరివరకు దాన్ని వదలలేకపోయాను. నన్ను ఆ పుస్తకం ఆకట్టివేసింది. జోహన్సుబర్గు నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం. సాయంత్రం రైలు డర్బను చేరుకుంది. స్థావరం చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. పుస్తకంలో చదివిన విషయాల్ని ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను.

ఇంతకు ముందు రస్కిన్ పుస్తకాలు ఏవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. కర్మభూమి మీద అడుగు పెట్టిన తరువాత సమయం చిక్కలేదు. అందువల్ల ఈనాటి వరకు నాకుగల పుస్తక జ్ఞానం తక్కువేనని చెప్పక తప్పదు. అయాచితంగా తప్పనిసరి అయి ఏర్పడిన ఈ సంయమం వల్ల నష్టం కలగలేదని చెప్పలేను. కాని చదివిన కొద్ది పుస్తకాలను ఒంట పట్టించుకున్నానని మాత్రం చెప్పగలను. నా జీవితంలో చదివిన తక్షణం మహత్తరమైన నిర్మాణాత్మక మైన మార్పు తెచ్చిన పుస్తకం ఇదేనని మాత్రం చెప్పగలను. తరువాత దాన్ని నేను అనువదించాను. సర్వోదయం అను పేరట ఆ పుస్తకం అచ్చు అయింది.

నాలో లోతుగా పాతుకుపోయిన విషయాల ప్రతిబింబం స్పష్టంగా రస్కిన్ రచించిన ఈ గ్రంథరత్నంలో నాకు కనబడింది. అందువల్ల ఈ పుస్తక ప్రభావం నా హృదయం మీద అపరిమితంగా పడింది. ఆ పుస్తకమందలి విషయాల్ని ఆచరణలో పెట్టాలని ప్రేరణ కలిగింది. మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను మేల్కొలపగల శక్తి కలవాడే కవి. కవుల ప్రభావం సర్వుల మీద పడదు. సర్వులలో మంచి భావాలు సమాన పరిమాణంలో వుండకపోవడమే అందుకు కారణం. నేను తెలుసుకున్న సర్వోదయ సిద్ధాంతాలు ఇవి. # సర్వుల మంచి యందే తన మంచి ఇమిడి ఉన్నది.

  1. వకీలు, క్షురకుడు ఇద్దరి వృత్తికి విలువ ఒకటిగానే ఉండాలి. జీవనోపాధి హక్కు అందరికీ సమానమే.
  2. నిరాడంబరంగా వుంటూ కష్టపడి పనిచేసే రైతు జీవనమే నిజమైన జీవనం.

మొదటి విషయం నాకు తెలును. రెండో విషయం కొంచెం తెలుసుకుంటున్నాను. మూడో విషయాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు. మొదటి దానిలో మిగతా రెండూ ఇమిడి వున్నాయి. ఈ విషయం దీపం వలె వెలుగు ప్రసారం చేసి సర్వోదయాన్ని నాకు బోధ చేసింది. తెల్లవారింది. ఇక ఆచరణకు పూనుకున్నాను.

19. ఫినిక్సు స్థాపన

మరునాడు ఉదయం నేను వెస్ట్‌తో మాట్లాడాను. సర్వోదయ వివరమంతా ఆయనకు తెలియజేశాను. ఇండియన్ ఒపీనియన్ పత్రికను ఏదైనా పొలానికి తీసుకుపోదామని చెప్పాను. అక్కడ అంతా కలిసి వుందాం. భోజనానికి అయ్యే ఖర్చు మాత్రం అంతా తీసుకుందాం. సంపాదన కోసం వ్యవసాయం చేద్దాం. మిగతా సమయంలో ఇండియన్ ఒపీనియన్ పని చేద్దాం అని చెప్పాను. వెస్ట్ అందుకు అంగీకరించాడు. ఒక్కొక్కరికి భోజనం ఖర్చు కనీసం మూడు పౌండ్లు అవుతుందని అంచనా వేశాం. తెల్లవారు నల్లవారు అని భేదం చూపలేదు.

అయితే ప్రెస్సులో ఇప్పుడు పదిమందిదాకా కార్యకర్తలు పని చేస్తున్నారు. అడవిలో వుండటానికి అంతా అంగీకరిస్తారా? అంతా సమానంగా భోజనానికి బట్టలకు అయ్యే ఖర్చు మాత్రమే తీసుకోవడానికి సిద్ధపడతారా! ఈ రెండు ప్రశ్నలు బయలుదేరాయి. ఈ విధంగా పని చేయడానికి అంగీకరించని వారు జీతం తీసుకోవచ్చు. కాని త్వరలోనే వారు కూడా సంస్థలో చేరిపోవాలి. ఈ ఆదర్శంతో అంతా పనిచేయాలి అని మేమిద్దరం నిర్ణయానికి వచ్చాం. ఈ దృష్టితో కార్యకర్తలను పిలిచి మాట్లాడాను. మదనజీత్‌కు మా నిర్ణయం మింగుడు పడలేదు. ఎంతో కాలం కష్టపడి తాను నెలకొల్పిన వ్యవస్థ నా మూర్ఖత్వం వల్ల మట్టిలో కలిసిపోతుందని, ఇండియన్ ఒపీనియన్ ఆగిపోతుందని, ప్రెస్సు నడవదని, పనిచేసేవాళ్ళంతా పారిపోతారని అభిప్రాయపడ్డాడు.

నా అన్నగారి కుమారుడు ఛగన్‌లాలు ప్రెస్సులో పనిచేస్తున్నాడు. అతనితో కూడా నేను వెస్ట్‌ను వెంటబెట్టుకునే మాట్లాడాను. అతనికి కుటుంబ భారం జాస్తి, అయితే బాల్యం నుండి అతడు నేను చెప్పిన ప్రకారం శిక్షణ పొందడానికి, నేను చెప్పిన ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మీద అతడికి అపరిమితమైన విశ్వాసం. మారు మాటాడకుండా మేము చెప్పిన ప్రకారం చేయడానికి అంగీకరించాడు. ఇప్పటివరకూ నా దగ్గరే ఉన్నాడు.

గోవిందసామి అని మెషిన్‌మెన్ వున్నాడు. అతడు కూడా సంస్థలో చేరిపోయాడు. మిగతావాళ్ళు సంస్థలో చేరేందుకు అంగీకరించలేదు. కాని ప్రెస్సును ఎక్కడికి తీసుకువెళితే అక్కడకు రావడానికి సిద్ధపడ్డారు.

ఈ విధంగా కార్యకర్తలతో మాట్లాడేందుకు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం పట్టలేదని గుర్తు. వెంటనే నేను డర్బనుకు సమీపంలో స్టేషను దగ్గరగా భూమి కావాలని పత్రికల్లో ప్రకటన చేశాను. ఫినిక్స్ యందలి చోటు వున్నది ఇస్తామని సమాధానం వచ్చింది. నేను, వెస్ట్ ఇద్దరం ఆ చోటు చూచేందుకు వెళ్ళాం. ఏడు రోజుల్లోపల 20 ఎకరాలు భూమి కొన్నాం. అందు ఒక చిన్ని నీటి కాలువ ఉన్నది. నారింజ చెట్లు, మామిడిచెట్లు కూడా ఉన్నాయి. దాని ప్రక్కన మరో 80 ఎకరాల భూమి కూడా ఉన్నది. అందు పండ్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక కుటీరం కూడా ఉన్నది. దాన్ని కూడా కొద్ది రోజుల తరువాత కొనివేశాం. రెండిటికీ కలిపి 10 వేల పౌండ్లు ఇచ్చాం.

సేఠ్ పారసీరుస్తుంగారు నేను పూనుకొనే సాహసోపేతమైన కార్యక్రమాలన్నింటికీ అండగా వుండేవారు. నా ప్రణాళిక వారికి నచ్చింది. ఒక పెద్ద గొడౌనుకు చెందిన టిన్ను రేకులు మొదలుగాగలవి వారి దగ్గరపడి ఉన్నాయి. వాటినన్నింటినీ ఉచితంగా మాకు ఇచ్చివేశారు. వాటితో గృహ నిర్మాణం ప్రారంభించాం. కొంతమంది హిందూ దేశానికి సంబంధించిన వడ్రంగులు, తాపీవాళ్ళు దొరికారు. వారిలో చాలామంది యుద్ధరంగంలో నాతోబాటు పనిచేసినవారే. వారి సాయంతో కార్ఖానా నిర్మాణం ప్రారంభమైంది. ఒక మాసం రోజుల్లో 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుగల ఇంటి నిర్మాణం పూర్తి అయింది. వెస్ట్ మొదలగు వారు ప్రాణాలకు తెగించి వడ్రంగులు తాపీవాళ్ళతో బాటు పనిచేశారు. ఫినక్సులో గడ్డి ఎక్కువగా ఉంది. అక్కడ జనసంఖ్య బహు తక్కువ. పాములు మాత్రం ఎక్కువ. ఇదే అక్కడ ప్రమాదం. ప్రారంభంలో అంతా డేరాలు వేసుకొని వున్నారు. ఇంటి యందలి ముఖ్యభాగం తయారవగానే ఎద్దుల బండ్లలో సామాను అక్కడికి చేర్చాం. డర్బనుకు, ఫినిక్సు పదమూడు మైళ్ళ దూరాన ఉన్నది. స్టేషనుకు మా భూమి రెండున్నర మైళ్ళ దూరాన ఉన్నది. ఒక్క వారం మాత్రమే ఇండియన్ ఒపీనియన్ పత్రికను మర్క్యురీ ప్రెస్సులో ముద్రించవలసి వచ్చింది. నా వెంట మా బంధువులు చాలా మంది దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటున్నారు. వారిని అంగీకరింపచేసి ఫినిక్సులో చేరుద్దామని ప్రయత్నం చేశాను. డబ్బు సంపాదించుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వారికి నచ్చచెప్పడం కష్టం. కొద్దిమంది మాత్రమే నా మాటల్ని అర్థం చేసుకున్నారు. అట్టివారిలో మగన్‌లాల్ గాంధీ పేరు ఎన్నిక చేసి మరీ పేర్కొంటున్నాను. నా మాటలు అర్థం చేసుకున్న వారిలో కొంతమంది కొద్దిరోజులు ఫినిక్సులో వుండి తరువాత డబ్బు సంపాదనలో పడిపోయాడు. కాని మగన్‌లాల్ గాంధీ మాత్రం అలా చేయలేదు. తన వ్యాపారం మానుకొని నా వెంట రావడమే గాక చివరవరకూ నాతోబాటు వుండిపోయాడు. తన బుద్ధిబలం, త్యాగనిరతి, అపరిమితమైన భక్తి భావంతో నేను ప్రారంభించిన శోధనా కార్యక్రమాలన్నింటిలో అండగా నిలబడి పనిచేశాడు. నా అనుచరుల్లో ఇప్పుడు మొదటిస్థానంలో మగన్‌లాల్ వున్నాడు. సుశిక్షుతుడైన పనివాడుగా సాటిలేని మేటిగా నా దృష్టిలో ఆదరం పొందాడు.

ఈ విధంగా 1904 లో ఫినిక్సు స్థాపన జరిగింది. ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కోవలసివచ్చినా తట్టుకొని ఫినిక్సు సంస్థ, ఇండియన్ ఒపీనియన్ పత్రిక రెండూ ఇప్పటికీ జీవించి వున్నాయి. అయితే ఈ సంస్థను ప్రారంభించినప్పుడు మేము పొందిన సాఫల్యాలు, వైఫల్యాలు తెలుసుకోతగినవి. వాటిని గురించి మరో ప్రకరణంలో వ్రాస్తాను.

20. మొదటి రాత్రి

ఫినిక్సులో ఇండియన్ ఒపీనియన్ పత్రిక ప్రథమ ప్రతిని వెలువరించడం కష్టమైంది. రెండు జాగ్రత్తలు పడియుండకపోతే ఒక వారం సంచిక వెలువడియుండేది కాదు లేక ఆలస్యంగా వెలువడియుండేది. ఈ సంస్థలో ఇంజను సాయంతో నడిచే మిషన్లు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు. వ్యవసాయం చేతులతో చేస్తున్నప్పుడు ముద్రణా కార్యక్రమం కూడా చేతులతో నడిచే మిషన్లతో సాగించడం మంచిదని భావించాను. అయితే అది కష్టమని ఆ తరువాత తెలిసింది. దానితో అక్కడికి ఆయిలు ఇంజను తీసుకువెళ్ళాం. ఈ ఆయిలు ఇంజను దగా చేస్తే ముద్రణ సాగించేందుకు మరో పరికరం సిద్ధం చేసి వుంచుకోవడం అవసరమని వెస్ట్‌కు చెప్పాను. అతడు చేతితో త్రిప్పితే తిరిగే చక్రం ఒకటి సిద్ధం చేశాడు. దానితో ముద్రణ యంత్రం నడిచే ఏర్పాటు చేశాడు. మా పత్రిక దినపత్రిక ఆకారంలో ఉన్నది. పెద్దమిషను పాడైతే వెంటనే దాన్ని బాగు చేసే ఏర్పాటు మా దగ్గర లేదు. అందువల్ల పత్రిక ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బంది నుండి తప్పించుకునేందుకై పత్రిక ఆకారాన్ని వారపత్రిక రూపంలోకి మార్చాం. కాలితో ట్రెడిల్ నడిపి కొన్ని పేజీలైనా ముద్రించవచ్చునని భావించాం. ఆరంభపు రోజుల్లో ఇండియన్ ఒపీనియన్ పత్రిక వెలువడే రోజు రాత్రి అంతా జాగరణ చేయాల్సి వచ్చింది. కాగితం సరిచేయడం, దాన్ని అమర్చడం మొదలగు పనులు అంతా కలిసి చేసేవాళ్ళం. రాత్రి 12 గంటలకు పనిపూర్తి అయ్యేది. అయితే ఫినిక్సులో ఆ మొదటి రాత్రి మరిచిపోవడానికి వీలులేనిది. ఫారం మిషను మీద ఎక్కించాం. అప్పుడు ఇంజన్ ససేమిరా నడవనని భీష్మించింది. ఇంజనీరును పిలిపించాం. ఆయన, వెస్ట్ ఎంతో శ్రమ పడ్డారు. కాని ఇంజను మాత్రం నడవలేదు. అందరూ చింతాక్రాంతులైనారు. చివరికి వెస్ట్ నిరాశపడి పోయాడు. కన్నీరు కారుస్తూ నా దగ్గరకు వచ్చాడు. “ఇక మిషను ఇవాళ నడవదు. ఈ వారం సమయానికి మనం పత్రికను ప్రచురించలేము” అని అన్నాడు.

“అయితే ఏం చేస్తాం! కన్నీరు కార్చవలసిన అవసరం ఏముంది? ఇంకా ఏమైనా ప్రయత్నం చేయవలసి ఉంటే చేద్దాం. సరే కాని మీరు సిద్ధం చేసిన చక్రం సగతి ఏమిటి?” అని అడిగాను. “ఆ చక్రం నడవడానికి జనం కావాలి. అంతమంది మన దగ్గర లేరు. మా వల్ల ఆ చక్రం నడవదు. వంతులవారీగా నలుగురు నలుగురు చొప్పున జనం కావాలి. మేమంతా బాగా అలిసిపోయాం” అని అన్నాడు వెస్ట్.

అప్పటికి వడ్రంగుల పని ఇంకా పూర్తికాలేదు. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోలేదు. ముద్రణాలయంలోనే వారంతా నిద్రపోతున్నారు. వారిని చూపించి ఈ మేస్త్రీ లంతా వున్నారుగదా! వీరి సాయం పొందవచ్చుగదా! ఈ రాత్రి మనమంతా అఖండ జాగరణం చేద్దాం. అదే మంచిదని నా అభిప్రాయం అని అన్నాను. “మేస్త్రీలను మేల్కొలపాలన్నా, వారి చేత పనిచేయించాలన్నా నాకు ధైర్యం చాలడంలేదు. అలసిపోయిన వాళ్ళకు కూడా పని చేయమని ఎలా చెప్పడం? ఆ పని నేను చేస్తాను” అని అన్నాను. “అయితే పని పూర్తి కావచ్చు”. నేను మేస్త్రీలను మేల్కొలిపాను. సాయం చేయమని కోరాను. వారిని బ్రతిమలాడవలసిన అవసరం కలుగలేదు. “ఇలాంటి కష్టసమయంలో ఆదుకోకపోతే మేము మనుష్యలం ఎలా అవుతాం? మీరు విశ్రాంతి తీసుకోండి. మేము చక్రం త్రిప్పుతాం మాకు అది పెద్ద పనికాదు” అని వాళ్ళు అన్నారు.

ముద్రణ చేసే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంతా పనిచేస్తూ కీర్తనలు పాడటం ప్రారంభించారు. చక్రం త్రిప్పడానికి మేస్త్రీలకు సాయపడ్డాం. వంతులవారీగా వాళ్ళు చక్రం త్రిప్పసాగారు. పని అయిపోతూ ఉన్నది. తెల్లవారింది. ఏడో గంట కొట్టారు. ఇంకా పని మిగిలి ఉండటం గమనించాను. వెస్ట్‌వైపు చూచి ఏమండీ ఇంజనీరును మేల్కొలపకూడదా? పగటిపూట బాగు చేస్తే ఇంజను నడుస్తుందేమో, పని సమయానికి పూర్తి అవుతుంది కదా! అని అన్నాను.

వెస్ట్ వెంటనే వెళ్ళి ఇంజనీరును మేల్కొలిపాడు. అతడు ఇంజను వున్న చోటకు వెళ్ళాడు. మీట నొక్కేసరికి ఇంజను పనిచేయడం ప్రారంభించింది. ప్రెస్సు అంతా సంతోషపు నినాదాలతో మార్మోగింది. “ఏమిటిది? ఇంజను రాత్రి నడవనంది కదా! మరి ఇప్పుడు మీటనొక్కగానే ఏమీ తెలియనట్లు ఠపీమని ఎలా నడిచింది?” ఈ ప్రశ్నలకు వెస్ట్, ఇంజనీరు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. “ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. మిషన్లకు కూడా మన మాదిరిగా విశ్రాంతి అవసరం అయివుండవచ్చు. అప్పుడప్పుడు అవి ఇలా వ్యవహరిస్తూ వుండటం కద్దు” అని అన్నారు.

“ఇంజను మనందరికీ మంచి పరీక్ష పెట్టింది. మనమంతా కష్టపడ్డాం సమయానికి అది నడవడం మన నిజమైన శ్రమకు శుభప్రదమైన ఫలితం అయివుండవచ్చు” అని అన్నాను. సమయానికి పత్రిక స్టేషను చేరుకుంది. అంతా నిశ్చింతగా శ్వాస పీల్చారు. పత్రిక సమయానికి వెలువడుతుందనే భావం జనానికి కలిగింది. ఫినిక్సులో కాయకష్టం చేయాలనే వాతావరణం నెలకొన్నది. ఒక పర్యాయం ఇంజనును నడపడం మాని, చక్రం త్రిప్పి ముద్రణా కార్యక్రమం సాగించిన రోజులు కూడా వున్నాయి. అవి నైతికంగా ఫినిక్సు చరిత్రలో ఉన్నతమైన రోజులని నా అభిప్రాయం.

21. పోలక్

ఫినిక్సు వంటి సంస్థ స్థాపించబడిన తరువాత నేను అక్కడ కొద్ది రోజులు మాత్రమే వుండగలిగాను. అందుకు ఎంతో విచారపడ్డాను. దాన్ని స్థాపించినప్పుడు నేను కూడా అక్కడే ఉండాలని, అక్కడే జీవితం గడపాలని నెమ్మదిగా వకీలు వృత్తి మానివేయాలని, ఫినిక్సు విజయాన్ని నిజమైన సేవగా భావించాలని అనుకున్నాను. కాని అనుకున్నట్లుగా పనులు జరగలేదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి అను విషయాన్ని జీవితంలో అనుభవం వల్ల తెలుసుకున్నాను. దానితోబాటు సత్యశోధన ఉపాసన సాగినప్పుడు, మనం కోరుకున్న ఫలితం కలుగక, ఊహించని ఫలితం కలిగితే దానివల్ల నష్టం కలుగదని, ఒక్కొక్కప్పుడు మనం ఊహించిన దానికంటే మించిన సత్ఫలితం కలుగుతుందనే అనుభూతి నాకు కలిగింది. ఫినిక్సులో కలిగిన ఊహించని ఫలితాలు, అక్కడ రూపొందిన ఊహించని కార్యక్రమాలు నష్టదాయకమైనవి కావని నా నిశ్చితాభిప్రాయం. ఊహించిన ఫలితాలకంటే మించినవి అవునో కాదో నిశ్చితంగా చెప్పలేను.

అంతా కాయకష్టం చేసి బ్రతకాలనే ఉద్దేశ్యంతో ముద్రణాలయ సమీపంలో సంస్థ యందలి ప్రతి వ్యక్తికి మూడు మూడు ఎకరాల చొప్పున భూమి కేటాయించాం. వాటిలో ఒక ముక్క నా కోసం ఉంచారు. ఆయా చోట్ల అందరికోసం, వారు కోరకపోయినా రేకులతో ఇళ్ళు నిర్మించాం. రైతుకు నప్పే విధంగా గడ్డి, మట్టి, పచ్చి ఇటుకలతో గోడలు కట్టి చొప్పతో పైకప్పు నిర్మించి కుటీరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కాని సాధ్యపడలేదు. అందుకు ధనం, సమయం అధికంగా కావలసి వచ్చింది. అందరూ ఇంటి వాళ్ళే, కనుక వెంటనే కాయకష్టం చేయాలని తహతహలాడారు.

“ఇండియన్ ఒపీనియన్” పత్రికకు సంపాదకుడు మన్ సుఖలాల్. ఆయన ఈ వ్యవస్థలో చేరలేదు. డర్బనులోనే ఆయన బస. డర్బనులో ఇండియన్ ఒపీనియన్‌కు చిన్న శాఖ కూడా ఉన్నది.

కంపోజు పని చేసేందుకు మనుషులు అదనంగా ఉన్నారు. నిజానికి ముద్రణా కార్యక్రమంలో ఎక్కువ సమయం కంపోజు చేయడానికి పడుతుంది. అయితే అది తేలిక పనే. సంస్థలో వుండేవారంతా కంపోజు పని నేర్చుకోవాలని నిర్ణయించారు. దానితో ఆ పని తెలియని వారంతా నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. నేను మాత్రం ఈ వ్యవహారంలో వెనుకబడ్డాను. మగన్‌లాల్ గాంధీ మొదటి స్థానం సంపాదించాడు.

అసలు మగన్‌లాల్‌కు అతని శక్తి ఏమీటో తెలియదని అనుకునేవాణ్ణి. అతడు ఎన్నడూ ప్రెస్సు పని చేయలేదు. అయినా నేర్పరియగు కంపోజిటరు అయ్యాడు. వేగంలో కూడా బాగా పుంజుకున్నాడు. కొద్దిరోజుల్లోనే ప్రెస్సు పనంతా క్షుణ్ణంగా తెలుసుకొని అతడు విజయవంతంగా ప్రెస్సు పని నిర్వహించడం చూచి నేను నివ్వెరబోయాను. ఇంకా ఫినిక్సు వ్యవహారం ఒక ఒడ్డుకు చేరలేదు. ఇంతలో ఈ క్రొత్త కుటుంబాన్ని వదిలి నేను జోహన్సుబర్గు పరుగెత్తవలసి వచ్చింది. అక్కడి పనిని ఎక్కువ కాలం వదలి వుండగల స్థితిలో నేను లేను.

జోహన్సుబర్గు చేరి పోలక్‌తో ఈ పెద్దమార్పును గురించిన వ్యవహారమంతా చెప్పాను. తానిచ్చిన పుస్తకం ఇంతటి మార్పుకు కారణం అయిందని తెలిసి పోలక్ పొంగిపోయాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. “నేను కూడా ఈ వ్యవస్థలో పాలుపంచుకోవచ్చా” అని గద్గద కంఠంతో అడిగాడు. “తప్పక పాలుపంచుకోవచ్చు. అంతేకాదు మీరు అందులో చేరాలి” అని అన్నాను. “చేర్చుకుంటానంటే సిద్ధంగా ఉన్నాను.” అని అన్నాడు. ఆయన నిర్ణయానికి సంతోషించాను. ‘క్రిటిక్’ పత్రిక నుండి తప్పుకుంటున్నానని ఒక నెల రోజుల ముందే నోటీసు పత్రికాధిపతికి పంపి, నెలరోజుల వ్యవధి గడచిపోగానే ఫినిక్సు చేరుకున్నాడు. తన సహృదయతతో అందరినీ ఆకట్టుకున్నాడు. వారందరికీ తల్లో నాలుక అయిపోయాడు. నిరాడంబరతకు ఆయన ప్రతిమూర్తి. అందువల్ల ఫినిక్సు జీవనం ఆయనకు ఎబ్బెట్టు అనిపించలేదు. ఆయన స్వభావానికి అది సరిపోయింది.

కాని నేను ఆయనను అక్కడ ఎక్కువ రోజులు ఉండనీయలేకపోయాను మి. రీచ్ లా చదువు ఇంగ్లాండులో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నందున, ఆఫీసు పని నేను ఒక్కణ్ణి సంబాళించలేకపోయాను. అందువల్ల పోలక్‌ను ఆఫీసులో చేరమని, వకీలు వృత్తి చేపట్టమని ప్రోత్సహించాను. ఆయన వకీలు అయితే చివరకు అంతా వదిలివేసి ఇద్దరు ఫినిక్సు వెళ్ళవచ్చునని భావించాను.

ఆ తరువాత నా కలలన్నీ కల్లలేనని తేలిపోయింది. పోలక్‌లో ఒక గొప్ప సుగుణం వున్నది. ఎవరిమీదనైనా నమ్మకం కుదిరితే మారు మాట్లాడకుండా చెప్పినట్లు చేయడం తన కర్తవ్యంగా భావించే వ్యక్తి. నా జాబుకు సమాధానం వ్రాస్తూ “నాకు ఇక్కడి జీవనం హాయిగా వున్నది. ఇక్కడ సుఖంగా ఉన్నాను. ఈ సంస్థను ఇంకా అభివృద్ధికి తీసుకురావచ్చు. అయినా నేను అక్కడకు రావడం అవసరమని మన ఆదర్శాలు త్వరగా నెరవేరతాయని మీరు భావిస్తే నేను వస్తాను” అని వ్రాశాడు. నేను ఆ జాబుకు స్వాగతం పలికాను. పోలక్ ఫినిక్సు వదిలి జోహన్సుబర్గు వచ్చేశాడు. నా ఆఫీసులో సహాయకుడిగా చేరి వకీలు వృత్తి ప్రారంభించాడు.

ఇంతలో ఒక స్కాచ్ థియోసాఫిస్టు వచ్చాడు. పోలక్‌ను అనుసరించమని ఆయనను ప్రోత్సహించాను. ఇంతకు పూర్వం ఆయనకు లా చదువు విషయంలో సాయం చేస్తూ వుండేవాణ్ణి. ఆయన పేరు మేకిస్‌టయర్.

ఈ విధంగా ఫినిక్సు ఆదర్శాలను వెంటనే ఆచరణలో పెట్టాలనే భావంతో, వాటికి విరుద్ధమైన జీవితపు లోతుల్లోకి ప్రవేశిస్తున్నట్లు నాకు అనిపించింది. భగవదేచ్ఛ మరోరకంగా వుండియుండకపోతే నిరాడంబర జీవనం అనే నెపంతో పరుచుకున్న మోహజాలంలో స్వయంగా చిక్కుకుపోయేవాణ్ణి. ఎవ్వరూ ఊహించని రీతిలో నేను, నా ఆదర్శాలు ఎలా రక్షింపబడ్డాయో రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను.

22. ఎవరిని దేవుడు రక్షిస్తాడో

త్వరగా హిందూదేశం వెళ్ళి స్థిరపడాలనే కాంక్ష వదులుకున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వస్తానని భార్యకు నచ్చచెప్పి దక్షిణ ఆఫ్రికా వచ్చాను. సంవత్సరం గడిచిపోయింది. తిరిగి దేశం వెళ్ళడం పడలేదు. అందువల్ల భార్యాబిడ్డల్ని పిలిపించాలని నిర్ణయించుకున్నాను.

పిల్లలు వచ్చారు. మా మూడో పిల్లవాడు రామదాసు. త్రోవలో మా వాడు కెప్టనుతో స్నేహం పట్టాడు. ఆయనతో ఆడుతూ వుండగా మా వాడి చేయి విరిగింది. కెప్టెను పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూచాడు. డాక్టరు ఎముకను సరిచేశాడు. జోహన్సుబర్గు చేరినప్పుడు కర్రచెక్కల మధ్య మెడలో వేసినపట్టీలో చెయ్యి కట్టివేసివున్నది. చేతికి తగిలిన గాయాన్ని డాక్టరుకు చూపించి నయం చేయించడం అవసరమని ఓడ డాక్టరు సలహా ఇచ్చాడు. కాని ఆ రోజుల్లో నా మట్టి పట్టీల చికిత్స జోరుగా సాగుతున్నది. నా దేశవాళీ చికిత్స మీద విశ్వాసం గల కక్షిదారులకు నేను మట్టితోను, నీటితోను చికిత్స చేస్తున్నాను. రామదాసును మరో వైద్యుని దగ్గరికి ఎలా పంపుతాను? వాడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. “నీ గాయనికి పట్టీలు వగైరా కట్టి చికిత్స చేస్తే భయపడతావా” అని మావాణ్ణి అడిగాను. రామదాసు నవ్వుతూ నాకు అనుమతి ఇచ్చాడు. ఈ వయస్సులో మంచి చెడ్డల పరిజ్ఞానం వాడికి లేకపోయినా డాక్టరీకి, దేశవాళీ వైద్యానికి గల తేడా వాడికి తెలుసు. నా ప్రయోగాలను గురించి వాడికి తెలుసు. నా మీద గల విశ్వాసంతో వాడు నా చేత చికిత్స చేయించుకునేందుకు భయపడలేదు.

వణుకుతున్న చేతులతో వాడి పట్టీ ఊడతీశాను. గాయం కడిగి శుభ్రం చేశాను, మట్టి పట్టీ గాయం మీద వేసి మొదటిలాగానే తిరిగి మెడకు పట్టీ కట్టివేశాను. డాక్టరు కట్టే పట్టీలకు కూడా ఇంత సమయం పడుతుందని ఓడ డాక్టరు చెప్పడం జరిగింది. మట్టి చికిత్స పై నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత ప్రయోగాలు చేయసాగాను. గాయాలు, జ్వరం, అజీర్ణం, పాండురోగం మొదలుగాగల వ్యాధులకు మట్టితోను, నీటితోను మరియు ఉపవాసాలు చేయించి చాలామందికి చికిత్స చేశాను. రోగుల్లో చిన్న పెద్ద అంతా వుండేవారు. చాలామందికి నా చికిత్స వల్ల రోగాలు నయమయ్యాయి. ఈ చికిత్సపై దక్షిణ ఆఫ్రికాలో నాకు గట్టి విశ్వాసం వుండేది. అంత విశ్వాసం ఇక్కడకు వచ్చాక తగ్గిపోయింది. ఈ ప్రయోగాలలో ప్రమాదం అధికమని అందువల్ల జాగరూకత అవసరమని అనుభవం వల్ల తెల్చుకున్నాను. ఇన్ని వివరాలు వ్రాస్తున్న కారణం నా ప్రయోగాలు సఫలమయ్యాయని చెప్పడానికి కాదు. ఏ ప్రయోగం కూడా పూర్తిగా సఫలం అని చెప్పడానికి వీలులేదు. డాక్టర్లు కూడా అలా చెప్పలేదు. అయితే క్రొత్త ప్రయోగాలు చేయదలచిన వారు మొదట తమతోనే ప్రారంభించాలని నా అభిప్రాయం. ఆ విధంగా చేస్తే నిజం త్వరగా బయటబడుతుంది. ఇట్టి ప్రయోగాలు చేసేవారిని భగవంతుడు రక్షిస్తాడు కూడా.

మట్టి ప్రయోగాలు ఎంత ప్రమాదకరమైనవో, యూరోపియన్లతో సంబంధం పెట్టుకోవడం కూడా అంత ప్రమాదకరమైన వ్యవహారమే. రంగులో తేడాయేగాని, అందరి వ్యవహారం ఒకటే. ఈ విషయం ముందుగా నేను గ్రహించలేదు. మిస్టర్ పోలక్‌ను నాతోబాటు వుండమని ఆహ్వానించాను. మేమిద్దరం సొంత సోదరుల్లా వుండేవారం. పోలక్ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ అమ్మాయితో చాలాకాలం నుండి అతనికి స్నేహం ఉన్నది. అయితే కొంత డబ్బు సమకూర్చుకున్న తరువాత వివాహం చేసుకుందామని ఎదురు చూడసాగాడు. రస్కిన్ రచనలు నాకంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు కాని పాశ్చాత్యదేశాలలో రస్కిన్ భావాలను పూర్తిగా అమలు చేయడాన్ని గురించి ఆయనకు ఆశలేదు.

“మనస్సులు కలిసిన తరువాత డబ్బు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం సరిపోదు. ఈ ప్రకారంగా అయితే బీదవాడెవడూ పెండ్లి చేసుకోవడానికి వీలు వుండదు. ఇప్పుడు మీరు నాతోబాటు ఉన్నారు. అందువల్ల ఇంటి ఖర్చును గురించిన సమస్య ఉండదు. మీరు త్వరగా పెండ్లి చేసుకోండి” అని నేను చెప్పాను.

నేనెప్పుడూ పోలక్‌తో రెండుసార్లు ఏ విషయమూ చర్చించలేదు. నా సలహాను వెంటనే అంగీకరించాడు. మిసెస్ పోలక్ ఇంగ్లాండులో ఉన్నది. ఆమెతో ఉత్తరాలు నడిచాయి. ఆమె అంగీకరించింది. కొద్ది మాసాలలోనే ఆమె పెండ్లి కోసం జోహన్సుబర్గు వచ్చింది. మేము పెండ్లికి ఖర్చు ఏమీ చేయలేదు. బట్టలు కూడా కొనలేదు. మత విధానాలతో కూడా వారికి పనిలేదు. మిసెస్ పోలక్‌ది క్రైస్తవమతం. మిష్టర్ పోలక్ యూదుడు. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం నీతికి సంబంధించిన ధర్మం మాత్రమే.

ఈ వివాహానికి సంబంధించిన విచిత్ర విషయం వ్రాస్తాను. ట్రాన్సువాలులో తెల్లవారి పెళ్ళిళ్ళను రిజిష్టరు చేసే అధికారి నల్లవాళ్ళ పెళ్ళిళ్ళను రిజిష్టరు చేయడు. ఈ వివాహంలో నేను సాక్షిని. వెతికితే మాకు ఒక తెల్లవాడు దొరికేవాడే కాని పోలక్ అందుకు అంగీకరించలేదు. మేము ముగ్గురం అధికారి దగ్గరికి వెళ్ళాం. నేను సాక్షిగా వున్నాను గనుక వరుడు వధువు ఇద్దరూ తెల్లవారేనని ఎలా నమ్ముతాడు. వివరాలు తెలుసుకోవడానికి వాయిదా వేద్దామని చూచాడు. మరునాడు నేటాలులో పండుగ దినం. పెండ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న మీదట ఈ విధమైన కారణాలతో ముహూర్తాన్ని వాయిదా వేయడం ఎవ్వరూ సహించలేకపోయారు. పెద్ద మేజిస్ట్రేటును నేను ఎరుగుదును. ఆయన ఈ శాఖకు పెద్ద అధికారి. దంపతులిద్దరినీ వెంటబెట్టుకొని వెళ్ళి ఆయనను కలిశాను. ఆయన నవ్వుతూ, నాకు జాబు వ్రాసి ఇచ్చాడు. ఈ విధంగా పెండ్లి రిజిస్టరు అయిపోయింది.

ఇప్పటివరకు కొంతమంది తెల్లవాళ్ళు మాతోబాటు వున్నారు. వారితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఒక అపరిచితురాలు మా ఇంట్లో ప్రవేశించిందన్నమాట. ఎన్నడూ ఏ విధమైన తంటా ఆమె వల్ల వచ్చినట్లు నాకు గుర్తులేదు. కాని అనేక జాతులవాళ్ళు, అనేక స్వభావాల వాళ్ళు హిందూ దేశస్థులు వచ్చి వెళ్ళేచోట, అనుభవం లేని నా భార్యవంటి వారు ఉన్న చోట, వారిద్దరికీ (శ్రీ. శ్రీమతి పోలక్) ఏమైనా ఇబ్బంది కలిగితే కలిగి యుండవచ్చు. ఒకే జాతివాళ్ళు వుండే కుటుంబాలలో కూడా వివాదాలు బయలుదేరుతూ ఉంటాయి. ఆ దృష్టితో చూస్తే విజాతీయులు వున్న మా గృహంలో వివాదాలు బాగా తక్కువేనని చెప్పవచ్చు. అసలు అట్టివి లేవనే చెప్పవచ్చు. నిజానికి సజాతీయులు, విజాతీయులు అను భావం మనస్సులో బయలుదేరే నీటితరంగం వంటిది. మేమంతా ఒకే కుటుంబీకులంగా వున్నాం.

వెస్ట్ వివాహం కూడా ఇక్కడే చేయాలని భావించాను. ఆ సమయంలో బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు యింకా నాకు కలుగలేదు. అందువల్ల పెండ్లి కాని స్నేహితులకు పెండ్లి చేయడం నా పని అయింది. వెస్ట్ తన తల్లి తండ్రుల్ని చూచేందుకు ఇంగ్లాండు బయలుదేరినప్పుడు పెండ్లి చేసుకురమ్మని అతనికి సలహా ఇచ్చాను. ఫినిక్సు ఇప్పుడు వారందరికీ స్థావరం అయింది. అంతా రైతులుగా మారిపోయారు. అందువల్ల వివాహానికి వంశవృద్ధికి భయపడనవసరం లేకుండా పోయింది.

లెస్టర్‌కు చెందిన ఒక అందమైన అమ్మాయిని పెండ్లి చేసుకొని వెస్ట్ వెంట తీసుకువచ్చాడు. ఆ సోదరి కుటుంబం వారు లెఫ్టర్‌లో చెప్పుల పరిశ్రమ యందు పనిచేస్తున్నారు. మిసెస్ వెస్ట్ కూడా కొంత కాలం చెప్పుల కార్ఖానాలో పనిచేసింది. ఆమెను ‘సుందరి’ అని పిలిచాను. ఆమె గుణాలు బహు సుందరమైనవి కావడమే అందుకు కారణం. వెస్ట్ తన అత్తగారిని కూడా వెంట తీసుకువచ్చాడు. ఆమె సుగుణాలు గల వృద్ధ వనిత. ఆమె ఇంకా జీవించే యున్నది. శ్రమ చేసే స్వభావంతో, నవ్వుముఖంతో మమ్మల్నందరినీ సిగ్గుపడేలాచేస్తూ ఉన్నది. నేను తెల్లవాళ్ళ పెళ్ళిళ్ళు చేయించినట్లే హిందూ దేశపు పురుషుల్ని కూడా పెళ్ళాం బిడ్డల్ని పిలిపించమని ప్రోత్సహించాను. దానితో ఫినిక్సు చిన్న ఊరుగా మారింది. అక్కడ అయిదారు హిందీ కుటుంబాలవారు కూడా స్థిరపడి అభివృద్ధికి రాసాగారు.

23. ఇంట్లో పెద్దమార్పులు - పిల్లలకు శిక్షణ

డర్బనులో వుంటున్నప్పుడు ఇంట్లో మార్పులు చేశాను. ఖర్చు విపరీతం అయినా నిరాడంబరంగా వుండాలని ప్రయత్నం చేశాను. జోహన్సుబర్గులో సర్వోదయ భావాలు నాచేత ఎక్కువ మార్పులు చేయించాయి.

బారిష్టరు ఇల్లు సాధ్యమైనంత నిరాడంబరంగా వుండాలని కృషి ప్రారంభించాను. కాని కొంత గృహాలంకరణ అవసరమనిపించింది. మనస్సులో మాత్రం నిరాడంబరత్వం మొదలైంది. ప్రతి పని స్వయంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇందు పిల్లలను కూడా చేర్చుకున్నాను.

బజారు నుండి రొట్టె కొని తేవడం మానివేశాము. ఇంట్లో కూనే సూచించిన ప్రకారం రొట్టె స్వయంగా తయారు చేసుకోవడం ప్రారంభించాము. మిల్లులో తయారైన పిండి వాడకం తగ్గిపోయింది. మిల్లులో పట్టిన పిండి కంటే చేతితో విసిరిన పిండిని ఉపయోగిస్తే ఆరోగ్యరీత్యాను, నిరాడంబరత్వరీత్యాను మంచిదని, డబ్బు కూడా మిగులుతుందని తేలింది. అందుకోసం ఆరు పౌండ్లు పెట్టి తిరగలి కొన్నాం. తిరగలి రాళ్ళు పెద్దవిగా వున్నాయి. ఇద్దరు మనుష్యులు ఆ తిరగలితో తేలికగా పిండి విసరవచ్చు. ఒక మనిషి తిరగలి విసరడం కష్టం. ఈ తిరగలితో నేను, పోలక్ మరియు మా అబ్బాయిలు పిండి విసిరే వాళ్ళం. అప్పుడప్పుడు కస్తూరిబాయి కూడా విసిరేది. అయితే ఆమెకు భోజనం తయారు చేసేపని అప్పగించాం. పోలక్ భార్య వచ్చిన తరువాత ఆమె కూడా సహకరించింది. ఆ కసరత్తు పిల్లలకు ఎంతో ప్రయోజనకారి అయింది. నేను బలవంతంగా వాళ్ళ చేత ఆ పని చేయించలేదు. వాళ్ళే ఆటగా భావించి తిరగలితో పిండి విసరడం ప్రారంభించారు. అలసిపోతే మానవచ్చునని వారికి అనుమతి ఇచ్చాం. కాని మా పిల్లలు ఇంకా చాలా మంది ఇట్టి పనులు బాగా ఉత్సాహంతో చేశారు. వాళ్ళను గురించిన వివరం ముందు ముందు వ్రాస్తాను. కొంతమంది ఇతర పిల్లలు కూడా పని చేయసాగారు. అయితే వాళ్ళంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తుండేవారు. అలిసిపోయాం అని చెప్పిన పిల్లలు బహు తక్కువగా వుండేవారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక నౌకరు ఉండేవారు. అతడు కూడా ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవాడు. అతడు చేసే పనికి పిల్లలు బాగా సహకరించేవారు. పాయిఖానా ఎత్తుకు పోయేందుకు మునిసిపాలిటీ వాళ్ళు వస్తూ ఉండేవారు. కాని పాయిఖానా గది శుభ్రం చేయడం, కూర్చునే స్థానాలు కడగడం మొదలుగాగల పనులు నౌకరు చేత చేయించేవారం కాదు. నౌకరు ఆ పని చేయాలని ఆశించడం కూడా సరికాదని మా అభిప్రాయం. ఆ పని మేము స్వయంగా చేస్తూ ఉండేవారం. మా పిల్లలకు కూడా అట్టి శిక్షణ లభిస్తూ ఉండేది. అందువల్ల మా పుత్రులందరు మొదటి నుండి పాయిఖానా ఎత్తివేయాలన్నా, పాయిఖానా దొడ్డి బాగు చేయాలన్నా అసహ్యించుకోలేదు. సాధారణమైన ఆరోగ్య నియమాలు వారు తేలికగా తెలుసుకున్నారు. జోహంసుబర్గులో మా అబ్బాయిలెవ్వరూ జబ్బు పడలేదు. సేవా కార్యక్రమాల్లో సంతోషంతో పాల్గొంటూ ఉండేవారు.

వారి అక్షరజ్ఞానం విషయమై నేను నిర్లక్ష్యంగా వ్యవహరించానని అనను, కాని దాన్ని హోమం చేయడానికి నేను వెనుకాడలేదు. నా యీ పొరపాటును గురించి నన్ను మాట అనడానికి మా అబ్బాయిలకు అవకాశం ఉన్నదని చెప్పగలను. వాళ్ళు అనేక పర్యాయాలు తమ అసంతృప్తిని వెల్లడించారు కూడా. ఈ వ్యవహారంలో కొంత దోషం నాదేనని ఒప్పుకోక తప్పదు. వాళ్ళకు అక్షర జ్ఞానం కలిగించాలనే కోరిక మిక్కుటంగా నాకు ఉండేది. అందుకు కృషి కూడా చేశాను. కాని ఆ పనికి ఎప్పుడూ ఆటంకాలు కలుగుతూ ఉండేవి. ఇంటి దగ్గర విద్యాభ్యాసానికి మరో ఏర్పాటు చేయలేదు. అందువల్ల వాళ్ళను నా వెంట ఆఫీసుకు తీసుకువెళుతూ ఉండేవాణ్ణి. ఆఫీసు రెండున్నర మైళ్ళ దూరాన ఉండేది. ప్రతిరోజూ రానుపోను ఉదయం సాయంత్రం కలిపి వాళ్ళకు నాకు అయిదు మైళ్ళ నడక కసరత్తుగా సాగుతూ ఉండేది. నడుస్తున్నప్పుడు త్రోవలో పాఠం చెబుదామని ప్రయత్నం చేసేవాణ్ణి. నా వెంట మరొకరెవ్వరూ లేనప్పుడు అది సాగేది. ఆఫీసులో కక్షిదారులతోను, గుమాస్తాలతోను నాకు సరిపోయేది. ఆ సమయంలో ఏదో ఒకటి వ్రాయమనో, చదవమనో వాళ్ళకు పని అప్పగిస్తూ ఉండేవాణ్ణి. ఆ కాసేపు చదివి తిరుగుతూ, ఇంటికి సామాన్లు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్లు. పెద్దవాడు హరిలాలు మినహా మిగతా పిల్లల చదువు ఇలాగే సాగేది. హరిలాలు దేశంలో ఉండిపోయాడు. మా పిల్లల చదువుకై ప్రతిరోజూ ఒక గంటసేపైనా నేను సమయం కేటాయించి ఉంటే వాళ్ళకు ఆదర్శ విద్య గరిపి ఉండేవాడినే. ఆ పట్టుదల నేను చూపలేదు. అందుకు నాకు, వాళ్ళకు విచారం కలిగింది. మా పెద్ద కుమారుడు నాకు వ్యతిరేకంగా మారాడు. అందువల్ల తన అభిప్రాయం వెల్లడించాడు. జనం మధ్యన కూడా ప్రకటించాడు. ఇతరులు ఉదారహృదయంతో ఈ దోషాన్ని అనివార్యమని భావించి ఊరుకున్నారు. ఈ దోషానికి నేను పశ్చాత్తాపపడలేదు. అయినా ఆదర్శ తండ్రి కాజాలకపోవడం వరకే అది నిమిత్తం. అజ్ఞానం వల్ల జరిగిన వాళ్ళ చదువును హోమం చేసిన మాట నిజమే. సద్భావంతో వాళ్ళను సేవారంగంలో ప్రవేశపెడదామనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను. అయితే వాళ్ళ శీలనిర్మాణం కోసం చేయవలసిందంతా చేశాను. లోటు ఏమీ చేయలేదు. ఇలా చేయడం ప్రతి తల్లి తండ్రి కర్తవ్యమని భావిస్తున్నాను.

అయినా నా పిల్లల శీలంలో ఎక్కడైనా దోషం ఉంటే అది మా దంపతుల దోషమని భావిస్తున్నాను. బిడ్డలకు తల్లిదండ్రుల రూపురేఖలు వారసత్వంగా లభించినట్లే వారి గుణదోషాలు కూడా తప్పక లభిస్తాయి. పరిసరాల ప్రభావం వల్ల వారిలో రకరకాల గుణదోషాలు చోటు చేసుకుంటాయి. అయితే అసలు ఆస్థి మాత్రం తండ్రి తాతల ద్వారానే వాళ్లకు లభిస్తుంది గదా! అట్టి దోషాలనుండి కొంతమంది పిల్లలు తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అది ఆత్మ స్వభావం. అట్టివారికి అభినందనలు.

నా పిల్లలకు జరిపిన ఇంగ్లీషు శిక్షణను గురించి పోలక్‌కు నాకు అప్పుడప్పుడు వేడివేడిగా చర్చలు జరిగాయి. బాల్యంనుండే తమ పిల్లల చేత ఇంగ్లీషు మాట్లాడించేందుకు తంటాలుపడే తల్లితండ్రులు తమకు, తమ దేశానికి ద్రోహం చేస్తున్నారని నా నిశ్చితాభిప్రాయం. ఇందువల్ల పిల్లలు తమ దేశ ధార్మిక, సాంఘిక వారసత్వం నుండి వంచితులవుతారని నా అభిప్రాయం. వాళ్ళు దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకు యోగ్యత తక్కువగా పొందుతారని నా భావన. ఈ కారణాల వల్లనే నేను నా పిల్లలతో కావాలనే గుజరాతీ భాషలో మాట్లాడుతూ ఉండేవాడిని. పోలక్‌కు నా ఈ పద్ధతి నచ్చలేదు. నేను పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్నానని పోలక్ భావించాడు. ఇంగ్లీషు వంటి వ్యాప్తి చెందిన భాషను పిల్లలు చిన్నప్పటినుండే నేర్చుకుంటే ప్రపంచంలో సాగే పరుగుపందెంలో పెద్ద అడుగు సహజంగా వేయగలుగుతారని ప్రేమతోను, పట్టుదలతోను నాకు నచ్చచెబుతూ ఉండేవాడు. ఆయన సలహా నాకు నచ్చలేదు. నా భావం నచ్చక చివరకు మౌనం వహించాడో లేదో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ చర్చలు జరిగి సుమారు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు నాకు కలిగిన భావాలు కాలం గడిచినకొద్దీ గట్టిపడ్డాయి. నా బిడ్డలు అక్షరజ్ఞానంలో వెనుకబడ్డారేమో కాని జ్ఞానం సులభంగా పొందగలిగారని చెప్పగలను. దాని వల్ల వాళ్ళకు, దేశానికి మేలు జరిగిందని చెప్పగలను. ఇవాళ వాళ్ళు విదేశస్థుల వలె లేరు. రెండు భాషలు వారికి సుపరిచితాలు. గొప్ప గొప్ప ఆంగ్లేయుల మధ్య వుండటం వల్ల, ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడబడే దేశంలో నివసించడం వల్ల వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడటం, వ్రాయడం బాగా నేర్చుకున్నారు.

24. జూలూల తిరుగుబాటు

దక్షిణ ఆఫ్రికాలో కాపురం పెట్టిన తరువాత స్థిరంగా కూర్చునే అదృష్టం నా నొసట రాసి లేదు. జోహన్సుబర్గులో కొంచెం స్థిరపడుతూ ఉండగా ఒక ఊహించని ఘట్టం జరిగింది. నేటాలులో జూలూలు తిరుగుబాటు చేశారని వార్త చదివాను. నాకు జూలూలతో శతృత్వం లేదు. వాళ్ళు ఒక్క హిందూ దేశస్థుడి జోలికి కూడా పోలేదు. తిరుగుబాటని, విద్రోహమని అనడం విషయంలో నాకు సందేహం ఉన్నది. అయితే ఆరోజుల్లో ఆంగ్ల సామ్రాజ్యం జగద్రక్షణకు అవసరమని నా అభిప్రాయం. హృదయపూర్తిగా ఆంగ్ల ప్రభుత్వం యెడ నాకు విశ్వాసం ఉంది. ఆ సామ్రాజ్యం నష్టపడటం నాకు ఇష్టం లేదు. అందువల్ల బలప్రయోగాన్ని గురించి గాని, నీతి అవినీతి అను విషయమై గాని నాకు పట్టింపు లేదు. నేను చేయబోయే చర్యను అది ఆపలేదు. నేటాలుకు కష్టం కలిగినప్పుడు రక్షణకోసం వాలంటీర్ల సైన్యం ఉన్నది. పని పడ్డప్పుడు ఆ సైన్యంలో క్రొత్తవాళ్ళను కొద్దిగా చేర్చుకునేవారు. వాలంటీర్ల సైన్యం ఈ తిరుగుబాటును శాంతింపచేసేందుకు బయలుదేరిందని చదివాను.

నేను నేటాలు వాసినేనని భావించాను. నేటాలుతో నాకు దగ్గర సంబంధం కూడా ఉంది. అందువల్ల నేను అక్కడి గవర్నరుకు జాబు వ్రాశాను. అవసరమైతే హిందూ దేశస్థుల దళాన్ని వెంటబెట్టుకొని యుద్ధరంగంలోకి వెళతానని, క్షత్రగాత్రులకు సేవచేస్తానని ఆ జాబులో వ్రాశాను. గవర్నరు వెంటనే సరేనంటూ సమాధానం పంపాడు. ఇంత త్వరగా అనుకూలంగా సమాధానం వస్తుందని ఊహించలేదు. అయితే జాబు వ్రాసేముందు ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను. గవర్నరు నుండి అనుకూలంగా సమాధానం వస్తే ఇప్పటి ఇల్లు వదిలివేయాలని, మి. పోలక్ చిన్న ఇల్లు తీసుకొని అందులో ఉండాలని నిర్ణయం గైకొన్నాము. ఇందుకు కస్తూరిబాయి అంగీకరించింది. ఇలాంటి నా నిర్ణయాలను ఆమె ఎప్పుడూ ఎదిరించలేదని నాకు బాగా గుర్తు. గవర్నరు నుండి సమాధానం రాగానే ఇంటి యజమానికి ఒక మాసం ముందుగా నోటీసు పంపి ఇల్లు ఖాళీ చేస్తామని తెలియజేశాము. కొంత సామాను ఫినిక్సుకు పంపాము. కొద్ది సామాను పోలక్ దగ్గర ఉంచాము. డర్బను చేరగానే మనుష్యులు కావాలని ప్రకటించాను. పెద్ద దళం అవసరం లేదని తెలిసి 24 మందిమి కలిపి దళంగా ఏర్పడ్డాం. వారిలో నేను గాక నలుగురు గుజరాతీలు ఉన్నారు. మిగతావారు మద్రాసుకు చెందిన గిర్‌మిటియా ప్రధ నుండి విముక్తి పొందినవారు. ఒకరు పఠాను. చీఫ్ మెడికల్ ఆఫీసరు నాకు “సార్జంట్ మేజర్” అను హోదా తాత్కాలికంగా ఇచ్చాడు. అది మా ఆత్మసన్మానానికి గుర్తుగా, పని సౌలభ్యం కోసం, అట్టి రివాజు వుండటం వల్ల ఆ ఆఫీసరు ఆ హోదా ఇచ్చాడు. నేను చెప్పిన ముగ్గురికి సార్జంటు హోదా మరియు కార్పోరల్ హోదా ఇచ్చాడు. డ్రస్సు కూడా ప్రభుత్వమే మాకు ఇచ్చింది. మా దళ సభ్యులు ఆరు వారాల పాటు సేవ చేశారు.

తిరుగుబాటు స్థావరం చేరి అక్కడ తిరుగుబాటు అనేదే లేదని తెలుసుకున్నాము. తిరుగుబాటు చేస్తూ ఎవ్వరూ కనబడలేదు. ఒక జూలూ సర్దారు క్రొత్తగా జూలూలపై విధించబడ్డ పన్ను చెల్లించవద్దని సలహా ఇచ్చాడట. పన్ను వసూలు చేసేందుకు వెళ్ళిన ఒక సార్జెంటును వాళ్ళు చంపివేశారట. అందువల్ల దీన్ని తిరుగుబాటు అని అన్నారు. ఏది ఏమైనా నా హృదయం మాత్రం జూలూలకు అనుకూలంగా ఉన్నది. ముఖ్య స్థావరం చేరిన తరువాత సంగ్రామంలో గాయపడిన జూలూలకు మేము సేవ శుశ్రూష చేయవలసి వచ్చింది. అందుకు నేను ఎంతో సంతోషించాను.

మెడికల్ ఆఫీసరు మాకు స్వాగతం పలికాడు. “తెల్లవాళ్ళెవళ్ళూ గాయపడ్డ జూలూలకు సేవ చేసేందుకు సిద్ధపడటం లేదు. నేను ఒక్కణ్ణి ఎంతమందికి సేవ చేయగలను? వాళ్ల గాయాలు మురుగుతున్నాయి. సమయానికి మీరు రావడం వాళ్ళ ఎడ దేవుడు చూపిన కృపయేయని నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే అతడు మాకు పట్టీలు, క్రిమినాశక మందులు, లోషన్లు వగైరాలు ఇచ్చి క్షతగాత్రులైన జూలూల దగ్గరికి తీసుకువెళ్ళాడు. మమ్మల్ని చూచి జూలూలు ఎంతో సంతోషించారు. తెల్ల సిపాయిలు తెరల వెనుకనుండి తొంగి చూస్తూ గాయాలకు మందులు రాయవద్దని, పట్టీలు కట్టవద్దని మాకు సైగ చేయసాగారు. మేము వాళ్ళ మాట పట్టించుకోనందున కోప్పడసాగారు. చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేలా గాయపడిన జూలూలను బండ బూతులు తిట్టడం ప్రారంభించారు.

తరువాత ఆ సిపాయిలతో కూడా నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళు నన్ను ఆదరించారు. 1896లో నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన కర్నల్ సార్క్సు, కర్నల్ వాయిలీలు అక్కడే ఉన్నారు. వాళ్ళు నేను చేస్తున్నపని చూచి నివ్వెరపోయారు. నన్ను ప్రత్యేకించి పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను జనరల్ మెకంజీ దగ్గరికి కూడా తీసుకువెళ్ళారు. వారికి నన్ను పరిచయం చేశారు. వీరంతా వృత్తిరీత్యా స్పార్క్సు. ఒక కసాయివాడకు యజమాని. కర్నల్ మెకంజీ నేటాలుకు చెందిన ప్రసిద్ధ రైతు. వారంతా వాలంటీర్లు. వాలంటీర్ల రూపంలో సైనిక శిక్షణ పొంది అనుభవం సంపాదించారు. మేము సేవ చేస్తున్న జూలూ క్షతగాత్రులంతా యుద్ధంలో గాయపడ్డ వారని పాఠకులు భావించవద్దు. వారిలో చాలామంది సందేహించి నిర్భందించబడ్డ ఖైదీలు. వారిని కొరడాతో కొట్టమని జనరల్ ఆదేశించాడు. కొరడా దెబ్బలు తగిలిన చోట బాగా కమిలిపోయింది. మరి కొంతమంది మిత్రులుగా భావించబడ్డ జూలూ జాతివాళ్ళు. ఈ మిత్రులు స్నేహాన్ని సూచించే గుర్తులు ధరించి ఉన్నారు. అయినా సైనికులు పొరపాటున వాళ్ళను కూడా గాయపరిచారు.

తెల్ల సిపాయిలకు కూడా మందులిచ్చే పని నాకు అప్పగించారు. డాక్టర్ బూథ్‌గారి చిన్న ఆసుపత్రిలో నేను ఒక సంవత్సరంపాటు ఈ పని నేర్చుకున్నాను. ఇది నాకు బహు తేలిక పని. ఈ పనివల్ల నాకు చాలా మంది ఆంగ్ల సైనికులతో మంచి పరిచయం ఏర్పడింది. యుద్ధంలో పాల్గొంటున్న సైన్యం ఒకే చోట ఉండదు. సంకటం ఏర్పడిందన్న చోటుకు పరిగెత్తాలి. వారిలో చాలామంది గుర్రపు రౌతులు. మా దళం ప్రధాన స్థావరాలనుండి తప్పుకొని వాళ్ళ వెంట వెళ్ళవలసి వచ్చింది. మా సరంజామా మేమే మోసుకెళ్ళాలి. ఒక్కొక్కసారి పగటిపూట 40 మైళ్ళ దూరం కాలి నడకన పయనం సాగించవలసి వచ్చేది. ఇక్కడ కూడా మాకు భగవంతుని కార్యమే లభించింది. పొరపాటువల్ల గాయపడ్డ జూలూలను కూడా డోలీలలో ఎత్తుకొని ఆసుపత్రికి చేర్చి అక్కడ వారికి సేవ శుశ్రూష చేయాలి. ఇదీ మా కార్యక్రమం.

25. హృదయ మథనం

జూలూ తిరుగుబాటు సమయంలో నాకు అనేక అనుభవాలు కలిగాయి. ఆలోచించడానికి చాలా సామగ్రి లభించింది. బోయరు యుద్ధంలో కనబడిన భయంకర రూపం ఇక్కడ కనబడలేదు. ఇక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు. మనుష్యుల వేట జరుగుతున్నదన్నమాట. నాతో మాట్లాడిన చాలామంది ఆంగ్లేయుల అభిప్రాయం కూడా ఇదే. ప్రొద్దున్నే సైనికులు లేవడం, వెంటనే గ్రామాలకు వెళ్ళడం, టపాకాయలు పేల్చినట్లు తుపాకులు పేల్చడం, ఆ ధ్వనులు దూరాన వున్న మాకు వినబడటం ఇదీ వరస. నేను ఈ వ్యవహారం సహించలేకపోయాను. అయినా చేదు గుటకలు మ్రింగవలసి వచ్చింది. నాకు లభించిన పని క్షతగాత్రులైన జూలూలకు సేవ చేయడం మాత్రమే. మేము ఆ పనికి పూనుకొని వుండకపోతే మరొకరెవ్వరూ ఆ పని చేసి ఉండేవారు కాదు. ఈ విధంగా చెప్పుకొని నా అంతరాత్మను శాంతపరచుకున్నాను.

ఇక్కడ జనసంఖ్య చాలా తక్కువ. పర్వతాలమీద, కొండచరియల్లోను, అమాయకులు, మంచివాళ్ళు, అడవి మనుష్యులుగా భావించబడే జూలూల గుండ్రంగా గోపురాల రూపంలో ఉండే కొద్ది గుడిసెలు తప్ప మరేమీ లేవు. అక్కడి దృశ్యాలు భవ్యంగా ఉన్నవి. ఇలాంటి జనసంచారం లేని చోట క్షతగాత్రుల్ని మోసుకొని తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు నేను విచార సాగరంలో మునిగిపోతూ ఉండేవాణ్ణి.

ఇక్కడే బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు నాలో పరిపక్వమయ్యాయి. నా అనుచరులతో కూడా కొద్దిగా ఈ విషయం చర్చించాను. ఈశ్వర సాక్షాత్కారానికి బ్రహ్మచర్యం అవసరమని నాకు అనుభూతి కలగలేదు. కాని సేవ చేయటానికి అవసరమని నాకు స్పష్టంగా బోధపడింది. ఈ విధమైన సేవ చేయవలసిన సందర్భాలు విస్తారంగా వస్తాయని, నేను భోగవిలాసాల్లో పడి, పిల్లల్ని కంటూ వాళ్ళ పోషణలో లీనమై ఉంటే సేవాకార్యం సరిగా చేయలేనని గ్రహించాను. బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం కావించకుండా జనాన్ని పెంచుకుపోతే సాంఘిక ప్రగతికోసం చేసే మానస కృషి క్రుంగి పోతుందని తెలుసుకున్నాను. వివాహం చేసుకొని కూడా బ్రహ్మచర్య వ్రతం సాగించితే కుటుంబ సేవ, సమాజ సేవ కుంటుబడదని భావించాను. ఈ రకమైన భావతరంగాల్లో తేలియాడుతూ ఎప్పుడెప్పుడు బ్రహ్మచర్యవ్రతానికి పూనుకుందామా అని తపన పడిపోయాను. ఈ రకంగా ఆలోచించడం వల్ల నాకు ఆనందం కలిగింది. ఉత్సాహం పెరిగింది. ఈ కల్పన నా సేవారంగాన్ని విశాలం చేసింది.

ఈ భావాలకు మనస్సులో రూపకల్పన చేస్తూ ఉండగా, ఇంతలో ఒకరు తిరుగుబాటు శాతించిందని, ఇక మనం వెళ్ళవచ్చునని వార్త అందజేశారు. మర్నాడు మీరు ఇళ్ళకు వెళ్ళిపోవచ్చునని మాకు ఆదేశం అందింది. కొద్దిరోజులకు ఎవరి ఇండ్లకు వారు చేరుకున్నారు. మా సేవాకార్యాన్ని అభినందిస్తూ గవర్నరు నాకు కృతజ్ఞతా పత్రం పంపించాడు.

ఫినిక్సు చేరుకొని బ్రహ్మచర్యాన్ని గురించి మగన్‌లాలుకు, ఛగన్‌లాలుకు, వెస్ట్ మొదలుగాగల వారికి ఉత్సాహంతో వివరించి చెప్పాను. అందరికీ నా అభిప్రాయం నచ్చింది. అంతా అందుకు అంగీకరించారు. అయితే ఆచరణకు సంబంధించిన ఇబ్బంది అందరి దృష్టికి వచ్చింది. అందరూ ఈ విషయమైన కృషి ప్రారంభించారు. చాలావరకు విజయం సాధించారు. ఇప్పటి నుండి జీవించి వున్నంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని నిర్ణయించుకున్నాను. అయితే ఈ వ్రత శక్తి, ఆచరణలో కలిగే కష్టాలు పూర్తిగా నా దృష్టికి రాలేదు. అందలి ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. బ్రహ్మచర్యవ్రతం యొక్క గొప్పతనం తరువాత బోధపడసాగింది. బ్రహ్మచర్య వ్రత రహిత జీవనం శుష్కమైనదిగాను, పశుజీవనం వలె నాకు కనబడసాగింది. సహజంగా పశుపు నిరంకుశమైనది. మనిషి యందలి మానవత్వం అంకుశానికి లోబడి ఉండటం చూస్తున్నాం. ధార్మిక గ్రంథాల్లో బ్రహ్మచర్యాన్ని గురించి వ్రాయబడిన రాతలు అతిశయోక్తులు అని అనిపించేవి. కాని ఆ వ్రతాన్ని ఆచరణలో పెట్టిన తరువాత బ్రహ్మచర్యం శక్తి ఎంత మహత్తరమైనదో బోధపడింది. ఆ రాతలు అతిశయోక్తులు కావని అనుభవం పొంది రాసినవని గ్రహించాను.

జీవనంలో ఎంతో మార్పుతేగల బ్రహ్మచర్యవ్రతానుష్ఠానం అంత సులభమైనది కాదు. ఇది కేవలం శరీరానికి సంబంధించినదికాదు. శరీరాన్ని అంకుశంలో వుంచడంతో బ్రహ్మచర్యం ప్రారంభం అవుతుంది. శుద్ధ బ్రహ్మచర్యపాలన యందు యోచనా సరళి నిర్మలంగా ఉండాలి. పూర్ణ బ్రహ్మచారి మనస్సునందు కలలో సైతం వికారాలు కలుగకూడదు. కలల్లో వికారాలకు సంబంధించిన యోచనలు వస్తూ ఉంటే బ్రహ్మచర్యం అపూర్ణమని భావించాలి.

నాకు బ్రహ్మచర్య వ్రతం అవలంబించినప్పుడు శారీరక సంబంధమైన ఇబ్బందులు బాగా కలిగాయి. ఇప్పుడు ఆ మహాకష్టాలు పూర్తిగా తొలగిపోయాయని గట్టిగా చెప్పగలను. కాని యోచనలమీద అవసరమైనంత విజయం లభించలేదు. ప్రయత్నంలో లోటు చేయలేదు. కాని ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. యోచనలు వచ్చి బుర్రలో జొరబడతాయి. వాటి రాకను గురించి ఈనాటి వరకు తెలుసుకోలేకపోయాను. యోచనల్ని ఆపివేయగల తాళంచెవి మనిషి దగ్గర ఉంటుంది. ఈ విషయమై నాకు సందేహం లేదు. అయితే ప్రతి వ్యక్తి ఈ తాళం చెవి తనదగ్గరే వెతుక్కోవలసి ఉంటుందని ఈనాడు చెప్పగలను. మహాపురుషులు తెలిపిన అనుభవాలు మనకు మార్గం చూపుతాయి. అవి సంపూర్ణం కావు. సంపూర్ణత్వం కేవలం ప్రభువు ప్రసాదంవల్లే లభిస్తుంది. అందువల్లే భక్తులు తమ తపశ్చర్యల ద్వారా పునీతము, పావనకరము అయిన రామనామాది మంత్రాలు మనకు అందించి వెళ్ళారు. పూర్తిగా ఈశ్వరార్పణ కానిదే యోచనలమీద విజయం లభించదు. ధర్మ గ్రంథాలన్నింటి యందు ఇట్టి వచనాలు నేను చదివాను. వాటి యందలి సత్యం ఈ బ్రహ్మచర్యానుష్టాన మందలి సూక్ష్మపాలనా ప్రయత్నాల యందు నాకు గోచరిస్తుంది. నా ఈ మహాప్రయత్నానికి సంబంధించిన కొద్ది చరిత్ర వచ్చే ప్రకరణంలో వివరిస్తాను. ప్రస్తుత ప్రకరణం ముగింపునందు వ్రతపాలన తేలికేనని అనిపించింది. వ్రతం ప్రారంభించగానే కొన్ని మార్పులు చేశాను. భార్యతో బాటు ఒకే పక్క మీద శయనించడం, ఆమెను ఒంటరిగా కలుసుకోవడం మానివేశాను. ఈ విధంగా ఏ బ్రహ్మచర్య వ్రతాన్ని ఇష్టంగానో, అయిష్టంగానో 1900 నుండి ప్రారంభించానో ఆ వ్రతారంభం నిజానికి 1906 మధ్య కాలంలో జరిగిందని చెప్పవచ్చు.

26. సత్యాగ్రహం పుట్టుక

జోహన్సుబర్గులో ఏదో ఒక ఘట్టం నా కోసం జరుగుతూ ఉంటున్నదని అనిపించసాగింది. ఆత్మశుద్ధి కోసం నేను చేసిందంతా సత్యాగ్రహానికి ముందు జరిగిన ఏర్పాటు అనిపించింది. బ్రహ్మచర్య వ్రతానికి పూనుకొనేవరకు నా జీవనంలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ అప్రత్యక్షరూపంలో నన్ను సత్యాగ్రహానికి సిద్ధం చేస్తాయనని ఇప్పుడు నాకు తోస్తున్నది. ‘సత్యాగ్రహం’ అను శబ్ద ఆవిర్భావానికి ముందే ఆ వస్తువు పుట్టుక జరిగిందన్నమాట. ఆ సమయంలో అది ఏమిటో నాకు తెలియదు. కాని పాసివ్‌రెజిస్టెన్స్ అను ఆంగ్లశబ్దం ద్వారా దాన్ని తెలుసుకోసాగాను. ఇంగ్లీషువాళ్ళ ఒక సభలో ఈ శబ్దానికి వాళ్ళు తీసుకుంటున్న సంకుచిత అర్థం ఏమిటో గ్రహించాను. అది బలహీనుల ఆయుధం అని వారు భావించారు. అందు ద్వేషానికి అవకాశం ఉన్నది. దాని చివరి అంశం హింసారూపంలో బహిర్గతం కావచ్చు. ఈ విధమైన వారి భావాన్ని నేను ఖండించవలసి వచ్చింది. హిందూ దేశస్థుల సంగ్రామం యొక్క యదార్థ స్వరూపాన్ని వారికి తెలియజేయవలసి వచ్చింది. హిందూ దేశస్థులికి ఈ సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు క్రొత్త శబ్దాన్ని సృష్టించవలసి వచ్చింది.

అందుకు తగిన మంచి శబ్దం స్ఫురణకు రాలేదు. తగిన శబ్దం కోసం బహుమతి నిర్ణయించి ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ప్రకటించి పాఠకులకు పోటీ పెట్టాము. ఈ పోటీ ఫలితంగా మగన్‌లాల్ గాంధీ సత్ - ఆగ్రహం రెండింటికీ సంధి కలిపి ‘సదాగ్రహం’ అను శబ్దం వ్రాసి పంపాడు. బహుమతి అతనికి లభించింది. కాని సదాగ్రహం అను శబ్దం ఇంకా స్పష్టంగా లేదని భావించి నేను సత్యాగ్రహం అని మార్చాను. గుజరాతీలో ఇది పోరు అను అర్థంలో ప్రచలితం అయింది.

ఈ సంగ్రామ చరిత్రయే దక్షిణ ఆఫ్రికాలో సాగిన నా జీవనంలో నేను కావించిన సత్యశోధన లేక సత్య ప్రయోగాల చరిత్ర అని చెప్పవచ్చు. ఈ చరిత్ర (ఎక్కువ భాగం) నేను యరవాడ జైల్లో వున్నప్పుడు వ్రాశాను. ఇదంతా నవజీవన్ పత్రికలో ప్రకటించబడింది. తరువాత అది దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను పేరిట విడిగా పుస్తకరూపంలో ప్రచురించబడింది. దాని ఆంగ్లానువాదం శ్రీ బాల్‌జీ గోవింద్‌జీ దేసాయి “కరెంట్ థాట్” లో ప్రచురించడం కోసం చేస్తున్నారు. దాన్ని త్వరగా ఇంగ్లీషులో పుస్తక రూపంలో ప్రకటించాలని నేను సూచించాను. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన పెద్ద ప్రయోగాలను గురించి తెలుసుకోదలచిన వారికి అది అందాలని నా ఉద్దేశ్యం.

గుజరాతీ పాఠకులు ఆ పుస్తకం చదివియుండకపోతే తప్పక చదవమని సిఫారసు చేస్తున్నాను. ఆ చరిత్రలో పేర్కొనబడ్డ ప్రధాన కధా భాగాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన మిగతా చిన్న పెద్ద నా వ్యక్తిగత ప్రయోగాలను గురించి వచ్చే ప్రకరణాల్లో వ్రాస్తాను. అవి పూర్తికాగానే హిందూ దేశంలో చేసిన ప్రయోగాలను తెలియజేయాలని భావిస్తున్నాను. అందువల్ల ప్రయోగాల సందర్భక్రమాన్ని సరిగా ఉంచుకోవాలని భావించేవారు. దక్షిణ ఆఫ్రికా చరిత్రకు సంబంధించిన ప్రకరణాలను ఎదురుగా ఉంచుకోవడం అవసరం.

27. ఆహారంలో వివిధ ప్రయోగాలు

మనోవాక్కాయాల ద్వారా బ్రహ్మచర్యవ్రతం ఎలా సాగించాలి అనేది ఒక యోచన అయితే సత్యాగ్రహ సమరానికి ఎక్కువ సమయం ఎలా మిగలాలి, హృదయ శుద్ధి అధికంగా ఎలా జరగాలి అనునది మరో యోచన. ఈ రెండు చింతలు లేక యోచనలు నన్ను ఆహారంలో ఎక్కువ మార్పులు చేయమని సంయమానికి అవి అవసరమని ప్రోత్సహించాయి. మొదట నేను ఆరోగ్యదృష్ట్యా ఆహారంలో మార్పులు చేసేవాణ్ణి. ఇప్పుడు ధార్మిక దృష్టితో చేయడం ప్రారంభించాను.

ఈసారి మార్పుల్లో ఉపవాసాలు, అల్పాహారాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. రుచులు మరిగిన జిహ్వ వాంఛల్ని రెచ్చగొడుతుంది. నాస్థితి కూడా అంతే. జననేంద్రియం మరియు స్వాదేంద్రియం మీద అధికారం సంపాదించుటకు నేను నానా అవస్థ పడవలసి వచ్చింది. ఈనాటికీ ఆ రెండిటిని పూర్తిగా జయించానని చెప్పలేను. నేను మొదటి నుండి అధికాహారిని. మిత్రులు నీవు సంయమంగా వున్నావని అనేవారు. దాన్ని నేను సంయమమని భావించలేదు. నామీద విధించుకున్న ఆ కొద్దిపాటి అంకుశాన్ని సడలనిచ్చి ఉంటే పశువుకంటే హీనంగా మారిపోయి వుండేవాణ్ణి. నష్టపడిపోయేవాణ్ణి. నా బలహీనతలు బాగా తెలుసుకున్నందువల్ల వాటి విషయమై చాలా జాగ్రత్తపడ్డాను. అందువల్లనే ఈ శరీరాన్ని ఇన్ని సంవత్సరాలనుండి నిలబెట్టి ఉంచగలిగాను. దానిచేత పని చేయించగలిగాను.

ఈ విధమైన జ్ఞానం సంపాదించి అట్టి వారి సాంగత్యం కూడా పొంది ఏకాదశి నాడు పండ్లు తిని ఉండటం, ఉపవాసం చేయడం ప్రారంభించాను. కృష్ణ జన్మాష్టమి మొదలుగా గల వ్రతాలు ప్రారంభించాను. అయితే పండ్లు తినడం, భోజనం చేయడం రెండిటిలో ఎక్కువ తేడా నాకు కనబడలేదు. పండ్లు తిండిగింజలు రెండిటి ద్వారా మనం పొందే ఆనందం ఒకే రకంగా ఉంటుంది. పండ్లు తినడం అలవాటు అయితే ఆనందం అధికంగా లభిస్తుంది. అందువల్ల రోజంతా ఉపవాసం చేయడమో లేక ఒక పూట భోజనం చేయడమో చేసి చూచాను. ప్రాయశ్చిత్తం నెపంతో కొన్ని పూటలు భోజనం మాని కూడా చూచాను.

దీనితో కొన్ని అనుభవాలు కలిగాయి. శరీరం ఎంత శుభ్రంగా ఉంటుందో అంతగా రుచియుందు కోరిక, ఆకలి పెరుగుతాయి. ఉపవాసాలు సంయమనానికేగాక, భోగాధిక్యతకు కూడా ఉపయోగపడతాయని తెలుసుకున్నాను. నాకేగాక నాతోబాటు ప్రయోగాలు చేసిన వారికి కూడా ఇదే విధమైన అనుభవం కలిగింది. శరీరాన్ని పుష్టిగా, తుష్టిగా వుంచుకోవడం, సంయమం అలవరుచుకోవడం, రుచుల వాంఛను జయించడం ఇవే నా లక్ష్యాలు. అందుకోసం తినే పదార్థాల్లో చాలా మార్పులు చేశాను. అసలు రసాస్వాదనం నీడలా మనిషిని సదా వెంబడిస్తూ ఉంటుంది. ఒక పదార్థం తినడం మానుకొని మరో పదార్థం పుచ్చుకోవడం ప్రారంభిస్తే అది ఎక్కువగా అలవాటవుతూ ఉంటుంది.

నా ప్రయోగాలలో కొంత మంది మిత్రులు కూడా పాల్గొంటూ ఉండేవారు. అట్టివారిలో హర్మన్ కేలన్ బెక్ ముఖ్యుడు. దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో ఆయనను పాఠకులకు పరిచయం చేశాను. అందువల్ల ఈ ప్రకరణంలో ఆ విషయం మళ్లీ వ్రాయను. ఆయన కూడా నాతో బాటు అన్ని ప్రయోగాలు చేశారు. ఏకాదశి ఉపవాసం, రోజంతా ఉపవాసం, ఒక పూట ఉపవాసం మొదలుగాగలవన్నీ చేశాడు. యుద్ధం తీవ్రంగా సాగుతూ ఉన్నప్పుడు నేను వారి ఇంట్లో ఉండేవాణ్ణి. మేము చేసిన ప్రయోగాలను గురించి చర్చించుకొనేవారం. మార్పు చేసినప్పుడు ఆయన అధికంగా సంతోషం పొందేవాడు. అప్పుడు మా సంభాషణ తీయగా సాగుతూ ఉండేది. తప్పు అని అనిపించేది కాదు. కాని తరువాత అనుభవం గడిచినకొద్దీ ఆ విధమైన రసవత్తర సంభాషణ కూడా తగదని తెలుసుకున్నాను. మనిషి రసానందం కోసం ఏమీ తినకూడదని కేవలం శరీర పోషణ కోసమే తినాలనీ తేల్చుకున్నాను. ప్రతి ఇంద్రియం కేవలం శరీరం కోసం, శరీరం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కోసం పనిచేస్తుంది. అప్పుడు అందలి రసానుభూతి తగ్గిపోతుంది. అప్పుడే ఇంద్రియాలు సహజంగా పనిచేస్తున్నాయని గ్రహించాలి. ఇట్టి సహజత్వం కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా తక్కువేనని మనం తెలుసుకోవాలి. ఆ కృషిలో శరీరాల్ని ఆహుతి చేయవలసి వచ్చినా వెనుకాడకూడదని గ్రహించాలి. ఇప్పుడు అంతా ఉల్టా వ్యవహారమే నడుస్తున్నది. నాశనమై పోయే శరీరం యొక్క శోభను పెంచడానికి, దాని వయస్సును పెంచడానికి ఇతర ప్రాణుల్ని బలిచేస్తున్నాం. అందువల్ల శరీరం, ఆత్మ రెండూ హూనమైపోతాయి. ఒక వ్యాధి వస్తే దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నించి రుచులు మరిగి, క్రొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. భోగశక్తిని కూడా పోగొట్టుకుంటాం. ఇదంతా మన కండ్ల ఎదుట జరుగుతూ ఉన్నది. మనం చూచి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నాం. కండ్లు మూసుకుంటున్నామన్నమాట.

ఆహార పదార్థాల మార్పును గురించి వివరించాను. అందలి అర్థాన్ని పాఠకులు గమనించాలి. ఆ దృష్టితో వాటి ఉద్దేశ్యం, వాటి వెనుక గల యోచనా సరళిని వివరించడం అవసరం కదా! అందుకే ఇంత వివరం వ్రాశాను.

28. నా భార్య యొక్క దృఢచిత్తత

కస్తూరిబాయి మీద జబ్బులు మూడుసార్లు దాడి చేశాయి. ఆ మూడింటిబారి నుండి ఆమె గృహ చికిత్సల ద్వారా తప్పించుకున్నది. మొదటి దాడి సత్యాగ్రహ సమరం సాగుతున్నప్పుడు జరిగింది. ఆమెకు మాటిమాటికి రక్తస్రావం జరుగుతూ ఉండేది. మిత్రుడగు ఒక డాక్టరు ఆపరేషన్ చేయడం అవసరమని చెప్పాడు. ఎంతో చెప్పిన మీదట ఆమె అందుకు అంగీకరించింది. శరీరం బాగా క్షీణించింది. మత్తుమందు ఇవ్వకుండానే డాక్టరు ఆపరేషన్ చేశాడు. కత్తులు పనిచేస్తున్నప్పుడు అపరిమితంగా బాధ కలిగింది. కాని ఎంతో సహనం, ధైర్యంతో ఆమె ఆ బాధను సహించింది. అది చూచి నేను నివ్వెరపోయాను. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. డాక్టరు, ఆయన భార్య ఇద్దరూ కస్తూరిబాయికి మంచి సేవ చేశారు.

ఇదంతా డర్బనులో జరిగింది. రెండు మూడు రోజుల తరువాత, నిశ్చింతగా జోహన్సుబర్గు వెళ్లమని డాక్టరు నాకు సలహా ఇచ్చాడు. నేను వెళ్లిపోయాను. కొద్దిరోజులు గడిచాయి. కస్తూరిబాయి శరీరం పూర్తిగా బలహీనమైపోయిందనీ లేవలేని స్థితిలో ఉన్నదనీ ఒక పర్యాయం మూర్ఛపోయిందని వార్త అందింది. నా అనుమతి లేకుండా కస్తూరిబాయికి మందుల్లో కలిపి మద్యం కాని, మాంసం కాని ఇవ్వవద్దని డాక్టరుకు తెలిపాను. డాక్టరు జోహాన్సుబర్గుకు ఫోను చేశాడు. ఫోను అందుకున్నాను. “మీ భార్యకు మాంసం కలిపిన చారుగాని లేక బీఫ్ టీగానీ ఇవ్వడం అవసరమని భావిస్తున్నాను. దయయుంచి అనుమతించండి” అని డాక్టరు అన్నాడు.

“నేను అందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే కస్తూరిబాయి స్వతంత్రురాలు. అపస్మారక స్థితిలో లేకపోతే ఆమెను అడగండి. ఆమె ఆంగీకరిస్తే తప్పక ఇవ్వండి” అని సమాధానం ఇచ్చాను. “ఇలాంటి సమయాల్లో నేను రోగిని అడగను. మీరు ఇక్కడికి రావడం అవసరం. నాకు ఇష్టమైన పదార్థం రోగికి ఇచ్చే స్వాతంత్ర్యం మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ భార్య ప్రాణాలకు బాధ్యత వహించను” అని డాక్టరు అన్నాడు. నేను ఆ రోజునే రైలు ఎక్కాను. డర్బను చేరాను. “మాంసం కలిపిన చారు పట్టిన తరువాతనే మీకు ఫోను చేశాను” అని డాక్టరు చెప్పాడు. “డాక్టరుగారూ! ఇది పూర్తిగా దగా” అని భావిస్తున్నాను అని అన్నాను. డాక్టరు దృఢమైన స్వరంతో ఇలా సమాధానం ఇచ్చారు. మందులు ఇచ్చే సమయంలో నేను దగాల్ని పట్టించుకోను. మేము డాక్టర్లం. మందులు ఇచ్చేటప్పుడు రోగుల్ని, వారి సంబంధీకుల్ని మోసం చేయడం పుణ్యమని భావిస్తాం అని ఆయన అన్నాడు. ఆ మాటలు విని నాకు విచారం కలిగింది. అయినా శాంతించాను. డాక్టరు నాకు మంచి మిత్రుడు, సజ్జనుడు కూడా. ఆయన, ఆయన భార్య నాకు ఎంతో ఉపకారం చేశారు. కాని ఈ వ్యవహారం నేను సహించలేకపోయాను.

“డాక్టర్‌గారూ! ఇక ఏం చేయదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఇష్టం లేకుండా ఆమెకు మాంసం పెట్టడానికి నేను సుతరాము అంగీకరించను. మాంసం తినకపోతే ఆమె చనిపోతే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” “మీ వేదాంతం నా ఇంట్లో నడవదు. మీరు మీ భార్యను నా ఇంట్లో ఉంచదలచుకుంటే నా ఇష్టం వచ్చిన ఆహారం పెడతాను. అవసరమైతే మాంసం పెడతాను. మీరు ఇందుకు ఇష్టపడకపోతే ఆమె నా ఇంట్లో మరణించడానికి నేను అంగీకరించను” అని డాక్టరు స్పష్టంగా చెప్పివేశాడు.

“అయితే ఆమెను తక్షణం తీసుకువెళ్ళమంటారా?” అని అడిగాను. “తక్షణం తీసుకువెళ్ళమని నేను అనలేదు. బంధనాలతో నన్ను బంధించవద్దని అంటున్నాను. అలా అయితే మేమిద్దరం రోగికి చేతనైనంతగా సేవ చేయగలం. మీరు నిశ్చింతగా వెళ్ళవచ్చు. ఇంత స్పష్టంగా చెబుతున్న మీరు అర్థం చేసుకోకపోతే ఇక చెబుతున్నా వినండి. మీరు మీ భార్యను తీసుకువెళ్ళండి” అని డాక్టరుగారు చెప్పివేశాడు. అప్పుడు నా వెంట మా ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. వాణ్ణి అడిగాను ‘మీ మాటే నా దృష్టిలో సరైనది. అమ్మను అడిగితే ఆమె మాంసం తినడానికి ఒప్పుకోదు’ అని మా అబ్బాయి అన్నాడు. నేను కస్తూరిబాయి దగ్గరికి వెళ్ళాను. ఆమె చాలా బలహీనంగా ఉన్నది. ఆమెను మాట్లాడించడానికి మనస్సు ఇష్టపడలేదు. అయినా ధర్మమని భావించి ఆమెకు విషయమంతా క్లుప్తంగా చెప్పాను. ఆమె దృఢనిశ్చయంతో ఇలా అన్నది “నేను ఏది ఏమైనా సరే మాంసం కలిపిన చారు పుచ్చుకోను. మానవజన్మ దుర్లభం. అది మాటిమాటికి లభించదు. అయినా మీ ఒళ్ళోచనిపోవడానికి ఇష్టపడతాను. కాని ఈ దేహాన్ని భ్రష్టం కానీయను” అని అన్నది. ఎన్నో విధాల ఆమెకు నచ్చచెప్పి చూచాను. “నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలని నీకు నిర్బంధం లేదు. మనకు తెలిసిన ఫలానా హిందువులు మాంసం, మద్యం పుచ్చుకున్నారు అని కూడా చెప్పాను. కాని ఆమె మాత్రం సరే అని అనలేదు. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి” అని అన్నది.

ఆమె మాటలునాకు సంతోషం కలిగించాయి. ఆమెను తీసుకు వెళ్ళడానికి భయం వేసింది. కాని గట్టి నిర్ణయానికి వచ్చి కస్తూరిబా అభిప్రాయం డాక్టరుకు చెప్పివేశాను. ఆయన మండిపడ్డాడు. “మీరు కసాయి భర్తగా కనబడుతున్నారు. ఇంత జబ్బుతో ఉన్న ఆమెకు ఈ విషయం చెప్పడానికి మనస్సు ఎలా ఒప్పింది? మీరు చేసింది సిగ్గుచేటు కాదా? ఇక చెబుతున్నా వినండి ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి ఆమె అనుకూల స్థితిలో లేదు. ఆమె శరీరం ఏమాత్రం వత్తిడి తగిలినా తట్టుకోదు. త్రోవలోనే ఆమె ప్రాణం పోవచ్చు. అయినా మీ మొండిపట్టు వదలకుండా ఆమెను తీసుకువెళతాను అని అంటే మీరు సర్వతంత్ర స్వతంత్రులు. నేను ఆమెకు మాంసం కలిపిన చారు పట్టకుండా ఒక్కరాత్రి అయినా నా ఇంట్లో వుండనీయను. మీ ఇష్టం అని అన్నాడు. అప్పుడు చిటపట చిటపట చినుకులు పడుతున్నాయి. స్టేషను దూరాన ఉన్నది. డర్బను నుండి ఫినిక్సుకు రైల్లో వెళ్ళాలి. స్టేషను నుండి ఆశ్రమానికి సుమారు రెండున్నర మైళ్ళు నడిచి వెళ్ళాలి. ప్రమాదం పొంచి ఉన్నది. దేవుడి మీద భారం వేశాను. ఒక మనిషిని ఫినిక్సుకు ముందుగా పంపించాను. ఫినిక్సులో మా దగ్గర ‘హమక్’ ఉన్నది. హమక్ అంటే చిన్న రంధ్రాలు గల బట్టతో తయారు చేయబడ్డ ఉయ్యాల లేక డోలీ అన్నమాట. హమక్ చివరికొనలు వెదురు బద్దలతో కట్టి వేస్తే రోగి హాయిగా అందు ఊగుతూ పడుకోవచ్చు. ఆ హమక్, ఒక సీసా వేడిపాలు, ఒక సీసా వేడి నీళ్ళు, ఆరుగురు మనుష్యులను స్టేషనుకు పంపమని వెస్ట్ కు కబురు పంపాను. రైలు కదిలే సమయం సమీపిస్తున్నందున రిక్షా తెమ్మని మనిషిని పంపాను. భయంకరమైన స్థితిలో ఉన్న కస్తూరిబాయిని ఆ రిక్షాలో ఎక్కించుకొని బయలుదేరాను. భార్యకు ధైర్యం చెప్పవలసిన అవసరం నాకు కలగలేదు. నాకు ఆమె ధైర్యం చెప్పడమే గాక “ఏం ఫరవాలేదు. మీరు భయపడకండి” అని ప్రోత్సహించింది. ఆమె అస్థిపంజరం అసలు బరువే లేదు. ఆమె ఏమీ తినలేదు. గుటక దిగడం లేదు. రైలు పెట్టెదాకా వెళ్ళాలంటే ప్లాటుఫారం మీద చాలా దూరం నడిచి వెళ్లాలి. లోపలికి రిక్షా పోనీయరు. నేను ఆమెను ఎత్తుకొని పెట్టెదాకా తీసుకువెళ్ళాను. ఫినిక్సుకు ఉయ్యాల తీసుకువచ్చారు. దానిలో రోగిని పడుకోబెట్టాము. వత్తిడి తగలకుండా ఆమెను ఫినిక్సు చేర్చాం. జలచికిత్స ప్రారంభించాను. నెమ్మదిగా ఆమె శరీరం పుంజుకోసాగింది.

ఫినిక్సు చేరుకున్న రెండు మూడు రోజులకు ఒక స్వామీజీ వచ్చాడు. నా పట్టుదలను గురించి ఆయన విన్నాడు. మా ఇద్దరికీ నచ్చచెప్పడం ప్రారంభించాడు. మణిలాలు, రామదాసులు ఇద్దరూ స్వామీజీ వచ్చినప్పుడు అక్కడే ఉన్నారని నాకు గుర్తు. మాంసాహారం తప్పుకాదని స్వామీజీ లెక్చరు ప్రారంభించాడు. మనుస్మృతి యందలి కొన్ని శ్లోకాలు వినిపించాడు. జబ్బులో వున్న భార్య ముందు ఈ రకమైన మాటలు మాట్లాడటం నాకు నచ్చలేదు. అయినా సభ్యతను దృష్టిలో పెట్టుకుని వూరుకున్నాను. మాంసాహారం సరియైనదేనని చెప్పడానికి మనుస్మృతి యందలి శ్లోకాలు వల్లించవలసిన అవసరం లేదు. ఆ శ్లోకాలు నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అనే వాదనను గురించి కూడా నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అయినా కాకపోయినా మాంసరహిత ఆహారం విషయమై నేను దృఢమైన నిర్ణయానికి వచ్చేశాను. దానికి తిరుగులేదు. పైగా కస్తూరిబాయి దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది. పాపం ఆమెకు శాస్త్రాల గొడవ ఏం తెలుసు? ఆమె దృష్టిలో తండ్రి తాతల ప్రవర్తనే ధర్మం. అదే ఆమెకు ప్రమాణం. మా పిల్లలకు తన తండ్రి అభిప్రాయాలు బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు స్వామీజీని ఆటలు పట్టించసాగారు. చివరికి కస్తూరిబాయి అందుకొని “స్వామీజీ! మీరు ఏం చెప్పినా సరే, నేను మాత్రం మాంసం ముట్టను. మాంసం తిని జబ్బు నయం చేసుకోవడానికి ఇష్టపడను. ఇక నా మెదడు కొరక్కండి. దయయుంచి నన్ను వదలండి. మిగతా విషయం నా బిడ్డల తండ్రితో తరువాత మాట్లాడండి” అని ఖరాఖండిగా చెప్పేసింది.

29. ఇంట్లో సత్యాగ్రహం

మొదటిసారి 1908లో నాకు జైలు ప్రాప్తి కలిగింది. జైల్లో ఖైదీల చేత అనేక నియమాల్ని పాటింపచేసేవారు. ఆ నియమాల్ని సంయమం కలిగిన వ్యక్తి లేక బ్రహ్మచారి స్వేచ్ఛగా పాటించాలని భావించేవాణ్ణి. ఉదాహరణకు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అనగా అయిదు గంటలకు భోజనం చేయడం. హిందూ దేశస్థులకు హబ్షీ ఖైదీలకు టీ ఇవ్వకపోవడం, మొదలుగాగలవి. అక్కడి నియమాల ప్రకారం రుచి కోసం తినవలసిన పరిస్థితి లేనేలేదు. జైలు డాక్టరుకు హిందూ దేశస్థుల కోసం నూరిన మసాలాలు వాడమని, ఉడుకుతూ వున్నప్పుడే ఆహారపదార్థంలో ఉప్పు కలపమని చెప్పాను. “ఇక్కడికి మీరు జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు రాలేదు. ఆరోగ్య దృష్ట్యా కావాలంటే ఉప్పు విడిగా తీసుకున్నా లేక ఉడుకుతూ వున్నప్పుడు పదార్థాల్లో వేసినా రెండూ ఒకటే” అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఎంతో ప్రయత్నించిన తరువాత అక్కడ కొద్ది మార్పులు చేయగలిగాము. కాని సంయమం దృష్ట్యా రెండు నిబంధనలు సరి అయినవే. ఇలాంటి నిబంధనలు బలవంతంగా విధించకపోతే అమలుకావు. స్వేచ్ఛగా పాటిస్తే మాత్రం అవి ఎంతో ప్రయోజనకరమైనవి. జైలునుండి విడుదల అయిన తరువాత ఆ మార్పులు వెంటనే చేశాను. టీ తీసుకోవడం మానివేశాను. సాయంత్రం త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాను. ఈనాటివరకు ఆ అలవాటు అలాగే ఉండిపోయింది.

ఒకసారి ఉప్పును కూడా మానవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియమం పది సంవత్సరాల వరకు నిరాటంకంగా సాగింది. ఆహారానికి సంబంధించిన అనేక పుస్తకాల్లో ఆరోగ్యదృష్ట్యా ఉప్పు తినవలసిన అవసరం లేదనీ, ఉప్పు వాడకపోతే ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందని చదివాను. బ్రహ్మచారులకు ఇందువల్ల లాభం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. శరీరం దుర్భలంగా ఉంటే పప్పు తినడం మానాలని కూడా చదివాను. అనుభవం మీద ఈ విషయం తెలుసుకున్నాను. కాని నేను వాటిని అప్పుడు మానలేకపోయాను. ఆపరేషను అయిన తరువాత కస్తూరిబాయికి రక్తస్రావం తగ్గిపోయింది. తరువాత అది మళ్ళీ ప్రారంభమైంది. తగ్గలేదు. జల చికిత్స వల్ల ప్రయోజనం చేకూరలేదు. నా చికిత్సల మీద ఆమెకు విశ్వాసం తక్కువే కాని ఆమెకు అవిశ్వాసం కూడా లేదు. ఇతర చికిత్సలు చేయించుకోవాలనే కోరిక కూడా ఆమెకు లేదు. చివరికి పప్పు ఉప్పు రెండూ వదలివేయమని సలహా ఇచ్చాను. ఎన్నో విధాల నచ్చచెప్పాను. అనేక గ్రంథాల నుండి ప్రమాణాలు కూడా చదివి వినిపించాను. అయినా ఆమె అంగీకరించలేదు. పప్పు ఉప్పు మానమని ఎవరైనా మీకు చెబితే మీరు మానతారా అని గట్టిగా అన్నది.

నాకు విచారం కలిగింది. సంతోషం కూడా కలిగింది. నా ప్రేమ ఎలాంటిదో పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. నీవు తప్పుగా యోచిస్తున్నావు. నాకు జబ్బు చేసి వైద్యుడు ఏ వస్తువైనా తినవద్దని చెబితే తప్పక వదిలివేస్తాను. అయినా, ఇదిగో, ఇప్పటినుండి ఒక్క సంవత్సరం కాలం పప్పు ఉప్పు వదిలి వేస్తున్నాను. నీవు మానినా సరే మానకపోయినా సరే నీ ఇష్టం. నేను మాత్రం వదిలివేస్తున్నాను అని అన్నాను. కస్తూరి బాయి గిలగిలలాడిపోయింది. “నన్ను క్షమించండి. మీ స్వభావం తెలిసి కూడా మామూలుగా అనేశాను. మీ మాట ప్రకారం నేను పప్పు ఉప్పు మానివేస్తాను. మీరు మాత్రం మానకండి నాకు పెద్ద శిక్ష పడుతుంది” అని అంటూ బ్రతిమలాడింది. “నీవు పప్పు ఉప్పు మానితే మంచిదే. దానివల్ల నీకు లాభం కలుగుతుందనే నమ్మకం నాకున్నది. కాని చేసిన ప్రతిజ్ఞను విరమించుకోవడం నా వల్ల కానిపని. ఆ విధంగా వాటిని మానడం వల్ల నాకు లాభం కలుగుతుంది. అందువల్ల ఒత్తిడి చేయవద్దు. నాకు కూడా పరీక్ష జరగాలికదా! నేను మానడం వల్ల నీ వ్రతానికి బలం చేకూరుతుంది.” అని ఆమెకు చెప్పాను. ఇక ఏం చేస్తుంది? “మీరు జగమొండి. ఎవ్వరి మాటా వినరు?” అంటూ కాసేపు కన్నీరు కార్చి తరువాత శాంతించింది.

దీన్ని నేను సత్యాగ్రహం అని అంటాను. నా జీవనపు కొన్ని మధురక్షణాల్లో ఇది కూడా ఒకటి అని భావిస్తున్నాను.

తరువాత కస్తూరిబాయి ఆరోగ్యం త్వరత్వరగా కుదుటపడసాగింది. పప్పు ఉప్పు రెండూ మానడం ఆమె జబ్బు నయం కావడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు లేక ఆ రెండూ మానడం వల్ల ఆహారంలో జరిగిన తదితర మార్పులు కారణం అయివుండవచ్చు లేక ఇటువంటి మార్పు చేయించటానికి నేను చూపిన జాగరూకత, తత్ఫలితంగా మానసికంగా వచ్చిన మార్పు కూడా కారణం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా చిక్కిపోయిన కస్తూరిబాయి శరీరం తిరిగి పుంజుకోసాగింది. దానితో వైద్యరాజ్‌గా నా పరపతి కూడా బాగా పెరిగిపోయింది. ఉప్పు, పప్పు రెండిటినీ త్యజించడం వల్ల నామీద మంచి ప్రభావం పడింది. వదలివేసిన తరువాత పప్పు, ఉప్పు తినాలనే కోరిక కూడా ఎన్నడూ కలగలేదు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇంద్రియాలు శాంతించినట్లు నాకు అనుభూతి కలిగింది. సంయమం వైపుకు మనస్సు పరుగెత్తసాగింది. ఏడాది గడిచిన తరువాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. హిందూ దేశం వచ్చిన కొంతకాలం తరువాతనే వాటిని పుచ్చుకున్నాను. ఒక పర్యాయం ఇంగ్లాండులో 1914లో ఉప్పు, పప్పు తిన్నాను. దేశం వచ్చాక ఎందుకు తినవలసి వచ్చిందో ఆ కథ మరో ప్రకరణంలో చెబుతాను.

ఇతరుల మీద కూడా పప్పు ఉప్పును గుర్తించిన ప్రయోగం చేశాను. దక్షిణ ఆఫ్రికాలో మంచి ఫలితం చేకూరింది. ఆయుర్వేద వైద్యం దృష్ట్యా వాటిని వదలడం వల్ల లాభం చేకూరుతుందని చెప్పగలను. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహమూ లేదు. భోగికి, సంయమం కలిగిన వ్యక్తికి మధ్య ఆహారం విషయంలోను, అలవాట్ల విషయంలోను వ్యత్యాసం వుండవలసిందే. బ్రహ్మచర్య వ్రతపాలనను గురించి కోరిక గల వ్యక్తి భోగిగా జీవనం గడిపి తిరిగి బ్రహ్మచర్యం గడపాలంటే చాలా కష్టం. అది అసంభవం కూడా. 

30. సంయమం

కస్తూరి బాయి జబ్బు పడినప్పుడు ఆ కారణంగా నా ఆహారంలో ఎన్నో మార్పులు జరిగాయని గత ప్రకరణంలో వ్రాశాను. ఇక ఇప్పుడు బ్రహ్మచర్యం దృష్ట్యా నా ఆహారంలో మార్పులు ప్రారంభమైనాయి.

పాలు విరమించడం మొదటి మార్పు. పాలు ఇంద్రియ వికారం కలిగించే పదార్థం. ఈ విషయం మొదట నేను శ్రీ రాయుచంద్‌భాయి వల్ల తెలుసుకున్నాను. అన్నాహారాన్ని గురించి ఇంగ్లీషు పుస్తకాలు చదవనప్పుడు ఈ భావం బాగా బలపడింది. కాని బ్రహ్మచర్య వ్రతం పట్టిన తరువాతనే పాలు తాగడం విరమించగలిగాను. శరీర పోషణకు పాలు అనవసరమని చాలాకాలం క్రితమే గ్రహించాను. అయితే వెంటనే పోయే అలవాటు కాదుగదా! ఇంద్రియదమనం కోసం పాలు త్రాగడం మానాలి అను విషయం తెలుసుకోగలిగాను. ఇంతలో గోవుల్ని, గేదెల్ని కసాయివాళ్లు ఎంతగా హింసిస్తున్నారో తెలిపే కరపత్రాలు, వివరాలు కలకత్తా నుండి నాకు చేరాయి. ఆ సాహిత్య ప్రభావం నా మీద అపరిమితంగా పడింది. ఈ విషయమై నేను కేలన్‌బెక్‌తో చర్చించాను.

కేలన్‌బెక్‌ను గురించి దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో వ్రాశాను. గత ప్రకరణంలో కూడా కొద్దిగా వ్రాశాను. ఇక్కడ రెండు మాటలు వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. ఆయన మి. ఖాన్ స్నేహితుడు. తనలో వైరాగ్య ప్రవృత్తి నిండి ఉన్నదని ఆయన గ్రహించాడు. అందువల్లనే ఖాను ఆయనను నాకు పరిచయం చేశాడని నా అభిప్రాయం. పరిచయం అయినప్పుడు ఆయన పెట్టే ఖర్చుల్ని చూచి, ఆయన హంగులు, దర్పం చూచి నేను బెదిరిపోయాను. అయితే మొదటి కలయికలోనే ఆయన ధర్మాన్ని గురించి ప్రశ్నలు వేశాడు. మాటల్లో బుద్ధ భగవానుని త్యాగాన్ని గురించి చర్చ జరిగింది. ఆ తరువాత మా పరిచయం ఎక్కువైంది. దానితో మా సంబంధం గాఢమైపోయింది. నేను చేసే ప్రతి ప్రయోగం తాను కూడా చేయాలనే స్థితికి ఆయన వచ్చాడు. ఆయన ఒంటరివాడు. తన ఒక్కడి కోసం ఇంటి అద్దె వగైరాలు గాక నెలకు 1200 రూపాయలు దాకా ఖర్చు పెడుతుండేవాడు. తరువాత నిరాడంబరత్వం వైపుకు మొగ్గి చివరికి నెలకు 120 రూపాయల ఖర్చుకు చేరుకున్నాడు. నా కాపురం ఎత్తివేశాక, మొదటిసారి జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత నుండి ఇద్దరం కలిసి వుండసాగాం. అప్పుడు మా ఇద్దరి జీవనం మొదటి కంటే కఠోరంగా వుండేది. మేము కలిసి ఉంటున్నప్పుడే పాలు మానాలని చర్చ జరిగింది. మి. కేలన్‌బెక్ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ “పాల దోషాలను గురించి మనం తరుచు చర్చిస్తున్నాం. పాలు తాగడం విరమించి వేయకూడదా? పాల అవసరం లేదు కదా!” అని అన్నాడు. ఆయన మాటలు విని నాకు ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. ఆయన సలహాను సమర్ధించాను. మేమిద్దరం ఆ క్షణాన టాల్‌స్టాయ్ ఫారంలో పాలు తాగడం మానివేశాం. 1912లో ఈ ఘట్టం జరిగింది.

అంతటితో శాంతి లభించలేదు. పాలు విరమించిన తరువాత కొద్దిరోజులకు కేవలం పండ్లు మాత్రమే భుజించి ఉందామని నిర్ణయానికి వచ్చాం. కారు చవుకగా దొరికే పండ్లు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాం. కడు నిరుపేద జీవించే పద్ధతిన జీవించాలని మా ఇద్దరి ఆకాంక్ష. ఫలాహారంలో ఉండే సౌకర్యాలను ప్రత్యక్షంగా పొందాము. పొయ్యి వెలిగించవలసిన అవసరం లేకుండా పోయింది. పచ్చి వేరుసెనగపప్పు, అరటిపండ్లు, ఖర్జూరం పండ్లు, నిమ్మపండ్లు, పప్పునూనె ఇవే నా ఆహారం. బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని భావించేవారికి ఒక హెచ్చరిక చేయడం అవసరం. బ్రహ్మచర్యానికి, ఆహార పదార్థాలకు దగ్గర సంబంధం ఉన్నదని చెప్పానేగాని అసలు రహస్యం మనస్సుకు సుబంధించిందే. మైలపడ్డ మనస్సు ఉపవాసాలు చేసినా శుభ్రపడదు. ఆహారం దానిమీద ఏమీ పనిచేయదు. ఆలోచనలవల్ల, భగవన్నామస్మరణవల్ల, భగవంతుని దయవల్ల మనోమాలిన్యం తొలగుతుంది. అయితే మనస్సుకు, శరీరానికి దగ్గర సంబంధం ఉంటుంది. వికారంతో నిండిన మనస్సు వికారం కలిగించే ఆహారాన్ని వెతుకుతుంది. వికారంతో నిండిన మనస్సు రకరకాల రుచుల్ని, భోగాల్ని వెతుకుతుంది. ఆ రుచుల ఆ భోగాల ప్రభావం మనస్సు మీద పడుతుంది. అందువల్ల ఆ పరిస్థితుల్లో ఆహార పదార్థాల మీద అంకుశం తప్పదు.

వికారంతో నిండిన మనస్సు శరీరంమీద, ఇంద్రియాల మీద విజయం సాధించకపోవడమే గాక, వాటికి లోబడి పనిచేస్తుంది. అందువల్ల శరీరానికి విశుద్ధమైన ఆహారం, తక్కువగా వికారం కలిగించే పదార్థాలు, అప్పుడప్పుడు ఉపవాసాలు, నిరాహారాలు అవసరం. కొందరు సంయమం గలవారు ఆహారాన్ని గురించి ఉపవాసాలను గురించి పట్టించుకోనవసరం లేదని భావిస్తారు. మరికొందరు ఆహారం, నిరాహారం ఇవే సంయమానికి మూలాధారాలని భావిస్తారు. ఇద్దరూ భ్రమలో పడి ఉన్నారని నా అభిప్రాయం. నాకు కలిగిన అనుభవంతో చెబుతున్నాను. సంయమం వైపుకు మరలుతున్న మనస్సుకు ఆహారం విషయమై వహించే జాగరూకతతోబాటు, నిరాహారం మొదలగునవి ఎంతో ఉపయోగపడతాయి. వీటి సహాయం లేనిదే మనస్సు నిర్వికార స్థితిని పొందలేదు. 

31. ఉపవాసాలు

పాలు, భోజనం మాని పండ్లు తినడం ప్రారంభించాము. సంయమం కోసం ఉపవాసాలు కూడా ప్రారంభించాను. మి. కేలన్‌బెక్ తాను కూడా నాతో బాటు వీటిని ప్రారంభించాడు. ఇంతకు పూర్వం నేను ఆరోగ్య దృష్ట్యా ఉపవాసాలు చేసేవాణ్ణి. ఇంద్రియదమనానికి ఉపవాసాలు బాగా పనిచేస్తాయని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. వైష్ణవ కుటుంబంలో జన్మించాను. మా అమ్మ కఠోరవ్రతాల్ని అనుష్టించేది. ఆ ప్రభావం వల్ల నేను మన దేశంలో వున్నప్పుడు ఏకాదశి వ్రతాన్ని అనుష్టించాను. అయితే అప్పుడు మా తల్లితండ్రుల్ని సంతోషపరిచేందుకు చేస్తూ వుండేవాణ్ణి. ఇట్టి వ్రతాలవల్ల ప్రయోజనం ఉంటుందో, ఉండదో ఆ రోజుల్లో నాకు తెలియదు. తరువాత ఒక మిత్రుణ్ణి చూచి, ఆ ప్రకారం బ్రహ్మచర్య వ్రతపాలన కోసం నేను కూడా ఏకాదశి ఉపవాసాలు ప్రారంభించాను. సామాన్యంగా జనం ఏకాదశినాడు పండ్లు పాలు తీసుకొని వ్రతపాలన చేశామని అనుకుంటూ వుంటారు. కాని పండ్లమీద ఆధారపడి నేను ఉపవాసాలు ఇప్పుడు ప్రతిరోజూ చేయసాగాను. మంచినీళ్ళు త్రాగుతూ ఉండేవాణ్ణి. అది శ్రావణమాసం. రంజాను, శ్రావణమాసం రెండూ ఒకేసారి వచ్చాయి. వైష్ణవ కుటుంబాల్లో వైష్ణవ వ్రతాలతో బాటు శైవ వ్రతాల్ని కూడా పాటిస్తూ ఉండేవారు. మా ఇంట్లో వాళ్లు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళినట్లే శైవ దేవాలయాలకు కూడా వెళుతూ ఉండేవారు. శ్రావణమాసంలో ప్రతివారూ ఏదో వ్రతానుష్టానం చేస్తూ ఉండేవారు. అది చూచి నేను కూడ శ్రావణమాసాన్ని ఎంచుకున్నాను.

ఈ ప్రయోగం టాల్‌స్టాయి ఆశ్రమంలో ప్రారంభించాను. సత్యాగ్రహాల కుటుంబాల వారిని పిలిపించి వారిని అక్కడ వుంచి నేను, కేలన్‌బెక్ వారితో బాటు ఉన్నాం. వారిలో పిల్లలు, నవయువకులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం పాఠశాల స్థాపించాం. నవయువకుల్లో అయిదారుగురు మహ్మదీయులు ఉన్నారు. ఇస్లాం మత విధుల్ని నిర్వహించుటకు నేను వారికి సహాయం చేశాను. నమాజు చేసుకునేందుకు వాళ్ళకు సౌకర్యం కల్పించాను. ఆశ్రమంలో పారశీకులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వారందరినీ మీమీ మత విధుల్ని పాటించమని ప్రోత్సహించాను. ముస్లిం యువకుల్ని ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. నేను ఉపవాసాలు చేస్తున్నాను. హిందువులు, క్రైస్తవులు, పారశీకులను కూడా ముహమ్మదీయ యువకులతో బాటు ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. సంయమంతో అందరికీ తోడ్పడవలెనని నచ్చ చెప్పాను. చాలామంది ఆశ్రమవాసులు నా సలహాను పాటించారు. అయితే హిందువులు, పారశీకులు మాత్రం పూర్తిగా మహ్మదీయులకు సహకరించలేదు. వాస్తవానికి అట్టి అవసరం కూడా లేదు. మహ్మదీయులు సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తుండేవారు. కాని మిగతా వారు ముందే భోజనం చేసి మహ్మదీయులకు వడ్డన చేసేవారు. వీరికోసం ప్రత్యేకించి పదార్థాలు తయారు చేసేవారు. మహ్మదీయులు సహరీ అంటే ఒకపూట భోజనం చేస్తూండేవారు. ఆ విధంగా ఇతరులు చేయవలసిన అవసరం లేదు. మహ్మదీయులు పగలు మంచినీళ్ళు త్రాగేవారు కారు. ఇతరులు మంచినీళ్ళు త్రాగవచ్చు.

ఈ ప్రయోగం వల్ల ఉపవాసాల, ఒక పూట నిరాహారదీక్ష యొక్క మహత్తు అందరికీ బోధపడింది. ప్రేమ, ఆదరాభిమానాలు ఒకరికొకరికి కలిగాయి. ఆశ్రమంలో ఆహారం విషయమై నియమాలు ఏర్పాటు చేశాం. ఈ విషయంలో నా మాటను అంతా అంగీకరించారు. అందుకు నేను కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఉన్నది. ఉపవాసం నాడు మాంసాహార నిషేధం మహ్మదీయులకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. కాని నాకు ఎవ్వరూ ఈ విషయం తెలియనీయలేదు. అంతా కలిసి మెలిసి ఆనందంగా ఉన్నారు. హిందూ యువకులు ఆశ్రమ నియమాలకు అనుకూలంగా కొన్ని రుచికరమైన వంటకాలు చేసి అందరికీ తినిపిస్తూండేవారు. నా ఉపవాసాలను గురించి వ్రాస్తూ ఇతర విషయాలు కావాలనే ఇక్కడ పేర్కొన్నాను. ఇంతటి తీయని విషయాలు తెలిపేందుకు మరోచోట అవకాశం లభించకపోవడమే అందుకు కారణం. నాకు ఇది సబబు అని తోచిన విషయాలపై అనుచరుల సమ్మతి కూడా పొందుతూ వుండేవాణ్ణి. ఇది నా ప్రవృత్తిగా మారింది. ఉపవాసాలు, ఒకపూట భోజనాలు అందరికీ క్రొత్త. అయినా నేను ఆ విధుల్ని అమలుపరచగలగడం విశేషం.

ఈవిధంగా ఆశ్రమంలో సంయమ వాతావరణం సహజంగా ఏర్పడింది. ఉపవాసాల వల్ల ఒకపూట భోజనాలవల్ల సత్ఫలితాలు కలిగాయి. ఆశ్రమవాసులందరి మీద వీటి ప్రభావం ఏ పరిమాణంలో పడింది అని అడిగితే స్పష్టంగా చెప్పడం కష్టం. అయితే ఆరోగ్యరీత్యానేగాక, విషయవాంఛల రీత్యా కూడా నాలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పగలను. ఇట్టి ప్రభావం అందరి మీద పడిందా అని అడిగితే చెప్పడం కష్టం. విషయ వాంఛలు అణగి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే అందుకు ప్రత్యేకించిన ఉపవాసాలు అవసరం. అయితే ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు కోరికలు తీవ్రం అవుతాయని కొందరికి కలిగిన అనుభవం. అసలు అన్నిటికీ మూలం మసస్సు. ఆ మనస్సును కంట్రోలులో పెట్టుకోకుండా శారీరకంగా ఎన్ని ఉపవాసాలు చేసినా, వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదు. గీతయందలి ద్వితీయ అధ్యాయమందు గల క్రింది శ్లోకం పరిశీలించదగినది.

“విషయావినివర్తన్తే నిరాహారస్య దేహినః రసవర్జరస్యోప్యస్యపరం దృష్ట్వా నిర్తతే”

అనగా నిరాహారియైనవానికి శబ్దాది విషయముల ఒత్తిడి తగ్గును. కాని విషయవాసన మిగిలియే ఉండును. అది పరమాత్మ దర్శనమువల్ల తొలగును.

సారాంశమేమనగా ఉపవాసాదులు సంయమానికి సాధనాల రూపంలో అవసరం. కాని అదే సర్వస్వం మాత్రం కాదు. శరీరరీత్యా ఉపపాసాలతోబాటు మనస్సు రీత్యా ఉపవాసాలు చేయకపోతే అది దంభానికి కారణభూతం అవుతుంది. అది హాని కూడా కలిగించవచ్చు. 

32. గురువుగా

దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో విస్తారంగా వ్రాయకుండా కొద్దిగా వ్రాసిన విషయం యిక్కడ పేర్కొంటున్నందున రెండింటి సంబంధం పాఠకులు గ్రహింతురుగాక. టాల్‌స్టాయి ఆశ్రమంలో బాలురకు బాలికలకు శిక్షణ ఇచ్చేందుకై ఏర్పాటు చేయవలసి వచ్చింది. హిందూ ముస్లిం క్రైస్తవ యువకులతో బాటు కొంతమంది బాలికలు కూడా మాతో ఉన్నారు. వారి శిక్షణ కోసం వేరే ఉపాధ్యాయుణ్ణి నియమించడం కష్టమని తేలింది. దక్షిణ ఆఫ్రికాలో భారతీయ ఉపాధ్యాయులు బహుతక్కువ. వున్నా పెద్ద జీతం యివ్వందే దర్బనుకు 21 మైళ్ళ దూరాన వున్న ఆశ్రమానికి ఎవరు వస్తారు. అంత డబ్బు నాదగ్గర లేదు. పైగా యిప్పటి విద్యావిధానం నాకు యిష్టం లేదు. సరియైన పద్ధతిని నేను ప్రయోగించి చూడలేదు. తల్లి దండ్రుల దగ్గర గరపబడే విద్య సరియైనదని నా భావం. అందువల్ల బయటి వారి సాయం తక్కువగా వుండాలని భావించాను. టాల్ స్టాయి ఆశ్రమం ఒక కుటుంబం వంటిదని, దానికి నేను తండ్రి వంటివాడినని అందువల్ల నేనే పిల్లల శిక్షణకు బాధ్యత వహించాలని నిర్ణయించాను. అయితే అందు పలు దోషాలు వున్నాయి. ఈ యువకులు జన్మించినప్పటినుండి నాదగ్గర లేరు. వేరు వేరు వాతావరణాల్లో పెరిగినవారు. వేరు వేరు మతాలకు చెందినవారు. ఇట్టి స్థితిలో తండ్రిగా బాధ్యతను ఎలా నిర్వహించగలనా అని అనుమానం కలిగింది. అయితే నేను హృదయ శిక్షణ అనగా మంచి నడతకు సంబంధించిన శిక్షణకు ప్రాముఖ్యం యిచ్చాను. ఏ వాతావరణంలో పెరిగినా, ఏ వయస్సువారికైనా, ఏమతాలవారి కైనా అట్టి శిక్షణ యివ్వవచ్చునని నా భావం. ఆ భావంతో రాత్రింబవళ్ళు ఆ పిల్లలతో బాటు తండ్రిగా వుండసాగాను. మంచి నడత అనగా శీలం ప్రధానమైనదని భావించాను. పునాది గట్టిగా వుంటే తరువాత విషయాలు పిల్లలు ఇతరుల ద్వారానో లేక తమంత తాముగానో నేర్చుకోగలరని నా అభిప్రాయం. అయినా అక్షర జ్ఞానం కొద్దో గొప్పో వారికి కల్పించాలని భావించి క్లాసులు ప్రారంభించాను. మి. కేలన్‌బెక్ ప్రాగ్జీ దేశాయిగారల సాయం పొందాను. శారీరక శిక్షణను గురించి నాకు తెలుసు. అది ఆశ్రమంలో వారికి సహజంగానే లభిస్తూవుంది.

ఆశ్రమంలో నౌకర్లు లేరు. పాయిఖానా దొడ్లు బాగుచేసుకోవడం నుండి వంటపని వరకు ఆశ్రమవాసులే చేసుకోవాలి. పండ్ల చెట్లు చాలా వున్నాయి. క్రొత్తగా నాట్లు వేయాలి. మి. కేలన్‌బెక్‌కు వ్యవసాయం అంటే ఇష్టం. ప్రభుత్వ ఆదర్శతోటలకు వెళ్ళి అభ్యసించి వచ్చారు. వంటపని చేస్తున్న వారిని మినహాయించి మిగతా పిన్నలు, పెద్దలు మొదలుగాగల ఆశ్రమవాసులందరూ ఏదో ఒక సమయంలో తోటలో కాయకష్టం చేసి తీరాలి. పిల్లలు ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేవారు. పెద్ద పెద్ద గుంటలు త్రవ్వడం, చెట్లు నరకడం, బరువు మోయడం మొదలగుగాగల పనులుచేయడం వల్ల వాళ్ళ శరీరాలు గట్టి పడ్డాయి. ఈ పనులు అంతా సంతోషంతో చేస్తూ వుండేవారు. అందువల్ల వేరే వ్యాయామం అనవసరం అని తేలింది. ఈ పనులు చేయమంటే అప్పుడప్పుడు కొందరు పిల్లలు నఖరాలు చేస్తూ భీష్మిస్తూవుండేవారు. వారిని గురించి పెద్దగా పట్టించుకునేవాణ్ణికాదు. కఠినంగా వ్యవహరించి వాళ్ళ చేత పనిచేయిస్తూ వుండేవాణ్ణి. అప్పుడు సరేనని వెంటనే మరచిపోతూ వుండేవారు. ఈ విధంగా మా బండి సాగుతూ వున్నది. అయితే వాళ్ళ శరీరాలకు పుష్టి చేకూరింది.

ఆశ్రమంలో ఎవ్వరూ జబ్బు పడలేదు. గాలి, నీరు, పుష్టికరమైన ఆహారం యిందుకు కారణమని చెప్పవచ్చు. శారీరక శిక్షణతో బాటు వృత్తి విద్య కూడా గరపడం అవసరమని భావించాను. మి. కేలన్‌బెక్ ట్రేపిస్ట్ మఠం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టడం నేర్చుకువచ్చారు. వారి దగ్గర చెప్పులు కుట్టడం నేర్చుకొని యిష్టపడిన పిల్లలకు నేర్పాను. వడ్రంగం పని మి.కేలన్‌బెక్‌కు కొంతవచ్చు. అది వచ్చిన మరో వ్యక్తి కూడా ఆశ్రమంలో వున్నాడు. అందువల్ల ఆ పని కూడా కొందరికి నేర్పుతూ వున్నాం. వంటచేయడం పిల్లలంతా నేర్చుకొన్నారు. ఈ పనులన్నీ పిల్లలకు క్రొత్తే. కలలోనైనా యిట్టి పనులు నేర్చుకోవాలని వారు భావించలేదు. దక్షిణ ఆఫ్రికాలో భారతదేశ పిల్లలు కేవలం ప్రారంభవిద్య మాత్రమే పొందేవారు. ఉపాధ్యాయులు తాము చేసిన పనులే పిల్లలకు నేర్పాలని, తాము చేయని పనులు పిల్లలచేత చేయించకూడదని టాల్‌స్టాయి ఆశ్రమంలో నియమం అమలు చేశాం. పిల్లల చేత పని చేయిస్తూ వున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారి వెంట వుండి పని చేస్తూ చేయిస్తూ వుండేవాడు. అందువల్ల పిల్లలు సంతోషంగా పనులు చేస్తూ వుండేవారు. శీలం గురించి, అక్షరజ్ఞానం గురించి తరువాత వ్రాస్తాను. 

33. అక్షరజ్ఞానం

శారీరక శిక్షణతో బాటు కొన్ని చేతి పనులు పిల్లలకు నేర్పుటకు టాల్‌స్టాయి ఆశ్రమంలో చేసిన ఏర్పాట్లను గురించి ప్రకరణంలో వివరించాను. పూర్తిగా నాకు తృప్తికలగనప్పటికి అందుకొంత సాఫల్యం లభించిందని చెప్పగలను. అక్షరజ్ఞానం కల్పించడం కష్టమని అనిపించింది. అందుకు అవసరమైన సామాగ్రి నా దగ్గర లేదు. అవసరమని నేను భావించినంత సమయం కూడా యివ్వలేకపోయాను. అంతజ్ఞానం కూడా నాకు లేదు. రోజంతా కాయకష్టం చేశాక అలసి పోయేవాణ్ణి. విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పుడు క్లాసులో పాఠం చెప్పలేక బలవంతాన పాఠం చెప్పవలసి వస్తూ వుండేది. ఉదయం పూట వ్యవసాయం, గృహకృత్యాలు, మధ్యాహ్నం భోజనం కాగానే క్లాసులు ఇంతకంటే అనుకూలమైన సమయం లభించలేదు.

అక్షరజ్ఞానం కల్పించేందుకు మూడుగంటల సమయం నిర్ణయించారు. క్లాసులో హిందీ, తమిళం, గుజరాతీ ఉర్దూ నేర్పవలసి వచ్చింది. పిల్లలకు వాళ్ళ మాతృభాషలో చదువు నేర్పాలని మా నిర్ణయం. ఇంగ్లీషు కూడా అందరికీ నేర్పుతూ వున్నాం. గుజరాతీ తెలిసిన హిందూ పిల్లలకు కొద్దిగా సంస్కృతం నేర్పే వాళ్ళం. ఈ పిల్లలందరికీ హిందీ నేర్పే వాళ్ళం. చరిత్ర, భూగోళం, గణితం అందరికీ నేర్పేవాళ్ళం. తమిళం, ఉర్దూ నేను నేర్పేవాణ్ణి.

స్టీమరుమీద, జైల్లో నేర్చుకున్న నా తమిళజ్ఞానం అంతటితో ఆగింది. ముందుకు సాగలేదు. పోప్ రచించిన “తమిళ స్వయంశిక్షక్” ద్వారా నేర్చుకున్న దానితో సరి. ఫారసీ అరబ్బీ శబ్దావలి సంగతి కూడా అంతే. ముస్లిం సోదరుల సహవాసం వల్ల నేర్చుకున్న ఉర్దూ, అరబ్బీ, ఫారసీ ఓడమీద నేర్చుకున్న దానితో సరి. హైస్కూల్లో నేర్చుకున్న సంస్కృతం, గుజరాతీ యీ మాత్రం పెట్టుబడితో పని నడపవలసి వచ్చింది. అందుకు సహకరించదలచి వచ్చిన వారికి నాకు వచ్చినంత కూడా రాదు. అయితే దేశభాషల యెడ నాకు గల ప్రేమ, శిక్షణా శక్తి మీద నాకు గల శ్రద్ధ, విద్యార్థుల అజ్ఞానం, వారి ఉదార హృదయం నా పనికి అమితంగా తోడ్పడ్డాయి.

తమిళ విద్యార్థులు దక్షిణ ఆఫ్రికాలో జన్మించినట్టివారే. అందువల్ల వాళ్ళకు తమిళం చాలా తక్కువగా వచ్చు. వాళ్ళకు లిపి అసలురాదు. అందువల్ల నేను తమిళ లిపి నేర్పవలసి వచ్చింది. పని తేలికగానే సాగింది. తమిళం మాట్లాడవలసి వస్తే తాము నన్ను ఓడించగలమని విద్యార్థులకు తెలుసు. కేవలం తమిళం మాత్రమే తెలిసిన వాళ్ళు నా దగ్గరకు వస్తే ఆ తమిళ పిల్లలు దూబాసీలుగా ఉపయోగపడుతూ వుండేవారు. ఈ విధంగా బండి నడిచింది. అయితే విద్యార్థుల ఎదుట నా అజ్ఞానాన్ని దాచడానికి నేను ఎన్నడూ ప్రయత్నించలేదు. మిగతా విషయాలవలెనే యీ విషయంలో కూడా వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అక్షరజ్ఞానంలో వెనకబడినప్పటికి వారి ప్రేమ, ఆదరణ బాగా పొందగలిగాను. ముస్లిం పిల్లలకు ఉర్దూ నేర్పడం తేలిక. వాళ్ళకు లిపివచ్చు. వాళ్ళను చదువులో ప్రోత్సహించడం, అక్కడక్కడ వారికి సహకరించడం నా పని.

దరిదాపు పిల్లలంతా చదువురానివాళ్ళే. స్కూల్లో చదువుకోని వారే. నేను నేర్పేది తక్కువ. వాళ్ళ సోమరితనం పోగొట్టి, చదవడానికి వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళ చదువును గురించి శ్రద్ధ వహించడం నా పని. దానితో నేను తృప్తిపడేవాణ్ణి. అందువల్లనే వేరు వేరు వయస్సుల్లో గల పిల్లల్ని సైతం ఒకే గదిలో కూర్చోబెట్టి పనిచేయిస్తూ వుండేవాణ్ణి.

పాఠ్యపుస్తకాలను గురించి ప్రతిచోట గొడవ చేస్తూ వుంటారు. కాని పాఠ్యపుస్తకాల అవసరం నాకు కలుగలేదు. ప్రతి పిల్లవాడికి ఎక్కువ పుస్తకాలు యివ్వడం అవసరమని అనిపించలేదు. వాస్తవానికి పిల్లవాడికి నిజమైన పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడే. పాఠ్యపుస్తకాల ద్వారా నేను నేర్పిన పాఠ్యాంశాలు జ్ఞాపకం వున్నవి బహుతక్కువే. కంఠస్థం చేయించిన పాఠాలు మాత్రం నాకు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. కంటితో గ్రహించిన దానికంటే చెవితో విని తక్కువ శ్రమతో ఎక్కువ గ్రహిస్తాడు. పిల్లలచేత ఒక్క పుస్తకం కూడా పూర్తిగా చదివించినట్లు నాకు గుర్తులేదు.

నేను చాలా పుస్తకాలు చదివాను. నేను జీర్ణం చేసుకున్న విషయాన్నంతా పిల్లలకు బోధించాను. అది వాళ్ళకు యిప్పటికీ జ్ఞాపకం వుండి వుంటుందని నా విశ్వాసం. చదివించింది జ్ఞాపకం పెట్టుకోవడం వారికి కష్టంగా వుండేది. నేను వినిపించిన పాఠం వాళ్ళు వెంటనే నాకు తిరిగి వినిపించేవారు. చదవమంటే కష్టపడేవారు. వినిపిస్తూ నేను అలసిపోయినప్పుడు లేక నేను నీరసపడినప్పుడు వాళ్ళు రసవత్తరంగా నాకు వినిపిస్తూ వుండేవారు. వాళ్లకు కలిగే సందేహాలు వాటి నివృత్తికై వాళ్ళు చేసే కృషి, వాళ్ళ గ్రహణ శక్తి అద్భుతం. 

34. ఆత్మ శిక్షణ

విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ గరపడం కంటే వారికి ఆత్మ శిక్షణ గరపడం కష్టమనిపించింది. ఆత్మశిక్షణకు మత గ్రంధాల సాయం నేను పొందలేదు. పిల్లలు తమతమ మతాల మూలతత్వం తెలుసుకోవడం, తమ మత గ్రంధాలను గురించి కొద్దిగా నైనా వాళ్ళు తెలుసుకోవడం అవసరమని భావించాను. అందుకోసం నేను చేతనైనంతవరకు సౌకర్యం కలిగించాను. బుద్ధి వికాసానికి అది అవసరమని నా భావం. ఆత్మ శిక్షణ విద్యాభ్యాసంలో ఒక భాగమని టాల్‌స్టాయి ఆశ్రమంలో పిల్లలకు శిక్షణ గరిపే సమయంలో నేను తెలుసుకున్నాను. ఆత్మ వికాసం అంటే శీలనిర్మాణం. ఈశ్వరసాక్షాత్కారం పొందడం అన్నమాట. ఆత్మజ్ఞానం పొందునప్పుడు పిల్లలకు సరియైన బోధ అవసరం. మరో రకమైన జ్ఞానం వ్యర్ధం, హానికరం కూడా కావచ్చునని తెలుసుకున్నాను. ఆత్మ జ్ఞానం నాల్గవ ఆశ్రమంలో అవసరమను దుర్భ్రమ చాలామందికి వుంటుంది. కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం ఆత్మజ్ఞానాన్ని వాయిదా వేసే వ్యక్తులు ఆత్మజ్ఞానం పొందలేరని, వృద్ధాప్యం వచ్చినప్పుడు దయకు పాత్రులై, దీనావస్థను పొంది భువికి భారంగా జీవిస్తూ వుంటారని నేను గ్రహించిన సత్యం. నా యీ భావాలను 1911-12 మధ్య ప్రకటించియుండలేదు. అప్పుడు యీ విషయమై నాకు గల అభిప్రాయాలు యివేనని జ్ఞాపకం.

ఆత్మశిక్షణ ఎలా గరపాలి? అందుకోసం పిల్లల చేత భజనలు చేయించేవాణ్ణి. నీతి పుస్తకాలు చదివి వినిపించేవాణ్ణి. అయినా తృప్తి కలిగేది కాదు. వాళ్లతో సంబంధం పెరిగిన కొద్దీ గ్రంధాలద్వారా వాళ్లకు ఆత్మజ్ఞానం కలిగించడం కష్టమని గ్రహించాను. శరీర సంబంధమైన శిక్షణ యివ్వాలంటే వ్యాయామం ద్వారా యివ్వాలి. బుద్ధికి పదును పట్టాలంటే బుద్ధిచేత వ్యాయామం చేయించాలి. అలాగే ఆత్మజ్ఞానం కలగాలంటే ఆత్మవ్యాయామం అవసరం. ఆత్మశిక్షణ ఉపాధ్యాయుని నడత, శీలం వల్లనే విద్యార్థులకు అలవడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు కడు జాగరూకులై వ్యవహరించడం అవసరం. ఉపాధ్యాయుడు తన ఆచరణ ద్వారా విద్యార్థుల హృదయాలను కదిలించగలడు. తాను అబద్ధాలాడుతూ తన విద్యార్థుల్ని మాత్రం సత్యసంధులుగా తీర్చిదిద్దాలను కోవడం సరికాదు. పిరికిపందయగు ఉపాధ్యాయుడు తన శిష్యుల్ని నిర్భీకుల్ని చేయలేడు. వ్యభిచారియగు ఉపాధ్యాయుడు తన శిష్యులకు సంయమం నేర్పలేడు. నా ఎదుట వున్న బాలబాలికలకు నేను ఆదర్శ పాఠ్యవస్తువుగా పుండాలి. అందువల్ల నా విద్యార్థులు నాకు గురువులు అవుతారు. నా కోసం కాకపోయినా వారి కోసమైనా నేను మంచిగా వుండితీరాలి. యీ విషయం నేను బాగా తెలుసుకున్నాను. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో నేను అలవరుచుకున్న సంయమనానికి కారకులు యీ బాలబాలికలేనని నా అభిప్రాయం. వారికి నా కృతజ్ఞతలు చెప్పాలి. ఆశ్రమంలో ఒక యువకుడు ఎప్పుడూ గొడవ చేస్తూ వుండేవాడు. అబద్దాలాడేవాడు. ఇతరులతో తగాదా పెట్టుకునేవాడు. ఒక రోజున పెద్ద తుఫాను సృష్టించాడు. నేను గాబరా పడ్డాను. విద్యార్థుల్ని ఎప్పుడూ నేను దండించలేదు. ఆ రోజున నాకు చాలా కోపం వచ్చింది. నేను అతని దగ్గరకు వెళ్ళాను. ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. నన్ను మోసగించాలని కూడా ప్రయత్నించాడు. దగ్గరే పడియున్న రూళ్ల కర్ర ఎత్తి అతడి భుజంమీద గట్టిగా వడ్డించాను. కొట్టే సమయంలో నన్ను వణుకు పట్టుకుంది. అతడు దాన్ని గ్రహించి యుండవచ్చు. అంతవరకు ఆవిధంగా ఏ విద్యార్ధి విషయంలోను నేను వ్యవహరించి యుండలేదు. అతడు భోరున ఏడ్చాడు. క్షమించమని వేడుకున్నాడు. రూళ్ల కర్ర తగిలి బాధ కలిగినందున అతడు ఏడ్వలేదు. ఎదిరించ తలుచుకుంటే నన్ను ఎదుర్కోగల శక్తి అతడికి వుంది. అతడి వయస్సు 17 సంవత్సరాలు వుండి వుంటుంది. శరీరం బలంగా కుదిమట్టంగా వుంటుంది. రూళ్ల కర్రతో కొట్టినప్పుడు నేను పడ్డ బాధను అతడు గ్రహించి యుంటాడు. తరువాత అతడు ఎవ్వరినీ వ్యతిరేకించలేదు. కాని రూళ్ల కర్రతో కొట్టినందుకు కలిగిన పశ్చాత్తాపాన్ని ఈనాటి వరకు నేను మరచిపోలేను. నేను అతడిని కొట్టి నా ఆత్మను గాక నా పశుత్వాన్ని ప్రదర్శించానను భయం నాకు కలిగింది.

పిల్లలను కొట్టి వారికి పాఠాలు చెప్పడానికి నేను వ్యతిరేకిని. నా విద్యార్థుల్లో ఒక్కణ్ణి మాత్రమే ఒక్కసారి మాత్రమే కొట్టినట్లు నాకు బాగా గుర్తు. రూళ్ల కర్రతో కొట్టి నేను మంచిపనిచేశానో లేక చెడుపనిచేశానో ఈనాటి వరకు నేను తేల్చుకోలేదు. అయితే ఆ దండన యందుగల ఔచిత్యం విషయమై నాకు సందేహం వున్నది. ఆనాటి దండనకు మూలం కోపం మరియు దండించాలనే కాంక్ష. నాకు కలిగిన దుఃఖం ఆ దండనలో వ్యక్తం అయితే సంతోషించి వుండేవాణ్ణి. ఈ ఘట్టం జరిగాక విద్యార్ధులను దండించే క్రొత్త విధానం నేర్చుకున్నాను. అప్పుడు ఈ క్రొత్తవిధానాన్ని అనుసరించి యుంటే ఏమై యుండేదో చెప్పలేను. ఆవిషయం ఆ యువకుడు అప్పుడే మరచిపోయాడు. అతనిలో పెద్ద మార్పు వచ్చిందని కూడా నేను చెప్పలేను. అయితే ఈ ఘట్టం విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలో నాకు బోధపరిచింది. జాగ్రత్తపడేలా చేసింది. తరువాత కూడా కొందరు యువకులు తప్పులు చేశారు. అయితే వారిని దండనా విధానంతో దండించలేదు. ఈ విధంగా యితరులకు ఆత్మశిక్షణ గరపాలనే ఉద్దేశ్యంతో కృషి చేసిన నేను ఆత్మ సుగుణాన్ని గురించి తెలుసుకోసాగాను. 

35. మంచి చెడుల మిశ్రమం

టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మి. కేలన్‌బెక్ మరో సమస్యను నా దృష్టికి తెచ్చారు. వారు చెప్పనంతవరకు ఆ విషయాన్ని గురించి నేను యోచించలేదు. ఆశ్రమంలో గల కొందరు పిల్లలు ఉపద్రవాలు చేసే రకం. చెడ్డవాళ్లు రౌడీలు కూడా వాళ్లతోబాటు నా ముగ్గురు పిల్లలు ఇంకా కొంతమంది పిల్లలు వుండేవారు. అట్టి చెడ్డ పిల్లలతోబాటు మీ పిల్లలు పుండటం సబబా అనే ప్రశ్న మి. కేలన్‌బెక్ వేశారు. ఒకనాడు ఆయన స్పష్టంగా మాట్లాడుతూ “మీ ఈ విధానం నాకు నచ్చలేదు. ఆ రౌడీ పిల్లల సాంగత్యం వల్ల మీ పిల్లలు చెడిపోకుండా ఎలా వుండగలరు” అని అన్నారు.

కొంచెం సేపు ఆలోచనలో పడ్డానో లేదో నాకు గుర్తులేదు. కాని నేను ఇచ్చిన సమాధానం ఇప్పటికీ నాకు గుర్తు వున్నది. “నా పిల్లలకు ఆ రౌడీ పిల్లలకు మధ్య వ్యత్యాసం ఎలా చూపగలను? ఇపుడు వారందరికీ నేనే సంరక్షకుణ్ణి కదా? ఆ యువకులు నా పిలుపుకి వచ్చారు. ఖర్చులు ఇస్తే ఇవాళే వాళ్లు జోహన్సుబర్గు వెళ్లి ఎప్పటిలా వుండిపోతారు. ఇక్కడికి రావడమంటే నామీద దయచూపించినట్లేనని, వాళ్లు వాళ్ల తల్లిదండ్రులు భావిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక్కడికి వచ్చి వాళ్లు యిబ్బందులు పడుతున్నారు. మీకూ నాకూ యీ విషయం తెలుసు. నాకు ఇది ధర్మ సంకటం. వాళ్లను ఇక్కడే వుంచాలి. అందువల్ల నా పిల్లలు కూడా వాళ్లతో బాటు వుండాలి. ఇతరుల కంటే తాము గొప్పవారమనే భావం నా పిల్లలకు ఇప్పటినుండే నేర్పటం తగునా? యిట్టి భావం వారి బుర్రలో కలిగించడమంటే వాళ్లను చెడ్డమార్గంలో ప్రవేశపెట్టడమేకదా! వాళ్లు యిప్పుడు వున్న పరిస్థితిలో వుంటేనే మంచిది. మంచి చెడుల వ్యత్యాసం గ్రహించగలుగుతారు. వీరి గుణగణాల ప్రభావం తోటి వారి మీద పడదని మాత్రం ఎలా అనగలం? ఏదిఏమైనా వారిని యిక్కడ వుంచక తప్పదు. అందువల్ల ఏదైనా ప్రమాదం కలిగితే అనుభవించక తప్పదు” అని వారికి సమాధానం ఇచ్చాను. మి. కేలన్‌బెక్ తలవూపి మౌనం వహించారు. యీ ప్రయోగం వల్ల చెడు కలిగిందనిగాని, వారి సహవాసం వల్ల నా పిల్లలకు కీడు వాటిల్లిందనిగాని చెప్పలేను. లాభం కలిగిందని మాత్రం స్వయంగా గ్రహించాను. నా పిల్లలలో గొప్పవాళ్లమను భావం ఏ కొంచెం వున్నా అది తగ్గిపోయిందని చెప్పవచ్చు. అందరితో బాటు వుండటం నేర్చుకున్నారు.

తల్లిదండ్రులు జాగ్రత్త పడితే పిల్లలు చెడ్డ వారి సహవాసం చేసికూడా చెడిపోరని, మంచివారిమీద చెడుయొక్క ప్రభావం పడదని నా అభిప్రాయం. మన పిల్లల్ని పెట్టెలో మూసి పెడితే శుద్ధంగా వుంటారని, బయటకి తీస్తే అపవిత్రులైపోతారని అనుకోవడం సరికాదు. అట్టి నియమమేమీ లేదు. అయితే బాలురు, బాలికలు అధిక సంఖ్యలో కలిసిమెలిసి వున్నప్పుడు, చదువు కుంటున్నప్పుడు తల్లి దండ్రుల మీద ఉపాధ్యాయుల మీద బరువు పడటం ఖాయం. అప్పుడే ఉపాధ్యాయులకు కఠిన పరీక్ష జరుగుతుంది. వాళ్లు జాగ్రత్తగా వుండక తప్పదు.

36. ఉపవాసం

బాలురు, బాలికలు యిద్దరినీ నిజాయితీగా పోషించడం, వారికి విద్య గరపడం ఎంత కష్టమైన పనో నాకు రోజురోజుకూ బోధపడసాగింది. ఉపాధ్యాయుడుగా, సంరక్షకుడుగా వారి హృదయాల్లోకి ప్రవేశించాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి జీవిత సమస్యల్ని పరిష్కరించాలి. వారి యౌవ్వనవికాస తరంగాల్ని సరియైన మార్గానికి తరలించాలి. జైళ్లలో ఉన్న ఖైదీలు కొందరు విడుదలైనందున ఆశ్రమంలో కొద్దిమంది మాత్రమే మిగిలారు. వారంతా ఫినిక్స్‌వాసులు. అందువల్ల ఆశ్రమాన్ని ఫినిక్సుకు తీసుకుని వెళ్లాను. ఫినిక్సులో నాకు కఠినపరీక్ష జరిగింది. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మిగిలిన వారిని ఫినిక్సుకు జేర్చి నేను జోహాన్సుబర్గు వెళ్లాను. జోహాన్సుబర్గులో కొద్దిరోజులు ఉన్నానో లేదో ఇంతలో ఇద్దరు వ్యక్తులు భయంకరంగా పతనం చెందారను వార్త నాకు చేరింది. సత్యాగ్రహ సంగ్రామంలో ఎక్కడైనా వైఫల్యం కలిగితే నాకు ఇంత బాధకలిగించదు కాని యీ వార్త వినగానే నా మీద పిడుగు పడినట్లని పించింది. నా మనస్సుకు గట్టి దెబ్బ తగిలింది. ఫినిక్సుకు బయలుదేరాను. మి.కెలెన్‌బెక్ వెంటవస్తానని పట్టుబట్టారు. వారు నా దయనీయస్థితిని గ్రహించారు. వంటరిగా వెళ్ళనీయనని పట్టుబట్టారు. పతనవార్త వారి ద్వారానే నాకు అందింది.

త్రోవలో నా కర్తవ్యం ఏమిటా అని యోచించాను. ఎవరి సంరక్షణలో వుంటూ వ్యక్తులు చెడిపోతారో ఆ సంరక్షకులు కూడా కొంతవరకు అందుకు బాధ్యులే అని భావించాను. నా బాధ్యత కూడా నాకు బోధపడింది. గతంలో నా భార్య నన్ను హెచ్చరించింది కూడా. కాని సహజంగా అందరినీ నమ్మే మనిషిని గనుక ఆమె మాటల్ని నేను పట్టించుకోలేదు. అందుకు గాను నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని అమలుపరిస్తే తప్పుజేసినవారు తమ తప్పేమిటో తెలుసుకుంటారని భావించాను. ఆ ప్రకారం నేను ఏడురోజులు ఉపవాసం చేయాలని నాలుగున్నర మాసాలు ఒక పూట భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. మి. కేలన్‌బెక్ నన్ను ఆపాలని ప్రయత్నించారు. కాని నేను ఒప్పుకోలేదు. చివరికి ఆయన నా నిర్ణయాన్ని ఒప్పుకుని తానుకూడా అలాగే చేస్తానని అన్నారు. నిర్మలమైన వారి ప్రేమను నేను కాదనలేక పోయాను. ఈ విధంగా నిర్ణయానికి వచ్చిన తరువాత నాకు బరువు తగ్గినట్లనిపించింది. మనస్సు కుదుటపడింది. దోషుల మీద కోపం తగ్గిపోయింది. వారిమీద కేవలం దయ మాత్రమే మిగిలింది. ఈ విధంగా రైల్లో మనస్సును శాంతపరచుకుని నేను ఫినిక్సు చేరాను. వివరాలన్నీ తెలుసుకున్నాను. నా ఉపవాసంవల్ల అందరికీ కష్టం కలిగినా వాతావరణం మాత్రం శుద్ధి పడిందని చెప్పగలను. పాపపు భయంకర స్వరూపం ఏమిటో అందరికీ బోధపడింది. విద్యార్థులకు, విద్యార్థినులకు, నాకు మధ్యగల సంబంధం గట్టిపడింది. కొంతకాలం తరువాత మరోసారి నేను 14 రోజులు ఉపవాసం చేయవలసి వచ్చింది. అందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సత్ఫలితం చేకూరింది.

ఈ వ్యవహారం దృష్ట్యా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి సంరక్షకుడు ఇలాగే చేయాలని మాత్రం నేను అనను. కొన్ని కొన్ని సందర్భాలలో యిట్టి ఉపవాసాదులకు అవకాశం కలదని చెప్పగలను. అయితే అందుకు వివేకం, అర్హత అవసరం. ఉపాధ్యాయునికి విద్యార్థికీ మధ్య శుద్ధమైన ప్రేమలేనప్పుడు విద్యార్థి చర్యవల్ల ఉపాధ్యాయుని హృదయానికి నిజమైన దెబ్బతగలనప్పుడు, విద్యార్థికి ఉపాధ్యాయుని గౌరవభావం లేనప్పుడు ఇట్టి ఉపవాసాదులు వ్యర్ధం. నష్టం కూడా కలిగించవచ్చు. ఏది ఏమైనా ఉపవాసాదులు వహించినా వహించకపోయినా ఇట్టి విషయాలలో ఉపాధ్యాయునికి బాధ్యత ఉండి తీరుతుందని నా నిశ్చితాభిప్రాయం. ఏడురోజుల ఉపవాసం, నాలుగున్నరమాసాల ఒంటిపూట భోజనవ్రతంవల్ల మాకెవ్వరికీ యిబ్బంది కలుగలేదు. నా పనియేదీ ఆగలేదు. మందగించలేదు. అప్పుడు నేను పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. అయితే ఆ తరువాత చేసిన 14 రోజుల ఉపవాస సమయంలో చివరి రోజుల్లో మాత్రం కష్టం కలిగింది. అప్పటికి రామనామస్మరణ యందలి మహిమను పూర్తిగా నేను గ్రహించలేదు కాబోలు. సహనశక్తి తగ్గింది. ఉపవాస సమయంలో నీరు బాగా త్రాగాలి అను విషయం నాకు తెలియదు. అందువల్ల కూడా ఉపవాస సమయంలో బాధకలిగింది. అంతకు పూర్వం చేసిన ఉపవాసాలు ప్రశాంతంగా సాగటంవల్ల 14 రోజుల ఉపవాసం గురించి తేలికగా వ్యవహరించాను. మొదటి ఉపవాససమయంలో కూనేగారి కటిస్నానం చేస్తూవున్నాను. 14రోజుల ఉపవాసం చేసినప్పుడు రెండుమూడు రోజుల తరువాత దానిని ఆపివేశాను. నీరు రుచించేదికాదు. నీళ్ళు త్రాగితే డోకు వచ్చినట్లుండేది. అందువల్ల నీళ్ళు త్రాగటం తగ్గించాను. దానితో గొంతు ఎండిపోయింది. బలహీనమైపోయాను. చివరిరోజుల్లో మాటకూడా మెల్లగా మాట్లాడవలసి వచ్చింది. కాని రాతపని మాత్రం చివరిరోజువరకు చేస్తువున్నాను. రామాయణాదులు చివరివరకూ వింటున్నాను. అన్ని విషయాల్లోను సలహాలు యిస్తూవున్నాను.

37. గోఖలేగారిని కలుసుకునేందుకై ప్రయాణం

దక్షిణ ఆఫ్రికాకు సంబంధించిన అనేక స్మృతుల్ని వదిలివేయక తప్పడం లేదు. 1914 సత్యాగ్రహ సమరం ఆగిన తరువాత గోఖలేగారి కోరిక ప్రకారం నేను ఇంగ్లాండు వెళ్ళి అక్కడినుండి హిందూదేశం చేరవలసి వుంది. అందువల్ల జూలై మాసంలో కస్తూరిబాయి, కేలన్‌బెక్, నేను ముగ్గురం ఇంగ్లాండుకు బయలుదేరాం. సత్యాగ్రహ సమరం జరిగిన తరువాత నేను రైళ్ళలో మూడో తరగతిలో ప్రయాణం చేయడం ప్రారంభించాను. అందువల్ల ఓడలో కూడా మూడో తరగతి టిక్కెట్లే కొన్నాను. అయితే ఇక్కడి మూడో తరగతికి మనదేశంలో మూడో తరగతికి చాలా తేడా వున్నది. మనదేశంలో కూర్చునేందుకు, పడుకునేందుకు, అతి కష్టంమీద చోటు దొరుకుతుంది. పారిశుధ్యం అను విషయాన్ని గురించి యోచించడం అనవసరం. కాని యిక్కడ మూడో తరగతి యందు చోటు బాగానే దొరుకుతుంది. పారిశుద్ధ్యం కూడా ఎక్కువగా జరుగుతుంది. మరొకరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వుండేందుకై ఒక పాయిఖానా దొడ్డికి తాళంబెట్టి తాళం చెవి మాకు యిచ్చారు. మేము ముగ్గురం పలావు భుజించేవారం కావడం వల్ల మాకు ఎండు ద్రాక్ష, కిస్‌మిస్, తాజా పండ్లు యిమ్మని స్టీమరు కేషియరుకు ఆర్డరు అందింది. సామాన్యంగా మూడో తరగతి ప్రయాణీకులకు పండ్లు కొద్దిగా లభిస్తాయేగాని ఎండు ద్రాక్ష వగైరాలు లభించవు. ఇట్టి సౌకర్యం లభించడం వల్ల మేము ముగ్గురం ఓడమీద 18 రోజులు ఎంతో ప్రశాంతంగా ప్రయాణం చేశాం.

ఈ యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం వున్నది. మి. కేలన్‌బెక్‌కు దుర్భిణీ యంత్రం అంటే సర్దా. ఆయన దగ్గర ఒకటి రెండు ఖరీదైన దుర్భిణీ యంత్రాలున్నాయి. వాటిని గురించి రోజూ చర్చిస్తూవుండేవారం. ఆదర్శంగా వుండాలని, సాదా జీవితం గడపాలని భావించే మనబోటివారికి అంత ఖరీదైన వస్తువులు తగవని నచ్చచెబుతూ వుండేవాణ్ణి. ఒకరోజున యీ విషయం మీద మా యిద్దరి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మేమిద్దరం మా కేబిన్ కిటికీల దగ్గర నిలబడి వున్నాం. “మన యిద్దరి మధ్య తకరారు ఎందుకు? ఈ దుర్భిణీ యంత్రం సముద్రంలో పారేస్తే ఆ ఊసే ఎత్తం కదా!” అని అన్నాను. మి. కేలన్‌బెక్ వెంటనే మనిద్దరి మధ్య పొరపొచ్చాలు కలిగిస్తున్న ఈ వస్తువును పారేయండి అని అన్నాడు. “నేను పారేయనా?” అని అడిగాను. ‘పారేయండి’ అని అన్నారు. నేను దుర్భిణీ యంత్రాన్ని సముద్రంలో విసిరి వేశాను. దాని ఖరీదు సుమారు ఏడు పౌండ్లు, అయితే దాని విలువ దాని ఖరీదులో లేదు. దాని యెడ కేలన్‌బెక్‌కుగల వ్యామోహంలో వుంది. అయినా కేలన్‌బెక్‌కు ఎన్నడూ దుఃఖం కలగలేదు. ఆయనకు నాకు మధ్య యిలాంటి వ్యవహారాలు చాలా జరుగుతూ వుండేవి. వాటిలో యిది ఒకటి. నమూనాగా పాఠకులకు యీ విషయం తెలియజేశాను.

పరస్పర సంబంధాల వల్ల ప్రతిరోజు ఏదో క్రొత్త విషయం నేర్చుకొనేవారం. ఇద్దరం సత్యాన్వేషణకు కృషిచేస్తున్నాం. సత్యాన్ని పాటించడం వల్ల క్రోధం, స్వార్ధం, ద్వేషం మొదలుగాగలవి సహజంగా తగ్గిపోయాయి. అవి తగ్గకపోతే సత్యం గోచరించదు. రాగద్వేషాలతో నిండియున్న మనిషి, సరళ హృదయుడు. అయినప్పటికీ సత్యవాక్కులే పలుకుతూ వున్నప్పటికీ శుద్ధసత్యాన్ని దర్శించలేడు. శుద్ధమైన సత్యశోధన జరపడమంటే రాగద్వేషాదుల నుండి విముక్తి పొందడమే. యాత్రకు బయలుదేరినప్పుడు నేను చేసిన ఉపవాసం ముగిసి ఎన్నోరోజులు దాటలేదు. అందువల్ల నాకు పూర్తి శక్తి చేకూరలేదు. రోజూ డెక్ మీద పచార్లు చేసి ఆకలి పెంచుకోవడానికి, ఎక్కువ ఆహారం తీసుకోవడానికి, తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయసాగాను. ఇంతలో నా పిక్కల్లో నొప్పి ప్రారంభమైంది. ఇంగ్లాండు చేరిన తరువాత కూడా నొప్పి తగ్గలేదు. యింకా పెరిగింది. ఇంగ్లాండులో డాక్టర్ జీవరాజ్ మెహతాతో పరిచయం కలిగింది. ఉపవాసాన్ని, పిక్కలనొప్పిని గురించి వివరించి చెప్పాను. అంతా విని “మీరు కొద్ది రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకొనలేకపోతే కాళ్ళు పనిచేయలేని స్థితి ఏర్పడవచ్చు” అని ఆయన చెప్పాడు. ఉపవాసాలు చేసిన వ్యక్తి పోయిన శక్తిని త్వరగా పొందాలనే కోరికతో ఎక్కువ ఆహారం భుజించకూడదను విషయం అప్పుడు నాకు బోధపడింది. ఉపవాసం విరమించినప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండి, సంయమం అలవర్చుకోవలసి వుంటుంది. మదిరా స్థావరం చేరినప్పుడు మహాయుద్ధం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నదని మాకు సమాచారం అందింది. మమ్మల్ని అక్కడ ఆపి వేశారు. పలుచోట్ల సముద్రంలో మందు పాతరలు పాతి పెట్టారని తెలిసింది. వాటిని తప్పించుకొని సౌదెంప్టన్ చేరడానికి రెండు రోజులు పట్టింది. ఆగష్టు నాల్గవ తేదీన యుద్ధ ప్రకటన వెలువడింది. ఆరవ తేదీన మేము ఇంగ్లాండుకు చేరాము.

38. యుద్ధరంగంలో

ఇంగ్లాండు చేరిన తరువాత గోఖలేగారు పారిస్‌లో చిక్కుకు పోయారని తెలిసింది. పారిసుతో రాకపోకలు ఆగిపోయాయి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆరోగ్యం కోసం గోఖలేగారు ఫ్రాన్సు వెళ్ళారు. యుద్ధం కారణంగా వారు అక్కడ చిక్కుబడిపోయారు. వారిని కలవకుండా దేశం వెళ్ళడం సాధ్యం కాని పని. అయితే ఆయన ఎప్పుడు రాగలిగేది చెప్పగల వారెవ్వరూ లేరు.

ఈ లోపున నేను ఏం చేయాలి? యుద్ధంలో నా పాత్ర ఏమిటి? దక్షిణ ఆఫ్రికా జైల్లో నా అనుచరుడు, సత్యాగ్రహి అయిన సోరాబ్‌జీ ఆడాజనియా ఇంగ్లాండులో బారిష్టరీ చదువుతూ వున్నాడు. ఉత్తమోత్తమ సత్యాగ్రహిగా ఆయనను బారెట్లా చదవమని అక్కడి వాళ్ళు పంపించారు. ఆయన నా స్థానాన్ని భర్తీ చేస్తారన్నమాట. ఆయన ఖర్చు దాక్టర్ ప్రాణ జీవరాజ్ మెహతా గారు భరిస్తున్నారు. నేను వారిని సంప్రదించాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థుల సమావేశం ఏర్పాటు చేయించి వారికి నా అభిప్రాయాలు తెలియజేశాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థులంతా యుద్ధంలో బ్రిటిష్ వారికి సహకరించాలని నాకు తోచింది. ఆంగ్ల విద్యార్థులు యుద్ధంలో పాల్గొని సేవ చేస్తామని ప్రకటించారు. హిందూ దేశస్థులు ఎందుకు వెనకబడాలి. ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా చాలా కారణాలు పేర్కొనబడ్డాయి. మనకు ఆంగ్లేయులకు మధ్య ఎంతో తేడా వున్నదని, ఒకరు బానిసలైతే మరొకరు ప్రభువులని, అట్టిస్థితిలో బానిసలు ప్రభువుకు ఆపదసమయంలో స్వేచ్ఛగా ఎలా సాయం చేయగలరని కొందరు ప్రశ్నించారు. బానిసత్వం నుండి విముక్తి పొందాలని భావిస్తున్న బానిస యజమాని ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి అని కూడా అన్నారు. ఈ తర్కం అప్పుడు నాకు మింగుడు పడలేదు. మనం పూర్తిగా బానిసత్వంలో లేమనే అభిప్రాయంతో అప్పుడు నేను వున్నాను. అసలు ఆంగ్ల ప్రభుత్వ విధానంలో లేదని, దాన్ని అమలుపరుస్తున్న ఆంగ్ల అధికారుల్లో దోషం అధికంగా వున్నదని ప్రేమద్వారా ఆదోషాన్ని తొలగించుకోవచ్చని భావించాను. ఆంగ్లేయుల సాయంతో మనస్థితిని చక్క దిద్దుకోవాలని మనం భావిస్తూ వుంటే ఆపద సమయంలో వారికి సాయం చేసి తద్వారా పరిస్థితి చక్కదిద్దుకోవాలని అభిప్రాయపడ్డాను. రాజ్యవిధానం దోషమయంగా వున్నప్పటికీ ఆ రోజుల్లో అది యిప్పటివలెనే నాకు పెద్దదిగా కనబడలేదు. అయితే ఇప్పుడు ఆంగ్ల రాజ్య విధానం మీద విశ్వాసం నాకు పూర్తిగా సడలిపోయింది. అందువల్ల ఇప్పుడు నన్ను సాయం చేయమంటే చేయలేను. అదేవిధంగా ఆంగ్ల రాజ్య విధానం మీద, ఆంగ్ల అధికారులుమీద పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిపోయినవారిని సాయం చేయమంటే చేస్తారా? సాధ్యమా?

ఆంగ్ల రాజ్య విధానంలో మార్పు కోరడానికి యిది మంచి తరుణమని వారు భావించారు. కాని నేను అందుకు అంగీకరించలేదు. యుద్ధ సమయంలో హక్కులు కోరకూడదని, ఆ విషయమై సంయమం పాటించడం మంచిదని, అది దూరదృష్టితో కూడిన పని అని భావించాను. నా అభిప్రాయం మీద గట్టిగా నిలబడినవారి పేర్లు నమోదు అయ్యాయి. అన్ని మతాల, అన్ని ప్రాంతాల వారి పేర్లు ఆ పట్టికలో వున్నాయి.

లార్డు క్రూ పేరట జాబు వ్రాశాను. హిందూ దేశస్థుల పేర్లు మీరు మంజూరు చేస్తే యుద్ధరంగంలో గాయపడ్డ వారికి సేవ చేసేందుకు, అందుకు అవసరమైన శిక్షణ పొందేందుకు సిద్ధంగా వున్నామని ఆ జాబులో తెలియజేశాను. కొద్దిగా చర్చలు జరిగిన తదుపరి లార్డ్ క్రూ అందుకు అంగీకరించాడు. కష్టసమయంలో ఆంగ్ల ప్రభుత్వానికి సాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. పేర్లు యిచ్చిన వారంతా ప్రసిద్ధ డాక్టరు కేంటలీ గారి అజమాయిషిలో గాయపడ్డవారికి సేవ చేసే ప్రాధమిక శిక్షణ పొందసాగారు. మా దళానికి ఆరువారాలపాటు చిన్న శిక్షణా కార్యక్రమంలో గాయపడ్డ వారికి సేవాశుశ్రూషలు చేసే ప్రాధమిక విధానం పూర్తిగా నేర్పారు. సుమారు 80 మందిమి ఆ క్యాంపులో చేరాము. ఆరువారాల తరువాత పరీక్ష పెట్టారు. ఒక్కడు మాత్రమే ఫేలయ్యాడు. ప్యాసైనవారందరికి ప్రభుత్వం పక్షాన కవాతు గరిపేందుకు ఏర్పాటు చేశారు. కర్నల్ బెకర్‌కు యీ కవాతు కార్యక్రమం అప్పగించారు. ఆయనను మా గ్రూపుకు నాయకునిగా నియమించారు. అప్పటి ఇంగ్లాండు పరిస్థితులు తెలుసుకోతగినవి. ప్రజలు భయపడలేదు. అంతా యుద్ధానికి ఏదో విధంగా సాయం చేసేందుకు పూనుకున్నారు. శరీరదార్ఢ్యత గలిగిన యువకులు సైన్యంలో చేరారు. అశక్తులు, వృద్ధులు, స్త్రీలు ఏం చేయాలి. వారికి కూడా పనులు అప్పగించవచ్చు. యుద్ధంలో గాయపడ్డ వారికోసం చాలామంది దుస్తులు కుట్టడం ప్రారంభించారు. అక్కడ లైసియమ్ అను స్త్రీ క్లబ్బు ఒకటి వున్నది. ఆ క్లబ్బుకు చెందిన స్త్రీలు యుద్ధశాఖకు అవసరమైన బట్టలు అందజేసేందుకు పూనుకున్నారు. సరోజినీ దేవి కూడా ఆ క్లబ్బు సభ్యురాలు. ఆమె యీ పనికి గట్టిగా పూనుకున్నారు. నాకు అక్కడే ఆమెతో మొదటి పర్యాయం పరిచయం ఏర్పడింది. ఆమె బోలెడన్ని బట్టలు నా ఎదుట కుప్పలుగా పడవేసి, వాటిలో సాధ్యమైనన్ని బట్టలు కుట్టించి తనకు అప్పగించమని చెప్పింది. నేను ఆమె కోరికను పాటించి సాధ్యమైనన్ని గుడ్డలు కుట్టించి ఆమెకు అప్పగించాను. 

39. కర్తవ్యం ఏమిటి?

యుద్ధంలో పని చేస్తానని మేము కొంతమందిమి కలిసి ప్రభుత్వానికి పేర్లు పంపించాము. ఈ వార్త అందగానే దక్షిణ ఆఫ్రికా నుండి నాకు రెండు టెలిగ్రాములు అందాయి. ఆందు ఒకటి పోలక్‌ది. “మీరు చేస్తున్న యీ పని మీ అహింసా సిద్ధాంతానికి విరుద్ధంగా లేదా?” అని ఆయన ప్రశ్నించాడు. ఇలాంటి తంతి వస్తుందని నేను మొదటే వూహించాను. అందుకు కారణం వున్నది. యీ విషయాన్ని గురించి నేను “హిందు స్వరాజ్య”లో చర్చించాను. దక్షిణ ఆఫ్రికాలో గల మిత్రులతో యీ విషయమై తరుచు చర్చ జరుగుతూ వుండేది. యుద్ధంలో జరిగే అవినీతి మనందరికీ తెలుసు. నా మీద దౌర్జన్యం చేసిన వారిమీదనే కేసు పెట్టడానికి అంగీకరించని నేను రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ వుంటే, అందలి గుణ దోషాల్ని గురించి తెలియనప్పుడు అందు పాల్గొనడం సబబా. యుద్ధంలో నేను పాల్గొన్న విషయం మిత్రులందరికీ తెలిసినప్పటికీ, ఆ తరువాత నా భావాల్లో చాలా మార్పు వచ్చి వుంటుందని వారు అనుకున్నారు. నిజానికి ఏ యోచనా సరళితో నేను బోయర్ యుద్ధంలో పాల్గొన్నానో సరీగా అదే యోచనా సరళితో యీ యుద్ధంలో కూడా పాల్గొనాలని భావించాను. యుద్ధంలో పాల్గొనడానికి, అహింసకు పొంతన కుదరదని తెలుసుకున్నాను. కాని కర్తవ్యబోధ దీపం వెలుగులా స్పష్టంగా వుండదు కదా! సత్య పూజారి అనేక సార్లు మునిగి తేలవలసి వస్తుంది.

అహింస వ్యాపకమైన వస్తువు. హింసావలయంలో చిక్కుకు పోయిన పామర ప్రాణులం మనం. తోటి జీవుల పై ఆధారపడి జీవించాలన్న సూక్తి సరియైనదే. మనిషి బాహ్య హింస చేయకుండా ఒక్క క్షణమైనా జీవించలేడు. లేస్తూ కూర్చుంటూ, తింటూ తిరుగుతూ తెలిసో తెలియకో హింస చేస్తూనే వుంటాడు. అట్టి హింసనుండి బయటపడేందుకు కృషి చేయడం. మనస్సు పూర్తిగా కరుణతో నిండి వుండటం. బహు చిన్న ప్రాణికి సైతం హాని కలిగించకుండా వుండటం అహింసా పూజారి లక్షణం. అట్టి వాని ప్రవృత్తి సంయమం వైపు పయనిస్తుంది. అతనిలో సదా కరుణ నిండి వుంటుంది. అయినా దేహధారి ఎవ్వడూ కూడా బాహ్యహింస నుండి పూర్తిగా విముక్తి పొందజాలడు.

అహింసలో అద్వైత భావం నిండి వుంటుంది. ప్రాణులన్నింటిలో భేదం లేనప్పుడు ఒకదాని పాపప్రభావం మరొకదానిమీద తప్పక పడుతుంది. అందువల్ల మనిషి హింసనుండి తప్పించుకోలేడు. సమాజంలో నివసించేవ్యక్తి సమాజంలో సాగే హింసలో యిష్టం లేకపోయినా భాగస్వామి కాక తప్పదు. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యుద్ధాన్ని ఆపడం అహింసా వాదుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించలేకపోయినపుడు, యుద్ధాన్ని వ్యతిరేకించగల శక్తి లేనప్పుడు, అట్టి హక్కు కూడా కలిగివుండనప్పుడు వ్యక్తి యుద్ధకార్యాల్లో చేరిపోవాలి. చేరినప్పటికీ తనను, తన దేశాన్ని, జగత్తును రక్షించేందుకు హృదయపూర్తిగా కృషిచేయాలి.

నేను ఆంగ్ల రాజ్యం ద్వారా నా దేశ ప్రజల స్థితిని సరిదిద్దవలెనని భావించాను. నేను ఇంగ్లాండులో కూర్చొని బ్రిటీష్ యుద్ధ ఓడల ద్వారా రక్షణ పొందివున్నాను. అంటే ఆ బలాన్ని యీ విధంగా ఉపయోగించుకొని, అందు నిహితమైయున్న హింసలో తిన్నగా నేను పాల్గొంటూ వున్నానన్నమాట. ఈ ప్రభుత్వంతో సంబంధం పెట్టుకొని వ్యవహారాలు జరపాలన్నా, ప్రభుత్వ పతాక క్రింద వుండాలన్నా, నేను రెండు మార్గాలలో ఏదో ఒక దాన్ని అనుసరించాలి. యుద్ధాన్ని బాహాటంగా వ్యతిరేకించాలి. ఆ ప్రభుత్వ విధానం యుద్ధానికి వ్యతిరేకంగా మారనంతవరుకు సత్యాగ్రహశాస్త్ర ప్రకారం దాన్ని బహిష్కరించాలి లేక ఆ ప్రభుత్వ చట్టాలను ధిక్కరించి జైలుకు వెళ్ళాలి. అలా చేయలేనప్పుడు యుద్ధకార్యాలలో పాల్గొని ఆ ప్రభుత్వానికి సహకరించి, అవసరమైనప్పుడు దాన్ని ధిక్కరించగల శక్తిని, హక్కును సమకూర్చుకోవాలి. అట్టి శక్తి యిప్పుడు నాకు లేదు. అందువల్ల యుద్ధంలో చేరి సహకరించాలనే నిర్ణయానికి వచ్చాను.

అయితే తుపాకి పట్టుకొన్న వాడికి, వాడికి సహకరించేవారికి మధ్య హింసదృష్ట్యా తేడా లేదని నాకు తెలుసు. దోపిడీ దొంగలకు అవసరమైన సేవ చేయటానికి, అతడి మాటలు మోయడానికి, గాయపడినప్పుడు అతడికి సేవాశుశ్రూషలు చేయడానికి సిద్ధపడిన మనిషి కూడా దోపిడి వ్యవహారంలో దొంగతో సమానంగా బాధ్యత వహించవలసిందే. ఈ దృష్టితో పరిశీలిస్తే సైన్యంలో చేరి గాయపడ్డ సైనికులకు సేవా శుశ్రూషలు చేసేవాడు కూడా యుద్ధానికి సంబంధించిన దోషాన్నుండి తప్పించుకోలేడు. ఈ విషయాన్ని పోలక్ తంతి చేరకపూర్వమే నేను యోచించాను. ఆయన తంతి అందిన తరువాత ఆ విషయమై కొంతమంది మిత్రులను సంప్రదించాను. యుద్ధంలో చేరడం ధర్మమని నేను భావించాను. ఈనాడు కూడా ఆ భావానికి కట్టుబడి వున్నాను. అందు దోషం కనబడలేదు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గురించి ఆనాడు నాకు గల భావాలననుసరించి, వాటిని పాటించే నేను యుద్ధకార్యాలకు సహకరించాను. అలా చేసినందుకు నేను పశ్చాత్తాపపడలేదు.

అయితే నా అభిప్రాయా ఔచిత్యాన్ని ఆనాడుకూడా నా మిత్రుల ఎదుట వుంచి సమర్ధించుకోలేక పోయినమాట నిజం. ఇది కడు సున్నితమైన విషయం. అభిప్రాయ భేదానికి అందుతావున్నది. అందువల్ల అహింసా ధర్మాన్ని అంగీకరించి దానిని పాలించేవారి కోసం శక్త్యానుసారం నా అభిప్రాయాన్ని యిక్కడ వ్యక్తం చేశాను. సత్యనిష్ట గలవారు, నియమాల మీదనే ఆధారపడి పనిచేయకూడదు. తన భావాల్ని మాత్రమే అంటిపెట్టుకొని వుండకూడదు. అందు దోషం వుండవచ్చని అంగీకరించాలి. ఆ దోషాన్ని గురించి పరిజ్ఞానం కలిగినవాడు ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా ఎదుర్కొనాలి. దాని ఫలితం అనుభవించాలి. ప్రాయశ్చిత్తం కూడా చేసుకొనేందుకు సిద్ధపడాలి. 

40. చిన్న సత్యాగ్రహం

ధర్మమని భావించి నేను యుద్ధంలో చేరాను. కాని అందుతిన్నగా పాల్గొనే అదృష్టం కలుగలేదు. అలాంటి సున్నితమైన సమయంలో సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. మా పేర్లు మంజూరై నమోదు అయిన తరువాత మాకు కవాతు గరపడానికి ఒక అధికారి నియమింపబడిన విషయం పేర్కొన్నాను. యీ ఆఫీసరు యుద్ధ శిక్షణ యివ్వడం వరకే నీమితమై వుంటాడని మిగతా అన్ని విషయాలలో నేను మా ట్రూపుకు నాయకుణ్ణని అంతా అనుకున్నాం. నా అనుచరుల విషయమై బాధ్యత నాదని, నా విషయమై బాధ్యత మావాళ్లదని భావించాను. కాని ఆదిలోనే హంసపాదన్నట్లు ఆ ఆఫీసరుగారి మొదటి చూపులోనే అనుమానం కలిగింది. సొహరాబ్ చాలా తెలివిగలవాడు. నన్ను వెంటనే “అన్నా! జాగ్రత్త. యీ మనిషి మనమీద నవాబ్ గిరీ చలాయించాలని చూస్తున్నట్లుంది. వాడి ఆజ్ఞ మాకు అనవసరం. వాడు కవాతు నేర్పే శిక్షకుడు. అంతే. అరుగో ఆవచ్చిన యువకులు కూడా మనమీద అధికారం చలాయించాలని భావిస్తున్నట్లుంది” అని నన్ను హెచ్చరించాడు. ఆ యువకులు ఆక్సుఫర్డు విద్యార్థులు. శిక్షణకోసం వచ్చారు. పెద్ద ఆఫీసరు వాళ్లను మామీద డిప్యూటీ అధికారులుగా నియమించాడు. సొహరాబ్ చెప్పిన విషయం నేనూ గమనించాను. సొహరాబుకు శాంతంగా వుండమని చెప్పేందుకు ప్రయత్నించాను. కాని సొహరాబ్ అంత తేలికగా అంగీకరించే మనిషికాడు.

మీరు సాధుపుంగవులు. తియ్యగా మాట్లాడి వీళ్ళు మిమ్ము మోసం చేస్తారు. మీరు తరువాత తేరుకొని “పదండి, సత్యాగ్రహం చేద్దాం అని మమ్మల్ని హైరానా పెడతారు” అని నవ్వుతూ అన్నాడు సొహరాబ్. “నా వెంట వుండి హైరానా తప్ప మరింకొకటి ఎప్పుడైనా మీరు పొందారా మిత్రమా? సత్యాగ్రహి మోసగింపబడటానికేగదా పుట్టింది. వాళ్ళు నన్ను మోసం చేస్తే చేయనీయండి చూద్దాం. ఒకరిని మోసం చేయాలనుకునేవాడే చివరికి మోసంలో పడిపోతాడని ఎన్నో సార్లు మీకు చెప్పాను గదా అని అన్నాను.

సొహరాబ్ పకపక నవ్వుతూ ‘మంచిది అలాగే మోసంలో పడండి. ఏదో ఒకరోజున సత్యాగ్రహంలో మీరు చచ్చిపోతే మా బోంట్లను కూడా వెంట తీసుకెళ్ళండి’ అని అన్నాడు. కీర్తిశేషురాలు మిస్. హోబోహౌస్ నిరాకరణోద్యమాన్ని గురించి వ్రాసిన క్రింది మాటలు నాకు జ్ఞాపకం రాసాగాయి. “సత్యం కోసం మీరు ఒకానొక రోజున ఉరికంబం ఎక్కవలసి వస్తుందనడంలో నాకు సందేహం లేదు. భగవంతుడు మిమ్ము సరియైన మార్గాన తీసుకువెళ్లుగాక. మిమ్ము రక్షించుగాక” సొహరాబ్‌తో నా యీ మాటలు ఆఫీసరు గద్దెక్కిన ఆరంభపు రోజుల్లో జరిగాయి. ఆరంభం, అంతం రెండింటి మధ్య ఎంతో కాలం పట్టలేదు. ఇంతలో నరం వాచి నాకు బాధకలిగింది. 14 రోజుల ఉపవాసానంతరం నా శరీరం పూర్తిగా కోలుకోలేదు. కాని కవాతులో తప్పనిసరిగా పాల్గొనసాగాను. ఇంటినుండి కవాతు చేసే చోటుకు కాలినడకన రెండు మైళ్ళు దూరం వెళుతూ వున్నాను. తత్ఫలితంగా మంచం ఎక్కవలసి వచ్చింది.

ఇట్టి స్థితిలో సైతం నేను ఇతరులతో బాటు క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. మిగతా వారంతా అక్కడ వుండేవారు. నేను సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేవాణ్ణి. ఇక్కడే సత్యాగ్రహానికి బీజారోపణం జరిగిందన్నమాట. ఆఫీసరు తన దర్జా చూపించ సాగాడు. తను అన్ని విషయాల్లోను మాకు ఆఫీసరు అన్నట్లు వ్యవహరించసాగాడు. ఆఫీసరు అట్టి పాఠాలు రెండు మూడు నాకు నేర్పాడు కూడా. సొహరాబ్ నా దగ్గరకు వచ్చాడు. నవాబ్‌గిరీ సహించే స్థితిలో లేడు. “ఏ ఆజ్ఞ అయినా మీ ద్వారానే రావాలి. ఇప్పుడు ఇంకా మనం శిక్షణా శిబిరంలోనే వున్నాం. ప్రతి విషయంలో అర్ధంలేని హుకుములు జారీ అవుతున్నాయి. ఆ యువకులకు మనకు చాలా వ్యత్యాసం చూపబడుతున్నది. దీన్ని సహించడం కష్టం. ఈ వ్యవహారం త్వరగా తేల్చుకోవడం మంచిది. లేకపోతే మనం యిబ్బందుల్లో పడతాం. మనవాళ్లెవరు కూడా అర్ధం పర్ధం లేని హకుములను పాటించేస్థితిలో లేరు. ఆత్మాభిమాన రక్షణ కోసం ప్రారంభించిన పనిలో అవమానాలు కావడం సరికాదు.” అని అన్నాడు.

నేను ఆఫీసరు దగ్గరకు వెళ్ళాను. విషయాలన్నీ ఆయనకు చెప్పివేశాను. ఒక పత్రంలో వాటన్నింటిని వ్రాసి యిమ్మని అంటూ తన అధికారాన్ని గురించి కూడా చెపుతూ “మీద్వారా యిట్టి ఆరోపణలు రాకూడదు. డిప్యూటీ ఆఫీసరుద్వారా తిన్నగా నాదగ్గరకు రావాలి” అని అన్నాడు. “నాకు అధికారాలేమీ అక్కరలేదు. సైనికరీత్యా నేను సామాన్య సిపాయిని మాత్రమే. కాని మాట్రూపునాయకుని హోదాలో మీరు నన్ను వారి ప్రతినిధిగా అంగీకరించక తప్పదు. నాకు అందిన ఆరోపణలు చెప్పాను. అదీకాక ఉపనాయకుల నియామకం మమ్మల్ని అడిగి చేయలేదు. వాళ్ళ విషయమై అంతా అసంతృప్తిగా వున్నారు. అందువల్ల వాళ్లను వెంటనే తొలగించివేయండి. ట్రూపు మెంబర్లకు తమ నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం యివ్వండి.” అని స్పష్టంగా చెప్పివేశాను. నా మాటలు అతనికి మింగుడు పడలేదు. అసలు ఉపనాయకుణ్ణి ఎన్నుకొనే ప్రశ్న లేదు, ఇప్పుడు వాళ్ళను తొలగించితే ఆజ్ఞాపాలనను సైనిక నియమాలకు తావే వుండదు అని అన్నాడు. మేము సభ జరిపాం. చిన్న సత్యాగ్రహానికి పూనుకోవాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటినాయకుల్ని తొలగించక పోతే, క్రొత్త నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం ట్రూపు మెంబర్లకు యివ్వకపోతే మా ట్రూపు కవాతులో పాల్గొనదు, క్యాంపుకు వెళ్ళడం మానివేస్తుంది. అంటూ తీర్మానం చేశాం.

నేను ఆఫీసరుకు మా అసంతృప్తిని వెల్లడిస్తూ జాబు వ్రాశాను. నాకు అధికారం ఏమీ వద్దు. సేవ చేయడానికి వచ్చాం. ఆపని పూర్తి చేయాలి. బోయర్ల సంగ్రామంలో నేను ఎట్టి అధికారం పొందలేదు. అయినా కర్నల్ గేలబ్‌కు మా ట్రూపుకు మధ్య ఎన్నడు ఏ విధమైన పొరపొచ్చము ఏర్పడలేదు. నా ద్వారా మా ట్రూపు అభిప్రాయాలు తెలుసుకొని ఆయన వ్యవహరించేవాడు. అని పత్రంలో వ్రాసి తీర్మానం ప్రతి కూడా దానితోపాటు పంపించాను. అయితే ఆఫీసరు నా పత్రాన్ని ఖాతరు చేయలేరు. మేము మీటింగు జరిపి తీర్మానం ప్యాసు చేయడం కూడా మిలటరీ నియమాలకు వ్యతిరేకమనే నిర్ధారణకు వచ్చాడు. తరువాత నేను భారతమంత్రికి ఈ వ్యవహారమంతా తెలియజేస్తూ జాబు పంపాను. తీర్మానం ప్రతి కూడా దానితో జత చేశాను. భారత మంత్రి వెంటనే సమాధానం వ్రాస్తూ ట్రూపుకు నాయకుని ఉపనాయకుని ఎన్నుకునే అధికారం వున్నది. భవిష్యత్తులో ఆ నాయకుడు మీ సిఫారసులను పాటిస్తాడు అని జాబు పంపాడు. ఆ తరువాత మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా జరిగాయి. ఆచేదు అనుభవాలన్నింటినీ పేర్కొని ఈ ప్రకరణాన్ని పెంచ దలుచుకోలేదు. అయితే హిందూ దేశంలో ప్రతిరోజు మనకు కలుగుతూ వుండే కటు అనుభవాలవంటివే అవి అని చెప్పక తప్పదు.

ఆఫీసరు బెదిరించి మాలో మాకు వైరుధ్యం వచ్చేలా చేశాడు. ప్రతిజ్ఞ చేసిన మాలో కొందరు సామదండభేదాలకు లోబడిపోయారు. ఇంతలో నేటలీ ఆసుపత్రికి అసంఖ్యాకంగా గాయపడ్డ సైనికులు వచ్చారు. వారికి సేవ చేసేందుకు మా ట్రూపు మెంబర్లమంతా అవసరమైనాము. మా వాళ్ళు కొంతమంది నేటలీ వెళ్ళారు. కాని మిగతావాళ్ళు వెళ్ళలేదు. ఇండియా ఆఫీసువారికి ఇలా వెళ్ళకపోవడం నచ్చలేదు. నేను మంచం పట్టినప్పటికి మెంబర్లను కలుసుకుంటూనే వున్నాను. మి.రాబర్ట్సు తో బాగా పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను కలుసుకునేందుకు వచ్చి మిగతా వారిని కూడా పంపమని పట్టుబట్టాడు. వాళ్ళంతా వేరే ట్రూపుగా వెళ్ళవచ్చని, అయితే నేటలీ ఆసుపత్రిలో అక్కడి నాయకుని ఆధీనంలో వుండి ఈ ట్రూపు సభ్యులు పనిచేయాలని, అందువల్ల పరువు నష్టం జరగదని ప్రభుత్వం ఎంతో సంతోషిస్తుందని, గాయపడ్డ సైనికులకు సేవాశుశ్రూషలు లభిస్తాయని మరీ మరీ చెప్పాడు.

నాకు, నా అనుచరులకు వారి సలహా నచ్చింది. దానితో మిగతా వారు కూడా నేటలీ వెళ్ళారు. నేను ఒక్కణ్ణి మాత్రం చేతులు నలుపుకుంటూ పక్కమీదపడి ఆగిపోయాను. 

41. గోఖలేగారి ఔదార్యం

ఇంగ్లాండులో నరం వాపును గురించి వ్రాశాను. నన్ను యీ జబ్బు పట్టుకున్నప్పుడు గోఖలేగారు ఇంగ్లాండు వచ్చారు. వారి దగ్గరికి నేను, కేలన్‌బెక్ తరుచు వెళుతూ వున్నాం. ఎక్కువగా యుద్ధాన్ని గురించిన చర్చ జరుగుతూ వుండేది. జర్మనీ భూగోళం కేలన్‌బెక్‌కు కరతలామలకం. ఆయన యూరపంతా పర్యటించిన వ్యక్తి. అందువల్ల మ్యాపువేసి యుద్ధస్థావరాలను గోఖలేగారికి చూపుతూ వుండేవాడు. నా జబ్బు కూడా చర్చనీయాంశం అయింది. ఆహారాన్ని గురించిన నా ప్రయోగాలు సాగుతూనే వున్నాయి. ఆ సమయంలో వేరుశెనగపప్పు, పచ్చి మరియు పండిన అరటిపండ్లు, టమోటాలు, ద్రాక్షపండ్లు మొదలగు వాటిని భుజిస్తున్నాను. పాలు, ధాన్యం పప్పు పూర్తిగా మానివేశాను. డా. జీవరాజ్‌మెహతా వైద్యం చేస్తున్నారు. ఆయన గోధుమ తినమని పాలు త్రాగమని బలవంతం చేశారు. గోఖలేగారికి యివిషయమై నామీద పితూరీ వెళ్ళింది. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని నేను చేసుకున్న నిర్ణయాన్ని గోఖలేగారు అంతగా ఆదరించలేదు. ఆరోగ్యదృష్యా డాక్టర్ల సలహాలను పాటించాలని వారి అభిప్రాయం. గోఖలేగారి మాటను ఉల్లంఘించలేను. వారు గట్టిగా పట్టుబట్టారు. 24 గంటల వ్యవధి కోరాను. నేను మరియు కేలన్‌బెక్ యింటికి వచ్చాము. త్రోవలో నా కర్తవ్యాన్ని గురించి చర్చించాం. నేను చేస్తున్న ప్రయోగాలు ఆయనకూడా చేస్తున్నాడు. ఆరోగ్యదృష్ట్యా యీ ప్రయోగాలలో మార్పు చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక అంతర్వాణి పై ఆధారపడ్డాను. రాత్రంతా ఆలోచించాను. నా ప్రయోగాలన్ని మానుకుంటే నా కృషి అంతా నిరర్ధకం అయిపోతుంది. నా అభిప్రాయాల్లో నాకు ఏవిధమైన దోషమూ కనబడలేదు. అయితే గోఖలేగారి ప్రేమకు లొంగిపోవడమా లేక నా శోధనల ప్రకారం ముందుకు సాగడమా తేల్చుకోవలసి వున్నది. బాగా యోచించి ధర్మబద్ధమైన ప్రయోగాలను సాగిస్తూ మిగతా ప్రయోగాల విషయమై డాక్టర్ల సలహాను పాటించాలనే నిర్ణయానికి వచ్చాను. పాల విషయం ధర్మబద్ధం కనుక పాలు త్రాగకూడదు. మిగతా వాటి విషయంలో డాక్టరు సలహా పాటించాలి అని భావించాను. కలకత్తాలో ఆవులను, గేదెలను చిత్రహింసకు గురిచేస్తున్న దృశ్యాలు నాకండ్లకు కనబడసాగాయి. పశువుల మాంసం ఎంత త్యాజ్యమో, పశువుల పాలుకూడా అంత త్యాజ్యమే. అందువల్ల పాలు మాత్రం త్రాగకూడదని నిర్ణయించుకొని ప్రొద్దున్నే లేచాను. నా మనస్సు తేటపడింది. కాని గోఖలేగారు ఏమంటారోనని భయం పట్టుకున్నది. వారు నా నిర్ణయాన్ని కాదనలేరులే అను ధైర్యం కూడా కలిగింది.

సాయంత్రం నేషనల్ లిబరల్ క్లబ్బులో వారిని కలుసుకునేందుకు వెళ్ళాము. డాక్టరు సలహా పాటించాలని నిర్ణయించారా? అని నన్ను చూడగానే గోఖలే ప్రశ్నించారు. “అన్నీ పాటిస్తాను. కాని ఒక్క విషయంలో మాత్రం మీరు పట్టు పట్టకండి. పాలు, పాలతో తయారైన వస్తువులు, మాంసం వీటిని తీసుకోను. అందువల్ల ప్రాణం పోయినా సరే సిద్ధపడమని నా మనస్సు, ఆదేశం” అని మెల్లగా అన్నాను.

“ఇది మీ చివరి నిర్ణయమా”

“మరో సమాధానం యివ్వడం సాధ్యంకాదు. మీకు విచారం కలుగుతుందని నాకు తెలుసు. మన్నించండి” “మీ నిర్ణయం సరికాదు. అందు ధర్మ బద్ధం అంటూ ఏమి లేదు. అయినా మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను” అని అన్నారు. గోఖలే మాటల్లో విచారం నిండి వున్నా ప్రేమమాత్రం అపరిమితంగా వెల్లడి అయింది. జీవరాజ్ మెహతా వైపు చూచి “ఇక గాంధీని బాధించకండి. ఆయన నిర్ణయానికి కట్టుబడి చేయగలిగిన చికిత్స చేయండి” అని అన్నారు.

డాక్టరు తన అసంతృప్తిని వెల్లడించారు. కాని తప్పనిసరికదా! పెసరనీళ్ళు త్రాగమని సలహా యిచ్చారు. అందు కొద్దిగా ఇంగువ కలపమని చెప్పారు. నేను అంగీకరించాను, ఒకటి రెండు రోజుల ఆ విధంగా చేశాను. నా బాధ యింకా పెరిగింది. పెసరనీళ్ళు పడలేదు. అందువల్ల నేను తిరిగి పండ్లు తినడం ప్రారంభించాను. డాక్టరు కొంత వైద్యం చేశారు. బాధ కొద్దిగా తగ్గింది. నా నియమాలు, నిబంధనలు చూచి డాక్టరు భయపడ్డారు. ఈ లోపున అక్టోబరు నవంబరు మాసాలలో ఇంగ్లాండులో ముమ్మరంగా ప్రారంభమయ్యే మంచును తట్టుకోలేక గోఖలేగారు ఇండియాకు బయలుదేరి వెళ్ళారు.

42. నొప్పి తగ్గేందుకు

నరాల నొప్పి తగ్గలేదు. కొంచెం కంగారు పడ్డాను. మందులవల్ల నొప్పి తగ్గదని, ఆహారంలో మార్పు వల్ల బయటి ఉపచారాలవల్ల నొప్పి తగ్గుతుందని భావించాను. 1890 లో అన్నాహారం మరియు యితర ఉపచారాల ద్వారా చికిత్స చేసే డాక్టర్ ఎలిన్సన్ గారిని పిలిపించాను. ఆయన వచ్చాడు. నా శరీరం వారికి చూపించాను. పాలను గురించిన నా నిర్ణయం తెలియజేశాను. ఆయన నాకు ధైర్యం చెప్పాడు పాలు అక్కర్లేదు. కొద్దిరోజులపాటు జిగురుపదార్థాలు తినవద్దు అని చెప్పాడు. ఒట్టి రొట్టె, పచ్చికూరలు, ఉల్లిపాయలు, పచ్చకూర, నారింజపండు తినమని చెప్పాడు. ఈ కూరలతో పాటు సొరకాయపచ్చడి తినవలసి వచ్చింది. మూడు రోజుల గడిచాయి. పచ్చికూరలు పడలేదు. ఈ ప్రయోగం పూర్తిగా చేసే స్థితిలో నా శరీరం లేదు. పైగా అట్టి శ్రద్ధ కూడా కలుగలేదు. 24 గంటలు కిటికీలు తెరిచివుంచమని, గోరువెచ్చని నీటితో స్నానం చేయమని, నొప్పిగా వున్న చోట తైలంతో మర్దన చేయమని, అరగంట సేపు తెరపగాలిలో తిరగమని సలహాయిచ్చాడు. ఈ సలహా నాకు నచ్చింది. నేను వున్న యింటి కిటికీలు ఫ్రెంచి పద్ధతిలో వున్నాయి. వాటిని పూర్తిగా తెరిస్తే వర్షపునీరు ఇంట్లోకి రాసాగింది. వెంటిలేటర్లు తెరుచుకోవు. అందువల్ల వాటి అద్దాలను తొలగించి వేసి 24 గంటలు గాలివచ్చేలా ఏర్పాటు చేయించాను. వర్షం జల్లులు లోపలికి రాకుండా వుండేలా కిటికీ తలుపులు కొంచెంగా మూసి వుంచాను. దానితో ఆరోగ్యం కొద్దిగా కుదుటపడింది. అయితే పూర్తిగా కుదుటపడలేదు. అప్పుడప్పుడు లేడీ సిసిలియా రాబర్ట్స్ నన్ను చూచేందుకు వస్తూ వుండేది. నా చేత పాలు త్రాగించాలని ఆమె భావించింది. నేను త్రాగనని తెలుసుకొని అట్టి గుణాలు గల పదార్ధాలు మరేమైనా వున్నాయా అని అన్వేషణ ప్రారంభించింది. మాల్టెడ్‌మిల్కును గురించి మిత్రుడు తెలిపి అందుపాలు కలవవని సరిగా తెలుసుకోకుండానే ఆమెకు చెప్పాడు. అది రసాయన పదార్ధంతో తయారు చేయబడ్డ పాలగుణం కలిగిన గుజ్జు. ఆమెకు నా నిర్ణయం యెడ అపరిమితమైన ఆదరం కలదని నాకు తెలుసు. అందువల్ల ఆమె తెచ్చిన ఆ గుజ్జును నీళ్ళలో కలిపి పుచ్చుకున్నాను. పాలరుచి పూర్తిగా అందువున్నది. ఎడం చేతికి బదులు పుర్ర చెయ్యి పెట్టు అన్నట్లున్నది యీ తతంగం. సీసామీదగల చీటి చదివాను. పాలతో తయారుచేయబడిన వస్తువు అని స్పష్టంగా అందు వ్రాసివున్నది. అందువల్ల ఒక్క సారి వాడి దాన్ని మానవలసి వచ్చింది. ఈ విషయం లేడీ రాబర్ట్స్‌నుకు జాబుద్వారా తెలిపి ఏమీ అనుకోవద్దని వ్రాశాను. ఆమె వెంటనే పరుగెత్తుకు వచ్చి జరిగిన దానికి మన్నించమని కోరింది. ఆమె మిత్రుడు అసలు లేబులు చదవనేలేదన్నమాట. మీ వంటి మంచి మనస్సు గల సోదరి ఆప్యాయతతో అందజేసిన వస్తువును వదిలినందుకు క్షమించమని ఆమెను వేడుకున్నాను. తెలియక ఒక్క పర్యాయం పుచ్చుకున్నందుకు పశ్చాత్తాపపడమని, ప్రాయశ్చిత్తం చేసుకోనని కూడా ఆమెకు తెలియచేశాను.

ఆమె వల్ల కలిగిన మధురస్మృతులు యింకా వున్నాయి. కాని వాటిని వదిలి వేస్తున్నాను. ఆపదలో సాయపడ్డ యిటువంటిస్మృతులు అనేకం వున్నాయి. భగవంతుడు దుఃఖమనే చేదు మందులు త్రాగించి వాటితో పాటు తీయని స్నేహమనే పథ్యం కూడా రుచి చూపుతాడని శ్రద్ధాళువులు గ్రహింతురుగాక. డాక్టర్ ఎలిన్సన్ నన్ను చూచేందుకు రెండోసారి వచ్చారు. యీ సారి ఎక్కువ స్వాతంత్ర్యం యిచ్చారు. నునుపుతనంగల ఎండు ద్రాక్ష, వేరుశెనగపప్పుతో తయారయ్యే వెన్న తీసుకోమని చెప్పారు. పచ్చికూరలు రుచించకపోతే ఉడకబెట్టి అన్నంలో కలిపి తినమని చెప్పారు. ఆహారంలో ఈ మార్పు నా ఒంటికి బాగా పనిచేసింది.

కాని నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. డాక్టర్ మెహతా అప్పుడప్పుడు వచ్చి చూచి వెళుతూ వున్నారు. “నేను చెప్పిన ప్రకారం చికిత్స చేయించుకుంటే తక్షణం నయం చేస్తా” అని ఆయన ఎప్పుడూ అంటూ వుండేవాడు. ఒకనాడు మి. రాబర్ట్స్ వచ్చి ఇండియా వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఈ పరిస్థితిలో మీరు నేటలీ వెళ్లడం కష్టం. ముందు ముందు చలి మరీ తీవ్రం అవుతుంది. యిక మీరు మీ దేశం వెళ్ళండి. జబ్బు నయం అవుతుంది. అని గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు యుద్ధం సాగుతూ వుంటే మీకు అందు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇక్కడ మీరు చేసిన సహకారం తక్కువైంది కాదు” అని అన్నాడు. ఆయన సలహా అంగీకరించి హిందూ దేశానికి బయలుదేరాను. 

43. ప్రయాణం

కేలెన్‌బెక్ నాతోబాటు హిందూ దేశానికి బయలుదేరారు. ఇంగ్లాండులో మేము కలిసే వున్నాం. కాని యుద్ధం కారణంగా జర్మను దేశస్థుల మీద నిఘా ఎక్కువైంది. అందువల్ల కేలన్‌బెక్ రాకను గురించి మాకు సందేహం కలిగింది. వారికి పాస్‌పోర్టు సంపాదించేందుకు నేను చాలా ప్రయత్నం చేశాను. మి. రాబర్ట్స్ ఆయనకు పాస్‌పోర్టు యిప్పించేందుకు సిద్ధపడ్డారు. ఆయన యీ వివరమంతా మెయిల్ ద్వారా వైస్రాయికి తెలియజేశారు. కాని లార్డ్‌హార్డింగ్ దగ్గర నుంచి “ఈ సమయంలో నేనీ ప్రమాదకరమైన పనికి సహకరించలేనని తెలుపుటకు చింతిస్తున్నాను. అంటూ ఠపీమని సమాధానం వచ్చింది. ఈ సమాధానమందలి ఔచిత్యాన్ని మేమంతా గ్రహించాము. కేలన్‌బెక్‌ను వదులుతున్నప్పుడు నాకు వియోగ బాధ అమితంగా కలిగింది. కేలన్‌బెక్‌కు కలిగిన దుఃఖం వర్ణనాతీతం. ఆయన హిందూ దేశం వచ్చి వుంటే మంచి రైతుగా, మంచి నేతవానిగా సాదాజీవితం గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో శేషజీవితం గడుపుతూ వున్నారు. గృహనిర్మాణానికి సంబంధించిన వృత్తిని చేపట్టి దాన్ని బాగా సాగిస్తున్నారు. మూడోతరగతి టిక్కెట్టుపై ప్రయత్నించాము.

మేము ఓడ ప్రయాణానికి పి. అండ్ ఓ. ఓడలో మూడోతరగతి టిక్కెట్టు తీసుకున్నాము. దక్షిణ ఆఫ్రికానుంచి తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు వెంట పెట్టుకున్నాం. మరో పదార్థాలు దొరుకుతాయి కాని అవి ఓడలో దొరకవు. డా. మెహతా నాశరీరాన్ని మీడ్జ్ ప్లాస్టరుతో కట్టివేశాడు. దాన్ని అలాగే వుంచమని సలహా యిచ్చాడు. రెండు రోజులు దాన్ని భరించాను. కాని యిక తట్టుకోలేక పోయాను. కొద్దిగా శ్రమపడి దాన్ని ఊడదీసి స్నానం చేశాను. ఎండు ద్రాక్ష, తాజా పండ్లు మాత్రం తీసుకుంటూ వున్నాను. ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడసాగింది. ఓడ సూయజ్ కాలువలోకి ప్రవేశించునప్పటికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. నీరసంగా వున్నప్పటికీ నన్ను పట్టుకున్న భయం వదిలింది. రోజురోజుకీ వ్యాయామం పెంచుతూ వున్నాను. ఈ మార్పుకు కారణం పరిశుద్ధమైన శీతోష్ణస్థితియేయని నాకు బోధపడింది. ఎందువల్లనో గాని మాకూ అక్కడవున్న ఆంగ్ల యాత్రికులకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడింది. ఇంత వ్యత్యాసం దక్షిణ ఆఫ్రికాలో నాకు కనబడలేదు. అక్కడ కూడా తేడా వుందికాని, యింత తేడా మాత్రం లేదని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఆంగ్ల యాత్రికుల్ని కలిసినా “క్షేమంగా వున్నారా? వున్నాము” అంతటితో సంభాషణ ఆగిపోతూ వున్నది. మనస్సులు కలవలేదు. స్టీమరులోను దక్షిణ ఆఫ్రికాలోను మనస్సులు కలిసేవి. మేము పరిపాలకులం అని ఆంగ్లేయులు, మేము పాలితులం అని హిందూ దేశస్థులు తెలిసో తెలియకో భావించడం యిందుకు కారణమని గ్రహించాను. ఇటువంటి వాతావరణా న్నుండి త్వరగా బయటపడి దేశం చేరుకోవాలని తహతహలాడాను. అదస్ చేరాక యింటికి చేరినట్లనిపించింది. దక్షిణాఫ్రికాలో అదస్ ప్రజలతో నాకు సంబంధం ఏర్పడింది. అక్కడ భాయికైకోబాద్‌కావస్ దీన్షా డర్బను విచ్చేసినప్పుడు ఆయనతోను, ఆయన భార్యతోను నాకు బాగా పరిచయం ఏర్పడింది. తరువాత కొద్ది రోజులకు మేము బొంబాయి చేరాం. 1905 కే తిరిగి వద్దామనుకున్న దేశానికి పదిసంవత్సరాల తరువాత వచ్చానన్నమాట. ఎంతో ఆనందం కలిగింది. బొంబాయిలో గోఖలేగారు స్వాగత సత్కారాల నిమిత్తం ఏర్పాట్లు చేశారు. వారి ఆరోగ్యం సరిగా లేదు. అయినా వారు బొంబాయి వచ్చారు. వారిని కలుసుకొని, వారిజీవితంతో కలిసిపోయి నా బరువును తగ్గించుకోవాలనే కోరికతో బొంబాయి చేరాను. కాని సృష్టికర్త నా నొసట మరో విధంగా లిఖించాడు. 

44. వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు

హిందూ దేశం వచ్చిన తరువాత నా జీవనస్రవంతి ఎలా ముందుకు సాగిందో వివరించే ముందు దక్షిణ ఆఫ్రికాలో జరిగిన కొన్ని ఘట్టాలు యిక్కడ తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. వాటిని నేను గతంలో కావాలనే వదిలి వేశాను. కొంత మంది మిత్రులు నా వకీలు జీవితపు అనుభవాలు తెలుపమని కోరారు. అట్టి జ్ఞాపకాలు కోకొల్లలు. వాటిని వ్రాయడం ప్రారంభిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. కొన్ని జ్ఞాపకాల్ని మాత్రం యిక్కడ తెలుపుతాను. వకీలు వృత్తిలో నేను ఆధారం చేసుకోలేదని మొదటనే తెలియజేశాను. నిజానికి నా వకీలు వృత్తితో ఎక్కువ భాగం సేవకే సమర్పించాను. జేబు ఖర్చుకు సరిపడే సొమ్ము మినహా మరింకేమీ తీసుకోలేదు. ఎన్నో పర్యాయాలు ఆ సామ్ముకూడా వదిలివేస్తూ వుండేవాణ్ణి. యింతటితో ఆపుదామంటే సత్యపాలనకోసం మీరు చేసిన వకీలు వృత్తిని గురించి ఏమి రాసినా ప్రయోజనం కలుగుతుందని మిత్రులు అభిప్రాయపడ్డారు. వకీలు వృత్తియందు అబద్ధాలు తప్పవని నా చిన్నతనం నుండి వింటూ వచ్చాను. అబద్ధాలాడి నేను ఏమైనా పదవినిగాని, ధనాన్నిగాని ఆశించలేదు. అందువల్ల అటువంటిమాటల ప్రభావం నామీద ఏమీ పడలేదు. దక్షిణ ఆఫ్రికాలో ఎన్నో పర్యాయాలు నాకు పరీక్ష జరిగింది. ఎదురు పార్టీ వాళ్ళు సాక్షులకు పాఠం నూరిపోస్తారని నాకు తెలుసు. నేను కూడా అలా చేస్తే, కక్షిదారును అబద్ధాలాడమని ప్రోత్సహిస్తే కేసు డిక్రీ కావడం ఖాయమే, కాని నేను అట్టి లోభంలో పడలేదు. ఒక్క కేసు విషయం నాకు బాగా జ్ఞాపకం వున్నది. కేసు గెలిచిన తరువాత కక్షిదారు నన్ను మోసగించాడని తెలుసుకున్నాను. అసలు కేసులో నిజం వుంటే గెలవాలని లేకపోతే ఓడాలని భావించేవాణ్ణి. గెలుపు ఓటమిని బట్టి సొమ్ము తీసుకునే వాణ్ణి కాదు. కక్షిదారు గెలిచినా లేక ఓడినా చేసిన శ్రమకు సరిపోయే సొమ్ము మాత్రమే తీసుకునేవాణ్ణి. “నీ కేసులో నిజం లేకపోతే నా దగ్గరికి రావద్దు, సాక్షులకు అబద్ధాలు నూరి పోయడం వంటి పనులు నేను చేయను.” అని ముందే చెప్పినవాణ్ణి. అందువల్ల అబద్ధం కేసులు నా దగ్గరకు వచ్చేవి కావు. నా పరపతి ఆ విధంగా పెరిగింది. నిజం వున్న కేసులు నాకు అప్పగించి అబద్ధం కేసులు మరో వకీలుకు అప్పగించే కక్షిదారులు కూడా వున్నారు.

ఒక పర్యాయం నాకు కఠిన పరీక్ష జరిగింది. అది నమ్మకమైన నా కక్షిదారుకు సంబంధించిన కేసు. అందు ఖాతాలెక్కల చిక్కులు అనేకం వున్నాయి. కేసు చాలా కాలం నడిచింది. ఆ కేసుకు సంబంధించిన విషయాలమీద వివిధ కోర్టుల్లో విచారణ జరిగింది. చివరికి కోర్టుకు సంబంధించిన లెక్కల్లో నిష్ణాతులైన కొందరిని పంచాయతీదారులుగా నిర్ణయించి వారికి లెక్కల వ్యవహారం అప్పగించారు. పంచాయతీదారుల తీర్పు ప్రకారం నా కక్షిదారు గెలవడం ఖాయమని తేలింది. కాని అతని లెక్కలో ఒక పెద్ద పొరపాటు దొర్లిపోయింది. జమా ఖర్చులో పంచాయతీదారుల దృక్పధం ప్రకారం ఇటు అంకెలు అటు చేర్చబడ్డాయి. ఎదుటి పక్షం వకీలు పంచాయితీ దారుల పొరపాటును గ్రహించాడు. అయితే పంచాయితీదారుల పొరపాటును అంగీకరించడం కక్షిదారు పనికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎదురు పార్టీ వారి మాటల్ని అంగీకరించవలసిన అవసరం మనకు లేదని ఆయన అన్నాడు. జరిగిన పొరపాటును అంగీకరించడం మంచిదని నేను అన్నాను. పెద్ద వకీలు అంగీకరించలేదు. “అలా అంగీకరిస్తే కోర్టు మొత్తం తీర్పునే రద్దుచేసే ప్రమాదం వున్నదని అట్టి ప్రమాదంలో తెలివిగల ఏ వకీలు తన కక్షిదారును పడవేయడని, నేను మాత్రం యిట్టి ప్రమాదానికి పూనుకోనని, కేసు విచారణ మళ్ళీ ప్రారంభమైతే కక్షిదారు డబ్బు బాగా ఖర్చు పెట్టవలసి వస్తుందని చివరకి తీర్పు ఎలా యిస్తారో చెప్పడం కష్టమని స్పష్టంగా చెప్పివేశాడు.

ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కక్షిదారు అక్కడే వున్నాడు. “ఇట్టి ప్రమాదానికి సిద్ధపడక తప్పదు. మనం అంగీకరించకపోయినా పొరపాటు జరిగిందని తెలిసిన తరువాత, ఆ తీర్పు మీద కోర్టు నిలబడి వుంటుందని భావించడం సరికాదు కదా! పొరపాటును సరిదిద్దుకుంటున్నప్పుడు కక్షిదారు నష్టపడినా తప్పేమిటి” అని ప్రశ్నించాను.

“కాని మనం పొరపాటున అంగీకరించినప్పుడు గదా ఇదంతా?” అని అన్నాడు పెద్దవకీలు. ‘మనం అంగీకరించక పోయినా, కోర్టు జరిగిన పొరపాటును గ్రహించదని లేక ప్రతివాదులు యీ పొరపాటును కోర్టు దృష్టికి తీసుకురారని భావించడం సబబా?’ అని అడిగాను. పెద్ద వకీలు యిక ఒక నిర్ణయానికి వచ్చి “అయితే యీ కేసులో మీరు వాదించండి. పొరపాటును అంగీకరించే షరతుమీద అయితే నేను రాను. వాదనలో పాల్గొనను” అని చెప్పి వేశాడు.

“మీరు రాకపోయినా కక్షిదారుకోరితే నేను యీ కేసులో వాదిస్తాను. జరిగిన పొరపాటును అంగీకరించే షరతులమీదనే నేను వాదిస్తాను. అంగీకరించవద్దంటే మాత్రం నేను వాదించను.” అని చెప్పి వేశాను. ఆవిధంగా చెప్పి నేను కక్షిదారు వంక చూచాను. కక్షిదారు పెద్దచిక్కుల్లో పడ్డాడు. ఈ కేసు విషయమై మొదటి నుండి శ్రద్ధ వహించియున్నందున, కక్షిదారుకు నా మీద అమిత విశ్వాసం కలిగింది. నా స్వభావం కూడా అతడికి పూర్తిగా తెలుసు. కొద్ది సేపు ఆలోచించి అతడు ఒక నిర్ణయానికి వచ్చి “సరేనండీ. మీరే కోర్టులో వాదించండి. జరిగిన పొరపాటును అంగీకరించండి. ఓటమి నొసటన వ్రాసివుంటే ఓడిపోతాను. అన్నింటికీ సత్యరక్షకుడు ఆ రాముడే” అని అన్నాడు. నాకు పరమానందం కలిగింది. మరో విధంగా అతడు జవాబిస్తాడని నేను భావించలేదు. పెద్ద వకీలు నన్ను మరీమరీ హెచ్చరించాడు. మొండి పట్టుపడుతున్నందున నామీద జాలి కూడా పడ్డారు. చివరికి ధన్యవాదాలు తెలిపాడు. ఇక కోర్టులో ఏమి జరిగిందో తరువాత వివరిస్తాను. 

45. గడుసుతనం

నా సలహా యందలి ఔచిత్యాన్ని గురించి నాకు కొంచెం కూడా సందేహం కలుగలేదు. కాని ఆ కేసు విషయంలో వాదన సాగించాలంటే నాకు సందేహం కలిగింది. యిలాంటి ప్రమాదకరమైన కేసులో పెద్ద కోర్టులో వాదించడం ప్రమాదమని తోచింది. అందువల్ల భయపడుతూనే నేను జడ్జిగారి యెదుటలేచి నిలబడ్డాను. ఆ పొరపాటును గురించిన మాట ఎత్తగానే ఒక న్యాయాధిపతి “ఇది గడుసుతనం అని అనిపించుకోదా” అని అన్నాడు.

నేను లోలోన మండి పడ్డాను. అసలు గడుసుతనానికి తావే లేనప్పుడు ‘మొదటనే జడ్జి వ్యతిరేకమైతే కఠినమైన యీ కేసులో విజయం పొందడం సాధ్యంకాదు’ అని అనిపించింది. కోపాన్నీ అణుచుకొని ‘అయ్యా! మీరు పూర్తి విషయం వినకుండానే గడుసుతనం అని దోషారోపణ చేయడం ఆశ్చర్యకరం’ అని ప్రశాంతంగా అన్నాను. “నేను దోషారోపణ చేయడం లేదు. సందేహం వ్యక్తం చేశాను.” అని అన్నాడు జడ్జీ. “మీ సందేహం నాకు దోషారోపణగా భాసించింది. నిజమేమిటో మనవి చేశాక సందేహానికి తావుంటే మీరు సందేహించవచ్చు” అని అన్నాను. దానితో జడ్జీ శాంతించాడు. మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు విచారిస్తున్నాను. మీరు మీ విషయం విశదంగా చెప్పండి. అని అన్నాడు. జడ్జీ దగ్గర బలవత్తరమైన ఆధారాలు వున్నాయి. ప్రారంభంలోనే ఆయన సందేహించడం, జడ్జీ దృష్టిని నా వాదన మీదకు ఆకర్షించగలగడం వల్ల నాకు ధైర్యం చేకూరింది. సవివరంగా కేసును గురించి చెప్పాను. జడ్జీలు ఓపికగా నావాదనంతా విన్నారు అజాగ్రత్తవల్ల పొరపాటు జరిగిపోయిందనే నమ్మకం నా వాదన విన్న మీదట వారికి కలిగింది. ఎంతో కష్టపడి తయారు చేసిన లెక్కను రద్దుచేయడం ఉచితం కాదని వారికి తోచింది. ఎదుటి పక్షపు వకీలుకు పొరపాటు జరిగిందని నేను చెప్పిన మీదట యిక తాను వాదించవలసింది ఏమీ వుండదని తెలుసు. అయితే యింత స్పష్టంగా సవరించుటకు వీలుగా వున్న పొరపాటు కోసం పంచాయతీ దారుల తీర్పును రద్దుచేసేందుకు జడ్జీలు సిద్ధపడలేదు. పాపం ఆ వకీలు బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. ప్రారంభంలో సందేహం వ్యక్తం చేసిన జడ్జీయే నా వాదనను గట్టిగా సమర్ధించాడు. గాంధీ పొరపాటును అంగీకరించి యుండకపోతే మీరు ఏం చేసేవారు అని జడ్జీ ఆ వకీలును ప్రశ్నించాడు. లెక్కల నిపుణులను మేము నియమించాము. అంతకంటే మించిన నిపుణులను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? అని అంటూ “ఈ కేసును గురించిన వ్యవహారంలో బాగా తెలుసుకున్నారని భావిస్తున్నాం. లెక్కలనిపుణులు కూడా పొరపాటు పడవచ్చు. మరో పొరపాటు ఏదీ మీరు చూపించలేదు. అట్టి స్థితిలో నియమాలకు సంబంధించిన కొద్ది పొరపాటుకు ఉభయ పార్టీలచేత క్రొత్తగా మళ్ళీ ఖర్చు చేయించడానికి కోర్టు సిద్ధంకాజాలదు. కేసును తిరిగి విచారించమని మీరు కోరితే అది సాధ్యం కాని పని అని జడ్జీలు అన్నారు. ఈ విధమైన తర్కంతో ప్రతి పక్షానికి చెందిన వకీలును శాంతపరిచి పొరపాటును సరిచేసి లేక యీ చిన్న పొరపాటును సరిదిద్ది మళ్ళీ తీర్పు యిమ్మని పంచాయితీ దారుల్ని ఆదేశించి, కోర్టు సరిదిద్దబడిన తీర్పును ఖాయం చేసింది. నేను ఎంతో సంతోషించాను. కక్షిదారు మరియు పెద్ద వకీలుకూడా సంతోషించారు. వకీలు వృత్తిలో కూడా సత్యరక్షణ కావిస్తూ పని చేయవచ్చుననే నా అభిప్రాయం దృఢపడింది.

వృత్తి కోసం చేసే వకాల్తాలో దోషం వుంటే, దాన్ని సత్యం కప్పి వుంచలేదని పాఠకులు గ్రహింతురుగాక. 

46. కక్షిదారులు అనుచరులుగా మారారు

నేటాలు మరియు ట్రాన్సువాలుల వకాల్తాలో ఒక తేడా వున్నది. నేటాలులో అడ్వొకేట్‌కు మరియు అటార్నికి తేడా వున్నప్పటికి యిద్దరూ కోర్టులన్నింటియందు సమానంగా వకాల్తాకు పూనుకోవచ్చు. ట్రాన్సువాలులో బొంబాయి వలెనే వ్యవహారం సాగుతున్నది. అక్కడ కక్షిదారుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అడ్వొకేట్ అటర్ని ద్వారానే జరుగుతాయి. నేటాలులో నేను అడ్వకేట్‌గా ధృవీకరణ పత్రం తీసుకున్నాను. ట్రాన్సువాలులో అటార్నీ పత్రం పుచ్చుకున్నాను. అడ్వొకేట్‌గా వుంటూ హిందు దేశస్థులతో నాకు తిన్నగా సంబంధం వుండదు. తెల్లవాడైన అటార్నీ నాకు కేసులు అప్పగించే స్థితి దక్షిణ ఆఫ్రికాలో లేదు. ట్రాన్సువాలులో వకాల్తా చేస్తూ మేజిస్ట్రేటు కోర్టుకు నేను చాలా సార్లు వెళ్ళాను. ఒక పర్యాయం విచారణలో వున్న ఒక కేసులో నా కక్షిదారు నన్ను మోసం చేశాడని తేలింది. అతని కేసు అబద్ధాల పుట్ట. అతడు బోనులో నిలబడి వణికిపోయాడు. పడిపోయే స్థితిలో వున్నాడు. నేను మేజిస్ట్రేటును “అయ్యా. నా కక్షిదారుకు కఠిన శిక్ష విధించండి” అని కోరి కూర్చున్నాను. ప్రతిపక్షానికి చెందిన వకీలు నివ్వెరబోయాడు. మేజిస్ట్రేటు సంతోషించాడు. కక్షిదారును నేను బాగా కోప్పడ్డాను. ముందుగనే అబద్ధం కేసుతీసుకోనని అతడికి గట్టిగా చెప్పాను. అతడు అందుకు అంగీకరించాడు కూడా. అందువల్ల అతడికి శిక్షవిధించమని కోరినందున అతడు కోపం తెచ్చుకోలేదు. ఏదిఏమైనా నా యీ వ్యవహార ప్రభావం నా వృత్తిమీద పడలేదు. కోర్టులో నా పని సులభమైపోయింది. సత్యనిష్టవల్ల వకీలు మిత్రుల దృష్టిలో నాకు గౌరవం పెరిగింది. వారందరి ఆదరణ పొందగలిగాను. వకీలు వృత్తి సాగిస్తున్నప్పుడు కక్షిదారు దగ్గర గాని, వకీలు దగ్గర గాని నా అజ్ఞానాన్ని దాచేవాణ్ణికాదు. నాకు బోధపడనప్పుడు మరో వకీలు దగ్గరకు వెళ్ళమని కక్షిదారుకు నేనే సలహా యిచ్చేవాణ్ణి. అతడు నన్నే పనిచేయమంటే మరో అనుభవజ్ఞుడైన వకీలు సలహా పొందుతానని చెప్పేవాణ్ణి. ఈ విధంగా వ్యవహరించడంవల్ల కక్షిదారులు నన్ను విశ్వసించేవారు. పెద్ద వకీలు దగ్గరకు వెళ్ళి సలహా తీసుకునేందుకు అయ్యే వ్యయం కూడా వారే సంతోషంగా భరించేవారు. అట్టి వారి ప్రేమ, విశ్వాసాలు నా ప్రజాసేవకు బాగా ఉపకరించాయి. గత ప్రకరణంలో దక్షిణ ఆఫ్రికాలో నా వకీలు వృత్తి లక్ష్యం ప్రజా సేవయేనని తెలియజేశాను. ప్రజా సేవ చేయడానికి కూడా ప్రజల విశ్వాసం పొందడం చాలా అవసరం. డబ్బు తీసుకొని నేను వకీలు పని చేసినా ఉదార హృదయంతో ప్రజలు నా పనిని సేవా కార్యంగానే భావించారు. జైళ్ళకు వెళ్లవలసి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండానే నామీద గల ప్రేమ విశ్వాసాల కారణంగా సిద్ధపడ్డారు. ఈ విషయాలు వ్రాస్తున్నప్పుడు వకీలు వృత్తికి సంబంధించిన ఎన్నో మధుర స్మృతులు నా కలాన్ని ఆవహిస్తున్నాయి. చాలామంది కక్షిదారులు నాకు మిత్రులుగా మారిపోయారు. ప్రజా సేవలో నాకు నిజమైన అనుచరులుగా వుండి నా కఠోర జీవితాన్ని సరళం చేశారు. 

47. అపరాధి జైలుశిక్ష పడకుండా తప్పించుకున్న విధానం

పారశీ రుస్తుంగారి పేరుతో ఈ ప్రకరణాల పాఠకులు సుపరిచితులే. ఆయన ఒకే సమయంలో నాకు కక్షిదారు, ప్రజాకార్యరంగంలో అనుచరుడు ఆయ్యాడు. మరో విధంగా చెప్పాలంటే ముందు అనుచరుడు తరువాత కక్షిదారు అయ్యాడన్నమాట. ఆయన విశ్వాసాన్ని నేను అపరిమితంగా చూరగొన్నాను. తన స్వంతవిషయాలేగాక తన ఇంటి విషయాల్లో సహితంగా నా సలహాలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకునేవాడు. ఆయనకు జబ్బు చేసినా నా సలహా అవసరమని భావించేవాడు. మా ప్రవర్తనా తీరులో ఎంతో వ్యత్యాసం వుండేది. ఆయన తన జబ్బులకు నా చికిత్సను వాడి చూచేవాడు. ఒక పర్యాయం పెద్ద ఆపద విరుచుకుపడింది. తన వ్యాపార రహస్యాలు నాకు చెపుతూ వుండేవాడు. అయినా ఒక రహస్యాన్ని దాచివుంచాడు. పారసీ రుస్తుంజీ చెల్లించవలసిన పన్ను చెల్లించేవాడు కాదు. దొంగ వ్యాపారం సాగించేవాడన్నమాట. బొంబాయి కలకత్తా నుండి వస్తువులు తెప్పించేవాడు. ఇక్కడే దొంగ వ్యాపారం జరుగుతూ వుండేది. అధికారులందరితో ఆయనకు మంచి సంబంధాలు పుండటం వల్ల ఆయనను ఎవ్వరూ సందేహించేవారు కాదు. ఆయన చూపించిన రశీదుల్ని, పట్టీలను బట్టి పన్ను వసూలు చేస్తూవుండేవారు. అప్పుడప్పుడు కొద్దిగా అనుమానం కలిగినా ఆఫీసర్లు చాలామంది కళ్ళు మూసుకునేవారన్నమాట. కాచో పారో ఖవో ఆన్, తేవుం ఛే చోరీ సుందన్ (పాదరసం తినడం, దొంగసొత్తు తినడం రెండూ సమానం సుమా) అని ఆ భగవంతుని సూక్తికదా! ఒకసారి పారసీ రుస్తుంగారి దొంగసొత్తు పట్టుబడింది. నా దగ్గరకు పరుగులు తీసాడు. ఆయన కండ్ల నుండి కన్నీరు కారుతున్నది. ‘అన్నా! నేను మోసం చేశాను. నా పాపం ఈనాడు బ్రద్దలయింది. నేను పన్ను ఎగ్గొట్టాను. నాకు జైలుశిక్ష తప్పదు. నాశనం తప్పదు. ఈ ఆపదనుండి నీవే రక్షించాలి. నేను నీదగ్గర ఏమీ దాచలేదు. కాని వ్యాపారంలో చేసే దొంగతనాన్ని గురించి చెప్పడం ఎందుకులే అని భావించి చెప్పలేదు. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.’ అని ఘోష పెట్టాడు. ధైర్యం చెబుతూ “నా పద్ధతి మీకు తెలుసు కదా! విడిపించగలగడం, విడిపించలేకపోవడం భగవంతునిమీద ఆధారపడ్డ విషయం. చేసిన అపరాధాన్ని అంగీకరించే షరతులమీద అయితే నేను ప్రయత్నిస్తాను” అని అన్నాను.

పాపం ఆ పెద్ద మనిషి ముఖం పాలిపోయింది. “మీదగ్గర ఒప్పుకున్నాను కదా! సరిపోదా!” అని అన్నాడు. “చేసిన అపరాధం ప్రభుత్వానికి సంబంధించినది. నా యెదుట అంగీకరిస్తే ప్రయోజనం ఏముంటుంది” అని మెల్లగా అన్నాను. “మీరు చెప్పిన ప్రకారం చేయక తప్పదు. నాకు ఒక పాత వకీలు వున్నాడు. ఆయన సలహా తీసుకోండి. ఆయన నాకు మంచి మిత్రుడు. అని అన్నాడు. రుస్తుంజీ వ్యవహారమంతా పరిశీలించి చూశాను. ఈ దొంగ వ్యాపారం చాలా కాలం నుండి సాగుతున్నదని స్పష్టంగా తెలిసిపోయింది. పట్టుబడ్డ సామగ్రి స్వల్పమే. వకీలును కలిశాం. ఆయన కేసును పరిశీలించాడు. “ఈ వ్యవహారమంతా జ్యూరీ ఎదుటకు వెళుతుంది. ఇక్కడి జ్యూరీ హిందూ దేశస్థుల్ని తేలికగా వదిలే రకం కాదు. అయినా వదలను” అని అన్నాడు. ఆయనతో నాకు పరిచయం తక్కువ. పారసీ రుస్తుంజీ ఆయన మాటను విని “మీకు ధన్యవాదాలు. అయితే ఈ వ్యవహారంలో నేను గాంధీగారి సలహా ప్రకారం నడుచుకుంటాను. ఆయన నన్ను బాగా ఎరుగును. మీరు వీరికి అవసరమైన సలహాలు యిస్తూవుండండి” అని అన్నాడు. ఈ వ్యవహారం అక్కడ ముగించి మేము రుస్తుంజీ కొట్టు దగ్గరకు వచ్చాం. “అసలు ఈ విషయాన్ని కోర్టుదాక పోనీయకూడదని అలా పోవడం మనకు మంచి పని కాదని అభిప్రాయపడ్డాను. కోర్టుకు వెళ్లడమా లేదా అని నిర్ణయించేవాడు టాక్సు వసూలు చేసే అధికారి. అతడు కూడా ప్రభుత్వ వకీలు సలహా ప్రకారం నడుచుకోవలసి వుంటుంది. నేను ఆ యిద్దరినీ కలుస్తాను. అయితే ఒక్క విషయం వాళ్లకు తెలియని అనగా వాళ్లకు పట్టుబడని దొంగతనాలు కూడా నేను వారికి చెప్పవలసి వుంటుంది. వారు విధించే శిక్షను అనుభవించేందుకు సిద్ధపడదాం. జైలుకు వెళ్లడం కంటే చేసిన దొంగ పని సిగ్గు చేటు అని నా అభిప్రాయం. సిగ్గుచేటు అయిన పని జరిగిపోయింది. జైలుకు వెళ్ళవలసి వస్తే ప్రాయశ్చిత్తమని భావిద్దాం. అయితే నిజమైన ప్రాయశ్చిత్తం ఒకటి వున్నది. ఇక భవిష్యత్తులో యిటువంటి దొంగపని చేయనని ప్రతిజ్ఞ గైకొనడమే ఆ ప్రాయశ్చిత్తం” అని స్పష్టంగా చెప్పివేశాను.

నా మాటను సరిగా రుస్తుంజీ అర్ధం చేసుకోగలిగాడని చెప్పలేను. ఆయన మంచి వీరుడు. అయితే అప్పుడు నీరు కారి పోయాడు. ఆయన పరువు పోయే ప్రమాదం సంభవించింది. ఎంతో కష్టపడి చెమటోడ్చి కట్టిన భవనం కుప్ప కూలిపోతుందేమోనన్న భయం ఆయన్ను పట్టుకున్నది. “నా మెడ మీ చేతుల్లో వుంచాను. ఇక మీఇష్టం” అని ఆయన అన్నాడు. వ్యవహారాలలో నాకుగల వినమ్రతా శక్తినంతటినీ వినియోగించాను. అధికారిని కలిశాను. దొంగ వ్యవహారమంతా నిర్భయంగా చెప్పి వేశాను. కాగితాలన్నీ చూపిస్తానని మాట యిచ్చాను. పారసీ రుస్తుంజీ పడుతన్న బాధను, ఆయన వెల్లడించిన పశ్చాత్తాపాన్ని వివరించాను. “ఈ వృద్ధ పారశీకుడు మంచివాడని తోస్తున్నది. ఆయన మూర్ఖపు పని చేశాడు. నా కర్తవ్యం ఏమిటో మీకు తెలుసా పెద్ద వకీలు ఎలా చెబితే అలా నేను చేయాలి. అందువల్ల మీరు పెద్ద వకీలుకు మీ శక్తినంతా వుపయోగించి నచ్చచెప్పండి.” అని ఆఫీసరు చెప్పాడు. “పారసీ రుస్తుంజీని కోర్టుకు యీడ్వకుండా వుంటే సంతోషిస్తాను” అని అన్నాను. ఆ అధికారి దగ్గర అభయదానం పొంది ప్రభుత్వ వకీలుతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. ఆయనను కలిశాను. నా సత్యనిష్ట ఆయన గ్రహించాడని తెలుసుకున్నాను. నేను ఏమీ దాచడం లేదని ఆయన ఎదుట ఋజువు చేశాను. ఈ వ్యవహారంలోనో మరో వ్యవహారంలోనో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన “మీరు లేదు కాదు చూద్దాం అను సమాధానం పొందే వ్యక్తి కాదు” అని నాకు సర్టిఫికెట్ యిచ్చాడు. పారసీ రుస్తుంజీ మీద కేసు మోపబడలేదు. ఆయన అంగీకరించిన టాక్సు సొమ్ము రెట్టింపు వసూలు చేసి కేసును ఉపహరించవలెనని ఆర్డరు వెలువడింది. రుస్తుంజీ తాను చేసిన పన్నుల ఎగవేతకు సంబంధించిన ఈ దొంగతనం గురించిన కథ వ్రాసి అద్దాల బీరువాలో భద్రపరిచాడు. ఆ కాగితాలు తన ఆఫీసులో తన వారసులకు, తోటి వ్యాపారస్తులకు హెచ్చరికగా వుంచాడు. రుస్తుంజీ సేఠ్ గారి మిత్రులు వ్యాపారస్తులు “ఇది నిజమైన వైరాగ్యం కాదు. స్మశాన వైరాగ్యం సుమా” అని నాకు చెప్పారు. వారి మాటల్లో సత్యం ఎంత వుందో నాకు తెలియదు. ఆ మాట కూడా రుస్తుంజీ సేఠ్‌కు నేను చెప్పాను. “మిమ్మల్ని మోసం చేసి నేను ఎక్కడికి వెళ్ళగలను?” అని ఆయన సమాధానం యిచ్చాడు.


* * *

Public domain
ఈ కృతి భారత ప్రభుత్వ w:భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా, రచయిత/ముద్రాపకుల అనుమతితో ఆర్ధిక లావాదేవీలు లేకుండా స్కాన్ చేసి సర్వర్లపై వుంచడం ద్వారా 2007-2017 మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంచబడింది. కొన్ని సమస్యలవల్ల DLI సర్వర్ తాత్కాలికంగా అందుబాటులో లేకున్నా ఈ కృతులు USA కేంద్రంగా పనిచేసే ఆర్కీవ్ లో లభ్యమవుతున్నాయి. హక్కుదారుల ఉద్దేశాన్ని గౌరవిస్తూ, DLI స్కాన్ కంటే మెరుగుగా యూనికోడ్ కు మార్చి ప్రజలకు అందుబాటులో చేయటానికి లాభనిరపేక్షంగా పనిచేసే తెలుగు వికీసోర్స్ సాయపడుతుంది కావున వికీసోర్స్ లో వుంచబడుతున్నది. ఈ కృతిని చదువుకోవటానికి తప్పించి వేరే విధంగా వాడుకొనేవారు సంబంధిత హక్కుదారులను సంప్రదించవలసింది. ఈ విషయమై హక్కుదారులు ఆక్షేపమేమైనా తెలిపితే వికీసోర్స్ నిర్వాహకులు కృతిని తొలగిస్తారు.