సత్యశోధన/నాల్గవభాగం/4. నాలో పెరిగిన త్యాగప్రవృత్తి

వికీసోర్స్ నుండి

4. నాలో పెరిగిన త్యాగ ప్రవృత్తి

ట్రాన్సువాలులో హిందూ దేశవాసుల హక్కులకోసం ఏ విధంగా పోరు సలపవలసివచ్చిందో, ఆసియా విభాగానికి చెందిన అధికారులతో ఏవిధంగా తలపడవలసి వచ్చిందో వివరించే ముందు నా జీవితంలో జరుగుతున్న మరో ముఖ్యమైన మార్పును గురించి తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను.

ఇప్పటివరకు కొంత డబ్బు ప్రోగు చేయాలనే కోరిక నాకు వున్నది. పారమార్థికంతో బాటు స్వార్థం కూడా అందు చోటు చేసుకున్నది. బొంబాయిలో నా ఆఫీసు ప్రారంభించినప్పుడు ఒక అమెరికాకు చెందిన భీమా ఏజంటు నన్ను కలుసుకునేందుకు వచ్చాడు. అతని ముఖం ఆకర్షణీయంగా వుంది. మాటలు మధురంగా వున్నాయి. మేము పాత మిత్రులమా అనే భావం కలిగేలా అతడు నా భావి జీవితహితానికి సంబంధించి మాట్లాడాడు. “అమెరికాలో మీ స్థాయిలో వుండే వ్యక్తులంతా తమ జీవితాన్ని భీమా చేస్తారు. మీరు కూడా చేయించుకొని మీ భవిష్యత్తుని గురించి నిశ్చింతపడండి. అది ఎంతో అవసరం. జీవితంలో స్థిరత్వం కోసం అమెరికాలో భీమా చేయించుకోవడం కర్తవ్యమని భావిస్తాం. ఒక చిన్న పాలసీ తీసుకునేందుకు నేను మిమ్ము ఒప్పించలేనా?” అని అన్నాడు.

దక్షిణ ఆఫ్రికాలోను, హిందూదేశంలోను, చాలామంది భీమా ఏజంట్లను త్రిప్పి పంపించివేశాను. భీమా చేయించడంలో కొంచెం పిరికితనం, ఈశ్వరునిపై అపనమ్మకం పనిచేస్తుందని నా అభిప్రాయం. కాని ఈ పర్యాయం నేను కొంచెం ఆకర్షితుడనయ్యాను. అతడి మాటలు వింటున్న కొద్దీ నా భార్యా బిడ్డల భవిష్యత్తును గురించిన చిత్తరువు కండ్ల ఎదుట కనబడసాగింది. “ఓ పెద్దమనిషీ! నీవు దరిదాపుగా నీ భార్య ఆభరణాలన్నీ అమ్మివేశావు. రేపు నీకేమైనా ఆయితే, భార్యాబిడ్డల భారం పాపం బీదవాడైన నీ అన్నగారి మీద పడుతుంది. ఆ సోదరుడే తండ్రిగా నీ బాధ్యత వహించాడు. ఆయన మీదే మొత్తం భారం పడదా! ఇది ఏమంత మంచిపని కాదు” ఈ రకమైన తర్కం నా మనస్సులో ప్రారంభమైంది. అప్పుడు 10వేల రూపాయలకు భీమా చేయించాను కాని దక్షిణ ఆఫ్రికాలో తలెత్తిన క్రొత్త ఆపదను పురస్కరించుకొని నేను చేసిన పనులన్నీ భగవంతుణ్ణి సాక్షిగా పెట్టుకొని చేసినవే. దక్షిణ ఆఫ్రికాలో ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. ఇక హిందూ దేశానికి తిరిగి వెళ్ళలేను. అందువల్ల నా భార్యాబిడ్డల్ని నా దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళను ఇక వదలకూడదు. వాళ్ళపోషణ దక్షిణ ఆఫ్రికాలోనే జరగాలి అని అనుకున్నాను. దానితో ఆ పాలసీ దుఃఖానికి హేతువు అయింది. భీమా ఏజంటు వలలో చిక్కుకున్నందుకు సిగ్గుపడ్డాను. మా అన్న తండ్రి బాధ్యత హించినప్పుడు, తమ్ముని భర్య వితంతువైతే ఆమె బాధ్యత వహించడని నీవు ఎట్లా అనుకున్నావు? నీవే ముందు చనిపోతావని ఎందుకు భావించావు? పాలకుడు ఆ ఈశ్వరుడే. నీవూ కాదు, నీ అన్నా కాదు. భీమా చేయించి భార్యాబిడ్డల్ని కూడా పరాధీనుల్ని చేశావు. వాళ్ళు స్వయం పోషకులు కాలేరా? ఎంతోమంది బీదల బిడ్డలు లేరా? వారి సంగతేమిటి? నీ వాళ్ళుకూడా అట్టివారేనని ఎందుకు భావించవు? ఈ విధమైన భావనాస్రవంతి ప్రారంభమైంది. వెంటనే ఆచరణలో పెట్టలేకపోయాను. భీమాకు చెల్లించవలసిన సొమ్ము ఒక్క పర్యాయం దక్షిణ ఆఫ్రికా నుండి పంపించినట్లు గుర్తు. ఈ విధమైన భావానికి బయటనుండి కూడా ఉత్తేజం లభించింది. మొదటిసారి దక్షిణ ఆఫ్రికాకు వచ్చినప్పుడు క్రైస్తవ వాతావరణ ప్రభావం వల్ల మత విషయంలో జాగరూకుడనయ్యాను. ఈసారి దివ్య జ్ఞాన సమాజ ప్రభావంలో పడ్డాను. మి.రీచ్ ధియాసోఫిస్టు. జోహాన్సుబర్గునందున్న ఆయన సొసైటీతో నాకు సంబంధం కల్పించాడు. అయితే నేను అందు మెంబరుగా చేరలేదు. దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాల విషయంలో నాకు అభిప్రాయభేదం ఉంది. అయినా సదరు సొసైటీ సభ్యులందరితో నాకు గాఢంగా పరిచయం ఏర్పడింది. వారితో నిత్యము మతపరంగా చర్చ జరుగుతూ వుండేది. వారి పుస్తకాలు చదివేవాణ్ణి. వారి సభల్లో మాట్లాడే అవకాశం కూడా లభిస్తూ ఉండేది. దివ్యజ్ఞాన సమాజంలో భ్రాతృభావానికీ, దాని పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమై మేము బాగా చర్చ చేస్తూ వుండేవాళ్ళం. వారి సిద్ధాంతానికి, సొసైటీ సభ్యుల ఆచరణకీ పొంతన కనపడకపోతే తీవ్రంగా విమర్శించేవాణ్ణి. ఈ విమర్శ యొక్క ప్రభావం నా మీద కూడా బాగా పడింది. నేను ఆత్మ నిరీక్షణ చేసుకోవడం నేర్చుకున్నాను.