సత్యశోధన/నాల్గవభాగం/3. చేదుగుటకలు

వికీసోర్స్ నుండి

3. చేదు గుటకలు

ఈ అవమానం వల్ల నాకు దుఃఖం కలిగింది. అయితే ఇంతకు పూర్వం ఇటువంటి అనేక అవమానాలు భరించివున్నాను. అందువల్ల నాకు అవి అలవాటయ్యాయి. కనుక అవమానాన్ని లక్ష్యం చేయకుండా తటస్థభావంతో వుండి కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.

ఆ అధికారి సంతకంతో ఒక పత్రం వచ్చింది. మి. చేంబర్లేన్ డర్బనులో మి. గాంధీని కలుసుకున్నారు. అందువల్ల ఆయన పేరు ప్రతినిధుల పట్టికనుంచి తొలగించవలసివచ్చింది అని ఆ పత్రంలో వ్రాసి ఉన్నది.

అనుచరులకు ఈ పత్రం వల్ల భరించలేనంత బాధ కలిగింది. అయితే అసలు మేము డెపుటేషనే తీసుకువెళ్ళం” అని అన్నారు. నేను వారికి నచ్చచెప్పాను. మనవాళ్ళ స్థితి దుర్భరంగా ఉంది. మీరు మి. చేంబర్లేను దగ్గరికి వెళ్ళకపోతే ఇక్కడ మనవాళ్ళకేమీ కష్టం లేదని ప్రకటిస్తారు. అందువల్ల ఏది ఏమైనా చెప్పదలుచుకున్నది లిఖితంగా చెప్పవలసిందే. అది వ్రాసి సిద్ధంగా ఉన్నది. నేను చదివినా, మరెవరు చదివినా ఒకటే. మి. చేంబర్లేన్ దీన్ని గురించి చర్చించడు. నాకు జరిగిన అవమానాన్ని మనం సహించవలసిందే అని నేను చెబుతూ వుండగా తయ్యబ్ సేఠ్ అందుకొని ‘మీ అవమానం జాతికే అవమానం. మీరు మా ప్రతినిధులు. దీన్ని ఎలా మరచిపోవడం?’ అని అన్నాడు.

“నిజమే. కాని జాతికూడా ఇటువంటి అవమానాల్ని సహించవలసిందే. మరో ఉపాయం ఏమీ లేదు” అని నేను అన్నాను. తయ్యబ్‌సేఠ్ “అయిందేదో అయింది. కావలసింది అయి తీరుతుంది. మేము చేతులారా మరో అవమానానికి గురికాము. మన పనులు ఎలాగూ చెడుతున్నాయి. మనకేమైనా హక్కులు లభించనున్నాయా? లేదే!” అని అన్నాడు.

ఈ ఆవేశం నా దృష్టిలో సరియైనదే. కాని దానివల్ల లాభం లేదని నాకు తెలుసు. జాతికి అవమానం జరుగుతున్నదని నాకు తెలియదా? అందువల్ల వారందరినీ శాంతపరిచాను. నా పక్షాన హిందూ దేశపు బారిష్టర్ కీ.శే. జార్జిగాడ్‌ఫ్రేను వెళ్ళమని చెప్పాను. అంతా అంగీకరించారు. ఈ విధంగా మి. గాడ్‌ఫ్రే డెపుటేషన్‌కు నాయకత్వం వహించారు. మాటల సందర్భంలో చేంబర్లేన్ నా విషయం కొద్దిగా పేర్కొన్నాడట. “ఒకే మనిషిని మాటిమాటికి వినేకంటే క్రొత్తవారిని వినడం ఎక్కువ మంచిది” మొదలుగా గల మాటలు పలికి తగిలిన గాయాన్ని కొద్దిగా మాన్చడానికి ప్రయత్నించాడట.

దీనివల్ల జాతిపని, నా పని కూడా బాగా పెరిగిపోయింది. మళ్ళీ మొదటినుండి ప్రారంభించవలసి వచ్చింది. “మీరు చెప్పినందువల్ల జాతి అంతా యుద్ధంలో పాల్గొన్నది. కాని ఫలితం ఇదేగదా?” అని ఎత్తిపొడిచేవాళ్ళు కూడా బయలుదేరారు. అయితే ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు నా మీద పనిచేయలేదు. “నేను అట్టి సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాపపడటం లేదు. యుద్ధంలో పాల్గొని మనం మంచి పనే చేశాము. ఇవాళ కూడా నా అభిప్రాయం అదే. ఆ విధంగా చేసి మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాం. దాని సత్ఫలితం మనం చూడలేకపోతే పోవచ్చు. కాని మంచి పనికి ఎప్పుడూ మంచి ఫలితమే కలుగుతుంది. ఇది నా దృఢ విశ్వాసం. గతంలో ఏం జరిగింది అని ఆలోచించకుండా ఇక భవిష్యత్తులో ఏం చేయాలి అని మనం యోచించాలి. ఇది మన కర్తవ్యం” అని చెప్పాను. నా మాటలు విని అందరూ నన్ను సమర్థించారు. తరువాత ఇలా అన్నాను. “నిజానికి నన్ను మీరు ఏ పని కోసం పిలిపించారో, ఆ పని అయిపోయిందని భావించవచ్చు. కాని మీరు వెళ్ళమన్నా వెళ్ళకూడదని, సాధ్యమైనంతకాలం ట్రాన్సువాలులో వుండాలని భావిస్తున్నాను. నా పని నేటాలులో కాక, ఇక్కడ జరగాలని భావిస్తున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వెళ్ళిపోదామనే అభిప్రాయం నేను విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వకీలు వృత్తి ప్రారంభిస్తాను. అనుమతి తీసుకుంటాను. ఈ క్రొత్త విభాగాన్ని నడిపించగల శక్తి నాకు వున్నది. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోకపోతే జాతి దెబ్బ తింటుంది. ఇక్కడి నుండి అంతా మూట ముల్లె కట్టుకొని పారిపోవలసిన స్థితి దాపురిస్తుంది. మి. చేంబర్లేను నన్ను కలవలేదు. ఆ అధికారి నా విషయంలో తుచ్ఛంగా వ్యవహరించాడు. అయితే జాతి మొత్తానికి జరుగుతున్న అవమానం ముందు ఇది అంత పెద్దది కాదు. కుక్కలవలె మనం ఇక్కడ వుండటం సహించరాని విషయం.” అంటూ యదార్థ విషయాన్ని వాళ్ళందరి ముందు వుంచాను. ప్రిటోరియూ మరియు జోహన్సుబర్గులో నివసిస్తున్న హిందు దేశనాయకులతో చర్చించాను. చివరికి జోహన్సుబర్గులో ఆఫీసు నెలకొల్పాలని నిర్ణయించాము.

ట్రాన్సువాలులో నాకు వకీలు వృత్తికి అనుమతి పత్రం లభించే విషయం సందేహాస్పదమే. అయితే వకీళ్ల సముదాయం మాత్రం నన్ను వ్యతిరేకించలేదు. పెద్ద కోర్టు వారు వకీలు వృత్తి కోసం నేను పెట్టుకొన్న దరఖాస్తును అంగీకరించారు.

హిందూ దేశవాసులకు తగినచోట ఆఫీసు నెలకొల్పడం కోసం ఇల్లు దొరకడం కూడా అక్కడ కష్టమే. మి. రీచ్‌గారితో నాకు బాగా పరిచయం ఉంది. అప్పుడు వారు వ్యాపారవర్గంలో వున్నారు. వారికి పరిచితుడైన హౌస్ ఏజంటు ద్వారా ఆఫీసు కోసం నాకు మంచి చోట ఇల్లు దొరికింది. నేను వకీలు వృత్తి ప్రారంభించాను.