సత్యశోధన/నాల్గవభాగం/2. ఆసియా నవాబ్ గిరీ

వికీసోర్స్ నుండి

2. ఆసియా నవాబ్ గిరి

అసలు నేను ట్రాన్సువాలులో అడుగు ఎలా పెట్టగలిగానో క్రొత్త విభాగం అధికారులు తెలుసుకోలేకపోయారు. తమ దగ్గరకు వచ్చిన హిందూ దేశస్థుల్ని ఈ విషయం అడిగారు. కాని పాపం వాళ్ళకు ఏం తెలుసు? నాకు గతంలో గల పరిచయాల వల్ల అధికార పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించి వుంటానని భావించారు. అప్పుడు నన్ను అరెస్టు చేయవచ్చునని అనుకున్నారు.

యుద్ధం ముగిసిన తరువాత పెద్ద పెద్ద అధికారులకు ప్రత్యేక అధికారాలు అన్నిచోట్ల ఇవ్వబడతాయి. దక్షిణాఫ్రికాలో కూడా అలాగే జరిగింది. అక్కడ శాంతి పరిరక్షణ పేరిట ఒక ప్రత్యేక చట్టం చేయబడింది. ఆ చట్టమందలి ఒక నిబంధన ప్రకారం అనుమతి పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించే వారిని అరెస్టు చేయవచ్చు. జైల్లో పెట్టవచ్చు. ఈ నిబంధన ప్రకారం నన్ను అరెస్టు చేయాలని అధికారులు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అయితే నన్ను అనుమతి పత్రం చూపించమని అడిగేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అధికారుల డర్బనుకు తంతి పంపారు. అనుమతి పత్రం తీసుకొనే వచ్చానని అక్కడి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అయితే ఆ విభాగం అధికారులు అంతటితో ఊరుకోలేదు. నేను ట్రాన్సువాలు చేరుకోగలిగాను కాని చేంబర్లేనును కలువకుండా చేయగల సత్తా వాళ్ళకు ఉంది.

అందుకే ముందుగానే పేర్లు అడిగారన్నమాట. దక్షిణాఫ్రికాలో వర్ణ ద్వేషం వల్ల కలిగే కటు అనుభవాలు అధికం. దానితోబాటు హిందూ దేశంలో వలె తారుమారు చేయడం, టక్కరితనం చేయడం వంటి దుర్వాసన ఇక్కడ కూడా మొదలైంది. దక్షిణాఫ్రికాలో ప్రభుత్వ శాఖలు ప్రజలహితం కోసం పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల అధికారులు వినమ్రంగాను, సరళంగాను వ్యవహరించే వారు. దాని ప్రయోజనం అప్పుడప్పుడు నల్ల తెల్ల పచ్చ చర్మాల వాళ్ళు కూడా సహజంగా పొందుతూ వుండేవారు. ఆసియా దేశపు వాతావరణం ఏర్పడేసరికి అక్కడి మాదిరిగానే కాళ్ళకు మొక్కుతా వంటి ప్రవృత్తి, అంతా తారుమారు చేసే పద్ధతి, తదితర చెడ్డ మురికి అలవాట్లు చోటు చేసుకున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒకరకమైన ప్రజాస్వామ్యం నడుస్తున్నది. కాని ఆసియా నుండి మాత్రం నవాబ్‌గిరీ వచ్చిపడింది. అక్కడ ప్రజాప్రభుత్వం లేకపోవడం, కేవలం ప్రజల మీద అధికారం చలాయించే ప్రభుత్వం మాత్రమే వుండటం అందుకు కారణం. దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు గృహాలు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళే అక్కడి ప్రజలన్నమాట. అందువల్ల అక్కడి అధికార్ల మీద వాళ్ల అంకుశం పని చేస్తున్నదన్నమాట. ఆసియా నుండి వచ్చిన నిరంకుశ అధికారులు కూడా వాళ్ళతో చేతులు కలిపి హిందూ దేశస్థుల్ని అడకత్తెర మధ్య ఇరుక్కున్న పోకచెక్కలా చేశారు.

నాకు కూడా ఇట్టి నవాబ్‌గిరీ ఎలా ఉంటుందో బోధపడింది. నన్ను మొదట ఈ విభాగం ప్రధాన అధికారి దగ్గరకు పిలిపించారు. ఈ ఆఫీసరు లంక నుండి వచ్చాడు. పిలిపించారనీ, పిలిపించబడ్డాననీ అనడం సబబు కాదు. కొంచెం వివరం తెలియజేస్తాను. నా దగ్గరికి లిఖితంగా ఏవిధమైన ఆర్డరు రాలేదు. కాని ముఖ్యులగు హిందూ దేశస్తులు అక్కడికి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి ముఖ్యుల్లో కీ.శే. సేఠ్ తయ్యబ్ హాజీ ఖాన్ మహ్మద్ కూడా ఒకరు. ఆయన్ని అధికారి “గాంధీ ఎవరు? అతడు ఎందుకోసం వచ్చాడు?” అని ప్రశ్నించాడు.

తయ్యబ్ సేఠ్ ‘ఆయన మాకు సలహాదారు. వారిని మేము పిలిపించాము’ అని చెప్పాడు. ‘అయితే మేమంతా ఇక్కడ ఎందుకున్నాం? మీ రక్షణ కోసం మేము ఇక్కడ నియమించబడలేదా? గాంధీకీ ఇక్కడి విషయం ఏం తెలుసు?’ అని గద్దించాడు. తయ్యబ్ సేఠ్ తన తెలివితేటల్ని ఉపయోగించి “మీరు వున్నారు. కాని గాంధీ గారు మా మనిషి గదా! ఆయనకు మా భాష వచ్చు. ఆయన మమ్మల్ని ఎరుగును. పైగా మీరు అధికారులు” అని అన్నాడు.

“గాంధీని నా దగ్గరకు తీసుకురండి” అని ఆదేశించాడు ఆ అధికారి.

తయ్యబ్ సేఠ్ మొదలగువారితో బాటు నేను అక్కడికి వెళ్ళాను. కూర్చోవడానికి కుర్చీ లభించలేదు. మేమంతా నిలబడే ఉన్నాము. దొర నావంక చూచాడు. చెప్పండి! మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు.

“నా సోదరులు పిలిచినందున వారికి సలహా ఇచ్చేందుకు వచ్చాను” అని జవాబిచ్చాను.

“ఇక్కడకు రావడానికి మీకు అధికారంలేదని తెలియదా? పొరపాటున మీకు అనుమతి పత్రం లభించింది. మీరు ఇక్కడి నివాసస్థులుగా పరిగణించబడరు. మీరు తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. మీరు మి. చేంబర్లేన్ దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు. ఇక్కడి హిందూ దేశస్తుల రక్షణ కోసం మా విభాగం ప్రత్యేకించి ఏర్పాటు చేయబడింది మంచిది. ఇక వెళ్ళండి” అని దొర నన్ను పంపించి వేశాడు. సమాధానం చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వలేదు.

ఇతర అనుచరులను ఆపి ఉంచాడు. వారిని బెదిరించాడు. నన్ను తక్షణం ట్రాన్సువాలు నుండి పంపివేయమని వాళ్ళకు సలహా ఇచ్చాడు.

అనుచరులు ముఖం వ్రేలాడేసుకొని వచ్చారు. ఊహించని ఒక క్రొత్త సమస్యను ఎదుర్కొని దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.