సత్యశోధన/నాల్గవభాగం/6. మాంసరహిత ఆహారం కోసం బలిదానం

వికీసోర్స్ నుండి

6. మాంసరహిత ఆహారం కోసం బలిదానం

జీవితంలో త్యాగనిరతి, నిరాడంబరత, ధర్మ జాగృతితో బాటు మాంసరహిత ఆహారాన్ని గురించి. అట్టి ఆహార ప్రచారాన్ని గురించి శ్రద్ధ పెరగసాగింది. ఆచరణ ద్వారాను, జిజ్ఞాసువులతో చర్చల ద్వారాను ప్రచారం చేయడం ప్రారంభించాను.

జోహన్సుబర్గులో ఒక మాంసరహిత భోజనశాల వున్నది. కూనేగారి జల చికిత్స తెలిసిన ఒక జర్మనీ వాడు దాన్ని నడుపుతూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళడం ప్రారంభించాను. వెంట తీసుకొని వెళ్ళగలిగినంత మంది ఇంగ్లీషు వాళ్ళను అక్కడికి తీసుకువెళ్ళసాగాను. ఈ భోజనశాల ఎక్కువ రోజులు నడవదని గ్రహించాను. ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందే. అవసరమని భావించి చేతనైనంత ఆర్థిక సాయం చేశాను. కొంత డబ్బు పోగొట్టుకున్నాను కూడా. చివరికి ఆ భోజనశాల మూతబడింది. థియాసాఫిస్టుల్లో ఎక్కువ మంది శాకాహారులు. కొందరు పూర్తిగా, కొందరు సగం శాకాహారులు. ఆ మండలిలో సాహసోపేతురాలైన ఒక మహిళ వుంది. ఆమెది పెద్ద స్థాయి. ఒక శాకాహార భోజనశాల ప్రారంభించింది. ఆమె కళాభిమాని, రసికురాలు. ఖర్చు బాగా పెడుతుంది. లెక్కాడొక్కా ఎక్కువగా ఆమెకు తెలియదు. ఆమెకు మిత్రమండలి అధికం. ప్రారంభంలో తక్కువ స్థాయిలో ప్రారంభించింది. కాని త్వరలోనే పెంచి, పెద్ద స్థాయిలో నడపాలని నిర్ణయానికి వచ్చింది. అందుకు నా సాయం కోరింది. అప్పుడు నాకు ఆమె లెక్కల వ్యవహారం తెలియదు. ఆమె లెక్కలు సరిగా ఉన్నాయని అనుకున్నాను. నా దగ్గర డబ్బుకు కొదువలేదు. చాలామంది కక్షిదారుల సొమ్ము నా దగ్గర ఉన్నది. వారిలో ఒకనితో మాట్లాడి అతని సొమ్ము 100 పౌండ్లు ఆమెకు ఇచ్చాను. ఆ వ్యక్తి విశాలహృదయుడు. నా మీద అతనికి అపరిమితమైన విశ్వాసం. అతడు మొదటి కూలీల జట్టులో దక్షిణ ఆఫ్రికా వచ్చినవాడు. “అన్నా! మీ మనస్సు సరేనంటే ఇవ్వండి. నాకేమీ తెలియదు. నాకు తెలిసినవారు మీరే” అని అన్నాడు. అతని పేరు బద్రీ. సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. జైలుశిక్ష కూడా అనుభవించాడు. అతడి మాట తీసుకొని సొమ్ము ఆమెకు అప్పుగా ఇచ్చాను. రెండు మూడు మాసాలు గడిచాయి. ఇక డబ్బు తిరిగి రాదని నాకు బోధపడింది. యింత సొమ్ము మునిగితే తట్టుకోగలశక్తి నాకు లేదు. ఆ సొమ్ముతో చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. ఇక ఆ సొమ్ము వాపసు రాలేదు. నా మీద అంత నమ్మకంతో వున్న బద్రీని నేను ముంచగలనా? అతనికి తెలిసినవాణ్ణి నేనేగదా? అందువల్ల ఆ సొమ్ము నేనే చెల్లించివేశాను.

ఒక కక్షిదారునికి ఈ విషయం చెప్పాను. అతడు తియ్యగా మందలించి నన్ను జాగ్రత్తపడమని హెచ్చరించాడు. “అన్నా! (దక్షిణ ఆఫ్రికాలో నేను అప్పటికి మహాత్ముణ్ణి కాలేదు. “బాపూ” కూడా కాలేదు. కక్షిదారులంతా నన్ను అన్నా అని పిలుస్తూ ఉండేవారు) ఇది మీ పనికాదు. మీమీద గల నమ్మకంతో మేము నడుచుకుంటాం. ఆ సొమ్ము ఇక మీకు రాదు. మీరు బద్రీని నష్టపరచరు. సరే మీరు మునిగినట్లేకదా! ఈ విధంగా పరుల మేలు కోసం కక్షిదారుల సొమ్ము ఇవ్వడం ప్రారంభిస్తే కక్షిదార్లు చచ్చిపోతారు. బిచ్చగాళ్ళు అయి ఇంట్లో కూర్చుంటారు. మీరు చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలు దెబ్బతింటాయి.” అని అన్నాడు.

అదృష్టవశాత్తు ఆ మిత్రుడు ఇంకా జీవించే వున్నాడు. దక్షిణ ఆఫ్రికాలోను, ఇతరత్రాను అతడి కంటే మించిన స్పష్టవాది మరొకడు నాకు తగలలేదు. ఎవరిని గురించి అయినా అనుమానం కలిగితే, వెంటనే ముఖం మీద అడిగి తేల్చుకోవడం, అది అబద్ధమని తేలితే వెంటనే వారిని క్షమాపణ కోరి మనస్సును తేలిక పరుచుకోవడం అతనికి అలవాటు. అతని మాటలు సబబుగా వున్నాయి. బద్రీ సొమ్ము తీర్చివేశాను. కాని మరో వంద పౌండ్లు నేను మునిగి వుంటే తట్టుకోగల శక్తి నాకు లేదు. అప్పు చేయవలసి వచ్చేది. జీవితంలో ఇట్టి పని ఇక ఎన్నడూ నేను చేయలేదు. ఇటువంటి పని నాకు అసలు గిట్టదు. సంస్కరణకు సంబంధించిన పనుల్లో కూడా శక్తికి మించి పాల్గొనడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం గీత బోధించిన తటస్థ నిష్కామకర్మ విధానానికి విరుద్ధమని, ఆ విధంగా గీతను తృణీకరించినట్లయిందని తెలుసుకున్నాను. మాంసరహిత ఆహార ప్రచారం కోసం ఈ విధమైన బలిదానం అవసరమవుతుందని కలలోనైనా ఊహించలేదు. ఇది బలవంతగా లభించిన పుణ్యమని భావించవచ్చు.