సత్యశోధన/నాల్గవభాగం/43. ప్రయాణం

వికీసోర్స్ నుండి

43. ప్రయాణం

కేలెన్‌బెక్ నాతోబాటు హిందూ దేశానికి బయలుదేరారు. ఇంగ్లాండులో మేము కలిసే వున్నాం. కాని యుద్ధం కారణంగా జర్మను దేశస్థుల మీద నిఘా ఎక్కువైంది. అందువల్ల కేలన్‌బెక్ రాకను గురించి మాకు సందేహం కలిగింది. వారికి పాస్‌పోర్టు సంపాదించేందుకు నేను చాలా ప్రయత్నం చేశాను. మి. రాబర్ట్స్ ఆయనకు పాస్‌పోర్టు యిప్పించేందుకు సిద్ధపడ్డారు. ఆయన యీ వివరమంతా మెయిల్ ద్వారా వైస్రాయికి తెలియజేశారు. కాని లార్డ్‌హార్డింగ్ దగ్గర నుంచి “ఈ సమయంలో నేనీ ప్రమాదకరమైన పనికి సహకరించలేనని తెలుపుటకు చింతిస్తున్నాను. అంటూ ఠపీమని సమాధానం వచ్చింది. ఈ సమాధానమందలి ఔచిత్యాన్ని మేమంతా గ్రహించాము. కేలన్‌బెక్‌ను వదులుతున్నప్పుడు నాకు వియోగ బాధ అమితంగా కలిగింది. కేలన్‌బెక్‌కు కలిగిన దుఃఖం వర్ణనాతీతం. ఆయన హిందూ దేశం వచ్చి వుంటే మంచి రైతుగా, మంచి నేతవానిగా సాదాజీవితం గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో శేషజీవితం గడుపుతూ వున్నారు. గృహనిర్మాణానికి సంబంధించిన వృత్తిని చేపట్టి దాన్ని బాగా సాగిస్తున్నారు. మూడోతరగతి టిక్కెట్టుపై ప్రయత్నించాము.

మేము ఓడ ప్రయాణానికి పి. అండ్ ఓ. ఓడలో మూడోతరగతి టిక్కెట్టు తీసుకున్నాము. దక్షిణ ఆఫ్రికానుంచి తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు వెంట పెట్టుకున్నాం. మరో పదార్థాలు దొరుకుతాయి కాని అవి ఓడలో దొరకవు. డా. మెహతా నాశరీరాన్ని మీడ్జ్ ప్లాస్టరుతో కట్టివేశాడు. దాన్ని అలాగే వుంచమని సలహా యిచ్చాడు. రెండు రోజులు దాన్ని భరించాను. కాని యిక తట్టుకోలేక పోయాను. కొద్దిగా శ్రమపడి దాన్ని ఊడదీసి స్నానం చేశాను. ఎండు ద్రాక్ష, తాజా పండ్లు మాత్రం తీసుకుంటూ వున్నాను. ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడసాగింది. ఓడ సూయజ్ కాలువలోకి ప్రవేశించునప్పటికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. నీరసంగా వున్నప్పటికీ నన్ను పట్టుకున్న భయం వదిలింది. రోజురోజుకీ వ్యాయామం పెంచుతూ వున్నాను. ఈ మార్పుకు కారణం పరిశుద్ధమైన శీతోష్ణస్థితియేయని నాకు బోధపడింది. ఎందువల్లనో గాని మాకూ అక్కడవున్న ఆంగ్ల యాత్రికులకు మధ్య ఎంతో వ్యత్యాసం కనబడింది. ఇంత వ్యత్యాసం దక్షిణ ఆఫ్రికాలో నాకు కనబడలేదు. అక్కడ కూడా తేడా వుందికాని, యింత తేడా మాత్రం లేదని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఆంగ్ల యాత్రికుల్ని కలిసినా “క్షేమంగా వున్నారా? వున్నాము” అంతటితో సంభాషణ ఆగిపోతూ వున్నది. మనస్సులు కలవలేదు. స్టీమరులోను దక్షిణ ఆఫ్రికాలోను మనస్సులు కలిసేవి. మేము పరిపాలకులం అని ఆంగ్లేయులు, మేము పాలితులం అని హిందూ దేశస్థులు తెలిసో తెలియకో భావించడం యిందుకు కారణమని గ్రహించాను. ఇటువంటి వాతావరణా న్నుండి త్వరగా బయటపడి దేశం చేరుకోవాలని తహతహలాడాను. అదస్ చేరాక యింటికి చేరినట్లనిపించింది. దక్షిణాఫ్రికాలో అదస్ ప్రజలతో నాకు సంబంధం ఏర్పడింది. అక్కడ భాయికైకోబాద్‌కావస్ దీన్షా డర్బను విచ్చేసినప్పుడు ఆయనతోను, ఆయన భార్యతోను నాకు బాగా పరిచయం ఏర్పడింది. తరువాత కొద్ది రోజులకు మేము బొంబాయి చేరాం. 1905 కే తిరిగి వద్దామనుకున్న దేశానికి పదిసంవత్సరాల తరువాత వచ్చానన్నమాట. ఎంతో ఆనందం కలిగింది. బొంబాయిలో గోఖలేగారు స్వాగత సత్కారాల నిమిత్తం ఏర్పాట్లు చేశారు. వారి ఆరోగ్యం సరిగా లేదు. అయినా వారు బొంబాయి వచ్చారు. వారిని కలుసుకొని, వారిజీవితంతో కలిసిపోయి నా బరువును తగ్గించుకోవాలనే కోరికతో బొంబాయి చేరాను. కాని సృష్టికర్త నా నొసట మరో విధంగా లిఖించాడు.