Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/44. వకీలువృత్తి - జ్ఞాపకాలు

వికీసోర్స్ నుండి

44. వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు

హిందూ దేశం వచ్చిన తరువాత నా జీవనస్రవంతి ఎలా ముందుకు సాగిందో వివరించే ముందు దక్షిణ ఆఫ్రికాలో జరిగిన కొన్ని ఘట్టాలు యిక్కడ తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. వాటిని నేను గతంలో కావాలనే వదిలి వేశాను. కొంత మంది మిత్రులు నా వకీలు జీవితపు అనుభవాలు తెలుపమని కోరారు. అట్టి జ్ఞాపకాలు కోకొల్లలు. వాటిని వ్రాయడం ప్రారంభిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. కొన్ని జ్ఞాపకాల్ని మాత్రం యిక్కడ తెలుపుతాను. వకీలు వృత్తిలో నేను ఆధారం చేసుకోలేదని మొదటనే తెలియజేశాను. నిజానికి నా వకీలు వృత్తితో ఎక్కువ భాగం సేవకే సమర్పించాను. జేబు ఖర్చుకు సరిపడే సొమ్ము మినహా మరింకేమీ తీసుకోలేదు. ఎన్నో పర్యాయాలు ఆ సామ్ముకూడా వదిలివేస్తూ వుండేవాణ్ణి. యింతటితో ఆపుదామంటే సత్యపాలనకోసం మీరు చేసిన వకీలు వృత్తిని గురించి ఏమి రాసినా ప్రయోజనం కలుగుతుందని మిత్రులు అభిప్రాయపడ్డారు. వకీలు వృత్తియందు అబద్ధాలు తప్పవని నా చిన్నతనం నుండి వింటూ వచ్చాను. అబద్ధాలాడి నేను ఏమైనా పదవినిగాని, ధనాన్నిగాని ఆశించలేదు. అందువల్ల అటువంటిమాటల ప్రభావం నామీద ఏమీ పడలేదు. దక్షిణ ఆఫ్రికాలో ఎన్నో పర్యాయాలు నాకు పరీక్ష జరిగింది. ఎదురు పార్టీ వాళ్ళు సాక్షులకు పాఠం నూరిపోస్తారని నాకు తెలుసు. నేను కూడా అలా చేస్తే, కక్షిదారును అబద్ధాలాడమని ప్రోత్సహిస్తే కేసు డిక్రీ కావడం ఖాయమే, కాని నేను అట్టి లోభంలో పడలేదు. ఒక్క కేసు విషయం నాకు బాగా జ్ఞాపకం వున్నది. కేసు గెలిచిన తరువాత కక్షిదారు నన్ను మోసగించాడని తెలుసుకున్నాను. అసలు కేసులో నిజం వుంటే గెలవాలని లేకపోతే ఓడాలని భావించేవాణ్ణి. గెలుపు ఓటమిని బట్టి సొమ్ము తీసుకునే వాణ్ణి కాదు. కక్షిదారు గెలిచినా లేక ఓడినా చేసిన శ్రమకు సరిపోయే సొమ్ము మాత్రమే తీసుకునేవాణ్ణి. “నీ కేసులో నిజం లేకపోతే నా దగ్గరికి రావద్దు, సాక్షులకు అబద్ధాలు నూరి పోయడం వంటి పనులు నేను చేయను.” అని ముందే చెప్పినవాణ్ణి. అందువల్ల అబద్ధం కేసులు నా దగ్గరకు వచ్చేవి కావు. నా పరపతి ఆ విధంగా పెరిగింది. నిజం వున్న కేసులు నాకు అప్పగించి అబద్ధం కేసులు మరో వకీలుకు అప్పగించే కక్షిదారులు కూడా వున్నారు.

ఒక పర్యాయం నాకు కఠిన పరీక్ష జరిగింది. అది నమ్మకమైన నా కక్షిదారుకు సంబంధించిన కేసు. అందు ఖాతాలెక్కల చిక్కులు అనేకం వున్నాయి. కేసు చాలా కాలం నడిచింది. ఆ కేసుకు సంబంధించిన విషయాలమీద వివిధ కోర్టుల్లో విచారణ జరిగింది. చివరికి కోర్టుకు సంబంధించిన లెక్కల్లో నిష్ణాతులైన కొందరిని పంచాయతీదారులుగా నిర్ణయించి వారికి లెక్కల వ్యవహారం అప్పగించారు. పంచాయతీదారుల తీర్పు ప్రకారం నా కక్షిదారు గెలవడం ఖాయమని తేలింది. కాని అతని లెక్కలో ఒక పెద్ద పొరపాటు దొర్లిపోయింది. జమా ఖర్చులో పంచాయతీదారుల దృక్పధం ప్రకారం ఇటు అంకెలు అటు చేర్చబడ్డాయి. ఎదుటి పక్షం వకీలు పంచాయితీ దారుల పొరపాటును గ్రహించాడు. అయితే పంచాయితీదారుల పొరపాటును అంగీకరించడం కక్షిదారు పనికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఎదురు పార్టీ వారి మాటల్ని అంగీకరించవలసిన అవసరం మనకు లేదని ఆయన అన్నాడు. జరిగిన పొరపాటును అంగీకరించడం మంచిదని నేను అన్నాను. పెద్ద వకీలు అంగీకరించలేదు. “అలా అంగీకరిస్తే కోర్టు మొత్తం తీర్పునే రద్దుచేసే ప్రమాదం వున్నదని అట్టి ప్రమాదంలో తెలివిగల ఏ వకీలు తన కక్షిదారును పడవేయడని, నేను మాత్రం యిట్టి ప్రమాదానికి పూనుకోనని, కేసు విచారణ మళ్ళీ ప్రారంభమైతే కక్షిదారు డబ్బు బాగా ఖర్చు పెట్టవలసి వస్తుందని చివరకి తీర్పు ఎలా యిస్తారో చెప్పడం కష్టమని స్పష్టంగా చెప్పివేశాడు.

ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కక్షిదారు అక్కడే వున్నాడు. “ఇట్టి ప్రమాదానికి సిద్ధపడక తప్పదు. మనం అంగీకరించకపోయినా పొరపాటు జరిగిందని తెలిసిన తరువాత, ఆ తీర్పు మీద కోర్టు నిలబడి వుంటుందని భావించడం సరికాదు కదా! పొరపాటును సరిదిద్దుకుంటున్నప్పుడు కక్షిదారు నష్టపడినా తప్పేమిటి” అని ప్రశ్నించాను.

“కాని మనం పొరపాటున అంగీకరించినప్పుడు గదా ఇదంతా?” అని అన్నాడు పెద్దవకీలు. ‘మనం అంగీకరించక పోయినా, కోర్టు జరిగిన పొరపాటును గ్రహించదని లేక ప్రతివాదులు యీ పొరపాటును కోర్టు దృష్టికి తీసుకురారని భావించడం సబబా?’ అని అడిగాను. పెద్ద వకీలు యిక ఒక నిర్ణయానికి వచ్చి “అయితే యీ కేసులో మీరు వాదించండి. పొరపాటును అంగీకరించే షరతుమీద అయితే నేను రాను. వాదనలో పాల్గొనను” అని చెప్పి వేశాడు.

“మీరు రాకపోయినా కక్షిదారుకోరితే నేను యీ కేసులో వాదిస్తాను. జరిగిన పొరపాటును అంగీకరించే షరతులమీదనే నేను వాదిస్తాను. అంగీకరించవద్దంటే మాత్రం నేను వాదించను.” అని చెప్పి వేశాను. ఆవిధంగా చెప్పి నేను కక్షిదారు వంక చూచాను. కక్షిదారు పెద్దచిక్కుల్లో పడ్డాడు. ఈ కేసు విషయమై మొదటి నుండి శ్రద్ధ వహించియున్నందున, కక్షిదారుకు నా మీద అమిత విశ్వాసం కలిగింది. నా స్వభావం కూడా అతడికి పూర్తిగా తెలుసు. కొద్ది సేపు ఆలోచించి అతడు ఒక నిర్ణయానికి వచ్చి “సరేనండీ. మీరే కోర్టులో వాదించండి. జరిగిన పొరపాటును అంగీకరించండి. ఓటమి నొసటన వ్రాసివుంటే ఓడిపోతాను. అన్నింటికీ సత్యరక్షకుడు ఆ రాముడే” అని అన్నాడు. నాకు పరమానందం కలిగింది. మరో విధంగా అతడు జవాబిస్తాడని నేను భావించలేదు. పెద్ద వకీలు నన్ను మరీమరీ హెచ్చరించాడు. మొండి పట్టుపడుతున్నందున నామీద జాలి కూడా పడ్డారు. చివరికి ధన్యవాదాలు తెలిపాడు. ఇక కోర్టులో ఏమి జరిగిందో తరువాత వివరిస్తాను.