సత్యశోధన/నాల్గవభాగం/41. గోఖలేగారి ఔదార్యం

వికీసోర్స్ నుండి

41. గోఖలేగారి ఔదార్యం

ఇంగ్లాండులో నరం వాపును గురించి వ్రాశాను. నన్ను యీ జబ్బు పట్టుకున్నప్పుడు గోఖలేగారు ఇంగ్లాండు వచ్చారు. వారి దగ్గరికి నేను, కేలన్‌బెక్ తరుచు వెళుతూ వున్నాం. ఎక్కువగా యుద్ధాన్ని గురించిన చర్చ జరుగుతూ వుండేది. జర్మనీ భూగోళం కేలన్‌బెక్‌కు కరతలామలకం. ఆయన యూరపంతా పర్యటించిన వ్యక్తి. అందువల్ల మ్యాపువేసి యుద్ధస్థావరాలను గోఖలేగారికి చూపుతూ వుండేవాడు. నా జబ్బు కూడా చర్చనీయాంశం అయింది. ఆహారాన్ని గురించిన నా ప్రయోగాలు సాగుతూనే వున్నాయి. ఆ సమయంలో వేరుశెనగపప్పు, పచ్చి మరియు పండిన అరటిపండ్లు, టమోటాలు, ద్రాక్షపండ్లు మొదలగు వాటిని భుజిస్తున్నాను. పాలు, ధాన్యం పప్పు పూర్తిగా మానివేశాను. డా. జీవరాజ్‌మెహతా వైద్యం చేస్తున్నారు. ఆయన గోధుమ తినమని పాలు త్రాగమని బలవంతం చేశారు. గోఖలేగారికి యివిషయమై నామీద పితూరీ వెళ్ళింది. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని నేను చేసుకున్న నిర్ణయాన్ని గోఖలేగారు అంతగా ఆదరించలేదు. ఆరోగ్యదృష్యా డాక్టర్ల సలహాలను పాటించాలని వారి అభిప్రాయం. గోఖలేగారి మాటను ఉల్లంఘించలేను. వారు గట్టిగా పట్టుబట్టారు. 24 గంటల వ్యవధి కోరాను. నేను మరియు కేలన్‌బెక్ యింటికి వచ్చాము. త్రోవలో నా కర్తవ్యాన్ని గురించి చర్చించాం. నేను చేస్తున్న ప్రయోగాలు ఆయనకూడా చేస్తున్నాడు. ఆరోగ్యదృష్ట్యా యీ ప్రయోగాలలో మార్పు చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక అంతర్వాణి పై ఆధారపడ్డాను. రాత్రంతా ఆలోచించాను. నా ప్రయోగాలన్ని మానుకుంటే నా కృషి అంతా నిరర్ధకం అయిపోతుంది. నా అభిప్రాయాల్లో నాకు ఏవిధమైన దోషమూ కనబడలేదు. అయితే గోఖలేగారి ప్రేమకు లొంగిపోవడమా లేక నా శోధనల ప్రకారం ముందుకు సాగడమా తేల్చుకోవలసి వున్నది. బాగా యోచించి ధర్మబద్ధమైన ప్రయోగాలను సాగిస్తూ మిగతా ప్రయోగాల విషయమై డాక్టర్ల సలహాను పాటించాలనే నిర్ణయానికి వచ్చాను. పాల విషయం ధర్మబద్ధం కనుక పాలు త్రాగకూడదు. మిగతా వాటి విషయంలో డాక్టరు సలహా పాటించాలి అని భావించాను. కలకత్తాలో ఆవులను, గేదెలను చిత్రహింసకు గురిచేస్తున్న దృశ్యాలు నాకండ్లకు కనబడసాగాయి. పశువుల మాంసం ఎంత త్యాజ్యమో, పశువుల పాలుకూడా అంత త్యాజ్యమే. అందువల్ల పాలు మాత్రం త్రాగకూడదని నిర్ణయించుకొని ప్రొద్దున్నే లేచాను. నా మనస్సు తేటపడింది. కాని గోఖలేగారు ఏమంటారోనని భయం పట్టుకున్నది. వారు నా నిర్ణయాన్ని కాదనలేరులే అను ధైర్యం కూడా కలిగింది.

సాయంత్రం నేషనల్ లిబరల్ క్లబ్బులో వారిని కలుసుకునేందుకు వెళ్ళాము. డాక్టరు సలహా పాటించాలని నిర్ణయించారా? అని నన్ను చూడగానే గోఖలే ప్రశ్నించారు. “అన్నీ పాటిస్తాను. కాని ఒక్క విషయంలో మాత్రం మీరు పట్టు పట్టకండి. పాలు, పాలతో తయారైన వస్తువులు, మాంసం వీటిని తీసుకోను. అందువల్ల ప్రాణం పోయినా సరే సిద్ధపడమని నా మనస్సు, ఆదేశం” అని మెల్లగా అన్నాను.

“ఇది మీ చివరి నిర్ణయమా”

“మరో సమాధానం యివ్వడం సాధ్యంకాదు. మీకు విచారం కలుగుతుందని నాకు తెలుసు. మన్నించండి” “మీ నిర్ణయం సరికాదు. అందు ధర్మ బద్ధం అంటూ ఏమి లేదు. అయినా మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను” అని అన్నారు. గోఖలే మాటల్లో విచారం నిండి వున్నా ప్రేమమాత్రం అపరిమితంగా వెల్లడి అయింది. జీవరాజ్ మెహతా వైపు చూచి “ఇక గాంధీని బాధించకండి. ఆయన నిర్ణయానికి కట్టుబడి చేయగలిగిన చికిత్స చేయండి” అని అన్నారు.

డాక్టరు తన అసంతృప్తిని వెల్లడించారు. కాని తప్పనిసరికదా! పెసరనీళ్ళు త్రాగమని సలహా యిచ్చారు. అందు కొద్దిగా ఇంగువ కలపమని చెప్పారు. నేను అంగీకరించాను, ఒకటి రెండు రోజుల ఆ విధంగా చేశాను. నా బాధ యింకా పెరిగింది. పెసరనీళ్ళు పడలేదు. అందువల్ల నేను తిరిగి పండ్లు తినడం ప్రారంభించాను. డాక్టరు కొంత వైద్యం చేశారు. బాధ కొద్దిగా తగ్గింది. నా నియమాలు, నిబంధనలు చూచి డాక్టరు భయపడ్డారు. ఈ లోపున అక్టోబరు నవంబరు మాసాలలో ఇంగ్లాండులో ముమ్మరంగా ప్రారంభమయ్యే మంచును తట్టుకోలేక గోఖలేగారు ఇండియాకు బయలుదేరి వెళ్ళారు.