సత్యశోధన/నాల్గవభాగం/40. చిన్న సత్యాగ్రహం
40. చిన్న సత్యాగ్రహం
ధర్మమని భావించి నేను యుద్ధంలో చేరాను. కాని అందుతిన్నగా పాల్గొనే అదృష్టం కలుగలేదు. అలాంటి సున్నితమైన సమయంలో సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. మా పేర్లు మంజూరై నమోదు అయిన తరువాత మాకు కవాతు గరపడానికి ఒక అధికారి నియమింపబడిన విషయం పేర్కొన్నాను. యీ ఆఫీసరు యుద్ధ శిక్షణ యివ్వడం వరకే నీమితమై వుంటాడని మిగతా అన్ని విషయాలలో నేను మా ట్రూపుకు నాయకుణ్ణని అంతా అనుకున్నాం. నా అనుచరుల విషయమై బాధ్యత నాదని, నా విషయమై బాధ్యత మావాళ్లదని భావించాను. కాని ఆదిలోనే హంసపాదన్నట్లు ఆ ఆఫీసరుగారి మొదటి చూపులోనే అనుమానం కలిగింది. సొహరాబ్ చాలా తెలివిగలవాడు. నన్ను వెంటనే “అన్నా! జాగ్రత్త. యీ మనిషి మనమీద నవాబ్ గిరీ చలాయించాలని చూస్తున్నట్లుంది. వాడి ఆజ్ఞ మాకు అనవసరం. వాడు కవాతు నేర్పే శిక్షకుడు. అంతే. అరుగో ఆవచ్చిన యువకులు కూడా మనమీద అధికారం చలాయించాలని భావిస్తున్నట్లుంది” అని నన్ను హెచ్చరించాడు. ఆ యువకులు ఆక్సుఫర్డు విద్యార్థులు. శిక్షణకోసం వచ్చారు. పెద్ద ఆఫీసరు వాళ్లను మామీద డిప్యూటీ అధికారులుగా నియమించాడు. సొహరాబ్ చెప్పిన విషయం నేనూ గమనించాను. సొహరాబుకు శాంతంగా వుండమని చెప్పేందుకు ప్రయత్నించాను. కాని సొహరాబ్ అంత తేలికగా అంగీకరించే మనిషికాడు.
మీరు సాధుపుంగవులు. తియ్యగా మాట్లాడి వీళ్ళు మిమ్ము మోసం చేస్తారు. మీరు తరువాత తేరుకొని “పదండి, సత్యాగ్రహం చేద్దాం అని మమ్మల్ని హైరానా పెడతారు” అని నవ్వుతూ అన్నాడు సొహరాబ్. “నా వెంట వుండి హైరానా తప్ప మరింకొకటి ఎప్పుడైనా మీరు పొందారా మిత్రమా? సత్యాగ్రహి మోసగింపబడటానికేగదా పుట్టింది. వాళ్ళు నన్ను మోసం చేస్తే చేయనీయండి చూద్దాం. ఒకరిని మోసం చేయాలనుకునేవాడే చివరికి మోసంలో పడిపోతాడని ఎన్నో సార్లు మీకు చెప్పాను గదా అని అన్నాను.
సొహరాబ్ పకపక నవ్వుతూ ‘మంచిది అలాగే మోసంలో పడండి. ఏదో ఒకరోజున సత్యాగ్రహంలో మీరు చచ్చిపోతే మా బోంట్లను కూడా వెంట తీసుకెళ్ళండి’ అని అన్నాడు. కీర్తిశేషురాలు మిస్. హోబోహౌస్ నిరాకరణోద్యమాన్ని గురించి వ్రాసిన క్రింది మాటలు నాకు జ్ఞాపకం రాసాగాయి. “సత్యం కోసం మీరు ఒకానొక రోజున ఉరికంబం ఎక్కవలసి వస్తుందనడంలో నాకు సందేహం లేదు. భగవంతుడు మిమ్ము సరియైన మార్గాన తీసుకువెళ్లుగాక. మిమ్ము రక్షించుగాక” సొహరాబ్‌తో నా యీ మాటలు ఆఫీసరు గద్దెక్కిన ఆరంభపు రోజుల్లో జరిగాయి. ఆరంభం, అంతం రెండింటి మధ్య ఎంతో కాలం పట్టలేదు. ఇంతలో నరం వాచి నాకు బాధకలిగింది. 14 రోజుల ఉపవాసానంతరం నా శరీరం పూర్తిగా కోలుకోలేదు. కాని కవాతులో తప్పనిసరిగా పాల్గొనసాగాను. ఇంటినుండి కవాతు చేసే చోటుకు కాలినడకన రెండు మైళ్ళు దూరం వెళుతూ వున్నాను. తత్ఫలితంగా మంచం ఎక్కవలసి వచ్చింది.
ఇట్టి స్థితిలో సైతం నేను ఇతరులతో బాటు క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. మిగతా వారంతా అక్కడ వుండేవారు. నేను సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేవాణ్ణి. ఇక్కడే సత్యాగ్రహానికి బీజారోపణం జరిగిందన్నమాట. ఆఫీసరు తన దర్జా చూపించ సాగాడు. తను అన్ని విషయాల్లోను మాకు ఆఫీసరు అన్నట్లు వ్యవహరించసాగాడు. ఆఫీసరు అట్టి పాఠాలు రెండు మూడు నాకు నేర్పాడు కూడా. సొహరాబ్ నా దగ్గరకు వచ్చాడు. నవాబ్‌గిరీ సహించే స్థితిలో లేడు. “ఏ ఆజ్ఞ అయినా మీ ద్వారానే రావాలి. ఇప్పుడు ఇంకా మనం శిక్షణా శిబిరంలోనే వున్నాం. ప్రతి విషయంలో అర్ధంలేని హుకుములు జారీ అవుతున్నాయి. ఆ యువకులకు మనకు చాలా వ్యత్యాసం చూపబడుతున్నది. దీన్ని సహించడం కష్టం. ఈ వ్యవహారం త్వరగా తేల్చుకోవడం మంచిది. లేకపోతే మనం యిబ్బందుల్లో పడతాం. మనవాళ్లెవరు కూడా అర్ధం పర్ధం లేని హకుములను పాటించేస్థితిలో లేరు. ఆత్మాభిమాన రక్షణ కోసం ప్రారంభించిన పనిలో అవమానాలు కావడం సరికాదు.” అని అన్నాడు.
నేను ఆఫీసరు దగ్గరకు వెళ్ళాను. విషయాలన్నీ ఆయనకు చెప్పివేశాను. ఒక పత్రంలో వాటన్నింటిని వ్రాసి యిమ్మని అంటూ తన అధికారాన్ని గురించి కూడా చెపుతూ “మీద్వారా యిట్టి ఆరోపణలు రాకూడదు. డిప్యూటీ ఆఫీసరుద్వారా తిన్నగా నాదగ్గరకు రావాలి” అని అన్నాడు. “నాకు అధికారాలేమీ అక్కరలేదు. సైనికరీత్యా నేను సామాన్య సిపాయిని మాత్రమే. కాని మాట్రూపునాయకుని హోదాలో మీరు నన్ను వారి ప్రతినిధిగా అంగీకరించక తప్పదు. నాకు అందిన ఆరోపణలు చెప్పాను. అదీకాక ఉపనాయకుల నియామకం మమ్మల్ని అడిగి చేయలేదు. వాళ్ళ విషయమై అంతా అసంతృప్తిగా వున్నారు. అందువల్ల వాళ్లను వెంటనే తొలగించివేయండి. ట్రూపు మెంబర్లకు తమ నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం యివ్వండి.” అని స్పష్టంగా చెప్పివేశాను. నా మాటలు అతనికి మింగుడు పడలేదు. అసలు ఉపనాయకుణ్ణి ఎన్నుకొనే ప్రశ్న లేదు, ఇప్పుడు వాళ్ళను తొలగించితే ఆజ్ఞాపాలనను సైనిక నియమాలకు తావే వుండదు అని అన్నాడు. మేము సభ జరిపాం. చిన్న సత్యాగ్రహానికి పూనుకోవాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటినాయకుల్ని తొలగించక పోతే, క్రొత్త నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం ట్రూపు మెంబర్లకు యివ్వకపోతే మా ట్రూపు కవాతులో పాల్గొనదు, క్యాంపుకు వెళ్ళడం మానివేస్తుంది. అంటూ తీర్మానం చేశాం.
నేను ఆఫీసరుకు మా అసంతృప్తిని వెల్లడిస్తూ జాబు వ్రాశాను. నాకు అధికారం ఏమీ వద్దు. సేవ చేయడానికి వచ్చాం. ఆపని పూర్తి చేయాలి. బోయర్ల సంగ్రామంలో నేను ఎట్టి అధికారం పొందలేదు. అయినా కర్నల్ గేలబ్‌కు మా ట్రూపుకు మధ్య ఎన్నడు ఏ విధమైన పొరపొచ్చము ఏర్పడలేదు. నా ద్వారా మా ట్రూపు అభిప్రాయాలు తెలుసుకొని ఆయన వ్యవహరించేవాడు. అని పత్రంలో వ్రాసి తీర్మానం ప్రతి కూడా దానితోపాటు పంపించాను. అయితే ఆఫీసరు నా పత్రాన్ని ఖాతరు చేయలేరు. మేము మీటింగు జరిపి తీర్మానం ప్యాసు చేయడం కూడా మిలటరీ నియమాలకు వ్యతిరేకమనే నిర్ధారణకు వచ్చాడు. తరువాత నేను భారతమంత్రికి ఈ వ్యవహారమంతా తెలియజేస్తూ జాబు పంపాను. తీర్మానం ప్రతి కూడా దానితో జత చేశాను. భారత మంత్రి వెంటనే సమాధానం వ్రాస్తూ ట్రూపుకు నాయకుని ఉపనాయకుని ఎన్నుకునే అధికారం వున్నది. భవిష్యత్తులో ఆ నాయకుడు మీ సిఫారసులను పాటిస్తాడు అని జాబు పంపాడు. ఆ తరువాత మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా జరిగాయి. ఆచేదు అనుభవాలన్నింటినీ పేర్కొని ఈ ప్రకరణాన్ని పెంచ దలుచుకోలేదు. అయితే హిందూ దేశంలో ప్రతిరోజు మనకు కలుగుతూ వుండే కటు అనుభవాలవంటివే అవి అని చెప్పక తప్పదు.
ఆఫీసరు బెదిరించి మాలో మాకు వైరుధ్యం వచ్చేలా చేశాడు. ప్రతిజ్ఞ చేసిన మాలో కొందరు సామదండభేదాలకు లోబడిపోయారు. ఇంతలో నేటలీ ఆసుపత్రికి అసంఖ్యాకంగా గాయపడ్డ సైనికులు వచ్చారు. వారికి సేవ చేసేందుకు మా ట్రూపు మెంబర్లమంతా అవసరమైనాము. మా వాళ్ళు కొంతమంది నేటలీ వెళ్ళారు. కాని మిగతావాళ్ళు వెళ్ళలేదు. ఇండియా ఆఫీసువారికి ఇలా వెళ్ళకపోవడం నచ్చలేదు. నేను మంచం పట్టినప్పటికి మెంబర్లను కలుసుకుంటూనే వున్నాను. మి.రాబర్ట్సు తో బాగా పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను కలుసుకునేందుకు వచ్చి మిగతా వారిని కూడా పంపమని పట్టుబట్టాడు. వాళ్ళంతా వేరే ట్రూపుగా వెళ్ళవచ్చని, అయితే నేటలీ ఆసుపత్రిలో అక్కడి నాయకుని ఆధీనంలో వుండి ఈ ట్రూపు సభ్యులు పనిచేయాలని, అందువల్ల పరువు నష్టం జరగదని ప్రభుత్వం ఎంతో సంతోషిస్తుందని, గాయపడ్డ సైనికులకు సేవాశుశ్రూషలు లభిస్తాయని మరీ మరీ చెప్పాడు.
నాకు, నా అనుచరులకు వారి సలహా నచ్చింది. దానితో మిగతా వారు కూడా నేటలీ వెళ్ళారు. నేను ఒక్కణ్ణి మాత్రం చేతులు నలుపుకుంటూ పక్కమీదపడి ఆగిపోయాను.