సత్యశోధన/నాల్గవభాగం/39. కర్తవ్యం ఏమిటి

వికీసోర్స్ నుండి

39. కర్తవ్యం ఏమిటి?

యుద్ధంలో పని చేస్తానని మేము కొంతమందిమి కలిసి ప్రభుత్వానికి పేర్లు పంపించాము. ఈ వార్త అందగానే దక్షిణ ఆఫ్రికా నుండి నాకు రెండు టెలిగ్రాములు అందాయి. ఆందు ఒకటి పోలక్‌ది. “మీరు చేస్తున్న యీ పని మీ అహింసా సిద్ధాంతానికి విరుద్ధంగా లేదా?” అని ఆయన ప్రశ్నించాడు. ఇలాంటి తంతి వస్తుందని నేను మొదటే వూహించాను. అందుకు కారణం వున్నది. యీ విషయాన్ని గురించి నేను “హిందు స్వరాజ్య”లో చర్చించాను. దక్షిణ ఆఫ్రికాలో గల మిత్రులతో యీ విషయమై తరుచు చర్చ జరుగుతూ వుండేది. యుద్ధంలో జరిగే అవినీతి మనందరికీ తెలుసు. నా మీద దౌర్జన్యం చేసిన వారిమీదనే కేసు పెట్టడానికి అంగీకరించని నేను రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతూ వుంటే, అందలి గుణ దోషాల్ని గురించి తెలియనప్పుడు అందు పాల్గొనడం సబబా. యుద్ధంలో నేను పాల్గొన్న విషయం మిత్రులందరికీ తెలిసినప్పటికీ, ఆ తరువాత నా భావాల్లో చాలా మార్పు వచ్చి వుంటుందని వారు అనుకున్నారు. నిజానికి ఏ యోచనా సరళితో నేను బోయర్ యుద్ధంలో పాల్గొన్నానో సరీగా అదే యోచనా సరళితో యీ యుద్ధంలో కూడా పాల్గొనాలని భావించాను. యుద్ధంలో పాల్గొనడానికి, అహింసకు పొంతన కుదరదని తెలుసుకున్నాను. కాని కర్తవ్యబోధ దీపం వెలుగులా స్పష్టంగా వుండదు కదా! సత్య పూజారి అనేక సార్లు మునిగి తేలవలసి వస్తుంది.

అహింస వ్యాపకమైన వస్తువు. హింసావలయంలో చిక్కుకు పోయిన పామర ప్రాణులం మనం. తోటి జీవుల పై ఆధారపడి జీవించాలన్న సూక్తి సరియైనదే. మనిషి బాహ్య హింస చేయకుండా ఒక్క క్షణమైనా జీవించలేడు. లేస్తూ కూర్చుంటూ, తింటూ తిరుగుతూ తెలిసో తెలియకో హింస చేస్తూనే వుంటాడు. అట్టి హింసనుండి బయటపడేందుకు కృషి చేయడం. మనస్సు పూర్తిగా కరుణతో నిండి వుండటం. బహు చిన్న ప్రాణికి సైతం హాని కలిగించకుండా వుండటం అహింసా పూజారి లక్షణం. అట్టి వాని ప్రవృత్తి సంయమం వైపు పయనిస్తుంది. అతనిలో సదా కరుణ నిండి వుంటుంది. అయినా దేహధారి ఎవ్వడూ కూడా బాహ్యహింస నుండి పూర్తిగా విముక్తి పొందజాలడు.

అహింసలో అద్వైత భావం నిండి వుంటుంది. ప్రాణులన్నింటిలో భేదం లేనప్పుడు ఒకదాని పాపప్రభావం మరొకదానిమీద తప్పక పడుతుంది. అందువల్ల మనిషి హింసనుండి తప్పించుకోలేడు. సమాజంలో నివసించేవ్యక్తి సమాజంలో సాగే హింసలో యిష్టం లేకపోయినా భాగస్వామి కాక తప్పదు. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యుద్ధాన్ని ఆపడం అహింసా వాదుల కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించలేకపోయినపుడు, యుద్ధాన్ని వ్యతిరేకించగల శక్తి లేనప్పుడు, అట్టి హక్కు కూడా కలిగివుండనప్పుడు వ్యక్తి యుద్ధకార్యాల్లో చేరిపోవాలి. చేరినప్పటికీ తనను, తన దేశాన్ని, జగత్తును రక్షించేందుకు హృదయపూర్తిగా కృషిచేయాలి.

నేను ఆంగ్ల రాజ్యం ద్వారా నా దేశ ప్రజల స్థితిని సరిదిద్దవలెనని భావించాను. నేను ఇంగ్లాండులో కూర్చొని బ్రిటీష్ యుద్ధ ఓడల ద్వారా రక్షణ పొందివున్నాను. అంటే ఆ బలాన్ని యీ విధంగా ఉపయోగించుకొని, అందు నిహితమైయున్న హింసలో తిన్నగా నేను పాల్గొంటూ వున్నానన్నమాట. ఈ ప్రభుత్వంతో సంబంధం పెట్టుకొని వ్యవహారాలు జరపాలన్నా, ప్రభుత్వ పతాక క్రింద వుండాలన్నా, నేను రెండు మార్గాలలో ఏదో ఒక దాన్ని అనుసరించాలి. యుద్ధాన్ని బాహాటంగా వ్యతిరేకించాలి. ఆ ప్రభుత్వ విధానం యుద్ధానికి వ్యతిరేకంగా మారనంతవరుకు సత్యాగ్రహశాస్త్ర ప్రకారం దాన్ని బహిష్కరించాలి లేక ఆ ప్రభుత్వ చట్టాలను ధిక్కరించి జైలుకు వెళ్ళాలి. అలా చేయలేనప్పుడు యుద్ధకార్యాలలో పాల్గొని ఆ ప్రభుత్వానికి సహకరించి, అవసరమైనప్పుడు దాన్ని ధిక్కరించగల శక్తిని, హక్కును సమకూర్చుకోవాలి. అట్టి శక్తి యిప్పుడు నాకు లేదు. అందువల్ల యుద్ధంలో చేరి సహకరించాలనే నిర్ణయానికి వచ్చాను.

అయితే తుపాకి పట్టుకొన్న వాడికి, వాడికి సహకరించేవారికి మధ్య హింసదృష్ట్యా తేడా లేదని నాకు తెలుసు. దోపిడీ దొంగలకు అవసరమైన సేవ చేయటానికి, అతడి మాటలు మోయడానికి, గాయపడినప్పుడు అతడికి సేవాశుశ్రూషలు చేయడానికి సిద్ధపడిన మనిషి కూడా దోపిడి వ్యవహారంలో దొంగతో సమానంగా బాధ్యత వహించవలసిందే. ఈ దృష్టితో పరిశీలిస్తే సైన్యంలో చేరి గాయపడ్డ సైనికులకు సేవా శుశ్రూషలు చేసేవాడు కూడా యుద్ధానికి సంబంధించిన దోషాన్నుండి తప్పించుకోలేడు. ఈ విషయాన్ని పోలక్ తంతి చేరకపూర్వమే నేను యోచించాను. ఆయన తంతి అందిన తరువాత ఆ విషయమై కొంతమంది మిత్రులను సంప్రదించాను. యుద్ధంలో చేరడం ధర్మమని నేను భావించాను. ఈనాడు కూడా ఆ భావానికి కట్టుబడి వున్నాను. అందు దోషం కనబడలేదు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గురించి ఆనాడు నాకు గల భావాలననుసరించి, వాటిని పాటించే నేను యుద్ధకార్యాలకు సహకరించాను. అలా చేసినందుకు నేను పశ్చాత్తాపపడలేదు.

అయితే నా అభిప్రాయా ఔచిత్యాన్ని ఆనాడుకూడా నా మిత్రుల ఎదుట వుంచి సమర్ధించుకోలేక పోయినమాట నిజం. ఇది కడు సున్నితమైన విషయం. అభిప్రాయ భేదానికి అందుతావున్నది. అందువల్ల అహింసా ధర్మాన్ని అంగీకరించి దానిని పాలించేవారి కోసం శక్త్యానుసారం నా అభిప్రాయాన్ని యిక్కడ వ్యక్తం చేశాను. సత్యనిష్ట గలవారు, నియమాల మీదనే ఆధారపడి పనిచేయకూడదు. తన భావాల్ని మాత్రమే అంటిపెట్టుకొని వుండకూడదు. అందు దోషం వుండవచ్చని అంగీకరించాలి. ఆ దోషాన్ని గురించి పరిజ్ఞానం కలిగినవాడు ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా ఎదుర్కొనాలి. దాని ఫలితం అనుభవించాలి. ప్రాయశ్చిత్తం కూడా చేసుకొనేందుకు సిద్ధపడాలి.