సత్యశోధన/నాల్గవభాగం/33. అక్షరజ్ఞానం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

33. అక్షరజ్ఞానం

శారీరక శిక్షణతో బాటు కొన్ని చేతి పనులు పిల్లలకు నేర్పుటకు టాల్‌స్టాయి ఆశ్రమంలో చేసిన ఏర్పాట్లను గురించి ప్రకరణంలో వివరించాను. పూర్తిగా నాకు తృప్తికలగనప్పటికి అందుకొంత సాఫల్యం లభించిందని చెప్పగలను. అక్షరజ్ఞానం కల్పించడం కష్టమని అనిపించింది. అందుకు అవసరమైన సామాగ్రి నా దగ్గర లేదు. అవసరమని నేను భావించినంత సమయం కూడా యివ్వలేకపోయాను. అంతజ్ఞానం కూడా నాకు లేదు. రోజంతా కాయకష్టం చేశాక అలసి పోయేవాణ్ణి. విశ్రాంతి తీసుకోవాలని భావించినప్పుడు క్లాసులో పాఠం చెప్పలేక బలవంతాన పాఠం చెప్పవలసి వస్తూ వుండేది. ఉదయం పూట వ్యవసాయం, గృహకృత్యాలు, మధ్యాహ్నం భోజనం కాగానే క్లాసులు ఇంతకంటే అనుకూలమైన సమయం లభించలేదు.

అక్షరజ్ఞానం కల్పించేందుకు మూడుగంటల సమయం నిర్ణయించారు. క్లాసులో హిందీ, తమిళం, గుజరాతీ ఉర్దూ నేర్పవలసి వచ్చింది. పిల్లలకు వాళ్ళ మాతృభాషలో చదువు నేర్పాలని మా నిర్ణయం. ఇంగ్లీషు కూడా అందరికీ నేర్పుతూ వున్నాం. గుజరాతీ తెలిసిన హిందూ పిల్లలకు కొద్దిగా సంస్కృతం నేర్పే వాళ్ళం. ఈ పిల్లలందరికీ హిందీ నేర్పే వాళ్ళం. చరిత్ర, భూగోళం, గణితం అందరికీ నేర్పేవాళ్ళం. తమిళం, ఉర్దూ నేను నేర్పేవాణ్ణి.

స్టీమరుమీద, జైల్లో నేర్చుకున్న నా తమిళజ్ఞానం అంతటితో ఆగింది. ముందుకు సాగలేదు. పోప్ రచించిన “తమిళ స్వయంశిక్షక్” ద్వారా నేర్చుకున్న దానితో సరి. ఫారసీ అరబ్బీ శబ్దావలి సంగతి కూడా అంతే. ముస్లిం సోదరుల సహవాసం వల్ల నేర్చుకున్న ఉర్దూ, అరబ్బీ, ఫారసీ ఓడమీద నేర్చుకున్న దానితో సరి. హైస్కూల్లో నేర్చుకున్న సంస్కృతం, గుజరాతీ యీ మాత్రం పెట్టుబడితో పని నడపవలసి వచ్చింది. అందుకు సహకరించదలచి వచ్చిన వారికి నాకు వచ్చినంత కూడా రాదు. అయితే దేశభాషల యెడ నాకు గల ప్రేమ, శిక్షణా శక్తి మీద నాకు గల శ్రద్ధ, విద్యార్థుల అజ్ఞానం, వారి ఉదార హృదయం నా పనికి అమితంగా తోడ్పడ్డాయి.

తమిళ విద్యార్థులు దక్షిణ ఆఫ్రికాలో జన్మించినట్టివారే. అందువల్ల వాళ్ళకు తమిళం చాలా తక్కువగా వచ్చు. వాళ్ళకు లిపి అసలురాదు. అందువల్ల నేను తమిళ లిపి నేర్పవలసి వచ్చింది. పని తేలికగానే సాగింది. తమిళం మాట్లాడవలసి వస్తే తాము నన్ను ఓడించగలమని విద్యార్థులకు తెలుసు. కేవలం తమిళం మాత్రమే తెలిసిన వాళ్ళు నా దగ్గరకు వస్తే ఆ తమిళ పిల్లలు దూబాసీలుగా ఉపయోగపడుతూ వుండేవారు. ఈ విధంగా బండి నడిచింది. అయితే విద్యార్థుల ఎదుట నా అజ్ఞానాన్ని దాచడానికి నేను ఎన్నడూ ప్రయత్నించలేదు. మిగతా విషయాలవలెనే యీ విషయంలో కూడా వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అక్షరజ్ఞానంలో వెనకబడినప్పటికి వారి ప్రేమ, ఆదరణ బాగా పొందగలిగాను. ముస్లిం పిల్లలకు ఉర్దూ నేర్పడం తేలిక. వాళ్ళకు లిపివచ్చు. వాళ్ళను చదువులో ప్రోత్సహించడం, అక్కడక్కడ వారికి సహకరించడం నా పని.

దరిదాపు పిల్లలంతా చదువురానివాళ్ళే. స్కూల్లో చదువుకోని వారే. నేను నేర్పేది తక్కువ. వాళ్ళ సోమరితనం పోగొట్టి, చదవడానికి వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళ చదువును గురించి శ్రద్ధ వహించడం నా పని. దానితో నేను తృప్తిపడేవాణ్ణి. అందువల్లనే వేరు వేరు వయస్సుల్లో గల పిల్లల్ని సైతం ఒకే గదిలో కూర్చోబెట్టి పనిచేయిస్తూ వుండేవాణ్ణి.

పాఠ్యపుస్తకాలను గురించి ప్రతిచోట గొడవ చేస్తూ వుంటారు. కాని పాఠ్యపుస్తకాల అవసరం నాకు కలుగలేదు. ప్రతి పిల్లవాడికి ఎక్కువ పుస్తకాలు యివ్వడం అవసరమని అనిపించలేదు. వాస్తవానికి పిల్లవాడికి నిజమైన పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడే. పాఠ్యపుస్తకాల ద్వారా నేను నేర్పిన పాఠ్యాంశాలు జ్ఞాపకం వున్నవి బహుతక్కువే. కంఠస్థం చేయించిన పాఠాలు మాత్రం నాకు ఇప్పటికీ జ్ఞాపకం వున్నాయి. కంటితో గ్రహించిన దానికంటే చెవితో విని తక్కువ శ్రమతో ఎక్కువ గ్రహిస్తాడు. పిల్లలచేత ఒక్క పుస్తకం కూడా పూర్తిగా చదివించినట్లు నాకు గుర్తులేదు.

నేను చాలా పుస్తకాలు చదివాను. నేను జీర్ణం చేసుకున్న విషయాన్నంతా పిల్లలకు బోధించాను. అది వాళ్ళకు యిప్పటికీ జ్ఞాపకం వుండి వుంటుందని నా విశ్వాసం. చదివించింది జ్ఞాపకం పెట్టుకోవడం వారికి కష్టంగా వుండేది. నేను వినిపించిన పాఠం వాళ్ళు వెంటనే నాకు తిరిగి వినిపించేవారు. చదవమంటే కష్టపడేవారు. వినిపిస్తూ నేను అలసిపోయినప్పుడు లేక నేను నీరసపడినప్పుడు వాళ్ళు రసవత్తరంగా నాకు వినిపిస్తూ వుండేవారు. వాళ్లకు కలిగే సందేహాలు వాటి నివృత్తికై వాళ్ళు చేసే కృషి, వాళ్ళ గ్రహణ శక్తి అద్భుతం.