సత్యశోధన/నాల్గవభాగం/34. ఆత్మశిక్షణ

వికీసోర్స్ నుండి

34. ఆత్మ శిక్షణ

విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ గరపడం కంటే వారికి ఆత్మ శిక్షణ గరపడం కష్టమనిపించింది. ఆత్మశిక్షణకు మత గ్రంధాల సాయం నేను పొందలేదు. పిల్లలు తమతమ మతాల మూలతత్వం తెలుసుకోవడం, తమ మత గ్రంధాలను గురించి కొద్దిగా నైనా వాళ్ళు తెలుసుకోవడం అవసరమని భావించాను. అందుకోసం నేను చేతనైనంతవరకు సౌకర్యం కలిగించాను. బుద్ధి వికాసానికి అది అవసరమని నా భావం. ఆత్మ శిక్షణ విద్యాభ్యాసంలో ఒక భాగమని టాల్‌స్టాయి ఆశ్రమంలో పిల్లలకు శిక్షణ గరిపే సమయంలో నేను తెలుసుకున్నాను. ఆత్మ వికాసం అంటే శీలనిర్మాణం. ఈశ్వరసాక్షాత్కారం పొందడం అన్నమాట. ఆత్మజ్ఞానం పొందునప్పుడు పిల్లలకు సరియైన బోధ అవసరం. మరో రకమైన జ్ఞానం వ్యర్ధం, హానికరం కూడా కావచ్చునని తెలుసుకున్నాను. ఆత్మ జ్ఞానం నాల్గవ ఆశ్రమంలో అవసరమను దుర్భ్రమ చాలామందికి వుంటుంది. కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం ఆత్మజ్ఞానాన్ని వాయిదా వేసే వ్యక్తులు ఆత్మజ్ఞానం పొందలేరని, వృద్ధాప్యం వచ్చినప్పుడు దయకు పాత్రులై, దీనావస్థను పొంది భువికి భారంగా జీవిస్తూ వుంటారని నేను గ్రహించిన సత్యం. నా యీ భావాలను 1911-12 మధ్య ప్రకటించియుండలేదు. అప్పుడు యీ విషయమై నాకు గల అభిప్రాయాలు యివేనని జ్ఞాపకం.

ఆత్మశిక్షణ ఎలా గరపాలి? అందుకోసం పిల్లల చేత భజనలు చేయించేవాణ్ణి. నీతి పుస్తకాలు చదివి వినిపించేవాణ్ణి. అయినా తృప్తి కలిగేది కాదు. వాళ్లతో సంబంధం పెరిగిన కొద్దీ గ్రంధాలద్వారా వాళ్లకు ఆత్మజ్ఞానం కలిగించడం కష్టమని గ్రహించాను. శరీర సంబంధమైన శిక్షణ యివ్వాలంటే వ్యాయామం ద్వారా యివ్వాలి. బుద్ధికి పదును పట్టాలంటే బుద్ధిచేత వ్యాయామం చేయించాలి. అలాగే ఆత్మజ్ఞానం కలగాలంటే ఆత్మవ్యాయామం అవసరం. ఆత్మశిక్షణ ఉపాధ్యాయుని నడత, శీలం వల్లనే విద్యార్థులకు అలవడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు కడు జాగరూకులై వ్యవహరించడం అవసరం. ఉపాధ్యాయుడు తన ఆచరణ ద్వారా విద్యార్థుల హృదయాలను కదిలించగలడు. తాను అబద్ధాలాడుతూ తన విద్యార్థుల్ని మాత్రం సత్యసంధులుగా తీర్చిదిద్దాలను కోవడం సరికాదు. పిరికిపందయగు ఉపాధ్యాయుడు తన శిష్యుల్ని నిర్భీకుల్ని చేయలేడు. వ్యభిచారియగు ఉపాధ్యాయుడు తన శిష్యులకు సంయమం నేర్పలేడు. నా ఎదుట వున్న బాలబాలికలకు నేను ఆదర్శ పాఠ్యవస్తువుగా పుండాలి. అందువల్ల నా విద్యార్థులు నాకు గురువులు అవుతారు. నా కోసం కాకపోయినా వారి కోసమైనా నేను మంచిగా వుండితీరాలి. యీ విషయం నేను బాగా తెలుసుకున్నాను. టాల్‌స్టాయ్ ఆశ్రమంలో నేను అలవరుచుకున్న సంయమనానికి కారకులు యీ బాలబాలికలేనని నా అభిప్రాయం. వారికి నా కృతజ్ఞతలు చెప్పాలి. ఆశ్రమంలో ఒక యువకుడు ఎప్పుడూ గొడవ చేస్తూ వుండేవాడు. అబద్దాలాడేవాడు. ఇతరులతో తగాదా పెట్టుకునేవాడు. ఒక రోజున పెద్ద తుఫాను సృష్టించాడు. నేను గాబరా పడ్డాను. విద్యార్థుల్ని ఎప్పుడూ నేను దండించలేదు. ఆ రోజున నాకు చాలా కోపం వచ్చింది. నేను అతని దగ్గరకు వెళ్ళాను. ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. నన్ను మోసగించాలని కూడా ప్రయత్నించాడు. దగ్గరే పడియున్న రూళ్ల కర్ర ఎత్తి అతడి భుజంమీద గట్టిగా వడ్డించాను. కొట్టే సమయంలో నన్ను వణుకు పట్టుకుంది. అతడు దాన్ని గ్రహించి యుండవచ్చు. అంతవరకు ఆవిధంగా ఏ విద్యార్ధి విషయంలోను నేను వ్యవహరించి యుండలేదు. అతడు భోరున ఏడ్చాడు. క్షమించమని వేడుకున్నాడు. రూళ్ల కర్ర తగిలి బాధ కలిగినందున అతడు ఏడ్వలేదు. ఎదిరించ తలుచుకుంటే నన్ను ఎదుర్కోగల శక్తి అతడికి వుంది. అతడి వయస్సు 17 సంవత్సరాలు వుండి వుంటుంది. శరీరం బలంగా కుదిమట్టంగా వుంటుంది. రూళ్ల కర్రతో కొట్టినప్పుడు నేను పడ్డ బాధను అతడు గ్రహించి యుంటాడు. తరువాత అతడు ఎవ్వరినీ వ్యతిరేకించలేదు. కాని రూళ్ల కర్రతో కొట్టినందుకు కలిగిన పశ్చాత్తాపాన్ని ఈనాటి వరకు నేను మరచిపోలేను. నేను అతడిని కొట్టి నా ఆత్మను గాక నా పశుత్వాన్ని ప్రదర్శించానను భయం నాకు కలిగింది.

పిల్లలను కొట్టి వారికి పాఠాలు చెప్పడానికి నేను వ్యతిరేకిని. నా విద్యార్థుల్లో ఒక్కణ్ణి మాత్రమే ఒక్కసారి మాత్రమే కొట్టినట్లు నాకు బాగా గుర్తు. రూళ్ల కర్రతో కొట్టి నేను మంచిపనిచేశానో లేక చెడుపనిచేశానో ఈనాటి వరకు నేను తేల్చుకోలేదు. అయితే ఆ దండన యందుగల ఔచిత్యం విషయమై నాకు సందేహం వున్నది. ఆనాటి దండనకు మూలం కోపం మరియు దండించాలనే కాంక్ష. నాకు కలిగిన దుఃఖం ఆ దండనలో వ్యక్తం అయితే సంతోషించి వుండేవాణ్ణి. ఈ ఘట్టం జరిగాక విద్యార్ధులను దండించే క్రొత్త విధానం నేర్చుకున్నాను. అప్పుడు ఈ క్రొత్తవిధానాన్ని అనుసరించి యుంటే ఏమై యుండేదో చెప్పలేను. ఆవిషయం ఆ యువకుడు అప్పుడే మరచిపోయాడు. అతనిలో పెద్ద మార్పు వచ్చిందని కూడా నేను చెప్పలేను. అయితే ఈ ఘట్టం విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలో నాకు బోధపరిచింది. జాగ్రత్తపడేలా చేసింది. తరువాత కూడా కొందరు యువకులు తప్పులు చేశారు. అయితే వారిని దండనా విధానంతో దండించలేదు. ఈ విధంగా యితరులకు ఆత్మశిక్షణ గరపాలనే ఉద్దేశ్యంతో కృషి చేసిన నేను ఆత్మ సుగుణాన్ని గురించి తెలుసుకోసాగాను.