Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/32. గురువుగా

వికీసోర్స్ నుండి

32. గురువుగా

దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో విస్తారంగా వ్రాయకుండా కొద్దిగా వ్రాసిన విషయం యిక్కడ పేర్కొంటున్నందున రెండింటి సంబంధం పాఠకులు గ్రహింతురుగాక. టాల్‌స్టాయి ఆశ్రమంలో బాలురకు బాలికలకు శిక్షణ ఇచ్చేందుకై ఏర్పాటు చేయవలసి వచ్చింది. హిందూ ముస్లిం క్రైస్తవ యువకులతో బాటు కొంతమంది బాలికలు కూడా మాతో ఉన్నారు. వారి శిక్షణ కోసం వేరే ఉపాధ్యాయుణ్ణి నియమించడం కష్టమని తేలింది. దక్షిణ ఆఫ్రికాలో భారతీయ ఉపాధ్యాయులు బహుతక్కువ. వున్నా పెద్ద జీతం యివ్వందే దర్బనుకు 21 మైళ్ళ దూరాన వున్న ఆశ్రమానికి ఎవరు వస్తారు. అంత డబ్బు నాదగ్గర లేదు. పైగా యిప్పటి విద్యావిధానం నాకు యిష్టం లేదు. సరియైన పద్ధతిని నేను ప్రయోగించి చూడలేదు. తల్లి దండ్రుల దగ్గర గరపబడే విద్య సరియైనదని నా భావం. అందువల్ల బయటి వారి సాయం తక్కువగా వుండాలని భావించాను. టాల్ స్టాయి ఆశ్రమం ఒక కుటుంబం వంటిదని, దానికి నేను తండ్రి వంటివాడినని అందువల్ల నేనే పిల్లల శిక్షణకు బాధ్యత వహించాలని నిర్ణయించాను. అయితే అందు పలు దోషాలు వున్నాయి. ఈ యువకులు జన్మించినప్పటినుండి నాదగ్గర లేరు. వేరు వేరు వాతావరణాల్లో పెరిగినవారు. వేరు వేరు మతాలకు చెందినవారు. ఇట్టి స్థితిలో తండ్రిగా బాధ్యతను ఎలా నిర్వహించగలనా అని అనుమానం కలిగింది. అయితే నేను హృదయ శిక్షణ అనగా మంచి నడతకు సంబంధించిన శిక్షణకు ప్రాముఖ్యం యిచ్చాను. ఏ వాతావరణంలో పెరిగినా, ఏ వయస్సువారికైనా, ఏమతాలవారి కైనా అట్టి శిక్షణ యివ్వవచ్చునని నా భావం. ఆ భావంతో రాత్రింబవళ్ళు ఆ పిల్లలతో బాటు తండ్రిగా వుండసాగాను. మంచి నడత అనగా శీలం ప్రధానమైనదని భావించాను. పునాది గట్టిగా వుంటే తరువాత విషయాలు పిల్లలు ఇతరుల ద్వారానో లేక తమంత తాముగానో నేర్చుకోగలరని నా అభిప్రాయం. అయినా అక్షర జ్ఞానం కొద్దో గొప్పో వారికి కల్పించాలని భావించి క్లాసులు ప్రారంభించాను. మి. కేలన్‌బెక్ ప్రాగ్జీ దేశాయిగారల సాయం పొందాను. శారీరక శిక్షణను గురించి నాకు తెలుసు. అది ఆశ్రమంలో వారికి సహజంగానే లభిస్తూవుంది.

ఆశ్రమంలో నౌకర్లు లేరు. పాయిఖానా దొడ్లు బాగుచేసుకోవడం నుండి వంటపని వరకు ఆశ్రమవాసులే చేసుకోవాలి. పండ్ల చెట్లు చాలా వున్నాయి. క్రొత్తగా నాట్లు వేయాలి. మి. కేలన్‌బెక్‌కు వ్యవసాయం అంటే ఇష్టం. ప్రభుత్వ ఆదర్శతోటలకు వెళ్ళి అభ్యసించి వచ్చారు. వంటపని చేస్తున్న వారిని మినహాయించి మిగతా పిన్నలు, పెద్దలు మొదలుగాగల ఆశ్రమవాసులందరూ ఏదో ఒక సమయంలో తోటలో కాయకష్టం చేసి తీరాలి. పిల్లలు ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేవారు. పెద్ద పెద్ద గుంటలు త్రవ్వడం, చెట్లు నరకడం, బరువు మోయడం మొదలగుగాగల పనులుచేయడం వల్ల వాళ్ళ శరీరాలు గట్టి పడ్డాయి. ఈ పనులు అంతా సంతోషంతో చేస్తూ వుండేవారు. అందువల్ల వేరే వ్యాయామం అనవసరం అని తేలింది. ఈ పనులు చేయమంటే అప్పుడప్పుడు కొందరు పిల్లలు నఖరాలు చేస్తూ భీష్మిస్తూవుండేవారు. వారిని గురించి పెద్దగా పట్టించుకునేవాణ్ణికాదు. కఠినంగా వ్యవహరించి వాళ్ళ చేత పనిచేయిస్తూ వుండేవాణ్ణి. అప్పుడు సరేనని వెంటనే మరచిపోతూ వుండేవారు. ఈ విధంగా మా బండి సాగుతూ వున్నది. అయితే వాళ్ళ శరీరాలకు పుష్టి చేకూరింది.

ఆశ్రమంలో ఎవ్వరూ జబ్బు పడలేదు. గాలి, నీరు, పుష్టికరమైన ఆహారం యిందుకు కారణమని చెప్పవచ్చు. శారీరక శిక్షణతో బాటు వృత్తి విద్య కూడా గరపడం అవసరమని భావించాను. మి. కేలన్‌బెక్ ట్రేపిస్ట్ మఠం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టడం నేర్చుకువచ్చారు. వారి దగ్గర చెప్పులు కుట్టడం నేర్చుకొని యిష్టపడిన పిల్లలకు నేర్పాను. వడ్రంగం పని మి.కేలన్‌బెక్‌కు కొంతవచ్చు. అది వచ్చిన మరో వ్యక్తి కూడా ఆశ్రమంలో వున్నాడు. అందువల్ల ఆ పని కూడా కొందరికి నేర్పుతూ వున్నాం. వంటచేయడం పిల్లలంతా నేర్చుకొన్నారు. ఈ పనులన్నీ పిల్లలకు క్రొత్తే. కలలోనైనా యిట్టి పనులు నేర్చుకోవాలని వారు భావించలేదు. దక్షిణ ఆఫ్రికాలో భారతదేశ పిల్లలు కేవలం ప్రారంభవిద్య మాత్రమే పొందేవారు. ఉపాధ్యాయులు తాము చేసిన పనులే పిల్లలకు నేర్పాలని, తాము చేయని పనులు పిల్లలచేత చేయించకూడదని టాల్‌స్టాయి ఆశ్రమంలో నియమం అమలు చేశాం. పిల్లల చేత పని చేయిస్తూ వున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారి వెంట వుండి పని చేస్తూ చేయిస్తూ వుండేవాడు. అందువల్ల పిల్లలు సంతోషంగా పనులు చేస్తూ వుండేవారు. శీలం గురించి, అక్షరజ్ఞానం గురించి తరువాత వ్రాస్తాను.