Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/31. ఉపవాసాలు

వికీసోర్స్ నుండి

31. ఉపవాసాలు

పాలు, భోజనం మాని పండ్లు తినడం ప్రారంభించాము. సంయమం కోసం ఉపవాసాలు కూడా ప్రారంభించాను. మి. కేలన్‌బెక్ తాను కూడా నాతో బాటు వీటిని ప్రారంభించాడు. ఇంతకు పూర్వం నేను ఆరోగ్య దృష్ట్యా ఉపవాసాలు చేసేవాణ్ణి. ఇంద్రియదమనానికి ఉపవాసాలు బాగా పనిచేస్తాయని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. వైష్ణవ కుటుంబంలో జన్మించాను. మా అమ్మ కఠోరవ్రతాల్ని అనుష్టించేది. ఆ ప్రభావం వల్ల నేను మన దేశంలో వున్నప్పుడు ఏకాదశి వ్రతాన్ని అనుష్టించాను. అయితే అప్పుడు మా తల్లితండ్రుల్ని సంతోషపరిచేందుకు చేస్తూ వుండేవాణ్ణి. ఇట్టి వ్రతాలవల్ల ప్రయోజనం ఉంటుందో, ఉండదో ఆ రోజుల్లో నాకు తెలియదు. తరువాత ఒక మిత్రుణ్ణి చూచి, ఆ ప్రకారం బ్రహ్మచర్య వ్రతపాలన కోసం నేను కూడా ఏకాదశి ఉపవాసాలు ప్రారంభించాను. సామాన్యంగా జనం ఏకాదశినాడు పండ్లు పాలు తీసుకొని వ్రతపాలన చేశామని అనుకుంటూ వుంటారు. కాని పండ్లమీద ఆధారపడి నేను ఉపవాసాలు ఇప్పుడు ప్రతిరోజూ చేయసాగాను. మంచినీళ్ళు త్రాగుతూ ఉండేవాణ్ణి. అది శ్రావణమాసం. రంజాను, శ్రావణమాసం రెండూ ఒకేసారి వచ్చాయి. వైష్ణవ కుటుంబాల్లో వైష్ణవ వ్రతాలతో బాటు శైవ వ్రతాల్ని కూడా పాటిస్తూ ఉండేవారు. మా ఇంట్లో వాళ్లు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళినట్లే శైవ దేవాలయాలకు కూడా వెళుతూ ఉండేవారు. శ్రావణమాసంలో ప్రతివారూ ఏదో వ్రతానుష్టానం చేస్తూ ఉండేవారు. అది చూచి నేను కూడ శ్రావణమాసాన్ని ఎంచుకున్నాను.

ఈ ప్రయోగం టాల్‌స్టాయి ఆశ్రమంలో ప్రారంభించాను. సత్యాగ్రహాల కుటుంబాల వారిని పిలిపించి వారిని అక్కడ వుంచి నేను, కేలన్‌బెక్ వారితో బాటు ఉన్నాం. వారిలో పిల్లలు, నవయువకులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం పాఠశాల స్థాపించాం. నవయువకుల్లో అయిదారుగురు మహ్మదీయులు ఉన్నారు. ఇస్లాం మత విధుల్ని నిర్వహించుటకు నేను వారికి సహాయం చేశాను. నమాజు చేసుకునేందుకు వాళ్ళకు సౌకర్యం కల్పించాను. ఆశ్రమంలో పారశీకులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వారందరినీ మీమీ మత విధుల్ని పాటించమని ప్రోత్సహించాను. ముస్లిం యువకుల్ని ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. నేను ఉపవాసాలు చేస్తున్నాను. హిందువులు, క్రైస్తవులు, పారశీకులను కూడా ముహమ్మదీయ యువకులతో బాటు ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. సంయమంతో అందరికీ తోడ్పడవలెనని నచ్చ చెప్పాను. చాలామంది ఆశ్రమవాసులు నా సలహాను పాటించారు. అయితే హిందువులు, పారశీకులు మాత్రం పూర్తిగా మహ్మదీయులకు సహకరించలేదు. వాస్తవానికి అట్టి అవసరం కూడా లేదు. మహ్మదీయులు సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తుండేవారు. కాని మిగతా వారు ముందే భోజనం చేసి మహ్మదీయులకు వడ్డన చేసేవారు. వీరికోసం ప్రత్యేకించి పదార్థాలు తయారు చేసేవారు. మహ్మదీయులు సహరీ అంటే ఒకపూట భోజనం చేస్తూండేవారు. ఆ విధంగా ఇతరులు చేయవలసిన అవసరం లేదు. మహ్మదీయులు పగలు మంచినీళ్ళు త్రాగేవారు కారు. ఇతరులు మంచినీళ్ళు త్రాగవచ్చు.

ఈ ప్రయోగం వల్ల ఉపవాసాల, ఒక పూట నిరాహారదీక్ష యొక్క మహత్తు అందరికీ బోధపడింది. ప్రేమ, ఆదరాభిమానాలు ఒకరికొకరికి కలిగాయి. ఆశ్రమంలో ఆహారం విషయమై నియమాలు ఏర్పాటు చేశాం. ఈ విషయంలో నా మాటను అంతా అంగీకరించారు. అందుకు నేను కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఉన్నది. ఉపవాసం నాడు మాంసాహార నిషేధం మహ్మదీయులకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. కాని నాకు ఎవ్వరూ ఈ విషయం తెలియనీయలేదు. అంతా కలిసి మెలిసి ఆనందంగా ఉన్నారు. హిందూ యువకులు ఆశ్రమ నియమాలకు అనుకూలంగా కొన్ని రుచికరమైన వంటకాలు చేసి అందరికీ తినిపిస్తూండేవారు. నా ఉపవాసాలను గురించి వ్రాస్తూ ఇతర విషయాలు కావాలనే ఇక్కడ పేర్కొన్నాను. ఇంతటి తీయని విషయాలు తెలిపేందుకు మరోచోట అవకాశం లభించకపోవడమే అందుకు కారణం. నాకు ఇది సబబు అని తోచిన విషయాలపై అనుచరుల సమ్మతి కూడా పొందుతూ వుండేవాణ్ణి. ఇది నా ప్రవృత్తిగా మారింది. ఉపవాసాలు, ఒకపూట భోజనాలు అందరికీ క్రొత్త. అయినా నేను ఆ విధుల్ని అమలుపరచగలగడం విశేషం.

ఈవిధంగా ఆశ్రమంలో సంయమ వాతావరణం సహజంగా ఏర్పడింది. ఉపవాసాల వల్ల ఒకపూట భోజనాలవల్ల సత్ఫలితాలు కలిగాయి. ఆశ్రమవాసులందరి మీద వీటి ప్రభావం ఏ పరిమాణంలో పడింది అని అడిగితే స్పష్టంగా చెప్పడం కష్టం. అయితే ఆరోగ్యరీత్యానేగాక, విషయవాంఛల రీత్యా కూడా నాలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పగలను. ఇట్టి ప్రభావం అందరి మీద పడిందా అని అడిగితే చెప్పడం కష్టం. విషయ వాంఛలు అణగి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే అందుకు ప్రత్యేకించిన ఉపవాసాలు అవసరం. అయితే ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు కోరికలు తీవ్రం అవుతాయని కొందరికి కలిగిన అనుభవం. అసలు అన్నిటికీ మూలం మసస్సు. ఆ మనస్సును కంట్రోలులో పెట్టుకోకుండా శారీరకంగా ఎన్ని ఉపవాసాలు చేసినా, వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదు. గీతయందలి ద్వితీయ అధ్యాయమందు గల క్రింది శ్లోకం పరిశీలించదగినది.

“విషయావినివర్తన్తే నిరాహారస్య దేహినః రసవర్జరస్యోప్యస్యపరం దృష్ట్వా నిర్తతే”

అనగా నిరాహారియైనవానికి శబ్దాది విషయముల ఒత్తిడి తగ్గును. కాని విషయవాసన మిగిలియే ఉండును. అది పరమాత్మ దర్శనమువల్ల తొలగును.

సారాంశమేమనగా ఉపవాసాదులు సంయమానికి సాధనాల రూపంలో అవసరం. కాని అదే సర్వస్వం మాత్రం కాదు. శరీరరీత్యా ఉపపాసాలతోబాటు మనస్సు రీత్యా ఉపవాసాలు చేయకపోతే అది దంభానికి కారణభూతం అవుతుంది. అది హాని కూడా కలిగించవచ్చు.