Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/30. సంయమం

వికీసోర్స్ నుండి

30. సంయమం

కస్తూరి బాయి జబ్బు పడినప్పుడు ఆ కారణంగా నా ఆహారంలో ఎన్నో మార్పులు జరిగాయని గత ప్రకరణంలో వ్రాశాను. ఇక ఇప్పుడు బ్రహ్మచర్యం దృష్ట్యా నా ఆహారంలో మార్పులు ప్రారంభమైనాయి.

పాలు విరమించడం మొదటి మార్పు. పాలు ఇంద్రియ వికారం కలిగించే పదార్థం. ఈ విషయం మొదట నేను శ్రీ రాయుచంద్‌భాయి వల్ల తెలుసుకున్నాను. అన్నాహారాన్ని గురించి ఇంగ్లీషు పుస్తకాలు చదవనప్పుడు ఈ భావం బాగా బలపడింది. కాని బ్రహ్మచర్య వ్రతం పట్టిన తరువాతనే పాలు తాగడం విరమించగలిగాను. శరీర పోషణకు పాలు అనవసరమని చాలాకాలం క్రితమే గ్రహించాను. అయితే వెంటనే పోయే అలవాటు కాదుగదా! ఇంద్రియదమనం కోసం పాలు త్రాగడం మానాలి అను విషయం తెలుసుకోగలిగాను. ఇంతలో గోవుల్ని, గేదెల్ని కసాయివాళ్లు ఎంతగా హింసిస్తున్నారో తెలిపే కరపత్రాలు, వివరాలు కలకత్తా నుండి నాకు చేరాయి. ఆ సాహిత్య ప్రభావం నా మీద అపరిమితంగా పడింది. ఈ విషయమై నేను కేలన్‌బెక్‌తో చర్చించాను.

కేలన్‌బెక్‌ను గురించి దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో వ్రాశాను. గత ప్రకరణంలో కూడా కొద్దిగా వ్రాశాను. ఇక్కడ రెండు మాటలు వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. ఆయన మి. ఖాన్ స్నేహితుడు. తనలో వైరాగ్య ప్రవృత్తి నిండి ఉన్నదని ఆయన గ్రహించాడు. అందువల్లనే ఖాను ఆయనను నాకు పరిచయం చేశాడని నా అభిప్రాయం. పరిచయం అయినప్పుడు ఆయన పెట్టే ఖర్చుల్ని చూచి, ఆయన హంగులు, దర్పం చూచి నేను బెదిరిపోయాను. అయితే మొదటి కలయికలోనే ఆయన ధర్మాన్ని గురించి ప్రశ్నలు వేశాడు. మాటల్లో బుద్ధ భగవానుని త్యాగాన్ని గురించి చర్చ జరిగింది. ఆ తరువాత మా పరిచయం ఎక్కువైంది. దానితో మా సంబంధం గాఢమైపోయింది. నేను చేసే ప్రతి ప్రయోగం తాను కూడా చేయాలనే స్థితికి ఆయన వచ్చాడు. ఆయన ఒంటరివాడు. తన ఒక్కడి కోసం ఇంటి అద్దె వగైరాలు గాక నెలకు 1200 రూపాయలు దాకా ఖర్చు పెడుతుండేవాడు. తరువాత నిరాడంబరత్వం వైపుకు మొగ్గి చివరికి నెలకు 120 రూపాయల ఖర్చుకు చేరుకున్నాడు. నా కాపురం ఎత్తివేశాక, మొదటిసారి జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత నుండి ఇద్దరం కలిసి వుండసాగాం. అప్పుడు మా ఇద్దరి జీవనం మొదటి కంటే కఠోరంగా వుండేది. మేము కలిసి ఉంటున్నప్పుడే పాలు మానాలని చర్చ జరిగింది. మి. కేలన్‌బెక్ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ “పాల దోషాలను గురించి మనం తరుచు చర్చిస్తున్నాం. పాలు తాగడం విరమించి వేయకూడదా? పాల అవసరం లేదు కదా!” అని అన్నాడు. ఆయన మాటలు విని నాకు ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. ఆయన సలహాను సమర్ధించాను. మేమిద్దరం ఆ క్షణాన టాల్‌స్టాయ్ ఫారంలో పాలు తాగడం మానివేశాం. 1912లో ఈ ఘట్టం జరిగింది.

అంతటితో శాంతి లభించలేదు. పాలు విరమించిన తరువాత కొద్దిరోజులకు కేవలం పండ్లు మాత్రమే భుజించి ఉందామని నిర్ణయానికి వచ్చాం. కారు చవుకగా దొరికే పండ్లు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాం. కడు నిరుపేద జీవించే పద్ధతిన జీవించాలని మా ఇద్దరి ఆకాంక్ష. ఫలాహారంలో ఉండే సౌకర్యాలను ప్రత్యక్షంగా పొందాము. పొయ్యి వెలిగించవలసిన అవసరం లేకుండా పోయింది. పచ్చి వేరుసెనగపప్పు, అరటిపండ్లు, ఖర్జూరం పండ్లు, నిమ్మపండ్లు, పప్పునూనె ఇవే నా ఆహారం. బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని భావించేవారికి ఒక హెచ్చరిక చేయడం అవసరం. బ్రహ్మచర్యానికి, ఆహార పదార్థాలకు దగ్గర సంబంధం ఉన్నదని చెప్పానేగాని అసలు రహస్యం మనస్సుకు సుబంధించిందే. మైలపడ్డ మనస్సు ఉపవాసాలు చేసినా శుభ్రపడదు. ఆహారం దానిమీద ఏమీ పనిచేయదు. ఆలోచనలవల్ల, భగవన్నామస్మరణవల్ల, భగవంతుని దయవల్ల మనోమాలిన్యం తొలగుతుంది. అయితే మనస్సుకు, శరీరానికి దగ్గర సంబంధం ఉంటుంది. వికారంతో నిండిన మనస్సు వికారం కలిగించే ఆహారాన్ని వెతుకుతుంది. వికారంతో నిండిన మనస్సు రకరకాల రుచుల్ని, భోగాల్ని వెతుకుతుంది. ఆ రుచుల ఆ భోగాల ప్రభావం మనస్సు మీద పడుతుంది. అందువల్ల ఆ పరిస్థితుల్లో ఆహార పదార్థాల మీద అంకుశం తప్పదు.

వికారంతో నిండిన మనస్సు శరీరంమీద, ఇంద్రియాల మీద విజయం సాధించకపోవడమే గాక, వాటికి లోబడి పనిచేస్తుంది. అందువల్ల శరీరానికి విశుద్ధమైన ఆహారం, తక్కువగా వికారం కలిగించే పదార్థాలు, అప్పుడప్పుడు ఉపవాసాలు, నిరాహారాలు అవసరం. కొందరు సంయమం గలవారు ఆహారాన్ని గురించి ఉపవాసాలను గురించి పట్టించుకోనవసరం లేదని భావిస్తారు. మరికొందరు ఆహారం, నిరాహారం ఇవే సంయమానికి మూలాధారాలని భావిస్తారు. ఇద్దరూ భ్రమలో పడి ఉన్నారని నా అభిప్రాయం. నాకు కలిగిన అనుభవంతో చెబుతున్నాను. సంయమం వైపుకు మరలుతున్న మనస్సుకు ఆహారం విషయమై వహించే జాగరూకతతోబాటు, నిరాహారం మొదలగునవి ఎంతో ఉపయోగపడతాయి. వీటి సహాయం లేనిదే మనస్సు నిర్వికార స్థితిని పొందలేదు.