సత్యశోధన/నాల్గవభాగం/29. ఇంట్లో సత్యాగ్రహం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

29. ఇంట్లో సత్యాగ్రహం

మొదటిసారి 1908లో నాకు జైలు ప్రాప్తి కలిగింది. జైల్లో ఖైదీల చేత అనేక నియమాల్ని పాటింపచేసేవారు. ఆ నియమాల్ని సంయమం కలిగిన వ్యక్తి లేక బ్రహ్మచారి స్వేచ్ఛగా పాటించాలని భావించేవాణ్ణి. ఉదాహరణకు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు అనగా అయిదు గంటలకు భోజనం చేయడం. హిందూ దేశస్థులకు హబ్షీ ఖైదీలకు టీ ఇవ్వకపోవడం, మొదలుగాగలవి. అక్కడి నియమాల ప్రకారం రుచి కోసం తినవలసిన పరిస్థితి లేనేలేదు. జైలు డాక్టరుకు హిందూ దేశస్థుల కోసం నూరిన మసాలాలు వాడమని, ఉడుకుతూ వున్నప్పుడే ఆహారపదార్థంలో ఉప్పు కలపమని చెప్పాను. “ఇక్కడికి మీరు జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు రాలేదు. ఆరోగ్య దృష్ట్యా కావాలంటే ఉప్పు విడిగా తీసుకున్నా లేక ఉడుకుతూ వున్నప్పుడు పదార్థాల్లో వేసినా రెండూ ఒకటే” అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఎంతో ప్రయత్నించిన తరువాత అక్కడ కొద్ది మార్పులు చేయగలిగాము. కాని సంయమం దృష్ట్యా రెండు నిబంధనలు సరి అయినవే. ఇలాంటి నిబంధనలు బలవంతంగా విధించకపోతే అమలుకావు. స్వేచ్ఛగా పాటిస్తే మాత్రం అవి ఎంతో ప్రయోజనకరమైనవి. జైలునుండి విడుదల అయిన తరువాత ఆ మార్పులు వెంటనే చేశాను. టీ తీసుకోవడం మానివేశాను. సాయంత్రం త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాను. ఈనాటివరకు ఆ అలవాటు అలాగే ఉండిపోయింది.

ఒకసారి ఉప్పును కూడా మానవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియమం పది సంవత్సరాల వరకు నిరాటంకంగా సాగింది. ఆహారానికి సంబంధించిన అనేక పుస్తకాల్లో ఆరోగ్యదృష్ట్యా ఉప్పు తినవలసిన అవసరం లేదనీ, ఉప్పు వాడకపోతే ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందని చదివాను. బ్రహ్మచారులకు ఇందువల్ల లాభం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. శరీరం దుర్భలంగా ఉంటే పప్పు తినడం మానాలని కూడా చదివాను. అనుభవం మీద ఈ విషయం తెలుసుకున్నాను. కాని నేను వాటిని అప్పుడు మానలేకపోయాను. ఆపరేషను అయిన తరువాత కస్తూరిబాయికి రక్తస్రావం తగ్గిపోయింది. తరువాత అది మళ్ళీ ప్రారంభమైంది. తగ్గలేదు. జల చికిత్స వల్ల ప్రయోజనం చేకూరలేదు. నా చికిత్సల మీద ఆమెకు విశ్వాసం తక్కువే కాని ఆమెకు అవిశ్వాసం కూడా లేదు. ఇతర చికిత్సలు చేయించుకోవాలనే కోరిక కూడా ఆమెకు లేదు. చివరికి పప్పు ఉప్పు రెండూ వదలివేయమని సలహా ఇచ్చాను. ఎన్నో విధాల నచ్చచెప్పాను. అనేక గ్రంథాల నుండి ప్రమాణాలు కూడా చదివి వినిపించాను. అయినా ఆమె అంగీకరించలేదు. పప్పు ఉప్పు మానమని ఎవరైనా మీకు చెబితే మీరు మానతారా అని గట్టిగా అన్నది.

నాకు విచారం కలిగింది. సంతోషం కూడా కలిగింది. నా ప్రేమ ఎలాంటిదో పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. నీవు తప్పుగా యోచిస్తున్నావు. నాకు జబ్బు చేసి వైద్యుడు ఏ వస్తువైనా తినవద్దని చెబితే తప్పక వదిలివేస్తాను. అయినా, ఇదిగో, ఇప్పటినుండి ఒక్క సంవత్సరం కాలం పప్పు ఉప్పు వదిలి వేస్తున్నాను. నీవు మానినా సరే మానకపోయినా సరే నీ ఇష్టం. నేను మాత్రం వదిలివేస్తున్నాను అని అన్నాను. కస్తూరి బాయి గిలగిలలాడిపోయింది. “నన్ను క్షమించండి. మీ స్వభావం తెలిసి కూడా మామూలుగా అనేశాను. మీ మాట ప్రకారం నేను పప్పు ఉప్పు మానివేస్తాను. మీరు మాత్రం మానకండి నాకు పెద్ద శిక్ష పడుతుంది” అని అంటూ బ్రతిమలాడింది. “నీవు పప్పు ఉప్పు మానితే మంచిదే. దానివల్ల నీకు లాభం కలుగుతుందనే నమ్మకం నాకున్నది. కాని చేసిన ప్రతిజ్ఞను విరమించుకోవడం నా వల్ల కానిపని. ఆ విధంగా వాటిని మానడం వల్ల నాకు లాభం కలుగుతుంది. అందువల్ల ఒత్తిడి చేయవద్దు. నాకు కూడా పరీక్ష జరగాలికదా! నేను మానడం వల్ల నీ వ్రతానికి బలం చేకూరుతుంది.” అని ఆమెకు చెప్పాను. ఇక ఏం చేస్తుంది? “మీరు జగమొండి. ఎవ్వరి మాటా వినరు?” అంటూ కాసేపు కన్నీరు కార్చి తరువాత శాంతించింది.

దీన్ని నేను సత్యాగ్రహం అని అంటాను. నా జీవనపు కొన్ని మధురక్షణాల్లో ఇది కూడా ఒకటి అని భావిస్తున్నాను.

తరువాత కస్తూరిబాయి ఆరోగ్యం త్వరత్వరగా కుదుటపడసాగింది. పప్పు ఉప్పు రెండూ మానడం ఆమె జబ్బు నయం కావడానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు లేక ఆ రెండూ మానడం వల్ల ఆహారంలో జరిగిన తదితర మార్పులు కారణం అయివుండవచ్చు లేక ఇటువంటి మార్పు చేయించటానికి నేను చూపిన జాగరూకత, తత్ఫలితంగా మానసికంగా వచ్చిన మార్పు కూడా కారణం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా చిక్కిపోయిన కస్తూరిబాయి శరీరం తిరిగి పుంజుకోసాగింది. దానితో వైద్యరాజ్‌గా నా పరపతి కూడా బాగా పెరిగిపోయింది. ఉప్పు, పప్పు రెండిటినీ త్యజించడం వల్ల నామీద మంచి ప్రభావం పడింది. వదలివేసిన తరువాత పప్పు, ఉప్పు తినాలనే కోరిక కూడా ఎన్నడూ కలగలేదు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇంద్రియాలు శాంతించినట్లు నాకు అనుభూతి కలిగింది. సంయమం వైపుకు మనస్సు పరుగెత్తసాగింది. ఏడాది గడిచిన తరువాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. హిందూ దేశం వచ్చిన కొంతకాలం తరువాతనే వాటిని పుచ్చుకున్నాను. ఒక పర్యాయం ఇంగ్లాండులో 1914లో ఉప్పు, పప్పు తిన్నాను. దేశం వచ్చాక ఎందుకు తినవలసి వచ్చిందో ఆ కథ మరో ప్రకరణంలో చెబుతాను.

ఇతరుల మీద కూడా పప్పు ఉప్పును గుర్తించిన ప్రయోగం చేశాను. దక్షిణ ఆఫ్రికాలో మంచి ఫలితం చేకూరింది. ఆయుర్వేద వైద్యం దృష్ట్యా వాటిని వదలడం వల్ల లాభం చేకూరుతుందని చెప్పగలను. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహమూ లేదు. భోగికి, సంయమం కలిగిన వ్యక్తికి మధ్య ఆహారం విషయంలోను, అలవాట్ల విషయంలోను వ్యత్యాసం వుండవలసిందే. బ్రహ్మచర్య వ్రతపాలనను గురించి కోరిక గల వ్యక్తి భోగిగా జీవనం గడిపి తిరిగి బ్రహ్మచర్యం గడపాలంటే చాలా కష్టం. అది అసంభవం కూడా.