సత్యశోధన/నాల్గవభాగం/24. జూలూల తిరుగుబాటు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

24. జూలూల తిరుగుబాటు

దక్షిణ ఆఫ్రికాలో కాపురం పెట్టిన తరువాత స్థిరంగా కూర్చునే అదృష్టం నా నొసట రాసి లేదు. జోహన్సుబర్గులో కొంచెం స్థిరపడుతూ ఉండగా ఒక ఊహించని ఘట్టం జరిగింది. నేటాలులో జూలూలు తిరుగుబాటు చేశారని వార్త చదివాను. నాకు జూలూలతో శతృత్వం లేదు. వాళ్ళు ఒక్క హిందూ దేశస్థుడి జోలికి కూడా పోలేదు. తిరుగుబాటని, విద్రోహమని అనడం విషయంలో నాకు సందేహం ఉన్నది. అయితే ఆరోజుల్లో ఆంగ్ల సామ్రాజ్యం జగద్రక్షణకు అవసరమని నా అభిప్రాయం. హృదయపూర్తిగా ఆంగ్ల ప్రభుత్వం యెడ నాకు విశ్వాసం ఉంది. ఆ సామ్రాజ్యం నష్టపడటం నాకు ఇష్టం లేదు. అందువల్ల బలప్రయోగాన్ని గురించి గాని, నీతి అవినీతి అను విషయమై గాని నాకు పట్టింపు లేదు. నేను చేయబోయే చర్యను అది ఆపలేదు. నేటాలుకు కష్టం కలిగినప్పుడు రక్షణకోసం వాలంటీర్ల సైన్యం ఉన్నది. పని పడ్డప్పుడు ఆ సైన్యంలో క్రొత్తవాళ్ళను కొద్దిగా చేర్చుకునేవారు. వాలంటీర్ల సైన్యం ఈ తిరుగుబాటును శాంతింపచేసేందుకు బయలుదేరిందని చదివాను.

నేను నేటాలు వాసినేనని భావించాను. నేటాలుతో నాకు దగ్గర సంబంధం కూడా ఉంది. అందువల్ల నేను అక్కడి గవర్నరుకు జాబు వ్రాశాను. అవసరమైతే హిందూ దేశస్థుల దళాన్ని వెంటబెట్టుకొని యుద్ధరంగంలోకి వెళతానని, క్షత్రగాత్రులకు సేవచేస్తానని ఆ జాబులో వ్రాశాను. గవర్నరు వెంటనే సరేనంటూ సమాధానం పంపాడు. ఇంత త్వరగా అనుకూలంగా సమాధానం వస్తుందని ఊహించలేదు. అయితే జాబు వ్రాసేముందు ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను. గవర్నరు నుండి అనుకూలంగా సమాధానం వస్తే ఇప్పటి ఇల్లు వదిలివేయాలని, మి. పోలక్ చిన్న ఇల్లు తీసుకొని అందులో ఉండాలని నిర్ణయం గైకొన్నాము. ఇందుకు కస్తూరిబాయి అంగీకరించింది. ఇలాంటి నా నిర్ణయాలను ఆమె ఎప్పుడూ ఎదిరించలేదని నాకు బాగా గుర్తు. గవర్నరు నుండి సమాధానం రాగానే ఇంటి యజమానికి ఒక మాసం ముందుగా నోటీసు పంపి ఇల్లు ఖాళీ చేస్తామని తెలియజేశాము. కొంత సామాను ఫినిక్సుకు పంపాము. కొద్ది సామాను పోలక్ దగ్గర ఉంచాము. డర్బను చేరగానే మనుష్యులు కావాలని ప్రకటించాను. పెద్ద దళం అవసరం లేదని తెలిసి 24 మందిమి కలిపి దళంగా ఏర్పడ్డాం. వారిలో నేను గాక నలుగురు గుజరాతీలు ఉన్నారు. మిగతావారు మద్రాసుకు చెందిన గిర్‌మిటియా ప్రధ నుండి విముక్తి పొందినవారు. ఒకరు పఠాను. చీఫ్ మెడికల్ ఆఫీసరు నాకు “సార్జంట్ మేజర్” అను హోదా తాత్కాలికంగా ఇచ్చాడు. అది మా ఆత్మసన్మానానికి గుర్తుగా, పని సౌలభ్యం కోసం, అట్టి రివాజు వుండటం వల్ల ఆ ఆఫీసరు ఆ హోదా ఇచ్చాడు. నేను చెప్పిన ముగ్గురికి సార్జంటు హోదా మరియు కార్పోరల్ హోదా ఇచ్చాడు. డ్రస్సు కూడా ప్రభుత్వమే మాకు ఇచ్చింది. మా దళ సభ్యులు ఆరు వారాల పాటు సేవ చేశారు.

తిరుగుబాటు స్థావరం చేరి అక్కడ తిరుగుబాటు అనేదే లేదని తెలుసుకున్నాము. తిరుగుబాటు చేస్తూ ఎవ్వరూ కనబడలేదు. ఒక జూలూ సర్దారు క్రొత్తగా జూలూలపై విధించబడ్డ పన్ను చెల్లించవద్దని సలహా ఇచ్చాడట. పన్ను వసూలు చేసేందుకు వెళ్ళిన ఒక సార్జెంటును వాళ్ళు చంపివేశారట. అందువల్ల దీన్ని తిరుగుబాటు అని అన్నారు. ఏది ఏమైనా నా హృదయం మాత్రం జూలూలకు అనుకూలంగా ఉన్నది. ముఖ్య స్థావరం చేరిన తరువాత సంగ్రామంలో గాయపడిన జూలూలకు మేము సేవ శుశ్రూష చేయవలసి వచ్చింది. అందుకు నేను ఎంతో సంతోషించాను.

మెడికల్ ఆఫీసరు మాకు స్వాగతం పలికాడు. “తెల్లవాళ్ళెవళ్ళూ గాయపడ్డ జూలూలకు సేవ చేసేందుకు సిద్ధపడటం లేదు. నేను ఒక్కణ్ణి ఎంతమందికి సేవ చేయగలను? వాళ్ల గాయాలు మురుగుతున్నాయి. సమయానికి మీరు రావడం వాళ్ళ ఎడ దేవుడు చూపిన కృపయేయని నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే అతడు మాకు పట్టీలు, క్రిమినాశక మందులు, లోషన్లు వగైరాలు ఇచ్చి క్షతగాత్రులైన జూలూల దగ్గరికి తీసుకువెళ్ళాడు. మమ్మల్ని చూచి జూలూలు ఎంతో సంతోషించారు. తెల్ల సిపాయిలు తెరల వెనుకనుండి తొంగి చూస్తూ గాయాలకు మందులు రాయవద్దని, పట్టీలు కట్టవద్దని మాకు సైగ చేయసాగారు. మేము వాళ్ళ మాట పట్టించుకోనందున కోప్పడసాగారు. చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేలా గాయపడిన జూలూలను బండ బూతులు తిట్టడం ప్రారంభించారు.

తరువాత ఆ సిపాయిలతో కూడా నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళు నన్ను ఆదరించారు. 1896లో నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన కర్నల్ సార్క్సు, కర్నల్ వాయిలీలు అక్కడే ఉన్నారు. వాళ్ళు నేను చేస్తున్నపని చూచి నివ్వెరపోయారు. నన్ను ప్రత్యేకించి పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను జనరల్ మెకంజీ దగ్గరికి కూడా తీసుకువెళ్ళారు. వారికి నన్ను పరిచయం చేశారు. వీరంతా వృత్తిరీత్యా స్పార్క్సు. ఒక కసాయివాడకు యజమాని. కర్నల్ మెకంజీ నేటాలుకు చెందిన ప్రసిద్ధ రైతు. వారంతా వాలంటీర్లు. వాలంటీర్ల రూపంలో సైనిక శిక్షణ పొంది అనుభవం సంపాదించారు. మేము సేవ చేస్తున్న జూలూ క్షతగాత్రులంతా యుద్ధంలో గాయపడ్డ వారని పాఠకులు భావించవద్దు. వారిలో చాలామంది సందేహించి నిర్భందించబడ్డ ఖైదీలు. వారిని కొరడాతో కొట్టమని జనరల్ ఆదేశించాడు. కొరడా దెబ్బలు తగిలిన చోట బాగా కమిలిపోయింది. మరి కొంతమంది మిత్రులుగా భావించబడ్డ జూలూ జాతివాళ్ళు. ఈ మిత్రులు స్నేహాన్ని సూచించే గుర్తులు ధరించి ఉన్నారు. అయినా సైనికులు పొరపాటున వాళ్ళను కూడా గాయపరిచారు.

తెల్ల సిపాయిలకు కూడా మందులిచ్చే పని నాకు అప్పగించారు. డాక్టర్ బూథ్‌గారి చిన్న ఆసుపత్రిలో నేను ఒక సంవత్సరంపాటు ఈ పని నేర్చుకున్నాను. ఇది నాకు బహు తేలిక పని. ఈ పనివల్ల నాకు చాలా మంది ఆంగ్ల సైనికులతో మంచి పరిచయం ఏర్పడింది. యుద్ధంలో పాల్గొంటున్న సైన్యం ఒకే చోట ఉండదు. సంకటం ఏర్పడిందన్న చోటుకు పరిగెత్తాలి. వారిలో చాలామంది గుర్రపు రౌతులు. మా దళం ప్రధాన స్థావరాలనుండి తప్పుకొని వాళ్ళ వెంట వెళ్ళవలసి వచ్చింది. మా సరంజామా మేమే మోసుకెళ్ళాలి. ఒక్కొక్కసారి పగటిపూట 40 మైళ్ళ దూరం కాలి నడకన పయనం సాగించవలసి వచ్చేది. ఇక్కడ కూడా మాకు భగవంతుని కార్యమే లభించింది. పొరపాటువల్ల గాయపడ్డ జూలూలను కూడా డోలీలలో ఎత్తుకొని ఆసుపత్రికి చేర్చి అక్కడ వారికి సేవ శుశ్రూష చేయాలి. ఇదీ మా కార్యక్రమం.