సత్యశోధన/నాల్గవభాగం/23. ఇంట్లో పెద్దమార్పులు - పిల్లలకు శిక్షణ

వికీసోర్స్ నుండి

23. ఇంట్లో పెద్దమార్పులు - పిల్లలకు శిక్షణ

డర్బనులో వుంటున్నప్పుడు ఇంట్లో మార్పులు చేశాను. ఖర్చు విపరీతం అయినా నిరాడంబరంగా వుండాలని ప్రయత్నం చేశాను. జోహన్సుబర్గులో సర్వోదయ భావాలు నాచేత ఎక్కువ మార్పులు చేయించాయి.

బారిష్టరు ఇల్లు సాధ్యమైనంత నిరాడంబరంగా వుండాలని కృషి ప్రారంభించాను. కాని కొంత గృహాలంకరణ అవసరమనిపించింది. మనస్సులో మాత్రం నిరాడంబరత్వం మొదలైంది. ప్రతి పని స్వయంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇందు పిల్లలను కూడా చేర్చుకున్నాను.

బజారు నుండి రొట్టె కొని తేవడం మానివేశాము. ఇంట్లో కూనే సూచించిన ప్రకారం రొట్టె స్వయంగా తయారు చేసుకోవడం ప్రారంభించాము. మిల్లులో తయారైన పిండి వాడకం తగ్గిపోయింది. మిల్లులో పట్టిన పిండి కంటే చేతితో విసిరిన పిండిని ఉపయోగిస్తే ఆరోగ్యరీత్యాను, నిరాడంబరత్వరీత్యాను మంచిదని, డబ్బు కూడా మిగులుతుందని తేలింది. అందుకోసం ఆరు పౌండ్లు పెట్టి తిరగలి కొన్నాం. తిరగలి రాళ్ళు పెద్దవిగా వున్నాయి. ఇద్దరు మనుష్యులు ఆ తిరగలితో తేలికగా పిండి విసరవచ్చు. ఒక మనిషి తిరగలి విసరడం కష్టం. ఈ తిరగలితో నేను, పోలక్ మరియు మా అబ్బాయిలు పిండి విసిరే వాళ్ళం. అప్పుడప్పుడు కస్తూరిబాయి కూడా విసిరేది. అయితే ఆమెకు భోజనం తయారు చేసేపని అప్పగించాం. పోలక్ భార్య వచ్చిన తరువాత ఆమె కూడా సహకరించింది. ఆ కసరత్తు పిల్లలకు ఎంతో ప్రయోజనకారి అయింది. నేను బలవంతంగా వాళ్ళ చేత ఆ పని చేయించలేదు. వాళ్ళే ఆటగా భావించి తిరగలితో పిండి విసరడం ప్రారంభించారు. అలసిపోతే మానవచ్చునని వారికి అనుమతి ఇచ్చాం. కాని మా పిల్లలు ఇంకా చాలా మంది ఇట్టి పనులు బాగా ఉత్సాహంతో చేశారు. వాళ్ళను గురించిన వివరం ముందు ముందు వ్రాస్తాను. కొంతమంది ఇతర పిల్లలు కూడా పని చేయసాగారు. అయితే వాళ్ళంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తుండేవారు. అలిసిపోయాం అని చెప్పిన పిల్లలు బహు తక్కువగా వుండేవారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక నౌకరు ఉండేవారు. అతడు కూడా ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవాడు. అతడు చేసే పనికి పిల్లలు బాగా సహకరించేవారు. పాయిఖానా ఎత్తుకు పోయేందుకు మునిసిపాలిటీ వాళ్ళు వస్తూ ఉండేవారు. కాని పాయిఖానా గది శుభ్రం చేయడం, కూర్చునే స్థానాలు కడగడం మొదలుగాగల పనులు నౌకరు చేత చేయించేవారం కాదు. నౌకరు ఆ పని చేయాలని ఆశించడం కూడా సరికాదని మా అభిప్రాయం. ఆ పని మేము స్వయంగా చేస్తూ ఉండేవారం. మా పిల్లలకు కూడా అట్టి శిక్షణ లభిస్తూ ఉండేది. అందువల్ల మా పుత్రులందరు మొదటి నుండి పాయిఖానా ఎత్తివేయాలన్నా, పాయిఖానా దొడ్డి బాగు చేయాలన్నా అసహ్యించుకోలేదు. సాధారణమైన ఆరోగ్య నియమాలు వారు తేలికగా తెలుసుకున్నారు. జోహంసుబర్గులో మా అబ్బాయిలెవ్వరూ జబ్బు పడలేదు. సేవా కార్యక్రమాల్లో సంతోషంతో పాల్గొంటూ ఉండేవారు.

వారి అక్షరజ్ఞానం విషయమై నేను నిర్లక్ష్యంగా వ్యవహరించానని అనను, కాని దాన్ని హోమం చేయడానికి నేను వెనుకాడలేదు. నా యీ పొరపాటును గురించి నన్ను మాట అనడానికి మా అబ్బాయిలకు అవకాశం ఉన్నదని చెప్పగలను. వాళ్ళు అనేక పర్యాయాలు తమ అసంతృప్తిని వెల్లడించారు కూడా. ఈ వ్యవహారంలో కొంత దోషం నాదేనని ఒప్పుకోక తప్పదు. వాళ్ళకు అక్షర జ్ఞానం కలిగించాలనే కోరిక మిక్కుటంగా నాకు ఉండేది. అందుకు కృషి కూడా చేశాను. కాని ఆ పనికి ఎప్పుడూ ఆటంకాలు కలుగుతూ ఉండేవి. ఇంటి దగ్గర విద్యాభ్యాసానికి మరో ఏర్పాటు చేయలేదు. అందువల్ల వాళ్ళను నా వెంట ఆఫీసుకు తీసుకువెళుతూ ఉండేవాణ్ణి. ఆఫీసు రెండున్నర మైళ్ళ దూరాన ఉండేది. ప్రతిరోజూ రానుపోను ఉదయం సాయంత్రం కలిపి వాళ్ళకు నాకు అయిదు మైళ్ళ నడక కసరత్తుగా సాగుతూ ఉండేది. నడుస్తున్నప్పుడు త్రోవలో పాఠం చెబుదామని ప్రయత్నం చేసేవాణ్ణి. నా వెంట మరొకరెవ్వరూ లేనప్పుడు అది సాగేది. ఆఫీసులో కక్షిదారులతోను, గుమాస్తాలతోను నాకు సరిపోయేది. ఆ సమయంలో ఏదో ఒకటి వ్రాయమనో, చదవమనో వాళ్ళకు పని అప్పగిస్తూ ఉండేవాణ్ణి. ఆ కాసేపు చదివి తిరుగుతూ, ఇంటికి సామాన్లు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్లు. పెద్దవాడు హరిలాలు మినహా మిగతా పిల్లల చదువు ఇలాగే సాగేది. హరిలాలు దేశంలో ఉండిపోయాడు. మా పిల్లల చదువుకై ప్రతిరోజూ ఒక గంటసేపైనా నేను సమయం కేటాయించి ఉంటే వాళ్ళకు ఆదర్శ విద్య గరిపి ఉండేవాడినే. ఆ పట్టుదల నేను చూపలేదు. అందుకు నాకు, వాళ్ళకు విచారం కలిగింది. మా పెద్ద కుమారుడు నాకు వ్యతిరేకంగా మారాడు. అందువల్ల తన అభిప్రాయం వెల్లడించాడు. జనం మధ్యన కూడా ప్రకటించాడు. ఇతరులు ఉదారహృదయంతో ఈ దోషాన్ని అనివార్యమని భావించి ఊరుకున్నారు. ఈ దోషానికి నేను పశ్చాత్తాపపడలేదు. అయినా ఆదర్శ తండ్రి కాజాలకపోవడం వరకే అది నిమిత్తం. అజ్ఞానం వల్ల జరిగిన వాళ్ళ చదువును హోమం చేసిన మాట నిజమే. సద్భావంతో వాళ్ళను సేవారంగంలో ప్రవేశపెడదామనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను. అయితే వాళ్ళ శీలనిర్మాణం కోసం చేయవలసిందంతా చేశాను. లోటు ఏమీ చేయలేదు. ఇలా చేయడం ప్రతి తల్లి తండ్రి కర్తవ్యమని భావిస్తున్నాను.

అయినా నా పిల్లల శీలంలో ఎక్కడైనా దోషం ఉంటే అది మా దంపతుల దోషమని భావిస్తున్నాను. బిడ్డలకు తల్లిదండ్రుల రూపురేఖలు వారసత్వంగా లభించినట్లే వారి గుణదోషాలు కూడా తప్పక లభిస్తాయి. పరిసరాల ప్రభావం వల్ల వారిలో రకరకాల గుణదోషాలు చోటు చేసుకుంటాయి. అయితే అసలు ఆస్థి మాత్రం తండ్రి తాతల ద్వారానే వాళ్లకు లభిస్తుంది గదా! అట్టి దోషాలనుండి కొంతమంది పిల్లలు తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అది ఆత్మ స్వభావం. అట్టివారికి అభినందనలు.

నా పిల్లలకు జరిపిన ఇంగ్లీషు శిక్షణను గురించి పోలక్‌కు నాకు అప్పుడప్పుడు వేడివేడిగా చర్చలు జరిగాయి. బాల్యంనుండే తమ పిల్లల చేత ఇంగ్లీషు మాట్లాడించేందుకు తంటాలుపడే తల్లితండ్రులు తమకు, తమ దేశానికి ద్రోహం చేస్తున్నారని నా నిశ్చితాభిప్రాయం. ఇందువల్ల పిల్లలు తమ దేశ ధార్మిక, సాంఘిక వారసత్వం నుండి వంచితులవుతారని నా అభిప్రాయం. వాళ్ళు దేశానికి, ప్రజలకు సేవ చేసేందుకు యోగ్యత తక్కువగా పొందుతారని నా భావన. ఈ కారణాల వల్లనే నేను నా పిల్లలతో కావాలనే గుజరాతీ భాషలో మాట్లాడుతూ ఉండేవాడిని. పోలక్‌కు నా ఈ పద్ధతి నచ్చలేదు. నేను పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్నానని పోలక్ భావించాడు. ఇంగ్లీషు వంటి వ్యాప్తి చెందిన భాషను పిల్లలు చిన్నప్పటినుండే నేర్చుకుంటే ప్రపంచంలో సాగే పరుగుపందెంలో పెద్ద అడుగు సహజంగా వేయగలుగుతారని ప్రేమతోను, పట్టుదలతోను నాకు నచ్చచెబుతూ ఉండేవాడు. ఆయన సలహా నాకు నచ్చలేదు. నా భావం నచ్చక చివరకు మౌనం వహించాడో లేదో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ చర్చలు జరిగి సుమారు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు నాకు కలిగిన భావాలు కాలం గడిచినకొద్దీ గట్టిపడ్డాయి. నా బిడ్డలు అక్షరజ్ఞానంలో వెనుకబడ్డారేమో కాని జ్ఞానం సులభంగా పొందగలిగారని చెప్పగలను. దాని వల్ల వాళ్ళకు, దేశానికి మేలు జరిగిందని చెప్పగలను. ఇవాళ వాళ్ళు విదేశస్థుల వలె లేరు. రెండు భాషలు వారికి సుపరిచితాలు. గొప్ప గొప్ప ఆంగ్లేయుల మధ్య వుండటం వల్ల, ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడబడే దేశంలో నివసించడం వల్ల వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడటం, వ్రాయడం బాగా నేర్చుకున్నారు.