Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/22. ఎవరిని దేవుడు రక్షిస్తాడో

వికీసోర్స్ నుండి

22. ఎవరిని దేవుడు రక్షిస్తాడో

త్వరగా హిందూదేశం వెళ్ళి స్థిరపడాలనే కాంక్ష వదులుకున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వస్తానని భార్యకు నచ్చచెప్పి దక్షిణ ఆఫ్రికా వచ్చాను. సంవత్సరం గడిచిపోయింది. తిరిగి దేశం వెళ్ళడం పడలేదు. అందువల్ల భార్యాబిడ్డల్ని పిలిపించాలని నిర్ణయించుకున్నాను.

పిల్లలు వచ్చారు. మా మూడో పిల్లవాడు రామదాసు. త్రోవలో మా వాడు కెప్టనుతో స్నేహం పట్టాడు. ఆయనతో ఆడుతూ వుండగా మా వాడి చేయి విరిగింది. కెప్టెను పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూచాడు. డాక్టరు ఎముకను సరిచేశాడు. జోహన్సుబర్గు చేరినప్పుడు కర్రచెక్కల మధ్య మెడలో వేసినపట్టీలో చెయ్యి కట్టివేసివున్నది. చేతికి తగిలిన గాయాన్ని డాక్టరుకు చూపించి నయం చేయించడం అవసరమని ఓడ డాక్టరు సలహా ఇచ్చాడు. కాని ఆ రోజుల్లో నా మట్టి పట్టీల చికిత్స జోరుగా సాగుతున్నది. నా దేశవాళీ చికిత్స మీద విశ్వాసం గల కక్షిదారులకు నేను మట్టితోను, నీటితోను చికిత్స చేస్తున్నాను. రామదాసును మరో వైద్యుని దగ్గరికి ఎలా పంపుతాను? వాడి వయస్సు ఎనిమిది సంవత్సరాలు. “నీ గాయనికి పట్టీలు వగైరా కట్టి చికిత్స చేస్తే భయపడతావా” అని మావాణ్ణి అడిగాను. రామదాసు నవ్వుతూ నాకు అనుమతి ఇచ్చాడు. ఈ వయస్సులో మంచి చెడ్డల పరిజ్ఞానం వాడికి లేకపోయినా డాక్టరీకి, దేశవాళీ వైద్యానికి గల తేడా వాడికి తెలుసు. నా ప్రయోగాలను గురించి వాడికి తెలుసు. నా మీద గల విశ్వాసంతో వాడు నా చేత చికిత్స చేయించుకునేందుకు భయపడలేదు.

వణుకుతున్న చేతులతో వాడి పట్టీ ఊడతీశాను. గాయం కడిగి శుభ్రం చేశాను, మట్టి పట్టీ గాయం మీద వేసి మొదటిలాగానే తిరిగి మెడకు పట్టీ కట్టివేశాను. డాక్టరు కట్టే పట్టీలకు కూడా ఇంత సమయం పడుతుందని ఓడ డాక్టరు చెప్పడం జరిగింది. మట్టి చికిత్స పై నాకు విశ్వాసం ఏర్పడింది. ఆ తరువాత ప్రయోగాలు చేయసాగాను. గాయాలు, జ్వరం, అజీర్ణం, పాండురోగం మొదలుగాగల వ్యాధులకు మట్టితోను, నీటితోను మరియు ఉపవాసాలు చేయించి చాలామందికి చికిత్స చేశాను. రోగుల్లో చిన్న పెద్ద అంతా వుండేవారు. చాలామందికి నా చికిత్స వల్ల రోగాలు నయమయ్యాయి. ఈ చికిత్సపై దక్షిణ ఆఫ్రికాలో నాకు గట్టి విశ్వాసం వుండేది. అంత విశ్వాసం ఇక్కడకు వచ్చాక తగ్గిపోయింది. ఈ ప్రయోగాలలో ప్రమాదం అధికమని అందువల్ల జాగరూకత అవసరమని అనుభవం వల్ల తెల్చుకున్నాను. ఇన్ని వివరాలు వ్రాస్తున్న కారణం నా ప్రయోగాలు సఫలమయ్యాయని చెప్పడానికి కాదు. ఏ ప్రయోగం కూడా పూర్తిగా సఫలం అని చెప్పడానికి వీలులేదు. డాక్టర్లు కూడా అలా చెప్పలేదు. అయితే క్రొత్త ప్రయోగాలు చేయదలచిన వారు మొదట తమతోనే ప్రారంభించాలని నా అభిప్రాయం. ఆ విధంగా చేస్తే నిజం త్వరగా బయటబడుతుంది. ఇట్టి ప్రయోగాలు చేసేవారిని భగవంతుడు రక్షిస్తాడు కూడా.

మట్టి ప్రయోగాలు ఎంత ప్రమాదకరమైనవో, యూరోపియన్లతో సంబంధం పెట్టుకోవడం కూడా అంత ప్రమాదకరమైన వ్యవహారమే. రంగులో తేడాయేగాని, అందరి వ్యవహారం ఒకటే. ఈ విషయం ముందుగా నేను గ్రహించలేదు. మిస్టర్ పోలక్‌ను నాతోబాటు వుండమని ఆహ్వానించాను. మేమిద్దరం సొంత సోదరుల్లా వుండేవారం. పోలక్ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ అమ్మాయితో చాలాకాలం నుండి అతనికి స్నేహం ఉన్నది. అయితే కొంత డబ్బు సమకూర్చుకున్న తరువాత వివాహం చేసుకుందామని ఎదురు చూడసాగాడు. రస్కిన్ రచనలు నాకంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు కాని పాశ్చాత్యదేశాలలో రస్కిన్ భావాలను పూర్తిగా అమలు చేయడాన్ని గురించి ఆయనకు ఆశలేదు.

“మనస్సులు కలిసిన తరువాత డబ్బు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం సరిపోదు. ఈ ప్రకారంగా అయితే బీదవాడెవడూ పెండ్లి చేసుకోవడానికి వీలు వుండదు. ఇప్పుడు మీరు నాతోబాటు ఉన్నారు. అందువల్ల ఇంటి ఖర్చును గురించిన సమస్య ఉండదు. మీరు త్వరగా పెండ్లి చేసుకోండి” అని నేను చెప్పాను.

నేనెప్పుడూ పోలక్‌తో రెండుసార్లు ఏ విషయమూ చర్చించలేదు. నా సలహాను వెంటనే అంగీకరించాడు. మిసెస్ పోలక్ ఇంగ్లాండులో ఉన్నది. ఆమెతో ఉత్తరాలు నడిచాయి. ఆమె అంగీకరించింది. కొద్ది మాసాలలోనే ఆమె పెండ్లి కోసం జోహన్సుబర్గు వచ్చింది. మేము పెండ్లికి ఖర్చు ఏమీ చేయలేదు. బట్టలు కూడా కొనలేదు. మత విధానాలతో కూడా వారికి పనిలేదు. మిసెస్ పోలక్‌ది క్రైస్తవమతం. మిష్టర్ పోలక్ యూదుడు. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం నీతికి సంబంధించిన ధర్మం మాత్రమే.

ఈ వివాహానికి సంబంధించిన విచిత్ర విషయం వ్రాస్తాను. ట్రాన్సువాలులో తెల్లవారి పెళ్ళిళ్ళను రిజిష్టరు చేసే అధికారి నల్లవాళ్ళ పెళ్ళిళ్ళను రిజిష్టరు చేయడు. ఈ వివాహంలో నేను సాక్షిని. వెతికితే మాకు ఒక తెల్లవాడు దొరికేవాడే కాని పోలక్ అందుకు అంగీకరించలేదు. మేము ముగ్గురం అధికారి దగ్గరికి వెళ్ళాం. నేను సాక్షిగా వున్నాను గనుక వరుడు వధువు ఇద్దరూ తెల్లవారేనని ఎలా నమ్ముతాడు. వివరాలు తెలుసుకోవడానికి వాయిదా వేద్దామని చూచాడు. మరునాడు నేటాలులో పండుగ దినం. పెండ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న మీదట ఈ విధమైన కారణాలతో ముహూర్తాన్ని వాయిదా వేయడం ఎవ్వరూ సహించలేకపోయారు. పెద్ద మేజిస్ట్రేటును నేను ఎరుగుదును. ఆయన ఈ శాఖకు పెద్ద అధికారి. దంపతులిద్దరినీ వెంటబెట్టుకొని వెళ్ళి ఆయనను కలిశాను. ఆయన నవ్వుతూ, నాకు జాబు వ్రాసి ఇచ్చాడు. ఈ విధంగా పెండ్లి రిజిస్టరు అయిపోయింది.

ఇప్పటివరకు కొంతమంది తెల్లవాళ్ళు మాతోబాటు వున్నారు. వారితో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఒక అపరిచితురాలు మా ఇంట్లో ప్రవేశించిందన్నమాట. ఎన్నడూ ఏ విధమైన తంటా ఆమె వల్ల వచ్చినట్లు నాకు గుర్తులేదు. కాని అనేక జాతులవాళ్ళు, అనేక స్వభావాల వాళ్ళు హిందూ దేశస్థులు వచ్చి వెళ్ళేచోట, అనుభవం లేని నా భార్యవంటి వారు ఉన్న చోట, వారిద్దరికీ (శ్రీ. శ్రీమతి పోలక్) ఏమైనా ఇబ్బంది కలిగితే కలిగి యుండవచ్చు. ఒకే జాతివాళ్ళు వుండే కుటుంబాలలో కూడా వివాదాలు బయలుదేరుతూ ఉంటాయి. ఆ దృష్టితో చూస్తే విజాతీయులు వున్న మా గృహంలో వివాదాలు బాగా తక్కువేనని చెప్పవచ్చు. అసలు అట్టివి లేవనే చెప్పవచ్చు. నిజానికి సజాతీయులు, విజాతీయులు అను భావం మనస్సులో బయలుదేరే నీటితరంగం వంటిది. మేమంతా ఒకే కుటుంబీకులంగా వున్నాం.

వెస్ట్ వివాహం కూడా ఇక్కడే చేయాలని భావించాను. ఆ సమయంలో బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు యింకా నాకు కలుగలేదు. అందువల్ల పెండ్లి కాని స్నేహితులకు పెండ్లి చేయడం నా పని అయింది. వెస్ట్ తన తల్లి తండ్రుల్ని చూచేందుకు ఇంగ్లాండు బయలుదేరినప్పుడు పెండ్లి చేసుకురమ్మని అతనికి సలహా ఇచ్చాను. ఫినిక్సు ఇప్పుడు వారందరికీ స్థావరం అయింది. అంతా రైతులుగా మారిపోయారు. అందువల్ల వివాహానికి వంశవృద్ధికి భయపడనవసరం లేకుండా పోయింది.

లెస్టర్‌కు చెందిన ఒక అందమైన అమ్మాయిని పెండ్లి చేసుకొని వెస్ట్ వెంట తీసుకువచ్చాడు. ఆ సోదరి కుటుంబం వారు లెఫ్టర్‌లో చెప్పుల పరిశ్రమ యందు పనిచేస్తున్నారు. మిసెస్ వెస్ట్ కూడా కొంత కాలం చెప్పుల కార్ఖానాలో పనిచేసింది. ఆమెను ‘సుందరి’ అని పిలిచాను. ఆమె గుణాలు బహు సుందరమైనవి కావడమే అందుకు కారణం. వెస్ట్ తన అత్తగారిని కూడా వెంట తీసుకువచ్చాడు. ఆమె సుగుణాలు గల వృద్ధ వనిత. ఆమె ఇంకా జీవించే యున్నది. శ్రమ చేసే స్వభావంతో, నవ్వుముఖంతో మమ్మల్నందరినీ సిగ్గుపడేలాచేస్తూ ఉన్నది. నేను తెల్లవాళ్ళ పెళ్ళిళ్ళు చేయించినట్లే హిందూ దేశపు పురుషుల్ని కూడా పెళ్ళాం బిడ్డల్ని పిలిపించమని ప్రోత్సహించాను. దానితో ఫినిక్సు చిన్న ఊరుగా మారింది. అక్కడ అయిదారు హిందీ కుటుంబాలవారు కూడా స్థిరపడి అభివృద్ధికి రాసాగారు.