సత్యశోధన/నాల్గవభాగం/21. పోలక్
21. పోలక్
ఫినిక్సు వంటి సంస్థ స్థాపించబడిన తరువాత నేను అక్కడ కొద్ది రోజులు మాత్రమే వుండగలిగాను. అందుకు ఎంతో విచారపడ్డాను. దాన్ని స్థాపించినప్పుడు నేను కూడా అక్కడే ఉండాలని, అక్కడే జీవితం గడపాలని నెమ్మదిగా వకీలు వృత్తి మానివేయాలని, ఫినిక్సు విజయాన్ని నిజమైన సేవగా భావించాలని అనుకున్నాను. కాని అనుకున్నట్లుగా పనులు జరగలేదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి అను విషయాన్ని జీవితంలో అనుభవం వల్ల తెలుసుకున్నాను. దానితోబాటు సత్యశోధన ఉపాసన సాగినప్పుడు, మనం కోరుకున్న ఫలితం కలుగక, ఊహించని ఫలితం కలిగితే దానివల్ల నష్టం కలుగదని, ఒక్కొక్కప్పుడు మనం ఊహించిన దానికంటే మించిన సత్ఫలితం కలుగుతుందనే అనుభూతి నాకు కలిగింది. ఫినిక్సులో కలిగిన ఊహించని ఫలితాలు, అక్కడ రూపొందిన ఊహించని కార్యక్రమాలు నష్టదాయకమైనవి కావని నా నిశ్చితాభిప్రాయం. ఊహించిన ఫలితాలకంటే మించినవి అవునో కాదో నిశ్చితంగా చెప్పలేను.
అంతా కాయకష్టం చేసి బ్రతకాలనే ఉద్దేశ్యంతో ముద్రణాలయ సమీపంలో సంస్థ యందలి ప్రతి వ్యక్తికి మూడు మూడు ఎకరాల చొప్పున భూమి కేటాయించాం. వాటిలో ఒక ముక్క నా కోసం ఉంచారు. ఆయా చోట్ల అందరికోసం, వారు కోరకపోయినా రేకులతో ఇళ్ళు నిర్మించాం. రైతుకు నప్పే విధంగా గడ్డి, మట్టి, పచ్చి ఇటుకలతో గోడలు కట్టి చొప్పతో పైకప్పు నిర్మించి కుటీరాలు ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కాని సాధ్యపడలేదు. అందుకు ధనం, సమయం అధికంగా కావలసి వచ్చింది. అందరూ ఇంటి వాళ్ళే, కనుక వెంటనే కాయకష్టం చేయాలని తహతహలాడారు.
“ఇండియన్ ఒపీనియన్” పత్రికకు సంపాదకుడు మన్ సుఖలాల్. ఆయన ఈ వ్యవస్థలో చేరలేదు. డర్బనులోనే ఆయన బస. డర్బనులో ఇండియన్ ఒపీనియన్‌కు చిన్న శాఖ కూడా ఉన్నది.
కంపోజు పని చేసేందుకు మనుషులు అదనంగా ఉన్నారు. నిజానికి ముద్రణా కార్యక్రమంలో ఎక్కువ సమయం కంపోజు చేయడానికి పడుతుంది. అయితే అది తేలిక పనే. సంస్థలో వుండేవారంతా కంపోజు పని నేర్చుకోవాలని నిర్ణయించారు. దానితో ఆ పని తెలియని వారంతా నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. నేను మాత్రం ఈ వ్యవహారంలో వెనుకబడ్డాను. మగన్‌లాల్ గాంధీ మొదటి స్థానం సంపాదించాడు.
అసలు మగన్‌లాల్‌కు అతని శక్తి ఏమీటో తెలియదని అనుకునేవాణ్ణి. అతడు ఎన్నడూ ప్రెస్సు పని చేయలేదు. అయినా నేర్పరియగు కంపోజిటరు అయ్యాడు. వేగంలో కూడా బాగా పుంజుకున్నాడు. కొద్దిరోజుల్లోనే ప్రెస్సు పనంతా క్షుణ్ణంగా తెలుసుకొని అతడు విజయవంతంగా ప్రెస్సు పని నిర్వహించడం చూచి నేను నివ్వెరబోయాను. ఇంకా ఫినిక్సు వ్యవహారం ఒక ఒడ్డుకు చేరలేదు. ఇంతలో ఈ క్రొత్త కుటుంబాన్ని వదిలి నేను జోహన్సుబర్గు పరుగెత్తవలసి వచ్చింది. అక్కడి పనిని ఎక్కువ కాలం వదలి వుండగల స్థితిలో నేను లేను.
జోహన్సుబర్గు చేరి పోలక్‌తో ఈ పెద్దమార్పును గురించిన వ్యవహారమంతా చెప్పాను. తానిచ్చిన పుస్తకం ఇంతటి మార్పుకు కారణం అయిందని తెలిసి పోలక్ పొంగిపోయాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. “నేను కూడా ఈ వ్యవస్థలో పాలుపంచుకోవచ్చా” అని గద్గద కంఠంతో అడిగాడు. “తప్పక పాలుపంచుకోవచ్చు. అంతేకాదు మీరు అందులో చేరాలి” అని అన్నాను. “చేర్చుకుంటానంటే సిద్ధంగా ఉన్నాను.” అని అన్నాడు. ఆయన నిర్ణయానికి సంతోషించాను. ‘క్రిటిక్’ పత్రిక నుండి తప్పుకుంటున్నానని ఒక నెల రోజుల ముందే నోటీసు పత్రికాధిపతికి పంపి, నెలరోజుల వ్యవధి గడచిపోగానే ఫినిక్సు చేరుకున్నాడు. తన సహృదయతతో అందరినీ ఆకట్టుకున్నాడు. వారందరికీ తల్లో నాలుక అయిపోయాడు. నిరాడంబరతకు ఆయన ప్రతిమూర్తి. అందువల్ల ఫినిక్సు జీవనం ఆయనకు ఎబ్బెట్టు అనిపించలేదు. ఆయన స్వభావానికి అది సరిపోయింది.
కాని నేను ఆయనను అక్కడ ఎక్కువ రోజులు ఉండనీయలేకపోయాను మి. రీచ్ లా చదువు ఇంగ్లాండులో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నందున, ఆఫీసు పని నేను ఒక్కణ్ణి సంబాళించలేకపోయాను. అందువల్ల పోలక్‌ను ఆఫీసులో చేరమని, వకీలు వృత్తి చేపట్టమని ప్రోత్సహించాను. ఆయన వకీలు అయితే చివరకు అంతా వదిలివేసి ఇద్దరు ఫినిక్సు వెళ్ళవచ్చునని భావించాను.
ఆ తరువాత నా కలలన్నీ కల్లలేనని తేలిపోయింది. పోలక్‌లో ఒక గొప్ప సుగుణం వున్నది. ఎవరిమీదనైనా నమ్మకం కుదిరితే మారు మాట్లాడకుండా చెప్పినట్లు చేయడం తన కర్తవ్యంగా భావించే వ్యక్తి. నా జాబుకు సమాధానం వ్రాస్తూ “నాకు ఇక్కడి జీవనం హాయిగా వున్నది. ఇక్కడ సుఖంగా ఉన్నాను. ఈ సంస్థను ఇంకా అభివృద్ధికి తీసుకురావచ్చు. అయినా నేను అక్కడకు రావడం అవసరమని మన ఆదర్శాలు త్వరగా నెరవేరతాయని మీరు భావిస్తే నేను వస్తాను” అని వ్రాశాడు. నేను ఆ జాబుకు స్వాగతం పలికాను. పోలక్ ఫినిక్సు వదిలి జోహన్సుబర్గు వచ్చేశాడు. నా ఆఫీసులో సహాయకుడిగా చేరి వకీలు వృత్తి ప్రారంభించాడు.
ఇంతలో ఒక స్కాచ్ థియోసాఫిస్టు వచ్చాడు. పోలక్‌ను అనుసరించమని ఆయనను ప్రోత్సహించాను. ఇంతకు పూర్వం ఆయనకు లా చదువు విషయంలో సాయం చేస్తూ వుండేవాణ్ణి. ఆయన పేరు మేకిస్‌టయర్.
ఈ విధంగా ఫినిక్సు ఆదర్శాలను వెంటనే ఆచరణలో పెట్టాలనే భావంతో, వాటికి విరుద్ధమైన జీవితపు లోతుల్లోకి ప్రవేశిస్తున్నట్లు నాకు అనిపించింది. భగవదేచ్ఛ మరోరకంగా వుండియుండకపోతే నిరాడంబర జీవనం అనే నెపంతో పరుచుకున్న మోహజాలంలో స్వయంగా చిక్కుకుపోయేవాణ్ణి. ఎవ్వరూ ఊహించని రీతిలో నేను, నా ఆదర్శాలు ఎలా రక్షింపబడ్డాయో రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను.