సత్యశోధన/నాల్గవభాగం/25. హృదయ మధనం

వికీసోర్స్ నుండి

25. హృదయ మథనం

జూలూ తిరుగుబాటు సమయంలో నాకు అనేక అనుభవాలు కలిగాయి. ఆలోచించడానికి చాలా సామగ్రి లభించింది. బోయరు యుద్ధంలో కనబడిన భయంకర రూపం ఇక్కడ కనబడలేదు. ఇక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు. మనుష్యుల వేట జరుగుతున్నదన్నమాట. నాతో మాట్లాడిన చాలామంది ఆంగ్లేయుల అభిప్రాయం కూడా ఇదే. ప్రొద్దున్నే సైనికులు లేవడం, వెంటనే గ్రామాలకు వెళ్ళడం, టపాకాయలు పేల్చినట్లు తుపాకులు పేల్చడం, ఆ ధ్వనులు దూరాన వున్న మాకు వినబడటం ఇదీ వరస. నేను ఈ వ్యవహారం సహించలేకపోయాను. అయినా చేదు గుటకలు మ్రింగవలసి వచ్చింది. నాకు లభించిన పని క్షతగాత్రులైన జూలూలకు సేవ చేయడం మాత్రమే. మేము ఆ పనికి పూనుకొని వుండకపోతే మరొకరెవ్వరూ ఆ పని చేసి ఉండేవారు కాదు. ఈ విధంగా చెప్పుకొని నా అంతరాత్మను శాంతపరచుకున్నాను.

ఇక్కడ జనసంఖ్య చాలా తక్కువ. పర్వతాలమీద, కొండచరియల్లోను, అమాయకులు, మంచివాళ్ళు, అడవి మనుష్యులుగా భావించబడే జూలూల గుండ్రంగా గోపురాల రూపంలో ఉండే కొద్ది గుడిసెలు తప్ప మరేమీ లేవు. అక్కడి దృశ్యాలు భవ్యంగా ఉన్నవి. ఇలాంటి జనసంచారం లేని చోట క్షతగాత్రుల్ని మోసుకొని తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు నేను విచార సాగరంలో మునిగిపోతూ ఉండేవాణ్ణి.

ఇక్కడే బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు నాలో పరిపక్వమయ్యాయి. నా అనుచరులతో కూడా కొద్దిగా ఈ విషయం చర్చించాను. ఈశ్వర సాక్షాత్కారానికి బ్రహ్మచర్యం అవసరమని నాకు అనుభూతి కలగలేదు. కాని సేవ చేయటానికి అవసరమని నాకు స్పష్టంగా బోధపడింది. ఈ విధమైన సేవ చేయవలసిన సందర్భాలు విస్తారంగా వస్తాయని, నేను భోగవిలాసాల్లో పడి, పిల్లల్ని కంటూ వాళ్ళ పోషణలో లీనమై ఉంటే సేవాకార్యం సరిగా చేయలేనని గ్రహించాను. బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం కావించకుండా జనాన్ని పెంచుకుపోతే సాంఘిక ప్రగతికోసం చేసే మానస కృషి క్రుంగి పోతుందని తెలుసుకున్నాను. వివాహం చేసుకొని కూడా బ్రహ్మచర్య వ్రతం సాగించితే కుటుంబ సేవ, సమాజ సేవ కుంటుబడదని భావించాను. ఈ రకమైన భావతరంగాల్లో తేలియాడుతూ ఎప్పుడెప్పుడు బ్రహ్మచర్యవ్రతానికి పూనుకుందామా అని తపన పడిపోయాను. ఈ రకంగా ఆలోచించడం వల్ల నాకు ఆనందం కలిగింది. ఉత్సాహం పెరిగింది. ఈ కల్పన నా సేవారంగాన్ని విశాలం చేసింది.

ఈ భావాలకు మనస్సులో రూపకల్పన చేస్తూ ఉండగా, ఇంతలో ఒకరు తిరుగుబాటు శాతించిందని, ఇక మనం వెళ్ళవచ్చునని వార్త అందజేశారు. మర్నాడు మీరు ఇళ్ళకు వెళ్ళిపోవచ్చునని మాకు ఆదేశం అందింది. కొద్దిరోజులకు ఎవరి ఇండ్లకు వారు చేరుకున్నారు. మా సేవాకార్యాన్ని అభినందిస్తూ గవర్నరు నాకు కృతజ్ఞతా పత్రం పంపించాడు.

ఫినిక్సు చేరుకొని బ్రహ్మచర్యాన్ని గురించి మగన్‌లాలుకు, ఛగన్‌లాలుకు, వెస్ట్ మొదలుగాగల వారికి ఉత్సాహంతో వివరించి చెప్పాను. అందరికీ నా అభిప్రాయం నచ్చింది. అంతా అందుకు అంగీకరించారు. అయితే ఆచరణకు సంబంధించిన ఇబ్బంది అందరి దృష్టికి వచ్చింది. అందరూ ఈ విషయమైన కృషి ప్రారంభించారు. చాలావరకు విజయం సాధించారు. ఇప్పటి నుండి జీవించి వున్నంత వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని నిర్ణయించుకున్నాను. అయితే ఈ వ్రత శక్తి, ఆచరణలో కలిగే కష్టాలు పూర్తిగా నా దృష్టికి రాలేదు. అందలి ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. బ్రహ్మచర్యవ్రతం యొక్క గొప్పతనం తరువాత బోధపడసాగింది. బ్రహ్మచర్య వ్రత రహిత జీవనం శుష్కమైనదిగాను, పశుజీవనం వలె నాకు కనబడసాగింది. సహజంగా పశుపు నిరంకుశమైనది. మనిషి యందలి మానవత్వం అంకుశానికి లోబడి ఉండటం చూస్తున్నాం. ధార్మిక గ్రంథాల్లో బ్రహ్మచర్యాన్ని గురించి వ్రాయబడిన రాతలు అతిశయోక్తులు అని అనిపించేవి. కాని ఆ వ్రతాన్ని ఆచరణలో పెట్టిన తరువాత బ్రహ్మచర్యం శక్తి ఎంత మహత్తరమైనదో బోధపడింది. ఆ రాతలు అతిశయోక్తులు కావని అనుభవం పొంది రాసినవని గ్రహించాను.

జీవనంలో ఎంతో మార్పుతేగల బ్రహ్మచర్యవ్రతానుష్ఠానం అంత సులభమైనది కాదు. ఇది కేవలం శరీరానికి సంబంధించినదికాదు. శరీరాన్ని అంకుశంలో వుంచడంతో బ్రహ్మచర్యం ప్రారంభం అవుతుంది. శుద్ధ బ్రహ్మచర్యపాలన యందు యోచనా సరళి నిర్మలంగా ఉండాలి. పూర్ణ బ్రహ్మచారి మనస్సునందు కలలో సైతం వికారాలు కలుగకూడదు. కలల్లో వికారాలకు సంబంధించిన యోచనలు వస్తూ ఉంటే బ్రహ్మచర్యం అపూర్ణమని భావించాలి.

నాకు బ్రహ్మచర్య వ్రతం అవలంబించినప్పుడు శారీరక సంబంధమైన ఇబ్బందులు బాగా కలిగాయి. ఇప్పుడు ఆ మహాకష్టాలు పూర్తిగా తొలగిపోయాయని గట్టిగా చెప్పగలను. కాని యోచనలమీద అవసరమైనంత విజయం లభించలేదు. ప్రయత్నంలో లోటు చేయలేదు. కాని ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. యోచనలు వచ్చి బుర్రలో జొరబడతాయి. వాటి రాకను గురించి ఈనాటి వరకు తెలుసుకోలేకపోయాను. యోచనల్ని ఆపివేయగల తాళంచెవి మనిషి దగ్గర ఉంటుంది. ఈ విషయమై నాకు సందేహం లేదు. అయితే ప్రతి వ్యక్తి ఈ తాళం చెవి తనదగ్గరే వెతుక్కోవలసి ఉంటుందని ఈనాడు చెప్పగలను. మహాపురుషులు తెలిపిన అనుభవాలు మనకు మార్గం చూపుతాయి. అవి సంపూర్ణం కావు. సంపూర్ణత్వం కేవలం ప్రభువు ప్రసాదంవల్లే లభిస్తుంది. అందువల్లే భక్తులు తమ తపశ్చర్యల ద్వారా పునీతము, పావనకరము అయిన రామనామాది మంత్రాలు మనకు అందించి వెళ్ళారు. పూర్తిగా ఈశ్వరార్పణ కానిదే యోచనలమీద విజయం లభించదు. ధర్మ గ్రంథాలన్నింటి యందు ఇట్టి వచనాలు నేను చదివాను. వాటి యందలి సత్యం ఈ బ్రహ్మచర్యానుష్టాన మందలి సూక్ష్మపాలనా ప్రయత్నాల యందు నాకు గోచరిస్తుంది. నా ఈ మహాప్రయత్నానికి సంబంధించిన కొద్ది చరిత్ర వచ్చే ప్రకరణంలో వివరిస్తాను. ప్రస్తుత ప్రకరణం ముగింపునందు వ్రతపాలన తేలికేనని అనిపించింది. వ్రతం ప్రారంభించగానే కొన్ని మార్పులు చేశాను. భార్యతో బాటు ఒకే పక్క మీద శయనించడం, ఆమెను ఒంటరిగా కలుసుకోవడం మానివేశాను. ఈ విధంగా ఏ బ్రహ్మచర్య వ్రతాన్ని ఇష్టంగానో, అయిష్టంగానో 1900 నుండి ప్రారంభించానో ఆ వ్రతారంభం నిజానికి 1906 మధ్య కాలంలో జరిగిందని చెప్పవచ్చు.